Sunday, June 18, 2017

మధమేహవ్యాధి పై వ్యాసం


మధమేహవ్యాధి పై వ్యాసం




సాహితీమిత్రులారా!


ఈ రోజుల్లో మధుమేహవ్యాధి చాల ఎక్కువగాను
సర్వసాధారణంగాను అయింది కావున దానిపై
డా. గన్నవరపు నరసింహమూర్తిగారు అందించిన
ఈ వ్యాసం అందరికి ఉపయుక్తంగా ఉెంటుందని
ఈ సాహితీనందనంలో ఉంచడం జరిగింది
అందరు చదివి మంచి చెడులను గ్రహింతురుగాక!

క్రీస్తు పూర్వము1500 సంవత్సర ప్రాంతములోనే " మధుమేహ వ్యాధిని " భారతీయ వైద్యులు వర్ణించారు. ఈ వ్యాధిగ్రస్తుల మూత్రము చుట్టూ చీమలు చేరడము గమనించి , వారి మూత్రము మధుకరమని గ్రహించారు. ఈజిప్టు దేశ వైద్యు లా వ్యాధిని అతిమూత్రవ్యాధిగా వర్ణించారు. శుష్రుతుడు, చరకుడు మధుమేహవ్యాధి రెండు విధములని, పిల్లలలో ఒకరకముగను, పెద్దలలో వేఱొక లక్షణములతో ఉంటుందని పసిగట్టారు. చిరకాలము క్రితమే కనుగోబడిన యీ వ్యాధి ప్రాబల్యము ఇరువది శతాబ్దములో బాగా హెచ్చినది. ఒకప్పుడు ధనిక వర్గాలలో ప్రాబల్యమైన యీ వ్యాధి యీ తరములో పేద, మధ్యతరగతి వారిలో విరివిగా పొడచూపు చున్నది.
శరీరమునకు అవసర మయ్యే శక్తి ఆహారము ద్వారా మనకు లభిస్తుంది. ఆహారపదార్ధాలలో పిండిపదార్థములు ( Carbohydrates ), క్రొవ్వులు ( Fats ) , మాంసకృత్తులు ( Proteins ) శక్తి నిస్తాయి. వాటి నుంచి లభ్యమయ్యే శక్తిని ( ఉష్ణమును ) కాలరీలు ( Calories ) గా కొలుస్తారు.
శరీర సాధారణ జీవప్రక్రియలకు కొన్ని కాలరీలు ఖర్చవుతాయి. మనము పడే శారీరక శ్రమ, వ్యాయామము, క్రీడలకు , బాల్య కౌమారకావస్థలలో పెరుగుదలకు అదనముగా శక్తి వెచ్చింప బడుతుంది. పెరుగుదల నిలిచాక మనకు ఆహారపు టవసరాలు త్రగ్గుతాయి. దైనందిక అవసరాలకు మించి తినే తిండి కాలేయము ( Liver ), కండరములలో మధుజని ( Glycogen ) అనే సంకీర్ణ శర్కర గాను, క్రొవ్వుగా చర్మము క్రింద పొరలోను ( Adipose tissue ), ఇన్సులిన్ సహకారముతో దేహమంతటా నిలువవుతుంది. రక్తములో, చక్కెర గ్లూకోజు ( Glucose ) రూపములో ప్రవహించి దేహములో కండరములకు, వివిధ అవయవాలకు , కణజాలమునకు యింధనముగా చేరుతుంది.
మధుజని ( Glycogen ) ఉత్పత్తిని Glycogenesis అని అంటారు.
శక్తి అవసరమయినప్పుడు , చక్కెర ( Glucose ) స్థాయి త్రగ్గినప్పుడు, కాలేయము, కండరములలో మధుజని ( Glycogen ) చక్కెరగా విచ్ఛిన్నమవుతుంది. క్రొవ్వు పొరల లోని క్రొవ్వు నుంచి శర్కరజనితము ( Gluconeogenesis ) అనే ప్రక్రియ వలన చక్కెర ( Glucose ) ఉత్పత్తి అవుతుంది. ఈ చక్కెర రక్తము ద్వారా కణజాలమునకు, చేరి వినియోగపడుతుంది.
సాధారణముగ రక్తపు చక్కెర విలువ ఉపవాస సమయములలో ( Fasting values ) 80 మి.గ్రా నుంచి 100 మి.గ్రాముల వఱకు ఉంటుంది. భోజనానంతరము రెండు గంటలప్పుడు పరీక్షిస్తే చక్కెర 140 మి.గ్రా. వఱకు ఉండవచ్చును. ఉపవాసపు విలువ 126 మి.గ్రా లైనా , రెండు గంటల భోజనానంతరపు విలువ 140 మి.గ్రా మించినా మధుమేహవ్యాధి ఉన్నదని నిర్ణయించవచ్చును. ఈ విలువలు పొలిమేరలలో ఉంటే శర్కర అసహనము ( Glucose Intolerance ) గాను , మధుమేహవ్యాధికి చేరువలో ( Borderline Diabetes ) ఉన్నట్లు గాను పరిగణించి వ్యాధి నివారణకు కృషి చెయ్యాలి.

మధుమేహవ్యాధికి కారణాలు :-
జీర్ణాశయపు సమీపమున దిగువగా ఉన్న క్లోమగ్రంధి ( Pancreas ) క్లోమరసమును ఉత్పత్తి చేసి ఆహారము జీర్ణమవుటకు తోడ్పడుతుంది. ఆ క్లోమరసము క్లోమనాళము ద్వారా డుయోడినంకు ( Duodenum ; చిన్నప్రేవుల తొలిభాగము ) చేరుతుంది.
క్లోమగ్రంధిలో చిన్న చిన్న దీవులుగా ( Islets of Langerhans ) ఉండే బీటా కణములు ( beta cells ) " ఇన్సులిన్ " అనే హార్మోన్ ని ( వినాళ రసం ) స్రవించి రక్తము లోనికి విడుదల చేస్తాయి. ఈ దీవులలో ఉండే ఆల్ఫా కణములు ( alpha cells) గ్లూకగాన్ ( Glucagon ) అనే వినాళ రసము నుత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్ , గ్లూకగాన్ లు ఒకదాని కింకొకటి వ్యతిరేకముగా పనిచేస్తాయి.
రక్తములో ఆహారము తిన్న తరువాత, చక్కెర విలువలు పెరిగినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తములో ఇన్సులిన్ విలువ పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ చక్కెరను కణాలలోనికి పంపుతుంది. కాలేయము, కండరాలలో అదనపు చక్కెరను మధుజని ( Glycogen ) గా మారుస్తుంది. క్రొవ్వుకణాలలోనికి చక్కెరను చేర్చి క్రొవ్వుగా మారుస్తుంది. కణములలో చక్కెర వినియోగపడి శక్తి విడుదల కావటానికి కూడా ఇన్సులిన్ దోహదకారి.
రక్తములో చక్కెర విలువలు బాగా పడిపోతే గ్లూకగాన్ స్రావము పెరుగుతుంది. గ్లూకగాన్ మధుజని విచ్ఛిన్నమును( Glycogenolysis , కాలేయము, కండరములలో ) , మద విచ్ఛిన్నమును ( Lypolysis , క్రొవ్వుపొరలలో ) ప్రేరేపించి చక్కెర ఉత్పత్తిని పెంచుతుంది. అందుచే చక్కెర విలువలు పెరుగుతాయి.. ఎడ్రినలిన్, ఎడ్రినల్ కార్టికోస్టీరాయిడ్ ల వంటి హార్మోనుల ప్రభావము కూడా చక్కెర విలువలపై ఉంటుంది.
ఇన్సులిన్ ఉత్పత్తి త్రగ్గినా, ఇన్సులిన్ కి అవరోధ మెక్కువయి ( Insulin Resistance ), ఉత్పత్తి అయిన ఇన్సులిన్ నిష్ఫలమైనా , చక్కెరపై అదుపు త్రగ్గుతుంది. చక్కెర కాలేయము, కండరాలలో మధుజనిగా మారదు. క్రొవ్వుపొరలలో క్రొవ్వుగా మార్పు చెందదు. కణజాలములోనికి తగినంతగా ప్రవేశించదు. చక్కెర ప్రాణవాయువుతో కలిసి బొగ్గుపులుసు వాయువు, ఉదకములుగా విచ్ఛిత్తి జరిగి ,శక్తి విడుదల కావటానికి కూడా ఇన్సులిన్ అవసరమే .
ఇన్సులిన్ లోపము, అసమర్థతల వలన రక్తములో చక్కెర విలువలు పెరిగి మధుమేహ వ్యాధిని కలుగ జేస్తాయి.
మధుమేహ వ్యాధి రెండురకాలు. (1) మొదటి రకము ( Type -1 or Insulin Dependent ) ఇన్సులిన్ ఉత్పత్తి లోపము వలన కలుగుతుంది. వ్యాధిగ్రస్థులలో ఇన్సులిన్ విలువలు తక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ తోనే వ్యాధిని నయము చేయగలము. ఈ మధుమేహము ఇన్సులిన్ అవలంబితము( Insulin Dependent ). తరుణప్రాయములోనే ఈ వ్యాధి ప్రస్ఫుట మవుతుంది. ఇన్సులిన్ తప్ప యితర మందులు ఈ వ్యాధికి నిష్ప్రయోజనము .
(2) రెండవ రకము ఇన్సులిన్ పై ఆధార పడనిది ( Type -2 or Non Insulin Dependent) . దీనిని వయోజనులలో చూస్తాము. స్థూలకాయులలో , ఇన్సులిన్ సమర్థత త్రగ్గుట వలన ఈ వ్యాధి కలుగుతుంది. అంత్యదశలలో తప్ప ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే ఉంటుంది. ఇన్సులిన్ కి అవరోధము
( Resistance ) పెరిగి, దాని ప్రయోజనము త్రగ్గి మధుమేహము కలుగుతుంది. జీవనశైలి, మార్పులు, నియమితాహారము, వ్యాయామములు వ్యాధి నివారణకు, వ్యాధిని అదుపులో ఉంచుటకు తోడ్పడుతాయి. మెట్ ఫార్మిన్, ఇన్సులిన్ స్రావకములు( Insulin Secretagogues ), ఇన్సులిన్లను అవసరము బట్టి వ్యాధిని అదుపులో ఉంచుటకు వాడుతారు.
కారణాలు :
(1) మొదటి రకపు మధుమేహపు వ్యాధి జన్యుసంబంధమైనది. శరీరరక్షణ వ్యవస్థ ఆత్మాక్రమణ వలన ( Autoimmune process ), క్లోమములోని బీటా కణములు నాశనమొందుట వలన ఇన్సులిన్ ఉత్పత్తి వీరిలో లోపిస్తుంది.
(2) రెండవరకపు వయోజన మధుమేహము కూడా వంశపారంపర్యముగా వచ్చే జన్యుసంబంధ మవ వచ్చును. కాని జీవనశైలి, వ్యాయామలోపము, అమితాహారము, శర్కర సహిత పానీయములు, మితిమీరిన క్రొవ్వుపదార్థ వాడుకలు ( Saturated fats ) ధూమపానము, స్థూలకాయములు ఈ మధుమేహము కలుగుటకు ఎక్కువగా తోడ్పడుతాయి. కణాలలో ఇన్సులిన్ గ్రాహకముల ( Receptors ) అవరోధము పెరుగుటచే ఇన్సులిన్ సమర్థత త్రగ్గుతుంది. రక్తములో ఇన్సులిన్ విలువలు ఎక్కువగా ఉన్నా దాని ఫలితము తక్కువే.
గర్భిణీ స్త్రీలలో పెక్కు వినాళగ్రంధస్రావకముల వలన ( Harmones) గర్భసంబంధ మధుమేహము ( Gestational Diabetes ) కలుగ వచ్చును.
ఇతర వినాళగ్రంధుల వ్యాధులు, క్లోమ వ్యాధులు, గ్లూకోకార్టికోస్టీరాయిడుల వంటి మందులు, శస్త్రచికిత్సతో క్లోమమును తీసివేయుట , మరికొన్ని యితర వ్యాధుల వలన మధుమేహము కలుగ వచ్చును.
వ్యాధి లక్షణాలు:-
రక్తములో చక్కెర స్థాయి పెరిగి మూత్రములో చక్కెర నష్టము కలిగితే, చక్కెరతో బాటు జలనష్టము కూడా కలిగి అతిమూత్రము కలుగుతుంది. జలనష్టము వలన దాహము పెరుగుతుంది. చక్కెర నష్టము వలన బరువు త్రగ్గుతారు . ఆకలి పెరిగి వారు తిండి ఎక్కువగా తిన్నా బరువు త్రగ్గుతారు. కళ్ళ కటకములలో చక్కెర , నీరు చేరి కటకపు ఆకృతి మారడము వలన దృష్టిలోపాలు కలుగ వచ్చును. కొందఱిలో విశేషముగ లక్షణాలు పొడచూపక పోవచ్చును. కొందఱు క్లిష్టపరిస్థుతులతోనే వైద్యులను సంప్రదించ వచ్చును.
మధుమేహము వలన వచ్చే జటిలములు :
మధుమేహవ్యాధి వలన సూక్ష్మరక్తనాళములు కుచించుకుపోతాయి.రక్తనాళములు బిరుసెక్కుట వలన ( ధమనీ కఠిన్యత , Atherosclerosis ) కలిగి హృద్రోగములు, మస్థిష్కవిఘాతములు( Cerebrovascular accidents ) మూత్రపిండముల వైఫల్యము
( Renal failure ) దూర నాడుల ధ్వంసము ( Peripheral Neuritis ) వలన స్పర్శలోపము, దూరరక్తప్రసరణ లోపాలు ( Peripheral Vascular disease ) దృష్టిదోషాలు మధుమేహము వలన కలుగ వచ్చును.
ఇన్సులిన్ లోప మధికమైతే చక్కెర ఆమ్లజనీకరణ( Oxygenation ) అసంపూర్తి కావుటచే
కీటోనులు( Ketones ) పెరిగి రక్తము ఆమ్లీకరణ మవవచ్చును ( Diabetic Keto Acidosis ) దీని వలన అత్యవసర పరిస్థితి కలుగ వచ్చు. అపస్మారకత రావచ్చును. చక్కెర స్థాయి బాగా పెరిగి Hyperosmolar coma కలుగ వచ్చు.
వ్యాధి నిర్ణయము : రక్తములో చక్కెర విలువలు చూసి వ్యాధిని నిర్ణయించవచ్చును. Glycated Haemoglobin విలువలు కూడా తోడ్పడుతాయి.

చికిత్స:-
తరుణ మధుమేహమునకు ఇన్సులిన్ వాడుక తప్పనిసరి.
వయోజన మధుమేహమునకు జీవనశైలి మార్పులు తప్పనిసరి. పరిమితాహారము, క్రొవ్వులు, చక్కెరల వినియోగమును నియంత్రించుట, వ్యాయామము, చక్కెరపానీయాలు మానుట, పొగత్రాగడము మానుట చాలా అవసరము.
మెట్ ఫార్మిన్, ఇన్సులిన్ స్రావకములు, క్రమరీతిలో వైద్యులు వాడుతారు. అవసరమయితే ఇన్సులిన్ వాడుక తప్పదు. రక్తపుపోటు నదుపులో పెట్టడము, స్టాటిన్స్ తో కొలెస్ట్రాల్ని తగ్గించుట, మూత్రపిండముల రక్షణకు ఆఛే ఇణిబితొర్స్ వాడడము, హృదయాఘాతకములను
( Heart attacks ) మస్తిష్క విఘాతకాలను నివారించుటకు ఎస్పిరిన్ వాడుకలు, కళ్ళపరీక్షలు, పాదరక్షణలు చికిత్సలో భాగమే. స్థూలకాయములను తగ్గించుట చాలా అవసరము.


తఱచు చక్కెర విలువలు పరీక్షించుట , చక్కెరలు అధికము , అల్పము కాకుండా చూసుకొనుట అవసరము. మందుల వలన విపరీతఫలితములు ఉండవచ్చును. మెట్ ఫార్మిన్ వలన
ఆమ్లరక్తత ( Metabolic Acidosis ) మూత్రపిండముల వైఫల్యములు కొందఱిలో కలుగవచ్చును. అందువలన అప్పుడప్పుడు రక్తపరీక్షలు అవసరమే. వ్యాధిగ్రస్థులకు క్రమశిక్షణ , వైద్యుల సలహాలను పాటించుట, తఱచు చక్కెరలను పరీక్షించుకోవడము, వాడే మందులపై సదవగాహము అవసరము. తగినంత వ్యాయామము చాలా అవసరమే . జటిలపరిస్థితుల లక్షణాలు కలిగితే సత్వర చికిత్సకు వైద్యులను సంప్రదించుట చాలా ముఖ్యము. ప్రపంచములో 400,000,000 మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్థులున్నారంటే వ్యాధి ప్రాబల్యము తెలుస్తుంది.

No comments:

Post a Comment