Tuesday, February 26, 2019

కాపరి భార్య


కాపరి భార్య
సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి............

రెండు గదుల ఆ ఇల్లంతా కలప దుంగలతో కట్టిందే. గచ్చురాళ్ళు పరిచిన నేల పగిలిపోయి బీటలు వారింది, ఆ గదుల వెనక ఒక పెద్ద వంటిల్లూ, ముందు చావడీ వున్నాయి.

చుట్టంతా దట్టమైన పొదలు. అరచేయిలా, ఎత్తు పల్లాలేవీ లేకుండా, నిర్భావంగా వుంది. అడవన్న పేరే కానీ, అక్కడ పచ్చదనం అతి తక్కువ. కొన్ని గిడచబారిన ఆపిల్ చెట్లూ, ఇంకొన్ని సరుగు చెట్లూ, దాదాపు ఎండిపోయిన చిన్న వాగూ! వూరు పంతొమ్మిది మైళ్ళ దూరం!

కాపరి గొర్రెలతో అడివిలోకెళ్ళి చాలా రోజులే అయింది. ఇంట్లో అతని భార్యా, పిల్లలు మాత్రం వున్నారు. నలుగురు పిల్లలు, చిరిగిన బట్టలతో, ఎండిపోయిన దేహాలతో ఇంటి బయట ఆడుకుంటున్నారు.

“అమ్మా! పాము, పామొచ్చింది!” వున్నట్టుండి, పిల్లలు గొల్లుమని అరిచారు. వాళ్ళ అమ్మ ఒక్క పరుగున వంటింట్లోంచి బయటికొచ్చింది. బక్కగా, ఎండకు కమిలిపోయిన శరీరంతో ఉంది ఆమె.

“ఎక్కడ? ఎక్కడుంది పాము?” పరిగెత్తుకొని వస్తూనే, నేల మీద పడున్న చంటి వాణ్ణి చంకనేసుకుంది, ముందు. పిల్లలని అడుగుతూనే రెండో చేతితో కర్ర పట్టుకుంది.

“అదిగో! ఆ కట్టెల మోపులోకెళ్ళింది.” అందర్లోకి పెద్దవాడు, పదకొండేళ్ళ టామ్ అరిచాడు. చురుకైన ముఖంతో తల్లి వంక చూశాడు. తనకంటే పొడుగైన కర్ర ఒకటి చేతిలో పట్టుకొచ్చాడు.

“నువ్వక్కడే వుండమ్మా! ఆ పాము పని నే పడతాగా!”

“టామ్! నువ్విటురా ముందు! అది కాటేస్తుంది. రమ్మనంగానే రా, వెధవా!” తల్లి కేకలకు వాడు చిన్నబోయిన మొహంతో పక్కకొచ్చి నిలబడ్డాడు. అంతలోకే వాడి కళ్ళు మెరిశాయి. కట్టెల మోపు నుండి పాకి ఇంటికిందకు దూరుతున్న పామును చూపించాడు. గోడల పగుళ్ళనుంచి ఇంటికిందకు కలుగులున్నాయి.

“అదిగో అమ్మా, పాము!” కర్ర ఎత్తి పాము మీద దెబ్బ వేయబోయాడు. ఇంతలో వాళ్ళ పెంపుడు కుక్క జరుగుతున్న గందరగోళమేమిటో చూడడానికి వొచ్చింది. పాముతోకను అది ఒడిసి పట్టుకునేంతలో అది మాయమైపోయింది. సరిగ్గా అప్పుడే టామ్ వేసిన కర్ర పోటు కుక్క మొహం మీద పడింది. అది పట్టించుకోకుండా గుర్ గుర్ మంటూ అక్కడే నిలబడింది పాము వెళ్ళినవైపు చూస్తూ. కాపరి భార్య వెళ్ళి కుక్కను కట్టేసి వచ్చింది. దాని పేరు మొసలి. పేరుకు తగ్గట్టే దాని ముఖం మొసలి ముఖంలా ఉంటుంది. పాములనుంచీ, పాముల్లాంటి మనుషుల నుంచీ అదే తనకు దిక్కు.అది ఎటైనా తప్పిపోతే ఇంకా కష్టం మరి. పిల్లలందరినీ కూడ గట్టి వాళ్ళని కుక్క పక్కన నిలబెట్టి తను పామును పట్టుకునే ప్రయత్నంలో పడింది. చిన్న గిన్నెలో పాలు పోసి తెచ్చి కలుగు పక్కన పెట్టి పాము కోసం ఎదురు చూస్తూ కూర్చుందామె. గంట గడిచినా పాము బయటికొచ్చిన జాడే లేదు.

సాయంకాలం అవుతుండడంతో చిన్నగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. రాత్రికి పెద్ద వర్షం వొచ్చేలాగుంది. పిల్లలని అలా ఎంత సేపని బయటే వుంచడం. పోనీ లోపలికి తీసికెళ్దామంటే పాము లోపలే వుందేమో! పైగా గచ్చులో అక్కడక్కడా నెర్రెలు పడి వున్నాయి. గోడ పగుళ్ళ కలుగుల్లోంచి పాము బయటికొస్తే!

కాసేపటి తరవాత ఏదో ఆలోచించుకొని, కట్టెల మోపులోంచి కొన్ని కట్టెలు తీసుకొని వంటింట్లో పొయ్యిలో పడేసింది. తరవాత పిల్లలందరినీ ఇంట్లోకి తీసికెళ్ళింది. వంటింట్లో గచ్చు లేదు. బురదతో అలికిన నేల మీద, చెక్కపేడు కాళ్ళతో మొరటుగా చేసిన ఒక పెద్ద బల్ల తప్ప ఇంకే సామానూ లేదు. ఆ బల్ల పైకి వాళ్ళందరినీ ఒకళ్ళ తరవాత ఒకళ్ళని ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళకి అక్కడే తిండి పెట్టింది. పాము ఎటునుంచి వస్తుందోనని వేయి కళ్ళతో కనిపెడుతూనే ముందు గది నుంచి చేతికందిన పక్క బట్టలు అందుకోని దడ దడ లాడే గుండెలతో వంటింట్లోంచి కొచ్చి పడింది. ఆ బల్ల మీదే దుప్పట్లు పరిచి పిల్లలని నిద్ర పుచ్చింది. పిల్లలు పడుకున్నరని నిర్ధారించుకొని ఇక పాము కోసం ఎదురు చూడసాగింది ఆమె.

పాము వున్న నెర్రెల వైపే చూస్తూ వంటింటి గుమ్మం దగ్గరే కుర్చీ వేసుకుని కూర్చున్నదామె. పక్కనే కర్ర, ఆమె కుట్టు పని సంచీ, ఒక పత్రిక పెట్టుకుంది. పక్కన కుక్కని కూర్చోబెట్టుకుంది. అమ్మని ఒంటరిగా పాముతో వదిలేసి పడుకోవడం టామ్ కసలే మాత్రమూ నచ్చలేదు.

“అమ్మా! రాత్రంతా నీతో పాటే కూర్చొని ఆ దరిద్రగొట్టు పాము తల పచ్చడి చేస్తాను!” శపథం చేశాడు.

“చాల్లే! నోరు మూసుకొని పడుకో! తిట్లు వాడడొద్దన్నానా? తల్లి కసిరింది. టామ్ ఒక దుడ్డుకర్రను పక్కలోనే పెట్టుకున్నాడు, పాముని చంపడానికి. అది తగిలి తమ్ముడు జాకీ ఫిర్యాదు చేశాడు.

“అమ్మా! టామ్ కర్ర నన్ను డొక్కలో పొడుస్తూంది. అది తీసి పడెయ్యమని వాడితో చెప్పూ!”

“జాకీ! నోరు మూసుకొని పడుకో రాస్కెల్, పాముతో కరిపించుకుంటావా?!” టామ్ బెదిరించాడు. జాకీ నోరు మూసుకున్నాడు.

“ఒరే జాకీ! పాము కరిచిందనుకో. నీ ఒళ్ళంత ఎర్రగా, నల్లగా అయిపోయి నువ్వు ఉబ్బిపోయి కంపుకొట్టి చచ్చిపోతావ్, తెలుసా!”

“అమ్మా, టామీ చూడు ఏమంటున్నాడో!”

“టామ్, చిన్నపిల్లవాడు. వాణ్ణి భయపెట్టకలా!”

సణుగుతూనే నిద్రలోకి జారిపోయాడు జాకీ. మెల్లిగా పిల్లలంతా నిద్రపోయారు, టామ్ తప్ప.

“అమ్మా, పామొస్తే నన్ను లేపుతావు కదూ?” నిద్రమత్తులో తూగుతూనే గొణిగాడు టామ్.

“అలాగేలే నువ్వు పడుకో!”

మధ్య రాత్రయింది. అంతటా చీకటి, చిక్కగా అలుముకున్న నిశ్శబ్దం. ఆమెకీ నిద్ర ఆగటం లేదు. అయినా కాసేపు కుట్టుకుంటూ, కాసేపు పత్రిక చదువుతూ, కట్టెల మోపు వైపే చూస్తోంది. చీమ చిటుక్కుమన్నా కర్ర మీదికి చేయి పోతుంది.

అనుకున్నట్టే ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. గోడల నెర్రెల్లోంచి లోపలికొస్తున్న ఈదురు గాలికి కొవ్వొత్తి ఆరిపోయేలా వుంది. లేచి కొవ్వొత్తిని బల్ల పైన పెట్టి అట్ట ఒకటి అడ్డంగా పెట్టింది. మెరుపు మెరిసినప్పుడల్లా గోడల మీది నెర్రెలు వెండి తీగల్లా కనిపిస్తున్నాయి. కుక్క గుమ్మానికడ్డంగా సాగిలపడి పడుకోని వుంది. ఎంత ధైర్యం చెప్పుకున్నా ఆమెకి గుండె దడదడ లాడుతూనే వుంది. తను పిరికిది కాదు కానీ ఈమధ్యే పాము కాటుకి గురై చచ్చిపోయిన బావగారి కొడుకు ఙ్ఞాపకం ఆమెను భయపెడుతోంది. భర్త అడవిలోకెళ్ళి ఆరు నెలలు అయింది. ఒక్క కబురూ లేదు. ఇక వొచ్చేస్తే బాగుండనుకొంది. ఈమధ్యే వచ్చిన కరువుతో అంతా నష్టపోయారు. దానితో మళ్ళీ అడవిలోకి పోక తప్పలేదు. ఈ సారి పశువులతో వెనక్కి రాగానే ఈ అడవీ, పల్లే వొదిలేసి పట్నంలో కాపురం పెడతానన్నాడు. అక్కడికి కొంచెం దూరంలోనే వున్న బావగారు అప్పుడప్పుడూ ఒక గొర్రెను చంపి కొంత తను తీసుకుని అందుకు బదులుగా వీళ్ళకి కావల్సిన వెచ్చాలు తెచ్చిపెడుతుంటాడు.

ఆమెకీ ఒంటరితనం అలవాటే నిజానికి. ఇంతకు ముందొకసారి పద్దెనిమిది నెలలపాటు ఒక్కతే ఇంట్లో వుంది అతని కోసం ఎదురు చూస్తూ. ఆమెకి వున్నట్టుండి తన చిన్నతనం గుర్తొచ్చింది. అందరు ఆడపిల్లల్లానే తనూ ఎన్నో కలలు కన్నది, గాల్లో మేడలు కట్టుకుంది. అన్నీ కరిగిపోయి చాలా యేళ్లయింది. ముందున్న నిజాలని ఒప్పుకోనూ లేకా, వాట్నించి తప్పుకోనూ లేక, తనక్కావల్సిన ప్రపంచాన్ని అప్పుడప్పుడూ ఆసక్తిగా చదివే ఆ పత్రికల్లో వెతుక్కుంటుంది.

నిజానికామె భర్త చెడ్డవాడేమీ కాదు. కొంచెం నిర్లక్ష్యం వున్నా, ఆమెని ప్రేమించే మనిషే. ఆమె కోరుకున్నట్టే ఆమెని రాజకుమార్తెలా గారాబం చేయలనీ, మహారాణీలా చూసుకోవాలని ఆశలున్నవాడే. పరిస్థితులే కలిసి రావడంలేదు. ఈ పశువుల పనిలో పాపం, నెలలతరబడి అడవుల వెంట తిరుగుతాడు. జీత భత్యాలతో తిరిగొచ్చి పట్నం తీసికెళ్తాడు. అప్పుడప్పుడూ అతను అధైర్యపడినా, ఆమే అతనికి ధైర్యం చెప్పి పంపిస్తుంది. పిల్లలు పుట్టినప్పుడు మరీ దిగులుగా భయంగా వుండేది ఆమెకి. ఇద్దరు బిడ్డలు ఈ అడవిలోనే పుట్టారు తనకు. ఇలాటి ఒంటరితనంలోనే ఒక బిడ్డను పోగొట్టుకుంది. చేతిలో బిడ్డ శవాన్నెత్తుకొని ఒంటరిగా పంతొమ్మిది మైళ్ళు వెళ్ళింది ఆ రోజు!

ఒక పెద్ద మెరుపూ, ఉరుముతో ఉన్నట్టుండి జడివాన మొదలయింది.

ఆలోచనల్లోనే రాత్రి గడుస్తోంది. ఝాము రెండయి వుంటుంది. మొసలి ఇంకా కళ్ళార్పకుండా పడుకొని గుమ్మం వైపే చూస్తోంది. వాడి వొంటి మీద గాయాలు చూస్తూ పాపం, వీడూ పెద్దయిపోయాడు, అనుకుందామె. వాడికి భయమనేదే లేదు. దేనికైనా ఎదురుపోతాడు. ఎన్నో పాములనూ చంపాడు. ఏదో ఒకరోజు పాముకాటుతోనే పోతాడు. ఇలాంటి కాపలా కుక్కల బతుకు అలాగే ముగుస్తుంది.

అప్పుడప్పుడూ చేతిలో పుస్తకం పక్కన పెట్టి ఆలోచనల్లోకి మళ్ళీ మళ్ళీ జారిపోతుందామె. వర్షం ఇంకా కురుస్తూనే వుంది. ఈ వర్షానికి గడ్డి ఇంతెత్తున పెరుగుతుంది. ఎండలకి ఎండి పోతుంది. అప్పుడూ అగ్గి భయం.

ఒకసారిలాగే పెరిగి ఎండిపోయిన గడ్డి అంటుకుంది. ఆ అంటుకున్న అగ్గి ఆర్పేసరికి బ్రహ్మ ప్రళయమైపోయింది తనకి. ఆదరా బాదరా చేతికందిన భర్త పాంటూ షర్టూ వేసుకొని ఒక పెద్ద చెట్టు కొమ్మతో మంటల్ని బాదడం మొదలు పెట్టింది తనారోజు. మంటలు ఆరిపోయినై కానీ తన మొహమూ చేతులూ అంతా బూడిదా మసీ కలిసిపోయి ఒక విచిత్రమైన రంగులోకి తిరిగిపోయాయి. తండ్రి బట్టల్లో వున్న తనని చూసి టామ్ పక పకా నవ్వితే, నల్లబడ్డ తన మొహం చూసి చంటి వెధవ జాకీ కెవ్వుమన్నాడు. వాడి ఏడుపు చూసి కుక్క తన పాంటు పట్టుకుని లాగింది, అదీ తనను గుర్తుపట్టలేదు. పాత జ్ఞాపకాలతో ఆమె మొహం మీద నవ్వు విచ్చుకుంది.

ఒంటరితనంతోనూ, చుట్టూ ఉన్న క్రూరమైన అడవితోనూ ఎన్ని యుద్దాలో! జబ్బు చేసి రెండు ఆవులు పోయినప్పుడూ, పైన బడుతున్న ఎద్దుని ఒంటరిగా ఎదురొన్నప్పుడూ, ఆఖరికి తమ కోడి పిల్లలని కాకుల నించీ గద్దల నించీ నిరంతరం కాపాడుకొటున్నప్పుడూ, ఇదే ఒంటరితనంతో పోరాటం చేస్తూ వచ్చింది తను. ఆ మాటకొస్తే, ఒంటరి ఆడదాని కోసం పొంచి వుండే మగవాళ్ళకి కొదవా?

కుక్క సాయంతోనూ, మొరటు మాటల సాయంతోనూ, అబధ్ధాల సాయంతోనూ అలాటి మగవాళ్ళనుండి తనని తాను కాపాడుకొంటూ వచ్చింది. అంతెందుకు, సరిగ్గా కిందటి వారం వొచ్చాడు ఒక దరిద్రుడు. అడివి దారంట పోతున్నాననీ, దాహంతో చచ్చి పోతున్నాననీ వేడుకున్నాడు. వాడి వాలకం నచ్చకపోయినా, జాలి పడి కొంచెం తిండి పెట్టి మంచి నీళ్ళిచ్చింది. సాయంత్రం కాగానే తన దారిని తాను వెళ్తాడనుకుంటే, ఒక వెకిలి నవ్వుతో “ఈ రాత్రికి ఇక్కడే వుండి పోతా” అన్నాడు.

మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఒక పెద్ద దుడ్డుకర్ర ఒక చేతిలో, భయంకరంగా పళ్ళు చూపిస్తూ గుర్రులాడుతున్న మొసలిని గొలుసుతో ఇంకో చేతిలో పట్టుకొని బయటికొచ్చింది. “ఇంకొక నిమిషంలో ఇక్కణ్ణించి కదలకపోతే, నేనూ నా కుక్కా కలిసి నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేయడం ఖాయం,” అని చెప్పింది వాడి కళ్ళల్లోకి చూస్తూ. ఆమె కళ్ళలోకి చూసి వాడేమనుకున్నాడో ఏమో, గబగబా మూటా ముల్లే సర్దుకుని, “వెళ్ళొస్తామ్మా!” అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.

బుష్‌ల్యాండ్ జీవితాలు అవి. ఆ అడవిలో బ్రతకాలంటే అది చెప్పే పాఠాలు నేర్చుకోవాలి. ఆమె వాటిలో రాటుతేలిపోయిన మనిషి.

ఐతే తన జీవితంలోనూ చిన్న చిన్న సంతోషాలూ, సరదాలూ లేకపోలేదు. అన్ని రోజులూ ఒక ఎత్తు, ఆదివారం మాత్రం ఒక ఎత్తు ఆమెకి. ఆదివారం మధ్యాహ్నం పనంతా ముగించుకుని, చక్కటి బట్టలు కట్టుకొని, పిల్లలనీ ముస్తాబు చేసి అడవిలో ఒంటరిగా కాసేపు నడిచొస్తుందామె. అప్పుడు ఆమె ముస్తాబూ, పిల్లల ముస్తాబూ చూస్తే వాళ్ళేదో పట్టణంలో విందుకెళ్తున్నట్టు వుంటారు! ఆ ఒంటరితనంలో అదొక్కటే ఆమెకి ఆటవిడుపు. నిజానికి ఆ అడవిలో ఇరవై మైళ్ళ వరకూ ఇంకొక ప్రాణి కనబడకుండా నడవొచ్చు! ఎంత దూరం నడిచినా అదే అడవి, అవే పిచ్చిమొక్కలూ. ఏ మార్పూ లేని ఆ పరిసరాలు, ఆ మాంద్యం తట్టుకోలేకే మొగవాళ్ళు పట్టణానికి పారిపోదామనుకుంటారు. కనీసం కొత్తగా వేసిన రైలుపట్టాల పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోదామనుకుంటారు. పెళ్ళైన కొత్తలో పిచ్చెత్తినట్టు వుండేది, ఇప్పుడలవాటై పోయింది. భర్త ఇంటికొచ్చినప్పుడు సంతోషమే కానీ, అతను ఎప్పటికీ ఇంటి పట్టున వుంటాడన్న నమ్మకమూ ఆశా లేవామెకి. పిల్లలంటే ప్రేమ ఆమెకు. పైకి కఠినంగా ఉంటుంది. పరిస్థితులు ఆ ప్రేమను పైకి చూపించనీయవు. చుట్టూ వున్న మొరటుతనం స్త్రీ సహజమైన సున్నితపుతనాన్ని పెరగనీయదు.

ఆలోచనల్లోనే తెల్లారుతూ వుంది. గడియారం చూద్దామంటే ముందు ఇంట్లో వుంది. కొవ్వొత్తి పూర్తిగా ఆరిపోయింది. వేరే కొవ్వుత్తులు లేవు. బయట వర్షం ఆగిపోయినట్టుంది.

రాత్రంతా నిద్రలేమితో ఆమె అలసిపోయింది. ఎందుకో కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి. చేతిగుడ్డతో తుడుచుకోబోయి వేళ్ళతో కన్ను పొడుచుకుంది. చేతిగుడ్డలో చిల్లులనుంచి ఆమె వేళ్ళు పొడుచుకొచ్చున్నాయి. ఆమెకు నవ్వొచ్చి పెద్దగా నవ్వింది. మొసలి ఆశ్చర్యంగా చూసింది. ఆమెకిలా తనమీద తాను నవ్వుకోవడం అలవాటే.

ఇంతలో ఉన్నట్టుండి కుక్క శరీరం బిగుసుకుంది. కదలకుండా ఊపిరి బిగబట్టి నేలలో వున్న నెర్రె వైపే చూస్తూన్న దాని శరీరంలో వెంట్రుకలన్నీ అదో మాదిరి ఉద్వేగంతో నిక్కబొడుచుకున్నాయి. ఆమెకి అర్థం అయింది. వంటింటి గోడ కింద వున్న నెర్రె వైపే తనూ చూస్తూ చేతి కర్ర అందుకుందామె. చిన్న కంతలోంచి గాజు గోళీల్లాంటి రెండు చిన్న కళ్ళు కదలకుండా బయటికి చూస్తున్నాయి. ఒక క్షణం బయట ఆమె, ఆమె పక్కన కుక్క, లోపల పాము కాలంతో పాటు స్తంభించి నిలబడ్డారు. కొంచెం సేపటికి పాము ముందు కదిలి మెల్లగా కొంచెం బయటికొచ్చింది.

ఆమె ఇంకా మెల్లిగా చేతి కర్ర పైకెత్తింది. ఆపద గ్రహించినట్టు పాము మళ్ళీ కలుగులోకి తల లాక్కుంది. ఒక్క నిమిషం తరువాత మళ్ళీ మెల్లిగా తల బైటకు పెట్టింది. కుక్క ఒక్క ఉదుటున పాము మీదికి దూకింది. పాము దాదాపు తప్పించుకొని పోబోయింది. కుక్క మళ్ళీ దాని పైకురికి పళ్ళతో దాన్ని ఒడిసి పట్టి పామును ఒక అడుగు బైటకు లాగింది. ధడ్! ధడ్! ఆమె పాము తలపై కొట్టింది. మొసలి పామును పట్టుకుని మరింత బయటకు లాగింది. ధడ్! ధడ్! ధడ్! ఐదడుగుల పొడవు, నల్లగా భయంకరంగా ఉంది పాము. సందడికి టామ్ లేచి తల్లికి సాయానికి రాబోయాడు. ఒక్క చేత్తో పిల్లవాణ్ణి దూరంగా నెట్టేసింది బలంగా, రెండో చేత్తో పాముని బాదుతూనే. మొసలి మూతి మీద ఒకట్రెండు దెబ్బలు తగిలాయి. వాడు పట్టించుకోలేదు. ఆమె ఆగకుండా ఆ పామును కొడుతూనే వుంది, అది ఇక కదలిక లేకుండా చచ్చి పడేదాకా.

పాము శరీరాన్ని మెల్లిగా కర్రతో లేవనెత్తి బయట మండుతున్న నెగడులో వేసిందామె. కుక్క, పిల్లవాడూ కదలకుండా దూరంగా నిలబడ్డారు కాలిపోతున్న పామును చూస్తూ. కర్ర పక్కన పడేసి వొచ్చి కుక్క పక్కన కూర్చుందామె. ఇద్దరినీ దగ్గరకు లాక్కుంది. ఆమె చేతి స్పర్శతో పిల్లవాడూ, కుక్కా కొంచెం కుదుట పడ్డారు.

తలెత్తి తల్లి వైపు చూశాడు టామ్. ఆమె కళ్ళల్లో నీళ్ళు. తల్లి మెడ చుట్టూ చేతులేసి ఆమెని హత్తుకుపోయాడు.

“అమ్మా! నేను పెద్దయిన తరవాత ఎప్పుడూ నిన్నొదిలి ఆ దరిద్రపు అడవిలోకెళ్ళను,” అన్నాడు. కొడుకుని తన గుండెకి పొదువుకుందామె. సన్నగా తెల్లవారుతున్న అడవిలో అలా కూర్చుండిపోయారు వాళ్లలా.
---------------------------------------------------------
(మూలం: హెన్రీ లాసన్ కథ, ది డ్రోవర్స్ వైఫ్.)
రచన: శారద, 
మూలం: హెన్రీ లాసన్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment