Sunday, June 18, 2017

శివామృత లహరి


శివామృత లహరి
సాహితీమిత్రులారా!
డా. ఏల్చూరి మురళీధరరావుగారి కృత
శివామృత లహరి చూడండి-


శ్రీనాదాంతవిభావనీయపరమశ్రేయోనిధానా! త్రివే
దానుస్వారవిధాన! వైదికలతాంతారూఢతత్త్వైకవి
ద్యానన్యాదృశకేళిరమ్య! ప్రణవధ్యానైకగమ్యా! స్వస
ర్గానూనస్థితిసంహృతిత్రితయముక్తాకార! విశ్వేశ్వరా!

కలరూ పేర్పడరాని వైద్యుతలతాకల్పంబవై పొల్చి, పెన్
వెలుఁగై నిల్చిన నాదబిందుసుకళాభిజ్ఞాస్పదభ్రూయుగీ
విలసన్మధ్యతలావతార! కరుణావిస్తార! నాలోన ని
న్నెలమిం దాపము తీఱఁ జూచుటెపుడోయీ, స్వామి విశ్వే శ్వరా!

ఓంకారాభిధమంత్రబంధశుభవర్ణోర్జస్వలప్రౌఢిమా
లంకర్మీణ! భవార్తభక్తజనకల్యాణైకపారీణ! భా
వాంకూరశ్లథనైకదక్ష! దురితవ్యాఘ్రౌఘహర్యక్ష! య
స్తుంకారమ్మును జూపి బాపవె మనోదుఃఖమ్ము విశ్వేశ్వరా!

సేవింతున్ నిగమాగమాంకితశుభశ్రీనామధేయున్, నినున్
భావింతున్ జతురాస్యకేశవనిలింపాదృష్టచూడాపదుం,
గావింతున్ భవదీయదాసజనకైంకర్యంబు, నీ పాదరా
జీవద్వంద్వనిరంతరార్చనవిధిన్ జీవింతు విశ్వేశ్వరా!

చిరమై శారదచంద్రికారుచిరమై శీర్యణ్యగంగాశుభా
కరమై శాంతజితేంద్రియప్రకరమై కైవల్యమందారసుం
దరమై విద్రుతభక్తలోకదరమై ధర్మానుసంధానసు
స్థిరమై పొల్చెడు వెల్గు నిన్ను నొకఁడే సేవింతు విశ్వేశ్వరా!

నతభక్తార్ణవచంద్రమండలఘృణీ! నైజాత్మయోగారణీ!
స్తుతకల్యాణమణీ! జటాటదమరస్రోతస్వినీధోరణీ!
శ్రితలోకైకశిరోమణీ! శ్రుతిశిరస్సీమంతముక్తామణీ!
ప్రతిమానన్యు నినున్ భవాబ్ధితరణీ! ప్రార్థింతు విశ్వేశ్వరా!

నీవై యుంచెదు మంటినేల మొలకన్; నీర్వోసి పేరాదటం
జేవ న్నించెద; విట్లు పెంచెదవు హృత్సీమన్ వెలుంగై మ ము
న్నీవే నొంచెద; వింకఁ ద్రుంచెదవునున్ నీలాభ్రధూర్జాట జూ
టీవిస్తీర్ణసురాపగాశివచిరంటీరమ్య! విశ్వేశ్వరా!

బ్రతుకెల్లన్ వరిబీడుగా నెఱియలై వాటిల్లు నెచ్చోట నీ
వు తిరంబై కొలువున్న చిన్నెలివి కాబోలు న్వగ, ల్లేవడుల్
జత గోరంబుల పంటలయ్యె నను నొల్లంబోక చూ
పితి వీ నిన్నుఁ దలంచు నెమ్మదిఁ దమిన్ విశ్వాత్మ! విశ్వేశ్వరా!

తరణాతీతభవాబ్ధిలో మునిఁగి శ్రీ తారుణ్య కారుణ్య స
ద్వరణామోఘగుణౌఘగాన మొనరింతున్ స్వామి ! రాని మ్ము త్వ
చ్చరణాంభోజము లాత్మ నిల్పికొను దాసశ్రేణిపైఁ గొంత నీ
కరుణాపూర్ణకటాక్షవీక్షణము నాకై కొంత విశ్వేశ్వరా !

శర్వాణీరమణీమణీహృదయశశ్వత్పద్మభృంగాణ! నీ
నిర్వాణప్రదనిర్మలాకృతిని మౌనిప్రాజ్ఞు లూహింప దృ
క్పర్వంబై యగుపింతు వెట్లు దయఁ బ్రోవన్ రావె తండ్రీ! నను
న్నర్వాచీనవటద్రుమూలఫలవిద్యామూర్తి! విశ్వేశ్వరా!

No comments:

Post a Comment