Monday, February 18, 2019

భార్యోత్సాహం


భార్యోత్సాహం




సాహితీమిత్రులారా!

పందిట్లో ఫెళ్ళున పెళ్లి అయిపోతోంది. పశుపతి లహరి మెళ్ళో మూడు ముళ్ళు వేశాడు. మూడో ముడి వేసేటప్పుడు ఆనంద పారవశ్యంతో, అనురాగంతో, అభిమానంతో, ఆపేక్షతో, ప్రేమతో చూపుడు వేలు, బొటన వేలుతో లహరి మెడమీద మృదువుగా సున్నితంగా సుదీర్ఘంగా స్పృశించాడు. ఊహలకి చేతలకి మధ్య తేడా ఉంటుందని, కొన్ని సందర్భాలలో అర్ధాలకి అపార్ధాలకి మధ్య గీత ఉండదని పాపం పశుపతికి తెలియదు. మృదువుగా చిలిపిగా ప్రేమగా పుణికాను అని పశుపతి అనుకుంటే కావాలని గిచ్చాడేమోనని లహరి అపార్ధం చేసుకుంది. బుగ్గలు పుణకడానికి గిచ్చడానికి క్రియ ఒకటే, ఉపయోగించే శక్తి వేరు. సాధారణంగా అది పుణికించుకునే వారి భావన పైనే ఆధారపడి ఉంటుంది.

లహరి వేరేగా అనుకోవడంలో ఆమె తప్పు లేదు. ఎందుకంటే, అర్ధరాత్రి రెండు గంటలకి మంగళ స్నానం చేసి, గౌరీ పూజలో మూడుగంటలు కూర్చుని, ఆ తరువాత బుట్టలో ఇంకో గంట ముడుచుకుని కూర్చుని, ఆ తరువాత ఇద్దరు బక్క మేనమామలు చెరో వైపు పట్టుకొని సుమారు ఓ పది మీటర్లు రొప్పుతూ రోజుతూ మోసుకొచ్చేటప్పుడు, ఎక్కడ పడవేస్తారో అనే భయంతో బిగుసుకొని పోయి ఇంకా ముడుచుకొని కూర్చుని, పెళ్లి పీటల దగ్గర కూడా బుట్టలో ఇంకో అరగంట కూచుని, కాళ్ళు చేతులు తిమ్మిరెక్కి, అప్పుడప్పుడే అవి తన స్వాధీనంలోకి వస్తున్న సమయంలో ఆమె అలా అనుకోవడం బహుశా తప్పు కాదేమో. మేనత్త తన తల మీద ఒక చేయి వేసి కిందకి వత్తుతూ, రెండో చేతితో జడ ఎత్తి పట్టుకొని, మూడు ముళ్ళ కార్యక్రమంలో సహకారం అందిస్తున్న అప్పటి స్థితిలో లహరి ఏమీ చేయలేక తన ఆగ్రహ వీక్షణాలు పశుపతి పాదాలపైనే ప్రసరించవలసి వచ్చింది.

ఆ తరువాత కొంత సేపటికి గానీ మోకాలు ముడిచి కూర్చున్న లహరికి లేచి నుంచునే అవకాశం రాలేదు. లేచి నుంచుని పూర్తిగా కాళ్ళు చేతులు స్వాధీనం లోకి తెచ్చుకుంది. పురోహితుడైన శ్రీ బ్రహ్మగారు, “అమ్మాయీ, నువ్వు మీ శ్రీవారికి పాదాభివందనం చేయాలి. ఆతరువాత మీ ఇరువురూ ఇరువైపులా పెద్దవారికి పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకోవాలి,” అని ఆదేశించారు. ఆ మాట వినగానే పశుపతి బ్రహ్మానంద భరితుడై కాళ్ళు రెండూ దగ్గర చేసి, చేతులు కట్టుకొని వివేకానంద ముద్ర ధరించిన వాడై పక్కనున్న బ్రహ్మగారి చెవిలో రహస్యంగా, “స్వామీ, అన్యోన్య దాంపత్యాన్ని ప్రసాదించే భార్యోత్సాహ పద్యం ఉందట గదా. నాకు ఆ పద్యం చెప్తారా?” అని అడిగాడు. “కాదు నాయనా! అప్పుడే కాదు. దానికింకా కొంచెం సమయం ఉంది. నేను నీకు తగిన సమయంలో వివరిస్తాను,” అని బ్రహ్మగారు పశుపతి ఉత్సాహానికి పలుపుతాడు కట్టారు.

భార్య అనే పదవిని అధిరోహించిన లహరి మెల్లిగా ముందుకు వంగి పశుపతి పాదాలు తాకింది. ఆ స్పర్శతో ఆనందోత్సాహాలు నింగి నంటగా పశుపతి తన్మయత్వం చెందాడు. కొద్ది క్షణాలు తన్మయత్వంలో మునిగిన పశుపతి, ఉన్నట్టుండి అబ్బా! అంటూ పాదం వెనక్కి తీసుకున్నాడు. అప్పటికే లహరి లేచి నుంచుంది. పశుపతికి తన పాదం మీద గోటి గీత, లహరి మొహంలో చిరునవ్వు కనిపించాయి. పశుపతి తొందర పడి అపార్ధం చేసుకోలేదు. అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రేమగా పాదం నిమురుతూ, ఒత్తుతుండగా గోరు గీసుకుందేమోనని సరిపెట్టుకోబోయాడు, కానీ ఎర్రగా ఉన్న గీటు మండుతుంటే ఎటూ తేల్చుకోలేకపోయాడు.

తరువాత కార్యక్రమాలన్నీ అయిన తరువాత తిరుగు ప్రయాణంలో బ్రహ్మగారి పక్కన కూర్చుని అడిగాడు పశుపతి.

“స్వామీ, ఇప్పుడైనా నాకు భార్యోత్సాహ పద్యం ఉపదేశిస్తారా?”

“భార్యోత్సాహము భర్తకు
భార్యను పెండ్లాడినపుడు గలుగదు జనులా
భార్యను గుణవతి యని పొగడగ
భార్యోత్సాహము పతికి గలుగును సుమతీ!”

రాగయుక్తంగా పాడారు బ్రహ్మగారు.

“స్వామీ, పద్యంలో ఏదో తేడా ఉన్నట్టుంది. పతివ్రత అని ఉండాలేమో,” అన్నాడు పశుపతి. బ్రహ్మగారు చిరునవ్వు నవ్వారు. దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదిలారు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచారు.

“నాయనా, సత్యకాలం నాటి పతివ్రతల నిర్వచనం మారిపోయింది. ద్వాపరయుగంలోనే వామపాదంతో ఫెడేల్మని సత్యభామ తన్నితే, నా కిరీటం తగిలి నీ పాదానికి నొప్పి గలిగిందేమో అన్నాడు శ్రీకృష్ణుడు. కలియుగంలో పరిస్థితి ఇంకా మారింది. ప్రస్తుత కాలంలో భార్య అనుకూలవతి అయితేనే గుణవతి, పతివ్రత అనిపించుకుంటుంది. అలా భార్య అనుకూలవతి అనిపించుకోవడంలో భర్త పాత్ర ఇంకా పెరిగింది. శ్రీకృష్ణుడే ఆదర్శంగా పతులు ప్రవర్తిస్తేనే భార్య గుణవతి అనిపించుకుంటుంది.”

“అర్ధం కాలేదు స్వామీ! కొంచెం వివరించండి.”

“నాయనా, అప్పుడెప్పుడో శ్రీ మునిమాణిక్యం, “అనుకూలవతి అంటే కొద్దిగా, తేలికగా, సరసంగా, ఏదో సంసార పక్షంగా కలహించేది అని అర్ధం. అంతే కానీ బొత్తిగా మొగుడు ఏమన్నా నోరు మూసుకొని కూర్చునేది అని కాదు. ఇది అనాదినుంచి వస్తున్న సదాచారం,” అని నిర్వచించారు. ఇంకా వివరించాలంటే మీ ఆవిడ ఏదో అంటుంది. నువ్వు బదులుగా ఏదో అంటావు. ఆవిడ గొంతు పెంచుతుంది. నువ్వూ పెంచుతావు. అప్పుడు ఏమౌతుంది? మీ ఇంట్లో టివి పక్కింటి వాళ్లకి కనిపిస్తే, మీ రేడియో పక్కింటి పక్కింటి వాళ్లకి వినిపిస్తుంది. మీ ఆవిడ ఏమన్నా అంటే నువ్వు వినీ విననట్టు ఊరుకుంటే మీ ఆవిడ ఇంకొంచెం సణిగి ఊరుకుంటుంది. మీ ఇంట్లో దూరదర్శన, దూరశ్రవణ తరంగాలు పక్కింటికి చేరవు. అందువల్ల ఏమైననూ నోరు మూసుకొని భరించవలెను. తమలపాకోపాఖ్యానము తెలుసును గదా నీకు?

“తెలియదు స్వామీ!”

“విను. నీవంటి సరిక్రొత్త భర్త యొకడు మొదటి రాత్రి ప్రణయ శృంగార సరసోల్లాసుడై, పానుపు మీద పడియున్న ఒక లేత తమలపాకుతో తన భార్యను చిలిపిగా చెక్కిలిపై తట్టెను. ఆ నూతన సతి అనుకూలవతి. భర్తకు అంతే చిలిపిగా జవాబిచ్చుటకు చుట్టూ వెంటనే వెతికెను. వేరొక తమలపాకు దొరకనందున మంచమునకు వారగా నిలబెట్టి ఉంచిన నిడుపాటి తలుపుచెక్కతో భర్తను ఒకటి ఫెడీమని కొట్టెను. తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నేరెండంటాననే సామెత ఆ విధముగా పుట్టెను.”

పశుపతి అప్రయత్నంగా కాలిపై ఇంకా మండుతున్న గోటి గీత వంక చూసుకున్నాడు. ఎందుకలా చూసుకోవాలనిపించిందో అతనికి అర్థం కాలేదు. బ్రహ్మగారు ఉపదేశం కొనసాగించారు.

“అది అట్లుంచి ఇప్పుడు ఆ భర్త బాధతో పెద్దగా అరిచిన ఏమౌతుంది? మొదటి రాత్రి గది లోనుండి అతని కేకలు విన్నవారికి అపోహలు గల్గవా? వారి మదిలో ఊహలు సెన్సారులు లేకనే ఎంత దూరమైననూ పోయి ఏవేవో దర్శిస్తాయి గదా. అందుకనే నేను చెప్పినది. భర్తలు ఏమైననూ సరే నోరు మూసుకొని భరించవలెను. అందుకు వేరే దారి లేదు. కేవలం ఆ రకం గానే, నీ భార్య గుణవతి అనిన్నూ నీవు గొప్ప తపస్సంపన్నుడవనిన్నూ కీర్తిని పొందెదరు. తపస్సు చేసేవాళ్ళు నోరు, ముక్కు, చెవులు మూసుకొని కూర్చుంటారు. చాలా మంది పతివ్రతల భర్తలు మహర్షులు, బ్రహ్మర్షులు అని గుర్తు పెట్టుకోవాలి. నువ్వు తపస్సంపన్నుడివి అనిపించుకోవాలంటే నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు ముఖ్యంగా నీ నాలుక, చెవులు భోషాణం లోనో ఇనప్పెట్టె లోనో భద్రపరుచుకొని రావాలి.”

“స్వామీ, ఇది ఆచరణ సాధ్యం కాదేమో!?”

