మనుషులపై మదుపు
సాహితీమిత్రులారా!
ఈ అనువాదకథను ఆస్వాదించండి............
నాకంతా తిమకమగా ఉంది. కోపంగా ఉంది, చికాకుగా ఉంది. మీరేమయినా అనుకోవచ్చు. ఎక్కడ తప్పు జరిగింది? నేను ఏది మిస్సయ్యాను…?
నాకు తెలియడం లేదు లేదా అర్థం కావడం లేదు. మా బాల్కనీ లోంచి కనిపిస్తున్న హోర్డింగ్‌లోని ప్రకటన – నాలోని అగ్నికి ఆజ్యం పోస్తోంది.
నా పేరు శారద. నాకు 55 సంవత్సరాలు. మావారి పేరు వెంకటేశ్. ఆయనకి 60 ఏళ్ళు. పాతికేళ్ళ క్రితం కొనుక్కున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో ఉంటాం మేము. పాతికేళ్ళ క్రితం మద్రాసు మహానగరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటంటే చాలామందికి ఓ లగ్జరీ వంటిది. అప్పట్లో మాది పైకొస్తున్న కుటుంబం. మేమిప్పటికీ అదే ఫ్లాట్‌లో ఉంటున్నాం, ఈ ఇల్లే మాకు భారం అయిపోయింది. మరిక్కడే ఎందుకు ఉండడం అంటే, ఇంకెక్కడికి వెళ్ళలేం కనుక… వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం మాకు పెద్దగా ఆసక్తి కూడా లేదు.
పరిమళని కలవడం నాకు బాగా చిరాకు కలిగించింది. పరిమళ కుటుంబం పదేళ్ళ క్రితం మా పక్కింట్లో ఉండేవారు. తర్వాత కొన్నాళ్ళకి ట్రిప్లికేన్‌కి వెళ్ళిపోయారు. పరిమళ ఈ రోజు ఇంత సంతోషంగా ఉంటుందని నేనెన్నడూ ఊహించలేదు. పరిమళ చేసే మూర్ఖపు పనుల వల్ల భవిష్యత్తులో తానెంతో బాధపడుతుందనీ, నా తెలివైన చర్యల వల్ల నేనెంతో సంతోషంగా ఉంటానని అనుకున్నాను. నేను మేధావిననీ, నన్ను నేను కాపాడుకోగలననీ భావించాను.
కానీ నేను పరిమళ చేతిలో పరాజయం పొందాను. పూర్తిగా ఓడిపోయాను.
నాకు పెళ్ళయ్యే సమయానికి సుమారుగా 30 ఏళ్ళు. మావారిది ఉమ్మడి కుటుంబం. ఆయన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అమ్మ… వీళ్ళే కాకుండా ఆయన బాబాయి పిల్లలు కూడా ఉండేవారు. ఇక రోజూ వచ్చి పోయే బంధువుల మాట చెప్పనే అక్కర్లేదు. ఇంత పెద్ద కుటుంబంలో ఉండాలని నేను ఏనాడూ అనుకోలేదు. నాకున్నది ఒకే ఒక జీవితం. దాన్ని నేను కోరుకున్నట్లుగా జీవించాలని అనుకున్నాను. వేరు కాపురం పెడదామని మావారిని ఒత్తిడి చేశాను. కుటుంబ పోషణ కోసం కావాలంటే డబ్బిద్దామని నచ్చజెప్పాను. ఆయన ఒప్పుకోలేదు. నేనేం చిన్నపిల్లని కాదుగా… అంత సులువుగా ఓటమిని ఒప్పుకోడానికి. నాకూ, మా అత్తమామలకి పొసిగేది కాదు. రోజూ ఇంట్లో గొడవలే. చివరికి వాళ్ళే మమ్మల్ని వేరు ఉండమని అడిగారు. మా ఆయన వాళ్ళ కుటుంబానికి దోచి పెట్టకుండా జాగ్రత్తపడ్డాను. నేను కూడా ఉద్యోగంలో చేరాను. ఈ ఇల్లు కొనుక్కున్నాం. మా అత్తమామలతో మాకు పెద్దగా మాటలు లేవు. మా ఆడపడుచుకి పెళ్ళి చేసి, ఉన్నంతలో మా మరుదులని స్థిరపరిచారు మా మావగారు. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూసొచ్చేవాళ్ళం. కొంతకాలానికి నేను తల్లినయ్యాను.
ఈ సమయంలోనే పరిమళ వాళ్ళు మా పక్కింట్లోకి అద్దెకి దిగారు. వాళ్ళదీ పెద్ద కుటుంబమే. అత్తగారూ, మావగారు, మరుదులు, ఆడపడుచులు, ఇంకా పినమావగారి పిల్లలు… ఇలా చాలామందే ఉండేవారా ఇంట్లో. నాకు నా పెళ్ళయిన కొత్తలో మా అత్తగారిల్లు ఉన్న పద్ధతి గుర్తొచ్చేది.
అయితే పరిమళ నాలా గడుసుది కాదు. అమాయకురాలు. నెమ్మదిగా మాట్లాడేది, ఎవరితోనూ గొడవ పెట్టుకునేది కాదు. చిరునవ్వుతో కుటుంబంలోని అందరికీ సేవలు చేసేది. ఎంతో మంది బంధువులు. పెద మావగారు, పెద అత్తగారు, పినమావగారు, పినత్తగారు… వాళ్ళ పిల్లలు, మనవలు… వచ్చి పోతుండేవారు. వీళ్ళందరికి వినయంగా వండి వడ్డించేది పరిమళ.
ఈ తాబేదారు పద్ధతి మార్చుకోమని నేను పరిమళకి ఎన్నోసార్లు చెప్పాను. వేరు కాపురం పెట్టుకుని తన బ్రతుకు తనని బ్రతకమని సలహా ఇచ్చాను. భర్త తెచ్చేదంతా బంధువులకి ధారపోస్తూ ఇదే ఇంట్లో ఉంటే తన కోసం, తన పిల్లల కోసం ఏమీ మిగుల్చుకోలేదని హెచ్చరించాను. కుటుంబం నుంచి విడివడి తన బాగు తనని చూసుకోమన్నాను. ఆమె ఓ చిరునవ్వు నవ్వేసేది, నా మాటలు పట్టించుకునేది కాదు. కొన్నాళ్ళకి నేనూ చెప్పడం మానేశాను.
ఆమెకి సలహాలివ్వడం ఎందుకు మానేశానంటే, నాకూ ఆమెతో అవసరం ఉంది. నాకెంతో సాయం చేస్తుంది. దాన్ని నేను కోల్పోవాలని అనుకోలేదు. మా పిల్లలు బడి నుంచి రాగానే తను పిల్లల్ని వాళ్ళింట్లో కూర్చోబెట్టి, సాయంత్రం నేను ఇంటికి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకునేది.
పరిమళ లేకపోతే, నేనసలు ఉద్యోగం చేయగలిగేదాన్నే కాదు. నేను రోజూ తొందరగా ఇంటికి రావాల్సి వచ్చేది. మా ఆయన నగరానికి దూరంగా ఉద్యోగం చేసేవారు. వాళ్ళ అత్తామామల్లానే, నేనూ కూడా పరిమళని వాడుకున్నాను.
మేము, మా పిల్లలు రాజాల్లా జీవించాం. నాకో అబ్బాయి, ఓ అమ్మాయి. పరిమళకి కూడా అంతే. ఓ కొడుకు, ఓ కూతురు. మేము ప్రతీ వారాంతం హోటల్‌కి వెళ్ళేవాళ్ళం. ప్రతీ నెలాఖరు లోనూ ఓ వినోద కార్యక్రమానికి, ప్రతీ ఏడాది చివర్లో కొత్త ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్ళేవాళ్ళం. పరిమళా, వాళ్ళ పిల్లలు ఇలాంటివాటికి నోచుకోలేదు. వాళ్ళు హోటళ్ళకి గాని సినిమాలకి గాను వెళ్ళడం చాలా అరుదు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మందంతా కదలాల్సిందే.
పరిమళ వాళ్ళ ఆయన తన సొంత కుటుంబం మీద కన్నా ఉమ్మడి కుటుంబం మీద ఎక్కువ ఖర్చు పెడతాడు. దూరపు బంధువులకి సైతం సాయం చేస్తాడు. అదంతా దుబారా అని నా ఉద్దేశం. నిజానికి ఆయన మావారికన్నా ఎక్కువే సంపాదిస్తాడు. కాని ఆయనకి గాని పరిమళకి గాని తమ భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం తెలియనే తెలియదు.
మేము షేర్లు, స్టాకులు, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, భూములలోనూ మదుపు చేశాం. వీటి సాయంతోనే నేను మా అబ్బాయిని ఇంజనీరుని, అమ్మాయిని డాక్టర్ చేయగాలిగాను. వీళ్ళ కాలేజి చదువులకే మేము సుమారుగా యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. మావారి తరపు బంధువుల బరువు బాధ్యతలు మేం మోయలేదు కాబట్టే ఇది సాధ్యమైంది.
పరిమళ పిల్లలు మాములు చదువులు చదివారు. కొడుకు బిఎస్సీ కెమిస్ట్రీ చదివాడు, అమ్మాయి బి.కామ్ చేసింది. ఈ మాత్రం చదువులకే వాళ్ళెంతో కష్టపడ్డారు. విదేశాల్లో చదువుకోడానికి మా అబ్బాయిని నేను స్పాన్సర్ చేసాను. అక్కడే ఎంఎస్ చేశాడు. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. పై చదువులకు మా అమ్మాయి యు.కె. వెళ్ళింది.
పరిమళ కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్ అయ్యాడు. కూతురు బి.కామ్ తర్వాత ఏదో నర్సరీ స్కూల్‌లో టీచర్‌గా చేరింది. పరిమళ మూర్ఖత్వం పట్ల నాకు విచారం కలిగేది. మా పిల్లల్ని తన పిల్లలతో పోల్చి చూసి, ఆమె తన జీవితాన్ని, పిల్లల జీవితాన్ని ఎలా పాడు చేసుకుందో చెబుతూంటాను. పాపం పరిమళ, ఈ మాటల్ని కూడా నవ్వుతూనే వినేది. ఎప్పుడు ప్రతిస్పందించేది కాదు.
పరిమళ పట్ల జాలి కలిగేది.
అమెరికాలో నా కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడు. మాకిష్టం లేకపోయినా ఆ పెళ్ళికి మేము అంగీకరించాల్సి వచ్చింది. ఆ విషయంలో మేమేమీ చేయలేకపోయాం. నా కొడుకు కోడలు గ్రీన్‌కార్డ్ సంపాదించుకుని అక్కడే స్థిరపడ్డారు. కొన్నాళ్ళకి మా కోడలు గర్భవతని తెలిసింది. తొమ్మిది నెలలు గడిచాక మాకు మనవడు పుట్టాడని తెలిసింది. నేనూ మా ఆయన వచ్చి సాయంగా ఉంటామని మా అబ్బాయితో అన్నాము. మాకు ‘ఇబ్బంది’ కలిగించకూడదనుకున్నాడు మా అబ్బాయి. ఆ ఇబ్బందేదో వాళ్ళ అత్తగారూ, మావగార్లనే పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత మావాడి అత్తగారు, మావగారు అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు.
మా అమ్మాయిని యు.కె. లోనే మరో భారతీయ వైద్యుడికిచ్చి పెళ్ళి చేశాం. తనూ అక్కడే స్థిరపడిపోయింది. మేము అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటూంటాం. రోజూవారి పనులు, అత్తామామలు, పిల్లలు, భర్త… వీళ్ళందరితోనూ అమ్మాయి తీరుబడి లేకుండా ఉంటుంది.
సుమారుగా పదేళ్ళ క్రితం, పరిమళ వాళ్ళ కుటుంబం ట్రిప్లికేన్‌కి వెళ్ళిపోయారు. క్రమంగా మా మధ్య సంబంధాలు తెగిపోయాయి.
మావారు రిటైరైపోయారు. నేనూ ఉద్యోగం మానేశాను. రోజూ పొద్దున్నే లేస్తాం. నాలుగు వైపులా ఉన్న రంగు వెలసిన గోడలని చూస్తాం. అవి ఒకప్పటి మా తీరికలేని జీవితాలకి ప్రతీకలని అనుకుంటాను. పైకప్పు కేసి, నేల గచ్చు కేసి, గోడల కేసి చూసుకుంటాం. మా పిల్లలతో గడిపిన రోజులని గుర్తు చేసుకుంటాం. కాసేపు అలా నడిచి వద్దామని గుడికి గాని, పార్క్‌కి గాని బయల్దేరదీస్తాను మా వారిని. ఒక్కోసారి మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకుంటాం… ఒక్కోసారి అస్సలు మాట్లాడుకోం.
కాలక్షేపం కోసం ఒకదాని తర్వాత మరొకటిగా టివి సీరియళ్ళు చూస్తాం. కుటుంబాలని విడదీసే కోడళ్ళను టీవీ సీరియళ్ళలో చూసినప్పుడు నాకేదో అయిపోతుంది. అలాంటప్పుడు మావారు నన్ను ఆ పాత్రధారులతో మనసులో పోల్చుకుంటారు, చాలాసేపటి వరకూ నాతో మాట్లాడరు. ఆయనకి మరో మార్గం లేదు మరి. ఆయన సంతోషాన్ని పోగొట్టింది నేనేనని అనుకుంటూంటారు. నేనే లేకపోతే, ఆయన కుటుంబం ఈ పాటికి ఆయన్ని పీల్చి పిప్పి చేసి నడిరోడ్డు మీద పడేసి ఉండేదని గ్రహించరు.
మేము ఎవరిళ్ళకీ వెళ్ళం. ఎవరితోనూ పెద్దగా సంబంధాలు ఏర్పరుచుకోనందుకు నేనేం బాధపడను. మా అత్తామామలు ఎప్పుడో చనిపోయారు. నా తరపు వాళ్ళతో గాని, ఆయన తరఫువాళ్లతో గాని మాకు ఎవరితోనూ రాకపోకల్లేవు, మాటామంతీ లేవు. అయినా కొత్తగా మళ్ళీ మొదలుపెట్టాలంటే ఎంతో కష్టం. అందుకే మేం ఒంటరిగానే ఉంటాం. ఆర్థికంగా మాకేమీ ఇబ్బందులు లేవు. మా పిల్లలపై ఖర్చు చేయగా మిగిలిన సొమ్ము మాకింకో 15-20 ఏళ్ళ వరకూ సరిపోతుంది. అన్నేళ్ళు ఎలాగూ బ్రతకం కాబట్టి ఇబ్బంది ఉండదు.
ఈ సమయంలోనే, ఓ రోజు ట్రిప్లికేన్ పార్థసారథి ఆలయంలో పరిమళ కలిసింది.
పరిమళ అలాగే ఉంది. పెద్దగా మారలేదు. కాని నేను మారాను. ముసలిదానిలా కనిపిస్తున్నాను. తను నా చేతులని ఆప్యాయంగా స్పృశించింది. మేము చాలా సేపు మాట్లాడుకున్నాం. ట్రిప్లికేన్‌లోని వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. వాళ్ళిల్లు అంత పెద్దదా అని నాకు ఆశ్చర్యం కలిగింది. నాకు గుర్తున్నంత వరకూ వాళ్ళు ట్రిప్లికేన్‌లో ఓ చిన్నింట్లో దిగారు.
“నిజానికిది మా వారి బాబయిగారి ఇల్లు. ఆయన మాకు అమ్మేశారు. మా పినమావగారు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయికి మా ఆయన సాయం చేశారు. మా పినమావగారూ, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అందుకని మాకీ ఇల్లు తక్కువ ధరకే అమ్మేశారు.” చెప్పింది పరిమళ.
“ఏ పినమావగారు? మీకు చాలామంది బంధువులున్నారుగా…” అడిగాను నేను.
“రాజా మావయ్యగారు. నీకూ తెలిసే ఉంటుంది. వాళ్ళబ్బాయి ఎక్కువ రోజులు మా ఇంట్లోనే ఉండేవాడు. ఆ కుర్రాడు నైట్ కాలేజీలో చదివేవాడు. కాలేజీకి దగ్గర అని మా ఇంట్లో ఉండేవాడు…” అంటూ గుర్తు చేయడానికి ప్రయత్నించింది పరిమళ.
“అవునా… ఇంతకీ మీ పిల్లలేం చేస్తున్నారు?” అడిగాను.
“మా వాడు మెడికల్ రిప్రజెంటేటివ్‌గానే నీకు తెలుసు. కాని మా సుందరం ఉన్నాడు చూశావు… మా అబ్బాయి చేత ముంబయిలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివించాడు. ఆ తర్వాత మా వాడు ఐఐటి, ఢిల్లీ నుంచి పిహెచ్‌డి చేశాడు. ఐఐటిలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్-డాక్టరల్ రీసెర్చ్ చేస్తున్నాడు. మా అమ్మాయి నర్సరీ స్కూల్‌లో టీచర్‌గా ఉండేది. కాని మూర్తి ఊరుకోలేదు. తనతో పాటు తీసుకువెళ్ళి సి.ఎ. చదివించారు. ఇప్పుడు అమ్మాయి తన భర్తతో కలసి ముంబయిలో ఆడిటర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది…” అని చెబుతూ-
“నువ్వు మా పిల్లల పెళ్ళిళ్ళకి రానే రాలేదు!” అంది పరిమళ.
“అవును. అప్పట్లో ఏవో సమస్యల వల్ల పెళ్ళిళ్ళకి రాలేకపోయాను…” అని చెప్పి, “ఈ సుందరం, మూర్తి ఎవరు? నాకు గుర్తు రావడం లేదు,” అన్నాను.
“సుందరం మా బంధువుల కుర్రాడే. తెల్లగా, సన్నగా ఉండేవాడు. నువ్వూ చూశావు. ఓసారి అతనికి పెద్ద యాక్సిడెంట్ అయి ట్రీట్‌మెంట్‌కి బాగా డబ్బు ఖర్చయింది. మా మావగారు అత్తగారివి నావి నగలు, మా ఇల్లు తనఖా పెట్టి ఆ కుర్రాడికి చికిత్స చేయించారు. దేవుడి దయ. ఆ అబ్బాయి కోలుకున్నాడు. తర్వాత బార్క్‌లో సైంటిస్ట్ అయ్యాడు. మేమంటే ఆ కుర్రాడికి బాగా అభిమానం.” అని చెప్పి, “మూర్తి వాళ్ళు మన కాంపౌండ్‌లోనే ఉండేవాళ్ళు గుర్తులేదా?” అని అడిగింది పరిమళ.
“మూర్తి అంటే… గ్రౌండ్ ఫ్లోర్‍లో ఉండే మూర్తిగారా? ఆయన మీకెందుకు సాయం చేశాడు?” అడిగాను ఆశ్చర్యంగా.
“నిజమే. సాయం చేయడానికి పెద్ద కారణం కూడా ఏమీ లేదు. మేము ఆయనకి ఎటువంటి మేలు చేయలేదు. ఒకసారి వాళ్ళ ఆవిడకి ఆరోగ్యం బాలేకపోతే… నెల రోజుల పాటు వాళ్ళకి మా ఇంటి నుంచే భోజనం పంపాను. అంతే. మిగతాదంతా దేవుడి దయ…” చెప్పింది పరిమళ.
ఇంట్లో ఎవరూ కనపడకపోయేసరికి, “ఇంట్లో నువ్వూ, మీ ఆయనేనా ఉండేది?” అన్నాను.
“లేదు. అబ్బాయి కోడలు మాతోనే ఉంటారు. వీళ్ళంతా బయటకి వెళ్ళారు. ఇప్పుడు నేను, మావారు మా అత్తమామల పాత్ర ధరిస్తున్నాం. రోజూ మా ఇంటికి ఎంతోమంది వచ్చి పోతూంటారు. పని అంతా కోడలి మీదే వదిలేసి తనని ఇబ్బంది పెట్టను. నాకు చేతనైన సాయం చేస్తాను. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిచిపోతుంది నాకు. బయటకి వచ్చేది చాలా తక్కువ. నాకు పెద్దగా టైం దొరకదు…” అని చెబుతూ,
“ఈసారి మీవారిని తీసుకుని రా. మిమ్మల్ని చూస్తే మా ఆయన ఎంతో సంతోషిస్తారు…” అని చెప్పింది.
తనకి నిజంగానే సమయం తక్కువని గ్రహించాను. ఈ వయసులో కూడా ఇంత పని చేయాల్సి వస్తున్నందుకు నాకు తనమీద జాలేసింది. ‘పాపం, పరిమళ’ అనుకున్నాను.
వీడ్కోలు చెప్పి అక్కడ్నించి బయల్దేరాను. మా ఇంటి సమీపంలోకి వచ్చాక, నా మూడ్ మారిపోయింది. నాకన్నా పరిమళ ఎంతో సంతోషంగా ఉందని అనిపించింది.
ఎలా…?
నేనెక్కడ తప్పు చేశాను? జీవితంలోని ప్రతీ అంశంలోనూ పరిమళ కంటే నేనే మెరుగు. నేను తెలివైన దాన్ని. పరిమళ తెలివితక్కువది. నేను ఉద్యోగం చేశాను. పరిమళ గృహిణిగా మిగిలిపోయింది. నేనెన్నో ప్రణాళికలతో జీవితాన్ని నడుపుకొచ్చాను. పరిమళకి ఎలాంటి ప్రణాళికలు లేవు. నా పిల్లల్ని నేను ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దాను. పరిమళ ఏమీ చేయలేదు. ఆమె పిల్లలు వాళ్ళంతట వాళ్ళే ప్రొఫెషనల్స్ అయ్యారు. నాకు ఇల్లు ఉంది. పరిమళకి లేదు. కాని అదృష్టవశాత్తు… ప్రస్తుతం ఆమెకో ఇల్లుంది. అయినా ఎందుకో… తనే నాకన్నా సంతోషంగా ఉన్నట్లనిపిస్తోంది.
నేను చేసినన్ని ఇన్వెస్ట్‌మెంట్లు తను చేయలేదు. నా పిల్లల కోసం నేను ఖర్చు చేసినట్లుగా తను తన పిల్లల కోసం ఖర్చు చేయలేదు. మరి ఆమె దేంట్లో ఇన్వెస్ట్ చేసింది? ఈ రోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతోంది?
సరిగ్గా, ఈ ఆలోచనల్లో ఉన్నప్పుడే నేను మా బాల్కనీ లోంచి ఆ హోర్డింగ్‌లోని ప్రకటనని చూశాను. అందులో “వుయ్ ఇన్వెస్ట్ ఇన్ పీపుల్!” అని తాటికాయంత అక్షరాలతో రాసుంది.
దాంతో నాకు వెర్రెత్తిపోయింది. ఆ వాక్యం ఎంత మూర్ఖపు ఆలోచనో, ఎంత అసంబద్ధమో, ఎంత అవివేకపు భావనో… అని అనిపించింది. ‘మనుషులపై మదుపు’ అనేది ఎక్కడైనా ఉందా? మూర్ఖత్వం కదూ…!
---------------------------------------------------------
రచన: కొల్లూరి సోమ శంకర్,
మూలం: రాజారామ్ బాలాజీ,
(ఆంగ్ల మూలం: Invest-men-ts, 2007.)
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment