Saturday, February 9, 2019

హృదయాన్ని తాకే మొల్ల కవిత్వం


హృదయాన్ని తాకే మొల్ల కవిత్వం





సాహితీమిత్రులారా!


నీలమేఘచ్ఛాయబోలు దేహమువాడు
ధవళాబ్జపత్ర నేత్రములవాడు
కంబుసన్నిభమైన కంఠంబుగలవాడు
బాగైనయట్టి గుల్ఫములవాడు
తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు
ఘనమైన దుంధుభి స్వనమువాడు
పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు
చక్కని పీనవక్షంబువాడు
తే.
కపటమెరుగని సత్యవాక్యములవాడు
రమణి రాముండు శుభలక్షణములవాడు
ఇన్ని గుణముల రూపింప నెసగువాడు
వరుస సౌమిత్రి బంగారువన్నెవాడు!
నిరాడంబరంగా ఉండి, పరమ ఆత్మీయంగా ఉన్న ఈ పద్యం మొల్లమ్మతల్లి వ్రాసింది. అంత కష్టపడి సముద్రాన్ని దాటి, రాత్రంతా లంక మూలమూలలు గాలించి, వెతికి, వేసారి, చివరకు అశోకవనంలో సీతను కనుగొని, మాటలాడుదామనుకునేలోగా రావణుడు వచ్చి కారుకూతలు కూసి బెదిరించిపోయిన తర్వత, కాపలా స్త్రీలు కూడా బెదిరించి, విసిగి, విసిగించి పోయిన పిదప, త్రిజట తన స్వప్నవృత్తాంతాన్ని చెప్పిన పిమ్మటగాని హనుమంతునికి జానకితో మాట్లాడే వీలు కలుగలేదు. కొంత సంభాషణ జరిగిన తర్వాత, అప్పటికే రాక్షస మాయలతో వేసారివున్న సీత, హనుమంతుని నమ్మలేక–సరే, రాముడూ లక్ష్మణుడూ ఎలాంటివారో చెప్పమంటే, వారిని వర్ణిస్తూ ఆయన జవాబుగా చెప్పిన సందర్భంలోని పద్యం ఇది. ఎంతో నిసర్గంగా వుందిగదూ ఈ వర్ణన! ఆడంబరంగా చెప్పింది ఏమీ లేదు. చెప్పిన నాలుగైదు ఉపమానాలు కూడా చాలా సాదాసీదావీ, మామూలుగా ఎవరైనా చెప్పేవే. ఏ ఉపమానాలూ లేకుండా అక్కడక్కడా రూపించిన బాగైన, తిన్ననైన, ఘనమైన, చక్కని లాంటి విశేషణాలు ఏ పోలికలూ వ్యక్తీకరించలేని అందాన్ని కుప్పపోశాయి అక్కడ. ఎదుటివ్యక్తి ఏమి వినాలనుకుంటుందో, ఏది ఎలా చెపితే ఆ వినాలనుకునే ఆమె ప్రసన్నురాలవుతుందో, అది తెలిసి చెప్పడం ఒక సమర్థమైన మనోభావ విశ్లేషణ. మొల్ల హనుమ చేత అలా ఆర్ద్రంగా ఆప్తంగా చెప్పించడం, ఆ రహస్యం తెలిసి చేసిన ప్రయత్నం.

అనుక్షణం బాధపడుతూ అసలు తనెక్కడుందో తన భర్తకు తెలుసునో తెలియదో తెలియక, ఆయన వస్తాడో రాడో తెలియక, మధ్యలో రావణుడి దౌష్ట్యాలకు గురవుతూ, రాక్షస స్త్రీల చేత బెదిరింపబడుతూ–తన ప్రాణశక్తులన్నింటినీ, తన ప్రేమభావం యావత్తునూ ఏ మహనీయుని మీద ఏకత్రితం చేసుకుందో ఆయనకోసం నిరీక్షిస్తూ–వేదనతో నిరాశతో గడిపేస్తే, భవిష్యత్తులో ఏమౌతుందో ఏ సూచనా దొరకని స్థితిలో ఎవరో ఒక ముక్కూమొహం ఎరుగని వానరుడు వచ్చి, ఏదో చెపితే నమ్మాలో నమ్మరాదో తెలియని స్థితిలో ఉన్న స్త్రీకి, ఏమి చెపితే ఎలా చెపితే ముందు ఆమె హృదయం చల్లబడుతుందో అది హనుమంతునికి తెలుసు. మొల్లకు తెలుసు. అది తెలుసుకుని చెప్పిన పద్యం అది. ఆ పరిస్థితిని స్త్రీ హృదయమే బాగా అర్థం చేసుకోగలుగుతుంది. అందుకే మొల్ల చెప్పిన ఆ పద్యం అంత హాయిగా ఉంది. పది పాదాల్లో వర్ణించిన రాముణ్ణి అలా వుంచితే కేవలం రెండేరెండు పాదాల్లో లక్ష్మణుని మూర్తిని అంతే సమగ్రంగా రూపుకట్టించడం ఎంతో గడుసుగానూ సొగసుగానూ ఉంది. ఆడంబరాలు లేని కవిత్వం, హృదయంతో అనుభవించి అప్రయత్నంగా పలవరించే కవిత్వం ఎంత రమ్యంగా ఉంటుందో చెప్పేందుకు ఈ పద్యం సాక్ష్యం.

తెలుగులో తొలి రామాయణం గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథరామాయణం. అది ద్విపదలో ఉంది. దేశి కవితా ధోరణి ఐనందునా, ఛందోవైవిధ్యం లేనందునా పండితులకు తృప్తి కలుగదు. ఐనా తెలుగువారు దానిని ప్రేమతో స్వీకరించారు. ఆ తరువాత భాస్కర రామాయణం వచ్చింది. దానిని నలుగురైదుగురు రచించారు. మొత్తం మీద బాగానే ఉంటుంది. అక్కడక్కడా మరింత బాగా ఉంటుంది. కానీ కవిత్రయ భారతంలాగానూ, పోతన భాగవతంలాగానూ గొప్పగా శిరోధార్యం కాలేకపోయిందనే చెప్పాలి.

ఆ తరువాత మొల్ల కేవలం కథ మాత్రమే చెపుతూ, అత్యంత సంగ్రహంగా, క్లుప్తంగా రామాయణం వ్రాసింది. చాలా సరళమైన భాషలో హాయిగా వ్రాసింది. మామూలు సాహిత్య ప్రరిజ్ఞానం కలిగినవారు కూడా ఏమాత్రం శ్రమ లేకుండా అర్థంచేసుకుంటూ చదువుకునేలాగా వ్రాసింది. సాధారణ జనంలోకి రామ కథ ప్రాకిపోవడానికి మొల్ల రామాయణం చేసిన దోహదం అంతా ఇంతా కాదు. తనకు ఛందో వ్యాకరణాలూ శాస్త్రాలూ తెలియవంది. కేవలం శ్రీకంఠ మల్లేశుని కృపవలన ఏదో పద్యాలు వ్రాయటం నేర్చుకున్నాననీ, శ్రీరాముడే తననీ కార్యానికి ప్రోత్సహించాడనీ చెప్పుకుంది. మొల్ల అబ్రాహ్మణ, అపండితురాలు. పైగా ఆడమనిషి. ఆరోజుల్లో ఆమెను ఎవరూ ప్రోత్సహించి వెన్నుతట్టి ఉండరు. అయితేనేం, కేవలం 650కన్నా తక్కువ పద్యాల్లో అన్ని వేల శ్లోకాల రామకథను వ్రాసింది. కిష్కింధ కాండ అయితే మరీ 27 పద్యాలే.

ఏ కావ్యానికయినా దాని భాగధేయాన్ని నిర్ణయించేది కవి యెడ సానుభూతి లేని రంధ్రాన్వేషణాతత్పరులైన పండితులు కారు. సాధారణ పాఠకులు. తెలుగు పాఠకులు మొల్ల రామాయణాన్ని ఆనందంగా ఆహ్వానించి గుండెలకు హత్తుకున్నారు. మళ్ళీ మళ్ళీ చదువుకొని మననం చేసుకోదగిన పద్యాలు చాలానే ఉన్నాయి అందులో. తాను విదుషిని కాదనీ, శాస్త్రాదులు తనకు తెలియవు అని అన్నా కూడా కవిత్వమనేది ఎలా ఉండాలో కచ్చితమైన అభిప్రాయాలే ఉన్నాయి మొల్లకు. సంస్కృతంలోంచి తెలుగులోకి అనువదిస్తున్నామని చెపుతూ మళ్ళీ అన్నీ సంస్కృత పదాలే గుప్పించడం ఏమిటి అని విసుక్కున్నది. ఒక్క తేనె చుక్క నాలుకమీద పడగానే నోరంతా తీయనైనట్లు, ఒక పద్యం అలా చదవగానే అర్థమంతా తోచకపోతే, అది మూగ చెవిటివాళ్ళ ముచ్చటే గదా అన్నది. ‘చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకుమీద చెపుతున్నాను. కాబట్టి తప్పులెంచవద్ద’నింది. ఇక విమర్శకుల దోషగవేషణా ప్రయత్నం వ్యర్థమే గదా!

ఇక పైన చెప్పిన సందర్భంలో, ఇతర రామాయణాల్లో ఏతత్కర్తలు చెప్పిన పద్యాలు యింత గొప్పగా ఉండవు. ఒకటి రెండు చూద్దాం.

వాసువాసు అనే పేరుతో ప్రసిద్ధిచెందిన వావిలికొలను సుబ్బారావు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణమనే పేరుతో వాల్మీకిని తు.చ. తప్పకుండా పద్యాల్లో అనువాదం చేశారు. దానికి ఆయనే మందరమనే వ్యాఖ్య వ్రాశారు. మందరానికి మంచిపేరే వచ్చింది కాని కావ్యంగా ఆయన రామాయణానికి ఎక్కువ వ్యాప్తిగానీ కీర్తిగానీ రాలేదు. మందర వ్యాఖ్య కూడా కవితా పరామర్శకన్నా ఆధ్యాత్మిక సందేహాల వివరణే ప్రధానంగా ఉంటుంది. అందుకని పై సందర్భంలో ఆయన వ్రాసిన పద్యాలు అంత గొప్పగా ఏమీ ఉండవు. రాముని వర్ణిస్తూ అక్కడ ఏడు పద్యాలు రాశారు. ‘రాముడు కమలపత్ర విశాల లోచనుండఖిల సత్వ మనోహరగుణుండు, రూపదాక్షిణ్య నిరూఢుడై జనియించె, తేజంబునందు నాదిత్యుబోలు’–అంటూ సాగుతుంది. ఆ పిమ్మట, ‘సమ విభక్తాంగుడు, సముడు, త్రితామ్రుండు, త్రిప్రలంబుడును, త్రిస్థిరుండు, ముచ్చోట్ల నున్నతి, ముచ్చోట్ల స్నిగ్ధత, ముచ్చోట్ల గాంభీర్యమును గలండు. త్రివళివంతుడును, త్రిసముండు, త్రిఅవనత త్రిశిరస్కుడమ్మ నీ హృదయవిభుడు’–అంటూ ఒక జాబితాలాగా కవిత్వగంధం లేకుండా నిస్సారంగా ఉంటాయి ఆ పద్యాలు.

భాస్కర రామాయణంలో ఈ ఘట్టం భాస్కరుని పుత్రుడైన మల్లికార్జునభట్టు వ్రాశాడు. ఈయన చక్కని కవి. ఈయన వ్రాసిన ఒకటి రెండు పద్యాలు మనం ఈ శీర్షికలో ముచ్చటించుకున్నాము. ఈయన ఇక్కడ-

1. రాఘవుడు చారుమేచక మేఘశ్యాముడు గృపాసమేతుడు విబుధ శ్లాఘాకవితుడు, సమరామోఘాస్త్రుడు వికచ పద్మముఖుడును మరియున్

2. రవిరోచిష్టుడు, భూసహిష్ణుడు, రణప్రస్ఫార నానాజయో
త్సవ వర్ధిష్ణుడు, సచ్చరిత్రుడు, సురక్షాకేళి విష్ణుండు, నా
హత వీరారి నిరాకరిష్ణుడును, సత్యాలంకరిష్ణుండు, బ్రా
భవ లక్ష్మీప్రభవిష్ణుడున్, గుణగణభ్రాజిష్ణుడున్, జిష్ణుడున్

3. బ్రాహ్మప్రార్థీ జన్ముడు, బ్రహ్మాస్త్ర ప్రముఖ దివ్య బాణచయుండున్
బ్రాహ్మణభక్తిప్రణవుడు, బ్రహ్మవిదుడు, బ్రహ్మచర్య పరమవ్రతుడున్

అని మూడు చక్కని పద్యాలు వ్రాశాడు. ఆ తరువాత, వాల్మీకి చెప్పిందాన్ని వదలిపెట్టకూడదు కాబట్టి ‘త్రిస్థిరుడు, త్రివ్యాప్తుడు, త్రివళీయుతుడు, చతుర్లేఖుడు, చతుష్కళుండు’ అంటూ ఒక దీర్ఘ వచనం పూర్తి పేజీది వ్రాశాడు. సీత స్పష్టంగా అడిగింది ‘రూపురేఖలవి యెట్టివి? యంగ విశేష సౌష్ఠవంబెట్టిది, వర్ణలక్షణములెట్టివి?’ అని. వచనములో పెద్ద జాబితా ఇచ్చాడుగాని, తొలి పద్యంలో ‘చారుమేచక శ్యాముడు, వికచ పద్మముఖుడు’ అనే రెండు ముక్కలు తప్ప రాముని ఆకారం, మొల్ల చెప్పినంత వివరంగా చెప్పలేదు. ఇక రెండో పద్యం పద్యనిర్మాణంలోనూ, అంత్యప్రాసల బాహుళ్యంతోనూ బాగానే వుంది. కాని ఎప్పుడు పాదానికి నాలుగు అంత్యప్రాసలు పెట్టి అదరగొట్టాలనుకుంటామో అప్పుడు భావమూ లాలిత్యమూ కొద్దిగా వెనకడుగు వేస్తాయి గదా. ఇక్కడ అంత నష్టం కలగలేదనుకోండి, సందర్భ శుద్ధిలో మాత్రం మొల్ల పద్యమే ఎత్తుగా ఉంటుందనిపిస్తుంది.

ఇక రామాయణ కల్పవృక్షం కూడా గమనిద్దాం. నిజానికి మొల్ల రామాయణానికీ విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికీ పోలిక పెట్టడం న్యాయం కాదు. ఎందుకంటే మొల్ల కథ మాత్రమే చెప్పింది. విశ్వనాథకు కథ, కవిత్వమూ, పద్యాలూ- ఇవి కేవలం పరికరాలు మాత్రమే. తాను ఒంటబట్టించుకున్న ఏదో మహార్థాన్ని ప్రపంచించడమే ఆయన ప్రాథమ్యం. ఆ మహార్థాన్ని వెలార్చే క్రమంలో ఆయన కవనం కూడా హిమాలయోత్తుంగంగా ప్రవర్తించిందనేది బంగారానికబ్బిన తావి. విశ్వనాథ ఇక్కడ పదకొండు పద్యాలు వ్రాసి, త్రిస్థిరుడూ, త్రిప్రలంబుడూ అంటూ ఒక చిన్న ఐదారు లైన్ల వచనం వ్రాశాడు. అన్ని పద్యాలూ ఉటంకించి పరామర్శించాల్సినవే కాని, అది అసందర్భం కాబట్టి సందర్భం కోసం ఒకే పద్యం స్పృశిస్తాను.

సుందరుడతడు, వెడంద లేకన్నులు, నతని జూచిన గుండెయందునుండి
త్రవ్వక వచ్చునే తారుణ్యభావ పయఃపయోధి నవనీతాకృతీ! యె
దో గాలివంటిది దుఃఖతరంగమ్ము, వికృత మౌనానంద విధుర వీచి
బహుయుగమ్ముల పుణ్యపరిపాకమాకారమూని వచ్చినవాడె తాను స్వామి!

రూప దాక్షిణ్య సంపన్నుడు, ఓపికమెయి బృధ్విసముడు బృహస్పతి విమలబుద్ధి
నలిదురాసాహుడును, సమజ్ఞావిశేషమందు, నేమందు, గుండె కామందు సామి!

‘రామచంద్రుని శరీర సంస్థానంబెట్టిది, యతని రూపమెట్టిది, లక్ష్మణునివెట్టివి, ఊరుబాహు వైలక్షణ్యమెట్టిది, వారి చిహ్నములెట్టివి’ అని మాత్రమే అడిగింది సీత. రాముని శరీర లక్షణాలను నామమాత్రంగా చెప్పి, రాముణ్ణి తన మనసులోకి ఆవాహన చేసుకుంటూ తన గుండెలోంచి తన్నుకొచ్చే భావపరంపరా పారవశ్యంతో, రాముని బాహిర రూపాన్నే కాక ఆయన అంతస్సత్వాన్నీ, అంతస్తత్వాన్నీ వింగడించకుండా ఉండలేకపోయాడు హనుమ. ఇంతకూ ‘బహు యుగమ్ముల పుణ్యపరిపాక’మెవరిది? సీతదా, హనుమదా, లేక విశ్వనాథదా! పోలికలింక ఆపేద్దాం.

విశ్వనాథ మహాకవి, మహా విజ్ఞాని, మహా భక్తుడు, మహా ఆధ్యాత్మికవేత్త. మొల్లమ్మ చల్లని మనసున్న స్త్రీమూర్తి. తోటి స్త్రీ దీనదశతో సహానుభూతి ఆమెకు. అందుకని ఆమె పద్యం చదువరుల గుండెమీద చందన లేపనంగా ఉండకుండా ఎలా ఉంటుంది?
-----------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment