Friday, May 18, 2018

పినవీరుని పద్యరచనలో గుబాళింపు


పినవీరుని పద్యరచనలో గుబాళింపు
సాహితీమిత్రులారా!


పినవీరభద్రుని పద్యరచనను వివరించే ఈ రచనను
శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు చేశారు. దీన్ని ఈ మాట
అంతర్జాల పత్రికలో అక్టోబర్ 2017ని ప్రచురించారు
దీన్ని మన పాఠకులకై ఇక్కడ................పొసగన్ నే గృతి జెప్పగా బరిమళంబుల్ చాల కొక్కొక్కచో
గొస రొక్కించుక గల్గె నేనియును సంకోచంబు గాకుండ నా
రసి యచ్చోటికి నిచ్చుగాత పరిపూర్ణంబొంద వాగ్దేవి యిం
పెసలారం దన విభ్రమశ్రవణ కల్హారోదయామోదముల్

తెలుగు కావ్యాల అవతారికలో మొట్టమొదట ఇష్టదేవతా స్తుతి చెయ్యడం అనూచానంగా ఏర్పడిన ఒక సంప్రదాయం. నన్నయ్య తిక్కనలు దీనిని ఒక పద్యంతో సరిపెట్టారు కాని, అనంతర కవులు దాన్ని పొడిగిస్తూ పోయారు. అందులో కూడా ఆయా కవుల కల్పనా చాతుర్యం, పద్య రచనా వైదుష్యం ప్రతిఫలించే అందమైన పద్యాలు కనిపిస్తాయి. సింహాసనము చారు సితపుండరీకంబు అంటూ గొప్ప ధారతో సాగే సీసంలో శ్రీనాథుడు చేసిన సరస్వతీ స్తుతి, అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ గణేశుని అల్లరిని వర్ణించే పెద్దన వినాయక స్తుతి, ఈ చిగురాకు నీ ప్రసవ మీ పువుదేనియ అంటూ శివుని కల్పతరువుతో పోల్చి చెప్పిన రామకృష్ణుని పద్యం మొదలైనవెన్నో సాహిత్యలోకంలో ప్రసిద్ధి చెందాయి. సరే పోతన పద్యాలయితే చాలామంది తెలుగు వారికి కంఠస్తమే! పైన పేర్కొన్న పద్యం కూడా ఒక కావ్య అవతారికలోని దేవతా ప్రార్థనే. అయితే నేను చదివిన దేవతా ప్రార్థనలన్నింటిలోనూ నాకు చాలా విలక్షణంగా తోచిన పద్యమిది. కవి గడుసుదనంతో అల్లిన ఈ పద్యం ఆలోచించే కొద్దీ కమ్మని భావ సౌరభాన్ని వెదజల్లుతుంది.

ఇది పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు రచించిన శాకుంతల కావ్య పీఠికలోని పద్యం, వాగ్దేవి స్తుతి. పిల్లలమఱ్ఱి పదిహేనవ శతాబ్దానికి చెందిన కవి. భారతం, అభిజ్ఞాన శాకుంతల నాటకం ఆధారంగా శకుంతలా దుష్యంతుల ప్రణయాన్ని పరిణయాన్ని వర్ణించే అచ్చమైన శృంగార ప్రబంధం శాకుంతలం. కవి దీనికి పెట్టిన పేరు శాకుంతలమే అయినా ఇది శృంగార శాకుంతలంగా ప్రసిద్ధి పొందింది. బహుశా శ్రీనాథుని శృంగార నైషధం పేరు ప్రభావం కావచ్చును. ఈ కావ్య అవతారికలో తాను నవరస దర్పణం, నారదీయము, మాఘ మాహాత్మ్యము, మానసోల్లాసము అనే రచనలు చేసినట్టు చెప్పుకొన్నాడు పినవీరన. అయితే ఆ రచనలేవీ మనకు దొరకలేదు. పినవీరభద్రుని మరొక రచన జైమిని భారతం మాత్రం లభ్యమయింది. అది బహుశా అతని చివరి రచన అయ్యుంటుందని పరిశోధకుల అభిప్రాయం. ఈ జైమిని భారతం గురించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.

సాళువ నరసింహరాయల ఆదేశం మేరకు ఆయనిచ్చిన గడువులోపల జైమిని భారత రచన చేయవలసి ఉండగా, గడువు తీరే ముందు రోజు వరకూ పినవీరభద్రుడు ఆ కావ్య రచన జోలికైనా వెళ్ళలేదట. ఆయన అన్నగారు ఇప్పుడెలా అని అడిగితే, కంగారు అవసరం లేదని చెప్పి తన గదిలోకి వెళ్లి గడియ వేసుకొని శారదాపీఠం ముందు కూర్చొని సరస్వతీ ధ్యాన నిమగ్నుడయ్యాడట పినవీరన. అతను ధ్యానంలో ఉండగా సరస్వతి ప్రత్యక్షమై శతఘంటాలతో కావ్యాన్ని వ్రాయడం మొదలుపెడుతుంది. ఇంచుమించు పూర్తి అవుతోందనగా, ఆ గదినుండి వస్తున్న దివ్యకాంతులను చూసి అన్న తలుపు సందునుండి చూసేసరికి, ‘బావగారు వచ్చారు’ అంటూ సరస్వతి అదృశ్యమవుతుంది. మిగిలిన కొద్ధి భాగాన్నీ పూరించి పినవీరభద్రుడు తన కావ్యాన్ని మరునాడు సభకు తీసుకువెళతాడు. ముందు రోజు వరకూ అతను కావ్యాన్ని ముట్టలేదని రాజుగారితో సహా సభలో పండితులందరికీ తెలుసు. అంచేత ఇందులో ఏదో మోసం ఉందని సభ అతనిపై అభియోగం మోపుతుంది. అప్పుడతను ‘వాణి నా రాణి’ అని, అందుకే అది సాధ్యమయ్యిందని ప్రకటిస్తాడు. అతని ఆ మాటకు సభ మరింత కోపగిస్తే, అది వాగ్దేవి చేతనే చెప్పిస్తానని ఒక తెరగట్టిస్తాడు. ఆ తెర వెనుకనుండి తన చేయెత్తి పినవీరభద్రుని మాట నిజమేనని సరస్వతి సాక్ష్యమిస్తుంది. అదీ కథ!

ఈ కథ నేపథ్యంలో పై పద్యాన్ని చదివితే అది మరింత రమ్యంగా ఉంటుంది!

పొసగన్ – చక్కదనంతో, నే కృతి చెప్పగా, పరిమళంబుల్ చాలక ఒక్కొకచో కొసరు ఒక్క ఇంచుక కలిగెనేనియు – ఒకొక్క చోట అందులోని కవితా సుగంధానికి పిసరంత లోటు కలిగినా, సంకోచము కాకుండా – సందేహింపక, ఆరసి – జాగ్రత్తగా కనిపెట్టి, వాగ్దేవి – సరస్వతి, ఇంపు ఎసలారన్ – చక్కదనం మరింత ఎక్కువయ్యే విధంగా, అచ్చోటికి – ఆ చోటుకి, పరిపూర్ణంబు ఒంద – పరిపూర్ణం కలిగేటట్టుగా (లోటు తీరేట్టుగా), తన విభ్రమ శ్రవణ కల్హార ఉదయ ఆమోదముల్ – తన కాంతులీనే చెవులనే వికసించే కలువల నుండి వ్యాపించే సువాసనలు, ఇచ్చుగాత – ఇవ్వాలని కోరుకొంటున్నాను.

ఇది వాచ్యార్థం. దీని తాత్పర్యం ఏమిటంటే – తాను చెపుతున్న ఈ కావ్యంలో అక్కడక్కడ కవిత్వ సౌరభానికి పిసరంత లోటు ఏర్పడినా, సరస్వతీదేవి దాన్ని జాగ్రత్తగా కనిపెట్టి ఆ లోపాన్ని తన వికసించే ఎర్ర కలువల్లాంటి చెవులనుండి వ్యాపించే సువాసనలతో ఆ లోటును పూర్తి చేయుగాత అని కోరుతున్నాడు కవి. స్థూలంగా, సరస్వతీ దేవి స్వయంగా తన కావ్యంలో లోటుపాట్లను చూసి వాటిని పూరించాలని కవి కోరిక. ఇందులో అభ్యర్థన కన్నా ఆదేశమే ధ్వనిస్తోంది! ఈ కవి నిజంగా వాణి నా రాణి అనగలిగే సత్తా ఉన్నవాడే అనిపిస్తుంది. అయితే, తన చెవులనుండి పుట్టే సువాసనలతో పూరించమని అడగడం ఏమిటి? ఈ పద్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే మన ఆలోచన ఇక్కడ ప్రారంభం కావాలి. ఈ పద్యంలో సంకోచము, ఆమోదము అనేవి కీలకమైన పదాలు. వీటికి రెండర్థాలు ఉన్నాయి. సంకోచం అంటే ముడుచుకోవడం, సందేహించడం. నిజానికి సంస్కృతంలో దాని అర్థం ముడుచుకోవడమే. తెలుగు వాడుకలో సందేహించడం అనే అర్థం అదనంగా వచ్చింది. అలాగే ఆమోదం అంటే రెండు అర్థాలు – వ్యాపించే సుగంధం, సంతోషంతో ఇచ్చే సమ్మతం. కవి కృతి చెపుతున్నాడు. అంటే వినిపిస్తున్నాడు. ఎవరికి? సరస్వతికి. ఆమె వింటుంది. మధ్యలో ఏదైనా ఒకచోట ఏదైనా కాస్త లోటు అనిపించినా, చెవులు మూసుకోకుండా (సంకోచంబు కాకుండ) వినమని, విని తన ఆమోదముద్రను అందించమని కోరుకొంటున్నాడు. ఆమె తన కావ్యాన్ని వినడమే ఆమె ఆమోదం. అందుకే ఆ ఆమోదాన్ని తెలిపేది ఆమె చెవులు. ఆమె ఆమోదమే తన కావ్యానికి పరిపూర్ణత్వాన్ని చేకూరుస్తుంది. సంకోచ, ఆమోద పదాలకు పూలతో ఉన్న సంబంధాన్ని ఆధారం చేసుకొని ఈ అందమైన పద్యాన్ని అల్లాడు పినవీరన. ఇందులో మరొక మహార్థం కూడా ఇమిడి ఉన్నదని ఎస్.వి. జోగారావు తన శారదాపీఠమనే వ్యాసంలో ఇలా అన్నారు: ఈ కవి వాక్కులే ఆ దేవి పూజా పుష్పములు. తత్పరిమళ గ్రహణ తత్పర ఆమె. అవి వాక్పుష్పములు అగుట వాని గమ్యస్థానము ఆమె శ్రవణములే. కాన, తత్ సౌరభ లోప పూరకము ఆమె శ్రవణ కల్హారోదయములే.

ఈ అర్థంలో ఆలోచించి చూస్తే, పినవీరన సరస్వతీదేవిని తన వాక్కులతో ఉపాసించే ఉపాసకుడుగా కనిపిస్తాడు. వాణి నా రాణి అంటే సరస్వతి ఆతని ఉపాసనా పీఠాన్ని అధిష్ఠించిన దేవత అని అర్థం వస్తుంది.

కవి వాక్కులను పుష్పాలతోనూ, వానిలో మాధుర్యాన్ని మకరందంతోనూ పోలుస్తూ, ఆ మాధుర్యాన్ని అమ్మవారి చెవులు నిరంతరం ఆస్వాదిస్తాయి అనే భావన సౌందర్యలహరిలో కవీనామ్ సందర్భ స్తబక మకరందైక రసికం అనే శ్లోకంలో కనిపిస్తుంది. అలా ఆస్వాదించే చెవుల దగ్గరకి అమ్మవారి రెండు కన్నులనే తుమ్మెదలు దగ్గరగా సాగి (అంటే ఆమె ఆకర్ణాంత విశాల నేత్ర అని), తాము కూడా నిత్యం ఆ తేనెను గ్రోలే ప్రయత్నంలో ఉంటాయట. తనకు ఆ భాగ్యం లేదని అసూయ చెంది మధ్యలో ఉన్న ఫాల నేత్రం కోపంతో ఎఱ్ఱబారిందట! అది ఆదిశంకరుల కవిత్వ సౌందర్య సౌరభం! సౌందర్యలహరిలో మరి రెండు శ్లోకాల ప్రభావం కూడా పినవీరన పద్యంపై ఉన్నదని అనిపిస్తోంది. సరస్వత్యాః సూక్తీ రమృతలహరీ అనే శ్లోకంలో, సరస్వతి గానామృతాన్ని అమ్మవారు తన చెవులతో నిరంతరం గ్రోలుతూ ఆ పాటలకు తల ఊపుతూ ఉంటే, చెవులకున్న కుండలాలు చేసే ఝణఝణలు ఆమె తన ఆమోదాన్ని తెలుపుతూ బదులిచ్చినట్టుగా ఉన్నాయట. చెవులతో తెలిపే ఆమోదం అదన్నమాట! అలాగే సవిత్రీభిర్వాచాం అనే శ్లోకంలో అమ్మవారిని ధ్యానించే కవులు, సరస్వతీదేవి ముఖకమల పరిమళము చేత మధురమయిన వాక్కులు (వచోభిర్ వాగ్దేవీ వదన కమలామోద మధురైః) కలిగి గొప్ప కావ్యాలను రచించే సామర్థ్యం పొందుతారని శంకరుల వాక్కు. సరస్వతీ ఉపాసకుడైన పినవీరనకు సౌందర్యలహరి నిత్య పరిచితమే అయ్యుంటుంది కదా!

కవిత్వంలోని సౌందర్యాన్ని పరిమళంగా భావించడం పినవీరనకు చాలా ఇష్టమై ఉండాలి. ఈ పోలిక మరికొన్ని చోట్ల కూడా కనిపిస్తుంది. అల్లన విచ్చు చెంగలువలందు రజంబును కప్పురంబు పై జల్లగ జల్లనై వలచు సౌరభముల్ వెదజల్లు భావములు తన కవిత్వంలో ఉంటాయని చెప్పుకుంటాడు. నన్నయ్య ప్రబంధ ప్రౌఢవాసనా సంపత్తి, తిక్కన వాక్ఫక్కికామోదంబు, నాచన సోముని వాచా మహత్వంబు సౌరభములు, శ్రీనాథుని భాషా నిగుంభన పరిమళంబులు తన కవిత్వం వెదజల్లుతుందని అంటాడతను.

శృంగార శాకుంతలంలో కథ ప్రసిద్ధమే. భారతంలో శకుంతలోపాఖ్యానం, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కలిపి, తన సొంత కల్పనలు కొంత చేర్చి ఈ కావ్యాన్ని కూర్చాడు పినవీరన. కథా సంవిధానంపై కన్నా, రస పోషణకు ఆలంకారికులు స్థిరపరిచిన విభావ అనుభావ సంచారీ భావ నిర్వహణలో ఎక్కువ శ్రద్ధ కనిపిస్తుంది. అందమైన పద్య నిర్మాణంలో మాత్రం పినవీరన అందెవేసిన చేయి. అతడు పద్య శిల్పం తెలిసిన కవి. ఈ కావ్యం అందుకోసమే చదవాలి. అలాంటి కమనీయ శైలితో రాజిల్లే ఒక సీస పద్యం:

ఆలానదండంబు హేలాహవాహూత రిపురాజ ధరణీకరేణువునకు
మానదండము మహామనుజేశ గర్వాబ్ధి గంభీరతా పరీక్షా విధికిని
నాళదండము సమున్నత జయశ్రీవధూ సముచిత క్రీడాబ్జసౌధమునకు
నాధారదండంబు హరిణాంకకుల కుభృజ్జన శుభ్రకీర్తిధ్వజంబునకును
యష్టిదండంబు వృద్ధశేషాహిపతికి
మూలదండంబు సైన్యసముద్రతతికి
కాలదండంబు శాత్రవక్ష్మాప
గతికి బాహుదండంబు జెప్ప దత్పార్థివునకు

సొగసైన తూగుతో చదువుతూ ఉండగానే సమ్మోహింప జేసే పద్యం. రాజు బాహువును ఘనంగా కీర్తించే ఈ పద్యం, వీరరసానికి స్థాయి అయిన ఉత్సాహాన్ని చక్కగా ధ్వనిస్తోంది. దుష్యంతుని బాహువు, యుద్ధానికి వచ్చే శత్రురాజుల రాజ్యమనే ఏనుగును సునాయాసంగా కట్టిపడేసే ఆలానదండం (ఏనుగును కట్టే స్తంభాన్ని ఆలానం అంటారు). మహారాజుల గర్వమనే సముద్రపు లోతులను కొలిచే మానదండం. విజయలక్ష్మి విహరించే తామరపూవు మేడకు ఆధారమైన నాళదండం (తామరతూడు). చంద్రవంశపు (హరిణాంక కుల) రాజుల (కుభృత్ జన) స్వచ్ఛమైన కీర్తి పతాకానికి ఆధారదండం (జెండా కఱ్ఱ). ముసలివాడైపోయిన ఆదిశేషుడు ఆనుకొనేందుకు చేతికర్ర (యష్టిదండం). ఆదిశేషుడు భూభారాన్ని మోస్తాడని పురాణాల మాట. అతనేమో మోసీ మోసీ ముసలివాడైపోయాడట! ఆ భూమి భారాన్ని వహించడానికి దుష్యంతుని చేయి అతనికి తోడ్పడుతుందని భావం. సైన్య సముద్రాన్ని దాటేందుకు చుక్కాని. శత్రు రాజులకు (క్ష్మాప – భూమిని పాలించే వాళ్ళు) యమపాశం (కాలదండం).

ఇంత చక్కటి ధారతో తీర్చిదిద్దిన సీసపద్యాన్ని అదే కవి మరో సందర్భంలో ఇలా నడిపించాడు:

చెప్పంగ జూచు, జూచి, ముఖాంబుజము దెస దప్పక చూచును, జెప్ప నోరు
పోక నిల్చు, నుపాయములు మతించు, మతించి, నేర్పు దేలేక నిట్టూర్పు వుచ్చు,
నుండరామిని జెప్ప నూహించు, నూహించి, పురమున కని యర్ధమునన నిల్చు,
ననసూయ జూచు, బ్రియంవద జూచు, నా మేనకాత్మజ జూచు, మీదు జూచు,
దరుణి దెస మోహలత యీడ్వ, బురము దెసకు
గార్యలత యీడ్వ, రెండు వంకలకు జనుచు,
భావ్యమిది యని కార్య మేర్పఱప లేక,
నుల్ల ముయ్యాల లూగె భూవల్లభునకు

దుష్యంతుడు శకుంతలను వదిలి తన రాజ్యానికి తిరిగివెళ్ళాలి. ఆ విషయం ఆమెతో చెప్పాలి. ఎలా? ఆ సందర్భంలో దుష్యంతుని తత్తరపాటు, విహ్వలత, ఊగిసలాట అద్భుతంగా చిత్రించిన పద్యమిది. దానికి అనుగుణంగా పద్యం నడక కూడా ఆగుతూ, సాగుతూ, ఆగుతూ సాగుతుంది. చెప్పాలని చూస్తాడు, శకుంతల ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోతాడు. చెప్పడానికి నోరురాక ఆగిపోతాడు. ఎలా చెప్పాలని ఉపాయాలు ఆలోచిస్తాడు. ఏ ఆలోచనా రాక ఒక నిట్టూర్పు విడుస్తాడు. ఇంక అక్కడ ఉండడానికి కుదరదని చెప్పాలనుకొంటాడు. అనుకొని ‘నగరానికి…’ అని చెప్పి సగంలో ఆగిపోతాడు. శకుంతల సఖులైన అనసూయను ప్రియంవదను చూస్తాడు. శకుంతలను చూస్తాడు. ఆకాశం వైపుకి చూస్తాడు. శకుంతలవైపు మోహలత లాగుతోంది. నగరం వైపుకి కార్యలత లాగుతోంది. ఏం చేయాలో తెలీని డోలాయమాన స్థితిలో ఊగిసలాడుతున్నాడు దుష్యంతుడు.

ఇదీ పిల్లలమఱ్ఱి పినవీరన పద్య రచనలోని గుబాళింపు! శిలలాంటి ఛందస్సును భావానుగుణంగా మలచి పద్యశిల్పంగా చెక్కడం ఒక కళ. తక్కిన ప్రాచీన కళల మాదిరి ఇది కూడా ఒక అంతరించిపోతున్న కళ!

No comments:

Post a Comment