ప్రద్యుమ్నుడి ఉపవాసం
సాహితీమిత్రులారా!
భరత ఖండే, భరత వర్షే, జంబూద్వీపే, ఏలూరు నగరే, రా.రా.పేటే, అద్దె గృహే, ది క్రీస్తు శకే, సెప్టెంబరు మాసే, ఆరవ తారిఖే, మధ్యాహ్న భోజన కాలే — “మీరు రేపటినుంచి ఒక్కపొద్దు ఉపవాసం ఉంటున్నారు,” అని ప్రభావతి ప్రకాశముగా ప్రకటించినది. ప్రద్యుమ్నుడు తీవ్రముగా అభ్యంతరం వ్యక్తం చేసినాడు. నిరాహార దీక్ష చేయడానికి ఒఖ్ఖ కారణం చూపించమని సవాలు కూడా చేసినాడు.
“మీరు చేస్తున్నారు. నేను నిర్ణయించాను అంతే. ఇంక చర్చలు అనవసరం!” ఉద్ఘాటించింది ప్రభావతి.
“కారణం తెలియకుండా నేను ఈ రిలే నిరాహార దీక్ష ఎందుకు చెయ్యాలి. నేను సమైక్య వాదిని కాను. విభజన వాదిని కూడా కాదు. సీమాంధ్ర కానీ తెలంగాణా కానీ నాకు ఉద్యోగం ఇవ్వలేదు. ఎక్కడో మూడువేల కిమీ దూరంలో అస్సాం నన్ను అక్కున చేర్చుకుంది. ముప్ఫై ఏళ్లకు పైగా నన్ను పోషించింది. అంతో ఇంతో పేరు, ప్రతిష్ఠ కల్పించింది. నా పిల్లలు కూడా అక్కడే పెరిగారు. అక్కడే చదివారు. నాకు సీమాంధ్రలో కానీ, హైదరాబాదులో కానీ, ఇల్లు కానీ, మరే స్థిరాస్తి, చరాస్తి ఏమీ లేవు. నా పిల్లలు సీమాంధ్రలో కానీ తెలంగాణాలో కానీ స్థానికులుగా పరిగణింపబడలేదు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావు. నాకు ఇక్కడ ఎక్కడా ఓటు హక్కు లేదు. నా ఎడ్రస్ ప్రూఫ్‌కి బీయెసెనెల్ వారి టెలిఫోన్ బిల్, ఐడెంటిటికి నా పాన్ కార్డ్ మాత్రమే గతి. నీకు గుర్తుందా, కిందటి ఎన్నికలప్పుడు లోక్ సభకు పోటీ చేసిన ఒక జోర్హాట్ అభ్యర్ధి, దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే మనం వచ్చి ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ఉద్భోదిస్తూ మనకు మెయిల్ పంపించాడు. కానీ మనం పోలేదు. దేశంలో ప్రజాస్వామ్యం నిలబెట్టడంలో మనం విఫలమయ్యామని గుర్తు చేయటానికి చింతిస్తున్నాను. సమైక్యాంధ్ర ఉద్యమంలో నేను పాలు పంచుకోను.
అవునూ, అంటే గుర్తుకొచ్చింది. నలుగురూ నాలుగు విధాలుగా వ్రాస్తున్నారు. సమైక్యాంధ్ర అని తేలికగా ఉద్ఘాటించే వారు కొందరయితే సమైఖ్యాంధ్ర అని నొక్కి వక్కాణించే వారు కొందరు, ద కి పొట్టలో గునపం దించి హింసించని వారు మరికొందరు, ఇందులో ఏది రైటు? మన తెలుగు భాషాభిమానులు అందరూ ఏం చేస్తున్నారు? తెలుగు భాష నశించి పోతోందని, అంత్యదశ ఆసన్నమవుతోందని బాధపడే భాషాభిమానులు ఈ విషయంలో వివరణ ఎందుకు ఇవ్వటం లేదు? సమైక్యాంధ్ర అనే విషయంలోనే మన అనైక్యత కొట్టవచ్చినట్టు ఇలా రచ్చకెక్కితే వీరందరూ ఏం చేస్తున్నారని విచార హృదయంతో ప్రశ్నిస్తున్నాను!”
సుదీర్ఘంగా, సవివరంగా ఉపన్యాసమిచ్చి విరమించాడు ప్రద్యుమ్నుడు, ఆయాసం తీర్చుకోడానికి. అతని ఉపన్యాస ప్రభావం ప్రభావతి మీద పడలేదు.
“మీరు మాట మార్చే వృధా ప్రయత్నం చేయవద్దు. నా నిర్ణయం మారదు. మీరు కట్టుబడి ఉండాల్సిందే. మరో మార్గం లేదు. మీరు రేపటినుంచి ఉపవాసం చేస్తున్నారు,” అని నిర్దయగా, నిరంకుశంగా, నిష్కర్షగా, నిర్లక్ష్యంగా, నిర్భయంగా, నిస్సంశయంగా, నిరాపేక్షగా, నిర్దేశనం చేస్తూ కఠినంగా, కర్కశంగా, నొక్కి మరీ వక్కాణించింది.
“కారణం లేకుండా నేను నిరాహార దీక్ష చెయ్యను గాక చెయ్యను!” ధైర్యం చేసి సాహసోపేతంగా మొండికేసి తిరుగుబాటు ప్రకటించాడు ప్రద్యుమ్నుడు.
అప్పటిదాకా శాంత గంభీర మృదు మధుర స్వనంతో (అంటే ఏమిటని అడగకండి. అరవైల్లోనూ, డెబ్భైల్లోనూ వచ్చిన నవలల్లో అలా మాట్లాడేవారు) వ్రాక్కుస్తున్న ప్రభావతి, శాంతాన్ని క్రోధంతోనూ, మృదుని కఠినంతోనూ, మధురని కటువుతోనూ, గంభీరాన్ని హేళనతోనూ మార్పిడి చేసి పక్క వీధిలో కూడా వినిపించే ఉచ్ఛస్వరంలో ముందు చెప్పబోతున్న రీతిన ఉద్ఘాటించింది.
ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఒళ్ళు తెలియని కోపం వచ్చినప్పుడు ఉ.భా.ప్ర. ప్రభావతి, అలంకార సమన్వితమై, సమాస భూయిష్టమై, సంధి ప్రేరేపితమై చెలరేగుతూ, మూడు నాలుగు అంతస్థుల తెలుగు అక్షరాలు విరివిగా ప్రయోగిస్తూ, యతి ప్రాసలను యధాస్థానముల నధిష్టింప చేస్తూ, గురు లఘువులకు సముచిత గౌరవమొసగుచూ, పద పాదాలు పద్య నియమానుసారంగా కూరుస్తూ, సీసం ప్రద్యుమ్నుడి చెవుల్లో పోస్తుంటుంది. తెలుగు మాష్టారి అబ్బాయి కావడం వల్ల ప్రద్యుమ్నుడు మొదట్లో అలంకారాలను త్యజించి, సమాసాలను వెతికి అన్వయం చేసుకుంటూ, సంధులను విడగొట్టుకుంటూ, నాలుగు అంతస్థుల అక్షరాలను రెండు అంతస్థులకి పడగొట్టుకుంటూ, యతి ప్రాసలను గమనిస్తూ, గురువులకు నమస్కరిస్తూ, లఘువులను ఆశీర్వదిస్తూ, పోసేది సీసమే యని నిర్ధారణ చేసుకుంటూ, అర్ధం వెతుక్కునే ప్రయత్నం చేసేవాడు. ఈ ప్రక్రియలో అర్ధాలకన్నా అపార్ధాలే ఎక్కువగా కలగడంతో, ఆ ప్రయత్నం మానేసి, కఠోర సాధనతో, ప్రభావతి స్వర గతులలోని తేడాలు గమనిస్తూ, రాగ విశేషాలను ఆకళింపు చేసుకుంటూ, శృతి తాళ భేదాలను శ్రద్ధగా పరికిస్తూ, ఆరోహణ అవరోహణలని నిశితంగా పరిశీలిస్తూ, సమయ సందర్భానుసారంగా విషయం అర్ధం చేసుకోవడంలో ప్రావీణ్యత కొంత సంపాదించ గలిగాడు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభావతి వదిలిన కఠిన పద్యకల్లోలానికి ఈ విధంగా అర్ధం చెప్పుకున్నాడు (తన కుత్సిత బుద్ధి, ఆవిడ ఉదార బుద్ధి, ప్రకృతి వర్ణన మొదలైన వాటిని వదిలేసి).
“మీకు తెలియదా, తెలియదాంట, ఎందుకు ఒంటిపొద్దు చెయ్యాలో. మొన్న నాలుగు రోజుల క్రితం మా బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు (అన్నట్టు పెళ్లి వర్ణన, బంధువుల గొప్పతనంతో కూడా సీసాన్ని వేడెక్కించడం జరిగింది) మీరేం చేశారో గుర్తు లేదా? గుర్తు లేకనే ఇందాకటి నుంచీ అల్లరి చేస్తున్నారా? దుష్టసింహా, క్రూరసేనా!”
సరిగ్గా అర్ధం కాలేదు కానీ ముష్టివెధవా అని కూడా అందేమోనని అనుమానం కూడా వచ్చింది ప్రద్యుమ్నుడికి. అయినా బింకంగానే అన్నాడు.
“ఏం చేశాం, పెళ్ళికి వెళ్ళాం, అక్షంతలు వేశాం, కానుక చదివించాం, చదివిస్తూ వీడియో లోను, ఫోటోల్లోను పడ్డాం, భోజనం చేశాం, వచ్చేశాం. అంతే కదా.”
“అదే, ఆ భోజనమే! ఎల్లా చేశారనే ప్రశ్నిస్తున్నాను.”
“భోజనం ఎల్లా చేయడం ఏమిటి? మామూలు గానే పదార్ధాలు ప్లేటులో పెట్టుకొని, చేతితో తీసుకొని, నోట్లో వేసుకొని, నమిలి తిన్నాను. నేను ఎక్కడా చెంచాలు ఉపయోగించనని నీకు తెలుసు గదా. ఇందులో ఆక్షేపించదగ్గ విషయం ఏమీ లేదని నేను దృఢంగా నమ్ముతున్నాను. చాలామంది అలాగే చేస్తారు గదా.”
“మీరు అందరి లాగానే చేస్తే నాకెందుకు బెంగ? మీరు తిన్న విధానమే నాకు నచ్చలేదు. కూరల్లో కారం ఎక్కువయిందని అవి వేసుకోలేదు. మామిడికాయ పప్పులో పులుపు ఎక్కువ అయిందన్నారు. అది తింటే మీ ఉదరమున వాయువులు ఉత్పత్తి అయి, కడుపు భారం అయి, వాయువులు అత్యవసర ద్వారం గుండా బయల్పడి, ఇతరులకు అసౌకర్యం కలిగే పరిస్థితి కల్పించదలచుకోలేదన్నారు. ఇత్యాది కారణాల వల్ల ఆ మధ్యాహ్న భోజనాన్ని శనివారం రాత్రి ఫలహారంగా ప్రకటించారు. బొటన వేలితో చిల్లు చేసి నెయ్యి నింపిన అరడజను బూరెలు నోట్లో అలవోకగా పడవేసుకున్నారు. డజను పైగా గులాబీజాములు కటోరాలో వేసుకొని కనురెప్ప పాటులో గుటుక్కుమనిపించారు. కాకినాడ కాజాలు నాకు ప్రాణం అంటూ ఐదారు లాగించేశారు. మధ్యలో ఇంకేం మెక్కేరో నేను గమనించలేదు. చివరగా నాలుగు కప్పులు ఐస్ క్రీం ప్లేటులో వేసుకొని, దాంట్లో ఓ పావుకేజీ పళ్ళ ముక్కలు కుమ్మరించుకొని అర్ధనిమీలిత నేత్రులై ఆరగించారు, కాదూ? దీన్ని భోజనం అంటారా? కక్కుర్తి అంటారా?”
“భలే దానివే, వెయ్యి రూపాయల కానుక చదివించాం, రానూ పోనూ ఆటో ఖర్చులు నాలుగు వందలు అయ్యాయి. అల్లా తిన్నాను కాబట్టే ఎంతో కొంత కిట్టుబాటు అయింది. ఆ మాత్రం వసూలు చేసుకోకపోతే ఎలా? నీకు మల్లె సుతారంగా తినడం నాకు అలవాటు లేదు,” నిస్సిగ్గుగా ప్రద్యుమ్నుడు జవాబిచ్చాడు.
“అయ్యో రామా, అంతా మిమ్మల్ని వింతగా చూశారు. మా వాళ్ళలో నా పరువు పోయినా సరే, మీ పద్ధతి మార్చుకోరన్న మాట.”
“ఎక్కడో వేలు విడిచిన మేనత్త కూతురి పెళ్ళికి, టెలిఫోన్ చేస్తేనే పరిగెత్తుకు బయల్దేరిన నిన్ను చూస్తే నాకూ అలాగే అనిపించింది. అక్కడ నిన్ను గుర్తు పట్టింది మీ వే.వి.మేనత్త ఒఖ్ఖర్తే. ఆయన కూడా ఆవిడ గుర్తు చేస్తే, బాగుండదని గుర్తు వచ్చినట్టు నటించాడు.”
“అంటే మీరిచ్చే బహుమతి కోసమే మనల్ని పిలిచారంటారా?”
“ఏమో? వస్తారనుకున్నవారు రాలేకపోతే, ఆర్డర్ చేసిన ప్లేట్లకన్నా వచ్చేవాళ్ళు తక్కువ అయి, నిన్ను పిలిచారనే అనిపించింది నాకు,” అన్నాడు వ్యంగ్యంగానే ప్రద్యుమ్నుడు.
“ముఫై ఏళ్లకు పైగా అస్సాంలో మా వాళ్ళందరికీ దూరంగా ఉంచి ఈ పరిస్థితికి కారణమయిన మిమ్మల్నేమనాలి నేను?”
పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన ప్రద్యుమ్నుడు మాట్లాడలేదు. ఒక్క నిముషం ఊరుకొని మళ్ళీ కొనసాగించింది ప్రభావతి.
“సరే, ఆ విషయం పక్కన పెట్టండి. మర్నాడు మీకు షుగర్ టెస్ట్ చేస్తానంటే ఎందుకు వద్దన్నారు?”
“ఆ వేళ నా శరీరంలో నలత గానూ, మనసు వ్యాకులం గానూ ఉంది కనుక. అటువంటప్పుడు టెస్ట్ చేస్తే సాధారణంగా ఎక్కువ వస్తుంది కనుక.”
“ఆ మర్నాడు కూడా చేయించుకోలేదు కదా, వై?”
“ఆ రోజున నాకు నీరసంగా ఉంది. నీరసంగా ఉంటే షుగర్ లెవెల్స్ పడిపోతాయి.”
“ఎవరు చెప్పేరేంటి మీకు?”
“ఎవరో చెప్పడం ఏమిటి? కామన్ సెన్స్. మొన్న ఆయనెవరో నాయకుడు నిరాహార దీక్ష చేస్తే ఏమయింది? మర్నాటికి నీరసం వచ్చేసింది. షుగర్, బీపీ, దారుణంగా పడిపోయాయి. నలుగురు డాక్టర్ల పర్యవేక్షణలో పెట్టారు. సాయంత్రానికి పరిస్థితి విషమించింది అన్నారు. వైద్యుల సలహా ప్రకారం హాస్పిటల్లో ఐసీయూలో పెట్టి గ్లూకోజ్ ఎక్కించి దీక్ష భగ్నం చేయించారు. నాలుగు రోజులు ఆయన అక్కడే ఉండాల్సి వచ్చింది. అవునూ, స్వాతంత్ర్య సమరంలో నాయకులు చాలామంది సత్యాగ్రహం చేసేవారు కదా. రెండో రోజుకి వారి ఆరోగ్యం ఇంతలా అయ్యేదా అని నాకో డౌటనుమానం.”
“అప్రస్తుత ప్రసంగం వద్దు. వాళ్ళ సంగతి ఎందుకు ఇప్పుడు? ఆ మర్నాడు మీకు టెస్ట్ చేశామా లేదా?”
“అవును. దుర్మార్గురాలా! నిద్ర లేస్తుండగానే, ఇంకా అరచేతిలో ‘ఇలియానా’ అని వ్రాసుకోకుండానే, నా వేలి మీద సూది గుచ్చి నా రక్తం పిండి టెస్ట్ చేశావు గదనే నా సూర్యకాంతమా!”
“ఎంత వచ్చింది గుర్తు ఉందా తమరికి?”
ఎంతోనా? ఆఫ్టరాలు రెండూ యాభయ్యారే గదా.”
“రెండూ యాభయ్యారు కాదు. రెండువందల యాభై ఆరు. పరగడుపున అది ఎంత ఎక్కువో తెలియదా మీకు?”
“ఆ రాత్రి నేను యన్టీవోడు అయినట్టు కల వచ్చింది. జమునతో డ్యూయట్ పాడుతుంటే, కత్తి పట్టుకొని రాజనాల యుద్ధానికి వచ్చాడు. నువ్వు సూది గుచ్చేంత వరకు ఆయనతో యుద్ధం చేస్తూనే ఉన్నాను. బహుశా ఆ టెన్షన్ వల్ల ఎక్కువ వచ్చింది.”
“మరి టిఫిన్ తిన్న రెండు గంటలకి ఎంత ఉంది?”
“మూడు అరవైనాలుగు అనుకుంటాను. ఇదేమైనా సచిన్ రికార్డా కంఠతా పట్టడానికి. అయినా, మూడు పెసరట్లు, కుంచెడు ఉప్మా తింటే ఆ మాత్రం ఉండదా అని ప్రశ్నిస్తున్నాను. ఇంకో రెండు గంటల తర్వాత చూస్తే వంద లోపే ఉండేది. నీకు తొందర ఎక్కువ. కొంచెం ఆగి ఉండాల్సింది.”
“షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయండి, రోజూ వాకింగ్ చెయ్యండి అని మొత్తుకుంటున్నా వింటున్నారా మీరు?”
“వాకింగ్ నేను చెయ్యటం లేదని ఎలా అనుకుంటున్నావు?”
“ఎప్పుడు చేశారు వాకింగ్ మీరు?”
“పిచ్చిదానా, నువ్వు గమనించటం లేదా? ఉదయమే లేచి మంచం దగ్గర నుంచి వాకింగ్ చేసి బాత్రూం దాకా వెళ్తున్నాను. మళ్ళీ అక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ రెండు గదులు దాటి డ్రాయింగ్ రూం లోకి వస్తున్నాను. అక్కడ కూర్చుని పేపరు చదువుకొని మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ టివి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆన్ చేస్తున్నాను. చూశావా! చేతి వ్యాయామం కూడా చేస్తున్నాను. నువ్వు టిఫినుకి పిలిచేదాకా అలా కూర్చుని యోగా చేస్తున్నాను. నేను లేచినప్పటి నుంచి నిద్ర పోయే దాకా నిరంతరంగా వాకింగ్ చేస్తూనే ఉన్నాను.”
“దీన్ని వాకింగ్ అనరు. ఉదయమో, సాయంకాలమో ఐదారు కిమీలు నడవాలి. అదీ వాకింగ్ అంటే. అవునూ, యోగా అన్నారు, అదేమిటి? మీరు చేస్తుండగా నేను ఎప్పుడూ చూడనేలేదు.”
“అమాయకపు జూ. శ్రీరంజనీ, ధర్మసూక్ష్మ మెరుగవు నీవు. యోగా అనగా నేమి? క్రమ పద్ధతిలో గాలి పీల్చుట, వదులుట. టివిలో ఆ యోగా గురువు, కాళ్ళూ, చేతులూ నానా రకాలుగా పెట్టించి, యే ఆసనం వేయించినా, ప్రతీ ఆసనం లోనూ గాలి ఘట్టిగా పీల్చి వదులుడూ, అని చెపుతాడు కదా.”
“అవును, యే ఆసనం లోనైనా ఉచ్ఛ్వాస నిశ్వాసములు క్రమ పద్ధతిలో చేయాలి.”
“కదా మరి, నేను కూడా కూర్చుండాసనం వేసి, సిగరెట్టు పొగ ఘట్టిగా పీలుస్తూ, గుండెలో ఒక్క పిసరు కూడా ఉండకుండా విసర్జిస్తూ యోగా చేస్తున్నాను కదా. ఇది కూడా యోగాయే అని ఈ వేళ కాకపోయినా మరో రోజున నువ్వు తప్పక గ్రహించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” ఆయాసం తీర్చుకున్నాడు ప్రద్యుమ్నుడు.
ప్రకటిత కోప వేగమున పద్మ దళాయిత నేత్రముల్ కదుల, భ్రుకుటి ముడిచి, నాసికను వెడల్పు చేసి, ఉచ్ఛ్వాస నిశ్వాసములను తీవ్రతరం చేసింది ప్రభావతి. పాటల గంధి చిత్తమున పాటిలు కోప భరంబు తీర్ప నెప్పాటను పాడాలో అర్ధం కాక ప్రద్యుమ్నుడు వెఱ్ఱి మొహం వేశాడు. కొంచెం అతిగా మాట్లాడానేమోనని చింతించాడు. పేరలుకన్ చెందిన కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే యని కూడా శంకించాడు. శిరోజ రహితమైన శిరస్సు మీద యాదగిరి గుట్టయో, కోటప్ప కొండయో మొలిచే అవకాశం ఉందేమోనని భయపడ్డాడు. అదృష్టవశాత్తూ, ప్రభావతి తనను తాను సంబాళించుకొని,
“మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజూ నాలుగు కిమీ వాకింగ్ చెయ్యాలి. ఆహార నియమాలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేయని పక్షంలో ఒంటిపూట భోజనం, అది కూడా నియమానుసారం, అవసరమైతే అప్పుడప్పుడు ఉపవాస దీక్ష చెయ్యాలి. మీ ఆరోగ్య దృష్ట్యా ఇది చాలా అవసరం.” అంది.
“ఒంటిపూట భోజనమా?” ఆశ్చర్యంతో కూడిన సందేహం వెలిబుచ్చాడు ప్రద్యుమ్నుడు.
“రాత్రి పూట తేలికపాటి టిఫిన్ చేయవచ్చు.”
“అసంభవం. కావలసి వస్తే ఇంకో గుప్పెడు మందులు మింగుతాను తప్ప అభోజనం ఉండడం నా వల్లకాదు. నా శరీరం గురించి నాకు తెలియదా? అయినా నా ఆరోగ్యం గురించి నీకెందుకు అంత బెంగ?”
“మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం కనుక. మీరు వ్యాయామం కానీ, డాక్టరు గారు చెప్పినట్టుగా భోజనపు అలవాట్లు మార్చుకోవడం కానీ చేయనంటారా?”
“ససేమిరా! ఈ వయసులో నేను నా జీవన శైలి కానీ భోజన అలవాట్లు కానీ మార్చుకోలేను.”
“మీకు ఇంకో రోజు టైం ఇస్తున్నాను. ఆలోచించుకోండి. మీరు మారకపోతే రేపటినుంచి నేను నిరాహార దీక్ష, రిలే కాదు ఆమరణం, చేస్తాను మీరు మారేదాకా. ఇది నా నిర్ణయం.”
“సరే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో,” అన్నాడు ప్రద్యుమ్నుడు మొండిగానే.
మర్నాడు ఉదయం నిద్ర లేచి కాఫీ అడిగాడు ప్రద్యుమ్నుడు.
“నేను పెట్టలేదు. నేను తాగను. కావలసివస్తే మీరు పెట్టుకోండి,” అంది ప్రభావతి.
ప్రద్యుమ్నుడు కాఫీ పెట్టుకొని ఇంకో గ్లాసు ప్రభావతికి తెచ్చాడు. ప్రభావతి తాగను అని నిష్కర్షగా చెప్పింది. ఆ గ్లాసు కూడా ప్రద్యుమ్నుడే తాగేశాడు. ఎనిమిదిన్నరకి హోటల్ నుండి రెండు ప్లేట్లు ఇడ్లీ తెచ్చాడు ప్రద్యుమ్నుడు. కానీ ప్రభావతి నిరాహార దీక్ష కొనసాగించింది. మధ్యాహ్నం భోజనం కూడా ప్రభావతి చెయ్యలేదు. రాత్రి కూడా ప్రభావతి ఏమీ తినలేదు. బింకం వదిలి ప్రద్యుమ్నుడు భార్యను అడిగాడు తినమని. ససేమిరా అంది ప్రభావతి.
మర్నాడు ఉదయం కాఫీ తాగమని భార్యని బాగా బతిమాలాడు ప్రద్యుమ్నుడు. ప్రభావతి వినలేదు. ప్రద్యుమ్నుడు కూడా తాగలేదు, భార్య తాగలేదని, భార్య మీద ప్రేమతో. రాత్రి దాకా ప్రద్యుమ్నుడు కూడా ఏమీ తినలేదు, తాగలేదు. మర్నాడు ఉదయం క్షుద్బాధ కోర్చుకోలేక ప్రద్యుమ్నుడు కాళ్ళ బేరానికి వచ్చాడు. ప్రద్యుమ్నుడు రోజూ ఉదయం ఒక అరగంట, సాయంకాలం ఇంకో అరగంట వాకింగ్ చేసేటట్టు, భోజన నియమాలు కూడా పాటించేటట్టు, ప్రతీ 15 రోజులకు షుగర్ టెస్ట్ చేయించుకునేందుకు ఒప్పుకుంటే తప్ప ప్రభావతి నిరాహార దీక్ష విరమించడానికి ఒప్పుకోలేదు. ప్రభావతి పెట్టిన నియమాలకి ఒప్పుకొన్నాడు. నియమాలు పాటిస్తానని తన మీద ఒట్టు పెట్టించుకొని మరీ ప్రభావతి దీక్ష విరమించింది.
పాపం, ప్రద్యుమ్నుడు, మొదట్లోనే ఒప్పుకుని ఉంటే ఒక కండిషన్ తోనే సరిపోయేది. ఇప్పుడు మూడు కండిషన్లకీ ఒప్పుకోవాల్సి వచ్చింది.
---------------------------------------------------------
రచన: బులుసు సుబ్రహ్మణ్యం,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment