Thursday, June 15, 2017

శ్మశానవాటి పద్యాలు


శ్మశానవాటి పద్యాలు



సాహితీమిత్రులారా!


సత్యహరిశ్చంద్ర ఎంత పేరెన్నిక గన్న
నాటకమో చెప్పక్కరలేదు. సత్యహరిశ్చంద్రుని
కథ కూడ గొప్పపేరు పొందినదే అందుకే మన
చలన చిత్రాలలో సత్యహరిశ్చంద్ర మొదటిది.
బలిజేపల్లి లక్ష్మీకాంతంగారి సత్యహరిశ్చంద్ర
నాటకం గతంలో ఎంత మంది మన పూర్వులను
ఆనందాబ్దిలో ఓలలాడించిందో చెప్పలేము.
కాని  జాషువాగారి ఖండకావ్యంలోని శ్మశానవాటి
పద్యాలు  ఏమహనీయుడు చేర్చాడో వాటికికూడ
ప్రజలు అంతగా హక్కున చేర్చుకున్నారు
వాటిలోని కొన్ని పద్యం ఇక్కడ చూద్దాం-

ఎన్నోయేండ్లు గతించి పోయినవి గానీ, యీ శ్మశానస్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ, డక్క టా!
యెన్నాళ్ళీ చలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నీటంబడి క్రాఁగి పోయినవి నిక్కంబిందు పాషాణముల్!


ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
                      కలము, నిప్పులలోనఁగఱఁగిపోయె!
యిచ్చోట; నే భూములేలు రాజన్యుని
                     యధికారముద్రికలంతరించె!
యిచ్చోట; నేలేఁత యిల్లాలి నల్లపూ
                    సలసౌరు, గంగలోఁగలసిపోయె!
యిచ్చోట;  నెట్టిపేరెన్నికం గనుఁగొన్న
                     చిత్రలేఖకుని కుంచియ, నశించె!
ఇదిపిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె, గదిలించి యాడు రంగస్థలంబు;
ఇది మరణదూత తీక్ష్ణమౌ దృష్టులొలయ
నవనిఁబాలించు భస్మసింహాసనంబు


వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁబాలఱాతి గో
రీకదఁ బారవేయఁబడి ప్రేలికలం  బొరలాడు ప్రేత మే
యాకటి చిచ్చునన్ గుమిలి, యార్చి, గతించిన పేదవాని దౌ
నోకద! వానికై వగవఁడొక్కండు; దాఁచదు కాటినేలయున్

ఈ పద్యాలను పాడటంకాదు
చదువుతున్నా కళ్లముందు
కదలాడే విధంగా కూర్చిన
జాషువాగారిని తెలుగువారు
ఎన్నటికి మరువరు.

No comments:

Post a Comment