ఒక్క క్షణమైనా నీలా…
సాహితీమిత్రులారా!
ఈ కవితను ఆస్వాదించండి...........
చీకటీ వెలుగూ నీలో ఎపుడూ సమంగా ఎలా
ఆవేశమూ ఆవేదనా కూడా నీకే తెలియనట్లుగా కదా
ఒక అద్భుత తాత్విక రహస్యమైపోవడం
నీకెపుడూ ఎలా తెలుస్తుంది
ఏ లోతులనైనా సమంగా చూడడమూ
నీ అనంత లోకాల అస్తిత్వపు జాడను
నిర్మోహంగా విడిచి కరిగిపోవడమూ
ఎలా సాధ్యపడుతుంది
ఏది ఏ కాలమో తెలియదు
ఎవరు నీకోసమో కాదో తెలియదు
ఏ తూనీగలు నీపై ఎగిరిపోతాయో
ఎవరి కేరింతలు నీలో అలలై కదులుతాయో
ఏ తామరలూ కలువలు నీలో పులకించి
నిన్ను పగటినో రాత్రినో చేస్తాయో తెలియదు
అన్ని భావాలకూ అతీతంగా
అందరినీ అలాగే పలకరిస్తూ
ఒక్క క్షణమైనా నీలా
నిరుద్విగ్నంగా
ప్రవహించడం ఎలా
----------------------------------------------------------
రచన: విజయ్ కోగంటి,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment