Saturday, May 5, 2018

నిరణమ్ కవిత్వం(కణ్ణశ్శన్)


నిరణమ్ కవిత్వం(కణ్ణశ్శన్)




సాహితీమిత్రులారా!

కేరళలో 14-15 శతాబ్దాలలో భాషా ఛందోరీతులలో కొన్ని ప్రత్యేక
నియమాలతో కూడిన సంస్కృత పురాణేతిహాసాల రచన 
మలయాళంలో వెలసింది ఈ నూతన రీతిని నిరణమ్ కవిత్వం
అని, కణ్ణశ్శన్ అని పిలుస్తున్నారు. ఈ పంథాకు చెందిన ముగ్గురు
కవులు ప్రసిద్ధులు వారిని నిరణమ్ కవిగళ్ అని పిలుస్తారు.
కణ్ణశ్శన్ కవులలో మొదటివాడు 14వ శతాబ్దానికి చెందిన
రామపణిక్కర్ ఈయన తిరువాన్కూర్ జిల్లాకు చెందినవాడు.
నిరణమ్ గ్రామవాసిగా ఈయన చెప్పుకున్నాడు.  అందుకే
ఇది నిరణమ్ కవిత్వం అని వచ్చింది. ఈ రామపణిక్కర్
రామాయణ, భారత, భాగవతాలను, శివరాత్రి మాహాత్మ్యాన్ని
రచించినట్లుగా ప్రసిద్ధి. రెండవ కవి మాధవపణిక్కర్. ఈయన
భాషాభగవద్గీత అనే పేర భగవద్గీతను రచించారు. మూడవ
కవి శంకరపణిక్కర్. ఈయన భారతమాలను రచించారు.
ఈ ఆరు కావ్యాలను నిరణమ్ కృతిగళ్ అని పేర్కొంటారు.

      నిరణమ్ కావ్యకవులు సంస్కృత, మలయాళ భాషలలో
పండితులు. వారి కావ్యాలలో తమిళప్రాధాన్యం తగ్గి మలయాళానికి
ప్రాముఖ్యం పెరిగింది. అదే విధంగా పురాణేతిహాసాల రచనలలో 
భాషాపరంగాను, భావ్యక్తీరకణ లోనూ, సంస్కృతాన్ని మలయాళంతో
సమానంగా వాడుకున్నారు. రచనలో సంస్కృతసమాసాలను 
యథేచ్ఛగా ప్రయోగించారు. భాషావిషయంగా సంస్కృత, 
మలయాళ శబ్దరచనకు అనువుగా లిపినికూడ కొంత మార్చుకొని 
పట్టెళుత్తు (గుండ్రని లిపి) ని రూపొందించుకున్నారు. క్రమంగా ఇదే 
లిపి వ్యవహారంలోకొచ్చింది. ద్రావిడ భాషా సంపర్కం చేత ద్రావిడ 
రూపాలను సంతరించికున్న సంస్కృతపదాలను కూడా తగినన్ని 
వాడుకున్నారు. నిరణమ్ కావ్యాలు ఒక క్రొత్త కావ్యభాషకు రూపుదిద్దాయి.

          భాషావిషయంగా మాత్రమే కాక ఛందస్సు పరంగాను కణ్ణశ్శన్ కవులు 
తమ ప్రత్యేకతను చూపించారు. అనేక వృత్తాలను వీరు వినియోగించినప్పటికి, 
నిరణమ్ వృత్తమ్ అనే క్రొత్త వృత్తాన్ని వీరు ఏర్పరుచుకున్నారు. ఈ ఛందస్సులో 
నాలుగు ద్విపదలు చేరి ఒక వృత్తంగా ఏర్పడుతుంది. సుదీర్ఘమైన ఈ వృత్తరచనను కథాసంవిధానానికి ఎంతో అనువుగా చేసుకున్నారు. నిరణమ్ కావ్యాలన్నిటిలోను 
రామపణిక్కర్ రామాయణం, మాధవపణిక్కర్ భాషాభగవద్గీత, శంకరపణిక్కర్ 
భారతమాల ఉత్తమరచనలుగా ప్రసిద్ధిపొందాయి. 

No comments:

Post a Comment