Thursday, February 21, 2019

తెలిసీ పలికిన విలువేమో!


తెలిసీ పలికిన విలువేమో!



సాహితీమిత్రులారా!


ఈ కథను ఆస్వాదించండి...................

“శ్రీ గురుభ్యోన్నమః” నాటకీయంగా అంటూ ఇంట్లోకి వచ్చాడు భాస్కర్.

“సమస్త సన్మంగళాని భవంతు” అని ఉషశ్రీ ఫక్కీలో అతన్ని ఆశీర్వదించాను.

భాస్కర్ మా అల్లుడు శరత్‌కన్నా నాలుగయిదేళ్ళు పెద్ద. మా ఎపార్ట్‌మెంట్ కాంప్లెక్సులోనే వుంటాడు. నేనేం చెప్పినా, “పెద్దల మాట” అనుకుంటూ వింటూంటాడనుకుంటాను. ఒంటరిగా వుండే నాకు అతను అప్పుడప్పుడూ రావడం మంచి కాలక్షేపాన్ని కలుగజేస్తుంది. ఆ రోజు ఎందుకో మూడీగా వున్నాడనిపించింది.

“ఏమిటయ్యా అలా వున్నావ్?” అడిగాను.

“భార్యా రూపవతీ శత్రుః అని పెద్దవాళ్ళు నా గూర్చే అన్నారనిపిస్తుందండీ” అన్నాడు.

భాస్కర్ భార్య అందంగా వుంటుంది. వయసు ఆమె అందాన్ని ఇనుమడింప జేసిందనే చెప్పుకోవచ్చు. ఆమె ఎదురుగా వస్తుంటే చూపులు తిప్పుకోవడం కొంచెం కష్టం, నా వయసు వాడిక్కూడా. పధ్ధెనిమిదేళ్ళ కూతురు పక్కన ఆమె నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్ళనుకుంటారు తెలియని వాళ్ళు.

“ఇవాళ్ళ ప్రత్యేకంగా ఏమయింది?”

“ఇంటి సందులోకి తిరిగి, నడిచి వస్తుంటే పట్టుమని పదిహేనేళ్ళు కూడా లేని మగపిల్లలు – జులాయి వెధవలు – మాట్లాడుకుంటున్నారు. ఇవాళ్ళ ఆంటీ ఏం జాకెట్టేసిందిరా! ఆ వీపు మీద సెవెంటీ ఎమ్మెం సినిమా వెయ్యొచ్చు అని ఒకడంటే, రెండోవాడు, సరేలే, మొన్నీమధ్య వేసిన జాకెట్టయితే, ముందునించీ చూసేను, గుండెలదర కొట్టేసిందీ అంటున్నాడు. వాళ్ళకి నేను ఆ ఆంటీ మొగుణ్ణని తెలిసి వుండే అలా అన్నారని నా నమ్మకం. మామూలుగా అయితే సందులో ఎప్పుడూ నడిచే అలవాటు లేదు కాబట్టి, అలాంటి వ్యాఖ్యానాలు నా దాకా రాలేదు. ఇవాళ్ళ కారు రిపేరుకివ్వడం, సందులో నడిచి రావడం వల్ల ఆ మాటలు నా చెవినపడ్డాయి. రోజూ వాళ్ళేకాక ఇంకా ఎంతమంది ఇలా మాట్లాడుకుంటారోనని అనుకుంటే గుండె బద్దలవుతోంది. ఆ సినిమావాళ్ళు వేసుకునేలాంటి జాకెట్లు నీకొద్దే అంటే వినదు. ఆఖరికి పూజలు వ్రతాలు జరుగుతున్న చోట్లక్కూడా వేసుకొస్తుంది.” అన్నాడు.

రోజూ బాల్కనీలో గంటలు గంటలు కూర్చుంటాను కాబట్టీ, అక్కణ్ణించీ నాకు సందు చివరిదాకా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టీ ఆ ఆంటీ అతని భార్యే అని నాకూ తెలుసు. మరీ మరీ చూడాలనిపించే ఆ చెంపకు చేరడేసి కళ్ళు. నవ్వితే సొట్టపడే బుగ్గలు. పెదవులమీద మొదలై కళ్ళల్లో ప్రతిఫలిస్తూ నవ్వుకే నిర్వచన మనిపించే ఆ పెదవుల వంపు. భార్య అందం రోజురోజుకీ ఇనుమడిస్తుంటే ఇతనికి తనమీద తనకి నమ్మకం తగ్గిపోతున్నట్లనిపిస్తుంది. వాళ్ళిక్కడికొచ్చిన అయిదారేళ్ళల్లో భార్యని తనతో సినిమాలకి గానీ షికార్లకి గానీ తీసుకుని వెళ్ళగా నేను చూడలేదు. ఎవరో బాగా దగ్గరి బంధువుల యిళ్ళల్లో జరిగే శుభకార్యాలకి తప్ప ఇద్దరూ కలిసి వెళ్ళింది లేదు – అదికూడా వున్న ఊళ్ళో అయితేనే! ఆఫీసర్ సెలవివ్వట్లేదనో, పిల్లల చదువులు పాడైపోతాయనో ఎప్పుడూ ఏవో కుంటిసాకులు నాకు చెబుతూనే వుంటాడు. నా అభిప్రాయమల్లా ఆమె అందం ఇతగాణ్ణి భయపెడుతోందని.

ఆమె లోకట్ బ్లవుజులు వేసుకునే మాట నిజమే. అయితే, మరీ సీత్రూ పైటని ఒకే పొరగా ఛాతీమీద వున్నట్టా లేనట్టా కనుక్కొమ్మన్నట్టుగా ఛాలెంజ్ చేస్తూ చాలామంది ఆడవాళ్ళు వేస్తున్న ఈ రోజుల్లో కూడా ఆమె రెండుమూడు పొరలుగా పైటని వేస్తోంది. దానికి భర్తగా అతనానందపడలేకపోతున్నాడు. ఆఫీసు పని అని చెప్పి ఏ రోజూ చీకటి పడేముందు ఇంటికి చేరింది లేదు. ఆదివారం నాడు తీరిక దొరికితే నాదగ్గరకి వచ్చి కూర్చుంటాడు. ఇంట్లో పన్లేం లేవా? అని పరోక్షంగా అడిగితే వాళ్ళావిడ టీవీ చూస్తోందనో, లేక ఆవిడతో బాటు గుడికి వెళ్ళడం ఇష్టంలేదనో చెబుతాడు. అతని వయసు స్నేహితులు గానీ కొలీగ్స్‌ కానీ అతనింటికి రాగా నేను చూసిన గుర్తు లేదు. పాపం ఆవిడకి ఎపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా కూర్చోవడానికి చికాకు పుట్టి అప్పుడప్పుడూ కొడుకునో కూతుర్నో తీసుకుని కొద్ది దూరం నడిచి రావడమో లేక పక్కింటావిణ్ణి తీసుకుని గుడికి వెళ్ళి రావడమో చేస్తూంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు కొంచెమయినా అలంకరించుకోరూ?

అతను ఉదహరించిన సామెత వినగానే నాకు క్రితం అమెరికా ట్రిప్పులో ఎదురయిన అనుభవం అతనికి చెబితే లాభం వుంటుందనిపించింది. ఇప్పటిదాకా ఎవరికీ చెప్పవలసిన అవసరం రాలేదు – రిటైరయిన ఒంటరిగాణ్ణి, నన్ను పట్టించుకునే వాళ్ళెందరున్నారు గనుక! సమయానుసారంగా కొంత కలిపి మరీ చెప్పాల్సిన అవసరం నాకు కనిపించింది.

“క్రితంసారి మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళొచ్చిన తరువాత అక్కడ నాకెదురైన అనుభవాలని నీతో పంచుకోవడానికి నువ్వు ఒక నెలపాటు ఊళ్ళో లేవు. ఆ తరువాత నీకు చెప్పడానికి నాకు గుర్తు లేదు. ఇప్పుడు సమయం వచ్చింది గనుక చెబుతున్నాను విను. మొత్తం మూణ్ణెల్ల గూర్చీ చెప్పన్లే, భయపడకు!” అంటూ మొదలుపెట్టాను.

“తాతయ్యా, మేం తెలుగు నేర్చుకుంటున్నాం” అన్నది పన్నెండేళ్ళ యామిని నన్ను వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుంటున్నప్పుడు.

“నేను కూడా” వంతపాడాడు పదేళ్ళ యశ్వంత్.

“‘వుయ్ ఆర్ లెర్నింగ్ టెలుగూ,’ అని మీరు అనలేదంటేనే ఎంత తెలుగు వచ్చేసిందో వెంఠనే అర్థమైపోయింది,” అన్నాను ఇద్దరినీ అక్కున చేర్చుకుని.

“ఎప్పటినించీ?” అనడిగాను.

“మీరు క్రితం ఏడాది ఇండియా తిరిగి వెళ్ళినప్పటినించీ,” అన్నది మా అమ్మాయి.

“మరి ఈ పదినెల్లపాటూ ఫోన్లో ఒక్కసారయినా చెప్పలేదేం?” అనడిగాను. నన్ను తెలిసినవాళ్ళు, పిల్లలని చూసిన దానికంటే వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారన్న విషయానికే ఎక్కువ సంతోషం పొందాననుకునేవాళ్ళు.

“మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఇలా దాచి వుంచారు,” అన్నాడు మా అల్లుడు శరత్.

“మేమిప్పుడు తెలుగు చదవగలం కూడా తాతయ్యా!” అన్నాడు యశ్వంత్.

ఇన్నిసార్లు అమెరికా వచ్చినా, వచ్చిన ప్రతీసారీ వాళ్ళని తెలుగులో మాట్లాడమని బ్రతిమిలాడితే ‘నో’ అన్నవాళ్ళు ఇప్పుడు అడగకుండానే ఇంతగా మారారా! ఎలా సాధ్యం?

“ఇక్కడ మాకు తెలిసిన ఒకాయన ప్రతి ఆదివారం తెలుగు క్లాసులు నడుపుతున్నారు. వాళ్ళమ్మాయి, ఇదీ మంచి స్నేహితులు. వాళ్ళు మాకు ఫామిలీ ఫ్రెండ్స్ కూడా. దానితోబాటు వీడూ వెడతానన్నాడు. వీళ్ళతోబాటు ఇంకో పదిమంది వుంటారు,” చెప్పింది మా అమ్మాయి.

ఇంటికి చేరిన తరువాత వాళ్ళు నాకు వాళ్ళ తెలుగు పుస్తకాలు చూపించారు. అక్షరాలమీద వేళ్ళుపెట్టి కూడబలుక్కుంటున్నట్టుగా యశ్వంత్ చదివితే, యామిని అంతకన్నా చాలా వేగంగా చదివింది. మరునాడు ఆదివారం కావడంతో వాళ్ళతోబాటు నేను కూడా ఆ తెలుగు క్లాసుకి వెళ్ళాను.

“మీరు వస్తున్నారని వీళ్ళు ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో వున్నారు. మీకు తెలుగంటే చాలా యిష్టమనీ, కవితలూ పద్యాలూ రాస్తారనీ చెప్పారు. మీ ముందు పాఠం చెప్పేటప్పుడు తప్పులేమయినా దొర్లితే క్షమించాలి,” అన్నాడు టీచర్ రఘురాం.

“ఏమయినా తప్పులున్నా పిల్లలముందు చెప్పను. మీరు సాఫ్ట్‌వేర్ వుద్యోగం చేస్తూ ఇలా మాతృభాష మీద మమకారంతో మీ సమయాన్ని వెచ్చించల్లా ఈ పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నందుకు నా అభివందనాలు,” అన్నాను.

ఆరోజు రఘురాం తెలుగులో సామెతల గూర్చి పాఠం చెప్పాడు.

“సామెతలంటే ప్రావెర్బ్స్ అన్నమాట. ఇవి, ఎన్నో వేల ఏళ్ళుగా తెలుగువాళ్ళు వాళ్ళ జీవితంలో నేర్చుకున్న పాఠాలని గుర్తుండేలా క్లుప్తంగా – అంటే కన్సైజ్‌గా – చిన్న చిన్న వాక్యాలల్లో చెప్పినవన్నమాట. ఉదాహరణకి, ‘ఇంటిదొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు’ అన్న సామెతని తీసుకోండి. దీనికెవరైనా అర్థం చెప్పగలరా?”

“ఈవెన్ ఈశ్వర్ కాంట్ కాచ్ హోం థీఫ్,” అన్నది యామిని. నేనే కాక రఘురాం కూడా కష్టపడ్డాడు నవ్వు నాపుకోవడానికి.

“నో. ఐ కెన్,” అన్నాడు ఒక కుర్రాడు. వాడి పేరు ఈశ్వర్ అని తెలిసింది. వాడు యామినికంటే రెండు మూడేళ్ళు పెద్దవాడయి వుండాలనిపించింది. కావాలనే చిలిపిగా అలా అన్నాడనుకుంటాను. ఆ పిల్లవాడి తెలుగు కూడా అద్భుతంగా ఉంది.

“క్లోజ్. ఇక్కడ ఈశ్వర్ అంటే గాడ్ అని అన్నమాట. అంటే, ఇంట్లో వున్న మనుషుల్లో ఎవరో ఒకళ్ళు చెప్పకుండా డబ్బే కాదు – ఏ వస్తువయినా తీస్తే, ఇంట్లోవాళ్ళెవరికీ తెలియదు అని అర్థం. ఇది అనుభవంతో తెలుసుకున్న దన్నమాట. ఇంకో సామెత – పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. దీనికి అర్థం తెలుసునా?”

వీళ్ళకి వాత అంటే ఏమిటో ఎలా తెలుస్తుందనుకున్నాను. పనిష్మెంట్‌కింద ‘వాత పెడతా’ నని అమెరికాలో వుండే తల్లులెవరు పిల్లలని బెదిరిస్తారు గనుక! సమాజం మారుతుంటే కొన్ని సామెతలు ఇందుకే మరుగున పడిపోతాయనిపించింది.

నేను అనుకున్నట్లుగానే, “పులి అంటే టైగర్, నక్క అంటే ఫాక్స్. కానీ, వాత అంటే ఏమిటి?” అనడిగాడు ఒక కుర్రాడు.

“ఇలా రండి,” అని వాళ్ళని పిలిచి, “ఇదీ వాతంటే” అని నా అరచేతిని చూపించాను.

“అది బర్న్ మార్క్. తాతయ్య చిన్నప్పుడు కాకర పువ్వొత్తు – అంటే స్పార్క్‌లర్ అన్నమాట – కాలుస్తుంటే అయింది.” తనకు అదేమిటో ముందే తెలుసునన్నట్లు గర్వంగా చెప్పాడు యశ్వంత్. “ఇట్స్ నాట్ ఇరేజబుల్, యు నో?” అని కూడా చేర్చాడు.

“ఆ సామెతకి అర్థం ఏమిటంటే, ‘పులికి చారలున్నాయి, అందుకే దానికంత బలం’ అని ఒక నక్క అనుకుని వంటినిండా వాతలు పెట్టుకుంటే దానికి ఆ బలం రాదు కదా! అంటే, ఇంకొకళ్ళని చూసి అసూయ పడొద్దు అని అర్థమన్నమాట,” అన్నాడు రఘురాం.

“వచ్చే వారానికి హోంవర్క్ ఏమిటంటే, ఈ సామెతలని ఉపయోగిస్తూ ఒక ఆటని – ఒక గేంని – మీరు తయారు చెయ్యాలి. మీ పుస్తకాలల్లో కొన్ని సామెతలుంటాయ్. ఇంటర్నెట్ లింకులు కొన్ని ఇవాళ ఇస్తున్నాను – వాటిల్లో ఇంకా చాలా దొరుకుతాయ్,” అన్నాడు రఘురాం. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇప్పటిదాకా అలాంటి ఆటని నేను ఇండియాలోనే విన్లేదు. అలాంటిది ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న ఈ అమెరికా తెలుగు పిల్లలకి ఇలాంటి ఛాలెంజా?

“పిల్లలు ఏం చెయ్యగలరు? పెద్దవాళ్ళే ఇప్పటిదాకా చెయ్యలేదు,” అన్నాను రఘురాంతో.

“ఇక్కడి పిల్లలు ఇండియాలో పిల్లలకంటే తెలివయినవాళ్ళని కాదు కానీ, ‘కుర్రకుంకవి నీకేం తెలుసు?’ అన్న వాతావరణంలో నేను పెరిగితే, ‘మీరు చెయ్యలేనిది ఏదీ లేదు’ అన్న ప్రోత్సాహంతో ఇక్కడ వీళ్ళు పెరుగుతారు. ఇక్కడ రోబోటిక్స్, ఆడిస్సీ ఆఫ్ ది మైండ్ లాంటి పోటీలల్లో ఈ వయసువాళ్ళు చేసే ఫీట్లు చూస్తే నాకు తల తిరిగిపోతూంటుంది,” అని జవాబిచ్చాడు. వీళ్ళు రఘురాం మాటని నిలబెడతారో లేదో తప్పక చూడాలనిపించింది. వచ్చే వారం కూడా తప్పకుండా ఆ క్లాసుకి వస్తానని అతనికి చెప్పాను.

ఇంటికొచ్చిన తరువాత యశ్వంత్ సామెతల పుస్తకాలు తిరగేస్తుంటే యామిని ఇంటర్నెట్ సర్ఫ్ చేసి, దొరికిన వాటిని ప్రింట్ చేసింది. వేసవి సెలవులు కాబట్టి, అమ్మానాన్నలు ఆఫీసుకి వెళ్ళిన తరువాత రోజంతా నా చుట్టూ తిరిగి వాటికి అర్థం చెప్పించుకున్నారు. వాళ్ళ ఎక్సైట్‌మెంట్‌లో నేనూ భాగం పంచుకోవడంతో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి.

తరువాతి ఆదివారం నాడు క్లాసులో రఘురాం, “సామెతల గేం గూర్చి ముందెవరు చెబుతారు?” అనడగ్గానే యామిని, యశ్వంత్‌లు చేతులెత్తారు.

“దూరపు కొండలు నునుపు” అన్నది యామిని.

“పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది” అన్నాడు యశ్వంత్.

“దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు” అన్నది యామిని.

“కోటివిద్యలు కూటికొరకే” అన్నాడు యశ్వంత్.

“కుక్కకాటుకు చెప్పుదెబ్బ” అన్నది యామిని.

“అబ్బ, అర్థమైంది! సామెతలతో అంత్యాక్షరి. వండర్‌ఫుల్” అని అంటూ రఘురాం చప్పట్లుకొట్టాడు.

“నేనిప్పటిదాకా ఇలాంటిది వినలేదు” అంటూ నావైపు దొంగచూపులు చూశాడు. ఆ ఆటకి నేను కూడా ఆశ్చర్యపోయి, “నేనేం వాళ్ళకి సహాయం చెయ్యలేదు. ఆ ఐడియా పూర్తిగా వాళ్ళదే” నని చెప్పి వాళ్ళని అభినందించాను.

“తరువాతెవరు?” అనడిగాడు రఘురాం. ఈశ్వర్ చెయ్యెత్తాడు. “చెప్పు” అనగానే, “ఈ గేంలో ఒక సామెత ఎలా వచ్చిందీ అన్నదానిమీద కథ అల్లాలి,” అన్నాడు.

“అలాగా. నువ్వే సామెత మీద కథ అల్లబోతున్నావ్?” “భార్యా రూపవతీ శత్రుః అన్నదాని మీద.” అని మొదలుపెట్టాడు.

“ఒకప్పుడు మగధరాజ్యాన్ని మహీపాలుడు పాలించేవాడు. మహీపాలునికి మహారాణీ, మహామంత్రి యుక్తిపరుడూ ఆప్తులు. ఆయన కళలను బాగా పోషించేవాడు. ఆయన ఆస్థానం కవులకూ, పండితులకూ నిలయమైవుండేది.”

“ఆ అబ్బాయి ఇంతమంచి తెలుగులో మాట్లాడాడా గురూజీ?” అడ్డం వచ్చాడు భాస్కర్.

“కథనం నాది. మధ్యలో అడ్డం రాకు.”

“మరేం లేదు, నాకే అలాంటి తెలుగు రాదే అనుకుని అడిగానంతే.”

మారువేషాల్లో వెళ్ళి రాజ్యపాలనని గూర్చి ప్రజలేమంటున్నారో తెలుసుకునే అలవాటు మహీపాలుడికీ, యుక్తిపరుడికీ వుండేది. ఒకనాడు వాళ్ళు అలా తిరుగుతున్నప్పుడు యుక్తవయస్సులో వున్న ఒక అందమైన యువతి పిల్లలతో ఒక ఆట ఆడుతూ కనిపించిది. ఆ ఆటలో, ఒకళ్ళు కేవలం అభినయంతో చూపే ఒక పదాన్నో, సమాసాన్నో, వాక్యాన్నో వేరొకళ్ళు దానికి నోటితో పదరూపాన్నిచ్చి కనుక్కుంటే వాళ్ళు గెలిచినట్టు అని అర్థంచేసుకున్నారు. (అలాంటి ఆటని Dumb Charades అని అంటారని రఘురాం నాకు చెప్పాడు.) మహీపాలుని కళ్ళు మాత్రం ఆ యువతికే అతుక్కుపోయాయి. “ఏమి అందం!” అన్నాడు యుక్తిపరుడితో.

మరునాడు మారువేషాలతో అదేచోటికి వెళ్ళి, ఆ యువతీ ఆ పిల్లలూ అదే ఆట ఆడడం చూశారు. మూడోరోజు కూడా ‘మళ్ళీ అక్కడికే వెడదాం’ అని మహారాజు అనడంతో ఆయన పరిస్థితి మహామంత్రికి అర్థమయింది. సంజ్ఞలతోనే తాను ఆ యువతికి తన కోరికని తెలియజేస్తానన్నాడు మహీపాలుడు.

యుక్తిపరుడు ఆ యువతి వద్దకు వెళ్ళి, “తల్లీ, వీరు నువ్వాడుతున్న ఆటలోనే నీకొక పరీక్ష పెడతానన్నారు. వారు చేసే అభినయానికి నువ్వు పదరూపాన్నివ్వగలవా?” అనడిగాడు. ఆమె కుతూహలంతో సరేనన్నది.

మహారాజు తన కుడిచేతి చూపుడు వేలితో ఆమెను చూపించాడు. “నువ్వు” అన్నదా అమ్మాయి. అది సరైన సమాధానమే నన్నట్లు తలవూపి, రెండవ పదమని చేతివేళ్ళతో చూపించి, కుడిచేతి చూపుడువేలిని తనవైపు తిప్పుకున్నాడు. “నేను” అన్నది ఆ యువతి. “అదే అర్థం వచ్చేలా ఇంకో పదం” అని చేసిన సంజ్ఞని బట్టీ, “నాకు,” “నేను” అంటూ “నన్ను” అనేసరికి అది సరైన పదమని ఆపి, ఇంక తరువాత పదమని చూపి, రెండు చేతులతో తాళికట్టడాన్ని అభినయించాడు. “పెళ్ళాడ్డం” అన్నది. అప్పుడు మహీపాలుడు కుడిచేతి బొటనవేలిని మాత్రం పైకెత్తి, మిగిలిన నాలుగు వేళ్ళనీ ముడిచి, గుప్పిటని ప్రశ్నార్థకంలాగా పైకీ, కిందకీ ఆడించాడు. “ప్రశ్న” అని జవాబిచ్చింది. ఇంక మొత్తం కలిపి చెప్పమన్నాడు. “నువ్వు… నన్ను… పెళ్ళాడ్డం…?” అని ఆగిపోయి, ఇంట్లోకి పరుగెత్తింది.

“ఎవరు ఇక్కడ నా చెల్లెలు రూపవతిని అల్లరి పెట్టింది?” అంటూ కత్తి దూసుకొచ్చిన వ్యక్తిని యుక్తిపరుడు అడ్డగించి, ఆ వచ్చింది మహారాజు అని చెప్పడంతో అతనూ, వాళ్ళ తల్లిదండ్రులూ సంతోషించి రూపవతిని మహీపాలునికిచ్చి పెళ్ళి జరిపించారు.

పెళ్ళయిన దగ్గర్నుంచీ మహీపాలుడూ రూపవతీ మూకాభినయపు ఆటని నిర్విరామంగా ఆడేవారు. ఒకనాడు, ఈ ఆటలో పోటీని తన కొలువులో నిర్వహించాలని మహీపాలునికి అనిపించింది. గొప్ప బహుమతులు ప్రకటించి రాజ్యంలో నలుమూలలా దండోరా వేయించాడు. ఈ పోటీలు దాదాపు ప్రతీ వారమూ జరుగుతూండడంతో కొద్దికాలం లోనే వాటిలో పాల్గొనడానికి విదేశాలనించీ కూడా రావడం మొదలుపెట్టారు.

ఈ పోటీలలో పడి మహీపాలుడు ఆస్థానంలోని కవులనీ, పండితులనీ పట్టించుకోవడం మానేశాడు. రాజాస్థానం పామరులతో నిండిపోతోందని కోపగించిన ఆ కవులూ పండితులూ రాజుని ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలనుకున్నారు. రూపవతి మోజులో మహారాణిని ఎలాగో అశ్రధ్ధ చేశాడు కాబట్టి, రాజాస్థానానికి పూర్వపు కళాకాంతులను తిరిగి తెప్పించడమే తమ ధ్యేయమని మహారాణిని చేరి ఆమెని నమ్మించారు. ఆమె పొరుగు రాజు శూరసేనుడికి కబురంపింది – ఒక చెల్లెల్ని కాపాడమంటూ. శూరసేనుడు తన సైన్యంతో వచ్చి మహీపాలుణ్ణి ఓడించి, మళ్ళీ అతణ్ణే గద్దె మీద కూర్చోబెట్టి, జాగ్రత్త! అని బెదిరించి, వెళ్ళిపోయాడు.

మహీపాలుడికి రక్తం ఉడికిపోయినా చెయ్యగలిగినదేమీ లేక మౌనంగానే రగిలిపోయాడు. ఇలా ఒక వారం గడవక ముందే తోటలో పరిచారికల గుసగుసల వల్ల ఇది రాణి చేయించిన పనే అని తెలిసి ముందు క్రోధంతో మండిపోయినా తరువాత విలవిలా ఏడ్చాడు. కవిత్వానికీ, సంగీతానికీ, నాట్యానికీ ఇచ్చినంత విలువని మూకాభినయానికి ఇవ్వడంలో తప్పేమిటి? అని బాధపడ్డాడు. మూకాభినయానికి తనిచ్చిన విలువకి తనకింత శిక్షా అని విచారపడ్డాడు. పైగా దాన్ని నిరసించి తనకీ పరిస్థితిని కలిగించిన విధి మీద అతనికి కోపం వచ్చింది. ఇంత రాజద్రోహం మహామంత్రికి కూడా తెలియకుండా జరిగినదని తెలుసుకుని ఇంకా నిరాశకు లోనయ్యాడు. చివరికి వజ్రపుటుంగరాన్ని పొడిచేసి పాలల్లో కలుపుకుని తాగాడు.

దాదాపు అచేతనంగా పడి వున్న మహారాజుని పరిచారికలు మంచం మీదకు చేర్చి వైద్యులకీ, మహారాణికీ, రూపవతికీ, యుక్తిపరునికీ కబురంపారు. వైద్యులు, తాము చెయ్యగలిగినదేమీ లేదన్నారు. వారందరూ మంచం చుట్టూ నిల్చొని దుఃఖిస్తూ వుండగా యుక్తిపరుడు మహారాజు చేతిని పట్టుకొని, పెద్దగానే “ఏమిటిది మహారాజా?” అని భోరుమన్నాడు.

కొంచెం స్పృహ వచ్చిన మహీపాలుడికి తనకి ఆ పరిస్థితిని కలిగించిన వారెవరో యుక్తిపరుడికి చెప్పాలనిపించింది. కళ్ళు తెరిచి, చెప్పడానికి నోరు పెగలకపోగా సంజ్ఞలతో చెబుతానని సంజ్ఞ చేశాడు. మహామంత్రి ఆదుర్దాగా, “చెప్పండి మహారాజా, కనుక్కోవడానికి మేము సిధ్ధమే!” అన్నాడు. మహీపాలుడు చుట్టూ కలియజూసి చూపుని రాణీమీద నిలిపాడు. ‘రాణి’ అన్నది రూపవతి. అది సరైన పదమేనని తలవూపి రూపవతిని గుర్తించి ఆమె మీద తనచూపుని నిలిపాడు. ‘రూపవతి’ అన్నాడు మహామంత్రి. అవునన్నట్లుగా తలవూపి తరువాత పదం కోసం ఒక్క క్షణం ఆలోచించిన తరువాత, మెల్లగా ఎడం చేతినెత్తి ధనుస్సుని పట్టుకున్నట్లుగా పెట్టి, కుడి చేతిని అభయమిస్తున్నట్లుగా పెట్టాడు. రూపవతి వెంటనే, ‘రాముడు’ అన్నది. ఆమెని మెచ్చుకోలుగా చూసి, కుడిచేతిని రామునికి కుడిపక్కన వుండేదెవరన్నట్లుగా సంజ్ఞచేశాడు. ‘లక్ష్మణుడు’ అన్నాడు యుక్తిపరుడు. ఆ కుడిచేతిని ఇంకా కుడివైపుకు చూపించాడు. ఇంకా పక్కన వుండేదెవరబ్బా అని అలోచిస్తూండగా కుడిచేతిని కొంచెం ఎత్తు తగ్గించి చూపించాడు. ‘భరతుడు’ అన్నది రూపవతి. కళ్ళు కొంచెం కాంతిని నింపుకోగా, ఇంకొంచెం ఎత్తు తగ్గిస్తున్నట్లు చూపించాడు. ‘శత్రుఘ్నుడు’ అన్నాడు మహామంత్రి. కాదన్నట్లు అక్కడే ఆగమన్నట్లు సంజ్ఞచేసి, కుడి చేతిని కొంచెం పైకెత్తి, కత్తితో నరుకుతున్నట్లుగా మంచమ్మీదకు వాల్చాడు. ‘శత్రు’ అని రూపవతి ఆపగానే మహీపాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

మహీపాలుడు ఏమి చెప్పబోయాడన్నది ఆ తరువాత పండితపామరుల నోళ్లల్లో ఆడిన ప్రశ్న. తెలిసిన పదాలు మాత్రం — రాణి, రూపవతి, శత్రు. మూడింటినీ కలిపి చదివితే వచ్చేది రాణి రూపవతి శత్రు అని. అయితే, ఇది తెలుగులో వుండాలో లేక సంస్కృతంలో వుండాలో ఎవరికీ తెలియలేదు. మామూలుగా అయితే, విడిపదాలను కనుక్కున్న తరువాత ఆ పదాలకు వ్యాకరణాన్ని చేర్చి వాక్యంగా తయారు చెయ్యవలసిన బాధ్యత కూడా మూకాభినయం ఆట ఆడేవాళ్ళకి వుంటుంది. అది అవునో కాదో చెప్పవలసింది ఆ సమస్యని ఇచ్చినవాళ్ళు. మహీపాలుడు లేకపోవడం వల్ల, పెద్ద సమస్యే ఎదురయ్యింది. ‘రాణి రూపవతికి శత్రువు’ అని వాక్యాన్ని పూర్తిచేస్తే, అందులో వింతేమిటని అనిపించి, ఆ జగమెరిగిన నిజాన్ని చెప్పడానికి అవసానదశలో రాజు అంత కష్టపడాలా? అని ప్రశ్నించి, అది అయ్యుండదని కొట్టిపారేశారు. ఒక మగాడికున్న ఇద్దరు భార్యలు సఖ్యంగా వున్నదెప్పుడు గనుక! రూపవతి మీద అసూయతో రాణి శతృవుతో చెయ్యి కలిపింది, అన్న నిజం పండితజనానికి తెలిసినా, వాళ్ళని ఎవరూ వేలెత్తి చూపించకుండా వుండేటందుకు, మూడు ముక్కలతో అంత పెద్ద నిర్ణయానికి రావడానికి కుదరదని అడ్డం కొట్టడానికి వాళ్ళు సిధ్ధంగా ఉన్నారు. అయితే, మిగిలిన వాళ్ళెవరి ఆలోచనలూ ఆ దారిలో వెళ్ళలేదు.

‘రాణి, రూపవతి, శత్రు’ అన్న మాటలు ప్రజల నోళ్లల్లో నానుతూండగా, ఒక సంస్కృతపండితుడు, రాజుగారికి సంస్కృతంలో ప్రావీణ్యత వున్నది గనుక, ఆ భాషలోనే ఇది చెప్పి వుంటారు, అందుకని చివరి పదం శత్రుః అయివుంటుంది అని ప్రతిపాదించాడు. అతి చిన్న సవరణతో మూడు ముక్కల్లో వ్యాకరణానికి అనువుగా వుండే వాక్యం తయారయింది. ఇదే ఆయన చెప్పబోయినది అని వాళ్ళు నిర్ధారించ బోతుండగా, ఒకడు, ఈ వాక్యానికి, ‘రూపవతి అయిన రాణి శత్రువు అని కూడా అర్థం వుందే, మరెట్లా?’ అన్నాడు. మహీపాలుడు రాణిని చూపిన మాట నిజమే కానీ, భార్య అని చెప్పడానికి మాత్రమే ఆమెని చూపి వుండాలన్న నిశ్చయానికి పెద్దలంతా వచ్చారు. మహారాజు పోయిన దాదాపు సంవత్సరం తరువాత, భార్యా రూపవతీ శత్రుః అన్నదే మహీపాలుడు చెప్పదలచుకున్నదనీ, ఆ వాక్యాన్ని సమాజాని కుపయోగపడే సందేశంలాగా మాత్రమే ఆయన ఇవ్వాలనుకున్నారు గానీ, మహారాణిని గానీ రూపవతిని గానీ చిన్నబరచే ఉద్దేశం ఆయనకి లేదనీ నిర్ధారించారు. ఆ వాక్యంకాస్తా సామెత లాగా వాడుక లోకి వచ్చేసి, దాని పుట్టు పూర్వోత్తరాలు మరుగున పడిపోయాయ్.” అని ముగించాడు ఈశ్వర్.

“వీళ్ళమ్మగారు మంచి రచయిత్రి” అని నాతో అని, “ఏమోయ్, ఇది మీ అమ్మగారు చెప్పిన కథ గదా!” అని ప్రశ్నించాడు రఘురాం.

“అవునంకుల్. అయినా, మీరు ఎవరి హెల్పూ తీసుకోవద్దన్లేదుగా!” అన్నాడు ఈశ్వర్.

“చాలా గొప్పగా వున్నదని ఆవిడతో చెప్పు,” అన్నాడు రఘురాం.

నువ్వు చెప్పిన సామెత వెనుక నాకు నచ్చిన కథ అదయ్యా. ఎందుకంటే, ప్రతీ సామెతనీ ఊర్కేనే అన్వయించుకోకూడదని ఈ కథ వార్నింగ్ ఇస్తుంది. ఉదాహరణకి, నువ్వు పుటుక్కున ఆ సామెతని నీకు అన్వయించుకున్నావు గానీ, మీ ఆవిడ తను నీకు శత్రువులాగా ఎప్పుడయినా నీకు అనిపించేలా ప్రవర్తించిందా అని ఆలోచించావా? లేకపోతే, ఆమె నిన్ను వదిలిపోతుందేమోనన్న భయం నీలో కలిగించిందా?” మెల్లగానే అడిగాను.

“లేదు గురూజీ. పిల్లలన్నా నేనన్నా ఆమెకు ప్రాణం,” అన్నాడు భాస్కర్ తల వంచుకుని.

“నీ భార్య అందంగా వుంటుందని నీకు తెలుసు. అందుకని ఎవడో కామెంట్ చేసేసరికి అక్కడ ఆవిడేదో నీకు అన్యాయం చేసినట్లు బాధపడ్డావ్. ఆవిడ అంత అందంగా లేకపోతే నువ్వు పెళ్ళి చేసుకునేవాడివా?”

“బహుశా కాదు,” అన్నాడు భాస్కర్. నిజాన్ని ఒప్పుకున్నందుకు కొంచెం సంతోషం కలిగింది.

“భార్యా కురూపీ మిత్రః” అని ఒక సామెత వుండుంటే నువ్వెళ్ళి ఓ కురూపినీ, ఓ అనాకారినీ పెళ్ళి చేసుకునేవాడివా?”

“పొరపాటున కూడా చేసుకునే వాడిని కాదు.”

“చూశావా, ఈ సామెతని ప్రజల మీద వదిలిన వాడికి కూడా తెలివితేటలున్నాయ్. ఎవడో పెళ్ళాం లేచిపోయినవాడే మగాళ్ళకి వార్నింగ్ నివ్వాలనుకున్నా, ‘భార్యా కురూపీ మిత్రః’ అని వుంటే వాడి మాట నెవరూ పట్టించుకోకుండా, ‘ఆఁ, చేసుకునేది భార్యగానే గానీ మిత్రురాలిగా కాదుగా!’ అని సమాధానపర్చుకుని దాన్ని పెడచెవిని పెట్టి, అందగత్తెల కోసమే మగాళ్ళందరూ వెదుకుతారని వాడికి తెలుసు. అందుకే ఇట్లా మార్చాడు. నీ భార్యకి నలభయ్యేళ్ళు దాటినా ఆమె అందాన్ని నలుగురూ నోళ్ళు తెరుచుకుని చూస్తుంటే ఆవిడ నీకొక్కడికే దక్కిందని సంతోషపడక – నీకే ఛాయిస్ ఇస్తే, ఆవిడని చొంగలార్చుకుంటూ చూసే మగాడిలా మిగిలిపోతావా లేక ఆవిడ భర్తగా వుండడాన్ని ఎంపిక చేసుకుంటావా?” జవాబేమొస్తుందో తెలిసినా అడిగాను అదేదో అతని నోటినుంచే వినాలని.

“మంచి ప్రశ్నే అడిగారు సార్. ఇంకెప్పుడూ ఇలా పిచ్చిపిచ్చిగా ఆలోచించను. నా కళ్ళు తెరిపించారు,” అని నాకు నమస్కారం పెట్టాడు.

తరువాత, చీకటి పడకముందే అతను ఇంటికి రావడం, వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్ళడం నాకు చాలాసార్లు కనిపించింది. అతను ఆమె భుజం చుట్టూ చెయ్యివేసి నడవడం ఆమె తనసొత్తని గర్వంగా చాటడానికో లేక ఆమె వీపుకి ఆఛ్ఛాదన నివ్వడానికో అతనికే తెలియాలి.
---------------------------------------------------------
రచన: తాడికొండ కె. శివకుమార శర్మ, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment