Saturday, May 12, 2018

సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు


సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు






సాహితీమిత్రులారా!



ఈ వ్యాసం ప్రతి సాహితీప్రియుడు, ప్రతి తెలుగువాడు
తప్పకుండా చదవాల్సినది. దీన్ని "వేమూరి వేంకటేశ్వర రావు" గారు
వ్రాయగా ఈమాట (అంతర్జాల మాసపత్రిక)లో జనవరి 2006న 
ప్రచురితమైంది. మన పాఠకులకై ఆ వ్యాసం ఇక్కడ.......
========== x===================x===================

ఈమధ్య వార్తాపత్రికలలోను, అంతర్జాలం లోని చర్చా వేదికల పైన తెలుగు మనుగడకే ముప్పు వస్తోందన్న ఆరాటంతో చర్చలు జరుగుతున్నాయి. తెలుగు భవిష్యత్తు ఒక ప్రశ్నార్ధకంగా తయారవుతోందని ఆవేదన పడేవారు అక్కడక్కడ కనిపిస్తున్నారు.

అమెరికాలో పెరిగిన మా పిల్లలు ఇంకా పిల్లలుగా ఉన్న రోజులలో వాళ్ళకి తెలుగు రావటం లేదనీ, వాళ్ళకి తెలుగు నేర్పటం ఎలాగనీ కొన్ని తర్జన భర్జనలు జరిగేయి. దేశకాల పరిస్థితులలో వస్తూన్న మార్పుల కారణంగా, అమెరికాలో ఉన్న పిల్లలకి తెలుగు నేర్చుకోవలసిన ఆవశ్యకత లేదని కొందరు వాదించేరు. రెండు భాషల మధ్య పిల్లల ఎదుగుదల కుంటుపడవచ్చని కొందరు శాస్త్రీయ పటుత్వం లేని భయాలతో పిల్లలతో ఇంట్లో తెలుగు మాట్లాడటానికే జంకేవారు. కారణాలు ఏమైతేనేమి, స్థూలంగా విచారిస్తే, అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకి తెలుగు రాలేదు.

ఇక తెలుగు దేశంలో పరిస్థితి చూద్దాం. తెలుగు దేశంలో ఉన్న తెలుగు వారిలోనే దరిదాపు 20 శాతం ప్రజలకి తెలుగు రాయటం, చదవటం రాదని ఒకరు ఉటంకించేరు. ఈ గణాంకంలో ఉన్న ఖచ్చితత్వం నాకు తెలియదు కాని, ఏ భాషలోనైనా సరే ఈ గణాంకం 25 శాతం దాటిందంటే ఇక ఆ భాష క్రమాంతరంగా విలుప్తం అయిపోయే ప్రమాదం ఉందని ఐక్య రాజ్య సమితి చేసిన ఒక అధ్యయనాన్ని ఎత్తి చూపి, తెలుగు సుదూర భవిష్యత్తులో విలుప్తం అయిపోతుందేమోనని ఆరాట పడుతున్నారు, మరి కొందరు. “తెలుగు భాష చచ్చిపోతేనేం? ఈ తెలుగు సంస్కృతి అంతరించిపోతే వచ్చే నష్టం ఏమిటీ?” అని వాదించే వారూ కనబడుతున్నారు.

ఈ భయాభయాలలో నిజానిజాలు ఏమిటి? తెలుగు ఇలా దిగజారిపోవటానికి కారణాలు ఏమిటి? తెలుగు మనుగడకి ముప్పు రాకుండా ఆదుకోటానికి మార్గాలు ఏమిటి? ఈ విషయాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి విచారణ చెయ్యటం ఇక్కడ ఎలాగా కుదరదు కనుక టూకీగా, ఒక నఖచిత్రంలా సమీక్షిస్తాను.

ఇక్కడ చెయ్యబోయే పరిశీలనకి కొంత చారిత్రక దృక్పథం ఉపయోగపడుతుంది. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, కామరూప, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మగధ, మాళవ, బంగాళ, నేపాళ, కేరళ, చోళ, పాంచాల, సింహళ, తమిళ, నాట, లాట, ఆంధ్ర, గాంధార, విదర్భ, విదేహ, బాహ్లిక, కురు, కిరాత, బర్బర, కేకయ, కోసల, కుంతల, టెంకణ, కొంకణ, మత్స్య, మద్ర, ఘూర్జర, ఇత్యాది భిన్న దేశాలతో ఏర్పడ్డ ఈ భరత ఖండంలో ఆంధ్ర దేశం ఒక అంతర్గత దేశం. ఈ భిన్న దేశాలకి ప్రత్యేకమైన భాషలు ఉండేవి; అవే మన దేశ భాషలు. స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆదరణ లేక, వాడుక లేక, మన కళ్ళ ఎదుట, మన దేశంలోనే చాలా భాషలు నశించిపోతున్నాయి. పోయినవి పోతే పోయేయి, కనీసం ప్రభుత్వం గుర్తించిన పదిహేనో, పదహారో ముఖ్య భాషలైనా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయా అంటే అదీ లేదు. పోనీ దేశ వ్యాప్తంగా హిందీ పుంజుకుని సార్వజనీనమైన ఆదరణ పొందిందా అంటే అదీ లేదు. ఎవ్వరూ ఎన్నడూ ఉహించని విధంగా, ఈ నాడు మనవాళ్ళు ఇంగ్లీషుని కోరి నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషు భాషా జ్ఞానం రెండో పురుషార్ధానికి రహదారి అయి కూర్చుంది. ఈ నేపథ్యంలో ఈ మిగిలిన పదహారు భాషలైనా ఇంకా ఎన్నాళ్ళుంటాయో అని కొందరు కంగారు పడుతున్నారంటే పడరూ మరి? ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ, మనం తెలుగు వాళ్ళం కనుక ఈ దుర్గతి తెలుగుకే పట్టిందని మనం అనుకోవటంలో వింతేమీ లేదు.

భిన్న భాషలతో పాటు మన దేశంలో విభిన్న ఆచారాలూ, సంస్కృతులూ కనిపిస్తాయి. అందుకోసమే మన పూర్వులు మనం నివసించే భూభాగాన్ని భరత ఖండం అన్నారు. ఇది ఒక దేశం కాదు; ఇది ఒక ఖండం. ఇటువంటి భిన్న భావాలు ఉన్న ఈ భరత ఖండానికి ఏకత్వం సంపాదించి పెట్టినది వైదిక సంప్రదాయ బద్ధమైన ఆర్ష ధర్మం. మన నాలుగు వేదాలు, వాటి షడంగాలూ ఈ ధర్మానికి మూలాధారాలు. శుద్ధ భౌతికాలైన భిన్న భాషలకీ, ప్రకృతులకీ, వేష భాషలకీ ఈ వైదిక సంప్రదాయం ఒక ఆధ్యాత్మికమైన బంధనంగా నిలచింది. పూలదండలో దారం దాగున్నట్లు అదృశ్యమైన ఈ బంధనం లేక పోతే అంగవంగకళింగాదులన్నీ వేటికవే ప్రత్యేకాలు అయి ఉండేవి.

ఈ వైదిక సంప్రదాయం, ఈ వైదిక ధర్మం, భిన్నత్వంలో ఏకత్వానికి పునాది అయింది. ఎలా అయిందీ? మన వేద వేదాంగాలన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి. అవి మనం సంస్కృతంలోనే చదువుకుంటాం. తత్సాంప్రదాయాలని సంస్కృతంలోనే నిర్వర్తించుకుంటాం. మన దేశ భాషలు ఐహికాలకి మాత్రమే పరిమితాలు. ఆధ్యాత్మికాలు వచ్చేటప్పటికి మళ్ళా సంస్కృతాన్నే ఆశ్రయిస్తాం. వీటి సారాంశాలని దేశ భాషలలోకి మనం ఎంత అనువదించుకున్నా, ధర్మాచరణ వేళకి మనకి మళ్ళా సంస్కృతమే కావాలి. ఇది ప్రాంతీయాలకి పరిమితం కాదు. దేశవ్యాప్తం. అంటే మనకి ఈ భరత ఖండంలో లౌకిక వ్యవహారాలకి దేశ భాషలూ, ఆధ్యాత్మిక పారమార్ధికాలకి సంస్కృతం జాతీయ భాషగా చెలామణీ అయేయి, సహస్రాబ్దాల పాటు. ఈ విశాల భరత ఖండంలో భిన్న దేశాల వారికీ, భిన్న జాతుల వారికీ, భిన్న భాషల వారికీ, భిన్న సంప్రదాయాలవారికీ ఏకత కలిగించినదీ ఈ సంస్కృతభాషే.

వాల్మీకి రామాయణాన్నీ, కృష్ణద్వైపాయనుడు భారతాన్నీ రచించినది ఈ భాషలోనే. గౌతముడు, పతంజలి, జైమిని దర్శనాలు రచించిందీ ఈ భాషలోనే. కాళిదాసు, భవభూతి, బాణుడు రసస్రవంతులు ప్రవహింపచేసినది ఈ భాషలోనే. రాముడు అయోధ్యా వాసి. కృష్ణుడు ద్వారకా వాసి. ఆది శంకరుడు దాక్షిణాత్యుడు. వీరి మాతృభాషలు ఏమిటి? అయోధ్యలోను, ద్వారక లోనూ, కాలడి లోనూ అప్పటి జన భాషలా? కాదే! వీరంతా సంస్కృత భాషలోనే అవతరించారు, సృజనా వ్యాపారం కొనసాగించేరు. అయినా వీరందరినీ ‘మన’ వాళ్ళు గానే పరిగణించేము కదా!

ఆంధ్రం, కన్నడం, వంగం, మళయాళం, ఓఢ్రం .. ఇవన్నీ కొమ్మలనుకుంటే సంస్కృతం కాండం వంటిది. అటువంటి కాండం పాశ్చాత్య ప్రపంచపు ఆంగ్ల ప్రభంజనంలో కూకటి వేళ్ళతోకదిలిపోయింది. ఈ ఆంగ్లం నిజానికి దేశభాషలని ఏమీ చెయ్యలేదు; సంస్కృతం పూర్వం ఏ స్థానంలో ఉండినదో ఆ స్థానాన్ని ఆంగ్లం ఆక్రమించుకుంది. సంస్కృతం ఆధ్యాత్మిక, పారమార్ధిక, ధర్మాచరణ సందర్భాలలో జాతీయ భాషగా నిలిస్తే, ఆంగ్లం పై మూడింటిని స్పర్శించనైనా స్పర్శించకుండా, రాజకీయ, వర్తక, వాణిజ్య, ఉన్నత విద్యా వ్యవహార, లౌకిక నిత్యకృత్యాలలో వాడుక భాషగా నిలచింది. విభిన్న జాతులని ఒక తాటి మీద నిలపటానికి పూర్వం సంస్కృతం ఏ పాత్ర పోషించిందో అటువంటి పాత్రనే ఇంగ్లీషు పోషిస్తోంది, ఇప్పుడు.

ఆంగ్లం పరిధి, ప్రభావము సంస్కృతం కూడ కని, విని, ఎరగని మారు మూలల్లోకి కూడ ప్రసరించి మన ఆర్ష విద్యా సంప్రదాయానికి ఒక గొడ్డలి పెట్టు అయింది. పూర్వం దేశ భాషలలో ఎంత పాండిత్యం, ప్రావీణ్యం ఉన్నా ఉభయభాషాప్రవీణ అనిపించుకుంటే కాని దేశభాషలలోని పాండిత్యం పనికి వచ్చేది కాదు. ఈ రోజులలో తెలుగు పండితుడికి తెలుగులో పాండిత్యం లేకపోయినా తెలుగుతోటీ, ఆంగ్లంతోటీ పరిచయం ఉండాలి; సంస్కృతం రాకపోయినా పరవా లేదు. సంస్కృతంతో బంధం ఇలా తెగిపోయేసరికి సంస్కృతం అనే చెట్టును ఆసరాగా చేసుకుని లతావల్లికలా ఎదిగిన తెలుగు ఒక విధంగా అనాధ అయిపోయింది. ఆ స్థానంలో వచ్చి నిలచిన ఇంగ్లీషు ప్రభావం తెలుగుతో పాటు దేశభాషలన్నిటి మీదా విపరీతంగా పడ్డప్పటికీ, ఈ ఆంగ్లం ఒక దాది, ఒక పెంపుడు తల్లిగానే ఉండగలిగింది కానీ మన దేశభాషలకి కన్న తల్లి కాలేకపోయింది.

దేశ భాషలని సంస్కృతము, ఆంగ్లము కొంతవరకు సారూప్యంగానే ప్రభావితం చేసేయి కానీ ఈ సారూప్యం పరిపూర్ణమూ, సమగ్రమూ కాదు. అందువల్లనే సంస్కృత సమాస భూయిష్టమైన తెలుగు తెలుగులాగే చెలామణీ అయిపోతుంది కాని, ఇంగ్లీషు మాటలతో నిండిన, “మా హసుబెండు గారు ఇంగ్లీషులోనే కాని తెలుగులో థింకు చెయ్యలేరని నేను చెబితే మీరు బిలీవు చెయ్యగలరా?” అన్నటువంటి వాక్యం మన చెవులకి ఎబ్బెట్టుగా వినిపిస్తుంది. నా చిన్నతనంలో పాశ్చాత్య భాషలలోని మాటలని తెలుగు నుడికారానికీ, వ్యాకరణానికీ అనుకూలంగా మలుచుకుని అప్పుడు వాడుకునేవాళ్ళం. హలంతాలని అజంతాలుగా మార్చి వాడటం, తత్సమాలని తద్భవాలుగా మార్చటం, రెండు చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇప్పుడు ఇంగ్లీషు మాటలని, పదబంధాలని, వాక్యాలని “హోల్‌సేల్ టోకుగా ఇంపోర్ట్” చేసేసుకుని వాడేస్తున్నాం. దీనితో భాషకి కంచర రూపం వచ్చింది తప్ప భాష నూతన పదజాలాలతో పరిపుష్టం కాలేదు.

అయినప్పటికీ – ఒక నాడు మన ఏకత్వానికి సంస్కృతం ఎలా దోహదం చేసిందో ఇంగ్లీషు ఈ నాడు అదే పని చేస్తోంది. ఒక నాడు తెలుగు భాషని, పదజాలాన్ని, లిపిని, వ్యాకరణాన్నీ సంస్కృతం ఎలా ప్రభావితం చేసిందో ఈ నాడు ఇంగ్లీషు దరిదాపుగా అదే పని చేస్తోంది. ఒక నాడు తెలుగు రచయితలని సంస్కృతం ఎలా ప్రభావితం చేసిందో ఈ నాడు ఇంగ్లీషు అదే పని చేస్తోంది. ఒక నాడు సంస్కృతం చెయ్యనిది కూడ ఈనాడు ఇంగ్లీషు చెయ్య గలుగుతోంది; ఇంగ్లీషు వచ్చిన భారతీయుడు నేడు సునాయాసంగా ప్రపంచ పౌరుడుగా చెలామణీ అవుతున్నాడు. ప్రపంచాన్నే జయించగల సమర్ధుడు అవుతున్నాడు. కనుక ఇంగ్లీషు యొక్క ప్రాముఖ్యతని విస్మరించటం తగని పని. పూర్వం సంస్కృతాన్ని అభిమానించి అందలం ఎక్కించినట్లే నేడు ఇంగ్లీషుని అభిమానించి నేర్చుకోక తప్పదు. కనీసం ఇరవై ఒకటవ శతాబ్దం అంతం అయేవరకు ఈ పరిస్థితి మారేటట్లు కనబడటం లేదు.

ఈ పరిస్థితులలో తెలుగు సంగతి ఏమిటి? తెలుగు విలుప్తం అయిపోకుండా మనం రెండు రకాల ప్రయత్నాలు చెయ్యవచ్చు. ఒకటి, తెలుగు భాష వాడుకని తెలుగు దేశంలో పెంచటం. రెండు, తెలుగు భాష ఉనికిని విదేశాలలో పెంచటం.

ముందు రెండవ అంశాన్ని తీసుకుందాం. కాల ప్రవాహానికి ఎదురీదలేము కనుక “మనం మన తెలుగు భాషని పరిరక్షించుకొని ఉద్ధరించాలంటే ఈ ఇంగ్లీషు కి ఉన్న పరపతిని మనం మన అవసరాలకి వాడుకోక తప్పేటట్లు లేదు. ఎలా? తెలుగు గురించి ఇంగ్లీషులో రాయాలి. మంచి తెలుగు పుస్తకాలని ఇంగ్లీషులోకి అనువదించాలి. తెలుగు గొప్పదనాన్ని ఇంగ్లీషులో చాటి చెప్పాలి” అని చెప్పేవారు కొందరు ఉన్నారు. ఈ సలహాలో కూడ ఒక చిక్కు ఉంది. తెలుగులో ఉన్న సాహిత్యం చాల మట్టుకు అనువాద సాహిత్యమే; మొదట్లో సంస్కృతం నుండి, ఇప్పట్లో ఇంగ్లీషు నుండి. మళ్ళా దీనిని ఇంగ్లీషులోకి తర్జుమా చెయ్యటమేమిటని. ఈ వాదనలో బొత్తిగా పస లేకపోలేదు కాని, తెలుగులో సృజన శూన్యం అనటం కూడ అన్యాయమే.

అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? భాష ఒక నదీ ప్రవాహం లాంటిది. ఇతర భాషల నుండి మాటలు అరువు తెచ్చుకుని భాషని కల్తీ చెయ్యద్దంటే ఎవ్వరూ వినరు. అలా అనవలసిన అవసరం కూడ లేదు. కానీ ఈనాడు వాడుకలో ఉన్న భాష సులభంగా నేర్చుకోవటానికి మనం సదుపాయాలు కలుగజేయాలి. “తెలుగు కంటె హిందీ, తమిళం నేర్చుకొనటం తేలిక” అని ఎవ్వరైనా అంటే ఆవేశపడిపోకుండా పరిష్కార మార్గాలు ఆలోచించాలి. పూర్వం తెలుగు వ్యాకరణం సంస్కృతంలో రాసేవారు. ఇప్పుడు, అవసరమైతే ఇంగ్లీషులో కూడ రాసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. తెలుగు “సెకండ్ లేంగ్వేజ్” గా నేర్చుకునే అభిలాష ఉన్నవారి సదుపాయానికి కొత్త వ్యాకరణాలు, వాచకాలు తయారు చెయ్యాలి. ఇవన్నీ ప్రవాసాంధ్రులని, విదేశీయులని దృష్టిలో పెట్టుకుని చెప్పిన సలహాలు.

ఇప్పుడు మొదటి అంశాన్ని పరిశీలిద్దాం. పైన నుడివిన పనులు ఎన్ని చేసినా తెలుగుని తెలుగుదేశంలోనే మరచిపోతే అసలుకే మోసం. భాష వాడుతూన్నకొద్దీ వాడి పోకుండా వాడిగా ఉంటుంది. తెలుగు దేశంలో తెలుగు వాడకానికి, తెలుగుని ప్రోత్సహించటానికి కార్యక్రమాలు చేపట్టాలి. తెలుగు దేశంలో తెలుగు భాష విలుప్తం ఇప్పట్లో అయే ప్రమాదం లేదని నిర్లిప్తతతో ఊరుకోకుండా దీపం ఉన్నప్పుడే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి.

ఈ గమ్యం చేరుకోటానికి కొన్ని సూచనలు:

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి 1-5 తరగతులలో (అంటే ప్రాథమిక పాఠశాలలో) ఉన్న విద్యార్ధులు తెలుగు తప్పని సరిగా నేర్చుకుని తీరాలి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి 6-11 తరగతులలో (అంటే ఉన్నత పాఠశాలలో) ఉన్న విద్యార్ధులు కనీసం రెండు భాషలు నేర్చుకోవాలి. అందులో తెలుగు తప్పనిసరిగా ఒకటి అయి ఉండాలి. రెండవదానిగా బోధనా వనరులు ఉన్నంతవరకు విద్యార్ధి ఏ భాషనైనా ఎన్నుకోవచ్చు.(క.) సాధారణ పరిస్థితులలో ఈ రెండవ భాష సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, ఉర్దు లలో ఒకటి అవటానికి అవకాశాలు ఎక్కువ. వైజ్ఞానిక, సాంకేతిక, వాణిజ్య, వ్యాపారాది రంగాలలో తప్పని సరి కనుక సర్వసాధారణంగా ఈ రెండవ భాష ఇంగ్లీషు అవుతుంది.
(చ.) శ్రౌతం, స్మార్తం కావలసినవారికి ఇది సంస్కృతం కావచ్చు.

(ట) మూడవ భాష నేర్చుకునే ఉత్సాహం ఉన్న పిల్లలకి వీలైనంతవరకు కొన్ని పాఠశాలలనోనైనా అవకాశాలు కల్పించటానికి ప్రయత్నించాలి.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి 1-11 పాఠశాలలో బోధనకి మాధ్యమంగా ఇంగ్లీషు, తెలుగు, ఉర్దు లలో ఏ భాషైనా కావచ్చు కాని తెలుగులో నేర్పమని కనీసం పది శాతం విద్యార్ధులు కోరితే వారికి ఆ వనరురులు తప్పక కలుగజెయ్యాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు పొలిమేరల్లో లావాదేవీలు, బేరసారాలు ప్రజలతో జరిగే సందర్భాలలో ఆ వ్యవహారాలు తెలుగులో కూడ జరగటానికి సావకాశం తప్పని సరిగా ఇవ్వాలి.(క) ఉదా. రైలు టికెట్లు, రిజర్వేషన్లు చేయించుకునేటప్పుడు, దరఖాస్తు ఫారాలు పామరులు తెలుగులో నింపినా, అధికారులు కంప్యూటర్ల సహాయంతో వాటిని ఇంగ్లీషులోకి మార్చుకోవచ్చు. జాబితాలని రెండు భాషలలోనూ అచ్చు కొట్టవచ్చు.
(చ.) ఉదా. మిగిలిన ఏ భాషలు వాడినా, వాడక పోయినా కచేరీల మీద, మిగిలిన బహిరంగ భవనాల మీద, తెలుగులో వాటి పేరు రాయాలి.

(ట.) ఉదా. ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్ళే బస్సుల మీద, తెలుగులో కూడ ఊర్ల పేర్లు రాయాలి. అంతేకాని, లైసెన్సు ప్లేటుల మీద లైసెన్సు నంబర్లని తెలుగు అంకెలలో రాసి సాధించగలిగేది ఏదీ లేదు.

పూర్వం రాజులు పోషించినట్లే, ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యపు వ్యవస్థలో భాషని, సాహిత్యాన్ని ప్రజలు పోషించాలి. ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేస్తుందని మనం ఎదురుచూడటం అవివేకం. ఇది ఎలా సాధ్యం? తెలుగు తెరచాటున పడి వాడుకలోంచి తప్పిపోయే లోగా పాశ్చాత్య దేశాలలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు కొంతవరకు పూనుకొని చెయ్యొచ్చు, చేస్తున్నారు కూడ.(క) ఉదా. తెలుగు సారస్వతాన్ని అంధ్రేతరులకి అందించటానికి ప్రయత్నాలు చెయ్యటం. ఇంగ్లీషుని ప్రథమ భాషగా నేర్చుకున్న మన పిల్లలు కాని, కనీసం ఇంగ్లీషు దేశంలో తరాలబట్టి నివసిస్తూ ఇంగ్లీషు నుడికారాన్ని ఒంటబట్టించుకున్న మన లాంటి వలస-తరం వారు కాని ప్రయత్నించి చూడాలి. తెలుగులో కథలకీ, కవితలకీ, వ్యాసాలకీ, పోటీలు పెట్టినట్లే తెలుగు నుండి ఇంగ్లీషులోకి తర్జుమా చెయ్యటం కాని, తెలుగు కథా వస్తువుని ఇంగ్లీషులో రాయటం కాని ప్రోత్సహించటానికి పోటీలు పెట్టాలి. ఇటువంటి కార్యక్రమం ఆటా, తానా, సిలికాన్ఆంధ్రా మొదలైన సంస్థలు చేపడితే బాగుంటుంది.
(చ) ఉదా. ప్రవాసాంధ్రులం బాలవిహార్ లాంటి పాఠశాలలు ఎన్ని పెట్టినా, తెలుగు భాష ఉనికిని వేత్తృత స్థాయికి లేవనెత్తాలంటే పాశ్చాత్య దేశాలలోని విశ్వ విద్యాలయాలు మరికొన్నిటిలో తెలుగు పీఠాలు స్థాపించాలి. విస్కాన్‌సిన్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఈ దిశలో కొన్ని అడుగులు వేసింది. చెయ్యవలసినది ఇంకా చాలా ఉంది. తెలుగువారు ఎక్కువగా ఉన్న రెండు కోస్తాలలో కూడ ఈ రకం కృషి జరగాలి.

(ట) తెలుగు సభలలో వక్తలు తెలుగులో మాట్లాడటానికి కొంచెం కృషి చెయ్యాలి.

No comments:

Post a Comment