పద్మిని - 2
సాహితీమిత్రులారా!
పద్మిని జాతి స్త్రీ గురించిన విషయం
మరికొంత-
రాజీవగంధియే రాకేందుబింబాస్య
నీలోత్పలశ్యామ నిర్మలాంగి
సద్గుణచారిత్ర సత్యవ్రతాచార
తరుణి కురంగాబ్జ ధవళనేత్ర
పాటలాధర రక్తపల్లవమృదుపాణి
గానవిద్యాలోల దానవిభవ
కీరభాషిణి మణిహారవిభూషిత
మదమదావళయాన మధురభోజి
నీరు జలజంబువాసన మారుకేళి
నాలుగవజామునకుఁదేలుఁ గేళినొరులఁ
జిత్తగింపదు పాంచాలుఁ జెందఁగోరు
విమల వస్త్రంబు పద్మిని వేడ్కఁగట్టు
తామరపువ్వులవంటి వాసనగల దేహమును,
పూర్ణచంద్రునివంటి ముఖమును, నల్లకలువలవంటి
దేహకాంతియు, నిర్మలమైన అవయవములును,
మంచిగుణమును, సత్యమును చెప్పుటయు,
లేడికండ్లును, తెల్లని నేత్రములును, తెలుపును
మించి ఎరుపువర్ణముగల అధరమును, లేత
చిగుళ్లవంటి అరచేతులును, లయజ్ఞానసంగీత
ప్రసక్తియు, యొప్పిదమైన యీవియు, చిలుక
పలుకులవంటి పలుకులును, రత్నములుపొదిగిన
భూషణాలంకారములును, మదపుటేనుగువంటి
నడకయు, తియ్యని పదార్థములందిష్టమును,
తామరవాసనగల రతిజలమును, నాలుగవజామున
రతిసల్పుటయు, రతియందు పాంచాలునిగాగ
ఇతరులను సమ్మతింపకపోవుటయు, తెల్లని
వస్త్రములు గట్టుటయు పద్మిని జాతిగా తెలియనగును-
అని భావం
No comments:
Post a Comment