Tuesday, May 1, 2018

వేణుగోపాల శతకం - 2


వేణుగోపాల శతకం - 2

సాహితీమిత్రులారా!
పోలిపెద్ది వేంకటరాయకవి గారి
అధిక్షేప శతకము వేణుగోపాల శతకం - 2
గతవారం తరువాత...........


16. అవనీశ్వరుఁడు మందుఁడైన నర్ధుల కియ్య, వద్దని యెద్ది దివాను చెప్పు
మునిషీ యొకడు చెప్పు మొనసి బక్షీచెప్పుఁ దరువాత నా మజుందారు చెప్పుఁ
దల ద్రిప్పుచును శిరస్తా చెప్పు వెంటనే, కేలు మొగిడ్చి వకీలు చెప్పు
దేశ పాండ్యా తాను దిన వలెనని చెప్పు, మొసరొద్ది చెవిలోన మొఱిగి చెప్పు

యశము గోరిన దొర కొడుకైన వాఁడు
ఇన్ని చెప్పులు కడఁ ద్రోసి యియ్య వలయు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

17. ఆత్మగానని యోగి కద్వైతములు మెండు, నెఱ ఱంకులాఁడికి నిష్ఠ మెండు
పాలు పిండని గొడ్డు బఱ్ఱె కీఁతలు మెండు. కల్ల పసిండికిఁ గాంతి మెండు
గెలువని రాజుకు బలుగచ్చులును మెండు, వంధ్యకు భర్తపై వలపు మెండు
దబ్బరపాటకుఁ దలద్రిప్పుటలు మెండు, రోగపుఁ దొత్తు మెఱుంగు మెండు

వండ లేనమ్మకు వగపులు మెండు
కూటికియ్యని విటకాని కోర్కి మెండు
మాచకమ్మకు మనసున మరులుమెండు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

18. ఆలిని వంచుకోఁజాలక తగవర్ల, బ్రతిమాలుకొనువాని బ్రతుకు రోఁత
నర్తనాంగనల వెన్కను జేరి తాళముల్, వాయించువాని జీవనము రోఁత
వ్యభిచరించెడి వారవనిత గర్భంబునఁ, బురుషత్వము వహించి పుట్టరోఁత
బంధుకోటికి సరిపడని దుర్వృత్తిని, బడియున్న మనుజుని నడత రోఁత

అరసికుండైన నరపతి నాశ్రయించి
కృతులొనర్చెడి కవినెత్తి గీఁత రోఁత
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

19. ఆస్థానమందు విద్యావంతులకు లేచి, మ్రొక్కు వేయని వార మోహినులను
దల గొఱగించి మెత్తని సున్నమును బూసి, బొగ్గు గంధమ్ము బొట్టమర్చి
చెప్పులు మెడఁగట్టి చింపిచేటలఁగొట్టి, గాడిదపైఁబెట్టి కాల మెట్టి
తటుకునఁ గ్రామ ప్రదక్షిణం బొనరించి, నిల్చినచోటఁ బేణ్ణీళ్ళు చల్లి

విప్రదూషకులను దానివెంట నిచ్చి
సాగ నంపించవలయును శునకు పురికి
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

20. పెట్టనేరని రండ పెక్కు నీతులఁ బెద్ద, గొడ్రాలిముండకు గొంతు పెద్ద
డబ్బురాని వకీలి డంబంబు కడుఁబెద్ద, రిక్తుని మనసు కోరికలు పెద్ద
అల్ప విద్వాంసుండు నాక్షేపణకుఁ బెద్ద, మూర్ఖచిత్తుఁడుఁ కోపమునకుఁ బెద్ద
గుడ్డి9 గుఱ్ఱపు తట్ట గుగ్గిళ్ళు తినఁ బెద్ద, వెలయునాఁబోతు కండలను బెద్ద

మధ్యవైష్ణవునకు నామములు పెద్ద
కాసునియ్యని విటకాని గాసి పెద్ద
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

21. ఈడిగె ముత్తికి జోడు శాలువలిస్తి, కురుబ గంగికి జరీ కోకలిస్తి
కడియాలు కుమ్మర కనికికి దర్శిస్తి, పోఁగులు గోసంగి పోలికిస్తి
పోచీలు చాకలి పుల్లిచేతుల వేస్తి, దాని తల్లికి నూఱు దారపోస్తి
దాసరచ్చికి దేవతార్చన లమ్మిస్తి, గుఱ్ఱాన్ని ఉప్పరకొండి కిస్తి

ననుచుఁ దాత్ర మపాత్రము ననక యిచ్చి
చెప్పుకొందురు మూఢులు సిగ్గులేక
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

22. ఈనె గాండ్లంటరో యీండ్ల బైశారను, శెన్నంగి సుద్దులు సెప్పలేరు
యేదగాండ్లంటరో యీండ్లింట పొగలెల్ల, గొర్రాల బిగ్గెన గొనుగుతారు
కయిత గాండ్లంటరో కాల్పంగటించుక, చిన్నచ్చరము పేరు చెప్పలేరు
బాసిపేలంట తమాసగా ఱొమ్మున, దప్పొట యేసుక తట్టలేరు

అనుచు విప్రోత్తములఁ గన్న యట్టివేళ
మోటమానవు లనియెడి మాటలిట్లు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

23. ఉండి యియ్యని లోభి రండకొంపను శ్రాద్ధ, మైననేమి శుభంబు లైననేమి
చండాలు వాకిట వండుకొన్నది యంబ, లైన నే మతి రసాలైననేమి
మాచకమ్మ సమర్త మఖపుబ్బ హస్తచి, త్తయిన నేమి పునర్వసైన నేమి
కులనాశకుండగు కొడుకు దీర్ఘాయు వై, యుండిన నేమి లేకున్న నేమి

బవరమునఁ జొచ్చి పొడువని బంటుచేతి
దాయుధంబైన నేమి తెడ్డయిన నేమి
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

24. ఎనుబోతువానకు జంకునా యింతైన, వెలహెచ్చుగల తేజివెఱచుఁగాక
జట్టిమల్లుండు గుంజిళ్ళకు వెఱచునా, పిన్నబాలుఁడు మతి వెఱచుఁగాక
గడుసైన పెనుమొద్దు గాలికి వెఱచునా, విరుగఁగాచిన మ్రాను వెఱచుఁగాక
ఱంకుముండ బజారురచ్చకు వెఱచునా, వీరపతివ్రత వెఱచుఁగాక

ఘనతగల్గిన దొరబిడ్డ గాక సుకవి
నోటితిట్లకు వెఱచునా మోటువాడు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

25. ఏదంబులకు మంగలెంకఁడే బగునేటు, ప్రశ్న సెప్పను మాల పాపిగాఁడు
కయితముల్ సెప్పబోగము చినెంకఁడె సరి, సంగీత యిద్దెకు సాకలెల్లి
చాత్రపురండాల సాతాననంతమ్మ, సిందులు ద్రొక్క దాసిరి పెదక్కి
యీశ గొట్టను కోమటీరేశమే సరి, మతిరతాలకు మాఱుమనుము లచ్చి

అనుచుమూర్ఖాళి యీరీతి ననుదినంబు
భూతలమున వచింపరే నీతిలేక
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

26. బంటి జందెము ద్వాదశోర్ధ్వ పుండ్రంబులు, నమరిన పసపు కృష్ణాజినంబు
దండంబు గోచి కమండలు వక్ష మా, లిక పుస్తకంబు పాదుకలు గొడుగు
దర్భ మౌంజీ పవిత్రము గోముఖముకొన, చెవిలోనఁదగు తులసీదళంబు
వేదమంత్రములు వినోదమౌ నపరంజి, పడగ కుండలముల పంచశిఖల

తో నరుగుదెంచి బలిని భూదాన మడిగి
తెచ్చి సురపతి కిచ్చితి విచ్చతోడ
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

27. కనుముక్కుతీరు చక్కనికాంతి పొందిన, శుభలక్షణంబులు సూక్ష్మబుద్ధి
ఘనత వివేక విక్రమము బాంధవ్య వి, మర్శ విలాసంబు మానుషంబు
సరస వాచాలత సాహసందొకవేళ, విద్యా విచక్షత విప్రపూజ
వితరణగుణము భూపతియందు భయభక్తి, నీతియు సర్వంబు నేర్చునోర్పు
స్నాన సంధ్యాద్యనుష్ఠాన సంపన్నత, గాంభీర్యము పరోపకారచింత

గలుగు మంత్రిని జేర్చుకోఁ గలుగు దొరకుఁ
గీర్తిసౌఖ్యము సకల దిగ్విజయము సిరి
గలుగుచుండును దోషము ల్దొలగుచుండు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

28. కన్నె నిచ్చినవానిఁ గబ్బమిచ్చిన వాని, సొంపుగా నింపుగాఁ జూడవలయు
అన్నమిచ్చిన వాని నాదరించిన వాని, దాతఁగాఁ దండ్రిఁగా దలపవలయు
విద్యనేర్పినవాని వెఱపుదీర్చినవాని, గురునిగా హరునిగా నెఱుఁగవలయు
కొల్వు గాచినవానిఁ గూర్మి చూపినవాని, సుతునిగా హితునిగాఁ జూడవలయు

ఇట్టి వారలపైఁ బ్రేమ పెట్టుకోక
కసరు పుట్టిన మనుజుండు గనఁడు కీర్తి
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

29. కలకొద్దిలోపలఁ గరుణతో మన్నించి, యిచ్చిన వారి దీవించవలయు
సిరిచేతమత్తుఁడై పరువెఱుంగని లోభి, దేబెను బెళ్ళునఁ దిట్టవలయుఁ
దిట్టిన యప్పుడేఁ దెలిసి ఖేదము నొంది, యింద్రుడైనను బిచ్చమెత్తవలయు
దీవించినను జాలదీర్ఘాయువొంది బీ, దేనియు నందలం బెక్క వలయు

నట్టియాతఁడు సుకవి కానట్టి యతనిఁ
గవియనఁగ నేల కవిమాలకాకి గాఁడె
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

30. కొండసిగల్ తలగుడ్డలు పాకోళ్ళు, చలువవస్త్రములు బొజ్జలకఠార్లు
కాసెకోకలు గంపెడేసి జందెములును, దలవార్లు జలతారు డాలువార్లు
సన్నపు తిరుచూర్ణ చారలు కట్నాలు, జొల్లువీడెమ్ములు వల్లెవాట్లు
దాడీలు వెదురాకు తరహా సొగసుకోర్లు, సంతకు దొరగార్లటంచుఁ బేర్లు

సమరమున జొచ్చి ఱొమ్ముగాయములకోర్చి
శాత్రవుల ద్రుంచనేరని క్షత్రీయులకు
నేలకాల్పన యీ వట్టి యెమ్మెలెల్ల
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

31. కోమటి అత్యంత క్షామము గోరును, ధారుణి క్షితిపతి ధనము గోరు
ధరఁగరణము గ్రామదండుగ గోరును, జంబుకం బేవేళ శవముగోరు
కుజనుడౌ వైద్యుండు ప్రజకు రోగము గోరు, సామాన్యవిప్రుండు చావుగోరు
అతిజారులగు వార లమవస గోరుదు, రాఁబోతుపేదల యశము గోరుఁ

గాఁపువానికి గ్రామాధికారమైన
దేవభూసురవృత్తుల దీయఁగోరు ...
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

32. కండ చక్కెర పానకముఁ బోసిపెంచిన, ముష్టిచెట్టుకుఁ దీపిపుట్టబోదు
పాలమున్నీటి లోపల ముంచికడగినఁ, గాకి ఱెక్కకుఁ దెల్పుగలుగఁబోదు
పన్నీరు గంధంబు పట్టించి విసిరినఁ, దేలుకొండి విషము తీయఁబోదు
వెదురుబద్దలు చుట్టు వేసి బిగించినఁ, గుక్కతోఁకకు వంక కుదురబోదు

మంచిమాటల నెంత బోధించి చెప్పగ
మడియరండకు విగుణంబు విడువబోదు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

33. ఖేద మోదంబుల భేదంబు తెలియక, గోలనై కడపితిఁ గొన్నినాళ్ళు
పరకామినుల కాసపడి పాప మెఱుఁగక, కొమరు ప్రాయంబునఁ గొన్నినాళ్ళు
ఉదరపోషణమున కుర్వీశులను వేడి, కొదవచేఁ గుందుచుఁ గొన్నినాళ్ళు
ఘోరమైనట్టి సంసార సాగర మీఁడు, కొనుచుఁ బామరముచేఁ గొన్నినాళ్ళు

జన్మమెత్తుట మొదలు నీ సరణిఁ గడచె
నెటులు గృపఁ జూచెదో గతంబెంచఁబోకు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

34. గజముపై చౌడోలు గాడిద కెత్తితే, మోయునా పడవేసి కూయుఁగాక
చిలుక పంజరములోపల గూబ నుంచితే, పలుకునా భయపెట్టి యులుకుఁ గాక
కుక్క నందలములోఁ గూర్చుండఁ బెట్టితే, కూర్చుండునా తోళ్ళూ కొఱుకుఁ గాక
ధర్మకార్యములలో దరిబేసి నుంచితే, యిచ్చునా తన్నుక చచ్చుఁ గాక

చెడి బ్రతికినట్టి శుంఠను జేర్చుకొనిన
వాఁడు చెడు నుంచుకొన్న భూపతియుఁ జెడును
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

35. గోవుల నఱవంగఁ గోసి వండుక తిను, వారలు నైశ్వర్యవంతు లైరి
మానాభిమానముల్ మాని వర్తించు గు, లాములు గౌరవధాములైరి
అక్షరం బెఱుగని యాకార పుష్టిచే, వర్ణ సంకరులు విద్వాంసులైరి
బాజారి ఱంకుకుఁ బంచాయతీ చెప్పు, ప్రాఁత లంజెలు వీరమాతలైరి

అహహ! కలియుగ ధర్మ మేమనఁగ వచ్చు
నన్నిటికి నోర్చి యూరక యుండవలయు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

36. చదువుచుండెడివేళ సభలోనఁ గూర్చుండి, దున్నపోతుల కొడుకెన్నుఁ దప్పు
విద్యాధికుల కిచ్చు వేళడ్డుపడి మాల, ధగిడీల కొడుకు వద్దనుచుఁ జెప్పు
ధన మెక్కుడుగఁ గూర్చి తినలేక యేడ్చెడి, పెనులుబ్ధుఁ డర్థుల గనిన ఱొప్పు
బిరుదు గల్గిన యింటఁ బెరిగినఁ గొణతంబు, విప్పినంతనె కుక్క వెదకుఁ జెప్పు

రాజసభలందుఁ బండిత రత్నములకుఁ
జనులు చెఱచును నొక్కొక్క పాపి నరుఁడు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

37. జన్నిరోగికి బఱ్ఱెజున్ను వేసినయట్లు, పిల్లినెత్తిని వెన్నఁ బెట్టినట్లు
కొక్కపోతుకు నెయ్యికూడు వేసినయట్లు, చెడ్డజాతికి విద్య చెప్పినట్లు
సాతాని నుదుట విభూది రాసినయట్లు, గూబ దృష్టికి దివ్వె గూడినట్లు
ధన పిశాచికి సుదర్శనము గన్పడినట్లు, చలిచీమలకు మ్రుగ్గు చల్లినట్లు

సురభి బదనిక పాముకుఁ జూపినట్లు
దుష్టునకు నీతి వెగటుగాఁ దోఁచునట్లు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

38. తండ్రి మధ్వాచారి తనయు డారాధ్యుండు, తల్లు రామాన్జ మతస్థురాలు
తనది కూచిమతంబు తమ్ముఁడు బౌధుండు, సర్వేశ్వర మతంబు సడ్డకునిది
ఆలు కోమటిజాతి దక్క జంగమురాలు, బావగారిది లింగబలిజకులము
ఆఁడుబిడ్డ సుకారి యల్లుఁడు పింజారి, మఱదలు కోడలు మారువాడి

గలియుగమ్మున వరణసంకరము ప్రబలి
యుత్తమకులంబు లొక మూల నొత్తిగిల్లె
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

39. తల్లి ఱంకునఁ దండ్రి ధనము పోయినయట్లు, మూలనిక్షేపంబు మునిఁగినట్లు
కూఁతురి ముడుపెల్లఁ గొల్లవోయినయట్లు, కాణాచివల్లెలు కాలినట్లు
తన యాలి గడనెల్ల దండుగ కైనట్లు, దండ్రి తద్దిన మేమొ తప్పినట్లు
చెల్లెపైఁ బడి దొంగ చెఱచిపోయిన యట్లు, కొడుకునప్పుడు తలగొట్టినట్లు

దిగులుపడి చూచి మూర్చిల్లి తెప్పరిల్లి
కవుల కియ్యంగ వద్దని కన్ను మీటు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

40. దూదేకుల హుస్సేను దొమ్మరి గోపాలు, పట్ర మంగఁడు గాండ్ల దాలిగాడు
బయశేనినాగఁడు పటసాలె నారాయుఁ, డగముడి లచ్చిగాఁ డా ముకుందు
చాకలిమల్లఁడు సాతాని తిరుమల, గొల్లకాతడు బెస్త గుర్విగాడు
కోమటీ శంభుడు కుమ్మరి చెంగడు, మంగ లెల్లడు బోయ సింగ డొకడు

కన్నవారెల్లఁ బండితుల్ కవులుఁ గాగ
వేదశాస్త్రంబు లేడను విప్రులేడ
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

No comments:

Post a Comment