Wednesday, January 9, 2019

శిల కరిగింది


శిల కరిగింది

సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...........

“ఒరేయ్‌ రేపు సినిమాకి పోదాం, వెంకటేష్‌ పిక్చర్‌ కి!”, ఉత్సాహంగా అన్నాడు రాజు. “అదేం కుదరదు. సినిమా తర్వాతైనా చూడొచ్చు ముందు exhibition  కి వెళ్ళాలి. మళ్ళా అది వెళ్ళిపోతుంది” పట్టుబట్టాడు రఘు. పరీక్షలై సెలవలివ్వడంతో, సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలీ అని తెగ చర్చించుకుంటున్నాం. రఘు చెప్పిన మాట అందరికీ నచ్చడంతో, అదే మరునాటి కార్యక్రమంగా నిర్ణయించ బడింది.

మరుసటి రోజు సాయంత్రం అయిదున్నరకల్లా అందరం కలసి exhibition  కి బయలుదేరాము.  Exhibition  అంతా కోలాహలంగా ఉంది. ఎప్పటికన్నా యెక్కువ  కొట్లే ఉన్నాయ్‌. జనం కూడా యెక్కువగానే ఉన్నారు. చిరుతిళ్ళు అమ్మే ఫుడ్‌ స్టాల్సు కూడా చాలానే ఉన్నాయ్‌. వాళ్ళకి బోలెడంత వ్యాపారం! జయింటు వీలు, మేజిక్‌ షో యిలా ఒకొక్కటీ చూస్తూ తిరుగుతున్నాం. అలా తిరుగుతున్న మాకు మధ్యలో ఓ చోట జనం గుమిగూడి కనిపించారు. ఏమిటో చూద్దామనే ఉత్సుకత మాకూ కలిగి దగ్గరకు వెళ్ళాం. అక్కడ గాంధీ తాత విగ్రహమొకటి వుంది.

Exhibition  లో గాంధీ విగ్రహం ఉండటమేమిటి, జనమంతా దాని చుట్టూ చేరడమేమిటి! మనవాళ్ళకు యింత దేశభక్తి యింత హఠాత్తుగా యెక్కడనుండి ఊడిపడిందని చాలా ఆశ్చర్యం వేసింది. చెప్పొద్దూ, కాస్త అనుమానం కూడా కలిగింది! జనాన్ని తోసుకుంటూ ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళాం. తెల్లని రంగులో ఉన్న ఆ శిల్పం జీవకళ ఉట్టిపడుతూ ఉంది. తన్మయత్వంతో ఆ శిల్పాన్ని అలా చూస్తూంటే, దాని క్రిందగా ఒక బోర్డు కనపడింది. “నేనొక నిరుపేద నటుణ్ణి. మీకు తోచిన సహాయం చేయమని ప్రార్థన.” క్రింద పేరూ వివరాలూ. ముందొక తుండుగుడ్డా దానిలో కొన్ని చిల్లర పైసలూ ఉన్నాయ్‌. అప్పుడా శిల్పాన్ని జాగ్రత్తగా గమనించాను.

నిజమే! యెంత అద్భుతం! ఇది మనిషిలాంటి రాయి గాదు, రాయిలాంటి మనిషి! ప్రాణం లేని రాయిని సజీవ శిల్పంగా మలచడమెంత కష్టమో, ప్రాణమున్న మనిషి అలా శిలలా స్తంభించిపోయి నటించడమూ అంతే కష్టం. ఇది చాలా గొప్ప విషయం. అదే అన్నాను మా మిత్ర బృందంతో. “అవునురా, చాలా అద్భుతంగా ఉంది. దగ్గరగా పరిశీలించి చూస్తే తప్ప మనిషని పోల్చుకోలేము,” రాజు కూడా తన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. “నిజమే, యిలా రాయిలా కదలకుండా మెదలకుండా గంటల తరబడి నిలబడటం యెంతో కష్టమైన పని. ఒక గొప్ప కళ. దీనికి యెంత సాధన కావాలి! ఓ రకంగా చూస్తే యీ కళాకారుడు నాకంటికొక గొప్ప యోగిలా కనిపిస్తున్నాడు,” ఆశ్చర్యోద్వేగాలతో పలికాడు రఘు. “ఒరేయ్‌ ఒరేయ్‌ కాస్త తగ్గు! నువ్వు మరీ అంత ఫీలయి పోయి దానికంత టచింగివ్వకు. ఇలా నటించడం కొంత కష్టమైన పనే, నేనొప్పుకుంటా. కానీ మరీ అలా యోగీశ్వరుడనో, మునీశ్వరుడనో అనడం చాలా పక్షసషథ  చెయ్యడమే. ఎంతైనా నటుడు నటుడే. గాంధీగారి వేషం వేసినంత మాత్రాన అతనంత గొప్పవాడైపోడు. శరీరం రాయిలా మార్చినంత మాత్రాన మనసు కూడా నిశ్చలంగా మారుతుందనుకోవడం తప్పు,” ఖరాఖండీగా అన్నాడు రాము.

రఘుకి ఆ మాటల్లో హేళన ధ్వనించింది. తన మాటలను తప్పు పట్టాడన్న ఉక్రోషం వచ్చింది. “ఇంత మంది జనం కళ్ళముందు కదులుతున్నా రెప్పైనా వేయకుండా అలా నుంచున్నాడంటే దానికెంత దీక్ష కావాలి? మనసులో ఆలోచనలు కదులుతూంటే, అంత ఏకాగ్రత యెక్కడనుండి వస్తుంది?” ఎదురు ప్రశ్న వేసాడు. వాదన పెరిగింది. ఉక్రోషాలు ఊపందుకున్నయ్‌.

“కొద్దిగా ప్రయత్నిస్తే, యీ శిల కరగడానికి రెండు నిమిషాలు చాలు!”
“అయితే పందెం. యీ మనిషి శరీరాన్ని యే విథంగానూ తాకకుండా దీనిలో పెద్ద కదలిక తేగలిగితే మనం వెళదామనుకుంటున్న వెంకటేష్‌ సినిమా ప్రోగ్రాం ఖర్చంతా నే పెట్టుకుంటా. లేకపోతే నువ్వు పెట్టుకోవాలి.” వాదన పెరిగి పందెంగా మారింది. సరేనంటే సరేననుకున్నారు.

పందెం గెలవాలన్న పట్టుదలతో తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు రాము. కిందనున్న రాయిని తీసి ఆ గాంధీ వేషధారిమీద వేస్తున్నట్టు చెయ్యి విసిరాడు, ఉలిక్కి పడి తప్పుకుంటాడేమోనని. ఆశ్చర్యం! ఆ శిల్పంలో ఏమాత్రం చలనం లేదు. తను నిజంగా రాయి విసరడని ముందే ఊహించి ఉంటాడని సరిపెట్టుకున్నాడు రాము. ఒక్కసారిగా అతనిపైకి ఉరుకుతున్నట్టు ఎగిరాడు. ఊహూ, అయినా లాభం లేకపోయింది.

పందెం గురించిన వార్త  Exhibition  అంతా ప్రాకి పోయింది. ఆ వింత చూడడానికి జనం చేరసాగారు. రాము చేస్తున్న విచిత్ర చేష్టలని కళ్ళప్పగించి చూస్తున్నారు. చేతలు సరిపోవనుకున్నాడేమో, మా వాడు, కూతలు మొదలు పెట్టాడు. పెద్దపులి గాండ్రింపు, ఏనుగు ఘీంకారం, నక్క ఊళలు ఇలా కర్ణ కఠోరమైన కూతలు గాంధీ గారి చెవి దగ్గర కూశాడు. కానీ ఏమాత్రం లాభం లేకపోయింది. సంగీతానికి రాళ్ళు కరుగుతాయన్నది గుర్తుకు వచ్చి కాబోలు, తన గాన కళా కౌశలాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. పక్కనున్న మేము చెవులు మూసుకున్నాం కాని, శిల్పంలో యే కదలికా లేదు. గాంధీ గారు తన మూడు కోతుల సూత్రాన్ని పాటిస్తున్నారేమో అన్నట్లుగా ఉంది!

చుట్టూ ఉన్న వాళ్ళలో యేమవుతుందన్న ఆసక్తి పెరిగింది. వాళ్ళ మధ్య కూడా పందేలు మొదలయ్యాయి. క్షణ క్షణం ఉద్వేగంగా సాగుతోంది.తన ప్రయత్నంలో భాగంగా యీమారు హాస్యరసాన్ని ఆశ్రయించాడు రాము. తనకు తెలిసిన రకరకాల జోకులు చెప్పి తనకు తానే నవ్వుకోవడం మొదలుపెట్టాడు. అతని జోకులకే నవ్వువచ్చిందో, అతని అవస్థకి నవ్వువచ్చిందో కానీ, ప్రక్కనున్న వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ శిల్పం మాత్రం అలాగే నిశ్చలంగా ఉంది. ఇలా శతవిధాల ప్రయత్నించినా రాముకి గెలుపు రాలేదు. ఆ కళాకారుడు శాంతమూర్తిలా, సుఖదుఃఖాలకు అతీతమైన స్థితప్రజ్ఞత యిదేనా అన్నట్టుగా నిలిచి ఉన్నాడు. తను గెలుస్తానన్న ఆశ రామూలో పూర్తిగా సన్నగిల్లింది. ఇక ఆఖరు ప్రయత్నంగా తన జేబులోని వందరూపాయల నోటు తీసి, ఆ గాంధీ వేషధారి కళ్ళముందు రెపరెపలాడించి, “నన్ను గెలిపిస్తే ఇది నీదవుతుంది,” అన్నాడు. శెహభాష్‌, మహాత్మునికే లంచమిచ్చే దృశ్యం! చుట్టూ ఉన్న మేము శిలాప్రతిమల్లాగా చూస్తూండిపోయాం. కొన్ని గంటలపాటు కదలకుండా గాంధీగారిలా నిలబడినందుకు ఒక్క పదిరూపాయిలైనా రాలేదు కానీ, మహాత్ముని నుండి మామూలు మనిషిగా మారడానికి వందరూపాయిలు ముడుతున్నాయ్‌! తను నమ్ముకున్న కళకు అన్యాయం చేయకూడదనుకున్నాడో, లేకపోతే ఆ గాంధీగారే ఆ క్షణంలో అతనిలో ప్రవేశించారో తెలీదుగానీ ఆ కళాకారుడు లంచానికి కూడా లొంగలేదు. తన చివరి ప్రయత్నం కూడా విఫలం కావటంతో యిక ఓటమి తప్పదనుకున్నాడు రాము. చిన్నబోయిన ముఖంతో వెనుదిరిగాడు.

సరిగ్గా అప్పుడు జరిగింది, మా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంఘటన.

గాంధీ గారి కళ్ళల్లో నీళ్ళునిండాయి! కన్నీళ్ళు పొంగిపొరలి ధారగా కారడం మొదలుపెట్టాయ్‌. మనిషి నిలువెల్లా వణికిపోతున్నాడు. నోటినుండి సన్నగా మూలుగు. కాళ్ళలో సత్తువంతా ఉడిగినట్లు ఉన్నపాటున కూలబడిపోయాడు! ఈ హఠాత్సంఘటనకి మేమంతా నిశ్చేష్టులమై అలా చూస్తూండిపోయాము. జనంలో కలకలం మొదలయ్యింది.

నేను మెల్లగా దగ్గరకు వెళ్ళి అతన్ని సముదాయించాను. అతను దాహమనడంతో షోడా తెప్పించి పట్టించాం. అతను కాస్త కుదుటపడ్డాడని చూసి ఏమిటి, ఏమయ్యిందని అడిగాను. అతను మెల్లగా నోరు మెదిపాడు. “బాబూ, నేను నాటకాలు వేసేవోణ్ణి. ఇప్పుడా కళకాదరణలేక, నాకు రోజులు బాగోకా కటిక దరిద్రాన్ని అనుబవిస్తున్నాను. మా నాన్నదగ్గర నేర్చుకున్న యీ విద్దెనిలా నలుగురు మనుషులు గుమిగూడే చోట సూపించి వచ్చిన సిల్లర డబ్బులతో నేనూ నా ఆడదీ బతుకెళ్ళదీస్తన్నాం. సిన్నప్పటినుంచీ కట్టపడి నేర్చుకున్న విద్దె కాబట్టి ఆ బాబు ఎంత పెయత్నించినా అలా కదలకుండా ఉండగలిగా. వంద రూపాయలనోటు సూసినప్పుడుకూడా ఎందుకో దానిమీద ఆస కలగలేదు”. “అయితే ఎందుకలా హఠాత్తుగా పడిపోయావు?” ఆపుకోలేని కుతూహలంతో అడిగాను. అసలు కారణం ఏమిటని చుట్టూ ఉన్న జనంకూడా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.

నా ప్రశ్నకి జవాబుగా ఆ కళాకారుడు వేలెత్తి ఒక వైపుగా చూపించాడు. అక్కడొక వ్యక్తి ఒక చేతిలో కేకు, మరో చేతిలో చిప్సు పేకెట్టు పట్టుకుని విలాసంగా తింటూ కనిపించాడు. అర్థం కాక మళ్ళా కళాకారుడి వైపు చూశాను. అతని చూపులా తింటున్న వ్యక్తి కాళ్ళదగ్గరున్నాయ్‌. ఆ తింటున్న మనిషి తనకెక్కువై పడవేశాడో లేక అతని అజాగ్రత్త వల్ల పడ్డాయో కానీ అక్కడ కిందనంతా కేకుముక్కలూ, చిప్సూ చాలా పడున్నాయి. “నాకు రెండు దినాలనుండీ తిండి లేదు బాబూ. వాటిల్ని చూసేసరికి, యీ యెదవ కడుపు ఊరుకుంది కాదు. పాడుపొట్టకి ఆకలిగుర్తొచ్చేసింది. కడుపులో పేగులన్నీ మెలిపెట్టీసినట్టయిపోయింది. ఆకలి మా సెడ్డది బాబూ. దాన్ని తట్టుకోలేకే ఇట్టా పడిపోయాను.” అన్నాడు, ఉబికి వచ్చే కన్నీళ్ళని అపే శక్తి కూడా లేక ఒక చేత్తో పొట్టపట్టుకుని.

చుట్టూ చూస్తున్న జనం, విషయం అర్థమవక కొందరూ, అర్థమైనా నమ్మకం కుదరక మరికొందరూ తమలో తాము గొణుక్కుంటూ ఎవరి దోవను వాళ్ళు వెళ్ళి పోయారు. నా స్నేహితులిద్దరూ “నేను గెలిచానంటే నేను గెలిచానని”  వాదులాట ప్రారంభించారు. కరిగిన ఆ శిల్పం నుండి కన్నీరు ధారగా కారుతూనే ఉంది.

గుండె మంటలార్పగలవేమో కానీ, కన్నీళ్ళు, కడుపుమంటను చల్లార్చలేవు కదా!
---------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment