Monday, June 12, 2017

గోలి గారి - బొట్టుపై పద్యాలు


గోలి గారి - బొట్టుపై పద్యాలు
సాహితీమిత్రులారా!


కుక్కపిల్లా
సబ్బుబిల్లా
అగ్గిపుల్లా
........
కాదేదీ కవిత కనర్హం
అని శ్రీశ్రీ గారి కవనం విన్నాం కదా
కుక్కపిల్ల, అగ్గిపుల్లల కంటే పవిత్రమైనది
కదా బొట్టు దాని గురించి గోలి శాస్త్రిగారు
పద్యరూపకంగా అందించిన కవితంను చూడండి-

   
కందము:
శ్రీకరమగు నిది నుదుట వ
శీకరమని తలచ బోకు క్షేమంకరమౌ
'ఛీ' కరమున తుడుపకుమా
మీకరమే తిలక మిడగ మెత్తురు సురలే.

కందము:
పుట్టిన పట్టికి దిష్టియె
వట్టిగనే తగులకుండ పట్టుచు " చాదే "
పెట్టును తల్లియె నుదుటన
బొట్టుగ మన మొట్టమొదటి బొట్టది గదరా!

కందము:
ళులుళులుళాయీ యనుచును
తల ద్రిప్పెడు బిడ్డ నుదుట తంటాల్ బడుచున్
కలిపిన ' చాదును ' బెట్టెడు
తెలుగింటను తల్లిని గన తీయని తలపౌ.

కందము:
ఇంటికి వచ్చిన బొట్టే
ఇంటికి రమ్మనుచు జెప్ప నింతికి బొట్టే
కంటికి " నో " యెబ్బెట్టే
వింటిరె మన సంసృతిగన వేడ్కగు నిట్టే!

కందము:
గోటికి గోరింటాకే
మేటిగ కాలికినిగజ్జె మీదట తీరౌ
కాటుక కంటికి, జడయును
బోటికియందమ్ము నుదుట బొట్టే సుదతీ!

కందము:
శోభను గూర్చునుగద నొక
యాభరణము చేరియున్ననది మగువలకే
ఆభరణమె బొట్టొక్కటి
సౌభాగ్యమె నుదుట బెట్ట చక్కటి మోమున్.

కందము:
అద్దము చేతను బట్టుచు
నొద్దికగా ముఖము గనుచు నొకచేతన్ తా
ముద్దుగ నుదుటను కుంకుమ
దిద్దెడు భంగిమ పడతికి తీరుగనుండున్.

కందము:
నీమము వీడక కొందరు
కోమలులే బొట్టు నుంత్రు క్రొత్తగ, కలియున్
లేమకు చర్మపు రంగున
నేమైనా " ఉంది' 'లేద" నేటట్లుండున్.

కందము:
హిందువు నీవేయైనచొ
బిందువుగా నుదుట బొట్టు పెట్టుము చాలున్
అందునలౌకిక భావన
మందును మనమనమున కొక హాయే గలుగున్.

కందము:
తిలకము నుదుటన దిద్దుము
తిలకించుము మోము చుట్టు తేజము హెచ్చున్
పులకింతలు మది గలుగగ
తిలకమవై సాటివారి తీరును గనుమా!

సీసము:
విష్ణు పూజనుసల్పి వినయమ్ము తోడను
                    నిలువు బొట్టును బెట్టు నిష్ట తోడ
భవుని మదిని దల్చి భయముల బోద్రోల
                     భస్మ ధారణ సల్పు భక్తి తోడ
ఆంజనేయుని చెంత నాకుపూజను జేసి
                     సిందూరమును దాల్చు శ్రీకరముగ
అమ్మవారిని గొల్చి యఘములే నశియింప
                      కుంకుమ నేదిద్దు కోరికోరి.

ఆటవెలది:
అడ్డ నిలువు బొట్టు లదిగాదు ముఖ్యమ్ము
బొట్టునుదుటనుంట పుణ్యప్రదము
ఎరుపు తెలుగు రంగు లేవైన మనకేమి
పట్టుబట్టి పెట్టు బొట్టు నిట్టు.

తేటగీతి:
దూర ముగ సేయబోకు సిందూర బొట్టు
కుంకుమను బొట్టు బెట్టుట గ్రుంక నీకు
బూదిలోన గలుపకు వీబూది బొట్టు
మనదు సంస్కృతి నిలబెట్టు మరచి పోకు.

ఆటవెలది:
దోసగింజ బొట్టు దొడ్డగనే బెట్టు
శనగగింజ బొట్టు సరిగ బెట్టు
కాసు వంటి బొట్టు కనిపించగా బెట్టు
ముఖము తగ్గ బొట్టు సుఖము - " ఒట్టు "

ఆటవెలది:
అడ్డబొట్టు జూడ నదియొక యందమ్ము
నిలువు బొట్టు గూడ కళగనుండు
చుక్క బొట్టు గనగ చక్కగ గనుపించు
మూడు గలిపి బెట్ట ముఖము నిండు.


కందము:
బొట్టును వలదను మతములు
బెట్టుగనే పట్టుబట్టి భీష్మించగ, నీ
బొట్టును బెట్టెడి మతమున
పెట్టక నీవుండ నిటుల ప్రియమన దగునా?

No comments:

Post a Comment