అనుబంధం
సాహితీమిత్రులారా!
ఈ కథను ఆస్వాదించండి......................
వరసగా ఐదు రోజులు పనిచేసిన అలసటని శనివారం విశ్రాంతితో మరిపిస్తున్న వేళ. డిష్ టీవీలో క్రికెట్ మాచ్ చూస్తూ, జరుగుతున్న ఆట గురించీ, ఆటగాళ్ళను గురించీ వ్యాఖ్యానిస్తూ, బీరు తాగుతున్న వాళ్ళను చూస్తూ కూర్చున్నాడు రాజు. కొత్తగా కలిసిన మిత్రులు వీళ్ళు. ఆరు నెలలుగా అమెరికాలో ఉన్నా, అతనికి ఇంకా అంతా కొత్తగా, గజిబిజిగా ఉంది. సాటి తెలుగు వాళ్ళు కనిపిస్తే ప్రాణం లేచివచ్చినట్టు అయింది.
ఆట అయిపోయింది. టీవీ కట్టేస్తూ తృప్తిగా నిట్టూర్చాడు నరేంద్ర. “ఎంతయినా మన వాళ్ళతో కలిసి సరదాగా గడిపినట్టు ఇక్కడి వాళ్ళతో ఉండలేం.”
“ఎందుకని?” అప్రయత్నంగా అడిగాడు రాజు.
“ఎందుకంటే — అసలు మనకీ వాళ్ళకీ పొత్తు కుదరదు. మనమయితే హాయిగా ఏ ఫ్రెండింట్లోనో కబుర్లు చెప్పుకుంటాం. లేకపోతే హోటలుకెళ్ళి ఓ కప్పు కాఫీతో గంట సేపు బాతాఖానీ వేస్తాం. అదీ లేకపోతే, రోడ్డుమీద నడుస్తూనో, చెట్టుకింద నిలబడో కాలక్షేపం చేస్తాం. ఇక్కడి వాళ్ళతో అలా కుదరదుగా.”
“ఎందుకు కుదరదు?” ఇంకా అర్ధం కాలేదు రాజుకి.
గోపాల్ అందుకున్నాడు. “ఇక్కడి వాళ్ళతో అంతా అప్పాయింటుమెంట్ల గొడవ. శనివారం రెండు గంటలకు కలుసుకుని అయిదు గంటల వరకూ ఫలానా గేముకి వెళ్ళి చూసొద్దాం, అని ఖచ్చితంగా చెబుతారు. రెండు గంటలకి ముందు వెళ్ళడానికి వీల్లేదు, అయిదు గంటల తర్వాత ఉండడానికీ వీల్లేదు. ఆ మధ్యలో అయినా మన ఇష్టమొచ్చినట్టు గడపడానిక్కూడా ఉండదు. వాళ్ళు చెప్పినట్టు ఏ ఫుట్ బాల్ గేముకో, బేస్ బాల్ గేముకో చచ్చినట్టు వెళ్ళి తీరాలి. అవేమో మనకి అర్ధమయ్యి చావవు. మనమయితే, వీకెండ్ లో ఒకసారి కలుద్దాం, అంటే, ఎప్పుడో అప్పుడు మన ఇష్టమొచ్చినప్పుడు వెళతాం, మనకి ఇష్టమున్నంత సేపు ఉంటాం, ఇష్టమైనప్పుడు తిరిగి వచ్చేస్తాం. మనం కలుసుకున్నప్పుడుకూడా ఏదో ఫలానా పని చెయ్యాలని లేదు. ఆ క్షణాన ఏం చెయ్యాలని తోస్తే అది చేస్తాం. ఎవరికీ బాదరబందీ ఉండదు. అంతా కాం గా జరిగిపోతుంది.” గుక్క తిప్పుకునేందుకు ఆగి, ఎండిపోతున్న గొంతుకి కాస్త బీరు పోశాడు గోపాల్.
అప్రయత్నంగా రాజుకి తను అవ్వాళ పొద్దున్న ఎలా గడిపినదీ గుర్తొచ్చింది. తనకి ఇంకా కారు లేదని నరేంద్ర వచ్చి తీసుకువెళ్తానంటే చాలా సంతోషించాడు. కానీ అతను ఎప్పుడొస్తున్నదీ చెప్పక పోవడంతో తన పనులన్నీ గందరగోళమయ్యాయి. మామూలుగా శనివారాలు చేసుకునే బజారు పనులు చెయ్యడానికి టైమున్నదో లేదో తెలియలేదు. పోనీ నరేంద్రని అడుగుదామంటే, ఎన్ని సార్లు ఫోను చేసినా అతను దొరకలేదు. మొత్తానికి పనులేమీ జరగలేదు. తీరా అతనొచ్చాక హఠాత్తుగా తన స్నేహితుడి ఇంటికి వెళ్దామని ఉదయ్ దగ్గరకి తీసుకువచ్చాడు. సహజంగా మొహమాటం, బిడియం కొంచెం ఎక్కువ పాలున్న తనకి ఇలా ముఖ పరిచయమైనా లేని వాళ్ళింటికి భోజనాల వేళకి వెళ్ళటం చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ వాళ్ళెవరూ పట్టించుకోలేదు.
“నిజమే,” అంటూ గోపాల్ ని బలపర్చాడు ఉదయ్. ఇక్కడివాళ్ళంతా మరీ బిజినెస్ మైండెడ్. వర్కైనా, రిలాక్సేషనైనా, అంతా ఒకటే. అంతా చాలా యాంత్రికంగా గడిపేస్తారు.”
“నిజమే. ఊరికే కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం వీళ్ళు చెయ్యరనుకుంటాను. ఏదో ఒక పనో, వ్యాపకమో ముందుగా నిర్ణయించుకుంటే తప్ప వాళ్ళకి తోచదు,” అన్నాడు నరేంద్ర.
అంతవరకూ విరామం లేకుండా వాగిన టీవీ వైపు చూసి మౌనంగా ఉండిపోయాడు రాజు.
“అయినా ఇక్కడి వాళ్ళతో మనం మాట్లాడ్డానిక్కూడా అంత కంఫర్టబుల్ గా ఉండదు నాకు,” అంది ఉదయ్ భార్య సునీత. “మనసులో మాట చెప్పుకునేందుకు ఫ్రీగా ఉండదు. ఎంతసేపూ మానర్స్ అనీ, ప్రైవసీ అనీ అదనీ, ఇదనీ, నోరు కట్టిపడేస్తారు. ఏమంటే ఏం ముంచుకొస్తుందోనని భయం. మనుషులకీ, మనుషులకీ మధ్య సంబంధాలు ఎలా ఉండాలో అసలు వీళ్ళకు తెలియదనుకుంటాను.”
“మీరయితే కొత్తగా వచ్చారు కాబట్టి అలా అనిపిస్తున్నదేమో. మీరు వచ్చి రెండు నెలలేగా అయిందన్నారు?” రాజు అడిగాడు.
“నిజమేకానీ, ఉదయ్ ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నారు కదా.”
“ఎన్నాళ్ళనుంచీ ఉంటున్నారు మీరు?” అని ఉదయ్ ని అడిగాడు రాజు.
“ఓ అయిదారేళ్ళయింది. ముందు ఎమ్మెస్ చేసేందుకు వచ్చాను. తర్వాత ఉద్యోగం ఓ రెండేళ్ళు చేశాక, ఈ ఊరికి వచ్చాను. ఇక్కడికి వచ్చి రెండేళ్ళు అవుతోంది.”
“మరిన్నేళ్ళుగా ఇక్కడున్నా, వేరే వేరే ఊళ్ళలో ఉన్నా, మీక్కూడా అలాగే అనిపిస్తోందా?” ఆశ్చర్యంగా అడిగాడు రాజు.
“నన్నడిగితే, ఎన్నేళ్ళున్నా, మనకి ఇక్కడ ఫ్రెండ్సంటూ దొరకరు,” అని తేల్చేశాడు ఉదయ్.
నమ్మలేకపోయాడు రాజు. “అదేమిటి, ఆరేళ్ళలో మీకు ఒక్కరితో కూడా స్నేహమవలేదా? ఏది ఏమైనా వీళ్ళు కూడా మనుషులేకదా?”
“ఆఁ, మనుషులే. మనుషులు కాకపోతే జంతువులన్నానా? కానీ వాళ్ళ లోకం వేరు, మన లోకం వేరు. ఆ రెండిటినీ కలపలేం.”
మాట్లాడకుండా కూర్చున్న రాజుని, “ఏమిటాలోచిస్తున్నావు?” అనడిగాడు నరేంద్ర.
“మీ అందరి మాటలూ వింటూంటే, నేనిక్కడకి రావడంలో పెద్ద పొరపాటు చేశాననిపిస్తోంది. కొత్త మూలాన తికమకగా ఉందనుకున్నానుగానీ, ఎప్పటికీ ఇక్కడ ఇమడననీ, ఎప్పుడూ ఒంటరిగా ఉంటాననీ తల్చుకుంటే చాలా భయంగా ఉంది.”
“భయమెందుకు? మన వాళ్ళు మనకి ఉంటారు కదా? మేం ముగ్గురం క్లాస్ మేట్స్ ఇక్కడకొచ్చినట్టే, నీ క్లాస్ మేట్స్ కూడా వస్తారు,” ఓదార్చాడు నరేంద్ర.
“అందుకే నేను గ్రీన్ కార్డుక్కూడా అప్లై చేశాను. ఏవో నాలుగు డబ్బులు చేసుకుఏందుకు వచ్చాం. మనకు చాలినంత డబ్బు రాగానే తిరిగి వెళ్తాం. ఆ డబ్బు కోసం ఇక్కడ పని చేస్తున్నన్నాళ్ళూ ఏదో పైపై మొహమాటాలకి మర్యాదగా ఉంటాం. కానీ నేననేది, ఇక్కడి వాళ్ళెప్పటికీ మనకు దగ్గరివాళ్ళూ, అయిన వాళ్ళూ కారని.”
గోపాల్ మళ్ళీ మొదలుపెట్టాడు. “పోనీ మాట్లాడదామన్నా మనకేముంది వీళ్ళతో మాట్లాడడానికి? క్రికెట్టంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. అసలు ఆ ఆటెలా ఆడతారో తెలియదు. ఇక ప్లేయర్స్ సంగతి అడగక్కరలేదు. ఇంకేం మాట్లాడతాం?”
“నాకు మాత్రం తెలుసా?” నవ్వాడు రాజు.
“అదేమిటి? మీరు ఇండియాలో క్రికెట్టెప్పుడూ చూళ్ళేదా?” గోపాల్ ఆశ్చర్యపోయాడు.
“లేదు,” ముక్తసరిగా జవాబిచ్చాడు రాజు.
“అదేమిటి? మీ పేరెంట్స్ అంత స్ట్రిక్ట్ గా ఉండేవారా? పాపం! ఏమిటి, ఒక్కసారి కూడా చూళ్ళేదా?” నరేంద్ర కూడా ఆశ్చర్యపడ్డాడు.
“లేదు.”
“అయ్యో పాపం. మీ స్కూల్లో, కాలేజీలో ఆడేవారు కాదా?” ఇప్పుడు జాలి పడడం సునీత వంతైయింది.
“లేదు. నేను చదివిన స్కూల్లోగానీ, కాలేజీలోగానీ, అలాంటి ఆటలేవీ జరగలేదు,” అన్నాడు రాజు.
“క్రికెట్టాడని స్కూళ్ళు కూడా ఉంటాయా? నేనెప్పుడూ వినలేదే?” ఉదయ్ విస్మయంగా అడిగాడు. “ఏం స్కూలది?”
రాజు కొంచెం ఇబ్బంది పడి, “ఇంగ్లీష్ మీడియం కాదు లెండి,” అని ఊరుకున్నాడు.
“అయినా టీవీ కూడా చూడనివ్వకుండా పెంచడం మరీ దారుణం బాబూ,” అంది సునీత జాలిగా.
రాజు మౌనంగా ఉండిపోయాడు. మా ఇంట్లో అసలు టీవీ లేదు, అని చెప్తే వీళ్ళేమనుకుంటారు? టీవీ మాట దేవుడెరుగు, అసలు రేడియోకి కూడా డబ్బుల్లేని ఇంట్లో తను పెరిగాడని తెలిస్తే వీళ్ళు తననిక్కడ ఉండానిస్తారా అని ఒక సందేహం కలిగింది.
గోపాల్ మళ్ళీ ప్రారంభించాడు. “గేముకి కాకపోతే గో ఔట్ ఫర్ డ్రింక్స్ అంటారు. ఏ బార్ కో వెళ్ళాలి. అక్కడేం చెయ్యాలో ఎలా మాట్లాడాలో మనకేం తెలుసు? తీరా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏదో అమ్మాయిలతో మొదలు పెడతారు. అదంతా మనకలవాటు లేదు కదా? ఇంకేం వెళ్తాం?”
అంతలో నరేంద్ర అడ్డొచ్చి, “అన్నీ కొట్టి పారేయక్కరలేదు. వీళ్ళకి కొన్ని మంచి అలవాట్లు కూడా ఉన్నాయి. అమ్మాయిల మాట వదిలేయ్. బారుకెళ్ళడం ఫర్వాలేదు,” అన్నాడు.
“బారంటే గుర్తొచ్చింది. మనకింకొన్ని బాటిల్స్ తేవోయ్,” అన్నాడు ఉదయ్ భార్యనుద్దేశించి.
సునీత వంటింట్లోకి వెళ్ళినప్పుడు రాజుని చూసి, “మీరేమిటి ఇంకా ఆ కోకా కోలా పట్టుక్కూర్చున్నారు?” అనడిగాడు వేళాకోళంగా.
“నాకింకేం వద్దండీ,” అన్నాడు రాజు.
“అరె! అమెరికా వచ్చి కూడా మడికట్టుక్కూర్చుంటే ఎలా? ఇక్కడున్నన్నాళ్ళైనా ఇక్కడి లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి.”
“లేదండి, నాకు తాగుడంటే ఇష్టం లేదు,” అన్నాడు రాజు.
“తాగుడేమిటి? మరీ అంత పెద్ద మాటలు వాడకు. అసలు బీర్లో ఆల్కహాలే లేదు, తెలుసా?” అన్నాడు నరేంద్ర.
“కరెక్ట్. కోకా కోలాలో ఉన్నంత కూడా ఉండదు,” అన్నాడు గోపాల్.
రాజు కొంచెం వింతగా చూస్తూ, “అదేమిటి? కోకా కోలాలో ఆల్కహాల్ ఎప్పటినుంచీ ఉంది?” అనడిగాడు.
ఇంతలో సునీత తిరిగొచ్చి, బీరంతా అయిపోయిందని విచారకరమైన వార్త వినిపించింది.
“అయిపోయిందా? సరిగ్గా చూశావా?” అని ఉదయ్ ఆశ్చర్యపోయాడు.
“ఆఁ, చూశాను. మీరంతా ఇందాకణ్ణించీ ఖాళీ చేస్తున్నారుకదా?” అంటూ నవ్వింది సునీత.
“ఇప్పుడెలా?” అని వాపోతున్న గోపాల్ తో, “ఎలా ఏమిటి? వెళ్ళి ఇంకొన్ని కొన్నుక్కొద్దాం. కాస్త షికారుకెళ్ళినట్టు కూడా ఉంటుంది. పదండి,” అంటు అందర్నీ బయల్దేరదీశాడు ఉదయ్.
లికర్ షాపు దగ్గిర కారు పార్క్ చెయ్యగానే అందరూ బిలబిలమంటూ దిగారు. అందరి వెనకగా నెమ్మదిగా దిగాడు రాజు. హుషారుగా కేరింతలు కొడుతూ లోపలికెళ్ళబోతూంటే, “ఎక్స్ క్యూజ్ మీ,” అని సన్నటి గొంతు వినిపించింది. ఎవరా అని అటూ ఇటూ చూస్తే, గుమ్మానికి అయిదడుల దూరంలో ఓ చిన్న పిల్లాడు వీళ్ళని పిలుస్తున్నాడు. పదేళ్ళుంటాయేమో?
“నువ్వేనా పిలిచింది?” ఇంగ్లీషులో అడిగాడు ఉదయ్.
“అవును,” అన్నాడా అబ్బాయి.
“ఏం కావాలి?”
ఆ కుర్రాడు కొంచెం తటపటాయించి, “ఏం లేదు. కొంచెం లోపల్నించి నాకు ఒక విస్కీ సీసా తెచ్చిపెడతారా?” అనడిగాడు.
“ఏమిటీ? విస్కీయా?!” అంటూ నవ్వేశాడు ఉదయ్. స్నేహితుల వైపు చూస్తూ, తెలుగులో, “చూశారా దారుణం? ఇంత చిన్న పిల్లాడు విస్కీ తాగుతాడట, విస్కీ!” అన్నాడు.
“ఆఁ, తేరగా వస్తే అందరూ తాగుతారు,” అన్నాడు నరేంద్ర. “మనం తీసుకొచ్చి పెట్టాలిట!” మళ్ళీ భాష మార్చి ఇంగ్లీషులో, “పద! పద! ఊళ్ళో అందరికీ ఫ్రీగా విస్కీ కొనేందుకు మాకు వేరే పనేంలేదనుకున్నావా?” అని అదిలించాడు.
ఆ కుర్రాడి మొహం ఎర్రబడింది. “నేనేం ఊరికే ఇమ్మంటం లేదు. డబ్బులిస్తాను,” అని జేబులోంచి డబ్బులు తీసి చూపించాడు.
చిన్నబోయిన ఆ అబ్బాయి వంకే చూస్తున్న రాజు, “నీ దగ్గిర డబ్బులుంటే నువ్వే ఎందుకు వెళ్ళి కొనుక్కోవు?” అనడిగాడు.
“వాళ్ళు నాకు అమ్మరు, ” అన్నాడు ఆ అబ్బాయి నిస్సహాయంగా.
“అదేమిటి?”
“నా వయసు వాళ్ళకు వాళ్ళు అమ్మరు,” అన్నాడు అబ్బాయి.
“ఎందుకమ్మరూ?” అని రాజెంతో ఆశ్చర్యంగా అడుగుతూంటే, మిగతా వాళ్ళు, “ఆఁ, వీడితో పనేమిటి మనకి?” అంటూ రాజుని లోపలకి లాక్కెళ్ళారు.
బయట కుర్రాడు నిరాశగా వీళ్ళవంక చూడ్డం షాపు అద్దాల్లోంచి రాజుకి కనిపిస్తూనే ఉంది. మిగతా అందరూ ఏమేం కొనాలో చూసేందుకు షాపులో తిరుగుతూంటే, రాజు కాష్ కౌంటర్ దగ్గిరకి వెళ్ళాడు. అక్కడి క్లర్కుతో, “చిన్న పిల్లలకి ఆల్కహాల్ అమ్మరా?” అనడిగాడు.
“ఊఁహుఁ,” అన్నాడా క్లర్కు.
“ఎందుకమ్మరు?”
“అమ్మితే మా లైసెన్స్ పోతుంది కనక.”
“ఆంటే? ఎందుకు పోతుంది?” రాజుకేమీ అర్ధమవ్వలేదు.
రాజుని దద్దమ్మని చూసినట్టు చూస్తూ, “ఇరవై ఒక్కేళ్ళ లోపు వాళ్ళకి ఆల్కహాల్ అమ్మకూడదు. అది చట్టం. ఆ చట్ట ప్రకారం నడుచుకోకపోతే, మా బిజినెస్ లైసెన్స్ తీసేస్తారు. ఇంకప్పుడు మా మొత్తం షాపు మూసేయాల్సొస్తుంది,” అన్నాడు.
“మరయితే ఆ అబ్బాయి తన కోసం మమ్మల్ని విస్కీ కొనుక్కు రమ్మన్నాడు. కానీ మీరమ్మరన్నమాట,” అన్నాడు రాజు.
క్లర్కు నవ్వేసి, “అదేం లేదు. కొనేవాళ్ళు మీరైతే నిక్షేపం లా అమ్ముతాం,” అన్నాడు.
“కానీ మేం కొంటున్నది చిన్న పిల్లాడి కోసమని తెలిసినా అమ్ముతారా?” అన్నాడు రాజు నివ్వెరపోతూ.
క్లర్కు మళ్ళీ నవ్వేసి, “తాగే వాళ్ళెవరైతే మాకేం పట్టె? కొనేవాళ్ళెవరనేదే మాకు ముఖ్యం. పెద్ద వాళ్ళు ఇంటికి తీసికెళ్ళి వాళ్ళ పిల్లలకు తాగిస్తారో, పసిపిల్లలకు పడతారో, అదంతా మాకనవసరం,” అన్నాడు.
అంత దాకా ఇది చాలా మంచి చట్టమని లోలోపల సంతోషిస్తున్న రాజుకి ఈ మాట వినగానే విచారమేసింది. ఇలాంటి చట్టం ఉన్నందుమూలాన వచ్చిన లాభమేమిటి?
ఇంతలో మిగతా వాళ్ళు అక్కడికొచ్చి, వాళ్ళు తీసుకున్న సరుకులకి డబ్బులిచ్చారు. బయటికొచ్చినప్పుడు ఇంకా ఆ అబ్బాయి అక్కడే నుంచుని ఉండడం గమనించాడు రాజు. వీళ్ళ చేతుల్లోని సంచులనీ, సంచులలోని బుడ్లనీ ఆశగా చూస్తున్నట్టనిపించింది రాజుకి. అందరూ కారు దగ్గరికి వెళ్ళ్తున్నా, రాజు వాళ్ళతో బాటు వెళ్ళలేకపోయాడు. ఒక్క నిముషం తటపటాయించి ఆ అబ్బాయి దగ్గిరకి వెళ్ళి, “చూదు. నీ పేరేమిటి?” అనడిగాడు.
“మార్క్,” అన్నాడా అబ్బాయి.
“చూడు, మార్క్. నువ్వు ఇంత చిన్నవాడివి కదా. నువ్వు ఇప్పటినించే తాగడం మంచిది కాదు. అందుకనే షాపు వాళ్ళు కూడా నీకు అమ్మటం లేదు. చక్కగా ఇంటికి వెళ్ళి ఆడుకో,” అని బుజ్జగించబోయాడు రాజు.
మార్క్ ఆవేశంగా, “ఇది నాక్కాదు. నేనేం తాగుతాననుకున్నావేమిటి? మా నాన్నకోసం,” అన్నాడు.
“మీ నాన్న కోసమా?” రాజు మనసులో ఏవేవో జ్ఞాపకాలు మెదిలాయి. ఒక్క క్షణం గొంతు పూడుకుపోయినట్టయింది. ఎలాగో సంబాళించుకుని, “ఫర్వాలేదులే. షాపు వాళ్ళు అమ్మరని మీ నాన్నకి చెప్పు,” అన్నాడు.
“ఆ సంగతి మా నాన్నకి తెలియదేమిటి? అందుకనే ఎవరినో ఒక పెద్ద వాళ్ళనడిగి కొనమంటాడు. నేనేం లేకుండా మళ్ళీ తిరిగి వెళ్తే నన్ను కొడతాడు.” మార్క్ కళ్ళలోని నీళ్ళు జారకుండా ఉండడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు..
“కొడతాడా?” అంటూ స్థంభించిపోయాడు రాజు.
ఇంతలో రాజు కోసమని నరేంద్రా, గోపాలూ తిరిగి వచ్చారు, “ఇక్కడే ఉండిపోయావేమిటి?” అనడుగుతూ.
“చూడండి పాపం, ఈ అబ్బాయి. ఇది కొనమని వాళ్ళ నాన్న పంపించాడట. అది లేకుండా ఇంటికి వెళ్తే కొడతాడుట,” అన్నాడు రాజు బాధగా.
నరేంద్ర నవ్వేశాడు. “ఆఁ! ఇలాంటి కాకమ్మ కథలు నమ్మకూడదు. ఈ దేశం లో ఎవరైనా పిల్లలని కొడితే వాళ్ళని వెంటనే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అందుకనే ఇక్కడి పిల్లలకు ఎవరి మీదా భయమూ, భక్తీ ఉండవు. పద, వెళ్దాం. వీడితో మనకేమిటి?”
కానీ రాజు కదల్లేక పోయాడు. తన చిన్నప్పుడు ఇలాగే ఎన్నోసార్లు సారా దుకాణానికి వెళ్ళడం గుర్తుకొచ్చింది. కనీసం మార్క్ వాళ్ళ నాన్న అతనికి డబ్బులైనా ఇచ్చాడు. తనకొక్కోసారి అదీ ఉండేదు కాదు. అలాగే దుకాణం దగ్గిర పడిగాపులు పడుతూ, ఎలాగో అలాగ వాళ్ళ నాన్నకు కావాల్సిన సరుకు సంపాదించి తీసుకెళ్ళి ఇచ్చేవాడు. దొరకకపోతే తన్నులు తప్పేవి కావు. ఎన్ని సార్లు చీకటిలో తచ్చాడుతూ, ఇంటికి వెళ్ళలేక భయంతో బెదురెత్తి పోయాడో బాగా గుర్తు. ఎన్ని సార్లు తనని రక్షించే నాథుడెవరైనా ఉన్నాడోనని ఆశగా ఎదురుచూశాడో ఎవరికి తెలుసు? ఏం లాభం? తన పరిస్థితీ, తన నాన్న సంగతీ అందరికీ తెలిసినా, కల్పించుకున్న వాళ్ళు మాత్రం ఎవరూ లేకపోయారు. తండ్రి తనని చావబాదుతున్నప్పుడు అడ్డుపడేవాళ్ళే లేకపోయారు. కదుములతో, గాయాలతో, వెక్కి వెక్కి ఏడ్చి అలసటతో సొమ్మసిల్లి పోతూంటే, అప్పుడప్పుడు ఎవరైనా చేరదీసి తలనిమరడం కద్దే. కానీ వాళ్ళ ఆదరణా, ఆప్యాయతా అంతటితో ఆగేవి. ఒక్కరికికూడా తండ్రిని నిలదీసి “ఏమిటిది?” అని అడిగే తీరికో, ఓపికో, ధైర్యమో లేకపోయింది.
అదంతా మనసులో మెదులుతూంటే, “అలాగా? ఇది కూడా చట్టమేనా?” అనడిగాడు రాజు.
“ఆహా, నిక్షేపంలా. ఇక్కడ ప్రతిదానికీ ఏదో ఒక రూలూ, ఏదో ఒక చట్టం.” నరేంద్ర గొంతులో కొంచెం ఎకసెక్కం వినిపించింది రాజుకి.
“చాలా మంచి చట్టం,” అన్నాడు రాజు.
“ఏం మంచి? తల్లితండ్రులకీ పిల్లలకీ మధ్య కూడా రూల్సూ, చట్టాలూ, పోలీసులూ అంటూంటే ఎలా? అదేగా ఇందాక మనమన్నదీ? వీళ్ళకి మానవ విలువలూ, మానవ సంబంధాలూ అంటే ఏమిటో తెలియదు,” అన్నాడు గోపాల్.
“పద, బయల్దేరుదాం,” అని తొందర చేశాడు నరేంద్ర.
కానీ రాజు మార్కుని వదల్లేక పోయాడు. “మీరు వెళ్ళండి. నేను తర్వాత కలుస్తాను,” అన్నాడు.
నరేంద్ర ఆశ్చర్యంగా చూశాడు. “ఆదేమిటి? నువ్వేం చేస్తావు?”
“నేనీ అబ్బాయితో కొంచెం మాట్లాడుతాను,” అన్నాడు రాజు.
నరేంద్రా, గోపాల్, ఇద్దరూ విసుగ్గా చూశారు. “ఈ అబ్బాయితోనా? వీడికోసమేమిటి నీ తాపత్రయం? వీడు నీకేమవుతాడని? వాడి కర్మకి వాణ్ణి ఒదిలేయ్. ప్రపంచం లో అందరినీ మనం ఉద్ధరించలేం,” అన్నాడు నరేంద్ర.
“ఉద్ధరిస్తాననలేదు నేను. కొంచెం మాట్లడుతానన్నాను. మీరు వెళ్ళండి,” అని రాజు వాళ్ళతో బాటు కారు దగ్గిరకి వెళ్ళి, ఉదయ్ కి కూడా సర్ది చెప్పి, చివరికి ఎలాగైతేనేం వాళ్ళందరినీ పంపించాడు.
మళ్ళీ మార్క్ దగ్గిరకి తిరిగొచ్చాడు. తన వైపే అనుమానంగా చూస్తున్న మార్క్ తో లాలనగా, “చూడు. మీ నాన్నంటే నీకు భయమా?” అనడిగాడు.
అవునంటూ తలాడించాడు మార్క్.
“భయపడక్కరలేదు. కావాలంటే నేను పోలీసులని పిలిచి మీ నాన్న నిన్ను కొడుతున్నాడని చెప్తాను. వాళ్ళొచ్చి ఆపిస్తారు,” అన్నాడు రాజు ఓదార్పుగా.
“వద్దు, వద్దు,” అంటూ మార్క్ అడ్డొచ్చాడు.
“ఏం? ఎందుకు వద్దు?” ఆశ్చర్యంగా అడిగాడు రాజు.
“వద్దు. పోలీసులొస్తే మా నాన్నని ఏదైనా చేస్తారేమో. జైల్లో పెట్టేస్తారేమో.”
“లేదు. ఫర్వాలేదు. ఊరికే వాళ్ళు మీ నాన్నని మందలిస్తారు, అంతే,” అని నచ్చచెప్పబోయాడు రాజు.
మార్క్ తల ఇంకా గట్టిగా అడ్డంగా ఊపుతూ, “ఊఁహూఁ. అలా ఏం చెయ్యరు. ముందు నన్ను తీసుకెళ్ళి ఇంకెవరింట్లోనో పెట్టేస్తారు,” అన్నాడు.
“ఎవరింట్లో పెడతారు?”
“ఫాస్టర్ హోం లో పెడ్తారు. మా నాన్న సంగతేమిటో చూసినన్నాళ్ళూ నన్ను వేరే ఎవరితోనో పెట్టేస్తారు.”
“అంటే మీ బంధువులా?” అనడిగాడు రాజు సరిగ్గా అర్ధం కాక.
“బంధువులు కాదు. ఊరికే ఎవళ్ళో ఒహళ్ళు. ఇలా అమ్మా నాన్నా సరిగ్గా లేని పిల్లలని చూసుకునేవాళ్ళు.”
“వాళ్ళు నిన్ను బాగా చూడరా?” అనడిగాడు రాజు, మార్క్ అభ్యంతరమేమిటో అర్ధం కాక.
“బాగానే చూస్తారు. అది కాదు.”
“మరి?”
“నేనింట్లో లేకపోతే మా నాన్ననెవరు చూస్తారూ? అందుకే — ఇదివరకోసారి నన్నలా పెట్టారు కానీ, నేను పారిపోయి వచ్చేశాను.”
ఛెళ్ళుమన్నట్లయింది రాజుకి. అవును. ఇది కూడా తనకనుభవమే. ఇది రక్త సంబంధపు ప్రభావం కాబోలు. ఎంత నిరాదరించినా, ఎంత నిర్లక్ష్యం చేసినా, మళ్ళీ ఆ తండ్రి కోసమే తనూ పాకులాడేవాడు. ఒక్కసారి తనని గమనించాలనీ, తనంటూ ఒక వ్యక్తి ఉన్నట్టు గుర్తించాలనీ, ఒక్కసారంటే ఒక్కసారి, ఒక చిన్న మాట, ఒక చిన్న మెచ్చుకోలుగానీ, ఒక చిన్న ఓదార్పు గానీ, ఏదో ఒకటి, దొరుకుతుందేమోనని ఎదురు చూసేవాడు. వాత్సల్యం, ఆప్యాయతా, ఆదరణా, ఇలాంటి మాటలేవీ ఆ వయసులో తనకు తెలీవు. కానీ ఆ అనుభూతులని మాత్రం తన మనసు కోరుకునేది. అవి దొరకనప్పుడు, నీళ్ళు లేని మొక్క లాగా, తన మనసూ ఎండిపోయింది.
పూర్తిగా వడలి, వాడి, చావడానికి సిద్ధంగా ఉన్న తరుణం లో మాష్టారు తనని చేరదీశారు. ఇక్కడిలా తనని ఇంట్లోంచి తీసుకెళ్ళక పోయినా, తనని స్కూలుకి రమ్మని ప్రోత్సాహించారు. అక్కడ తనని కూర్చోబెట్టి శ్రద్ధగా, ఎన్నాళ్ళనుంచో వట్టిబోయిన తన చదువుని పునరుద్ధరించారు. మిగతా పిల్లలతో పోలిస్తే చాలా వెనకబడిపోయాడు తను. ఆ సిగ్గుతో, నామోషీతో, తను స్కూలుకి వెళ్ళడానికే సంకోచించేవాడు. కానీ, మాష్టారు బుజ్జగింపులూ, బెల్లింపులూ, ఆయన చల్లటి మాటల మురిపింపులూ, అన్నీ కలిసి తనని ప్రోద్బలించి స్కూలుకి తీసుకెళ్ళాయి. అక్కడ ఆయన శ్రద్ధగా, ఓపిగ్గా, ఇన్నాళ్ళనుంచి తను నేర్చుకోనివి, ఒకప్పుడు నేర్చుకున్నా మరిచిపోయినవీ, పాఠాలన్నీ నేర్పించారు. త్వరలోనే తనలో ప్రతిభ దాగుందని మాష్టారు చెపితే తను నమ్మలేదు. కానీ, మాష్టరి నిరంతర శ్రమతో, ఎక్కడో తన అంతరాంతరాల్లో, ఏ మారుమూలో కప్పడిపోయిన చిన్న రవ్వ లాంటి తన తెలివికి గాలిపోసీ, చమురుపోసీ, క్రమక్రమంగా దాన్ని జ్వలింపజేశారు. ఆయన ప్రోత్సాహమూ, ఆశీర్వాదమే కాదు, ఆయన చేతి డబ్బు కూడా పడినట్టు తన అనుమానం. కాలేజీ చదువుకు తనని వెళ్ళమంటే, అది తన కందుబాటులో లేదని నిరుత్సాహపడ్డాడు. కానీ మాష్టారే పూనుకుని, తనకి ఎక్కడెక్కడనుంచో, ఎవరెవరిదగ్గిరనుంచో, డబ్బులు ఎలా దొరుకుతాయో వాకబు చేసి, ఆ ఏర్పాట్లన్నీ ఆయనే చేశారు. చందాలతో, స్కాలర్ షిప్పులతో గడిచింది తన చదువు.
రాజు తదేకంగా ఆ కుర్రవాడి ముఖంలోకి చూశాడు. చివరిసారి మాష్టార్ని కలిసినప్పుడు ఆయన వంక ఇలాగే చూశాడు తను.
కృతజ్ఞతతో, భక్తితో, ఆయన కాళ్ళకి నమస్కరించబోతే మధ్యలోనే వారించారు ఆయన. తన ఉద్యోగ వివరాలన్నీ చెప్పి, “ఇదంతా మీ దయమూలానే మాష్టారూ. మీ ౠణం ఎన్నటికీ తీర్చుకోలేను,” అంటే ఆయన నవ్వేశారు.
“నేను చేసిందేముందోయ్. చదివినవాడివి నువ్వు. కష్టపడిపైకొచ్చినవాదివి నువ్వు.”
“కాదు, మాష్టారూ. మీరు పూనుకోకపోతే అసలు చదువనేదే నాకు తెలిసేది కాదు. అడుగడుగునా మీ సహాయం లేకపోతే అది ఇంత వరకూ వచ్చేదీ కాదు. నేను మీకేమవుతానని ఇంత శ్రద్ధా, శ్రమా తీసుకున్నారు మీరు?”
“ఏమవుతావేమిటి? సాటి మనిషివి. అది చాలదూ?” అంటూ నిండుగా నవ్విన మాష్టారి ముఖం రాజు మదిలో మెరిసింది. మాష్టారి ౠణం ఎలా తీర్చుకోవాలో స్ఫురించింది.
“పద. మీ ఇంటికి వెళదాం,” అన్నాడు.
అర్ధం కాక చూస్తున్న మార్క్ తల నిమిరి, “నేను కూడా వస్తాను. ఇకనుంచీ ఇలాంటి పనులకు నిన్ను పంపించకూడదని మీ నాన్నకు నేను చెప్తాను. ఏం భయం లేదు. ఇక అన్నిటికీ నేనుంటానుగా,” అని ధైర్యం చెప్పాడు.
మానవులున్న ప్రతిచోటా మానవ సంబంధాలూ, అనుబంధాలూ తప్పకుండా ఉంటాయి. ఎటొచ్చీ అవతలి వ్యక్తిని మనిషిగా మనం గుర్తించి గౌరవించాలి.
మార్క్ భుజం మీద చెయ్యి వేసి ధృఢంగా అడుగులు వేశాడు రాజు.
---------------------------------------------------------
రచన: మాచిరాజు సావిత్రి,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment