హృదయం ఇక్కడే వుంది!
సాహితీమిత్రులారా!
ఈ కథను ఆస్వాదించండి .....................
నిజానికది ఆహ్వానం కాదు. అర్ధింపు. ‘ఒకసారి రాగలవా? ప్లీజ్,’ అంటూ!
మళ్ళీ ఇన్నాళ్ళకి విహారి నుంచి మెసేజ్. తను ఇచ్చిన అడ్రస్ చూశాను. మా వూరికి కొంత దూరంగా వున్న ఖరీదైన గెస్ట్ హౌస్ అది. వింటమే కానీ నేనెప్పుడూ చూసే అవకాశం రాలేదు, ఇప్పటిదాకా. ఇంకేమీ అడగకుండా వెంటనే బయలుదేరాను.
అప్పుడూ అదే మెసేజ్. అదే వాక్యం. ఎన్నేళ్ళు తనని వెంటాడింది? ఎంత ఆర్ద్రత నింపుకున్న అక్షరాలని అవి! ఆనాడు గండి తెగిన తన గుండెకి నన్నొక ఆనకట్టగా భావించాడేమో? జీవన్మరణ సంధిలో తననొక రాయబారిగా పంపాలనుకున్నాడేమో?! ఆరిపోతున్న తన ప్రాణజ్యోతికి నేనొక ఆసరాగా నిలుస్తానని ఆశపడ్డాడేమో? ఆ తర్వాత కదూ తనకు తెలిసింది!
మనసంతా మళ్ళా అప్పటి విషాదం చుట్టుకుంటోంది. వర్షం కురవని కరిమబ్బవుతోంది.
వెంటనే తులసి గుర్తొచ్చింది. తలొంచుకుని భాషే రాని మూగ దానిలా నా ముందు నుంచుని కనిపించింది.
విహారి. ఆ చీకట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒంటరిగా ఎంతగా కుంగిపోతూ కనిపించాడు? మిన్ను విరిగి వెన్ను మీద పడ్డవానిలా తలొంచేసుకుని, రెండు భుజాలు కుదించేసుకుని… తనకిక పగలన్నది లేదు, మిగిలింది అమావాస్య మాత్రమే అన్న వైనాన శోకమూర్తిలా రైలెక్కి వెళ్ళిపోవడం… ఎంత చేదయిన జ్ఞాపకం!
ఆ ఆఖరి దృశ్యం కళ్ళ ముందు మెదిలినప్పుడల్లా అదంతా, ఇప్పుడే కళ్ళముందు జరుగుతున్నట్టుంటుంది. నా ఆలోచన్లతో ప్రమేయం లేకుండానే నా చేతుల్లో స్టీరింగ్ వీల్ కదులుతోంది.
‘ఒక్క సారి రాగలవా? ప్లీజ్!’ విహారి మెసేజ్ చూసి వెంటనే ఫోన్ చేశాను.
“ఏమైందీ విహారీ?” ఆందోళనగా అడిగాను.
అవతల్నించి ఒక సెకనుపాటు నిశ్శబ్దం. నా మనసుకెందుకో భయమేసింది. చాలా, భయమేసింది.
“విహారీ, అంతా బాగానే వుందా?” మెల్లగా అడిగాను.
అవతలనించి ఒక్కసారిగా దుఖం పెల్లుబుకింది. “లేదు, గీతా. ఏమీ బాగాలేదు. తను నన్నిలా ఒదిలేసి వెళ్ళిపోవడం ఏమీ బాగోలేదు. ఏం చేయాలో తోచడం లేదు. అడిగితే కారణమూ చెప్పటం లేదు. గీతా! నువ్వొక్క సారి వెళ్ళి తనతో మాట్లాడవా? తను లేకపొతే, నేను… నే…ను చచ్చిపోతానని చెప్పవా! ప్లీ…జ్!” అతికష్టంతో ఆగిన స్వరం. సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్న వారికి మిగిలిన చిట్టచివరి ఆసరాలా వుంది ఆ అవస్థ. వింటున్న నాకు ఏమీ అర్ధం కాలేదు. అతని దీనావస్థకి కంగారుపడి నిలువునా నీరైపోతూ అడిగాను.
“అసలేమైంది విహారీ?”
“తులసి పెళ్ళి చేసుకుంటోంది గీతా! నన్ను కాదని వేరే అతన్ని…”
మాట పూర్తి చేయలేక, వెక్కిళ్ళని నొక్కిపెట్టుకుంటున్నా వినిపిస్తూనే వుంది నాకు స్పష్టంగా. అతని గుండె ఎంత ఏడుస్తోందో! నోట మాట రానిదాన్నయిపోయాను. ఏమని చెప్పి ఊరడిస్తానని? జీవితంలో మగాడికెలాటి కష్టమొచ్చినా ఓదార్చి, ఊరుకోబెట్టొచ్చు. కానీ ప్రేమలో ఘోరంగా విఫలమైన ఒక సున్నిత మనస్కుడికి కలిగే దుఖాన్ని ఊరడించడానికి మాత్రం ఎంత స్నేహమూ చాలదు. ప్రేమికుణ్ని నిలువునా దహించివేసే అగ్ని జ్వాల అది. ఆమాటకొస్తే, ఎవ్వరి వల్లా కూడా సాధ్యమయ్యే పని కాదు బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చడం.
ఒక గాయపడిన గుండెకి మందేమిటో, గాయం చేసిన వారికే తెలుస్తుంది. కానీ అప్పటికే, ఆ ఒక్కరు పిలుపందుకోలేని దూరంలో వుండిపోతారు. ‘కాలిన శవంలా బ్రతకడకొమొకటే మిగిలింది చెలీ, నువ్ రగిల్చి వెళ్ళిన ప్రేమాగ్నిలో’ అని అంటాడు ఒక కవి.
అప్పటికే నా మెదడు పనిచేయడం ఆగిపోయి చాలా సేపయింది. అందుకు రెండు కారణాలు. ఒకటి – తులసిపై నా అనుమానం నిజమైనందుకు. రెండు – విహారి ఇంత బేలవాడైపోతాడని అనుకోనందుకు.
ఎవరికైనా, పగిలే దాకా తెలుస్తుందా, హృదయం అద్దమని?
కాంపస్‌లో అతని కళ్ళు తులసి కోసం వెదుకుతున్నప్పుడు గమనిస్తుండే దాన్ని. చూపందనంత దూరం నించి ఒక చిన్న చుక్కలా కదలి వస్తున్నా, ఆ బిందువు తులసి అని ఇట్టే గుర్తుపట్టేసేవాడు. అతనికంత ప్రేమ! ఆ సంగతి అతనెప్పుడూ నోటితో చెప్పేవాడు కాడు. కాని, ఆ కళ్ళల్లోంచి పుట్టుకొచ్చే కాంతి, ఆమె దగ్గరౌతున్న కొద్దీ ముఖమంతా కమ్ముకునేది. చూపుల కాంతులే దీపాలు, ఆశల ఊపిరులే నీకై పూజించే పుష్పాలు. నా ధ్యానం నీ కోసం. నా ప్రాణం నీతో జీవించడం కోసం… – ఒకసారి కవిత రాశానంటూ మా ఇద్దరికి చదివి వినిపించాడు.
తులసి మాత్రం మామూలుగా వినేది. పట్టరాని సంతోషం, ఆశ్చర్యం వంటి భావాలు ముఖంలో కనిపించేవి కావు. బిడియం వల్ల కావచ్చు. కానీ, అతనంటే ఆమెకి ఓ ప్రత్యేకమైన ఇష్టం వుందన్న సంగతిని మాత్రం నా నించి దాచలేకపోయింది. బహుశా నాపైన నమ్మకం కావచ్చు. ఇలాటి కథలు కడుపులో పెట్టుకుని కాపాడేందుకో మనిషి కావాలి ఏ రహస్యమైన ప్రేమ కైనా! ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు అలకల తగవులొచ్చినప్పుడు – కారణాలు చెప్పుకునే తడిక పాత్ర పోషణకి ఒక మనసున్న మనిషి చాలా అవసరం కదా మరి.
ముగ్గురం స్నేహితులమే అయినా నాకు వారిద్దరితో ఉన్న బంధం కంటే వేరొక రకమైన బంధం వారిద్దరి మధ్య అని తెలిసిపోతూనే ఉండేది. అందుకే వాళ్ళు మాట్లాడుకోవడం కోసం, బీచ్ కెళ్ళినా, పార్క్ కెళ్ళినా కొంచెం పక్కకి తప్పుకుంటూ వుండేదాన్ని, నా బుక్స్ లోనో, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నాకు నచ్చిన పాటల్లోనో దాగిపోతూ. వెళ్ళడం ముగ్గురం కలిసే అయినా, జంటగా మాత్రం వాళ్ళిద్దరూ కలిసి షికార్లు కొట్టేవాళ్ళు. ఏదో విలువైనది వెతుక్కోవడం కోసం వెళ్తున్నట్టుండేది వాళ్ళిద్దరూ కలిసి నడిచే విధానం! సముద్రం తీరం వెంట మాట్లాడుకుంటూ, మాట్లాడుకుంటూ అలా పోతూ వుండేవారు. మధ్యమధ్యలో అతను వొంగి, రంగు రాళ్ళనో అరుదైన శంఖాలనో ఏరి ఆమెకిస్తుండేవాడు. ఆమె వాటిని అపురూపంగా అందుకుని, పరిశీలిస్తూ ఆగిపోయేది. కొన్ని క్షణాల్లో తిరిగి నడక సాగించే వాళ్ళు. ప్రేమించుకునే వాళ్ళకి వాళ్ళది మాత్రమే ఒక లోకంగా తోస్తుంది. నా ముందు దాచుకునేవారూ కాదు, అలా అని పైకి చూపించేవారూ కాదు.
నాకు నవ్వొచ్చేది ఈ జంటనిలా చూసినప్పుడల్లా. తాగిన వాని చేష్టలు తాగని వారికి వినోదం అయినట్టు. ఇద్దరూ స్నేహితులే, ఆప్తులే. ఆనందంగానూ ఉండేది. నేనిక్కడ వెనక్కి వాలి, ఇసుకలో చేతులు ముంచి, వెనక నించి ఆ వాళ్ళను అలా చూస్తుండేదాన్ని. గవ్వలేరుకునే ఈ మాత్రం సరదాకి అంతదూరం… నడచి నడచి పడి పోవాలా? కాదు. అప్పటి దాకా కాస్త దూరం దూరంగా నడుస్తున్న ఆ ఆకారాలు మెల్లమెల్లగా దగ్గరకి జరిగేవి. అతని చేయి మెల్లగా ఆమె చేతినందుకునేది. ఆమె తల అతని భుజం మీద వాలేది. పడమటి సూర్యుడు వాళ్ళిద్దరి మీంచి జారిపోతూ చేయి తిరిగిన చిత్రకారుని చేతిలోంచి జారిన రెండు వొంపుల గీతల్లా మార్చేవాడు ఇద్దరినీ.
హబ్బ! ఎంత బావున్నారీ జంట, లైలా మజ్ఞూల్లా!
ఒకసారి ఇలానే, ఓ సాయంత్రం బీచ్ కెళ్ళినప్పుడు – వాళ్ళకి తెలీకుండా ఫోటో తీసి చూపించాను. విహారి ముఖం వెలిగిపోయింది. తులసి మాత్రం కంగారు పడింది. ఎందుకు ఇదంతా? అంటూ కోపగించుకుంది. ఆ కళ్ళల్లో ఆనందానికి బదులు ఆందోళన చోటు చేసుకోవడం ఆశ్చర్యమేసింది. నన్ను ఆలోచనలో పడేసింది.
ప్రేమ అనేది ఒక తీపి పదార్ధం. ఇద్దరిలో ఎవరిష్టపడకున్నా, అది చేదైపోవడం ఖాయం. తులసికి అతనంటే వుండే ఇష్టంలో ఏదో తేడా వుందనిపిస్తోంది. ఊహుఁ, కాదు. అలా అయివుండదు. ఆమెని అర్ధం చేసుకోవడంలో నేనే పొరబడ్డానేమో? నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఆ తర్వాత మరి కొన్ని సందర్భాలలో మరింత పట్టుబడింది. తల మీద అప్పుడే తీగలెత్తుకుంటున్న లేత మొలక తులసి. దగ్గరగా ఏ ఆధారం దొరికినా చాలేమో అల్లుకోడానికి. కానీ, విహారి అలా కాదు. చాలా స్థిరమైన గట్టి గుంజ లాంటి వాడు. తనచుట్టూ అల్లుకున్న తీగని పందిరిగా చేసుకుని బ్రతుకుదామని కలలు కంటున్న వాడు.
అందరిలో వున్నప్పుడు – అతనితో టచ్ మీ నాట్‌లా ఏమీ ఎరగనట్టుండే తులసి, ఎవరూ లేనప్పుడు అతనితో మమేకమై కబుర్లు చెప్పే తులసి, ఒక్కరు కాదనే నిజాన్ని నేనెప్పుడూ పైకి చెప్పే సాహసం చేయలేకపోయాను. కనీసం ప్రయత్నమైనా చేయలేదు. అదే నే చేసిన పెద్ద తప్పేమో విహారి విషయంలో. కనీసం ఒక హింట్ అయినా ఇచ్చి వుంటే అతను కొంత వరకు జాగ్రత్త పడేవాడేమో? తులసి కళ్ళలో కనపడే ప్రేమ ఎంత నిజమైందో నాకూ తెలుసు, చెప్పలేక పోయాను, అందుకేనేమో.
అనుకుంటాం కానీ, అసలు ప్రేమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, కొందరి హెచ్చరికలు, మరి కొన్ని సూచనలు సలహాలు చూసి, చదివి, విని భద్రకవచాలు ధరించి ప్రేమలో పడతారా ఎవరైనా? అసలా మాటకొస్తే, ఈత రాని వాడు నీళ్ళలోకి దూకితేనే ఈది ఒడ్డుచేరతాడట. వలపు ఈదులాటా అంతే. ప్రేమలో విఫలమైన వాడు ఆ మునకలో మరణించడానికైనా సిద్ధపడతాడు కానీ, ప్రాణాల కోసం ఒడ్డున పడదాం అని అనుకోడు. అలాటి మానసిక స్థితిలోని ప్రేమికునికి ఈత వచ్చినా దండగే కదూ? ఖుస్రో అన్నట్టు దరియా ప్రేమ్ కా ఉల్టీ వా కీ ధార్, జో ఉతరా సో డూబ్ గయా, జో డూబా సో పార్. నాలో నేనే విశ్లేషించుకుంటూ నన్ను నేను సమాధానపర్చుకునే ప్రయత్నం చేశాను.
ఏదైనా కాని, ఇది వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయం. ఎంత స్నేహితులమైనా నా జోక్యం కొన్ని విషయాలలో తగదు. అందుకని వాళ్ళని ఏ రకంగానూ ఏమీ అనకుండా నా దూరం నేను పాటిస్తూనే వచ్చాను.
కానీ ఇప్పుడు విహారి బాధ చూసి నా మనసు భగ్గుమంది. కోపం హద్దులు దాటింది. వెంటనే ఉన్నదాన్ని వున్నట్టు బయల్దేరాను. పట్టలేని కోపంతో ఆఘమేఘాల మీద తులసి ఇంటికెళ్ళాను. లాక్కెళ్ళి విహారి కాళ్ళ మీద పడేయాలన్నంత ఉద్వేగంతో బయల్దేరాను. ఎందుకంటే – ఆ అమాయకుడికి, ఆ ఆరాధకుడికి జరుగుతున్న అన్యాయానికి ఏకైక బాధ్యురాలు తులసి అన్న సంగతి నాకొక్కదానికి మాత్రమే తెలుసు కాబట్టి.
గేట్ తీసుకుని ఇంట్లోకడుగు పెడుతుంటే ఎదురొచ్చింది. అప్పటి దాకా అణచిపెట్టుకున్న ఆవేశమంతా ఇక ఆగనంటూ ఉప్పెనలా ఉరికింది కంఠంలోకి.
“ఏమిటీ, విహారిని వొదిలేసి, వేరే పెళ్ళి చేసుకుంటున్నావా?” రొప్పుతూ అడిగేశాను.
“హుష్!” అంటూ అటు ఇటు చూసింది, భయం భయంగా. నన్ను చేయి పట్టుకుని తన గదిలోకి త్వరత్వరగా లాక్కుపోయి, తలుపులు మూసేసింది. మనిషి నిలువునా వొణికిపోతోంది పట్టరాని భయంతో.
రూమ్ అంతా చిందరవందరగా వుంది.
“గీతా, ప్లీజ్! గట్టిగా మాట్లాడకు. నాకు పెళ్ళని బయట ఎవ్వరికీ తెలీదు. మా వాళ్ళు చెప్పొద్దన్నారు. విహారికి మాత్రమే చెప్పాను. చెప్పకుండా ఉండలేకపోయాను. నాకు తప్పలేదు,” అంటూ కళ్ళు వాల్చుకుంది.
“అది అడగడానికే వచ్చాను. ఎందుకు? ఎందుకిలా?”
“హుష్! మెల్లగా, మెల్లగా మాట్లాడు. మా అమ్మ వింటే అఘాయిత్యం చేస్తుంది,” అంది లోగొంతుకలో.
గొంతు తగ్గించి మళ్ళీ అదే ప్రశ్న వేశాను సూటిగా. తలొంచుకుని చెప్పింది. “మేము బ్రాహ్మలం. మా వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు.”
“ఓహో! అలానా? మరి నీకాసంగతి అతనితో కలిసి బీచ్‌ల వెంబడి షికార్లు కొట్టేటప్పుడు తెలీలేదా?”
“తెలుసు.”
షాక్ అయ్యాను ఆ జవాబుకి. “తెలిసీ ఎందుకు ప్రేమించావ్?” వెంటనే అడిగాను.
“అతన్ని కాదనుకోలేకపోయాను.”
నాకు మాట పడిపోయింది. నేననుకున్నంత తెలివి తక్కువది కాదు తులసి. జీవితంలో ఏ పరిస్థితిలో ఏ ఎమోషన్ ఎంత శాతంలో వుంటే ఆనందంగా ఉండవచ్చో తెలిసిన సిద్ధాంతినిలా కనిపించింది నాకా క్షణంలో. మన సంతోషం కోసం మనుషులతో ఆడుకోవచ్చు. కానీ, మనసులతో కాదు కదా?
“ప్రేమంటే ఏవిటో తెలుసుకున్నావు కదా, మరి సొంతం చేసుకోవాలనిపించలేదా ఆ ప్రేమని?” కోపంగా అడిగాను.
“అనిపించకుండా ఎలా వుంటుంది గీతా? అతనితో తిరుగుతున్నానని ఎలా తెలిసిందో ఏమో మా నాన్నకి. చచ్చేలా బాదాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గదిలోకెళ్ళి తలుపులు మూసుకున్నాడు. అమ్మ నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. ఇల్లు నరకమవడానికి కారణమయ్యానని అన్నయ్య నన్ను దోషిని చేశాడు. బామ్మ కర్మఫలాన్ని బోధించింది.” విరాగినిలా చెప్పింది.
“కుటుంబం కోసం ప్రేమని త్యాగం చేశానంటావ్? మరి నీకోసం ఏకధారగా ఏడుస్తున్న విహారినేం చేయాలనుకుంటున్నావ్?”
“అతనికి వీడ్కోలు చెప్పేశాను గీతా. ఇక చెప్పాల్సిందేమీ లేదు.”
ఏం జరిగినా తనకెలాటి బాధ్యతా లేదు అని ఖచ్చితంగా చెప్పకనే చెబుతోంది పరోక్షంగా. తులసిలో కొత్త మనిషిని చూస్తున్నా. పరిస్థితులు మనిషికి మాటలు నేర్పిస్తాయి. అవసరమైతే ఎదురువాదం చేయమంటాయి. బతక నేర్చే ఒక పక్క మార్గాన్ని సృష్టిస్తాయి. అసలు మనిషిని తయారు చేసేది పరిస్థితులే. నాకర్ధం కాని పాయింట్ ఒకటే. సముద్రంలో పడి తేలుతున్న వాడికి ప్రయాణిస్తున్న పడవే కదా ఆధారం? మరి తులసేమిటీ, తన పడవతో బాటు నావికుణ్ణి కూడా ముంచేస్తూ ఇంత పిచ్చి పని చేస్తోంది? తలెత్తి నేనామె వైపు చూడబోయాను. అప్పటికే ఆమె అటువైపుకు తిరిగి నించుంది. ఆమెని తీసుకెళ్దామని వచ్చాను కానీ, ఈమె వైనం అందుకు పూర్తి భిన్నంగా వుందన్న సంగతి అర్ధమైపోయింది. మనిషినైతే బంధించి తీసుకెళ్ళొచ్చు. కానీ లేని హృదయాన్ని ఏ గుప్పిట్లో పట్టి తీసుకెళ్ళగలం? ఆఖరు ప్రయత్నంగా అడగాలి కాబట్టి అడిగాను.
“నువ్వు లేకుండా బ్రతకలేనంటున్న విహారికి ఏం చెప్పమంటావ్, చివ…?”
నా మాట పూర్తి కాకముందే అందుకుంది. “జీవితంలో ఇంకెప్పుడూ కలిసే ప్రయత్నం చేయొద్దని చెప్పు. తను నాకు ఈ ఒక్క సహాయం చేస్తే చాలని చెప్పు. ఇదొక్కటే నా చివరి మాటగా చెప్పు చాలు.” మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతులో ఎలాటి జీర వినిపించలేదు. చివరి నిర్ణయాన్ని ఎంతో స్థిరంగా చెప్పింది. ఇక మార్చుకునే ప్రసక్తి ఎక్కడిది? లేదు. నిరాశ ముంచెత్తింది నన్ను.
కొంతమందికి బ్రతకడమే ముఖ్యం. ఎలా అయినా పెద్ద పట్టింపు వుండదు. శరీరం కదులుతుంటే చాలు. మనసు మొద్దు బారినా ఫర్వాలేదు. ఆత్మని నొక్కేశాక, ఇక అంతరాత్మలతో పనేముంటుంది?
నేనక్కణ్ణించి నిశ్శబ్దంగా బయటకొచ్చేశాను. విహారి వుంటున్న హాస్టల్ దాకా ఎలా చేరానో నాకే తెలీదు. తులసి ఏమంది? అని ఆశగా అడిగే విహారికి జవాబు ఏం చెప్పాలన్న బాధ నన్ను నన్నుగా నిలవనీడం లేదు. హాస్టల్ ముందు గుంపులు గుంపులుగా జనం. ఆంబ్యులెన్స్ లైట్లు. పారామెడిక్స్ కారిడార్ ఆ మూల నించి స్ట్రెచర్ తోసుకుంటూ వస్తున్నారు. శివ కనిపించాడు ఇంతలో.
“గీతా, విహారి పాయిజన్ తాగాడు. బ్రతికే ఛాన్స్ లేదంటున్నారు.” కళ్ళనీళ్ళ ధారలు తన చెంపలపై.
అనుమానం భయమై నిజమయింది. దేవుడా, ఇంకేమిటి ఇప్పుడు చేయడం?
పోలీస్ విజిల్స్, అంబులెన్స్ సైరన్, అరుపులు, కేకలు, అడుగుల చప్పుళ్ళు… చలనం లేని రాయిలా నేను.
గీతా! నువ్వొక్క సారి వెళ్ళి తనతో మాట్లాడవా… తను లేకపొతే, నేను… నే…ను చచ్చిపోతానని చెప్పవా! ప్లీ…జ్”
రెండు చేతుల్లో ముఖం దాచుకుని కూలిపోయాను. దుఃఖం ఆగలేదిక.
“గీతా…”
ఎంతో ఆర్ద్రంగా వుందా పిలుపు. నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ చెప్పాడు విహారి.
“నీకెలా థాంక్స్ చెప్పాలో తెలీడం లేదు గీతా! నువ్వు చేసిన సేవలు, నీ సహాయం మరచిపోలేను. ఈ జన్మంతా గుర్తుంచుకుంటాను. నువ్వన్నట్టు నేనీ వూరు మారాలి. నేనూ మారాలి. అన్నిటికంటే ముఖ్యంగా గుండె మార్పిడి జరగాలి.” గుండె మీద చేయుంచుకుంటూ అంటున్నప్పుడు అతని కళ్ళల్లోకి చూడలేకపోయాను. అవి, వర్షిస్తుంటే!
అతని స్నేహితులు గుంపుగా వచ్చారు. అందరి దగ్గరా సెలవు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. యుధ్ధంలో ఘోరంగా పోరాడి పరాజయం పొందిన వాడిలా, మిన్ను విరిగి వెన్ను మీద పడ్డవానిలా తలొంచేసుకుని, రెండు భుజాలు కుదించేసుకుని… తనకిక పగలన్నది లేదు మిగిలింది అమావాస్య అన్నట్టు… శోకమూర్తిలా రైలెక్కి వెళ్ళిపోయాడు.
ఇంటికొచ్చి లోపలకెళ్ళ బుద్ధి కాక, బయట గార్డెన్ చెయిర్లో కూర్చుని ఆలోచిస్తున్నా, ఏవిటీ, ఇలా ఎందుకు జరిగింది అనుకుంటూ!
ఇంతలో తులసి పరుగు పరుగున వచ్చి నా ముందు నించుంది. నేనేం మాట్లాడలేదు. నిర్లిప్తంగా చూశానామె వైపు. ఛటాల్న కూలబడిపోయింది మోకాళ్ళ మీద. ఆ మరుక్షణమే నా వొళ్ళో ముఖం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
అప్రయత్నంగా నా చేయి – ఆమె తల నిమిరింది.
నిజానికి ఇద్దరూ నా స్నేహితులే. ఎవర్ని ద్వేషించగలను. ఎవరిది తప్పని నిందించగలను.
ఇంకా ఏడుస్తూనే వుంది తులసి.
దేనికోసమని? విహారి బ్రతికినందుకా? లేక ఆమె కోరినట్టు బ్రతికున్నంత కాలమూ రాకుండా పంపించేసినందుకా?
పిచ్చి మనసు. కారణం తెలుసుకుని ఏడ్వటం దానికెప్పుడొస్తుందనీ? నాకూ చెప్పలేనంత బాధగా వుంది.
కాలమే అన్ని ప్రశ్నలకీ జవాబు. అంతే కాదు, అన్ని బాధలకూ అదే ఓదార్పు.
మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి! విహారి రావడం, రమ్మని కబురంపడం నాకు చాలా ఆనందంగా వుంది. అంతకు మించి చిత్రం గానూ వుంది.
ఇప్పుడెలా వుంటాడు? అతనెలా ఉంటాడో ఊహించ ప్రయత్నించినా ఆ విహారే కళ్ళముందు నిలుస్తున్నాడు.
నాకోసమే చూస్తున్న విహారి నవ్వుతూ ఎదురొచ్చాడు. గీతా! అంటూ. దగ్గరకొచ్చి హగ్ చేసుకున్నాడు. “హౌ ఆర్యూ మై ఫ్రెండ్?” అంటూ ఆత్మీయంగా పలకరించాడు. ఆ కళ్లు స్వచ్చంగా నవ్వుతున్నాయి అప్పట్లాగే. మనిషిలో మార్పేమీ లేదు, కొద్దిగా చెంపల దగ్గర తెల్లబడుతున్న జుట్టు తప్ప. మనిషికి గొప్ప హోదానిచ్చేవి నిజానికి సిరిసంపదలు కావు. మంచితనం, హృదయమున్నతనం, ఎనలేని హుందా ఆపాదించి పెడతాయనుకుంటా.
విహారి! నే బ్రతికించిన విహారి! కొత్త జీవితాన్నెంచుకుని హాయిగా వున్నాడు. నాక్కావాల్సిందీ అదే. ఇన్నేళ్ళూ విహారిని అస్సలు కలవకపోవడానికి గల ప్రధాన కారణమూ ఇదే. అతని సంతోషాన్ని ఆ జ్ఞాపకాలు హరించకూడదనే! అతన్ని దూరంగా వెళ్ళమని సలహా ఇచ్చి, తను మాటిమాటికీ దగ్గరై మాట్లాడ్డానికి కాదు కదా.
“ఎలా వున్నావ్ విహారీ?” అంటూ మాటల్లోకి తీసికెళ్ళాను.
అతను గడ గడా మాట్లాడేస్తున్నాడు. తన గురించి, తను చేస్తున్న బిజినెస్ గురించీ, హైదరాబాద్లో వాళ్ళబ్బాయి సాఫ్ట్ వేర్ కంపెనీ గురించి, వాళ్ళమ్మాయి ఫేషన్ డిజైనింగ్‌లో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతుల గురించి, వాళ్ళావిడ గురించి… మాట్లాడుతున్నాడు.
నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. వింటున్న నాకెందుకో సందేహమొచ్చింది. విహారి ఏం మాట్లాడుతున్నాడూ అని? మాటల వెనక దాస్తున్న మనసు అతని ముఖం లోంచి అప్పుడప్పుడు తొంగి చూడటం గమనించా. సంభాషణ పొడిగింపు కోసమన్నట్టు నా గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. నిజానికి శ్రధ్ధ పెట్టడం లేదని తెలుస్తోనే వుంది. పరాకుగా ఊఁ, ఊఁ, గుడ్, గుడ్,’ అంటూ ఆగిపోవడంతో.
మాటల్లో తనే చెప్పాడు. ఆంధ్రాకి పని మీదొచ్చినట్టు, ముఖ్యంగా నన్ను కూడా కలిసినట్టుంటుందని. మరుసటి ఉదయం ఫ్లయిట్‌లో వెళ్ళిపోతున్నట్టు చెప్పాడు.
“ఓహో. అలానా! నా నెంబర్ ఎలా తెలిసింది నీకు?” అడిగాను గబుక్కున గుర్తొచ్చి.
“నాకు అన్నీ తెలుస్తూనే వుంటాయి గీతా. ప్రభాకర్ని కాంటాక్ట్‌లో వుంచుకున్నాను…” అంటూ ఆగాడు ఏదో అడగబోతూ.
నేనేమీ చెప్పదలచుకోలేదు. తెలిసినా సరే. అతనికిష్టమైన గాయం తులసి అని నాకు తెలుసు. అతను బ్రతకాలంటే – ఆ గాయం మానకపోయినా ఫర్వాలేదు. మరింత రేగ కూడదనేది నా ఉద్దేశం.
కుర్చీ లోంచి లేచి చేతివేళ్ళతో జుట్టు సరిచేసుకుంటూ తడబడుతూ అన్నాడు, మెల్లని స్వరంతో. “గీతా! నన్ను కోప్పడనంటే నిన్నొక మాటడుగుతాను చెబుతావా?”
“ఏవిటీ?” అన్నాను సంకోచంగా.
“అదే, తులసి భర్త…” అంటూ ఆగిపోయాడు.
“అవును. పోయాడు.” తొణక్కుండా చెప్పాను.
అతను గబుక్కున నా చేతులు పట్టుకున్నాడు. “గీతా, ఒక్కసారి ఒక్క సారి తులసిని చూడాలనుంది. ఎంత బాధలో వుందో కదూ?” అతని కళ్ళనిండా కన్నీళ్ళు. ప్రేమతో నిండిన కన్నీళ్ళు. ఎంత పిచ్చి ప్రేమ! ఆమె పట్ల ఎంత దయ ఇతనికిప్పటికీ? చూడలన్న ఎంత కాంక్ష?
అప్రయత్నంగానే నా కళ్ళలోనూ నీళ్ళు నిండాయి. ఇప్పుడర్ధమైంది. విహారి ఈ వూరెందుకొచ్చాడో. ఎవర్ని వెతుక్కుంటూ వచ్చాడో.
అంతా అర్ధమైన దానిలా తలూపుతూ, “సరే. తులసికి చెబుతాను. సరేనా?” అన్నాను, బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ.
అతని కళ్ళు అప్పట్లానే మెరిశాయి. “థాంక్స్ గీతా.” చెప్పాడు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
తిరిగి వొచ్చేస్తుంటే మనసుకేమీ తోచనట్టు అయింది. ఇంతగా ప్రేమించే మనుషులుంటారా, ఈ కాలంలో కూడా. ఆశ్చర్యం! ప్రేమకి అంత శక్తి వుంటుందా? ప్రేమించిన మనిషిని ఒక జన్మంతా గుర్తుకుంచుకునేంత హృదయం ఎక్కడైనా వుంటుందా? ఒక్క సారైనా ఆమెని చూడాలని, పలకరించాలనీ అసలిదెలా సాధ్యం? విహారి వంటి బ్రిలియంట్ ఇంత బేలగా అయిపోవడమేమిటీ?
ఒక పక్కన సంసారం పిల్లలు సమాజం పరువు ప్రతిష్టలు ఇన్నున్నా మరో వైపు ఆ గతం, ఆ జ్ఞాపకం అలానే వున్నాయా మనిషితో బాటు తామూ వెంట తిరుగుతున్నాయా ఇన్నాళ్లూ? అంటే మనిషి వేరు. మనసు వేరా? అతను నవ్వుతూ బ్రతుకుతోంది నిజమైన మనసుతో కాదా?
ఏమో. ఇప్పుడు నేను చేయాల్సిన పని? ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తులసి ఇంటికి ఎందుకు వెళ్ళానో ఇప్పుడు మళ్ళీ అందుకే వెళ్ళాలి. తను విషయం చెప్పేలోగా ఆమె ‘హుష్’ అంటూ గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి ఏడుస్తుంది. పిల్లలు వింటే పరువు పోతుందని. కోడలు చూస్తే జీవితమే నాశనమైపోతుందని, కొడుకు ఛీ కొడ్తాడని కారణాలు చెబుతుంది.
‘విహారికేం చెప్పమంటావ్’ అని అడుగుతాను. అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడూ చెప్తుంది. కారణాలు మాత్రమే వేరు.
నేను బాధపడుతూ విహారి దగ్గరకొచ్చి చెప్తాను. అతను ఆ రాత్రి లాగానే తలదించుకుని వెళ్ళిపోతాడు. కొత్తగా రేగిన గాయం ఈసారి మానదు. అదే సన్నివేశం పునరావృతం అవుతుంది. నిర్ణయం మార్చుకుని, కారుని ఇంటి వైపుకి మళ్ళించాను.
నిస్త్రాణగా బ్యాగ్ ఇంట్లో పడేసి బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేక, అలానే మొక్కల మధ్య కుర్చీలో కూర్చుని టీ తాగుతున్నాను. ఉక్కపోత, మబ్బులు కమ్ముకుంటున్నాయి. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. విహారి ఎదురు చూస్తుంటాడేమో, నేను చేసింది తప్పేమో, స్నేహితుడి కోసం ఇంకొక్క సారి తులసిని అడిగివుండాల్సిందేమో… లేదు లేదు. ఇద్దరూ స్నేహితులే, కానీ తాను కాపాడవలసింది ముందు విహారిని. తులసికి ఆ అవసరం లేదు. నా నిర్ణయం సరైనదే.
చినుకులు పడడంతో వరండాలోకి వచ్చి కూర్చున్నాను. ఇంతలో పరుగు పరుగున మెరుపులా వచ్చింది తులసి. వచ్చి, నా కుర్చీ పక్కన రొప్పుతూ నిలబడింది. నేనామె వైపు నిర్లిప్తంగా చూశాను.
మనిషంతా కంపించిపోతూ వొణుకుతున్న పెదాలతో అడిగింది. “విహారి వచ్చాడటగా? నువ్వెళ్ళి కలిసొచ్చావట?” ఆ కంఠంలో ఎప్పుడూ లేని ఆత్రం వినిపించింది. నేనిన్నాళ్ళూ వినని ఒక కొత్త గొంతు వింటున్నాను.
“అవును వచ్చాడు. ఏం?” సూటిగా చూశాను.
ముఖాన్ని గుండెల దాకా వొంచుకుంది. “ఒక్కసారి కలవనా?” అంది ఎంతో ఆశగా. నేను విస్తుపోయాను.
“ఏం, ఎందుకు?”
“ఎందుకో చెప్పలేను. అలా అని ఇంక దాచుకోనూ లేను. ఇప్పుడిక ఏమీ మారదు, ఏ ప్రయోజనమూ లేదు. కానీ ప్లీజ్ గీతా… విహారిని ఒక్కసారైనా కలవాలి”
రాళ్ళను కరిగించే దైన్యం ఆ గొంతులో. ఇన్నేళ్ళుగా తనను తాను అసహాయతతో నిర్దయగా హింసించుకున్న ప్రాణి ఆఖరుసారి ఆశపడుతున్న గొంతు అది.
ఆశ్చర్యం. తులసిలో కూడా ఇంత క్షోభ దాగి ఉందా?
కన్నీళ్ళాగడం లేదు.
గేటు చప్పుడైతే తల తిప్పి చూశాను.
వర్షంలో తడుస్తూ విహారి లోపలికి వస్తున్నాడు.
అతనికెలా తెలిసిందీ?
--------------------------------------------------------
రచన: ఆర్. దమయంతి,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment