Wednesday, February 6, 2019

అహోరాత్రం


అహోరాత్రం




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి..............

ఒకటే వృత్తం చుట్టూ పరిగెడతారు వాళ్లందరూ
నిరంతరంగా, నిర్నిరీక్షణగా
లెక్కలేనన్ని ఆశలు దారిలో వెదజెల్లుతూ
ఒక్కరోజులో వృత్తం చుట్టబెడతాడొకడు
అమూర్తుడతడు

మరొకడు జారిపడ్డవాటిని జేబులో పట్టినంతవరకూ
ఏరుకుంటూ
అందులో కొన్నిటిని విత్తులుగా వెదజెల్లి
నెలకొక ఆవృత్తం పూర్తిచేస్తాడు,
ఉబ్బసరోగం వాడికి

మరో నలుగురు కాస్త నెమ్మదిగానే పరిగెడతారు
పడ్డ విత్తులని భూమిలో నాటతాడొకడు
వాటికి నీరుపోస్తాడొకడు
వెలుగునిస్తాడొకడు
దడికడతాడింకొకడు
సావకాశంగా ఏడాదికొకసారి
వృత్తం చుట్టూ తిరుగుతారు వాళ్లు
మొక్కలన్నా జీవితమన్నా ఇష్టం వాళ్లకి

బవిరిగెడ్డం తాత కూడా అక్కడే తచ్చాడుతూ ఉంటాడు
ఆ చేపకళ్లలో మార్దవం, చూపులు మాత్రం బాణాల కొనలు
వేర్లు పరికిస్తాడు, పూలని పళ్లగా ఎలా మార్చుకోవాలో
మొక్కలకి పాఠాలు చెప్తాడు, వినే ఓపికుంటే!
చేతికర్ర తాటిస్తూ అడుగులో అడుగేసి నడిచే జ్ఞాని కాబోలు

గొప్పులు తవ్వడానికి,
కలుపు తియ్యడానికి
కాల్వలు కట్టడానికి
పంట కొయ్యడానికి
ప్రయాసపడుతుంటాడు ఒక్కడే, ఒంటరిగా
వాడంటే మాత్రం ఎవరికీ పడదు
ఎవరికీ అర్థంకాని నల్లటి విషాదం వాడిది
మరి ముప్పై ఏళ్లు పడుతుందిగా వాడికి
ఆ వృత్తం చుట్టూ తిరగడానికీ?

పగటిపూట నీడలో ఒకడు
రాత్రి నీడలు పరుస్తూ మరొకడు
చెట్లనుంచి వేలాడుతూనో
పుట్టల్లో చుట్టుకునో
మాసిపోయిన మధుపర్కాలతో
వర్షం రప్పిస్తారు,
కావాలంటే కలలు విరిచేస్తారు
వాళ్లిద్దరి తోకలే ఆ వృత్తానికి పరిధి
అశోకవరాళి అది

పరాశరుడంటే జీవితాన్ని వడగట్టిన
ఒక కవి కలంపేరు!
----------------------------------------------------------
రచన: నాగరాజు పప్పు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment