వేణుగోపాల శతకము - 4
సాహితీమిత్రులారా!
"పోలిపెద్ది వేంకటరాయకవి" కృత అధిక్షేప శతకము
వేణుగోపాలశతకం నాలుగ వ భాగం వీక్షించండి......
56. మంగల కత్తిపై నంగవేసిన యట్లు, క్రోడెత్రాచును ముద్దు లాడి నట్లు
కొఱవితో నడునెత్తి గోఁకి న ట్టీనిన, పులితోడ సాముకుఁబూనినట్లు
వెదసింగమును ఱాల నదలించికొని నట్లు, మినుకు వజ్రపు రవమ్రింగినట్లు
కొర్తిమీదను గొంతు కూర్చుండు కొని నట్లు, నూతిపైఁ బసిబిడ్డ నునిచి నట్లు
క్ష్మాతలేంద్రులసేవ కష్టంబు వార
లిచ్చి రని గర్వమున నిక్కి యెగురరాదు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
57. మకరందపానంబు మధుకరాళికిఁగాక, జోఱీగఁ చవి గని జుఱ్ఱగలదె
హరిపదాబ్జధ్యాన మమనస్కులకుఁగాక, చెనఁటిసద్భక్తితోఁ జేయగలడె
కవితా రసజ్ఞత సువివేకులకుఁగాక, యవివేకి చెలి యొగ్గియాఁనగలడె
పద్మినీ సతిపొందు పాంచాలునకుఁగాక, దేబైన షండుడు తెలియఁగలఁడె
రాజసభలఁబరోపకారములు తెలుప
శ్రేష్ఠులేకాక దుష్టులు చెప్పఁగలరె
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
58. మద్యపాయులతోడ మచ్చిక కారాదు, బడవాల గొప్పగాఁ బట్టరాదు
శాత్రవునింత భోజనము చేయఁగరాదు, సన్యాసులను గేలి సలుపరాదు
దేవభూసురవృత్తి తెరువు పోవఁగరాదు, పరు నాలి గని యాస పడగఁరాదు
కంకోష్ఠునకు నధికార మియ్యగరాదు, చెలగి లోభినిఁ జేర బిలువ రాదు
లంచగాండ్రను దగవుల నుంచ రాదు
మాతృపితరుల యెడ భక్తి మఱువరాదు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
59. మన్ననలేని భూమండలేంద్రుని కొల్వు, లాలింపనేరని లంజ పొందు
వస్తుపోతుందని వాని చుట్టఱికంబు, బుద్ధి తక్కువవాని యొద్ది ఋణము
సరగానివానితో సరసోక్తి తనకన్న, బలవంతు నింతను బడుచుఁగొనుట
సామాన్య జాతితో జగడంబు పూనుట, మూర్ఖుని మైత్రికి మోహపడుట
అధమ మిది భువి నరులకు నజునకైన
మఱచి యప్పని చేసిన మానహాని
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
60. మన్నించు నరపతి మమత తప్పిన వెన్క, నుత్తముం డాభూమి నుండరాదు
పైవిటుం డొక్కఁ డేర్పడినట్టి వేశ్యపై, నెంతవాఁడైన నాసింప రాదు
అన్నదమ్ములను గొట్లాడి మానసము ని, ర్జింపక మును తామసింప రాదు
పగతుఁడు నెనరుగా భాషించెనని వాని, నెయ్యంబుగనక చన్వియ్య రాదు
చెలులతో రాజకార్యముల్ చెప్పరాదు
పలువ మంత్రైన దొరలకుఁబరువులేదు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
61. రణభేరి తెగువైన రాజు స్వేతచ్చత్ర, మేనుఁగు నివి నాలుగు నేకరాశి
మారుండు కీరంబు మంద సమీరుండు, రాకాసుధాకరుం డేకరాశి
వేదము ల్గోవులు విప్రోత్తములు దర్భ, లేర్పరింపఁగ నాలు గేకరాశి
ముఢాత్ముఁ డత్యంత మూర్ఖుఁడు గాడిద, కాకి వీరలు నాలు గేకరాశి
ద్విపద కావ్యంబు ముదిలంజ దిడ్డిగంత
యియ్యనేరని రండ నాల్గేక రాశి
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
62. రమణచెంతను సిగ్గు రణమున భీతి భో, జన కాలమందు సంశయము
ఇచ్చెడిచోఁజింత మెచ్చిన యెడలేని, యచ్చినవానిపై హూంకరింపు
తగవున మోమోట దాన మిచ్చకులకుఁ, దపమొనర్చెడివేళఁ దామసంబు
గూర్మిచేసినచోటఁ గూహకం బద్భుత, ద్రోహవర్తనులపై మోహదృష్టి
అవని సత్కీర్తి కోసమై యాశనొందు
రాజవర్యుల కివియుఁగారాని పనులు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
63. రాజులమంచు బొఱ్ఱలు తివురంగఁగా, దని మొనలో నఱుకాడ వలయు
మంత్రులమని బొంకుమాటలాడంగఁగా, దిప్పింపనేర్చి తామియ్య వలయు
కవుల మంచును వింతగా నల్లినను గాదు, చిత్రప్రబంధముల్ చేయవలయు
తపసుల మని నిక్కి తలలు పెంచినఁగాదు, నిర్వికల్పసమాధి నెగడవలయు
ఇచ్చినను నేమి వినయోక్తు లెఱుఁగవలయు
గడుసుకూఁతల సత్కీర్తి కలుగబోదు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
64. రామాండ కతలెల్ల మేమెఱుంగని యవే, కాటమరాజుకుఁ గర్ణు డోడె
బాగోత కతలంట పలుమాఱు వినలెదె, యిగనేశుఁ డర్జను నిరఁగ మొడిసె
బారత కతలోన బాలరా జొక్కఁడు, కుంబకర్ణుని బట్టి గుద్ది సంపె
కంద పురాండలకత పిల్లకాటేరి, యీరబద్రుని మెడ యిరఁగగొట్టె
అనుచు మూర్ఖులు పలుకుదు రవనియందుఁ
గవివరులు పేఁడఁబోయిన కాలమందు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
65. లత్తుక రంగు చల్లడము మిటారంపు, చౌకట్లు తగటుఁ మిర్జాకుళాయి
మగవాల పంచిక మొగముపై జవ్వాది, తిలకము జాతికెంపుల బులాకి
పులిగోరుతాళి పచ్చల బాజుబందు ని, ద్దా మేల్కడానిజ ల్తారుపాగ
కుడి పదంబునకు జాగుల్కి ఘంతలును ఘ, ణిల్లని మ్రోము మానికపు టందె
నీతుగాఁ బిన్నపై పల్లెకూతమునకు
నరుగుచును మధ్యధేనుకాసురుని బట్టి
కొట్టి ధరఁగూల ద్రోయవా గుండె లవియ
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
66. వంకరపాగాలు వంపుముచ్చెల జోళ్ళు, చెవి సందుకలములు చేరుమాళ్ళు
మీఁగాళ్ళపైఁ బింజె బాగైన దోవతుల్, జిగితరంబైన పార్షీమొహర్లు
చేఁపవలెను బుస్తీ మీసము ల్కలం, దాన్పెట్టెలును జేత దస్త్రములును
సొగసుగా దొరయొద్దఁ దగినట్లు కూర్చుండి, రంకులాండ్లకు శిపారసులు చేసి
కవిభతుల కార్యములకు విఘ్నములు చేయు
రాయసా ల్పిందములు తిను వాయసాలు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
67. వలపు రూపెరుగదు వసుధ మార్త్యులకు సూ, కరమైన మనిసిగాఁ గానుపించు
ఆకలిలో నాల్క యరుచి యెఱుగద, యంబలైనను సుధయనుచుఁ గ్రోలు
గోపం బెదుటి గొప్ప కొద్దులెఱుంగదు, ప్రాణబంధువునైనఁ బగతుఁజేయు
నిదుర సుఖం బెఱుంగదు వచ్చినప్పుడు, కసవైన విరిశయ్యగా గనబడు
గామంబు నిర్ణయకాలం బెఱుంగద, యిచ్చచెందిన వేళ నెనయగోఁరు
హరునకైనను నివి గెల్వ నలవికాదు
ఇతరులైనట్టి మానవులెంత వారు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
68. వసుదాధిపతికి విశ్వాసగుణంబు జా, రునకు సత్యంబు చోరునకు భయము
లంజెకు మోమోట పంజకు ధైర్యమెం, గిలికెగ్గు మద్యపాయులకు సిగ్గు
ద్రవ్యాధికులకును దాన ధర్మములపై, దృష్టియు జారిణి స్త్రీకి వావి
పలుగాకులకు మేలు పందగొడ్డుకుఁ బాలు, మానికిఁగఱవు కోమటికి బరువు
మేక మెడ చన్నులకుఁ బాలు మేడిపూలు
లేవు త్రిభువనములను గాలించి చూడ
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
69. వాగ్భూషణంబునిన్ వర్ణనసేయుట, కర్ణభూషణము నీ కథలు వినుట
హస్తభూషణము నీ కర్చన సేయుట, నేత్రభూషణము నీనీటు గనుట
హృదయభూషణము నిన్మదిఁ బాయకుండుట, మూర్ధభూషణము నిన్మ్రొక్కు టరయ
అంఘ్రీభూషణము నీయానంద నిలయప్ర, దక్షిణం బేగుట ధర్మచరిత!
సతముగల భూషణములెన్ని జన్మములకు
నివియెఁకా గనుటింత కెచ్చేమిగలదు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
70. వార్ధక్యమునఁ చిన్నవయసు పెండ్లామైన, దారిద్ర్యమునఁ బెక్కుతనయులైన
ఆత్రుఁడౌ విటకాని కతిభాషి లంజైనఁ, బొరుగున నత్తిల్లు పొసగఁనైన
సంగీతపరునకు జటపాఠితోడైన, నెనుముతో నట్టేట నీఁదుటైన
బెను వానాకాల మందును బ్రయాణంబైన, జలికాలమున దీక్ష సలుపుటైన
మరణ మిక లేదు వేఱె భూమండలమున
గణనసేయంగ నగునె యీ కష్టమహిమ
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
No comments:
Post a Comment