Tuesday, May 8, 2018

వేణుగోపాల శతకము - 3


వేణుగోపాల శతకము - 3

                   
సాహితీమిత్రులారా!


పోలిపెద్ది వేంకటరాయకవిగారి వేణుగోపాల శతకం (అధిక్షేప శతకము)
మూడవ భాగాన్ని 41నుండి - 55వ పద్యం వరకు ఆస్వాదించండి-
----------------------------
41. దొరవద్ద నెంత చౌదరి యైన ధన మన్వి, తాఁజెప్పఁ గార్య సాధకము లేదు
రంభైన తన శరీరముఁ గరంబుల, దా బిగించిన సుఖ తరము లేదు
తగవులో నాపురందరుఁడైనఁ దన ప్రజ్ఞ, తాఁజెప్పుకొనినఁ బెత్తనము లేదు
తాఁజేయి పుణ్య మింతని యొరులతోఁ జెప్ప, బ్రహ్మ దేవునికైన ఫలము లేదు

గనుక నివి యెల్ల నొరులచేఁ గాని భువిని
తమదు శక్తిని మంత్ర తంత్రములు లేవు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

42. దొర సొమ్ముదిని కార్య సరణి వచ్చినవేళఁ, బాఱిపోఁ జూచిన బంతువాని
నగ్నిసాక్షిగను బెండ్లాడిన తన యింతి, నేలక పరకాంత నెనయు వానిఁ
గబ్బము ల్సేయ సత్కవిజనాళికిఁ గల్గి, నంతలో నేమియ్య నట్టివాని
నిచ్చిన దీవెన లియ్యక యత్యాశ, తోనేఁగు యాచకుండైన వాని

గట్టి ముచ్చెలతోఁ బట్టి కొట్టి విఱుగ
గట్టి పంపించవలయునుఁ గాలుపురికి
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

43. నంబి కవిత్వంబు తంబళ జోస్యంబు, వలనొప్పు కోమటి వైష్ణవంబు
వరుసనే యుప్పరివాని సన్న్యాసంబు, తరువాత శూద్ర సంతర్పణంబు
రజకుని గానంబు రండా ప్రభుత్వంబు, వెలయఁగా వెలమల వితరణంబు
సానిపండితశాస్త్ర వాదము వేశ్య, తనయుఁడబ్బకుఁబెట్టు తద్దినంబు

నుభయ భ్రష్టత్వములు గాన నుర్విలోన
రాజసభలందు నెన్నగా రాదుగదర
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

44. నత్తులేకుండిన ముత్తైదు ముక్కందు, మూల లందును ఋతుస్త్రీల యందు
మధ్యపక్వ స్థలమందుఁ గిన్నెరమీటు, నతనిచేఁ గుమ్మరి యావమందుఁ
కాటుక పొగయందుఁ గాళ్ళ చప్పుడు నందు, దొమ్మరివాయించు డోలునందు
దీపము లేనట్టి దివ్వెకంబము నందు, మార్జాల ముఖమందు మాంసమందు

ముదముతో సంతతము నీదు వదినెగారు
విడిది చేసుక వీరిని విడువకుండు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

45. పంచాంగములు మోసి ఒడవాతనముఁ జేసి, పల్లె రూటము చెప్పి పసులఁగాచి
హీనవృత్తిని బిచ్చమెత్తి గోడలు దాఁటి, ముష్టి కూళ్ళకుఁబోయి మెత్తులఁబడి
విస్తళ్ళుగుట్టి కోవెలనంబి వాకిటఁ, గసవూడ్చి లంజెల కాళ్ళు పిసికి
కన్న తొత్తులఁ దమ కళ్ళెత్తి చూడక, యాలు బిడ్డలఁ బరులంటఁ జేయు

నిట్టి దేబెకు సిరి గల్గెనేని వాఁడు
కవివరుల దూఱు బంధువర్గముల గేరు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

46. పతికి మోహములేని సతి జవ్వనం బేల, పరిమళింపని సుమ ప్రచయ మేల
పండిత కవివర్యు లుండని సభ యేల, శశి లేని నక్షత్ర సమితి యేల
పుత్ర సంపద లేని పురుషుని కలి మేల, కలహంసములు లేని కొలన దేల
శుకపికరవ మొకించుక లేని వనమేల, రాజు పాలింపని రాజ్య మేల

రవి వికాసనంబ లేనట్టి దివసమేల
ధైర్య మొదవని వస్తాదు తనమదేల
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

47. పరకాంతపై నాసపడెడి మానవులకు, నగుబాటు, మనమున తగని దిగులు
అగడువిరుద్ధంబు నాచారహీనత, చేసొమ్ముపోవుట, సిగ్గుచెడుట
యపకీర్తి బంధుజనాళి దూషించుట, నీతియుఁదొలగుట నిద్రచెడుట
పరలోకహాని లంపటనొంది మూల్గుట, పరువుదప్పుట దేహబలము చెడుట
తనయాలి చేతిపోటునఁ గృశించుట దాని, వరుడు గన్గొనిన జీవంబుతెగుట

ముజ్జగము లేలు నా విరాణ్మూర్తికయినఁ
గాని దుర్వృత్తి దగదెంత వానికైన
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

48. పరదళంబులఁగాంచి భయముచే నురికిన, రాజుగాఁడతడు గోరాజు గాని
ధర్మంబులకు విఘాతముసేయ మంత్రిశే, ఖరుఁడు గాఁడతఁడు సంకరుఁడు గాని
విద్యాప్రసంగము ల్విను రసజ్ఞులు లేక, ప్రాజ్ఞుల సభగాదు రచ్చ గాని
పతితోడ కలహించి పడుకొని యేడ్చెడి, దాలుగా దది యెఱ్ఱతేలు గాని

శాస్త్రముల మించినట్టి యాచారమైన
నిష్ఠగానేరఁదది పెనుజ్యేష్ఠగాని
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

49. పానంబు జూదంబు పరసతిపై బాలి, ధనకాంక్ష మోహంబు తగని యాస
యనుదినంబును వేఁట యధిక నిద్రనుగొంత, పేదఱికంబును బిఱికితనము
నతిలోభమును మందమతి హెచ్చుకోపము, నమిత వాచాలత యనృతములును
ఖండితం బాడుట గర్వంబు సంధ్యల, వేళలఁబయనంబు విప్రనింద

యాప్తజనముల దూఱుట నసురు తిండి
మానవేంద్రుల పదవికి హాను లివియ
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

50. పాలనలేని భూపతియైన నతని ద, గ్గెరనుండు మంత్రి ధగ్డీయునైన
చెవిటి రాయసమైన సేవకుఁ డౌడైన, వారసుగాఁడు దివాను నయిన
వరుస బక్షీ చిత్తవైకల్యుఁ డయినను, గడుదీర్ఘ వృత్తి వకాలతైన
కోశపాలకునకు గుందేతి తెవులైన, నుగ్రాణిగాని కత్యుగ్రమైన

దాతలకు మోస మచటి విద్వంసులకును
బ్రాణసంకట మా భూమిఁ బ్రజకుఁగీడు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

51. సీమగంధపు మోము పిల్లి మీసంబులు, కట్టెశరీరంబు కాకినలుపు
ఆర్చుకన్నులు వెన్నునంటిన యుదరంబు, నురుగు కారుచునుండు నోరుకంపు
చెయిచెయ్యి దిగరాచి చెక్కిళ్ళురుద్దుట, దవుడల సొట్ట పాదముల మిట్ట
ఒకరిని జూచి మేలోర్వ లే కేడ్చుట, దౌర్భాగ్యగుణములు తగని యాశ

ఇట్టి యవలక్షణపు మంత్రి నేర్పరింప
దొరల కపకీర్తి దెచ్చు నా దుర్జనుండు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

52. పూబొదలో దాఁగియున్న పులియున్నరీతిని, మొగిలిరేకుల ముండ్లు మొలచి నట్లు
నందనవనములో నాగుఁబామున్నట్లు, చందురునకు నల్పు చెంది నట్లు
సొగసుకత్తెకుఁజెడ్డ తెగులు కల్గిన యట్లు, మృగనాభిలోఁ బుప్పి తగిలినట్లు
జలదిలో బెద్దక్క సంభవం బైనట్లు, కమలాప్తునకు శని గల్గినట్లు
పద్మరాగమునకుఁ బటల మేర్పడినట్లు, బుగ్గవాకిటఁ జెట్టు పుట్టినట్లు

ధర్మవిధులైన రాజసంస్థానములను
జేరు నొక్కొక్క చీవాట్లమారి శుంఠ
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

53. పై మాటలొకలక్ష పలుకంగను సరా య, హంకారవర్తన మణఁగ వలయు
అనఁపజాలక కానలందుఁబోవగ సరా, యెఱుకదెల్పెడి మూర్తి దొరక వలయు
దొరికినాఁదని వేడ్క నరయంగనే సరా, గురుపదంబుల ఖక్తి కుదర వలయు
కుదిరె నం చని యూరకుండఁగానే సరా, పాయకాత్మను బాటి సేయవలయు

చేసినను కాదు పాచిని దోసి శుద్ధ
గంగనెత్తిన యటముక్తి గాంచవలయు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

54. భట్టరావార్యుల బట్టలు కాగానె, మడిగట్టుకొను పట్టుమడత లౌనె
అలరాచకూతురు నధరంబు కాగానె, తేనెఁ జిల్కునె యనుపాన మునకు
అల్ల యేలేశ్వరోపాధ్యాయు బుఱ్ఱయు, రాచూరిపెద్ద ఫిరంగి యౌనె
అల తాళ్ళపాక చిన్నన్న రోమములైన, దంబుఱ దండెకు దంతులౌనె

హుంకరించిన నెటువంటి మంకునైనఁ
దిట్టవలయును గవులకు దిట్టమిదియె
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

55. బడవాకుఁ బ్రతియెన్న బహుమతు లేనూరు, దళవాయి కొక్క యూరధర్మచేసి
పడుపు తొత్తుకు మేలు పౌజుకమ్మల, తాటాకు దుద్దుల తల్లిచెవుల
దండె దాసర్లకుఁ దాజీతవాజము, కవివరులకుఁగన్నగాని మన్ను
బై నీని సుద్ధికి బారిశలువ జోడు, విద్వాంసులకు బేడ వెలితిగుడ్డ

ఘనము నీచం బెఱుంగక కలియుగమున
నవని నడుతురు మూఢులైనట్టి దొరలు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

No comments:

Post a Comment