“భార్యోత్సాహ పద్యం పాడుకోవాలంటే సాధ్యం చేసుకోక తప్పదు నాయనా. అందుకనే చెప్తున్నాను విను. ఇది ఇంత అసాధ్యమైన పని కాబట్టే నీకు అడిగిన వెంటనే చెప్పలేదు. నా మాట పాటించి ఆ పద్యం మర్చిపో.”

బ్రహ్మగారు ఎంత చెప్పినా పశుపతికి భార్యోత్సాహ పద్యం పాడుకోవాలనే ఉబలాటం తగ్గలేదు. కష్టమైనా, నిష్ఠురమైనా సాధించాలని బలంగా కోరుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కీర్తి కండూతి పుడుతుంది. లహరి మహా దొడ్డ ఇల్లాలు అని భార్య పేరు పొందాలని, తద్వారా లహరీపశుపతులు ఆదర్శ దంపతులు, ఒకరి కోసమే మరొకరు పుట్టారు — అనిపించుకోవాలని తీర్మానించుకున్నాడు. ఘోర ప్రతిజ్ఞ చేసుకున్నాడు.

పెళ్ళైన పదిహేను రోజులకి హైదరాబాదులో కాపురం పెట్టాడు పశుపతి. కూతురుతో కాపురం పెట్టించడానికి వచ్చిన అత్తగారు ఉన్న వారం రోజులూ కొత్తకాపురాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలో లహరికి తీరికగా బోధించారు. శిక్షణ పూర్తి చేసి ఆఖరున ఊరికి తిరిగి వెళ్ళే ముందు కూతురికి బ్రహ్మోపదేశం చేసి మరీ వెళ్ళారు (లహరి నాన్నగారు మౌనంగా పెట్టే బేడా మోస్తూ ఆవిడను అనుసరించారు.)

“ఒసే, అమ్మాయ్! పండంటి కాపురానికి ఒకే ఒక్క సూత్రం — మొగుడిని చెప్పుచేతలలో పెట్టుకొని, నువ్వు గీసిన గీటు దాటకుండా చెయ్యడం. ఇది కాపురం పెట్టిన మొదటి ఐదారు నెలల్లోనే చేసెయ్యాలి. ఆ తరువాత వాడు ఏకు మేకై కూర్చుంటాడు. ఇది ఒక రకమైన యుద్ధం. యుద్ధంలో నియమాలు ఉండవు. మనం పెట్టిందే నియమం. విజయోస్తు.”

తల్లి వెళ్ళిన మరుసటి రోజు లహరి వంట మొదలు పెట్టింది. పశుపతి 9గంటల బస్సులో ఆఫీసుకి వెళతాడు. ఉదయమే కాలనీలో ఉన్న హోటల్ నుంచి తనకి, భార్యకి టిఫిన్ తెచ్చాడు. ఏడుగంటలకి నిద్ర లేచిన లహరి టిఫిన్ చేసి, వంటకి ఉపక్రమించింది. తొమ్మిది లోపు చేసి భర్తకి బాక్స్‌లో పెట్టి ఇవ్వాలి. ఇద్దరు అన్నల తరువాత పుట్టిన ఒకే అమ్మాయి అవటంతో గారాబంగా పెరిగింది పుట్టింట్లో. అమ్మ వంట చేస్తుంటే చూడడమే తప్ప ఎప్పుడూ వంట చేయలేదు. పెళ్లి కుదిరిన తరువాత రెండు వంటల పుస్తకాలు కొంది కానీ చేయలేదు. తేలికగా చెయ్యచ్చు అని మొదటి రోజు వంట వేపుళ్ళతో మొదలు పెట్టింది. వంట చేయడం కేవలం చూడడమే తెలిసిన లహరి ఉప్పు కారం చూపులతో కొలవలేక ఇబ్బంది పడింది. పుస్తకాలల్లో కూడా తగినంత, మీ అభిరుచికి తగ్గట్టుగా అనే రాశారు కానీ ఎంత వేయాలో చెప్పలేదు. వాళ్ళ అమ్మ కూడా చేతితోనే వేసేది. లహరికి తెలిసి కనీసం చెంచా కూడా ఉపయోగించలేదు. వేపుళ్ళలో ఉజ్జాయింపుగా వాళ్ళ అమ్మ వేసినంత వేసింది కానీ ఆవిడ ఐదుగురికి వండేది. లహరి ఇద్దరికే వండుతున్నానని చూసుకోలేదు.

“ఏవండీ, కూరలో కారం ఎక్కువ అయిందా?” రాత్రికి ఇంటికి వచ్చిన భర్తని భయం భయంగానే అడిగింది లహరి.

“నువ్వేం కంగారు పడకోయ్. పర్లేదులే. నాలుగైదు రోజుల్లో నీకే తెలిసిపోతుంది ఉప్పూ కారం ఎలా వెయ్యాలో!”

విప్పారిన భార్య కళ్ళలో భయం చూసి పశుపతి కరిగిపోయి చిరునవ్వుతో అలా అనడానికి కారణం అతని మనసులో పుట్టిన అవ్యాజమైన ప్రేమ. అది పశుపతిని అడుసులో కాలు వేయించింది. అంతటితో ఆగలేదు తన మెడకు తానే తాడు తగిలించుకునేలా చేసింది. ఆ కథాసంవిధానంబెట్టిదనిన…

నాలుగైదు రోజులు కాస్తా పది పదిహేను రోజులైనాయి. కూరలో ఉప్పు ఎక్కువైనా, పచ్చడిలో కారం తక్కువైనా పశుపతి ఏమీ మాట్లాడలేదు. తియ్యటి పులుసులు, తీపే లేని పాయసాలు కూడా నవ్వుతూనే ఆరగించాడు. శరీరం బెదిరించింది. నాలుక మందగించింది. గత మూడు వారాలుగా తన జిహ్వపై జరిగిన దాడిని సింహావలోకనం చేసుకున్నాడు. ఇంక ఉపేక్షించరాదని నిర్ణయించుకున్నాడు.

మర్నాడు ఉదయం హోటల్నుంచి తెచ్చిన ఉపాహారమారగించి పశుపతి వంటింట్లోకి ప్రవేశించాడు. లహరి వంకాయలు తరుగుతోంది. వంకాయ కారం పెట్టి కూర చేసే విధానం సోదాహరణంగా వివరిస్తూ చేసి చూపెట్టేడు. లహరి రుచి చూసి, అబ్బ! ఎంత బాగా చేశారండీ, అని మెచ్చుకుంది. ముదితల్ చేయగరాని కూర గలదా మొగుడొచ్చి నేర్పించినన్ అని కూనిరాగం పాడింది. నాలుగు రోజులు ఇల్లా నేర్పేరంటే పూర్తిగా నేర్చేసుకుంటాను అని హామీ కూడా ఇచ్చింది.

పదిరోజులు పశుపతి రకరకాల కూరలు వండి చూపెట్టేడు కానీ లహరికి వంట వంట పట్టలేదు. కానీ, కాబేజీ ఇంత సన్నగా ఎలా తరిగారండీ, దొండకాయ కూర మా అమ్మ కూడా ఇంత బాగా ఎప్పుడూ చెయ్యలేదండీ, పప్పుపులుసు ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియదండీ, అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. తన చేతులను పశుపతిని మెడ చుట్టూ గొలుసులా ఒకట్రెండు సార్లు వేసింది. పశుపతి అవ్యాజమైన ప్రేమకు ఆ రకంగా ఎరువేసి నీళ్ళు పోసింది.

పశుపతి మరింతగా రెచ్చిపోయి ద్విగుణీకృతోత్సాహంతో రకరకాల కూరలు రకరకాలుగా వండి వార్చేశాడు ఇంకో పదిహేను రోజులు. మొదటగా పశుపతి గమనించలేదు. రాను రానూ పశుపతి వంట చేస్తుంటే లహరి ముందు వంటగదిలో ఆపైన ముందు గదిలో కూర్చుని పేపరు చదువుకోవడం మొదలు పెట్టింది. గమనించిన తరువాత ఔరా! అనుకున్నాడు. ఔరౌరా! అని కూడా అనుకున్నాడు. తనకు తెలియకుండానే తను ఊబిలోకి దిగిపోయిన గేదెనైనానే అని అనుమానపడ్డాడు. మళ్ళీ అవలోకనాలు, ఆలోకనాలు చేసి సమస్యను మధించి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలని అనుకున్నాడు. ఇంతలో… ఆ రాత్రి లహరి చెప్పింది.

“ఏవండీ, మా ఫ్రెండ్స్ అపర్ణ, శైలజ, మృణాలిని ఆదివారం భోజనానికి వస్తున్నారండీ.”

“సరే, రెండు కూరలు, బిర్యాని, పూరీ కూరా ఇంకో రెండు రకాలు హోటల్ నుంచి తెస్తాను. అన్నం ఇంట్లో వండేద్దాం.”

“అబ్బే. అది కాదండీ మొన్న మాటల సందర్భంలో మా ఆయన వంట బ్రహ్మాండంగా చేస్తారు అని చెప్పానండి. వాళ్ళు నమ్మలేదు. అందుకని నేనే పిలిచానండి, వచ్చి మా ఆయన వంట రుచి చూడండి అని. మరి మీరు చేయనంటే ఎలాగండీ.” అంది లహరి (కొంచెం గోముగా.)

“వంట నేనే చెయ్యాలా!” ఆశ్చర్యపోయాడు పశుపతి. “మీ వాళ్ళందరికీ నేనే వంట చేస్తున్నానని చెప్పేశావా!!” విచారించాడు పశుపతి.

“చుట్టు పక్కల వాళ్ళందరికీ తెలుసు కదండీ, మరి నా ప్రాణ స్నేహితులకి తెలిస్తే తప్పేమిటండీ!?” ఆశ్చర్యంతో కూడిన బాధతో ప్రశ్నించింది లహరి.

“చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసునా!?” బాధతో కూడిన ఆశ్చర్యం ప్రకటించాడు పశుపతి.

“పాలవాడికి, పనిమనిషికి తెలిస్తే ఊరందరికీ తెలుస్తుంది కదండీ!” తాత్పర్యం వివరించింది లహరి.

“అయితే నేనే చెయ్యాలా? ఇప్పుడు వెళ్ళి కూరలు తీసుకు రావాలా?” దీనంగా అడిగాడు పశుపతి.

“కూరలు అవీ అన్నీ సాయంకాలం తెచ్చేశాగా. మీకెందుకూ ఆ శ్రమ.” పొంగిపోతూ అన్నది లహరి. “శైలజ కొబ్బరి సెనగపప్పు వేసి చేసిన కాబేజీ కూర లొట్టలు వేసుకుంటూ తినేస్తుందండి. అపర్ణ పులిహోర అంటే ప్రాణం పెట్టేస్తుందండి. మృణాలినికి పప్పు పులుసు తినాలని ఉందిటండి, అది సాంబారు తప్ప పప్పు పులుసు ఎప్పుడూ తినలేదుటండి,” అంటూ మెనూ కూడా చెప్పేసింది.

ఆదివారం పొద్దు పొద్దున్నే పశుపతి వంటింట్లో జొరబడ్డాడు, భార్యాదేశానుసారం వంట చేయడానికి. తొమ్మిది గంటలకల్లా లహరి స్నేహితురాళ్ళు ముగ్గురూ వచ్చారు. వచ్చి వంటింట్లో వంట చేస్తున్న పశుపతిని పలకరించి వెళ్ళి ముందు గదిలో కూర్చుని లహరితో కబుర్లు మొదలు పెట్టారు. అందువల్ల, పాపం పశుపతికి కనీస సహాయం చేసే అవకాశం కూడా లహరి కోల్పోయింది. కష్టపడి పశుపతి ఒంటరిగా రెండు కూరలు, ఒక పచ్చడి, పప్పుపులుసు, పులిహోర, సేమ్యా పాయసం చేసి, అన్నం వండి అప్పడాలు వేయించి 11 గంటల పదిహేను నిముషాలకి వంట అయిందనిపించి చెమట తుడుచుకున్నాడు. వంటలు అయ్యాయి ఆడవాళ్ళు మడిగట్టుకొని బోజనాలకి లేవచ్చు అని ముందు గదిలోకి వచ్చి ప్రకటన చేశాడు.

“అయ్యో, ఇంకా శైలజ వాళ్ళాయన రాలేదండీ. ఆయన వచ్చిన తరువాత భోజనం చేద్దాం,” అంది లహరి.

“మిగతా ఇద్దరు మొగుళ్ళు రారా?” అడిగాడు లహరిని పశుపతి మెల్లిగా.

“వాళ్ళిద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు కదండీ, హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నారు కదా!” గుర్తు చేసింది లహరి.

అవునుస్మా మరిచిపోయాను ఈ వంటలో పడి అని నిట్టూర్చాడు పశుపతి. ఇంకో అరగంటలో మొగుడుగారు వచ్చారు. ఇంత ఆలస్యం చేసావేమిటి అనూ అని శైలజ కోప్పడింది భర్తని. పశుపతి మొహంలో ఆశ్చర్యార్ధకం గమనించి ఆయనే, నా పేరు అనిల్, మా శైలు నన్నలాగే పిలుస్తుందండి అని వివరణ ఇచ్చాడు. గ్లాడు టు మీట్ యు అని చెయ్యిచ్చాడు. అందుకొని నా పేరు పశుపతి అని చెప్పుకున్నాడు.

“విన్నానండి, మీ గురించి చాలానే,” అన్నాడు అను.

“వంట చేస్తానని విన్నారా?” నీరసంగా నవ్వే ప్రయత్నం నీరసంగా చేశాడు పశుపతి.

“అంతే కాదండి, మీరు చాలా ఆదర్శపతి అని, నేను కూడా మీకు మల్లే ఉండాలని మా శైలు ఎప్పుడూ అంటుంటుంది.”

“అవునండి, నేను అందుకు పూజలు కూడా చేస్తున్నానండీ, తెలుసా!” అంది శైలు.

“పది రోజుల క్రితం ఏమైందో తెలుసా? పాపం పశుపతిగారు ఆఫీసు నుంచి రాత్రి ఎనిమిది గంటలకి విపరీతమైన తలనొప్పితో ఇంటికి వచ్చారుట. మా లహరి సెకండ్ షో సినిమాకి వెళదామందిట. ఆ వేళే చివరి రోజుట ఆ సినిమాకి. అంత తలనొప్పితో కూడా భార్య కోరిక తీర్చడానికి ఆయన సినిమాకి తీసుకెళ్లారట. మీ కెప్పుడు తలనొప్పి వస్తుందా, సినిమాకి తీసుకెళతారా, కెళ్ళరా అని చూస్తున్నాను. ఇప్పటిదాకా మీకు తలనొప్పి రాలేదు కదా!” విచారించింది శైలు.

“పెళ్ళైన తరువాత మనసులు ఇచ్చి పుచ్చుకుంటారు కదండీ, బహుశా మీ ఆయన మీకు తలకాయ కూడా ఇచ్చేసుంటారు,” అన్నాడు పశుపతి నవ్వుతూ.

ఇంకో పది నిముషాల తరవాత భోజనాలకి కూర్చున్నారు అందరూ. తింటున్నంత సేపు పశుపతి పాక ప్రావీణ్యం గురించి పొగడుతూనే ఉన్నారు. ఇక మీదట నలభీమపాకం కాదు నలభీమ పశుపతిపాకం అనాలని మృణాలిని ప్రశంసా పత్రం ప్రదానం చేసింది. అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఓ వెఱ్ఱి నవ్వు నవ్వి ఊరుకున్నాడు పశుపతి. భోజనాలు అయిన తరువాత కబుర్ల కార్యక్రమం కొనసాగింది.

శైలు మెడలో గొలుసు బాగుంది అని లహరి అంది. మొన్నే కొన్నాం ఏభై వేలు మాత్రమే అంది శైలు. చామన చాయ రంగు ఉండే నాకే బాగుంటే పచ్చగా ఉండే నీకు మరింత బాగుంటుంది అంటూ తన మెడలో గొలుసు లహరి మెడలో వేసింది. అవును లహరి మెడలో చాలా బాగుంది అని ముక్తకంఠంతో అందరూ ఒప్పుకున్నారు. లహరి మెడలో గొలుసుకే కొత్త అందం వచ్చింది అన్నారు. అంతే కాదు పశుపతి కూడా లహరికి ఆ గొలుసు కొనాలని సలహా ఇచ్చారు.

ఇప్పుడు ఏభై వేలంటే కష్టమేమో అంది లహరి మెల్లిగా కొంత అసంతృప్తి ధ్వనిస్తూ. అదేమిటే, నలభై వేలు సంపాదించే మా ఆయనే కొనగలినపుడు, అరవై వేలు సంపాదించే మీ ఆయన కొనలేడా అంది పుసుక్కున శైలు. ఏమండీ పశుపతి గారూ మీరూ కొనిపెట్టండి మీ ఆవిడకి అని అపర్ణ కూడా వంత పాడింది. చూద్దాం లెండి అన్నాడు పశుపతి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి మోడల్స్ దొరకవు. మీరు ఓ ఏభై వేలకి చెక్కు ఇవ్వండి, రేపటి మధ్యాహ్నాని కల్లా మీ ఆవిడ మెడలో ఆ గొలుసు ఉండే ఏర్పాటు నేను చేస్తాను అని హామీ ఇచ్చాడు అనూ.

పశుపతి మాట్లాడలేదు కానీ, ఏమండీ చెక్కు బుక్కు తీసుకురానా అని అడిగింది ఆశగా లహరి పశుపతిని. అడకత్తెరలో పోక చెక్కలాగా అవస్థ పడ్డాడు పశుపతి. చేసేదేమీ లేక ఊపీ ఊపనట్టుగా తలూపాడు. లహరి చెంగున దూకి చెక్కుబుక్కు తెచ్చింది.

అనూ అన్నట్టుగానే మర్నాటికి లహరి గొలుసాలంకృత అయింది. నాలుగు రోజుల తరువాత పశుపతి ఫేసుబుక్కులో లహరి ప్రొఫైలు చూశాడు.

“భర్త అనుకూలుడై భార్య మనసులోని కోరికలన్నీ చెప్పకుండా కూడా తీర్చేస్తున్నప్పుడే భార్యకి భర్తోత్సాహం కలుగుతుంది. అటువంటి భర్తోత్సాహం నిన్ననే నాకు కలిగింది. మా అమ్మ చెప్పిన మాట నిజమైంది.” అంటూ ఓ టపా వేసింది. 346 లైకులు, 124 కామెంట్లు కూడా వచ్చాయి టపాకి. చాలామంది లహరికి శుభాకాంక్షలు చెపితే కొంతమంది భర్తని అభినందించారు కూడా.

బ్రహ్మగారి ఉపదేశం అనాలోచితంగా మనసులో మెదిలింది. పశుపతి అప్రయత్నంగా కాలిమీద మచ్చగా మిగిలిపోయిన గోటి గీతను చూసుకున్నాడు.
---------------------------------------------------------
రచన: బులుసు సుబ్రహ్మణ్యం, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment