శైవాగమాలు
సాహితీమిత్రులారా!
శైవాగమాలు ఇరవై ఎనిమిది. ఈశ్వరుని సద్యోజాతాది పంచముఖాలనుంచి ఇవి ఉత్పన్నమైనాయి. వీటికి వక్త పరమేశ్వరుడే. ఈ 28 ఆగమాలలో 10 శివభేదాలు
కాగా 18 రుద్రభేదాలు. శివభేదాలలో ఒక్కొక్కదానికి ముగ్గురు,
రుద్రభేదాలలో ఒక్కొక్కదానికి ఇద్దరు ప్రవర్తకులు.
శైవ సంప్రదాయాన్ననుసరించి శివసృష్టి సమారంభంలో
యోగమాయ చేత ఇచ్ఛాశక్తి వల్ల సృష్టి బీజం చిలుకరింపబడింది.
అప్పుడు నాదము, దాని కింద బీజము, దానికింద అంబిక అనే శక్తి ఆవిర్భవం పొందాయి. ఆ క్రింద వామశక్తికి పరరూపాలుగా జయ విజయాది శక్తులు లోకంలో వ్యాప్తమైనట్లు స్ఫురించి వాటినుండి
50 అక్షరాలు ఏర్పడినాయి. స్వరాక్షరాన్ని శివుడు, వ్యంజనాక్షరాన్ని శక్తి అధిష్టించి ఉంటారు. స్వరవ్యంజనాక్షరాల కలయిక వలన పదవాక్యాదులు ఏర్పడి అర్థ ప్రతీతి కలుగుతున్నది.
శైవాగమాలలో జ్ఞా, క్రియా, యోగ, చర్యా పాదములనే 4 పాదాలు ఉన్నాయి. జ్ఞానపాదంలో పశుపతి, పాశముల స్వరూప లక్షణాదులు,
శివ శక్తి సదా శివాదులయిన 36 తత్త్వాల స్వరూపము, తత్త్వ రూప దర్శన శుద్ధ్యాది దశ కార్య లక్షణాలు నిరూపింపబడి ఉంటాయి. క్రియాపాదంలో మంత్ర విభాగంలో ఆయా క్రియలకు ఉచితమైన మంత్రాలు, క్రియా విభాగంలో పరిమాణ, గర్భన్యాస, శిలా సంగ్రహణ, లింగమూర్తి ప్రతిష్ఠాదులు, రక్షాబంధం, కుంభ స్థాపన, కలాకర్షణ, కుంభాభిషేక, మహాభిషేక, మండలాభిషేకాలు, ఉత్సవ, ప్రాయశ్చిత్త,
నిత్యనైమిత్తక, కావ్య పూజాదులు వివరించబడి ఉంటాయి.
యోగపాదంలో షట్చక్రాల స్వరూపం, బ్రహ్మరంధ్ర, బ్రహ్మ రుద్ర విష్ణుగ్రంధి, సబస్రార కుండలిన్యాదుల స్వరూపం తెలుపబడుతుంది. చర్యాపాదంలో పూజోపకరణాలు, ఉపచారాలు, ఆరాధన విధులు వర్ణితమవుతాయి.
కాశ్మీర దేశంలో అభినవ గుప్తాదులు ప్రత్యభిజ్ఞా, స్పందదర్శనాలు అనే శైవాద్వైత సంప్రదాయాలను ప్రతిష్ఠించారు.
వీటిలో 1. భైరవ, 2. యామళ, 3. మత, 4. మంగళ, 5. చక్రాష్టక, 6. బహురూప, 7. వాగీశ, 8. శిష్టాష్టక అనే తంత్రవిభాగాలు. ఈ విభాగాలలో ఒక్కొక్క దానిలో ఎనిమిదేసి తంత్రాలు ఉన్నాయి.
No comments:
Post a Comment