Thursday, May 24, 2018

రుక్మిణీ వర్తమానం


రుక్మిణీ వర్తమానం

సాహితీమిత్రులారా!


మన తెలుగువారిలో రుక్మిణి కల్యాణం తెలియనివారుండరు
ఇప్పుడుకాదండి గతంలో ఇప్పుడు ఆమె ఏ సినిమా నాయికయో
చెప్పమనే స్థాయికి వచ్చేశాం. శ్కీకృష్ణునికి రుక్మిణి పంపిన సందేశంలోని
పద్యవివరణను చీమలమర్రి బృందావనరావుగారి మాటల్లో చూద్దాం.
ఈ వివరణ అంతర్జాల మాసపత్రిక నవంబర్ 2011లో ప్రచురితమైంది
ఇక చదవండి..........


ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో

పైది చాలా ప్రసిద్ధమైన పద్యం. భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం లోనిది. కవి పోతన.

ఒక యువకుని ప్రేమించి, తన ప్రేమ సాఫల్యం పొందగల అవకాశాలు కానీ, తన వారినుంచి తగిన సానుకూలత గానీ లేకపోవడంతో స్వయంగా తన ప్రయత్నాలు ప్రారంభించి, ఆ యత్నాలు ఫలిస్తాయో లేదో అనే సందేహమూ, ఆతురతా, ఏమవుతుందో అనే భయమూ – వీటితో డోలాయమానమౌతున్న కన్నె మనసు ఈ పద్యంలో ఎంతో సహజంగా కనిపిస్తుంది.

విదర్భ రాజపుత్రి రుక్మిణి. వివాహయోగ్యమైన వయసు వచ్చింది ఆమెకు. చిన్నతనం నుంచీ శ్రీకృష్ణుని పరాక్రమమూ, లీలలూ విని వుందేమో – ఆయననే పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. కానీ ఆమె అన్న రుక్మికి అది ఇష్టం లేదు. తన స్నేహితుడైన చేది రాజు శిశుపాలునికి చెల్లెలినివ్వాలనేది అతని ఉద్దేశం. తండ్రి భీష్మకుడు పేరుకే రాజు. పెత్తనమంతా రుక్మిదే. కూతురి మనసు తెలిసినా కొడుకు మాటను కాదనే సమర్థత తండ్రికి లేదు. రుక్మి మొండివాడు. చెల్లెలి ఇష్టాయిష్టాలతో అతనికి నిమిత్తం లేదు. శిశుపాలునికి ఇవ్వాలనేదే అతని నిశ్చయం. అతనికి కృష్ణుడంటే చిన్నచూపు. అతని స్నేహితుడైన శిశుపాలునికైతే కృష్ణునితో జన్మవైరం. ఇక రుక్మిణికేమో శిశుపాలుడంటే అసహ్యం. అతడు మత్తుడనీ, సింహము పాలి సొమ్ము లాక్కోవాలనుకునే గోమాయువు (నక్క) లాంటివాడనీ ఆమె అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో తను కోరుకున్న వానిని పొందగలిగే అవకాశం రుక్మిణికి లేనే లేదు.

కానీ ఆమె మోహం చాలా తీవ్రమైనది. ఎలాగైనా సరే కృష్ణునే చేసుకోవాలనేది ఆమె పంతం. అది వీలు కాకపోతే “వ్రతచర్యన్ నూరు జన్మంబులన్ నిను జింతించుచు బ్రాణముల్విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా,” అనేది ఆమె నిశ్చయం. ఏదో ఒక విధంగా కృష్ణునికి తన ప్రేమ తెలియజేస్తే చాలు, అతనే వచ్చి తనను సాధించుకుంటాడని ఆమె నమ్మింది. అందుకోసం తన ప్రేమ వార్తను ఎలాగైనా కృష్ణునికి చేరవేయాలని భావించింది.

రుక్మిణి ప్రేమ తీవ్రతతో ఉందే కాని, ఉచితానుచితాలు తెలియని యువతి కాదు. ఆమె ఒక మహారాజు పుత్రిక. మరో రాజుతో పెండ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె ఏమి చేసినా తొందరపాటు గానో, దొంగ వ్యవహారం గానో వెకిలిపాటు గానో ఉండరాదు. అది ఆమె శీలానికి యోగ్యమైన పద్ధతి కాదు. అందుకని ఆమె ఏ కుంటెనకత్తె తోనో రహస్యంగా వర్తమానం పంపలేదు. పరమ యోగ్యుడైన ఒక భూసురుని ఆ పనికి ఎన్నుకున్నది. తన పరిస్థితిని వివరించి చెప్పి కృష్ణునికి తన మనోగతాన్ని తెలుపమని పంపింది. ఆ బ్రాహ్మణుడు కూడా అది తగని పనిగా భావింపలేదు. విషయం రుక్మికో, రాజుకో తెలిస్తే తల తెగిపోయే పరిస్థితి. అయినా భయపడలేదు. ఒక సర్వ లక్షణ లక్షిత అయిన రాకుమారికి పరమయోగ్యుడైన శ్రీకృష్ణుడే భర్త కావాలని ఆయన కూడా భావించి అది సత్కార్యం గానూ, దైవ నిర్ణయం గానూ, తనకు ధర్మంగానూ నమ్మి అంగీకరించాడు. శ్రీకృష్ణునితో మాట్లాడేటప్పుడు గూడా ఆమెకు తగిన వాడవు నీవే, ఆమె కూడా నీకు మాత్రమే తగినది అని వివరిస్తాడు.

శ్రీకృష్ణుడు భగవంతుడు, రుక్మిణి సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆయన భక్తురాలు – ఈ మామూలు వాదనలను పక్కకు తోసెయ్యండి. ఒక యువతి తాను ప్రేమించిన వాడిని పొందడం కోసం, వ్యతిరేక పరిస్థితులను అధిగమించి ప్రయత్నాలు సాగించి సఫలీకృతురాలు కావడమూ, ఆ ప్రేమను పొందిన యువకుడు ఏదోలే అని కొట్టిపార వేయకుండా, నిర్దిష్టమైన ప్రణాళికతో నలుగురూ చూస్తుండగానే ఆమెను తన రథమ్మీద ఎక్కించుకొని తీసుకొని పోవడం – ఈ ఇరవయ్యోకటో శతాబ్దపు సినిమా కథ ద్వాపరయుగంలో జరగడమనేది ఎంత హృద్యమైన సన్నివేశం!

ఆ బ్రాహ్మణుడిని – అతని పేరు అగ్నిద్యోతనుడు – ద్వారకకు పంపిన దగ్గర్నుంచీ రుక్మిణి మనసులో ఒకటే గుబులు, ఒకటే ఆరాటం, ఏమౌతుందో, ఏమౌతుందో అని ఒకటే దిగులు. ఆ ఆరాటమంతా ఈ పద్యంలో ఎంత సహజంగానో వ్యక్తమయింది. అసలీయన ద్వారక చేరాడా, దారిలో అలసి ఎక్కడైనా చిక్కు పడ్డాడా! కృష్ణుడికి తన సంగతి తెలిపితే ఆయన ఏమనుకున్నాడో! ఇదేమిటి, ఈ అమ్మాయి ఇలా తప్పుగా ప్రవర్తించింది, అని అనుకోలేదు గదా. ఇంతకీ కృష్ణుడు వస్తాడా, ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడా లేదా! అయినా నా అదృష్టం ఎలా ఉందో గదా! ఇలా రకరకాలుగా ఊహలు పోతున్నాయి ఆమె మనస్సులో. తనంతట తనే వలచి వస్తే చులకన కావడం మామూలే. కృష్ణుడి దృష్టిలో తాను పలుచనై పోలేదు గదా! ‘తప్పుగా తలచెనో’ అనుకోవడంలో ఉద్దేశం అదే. తన ప్రేమ చాలా స్వచ్ఛమైనది. తానేమీ ఏమో రాజ్యసుఖాదికాలు ఆశించి కృష్ణున్ని కావాలనుకోలేదు. తాను రాజపుత్రిక. తనకు లేని రాజ్యసుఖాలు లేవు. కృష్ణుడే రాజ్యమేమీ లేనివాడు. అనాది నుంచి రాజ్యభోగాలు ఆశ చూపించి స్త్రీని లోబరుచుకోవడం పురుషుల ప్రకృతి. దుష్యంతుడు కూడా శకుంతలను లోబరచుకోటానికి “ఈ మునిపల్లె నుండుటిది యేల? నాకు భార్యవయి భాసుర లీల నశేష రాజ్యలక్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగ నందుము అనిందితేందు కాంతామలతుంగ హర్మ్యముల,” అన్నాడు. ఆమె కూడా తనకు పుట్టిన వాడినే రాజుగా చెయ్యమని అడిగి ఒప్పించుకొని ఒడబడింది. ఇక్కడ అలాంటిదేమీ లేదు.

ఏ రకంగా చూసినా కృష్ణుని కన్నా రుక్మిణే గొప్పది. ఆమె చాలా ఉచితం గానూ, ధైర్యం గానూ, మనస్సాక్షి పూర్వకం గానూ ప్రవర్తించింది. ఎంతైనా, తన రాయబార ఫలితం తెలిసిందాకా మనసులో ఆరాటమే గదా. ఆ ఆరాటమంతా పై పద్యంలో కనిపిస్తుంది. ఈ బ్రాహ్మణుడు పోయినాడో, లేదో ఆయన ఏమనుకున్నాడో, ఇంతకూ వస్తాడో, రాడో అని అనుకున్న తర్వాత “ఈశ్వరుండనుకూలింప దలంచునో, తలచడో,” అనుకోవడం ఎంతో స్వాభావికంగా ఉంది. ఇక్కడొక విచిత్రం ఉంది. ఈశ్వరుడేం చేస్తాడో గదా అని ఈశ్వరుణ్ణి ఒక్కణ్ణే కాదు. అమ్మవారిని – ఆర్యామహాదేవిని – కూడా రుక్మిణి తలచుకున్నది. ఈశ్వరుడు అనుకూలింప దలంచునో, లేదో అని సందేహపడింది గానీ, పార్వతీ దేవి విషయంలో ఆమెకు అటువంటి సందేహం ఏమాత్రమూ లేదు. ఆమె తప్పక తనను పాలిస్తుంది. అది నిశ్చయమే. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే “నను పాలించ నెరుంగునో, ఎరుగదో” అనేది. అమ్మవారు నిశ్శంకగా కాపాడుతుంది. కానీ, ఆ ఉపాయం ఆమెకు తెలుసునో, తెలియదో అని అనుకుంటున్నది రుక్మిణి. ఎంత నమ్మకమో చూడండి రుక్మిణికి గౌరీదేవి మీద. ఎంతైనా సాటి ఆడది గదా, ఆ మాత్రం సానుకూలత ఆమె మనసులో లేకుండా ఎలా వుంటుందా, అనేది రుక్మిణి విశ్వాసం! ఎంత కమ్మని పద్యం రాశాడు పోతన!

వివాహం జరగబోయే ముందు గౌరీదేవి ఆలయానికి వచ్చి గౌరీపూజ చేసి బయటకి వచ్చాక అప్పటికే రథంతో తయారుగా ఉన్న కృష్ణుడు అందరూ చూస్తుండగానే, రుక్మిణి చేయందించగా దాన్ని గ్రహించి ఆమెను రథమ్మీదకి ఎక్కించుకుంటాడు. ఇది రుక్మిణీ కళ్యాణానికి పతాక సన్నివేశం.

ఇప్పటికీ వివాహ సందర్భంలో వధువు గౌరీపూజ కావించడమనేది తప్పకుండా వస్తున్న ఆచారం. ఆడపెండ్లివాండ్ల విడిది గదిలో అలంకరించున్న ఆడంగులందరూ ఉండగా, బ్రాహ్మణుడు పెండ్లి కూతురి చేత గౌరీపూజ చేయిస్తాడు. ఆ పూజ అయింతర్వాత వరుని తరఫు పురోహితుడూ, వరుని తల్లిదండ్రులూ, ఇతర పెద్దలూ ఆ గదిలోకి వస్తారు. పురోహితులిద్దరూ – గోత్రమూ, ఋషుల ప్రవరతో సహా – ఫలానా వారి ముని మనమరాలు, ఫలానా వారి మనమరాలు, ఫలానా వారి పుత్రిక అయిన వధువును, ఫలానా గోత్రము, ఋషుల ప్రవర గల్గిన ఫలానా వారి ముని మనమడు, ఫలానా వారి మనమడు, ఫలానా వారి కొడుకు అయిన వరునితో వివాహానికి అనుజ్ఞ ఇచ్చిన తర్వాత, పెండ్లి కూతురిని గంపలో కూర్చోబెట్టి మేనమామలు పెండ్లి పీటల మీదకి తీసుకుని రావడం – అదో ముచ్చట! చెప్పవచ్చేదేమంటే, గౌరీపూజ అనేది పెండ్లిండ్లలో నేటికీ జరుగుతున్న ఆచారం. ద్వాపర యుగంలో ఇంట్లో కాకుండా ఆలయానికే వెళ్ళి గౌరీపూజ చేసేవారు కాబోలు. ఆ పద్ధతి రుక్మిణీ కృష్ణులకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఆర్యామహాదేవికి ఉపాయాలే తెలియకుండా ఉంటాయా!

ఇప్పటికీ ఏ పని మీదనైనా ఎవర్ని ఎక్కడికైనా పంపితే, అతను తిరిగి వచ్చేలోగా ‘ఘనుడా భూసురుడేగెనా’ అని మనం అనుకోవడం ఈ పద్యం సార్థకతను చెప్పకనే చెపుతుంది. మహానుభావుడు పోతన. ఔచిత్యమూ, అభిరుచీ ఎరుగని మన తెలుగు సినిమా నిర్మాతలూ, దర్శకులూ తగని నటులను ఎన్నుకొని రుక్మిణి పాత్రను ఘోరంగా, ఏడుపుగొట్టుగా చూపించారు గానీ నిజానికి రుక్మిణి మన పురాణాల్లోని ఒక గొప్ప నాయిక.

No comments:

Post a Comment