రావణుని మానసిక అవస్థ
సాహితీమిత్రులారా!
"ప్రవరసేనుని సేతుబంధము" పదకొండవ ఆశ్వాసములో సీతకు రావణుడు రామచంద్రుని మాయాశిరమును చూపుటను, దానిని చూసి సీత ఉద్వేగముతో మూర్ఛపోయి, అటుపై అనేకవిధములుగా విలపించటము, త్రిజట యనే రక్కసి సీతను ఊరడించి, ధైర్యము చెప్పుట చిత్రింపబడినాయి. ఈ ఆశ్వాసమున మొదటి ముప్పై అయిదు శ్లోకములలో రావణుని తీవ్ర ఉన్మత్తావస్థను కవి మహానైపుణ్యముతో చిత్రించినాడు. రాముడు కపిసేనతో కూడి యుద్ధమునకై లంకకు ఏతెంచిన వార్త విని రాక్షసరాజుకు నిద్రపట్టుట లేదు. సీతమీది మోహము వేధించుచున్నది.
తం పులఇఅమ్మి పేచ్ఛఇ ఉల్లవన్తో అ తీఅ గేహ్ణఇ గోత్తమ్|
ఠాఇ అ తస్స సమఅణే అణ్ణమ్మి వి చిన్తిఅమ్మి స చ్చిఅ హిఅఎ||
ఛాయ:
తాం ప్రలోకితే పశ్యత్యుల్లపంశ్చ తస్యా గృహ్ణాతి గోత్రమ్|
తిష్టతి చ తస్య సమదనేऽన్యస్మిన్నపి చిన్తితే సైవ హృదయే||
చూచిన ప్రతి చోటా సీతముఖమే కనిపిస్తోంది. మాటాడిన ప్రతి మాటలోనూ ఆమె నామము దొరలుతూంది. ఆమెను మర్చిపోవటానికి ప్రయత్నము చేసే కొద్దీ, ఆమెయే హృదయంలో నిలుస్తోంది.
ఈ ఘట్టములో దశకంఠుని అవస్థ మయసభలో పరాభవం చెందిన కురురాజు దుర్యోధనుని మనఃస్థితిని కొంత ప్రతిబింబిస్తుంది. ఆ యవస్థను నివారించటానికి దశవదనుని పత్నులు విఫలప్రయత్నము చేస్తారు. ఈ దురవస్థను అతను సైపలేక చివరకు ఈ విధముగా చింతించినాడు: జనులు తమ ఆశలు శిథిలమయినప్పుడు, తమకు రక్షణ కరవైనపుడు, మిత్రులు దొరకనపుడు భయము చేత లజ్జను విడనాడి తమ నియమముల నతిక్రమింతురు.
ఈ విధముగా క్రూరముగా ఆలోచించి, రాక్షసరాజు భటులకు రాముని ఖండిత మాయాశిరమును తయారు చేయమని ఆజ్ఞనిచ్చినాడు. ఆ శిరమును జూపి భీతావహురాలైన సీతను స్వాధీనము గావించుకొనవలెనన్న కర్కశమైన కాంక్ష యతనిది. దశవదనములతో దనుజరాజు భటులకు యాజ్ఞనిచ్చునప్పుడు రావణుని (అవస్థ) వర్ణన ఇది. ఉన్మత్తతకు పరాకాష్ట.
అణ్ణేణ సమారద్ధం వఅణం అణ్ణేణ హరిసగహి అప్ఫిడిఅమ్|
అణ్ణేణ అద్ధభణిఅం ముహేణ అణ్ణేణ సే కఇ వి ణిమ్మవిఅమ్||
ఛాయ:
అన్యేన సమారబ్ధం వచనం అన్యేన హర్షగృహీతస్ఫేటితమ్|
అన్యేనార్ధభణితం ముఖేన అన్యేనాస్య కథమపి నిర్మాపితమ్||
మొదటి ముఖముతో వచనమునారంభించినాడు. ఇంకొక ముఖము రాక్షసానందముతో ఆ మాటలనందుకొనినాడు. ఆపై మాటలు రాక మరొక ముఖముతో మాటలాడినాడు. చివరన యెటులో మరొక ముఖముతో ఆజ్ఞను ముగించినాడు.
రావణాసురుని మనమునందున్న తీవ్రమైన అరిషడ్వర్గవిన్యాసము ముప్పది ఐదు శ్లోకములలో చిత్రింపబడి, పై శ్లోకమందు శిఖరాగ్రము నందుకొనినది.
సేతుబంధకారుని సీతాదేవి అసహాయ. అయినప్పటికీ ధీర. పరమ ముగ్ధ కాదు. ఆమె మాటలలో రాచకన్య యొక్క ధీరత్వము, ప్రతీకారేచ్ఛ కానవస్తుంది. సీతయందు ప్రవరసేనుడు నిలిపిన ధీరత్త్వము ’కుందమాల’ అను దృశ్య కావ్యమున తిరిగి కానవచ్చును. జానకిని ఊరడించుట త్రిజట వంతయ్యింది. సేతుబంధకవి రాముడు సాక్షాత్తు నారాయణుడు. ఈ విషయమును త్రిజట ముఖమున కవి చెప్పించినాడు. చివరకు వానరుల యుద్ధసంరంభమును, భేరీ నినాదములను విని సీత ఊరడిల్లును.
ఈ ఆశ్వాసము నందు సేతుబంధకారుడు సీతయొక్క పాత్రచిత్రణమునూ, రావణుని ఉన్మత్త మానసిక అవస్థను అపూర్వముగా చిత్రించినాడు. పూర్వఘట్టములందు సుగ్రీవుని పాత్రచిత్రణమును, నాయకత్త్వప్రతిభను గురించిన ప్రస్తావన ఇదివరకు ఉటంకింపబడినది.
యుద్ధము మొదలైనది. వానరయోధుని బలమును, పరాక్రమమును కవి చిత్రించుచున్నాడు.
కఇవచ్ఛత్థలపరిణఅణిఅఅముహత్థమిఅదన్తిదన్తప్ఫలిహమ్|
ణిహఅ భడ మహిఅ ణివడిఅ సురవహుచల వలఅ ముహలపవ అవఇవగమ్||
ఛాయ:
కపివక్షఃస్థలపరిణత నిజముఖాస్తమిత దన్తిదన్తపరిఘమ్|
నిహత భట మహిత నిపతిత సురవధూచల వలయ ముఖరప్లవగ గతిపథమ్||
అసురసైన్యమందలి యుద్ధగజమొక్కటి ఒకానొక వానరయోధుని పాషాణసదృశమైన వక్షఃస్థలమును తన కొమ్ములతో కుమ్మింది. ఆ అదటుకు వానరశ్రేష్టునికి యేమీ నొప్పి కలుగలేదు కానీ, గజము యొక్క దంతము మాత్రము వెనుకకు వంగి దానిముఖములోనికే చొచ్చినది. ఇక్కడ వానరయూధుల దేహదారుఢ్యము వ్యంజితము. నిహతులైన వానరయోధుల కొనిపోవుటకు వచ్చిన స్వర్గలోకవాసులైన అప్సరల నూపురనాదములతో యుద్ధపథమతిశయించినది.
-----------------------------------------------------------
ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము - అనే వ్యాసం నుండి
దీని రచయిత రవి. ఈ మాట- జనవరి 2016
No comments:
Post a Comment