Saturday, February 2, 2019

కవులు మరిచిపోయారు


కవులు మరిచిపోయారు




సాహితీమిత్రులారా!


కవులు
అన్నీ మరిచిపోయారు
కరవాలం తిప్పడం మానేసి
కారుడ్రైవింగు నేర్చుకుంటున్నారు
కాగడాలు వెలిగించడం వదిలేసి
కలర్‌ లైట్లు వేయడంలో నిమగ్నమయ్యారు

కవులు
అన్నీ మరిచిపోయారు
ఊరు కాలిపోతుంటే
ఇంటిపోరులో మునిగిపోయారు
ఆర్తనాదాలు వినిపిస్తుంటే
అడ్డుగోడలు లేపుకుంటున్నారు

కవులు
అన్నీ మరిచిపోయారు
అడవుల్లో కూంబింగు జరుగుతుంటే
అవార్డుల లిస్టుల్లో పేర్లు వెదుక్కుంటున్నారు
ఎన్‌కౌంటర్లకు ఎడతెరిపి లేనప్పుడు
పాస్‌పోర్టు కోసం లైన్లో నిలుచుంటున్నారు

కవులు
అన్నీ మరిచిపోయారు
అస్త్రాలను దాచేసి
వీసాలు కొంటున్నారు
విమానాల్లో తిరుగుతూ
సాహిత్యాన్ని సమీక్షిస్తున్నారు

కవులు
అన్నీ మరిచిపోయారు
ఆరునెలలు పిల్లలనాడిస్తూ
అమెరికాలో గడుపుతున్నారు
ఇండియాకు తిరిగి వచ్చాక
ఎదుటివాళ్ల తప్పులు వెదుకుతున్నారు

కవులు
అన్నీ మరిచిపోయారు
ఎప్పుడు ఏది రాసినా
వాళ్లదే నిజమంటున్నారు
సంశయాలు వెలిబుచ్చితే
మల్టీ డైమెన్షన్లని భుజాలు తడుముకుంటున్నారు

కవులు
అన్నీ మరిచిపోయారు
విదేశాల్లో కవిత్వం రాసి
స్వదేశంలో ఆవిష్కరిస్తున్నారు
సంచనాలు చెలరేపి
సాహిత్య పేజీలన్నీ ఆక్రమిస్తున్నారు

కవులు
అన్నీ మరిచిపోయారు
రాగానే ఒకటి, వెళ్లే ముందింకొక్కటి
సభలు పెట్టి శాసిస్తున్నారు
నిబద్ధత వదిలేసి
దబాయించడం నేర్చుకున్నారు

కవులు
అన్నీ మరిచిపోయారు
కవిత్వాన్ని పక్కన పారేసి
ప్రచారం చేసుకోవడంలో మునిగిపోయారు
----------------------------------------------------------
రచన: ఆశారాజు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment