Sunday, January 6, 2019

తరవాణి కేంద్రం


తరవాణి కేంద్రం





సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..................

మా చిన్నప్పుడు వేసంకాలం వచ్చిందంటే తప్పకుండా తరవాణి కుండ ఇంట్లో వెలియాల్సిందే.  ఆ మాటకొస్తే వేసంకాలం కాకపోయినా ఉండేదనుకోండి.  మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళే మూడుతరాలవాళ్ళు.  వీళ్ళు గాక చుట్టాలూ, పక్కాలూ, పరామర్శలకొచ్చినవాళ్ళూ, పనిమీదొచ్చినవాళ్ళూ పూట పూటా పది విస్తళ్ళే లేస్తాయో, పాతికే లేస్తాయో ఎవరికెరుక?  ఇలాంటి పరిస్థితుల్లో పూట పూటా అన్నం మిగిలిపోవడంలో ఆశ్చర్యమేమీలేదు.  ఎంత ముష్టి వాళ్ళకేసినా, వాళ్ళవి మాత్రం పొట్టలా, చెరువులా?  కాబట్టి తరవాణి కుండే శరణ్యమైంది. పైగా మా అమ్మమ్మకి తరవాణికి ఉండే రోగనిరోధక శక్తి మీద చాలా గురి.  “అన్నం పరబ్రహ్మ స్వరూపం.  ఒంటికి చలవ,” అంటూ పిల్లలందరినీ కూర్చోబెట్టి మిట్ట మధ్యాన్నం వేళ తరవాణి పోసేది.  బలవంతం ఏం లేదులెండి.  మేం కూడా ఇష్టంగానే తాగేవాళ్ళం.

లాస్‌ ఏంజెలెస్లో మండు వేసవిలో ఏర్‌ కండిషనర్‌ లేని ఇంట్లో కూర్చుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాను.  (ఏర్‌ కండిషనర్‌ ఎందుకు లేదంటారా?  ఈ ఇళ్ళు కట్టినప్పుడు అలాంటివన్నీ అనవసరం అనిపించినట్టున్నాయి, అందుకని ఒక కూలర్‌ పెట్టి ఊరుకున్నాడు ఇల్లు కట్టిన మహానుభావుడు.  మరి ఆ రోజుల్లో ప్రజలకి ఎండ తట్టుకునే శక్తి ఎక్కువగా ఉండేదో, లేక అసలు ఆ రోజుల్లో ఇంత ఎండలు ఉండేవు కావో నాకు తెలియదు. లేకపోతే వాళ్ళు అమాయకులైవుండవచ్చు.  ఈ కాలపు వాళ్ళు మరీ తెలివి మీరిపోయారు కానీ, ఆ కాలపు వాళ్ళకి సమ్మర్లో వేడిగా ఉండడం అత్యంత సహజంగా అనిపించి ఉండవచ్చు.)

అయితే ఈ మధుర స్మృతులని ఎవరితో పంచుకోవడం?  మా ఆవిడ పూర్తిగా పట్న వాసంలో పెరిగింది.  నేను చదువుకునే రోజుల్లోనే మేము పల్లెటూరు వదిలేయడంతో ఆవిడ అసలు పల్లెలో అడుగుపెట్టాల్సిన అవసరమే లేకపోయింది.  పైగా పెళ్ళైనప్పటినించీ అమెరికాలోనే ఉంటున్నామయ్యె.  అయినా ప్రయత్నించి చూద్దాం అని తనని పిలిచి నా చిన్ననాటి ముచ్చట్లు చెప్పడం ఆరంభించాను.  తన రియాక్షన్‌ నేను ఊహించినదానికంటే కూడా దారుణంగా ఉంది.

“ఏమిటీ? పాసిపోయిన అన్నం తినేవాళ్ళా మీరు?”
“పాసిపోకుండా ఉండడానికే నీళ్ళు పోయడం.”
“ఛీ!  ఛీ!  అలా నీళ్ళోడుతున్న అన్నాన్ని ఎలా తింటారబ్బా!”
“తినరు.  తాగుతారు.”
“అన్నం తాగుతారా ఎక్కడైనా?”
“అన్నం కాదు.  తరవాణి.”
“ఏదో ఒక అన్నం.”
” నీకెందుకు?  నేను చేసి చూపిస్తాగా?  అప్పుడు నువ్వే దాన్ని జుర్రుకుంటూ తాగుతావు.”
“ఛీ!  నేనెప్పుడూ జుర్రను.”

మొత్తానికి ఎలాగైనా తరవాణిని చేసి ఆవిడ చేత తాగిస్తే గానీ దాని అద్భుతం తనకు బోధపడదనిపించింది.  కానీ ఇది నా ఒక్కడి వల్లా అవుతుందా?  ముఖ్యంగా మా ఆవిడ దగ్గిరనించి సహకారం మానె, ప్రోత్సాహమైనా దొరకనప్పుడు?  నాకు అండగా నిలిచేందుకు ఎవరైనా కావాలనిపించింది.  స్నేహితులూ, సన్నిహితులూ అందరి పేర్లూ (వ్యాకరణ దృష్య్టా “పేళ్ళు” అనాలి కాబోలు.  కానీ ఆ మాటంటే నాకెప్పుడూ కట్టెలు జ్ఞాపకమొస్తాయి.  సరే!  పేర్లనే అందాం ) తిరగెయ్యగా, రావుగారూ, శర్మగారూ నాకు తగిన సహాయకులనిపించింది.  ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా పల్లెటూర్లలో పెరిగిన వాళ్ళే.

తరవాణి మాట ఎత్తగానే ఇద్దరూ చాలా ఎక్సైట్‌ అయిపోయి ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చేస్తామని వాగ్దానాలు చేశారు.  ఒక శుభ ముహూర్తాన మేము ముగ్గురం కూర్చుని తరవాణి తయారుచేసేందుకు కావాల్సిన వస్తువులను జాబితా వెయ్యడం మొదలుపెట్టాం.
“చాలా సింపిలండీ.  కొంచెం గంజీ, ఓ కుండా, నాలుగు దబ్బాకులూ ఇంకేం అఖ్ఖర్లేదు,” అన్నారు రావుగారు.
నేనూ, శర్మగారూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం.  చివరికి శర్మగారే అనేశారు, “ఐటమ్స్‌ తక్కువేగానీ అవి ఇక్కడ అంత తేలిగ్గా దొరికేవి కావు మాష్టారూ,” అని.
“అలా ముందే నీరసపడిపోతే ఎలాగండీ?  మనసుంటే మార్గముందన్నారు.  ఒక్కొక్కటీ తీసుకుందాం.  మొదట కావాల్సింది గంజి.  దాంట్లో కష్టమేముంది?”
పక్కనే కూర్చుని అంతవరకూ మామాటలన్నీ నిశ్శబ్దంగా వింటున్న మా ఆవిడ హఠాత్తుగా కల్పించుకుంది.  “గంజంటే కాటన్‌ చీరలకు పెడతారు అదే కదా?”
“ఆఁ.  అదే,” అన్నాన్నేను ఆవిడ పరిజ్ఞానానికి కొంచెం ఆశ్చర్యంగానూ, చాలా ఆనందంగానూ.
“అయితే ఏం కష్టం లేదు.  అది మనింట్లోనే ఉంది.”
“ఉందా?  ఏమిటి ఇప్పుడుందా?”  నేను తెల్లబోయాను.
“అరె!  ఎందుకంత ఆశ్చర్యం?  అవును.  ఇప్పుడే రెడీగా ఉంది.”
“నేన్నమ్మను.”
ఆవిడ ఉడుక్కుంది.  “అయితే చూపిస్తాను,” అని లేచి బెడ్రూమ్‌ లోకి వెళ్ళింది.  నిజం చెప్పొద్దూ, ఒక ఇస్త్రీ చేసిన కాటన్‌ చీర తెచ్చి దాన్ని దులుపుకోమంటుందేమోనని నాకు కొంచెం భయంవేసింది.  ఇంతలో ఆవిడ చేతిలో ఒక స్ప్రే కాన్‌ పట్టుకొచ్చి మా ముందర బల్ల మీద ఠక్‌ మని పెట్టి విజయగర్వంతో మా ముగ్గురినీ కలయజూసింది.  కొంప మునిగింది.  నేను అనుకున్నంతా అయింది.

నేనూ, శర్మగారూ గుడ్లు మిటకరిస్తూ, ఒకర్నొకరు చూసుకుంటూ, గుటకలు మింగుతూ కూర్చున్నాం.  అయితే రావుగారిని ఏ సంకోచాలూ బాధించినట్టు లేవు.  మా అందర్లోకీ ఆయనే పెద్దవాడవడం మూలానేమో.
“ఇదేమిటీ?” అంటూ ఆయన ఆ డబ్బాని వింతగా చూస్తూ అటూ ఇటూ కదిలించారు.
“మీరడిగిందే.”
“కానీ ఇదేదో బట్టల మీద స్ప్రే చేసే స్టార్చులాగుందే?”
“అవును.”
“భలే జోకు వేశారే!” అంటూ ఆయన విరగబడి నవ్వేశారు.

నేను హడావుడిగా కల్పించుకుని, “మాక్కావాల్సింది ద్రవ రూపంలో అంటే లిక్విడ్‌ ఫార్మ్‌ లో ఉండాలి.  ఇది పనికి రాదు,” అని దాన్ని బల్ల కిందకి తోసేయబోయాను.
మా ఆవిడ దాన్ని నా చేతుల్లోంచి లాక్కుని, “అయితే బజార్లో స్టార్చ్‌ పౌడర్‌ అమ్ముతారు.  అది తెచ్చుకుని నీళ్ళలో కలుపుకోండి,” అన్నది.
ఇది ఫరవాలేదనిపించింది.  “ఎక్కడ దొరుకుతుంది?” అనడిగాను ఉత్సాహంగా.
“గ్రోసరీలో లాండ్రీ డిటర్జెంట్స్‌ ఉండే సెక్షన్లో.”
“ఏమిటీ?  బట్టల సబ్బుని తినమంటావా మమ్మల్ని?”  నా కోపం ఆకాశాన్నంటబోతున్నదని గ్రహించారేమో, శర్మగారు తొందరగా మా ఇద్దరి మాటలనీ సర్దేశారు.
“అబ్బే, ఆవిడ ఉద్దేశం బేకింగ్‌ సెక్షన్‌  అనండీ.  నేను కూడా ఆ స్టార్చ్‌ పెట్టెలను చూశాను.”
“అబ్బబ్బే.  ఈ పౌడరూ గీడరూ కుదరవండీ.  శుభ్రంగా అన్నం వార్చిన గంజే వాడదాం,” అని రావుగారు తేల్చి చెప్పేశారు.
“అన్నం వార్చడమంటే?” అని మా ఆవిడ ధర్మ సందేహం.
“అన్నం ఉడికాక మిగిలిపోయిన నీళ్ళు పారబోస్తాం కదా, అదన్నమాట,” అని రావుగారు వివరించారు.
“మిగిలిపోయిన నీళ్ళేమిటి?  అన్నం ఉడికేందుకు ఎన్ని నీళ్ళు కావాలో అన్నే పోస్తాం కదా?”

మా ఆవిడ పెళ్ళవగానే అమెరికా వచ్చేసిందని చెప్పాను కదూ?  అమెరికా వచ్చాకే తను వంట చెయ్యడం మొదలుపెట్టిందని కూడా ఇక్కడ మనవి చేసుకోవాలి.  అందుకే నేను, “మీ రైస్‌ కుక్కర్లలో అయితే సరిగ్గా కావాల్సినన్ని నీళ్ళు కొలిచి పోస్తారుగానీ, మన పాతకాలంలో ఇవ్వన్నీ ఎక్కడున్నాయ్‌?  ఏదో ఉజ్జాయింపుగా పోసేవాళ్ళు.  ఆ పోసేదేదో కాస్త ఎక్కువగానే పోస్తే అన్నం మాడుతుందన్న భయం లేకుండా ఉండేది.  కాబట్టి ఇప్పుడు మనం కూడా అలాగే అన్నం వార్చాలి,” అని స్పష్ట పరిచాను.
ఆవిడ మూతి తిప్పుకుంది.  “రైస్‌ కుక్కర్లో ఎక్కువ నీళ్ళు పోస్తే అవేమీ మిగలవు.  నీళ్ళన్నీ అయిపోయేదాకా అన్నం ఉడుకుతూనే ఉంటుంది.  అలా వండితే మీకు వచ్చేది గంజి కాదు , గుజ్జు.  అంతే.”
“తెలుసులే.  అందుకే మేం రైస్‌ కుక్కర్లో వండం.  వేరే గిన్నెలో వండుతాం.”
“ఎందుకింత శ్రమ?  రైస్‌ కుక్కర్లో అయితే ఎంత సుఖం?  ఒక బటన్‌ నొక్కితే సరి.  మళ్ళీ దాన్ని గురించి ఆలోచించక్కరలేదు.  అది పొంగుతోందో, మాడుతోందో అని బెంగ పెట్టుకోనక్కరలేదు.”
“ఈనాడు అన్నం వండడం కూడా ఒక “లాస్ట్‌ ఆర్ట్‌” అయిపోయింది,” అని నిట్టూర్చారు శర్మగారు.

అందరం ఆలోచనలో పడి కొంతసేపు మాటల్లేకుండా కూర్చున్నాం.  బహుశ ఎవరికి వారే లోలోపల వారికి ప్రియమైన జ్ఞాపకాలను తవ్వుకుంటూ, మళ్ళీ తిరిగి రాని, రాబోని జీవన విధానాన్ని తలుచుకుంటున్నారనుకుంటాను.  హఠాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రావుగారు బల్లని ఒక చరుపు చరిచి, “అఛ్ఛా!” అన్నారు.  మేమంతా ఉలిక్కిపడి ఆయన వంక చూశాం.
ఆయన చాలా ఉత్సాహంగా కనిపించారు.  “ఇప్పుడు మనం చేస్తున్నదేమిటో తెలుసా?” అనడిగారు గంభీరంగా.
“తరవాణి,” అన్నాన్నేను.
“కాదు.  ఉట్టి తరవాణి కాదు.  మనం చేయబోతున్న ఈ తరవాణికి గొప్ప ” symbolic meaning ” ఉన్నది.  అదేమిటో తెలుసా?”
తెలీదన్నట్టు తలలూపాం.
” Modern technology  కింద మాసిపోతున్న మన ఆచారాలను పునరుధ్ధరించబోతున్నాం.  పరిస్థితులు ఎంత ప్రతికూలించినా, తెలుగు దేశం వదిలి ఎన్నేళ్ళయినా, ఎంత దూరంలో ఉన్నా, మనమింకా పదహారణాల అచ్చ తెలుగు బిడ్డలమేననీ, మన తెలుగు తల్లిని మరచిపోలేదనీ నిరూపించబోతున్నాం.  అమెరికాలో ఉన్నా ఆంధ్రత్వం కోల్పోలేదనీ, ముక్కోటి ఆంధ్రులకూ మనం గర్వకారణమనీ ఢంకా బజాయించి మరీ చెప్తాం!”
అన్నట్టు రావుగారు అడపాదడపా ఏవో రచనలు కూడా వెలిగిస్తూంటారు లెండి.  ఆయన వాగ్ధాటికి మేం తట్టుకోలేకపోయాం.  మేం తెల్ల మొహాలు వేశామేమో, ఆయనే మళ్ళీ అన్నారు,
“ఏం? అర్ధం కావడం లేదా?  మనం ఈ తరవాణి చెయ్యడం కేవలం కాలక్షేపం కోసం కాదు.  We are preserving our culture!   మిగిలిపోయిన అన్నం, ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంకా మనలో మిగిలి ఉన్న మన సంస్కృతి చిహ్నం.  దాన్ని నాన వేసే ఆ గంజి మన సంస్కృతి నిండా ప్రవహించే జీవరసం.  మిగిలిపోయిన అన్నం పాడవకుండా ఉండడానికి ఎలా గంజిలో వేస్తామో, అలాగే ఇంకా మనలో ఇంకిపోని తెలుగు వాసనలని ఇలా మన సాంప్రదాయాల సారంలో వేసి నిలబెట్టుతున్నామన్నమాట.”

రావుగారి ఉపన్యాసం నామీదా, శర్మగారిమీదా సంజీవనీ మంత్రంలా పనిచేసి మాలో కొత్త ఊపిరి పోసింది.  తుపాకీ గుండుకి నిర్భయంగా ఛాతీ చూపించిన అల్లూరి సీతారామరాజూ, ప్రజలకోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములగారూ మమ్మావహించినట్టు పునర్జీవులైనాం.  చాపకింద నీరులా వచ్చి మనని ముంచేసే పాశ్చ్యాత్త ప్రభావానికి లొంగకూడదనే ఆవేశంతో శక్తులు నిండే రక్తం మండే శ్రీ శ్రీ గారి సైనికులమై చెంగున లేచి నుంచున్నాం.

మా ఆవిడ మీద మాత్రం దాని ప్రభావమేమీ ఉన్నట్టులేదు.  “అవునవును.  రైస్‌ కుక్కర్లో వండితే గంజి రాదు కాబట్టి మామూలు గిన్నెలో వండాలి.  అన్నం పాడవకుండా ఉండేందుకు రిఫ్రిజరేటర్లో పెట్టకూడదు.  తరవాణిలో వెయ్యాలి.  గారెలకి పప్పు బ్లెండర్లో రుబ్బితే సరైన రుచి రాదు కాబట్టి ఇండియానుంచి రుబ్బురోలు తెప్పించి మరీ రుబ్బాలి.  మీ cultural preservation  అంతా ఆడవాళ్ళకు తప్పిపోయిన చాకిరీ మళ్ళీ తెచ్చిపెట్టడానికే.  ఈ కల్చర్‌ వంకంతా ఆడవాళ్ళని అణిచి పెట్టి ఉంచడానికే.”

నేనే అడ్డంకులనీ లెక్క చేసే స్థితిలో లేను.  “నీ వాదంలో బలం లేదు. ఇక్కడ చాకిరీ అంతా మొగవాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఏ ఆడవాళ్ళూ అణచబడటం లేదు,” అని శర్మగారి వైపు తిరిగాను.  ” రండి సార్‌!  మన ధ్యేయమేమిటో మాష్టారు గారు చెప్పాక ఇక నాకు ఆగాలనిపించడం లేదు,” అని అలమరలోంచి ఒక పెద్ద గిన్నె తీశాను.
“భేష్‌” అని మెచ్చుకున్నారు రావుగారు.  “ఉత్సాహం అంటే అలా ఉండాలి.  ఏదీ, కాస్త ఎసరు పడేసి అన్నం ఉడికేలోగా మనం కుండా, ఆకులూ సంపాదిద్దాం.”
కుండ మాట వినేసరికి లేస్తున్న శర్మగారు మళ్ళీ కుర్చీలో కూలబడ్డారు.  “ఇక్కడ కుండలెక్కడ దొరుకుతాయండీ?  అంతా ప్లాస్టిక్కు మయం.”
“బజారులో అమ్ముతారుగదా, ceramic pots  అని?  అవి మట్టితో చేసినవే గదా?”  అనడిగారు రావుగారు.
“అబ్బే, వాటన్నిటికీ పైన ఏదో glaze పూస్తారు మాష్టారూ.  కాబట్టి మట్టి గుణాలేవీ వాటికి మిగిలుండవు.”
“పోనీ మొక్కల కోసం చేసే pots  ఉంటాయిగా.  వాటికేమీ glaze  ఉండదుగా?” అన్నారు రావుగారు విసుగు చెందని విక్రమార్కుడిలా.

ఆ అద్భుతమైన బ్రెయిన్‌ పవర్‌ చూసి శర్మగారూ, నేనూ చిత్తయిపోయాం.  “భలే ఆలోచన గురువుగారూ.  వెంటనే వెళ్ళి కొనుక్కొద్దాం రండి.  ఎందుకలా నవ్వుతున్నావు?” అని చిరాగ్గా మా ఆవిడనడిగాను.
ఆవిడ పొట్ట పట్టుకుని, “ఆ పాట్స్‌ కి.. ఆ పాట్స్‌ కి ..” అంటూ ఆయాసపడసాగింది.
“ఊఁ, ఏమిటా పాట్స్‌ కి?”
“ఆ పాట్స్‌ అన్నిటికీ అడుగున చిల్లులుంటాయి.  మీరు ఇంత కష్ట పడి చేసిన తరవాణీ అంతా కారిపోతుంది,” అని చెప్పి మళ్ళీ ఆవిడ నవ్వులంకించుకుంది.
“ఊఁ, మంచి సమస్యే తెచ్చిపెట్టారే,” అని సాలోచనగా చూశారు రావుగారు.  “పోనీ మనం ఒక pottery  క్లాసు తీసుకుని మనక్కావాల్సిన విధంగా ఒక కుండ తయారు చేసుకుంటే?”
“బ్రహ్మాండంగా ఉంటుంది.  అయితే ఆ క్లాసు జరిగినన్ని వారాలూ ఈ అన్నం ఇలా ఉడుకుతూనే ఉండాలా?” మళ్ళీ నవ్వడం మొదలు పెట్టింది మా ఆవిడ.
“అబ్బే, ఇది ఆపేసి క్లాసులన్నీ అయ్యాకే మళ్ళీ వండడం మొదలుపెడతాం,” అన్నారు రావుగారు తేలిగ్గా.

నాకిదేం నచ్చలేదు.  “అలా వద్దు మాష్టారూ.  ఇవ్వాళ సంకల్పించాము గదా.  ఇవ్వాళే దీని అంతు చూడాలి.  పోనీ మేము కిందటి సారి మెక్సికో వెళ్ళినప్పుడు ఒక కూజా లాంటిది కొన్నాం.  అది వాడొచ్చనుకుంటాను.  దానికి ఈ గ్లేజూ, గీజూ ఏమీ లేదు. మన దేశంలో చేసే వాటిలాగానే ఉంటుంది,” అని దాన్ని తెచ్చేందుకు లేచాను.
“ఆఁ, అది మంచి ఐడియా,” అన్నారు శర్మగారు కూడా ఉత్సాహంగా.
కానీ మా ఆవిడ కెవ్వుమంది.  “ఇంకా నయం.  దాంట్లో lead  ఉంటుంది.  అందులో వేసుకున్నదేదైనా తింటే lead poisoning  వస్తుంది.  అది మాత్రం వాడకండి,” అని ఆదేశించింది.

మాకేం చేయాలో పాలుపోలేదు.  ఓ పక్కనేమో మొదలు పెట్టిన పనిని పూర్తిచేయలనే ఆరాటం.  మరో పక్క మొండిపట్టు పడితే ఏం ముంచుకొస్తుందో అనే భయం.  “ఒకవేళ ఆ మెక్సికన్‌ కూజాలో కాస్తో కూస్తో lead  ఉందనే అనుకుందాం.  తరవాణి మహిమ ముందర అది నిలవగలదా?” అని నేను జబర్దస్తీ చేయబోయాను.
“కడివెడు పాలలో ఒక్క చుక్క విషం ఉన్నా అంతా విషమౌతుందంటారు.  ఎందుకులెండి అనవసరంగా,” అని తీర్చేశారు రావుగారు.
“మరైతే..?”
“ఏముంది?  ఓ కార్నింగ్‌ వేర్‌ గిన్నె వాడేద్దాం.  అదీ ceramic  ఏ గదా?  పనికొస్తుంది లెండి,” అని శర్మగారు తీర్మానించేశారు.
“సరే. మరి దబ్బాకులు?” అన్నాన్నేను జారిపోతున్న ఉత్సాహాన్ని మళ్ళీ తెచ్చుకుంటూ.
“అసలు ఈ దేశంలో దబ్బ చెట్లుంటాయా?” అని ధర్మ సందేహం వెలిబుచ్చారు శర్మగారు.
“దొడ్లో నిమ్మచెట్టు పెట్టుకుని మళ్ళీ దబ్బ చెట్టుని వెతుక్కోవడమెందుకు?” అన్నారు రావుగారు.
“నిమ్మాకులు పనికొస్తాయా?” అన్నాను నేను సంకోచిస్తూ.
“నిక్షేపంలా పనికొస్తయ్‌.  అయినా మీ నిమ్మకాయలను చూసి అందరూ దబ్బకాయలని ఎలాగూ భ్రమపడుతున్నారు.  ఇక ఆలోచన ఎందుకు?”

మా నిమ్మకాయలు కాస్త పెద్ద సైజులో ఉంటాయి లెండి.  వాటిని మొదటి సారి చూసిన ప్రతి వాళ్ళూ అవి నిజంగా దబ్బకాయలని మాతో పేచీ మొదలుపెడతారు.  కాదు, నిమ్మకాయలేనని వాళ్ళను నమ్మించేందుకు మేం చాలా కష్టపడాల్సొస్తుంది.

మొత్తం మీద ఎలాగైతేనెం, ఒక కార్నింగ్‌ వేర్‌ గిన్నే, పది నిమ్మాకులూ తెచ్చుకుని గట్టుమీద సిద్ధంగా పెట్టుకున్నాం.  అన్నం ఉడకగానే దాన్ని ఆ కార్నింగ్‌ వేర్‌ గిన్నెలోకి వార్చాం.  కొంచెం చల్లారనిచ్చి అందులో నిమ్మాకులు వేశాం.
“ఇప్పుడేమిటి నెక్స్ట్‌ స్టెప్‌” అన్నాను నేను ఆత్రంగా.
“ఇంకేమీ లేదు.  అది పులిసేంతవరకూ అలా వదిలేయడమే,” అన్నారు రావు గారు.  “కనీసం రేప్పొద్దుటి వరకూ దాని మొహం చూడనక్కరలేదు.”
“రేపటి వరకూ ఆగాలా?” పాపం తరవాణీని వెంటనే తాగేద్దామనుకున్న శర్మగారి మొహంలో ఆశాభంగం స్పష్టంగా కనిపించింది.
ఎలాగో మనసులకి నచ్చచెప్పుకుని, మా ఆశలన్నీ రేపటిమీద కేంద్రీకరించి, ఆపూటకి మామూలు విందు భోజనంతో (అదే లెండి, పార్టీ భోజనంతో) సరిపెట్టుకున్నాం.

మర్నాటి సాయంకాలం దాకా ఆ తరవాణీ గిన్నెని కదపడంగానీ, మూతతీయడంగానీ చెయ్యనని నాచేత ఒట్టు వేయించుకుని రావుగారు “గుడ్‌ నైట్‌” చెప్పి ఇంటికి వెళ్ళారు.  రేపు సాయంకాలమవగానే తరవాణి స్టాటస్‌ తనకి వెంటనే ఫోన్‌ చేసి చెప్తానని నాదగ్గిర వాగ్దానం పుచ్చుకుని వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళారు శర్మగారు.

అయితే ఆ మర్నాడు నేను ముందు ఫోన్‌ చేసింది రావుగారికి.  “మాష్టారూ, దీని వాసన చూస్తే ఏం పులిసినట్టనిపించడంలేదు.  పైగా చాలా చిక్కగా కూడా ఉన్నట్టుంది.  తరవాణీ అంటే పల్చగా గ్లాసులో తాగేటట్టుగా ఉంటుంది కదా?  కొన్ని నీళ్ళు పొయ్యమంటారా?” అని సందేహం వెలిబుచ్చాను.
“ఒద్దొద్దు.  ఇప్పుడే నీళ్ళు పోస్తే గంజి పులవదు.  ఇక్కడ “డ్రై హీట్‌” కదా.  అందుకని మనవైపంత తొందరగా పులవదు.  ఇంకో రోజో రెండు రోజులో ఆగి చూద్దాం.  ఆ తర్వాత కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు,” అని ఆదేశించారు రావుగారు.  సరే.  అన్నీ తెలిసిన మనిషి దీని బాధ్యత నెత్తిమీదకెక్కించుకుంటుంటే మధ్యలో నేనెందుకు అడ్డు చెప్పడం?  అలాగే అని, ఈ విచార వార్త శర్మగారి చెవిన వేశాను.
“ఏమిటీ?  ఇంకా రెండు రోజుల ఆగాలా?  మరి అప్పుడు వీక్‌ మధ్యలో రావడం నాకు కుదరదే!” అని నిరుత్సాహపడిపోయారు శర్మగారు.  ఈ లాస్‌ ఏంజలెస్లో దూరాలు ఇక్కడున్న వాళ్ళందరికీ భారాలే.  ఒక్క ఫ్రెండుని చూడాలనుకుంటే ఒక పూటంతా ప్రయాణం చెయ్యాలి.
“ఫరవాలేదు.  వచ్చే వీకెండ్‌ ఇక్కడకి వచ్చేయండి,” అని ఆయన్ని ఓదార్చబోయాను.
“అప్పటికి అది కాస్తా పాడైపోదూ?” అన్నారు ఆయన అనుమానంగా.
“తరవాణి పాడవడమేమిటండీ?  అసలది పాడవదనేదే కదా దాని మూల సూత్రం?” అన్నాను నచ్చచెబుతూ.
“ఏమో, ఎందుకైనా మంచిది.  అది సరిగ్గా పులిసిన తర్వాత దాన్ని కాస్త రెఫ్రిజరేటర్లో పెట్టి ఉంచండి,” అని ప్రాధేయపడ్డారు శర్మగారు.

దురదృష్టవశాత్తూ ఈ సంభాషణంతా స్పీకర్‌ ఫోన్‌ మీద జరగడంతో ఈ ముక్క మా ఆవిడ చెవిన బడడం, ఆవిడ కిసుక్కుమని గదిలోంచి పారిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.  అదృష్టవశాత్తూ శర్మగారు ఇలాంటివేవీ పట్టించుకునే స్థితిలో లేరు.  తరవాణీ తయారవగానే దాన్ని రెఫ్రిజరేటర్లో పెట్టాల్సిందని మళ్ళీ మళ్ళీ చెప్పి చివరకి బాధగానే ఫోను పెట్టేశారు.

ఆ మర్నాడు తరవాణీ గిన్నెలోకి తొంగి చూశాను కానీ మూత తియ్యలేదు.  పరిస్థితిలో ఏమీ మార్పునట్టు నాకు తోచలేదు.  “ఆయన రెండురోజులు ఆగమన్నారు కదా.  ఊరికే దాన్ని చూస్తూ కూర్చుంటే అది తొందరగా పులుస్తుందా ఏమైనానా? ” అన్న మా ఆవిడ హెచ్చరిక విని గబగబా ఇవతలకి వచ్చేశాను.  “A watched pot never boils”  అని ఇంగ్లీషులో సామెత ఉన్నది కదా.  అలాగే “A watched తరవాణి  pot never sours”  అని కూడా చెప్పచ్చేమో, నేను దాని వైపే చూస్తూంటే అది ఎప్పటికీ పులవదేమోనని భయం వేసింది.  అయినా ఇంకొక్క రోజేకదా అని సరిపెట్టుకున్నాను.
ఆ మర్నాడు నేను ఆఫీసునుంచి ఇంటికొచ్చేసరికి మా ఆవిడ ఆ తరవాణీ గిన్నె వైపే చూస్తూ, దాని మూత తియ్యబోయే దానిలా చెయ్యెత్తి కనిపించింది.
“ఆఁ, ఆఁ, ఏం చేస్తున్నావు?” అంటూ రఁయ్యిమని దూసుకొచ్చేశాను.  ఆవిడ వెనక్కి జరిగింది.  “ఏమీ చెయ్యటం లేదు కానీ, దీనికేదో అయినట్టుంది,” అన్నది.
“పులిసిందా?” అని నేను ఉత్సాహంగా తొంగి చూశాను.  మొదటిరోజుకీ ఇప్పటికీ నాకేమీ తేడా కనిపించలేదు.  “ఏముందీ?” అన్నాను అయోమయంగా.
మా ఆవిడ వేలు తరవాణికి అరంగుళం పైన కదలాడింది.  “ఇదిగో.  ఇదేమిటీ?  ఇక్కడా .. ఇక్కడా ..”
ఆవిడ వేలు వెంటనే చకచకా నా చూపులు కూడా ఒక్కొక్క నిమ్మాకు వైపు ప్రసరించాయి.  ఒక్కో ఆకు చుట్టూ నల్లగా పీచుల్లాంటివి ఏవో .. తెల్లటి తరవాణిలో దిష్టి చుక్కల్లా, మా ఆశలని నిర్దాక్షిణ్యంగా నలిపివేస్తున్న కాల పిశాచాలలాగా …
“ఏమిటంటావు అదీ?” అనడిగాను, నా నోటితో నేను అనలేక.
ఆవిడ ఏమాత్రం మొహమాటం లేకుండా, “బూజు. కదా?” అని ఒక్క ముక్కలో తేల్చేసింది.
“అలాగే ఉంది మరి,” అన్నాన్నేను నీళ్ళు నములుతూ.
మేమిద్దరం ఒకళ్ళ మొహాలొకరు ప్రశ్నార్ధకంగా చూసుకున్నాం.
నేను ఉండబట్టలేక మూత తీసి గిన్నెలో మొహం పెట్టబోయాను.  గుప్పుమన్న వాసనకి మా ఆవిడ ఠక్కుమని మూత మళ్ళీ పెట్టేసింది.
వణుకుతున్న చేతులతో రావుగారికి ఫోను చేశాను.  ఈ వార్త విన్నాక ఒక రెండు నిముషాలు ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయారు.  “హలో .. ఉన్నారా అక్కడ?” అనడిగాను కంగారుగా.
“ఆఁ, ఉన్నానున్నాను.  ఎందుకిలా అయిందా అని ఆలోచిస్తున్నాను అంతే.  ఒకవేళ మనం అందులో ఉప్పు వేసి ఉండాల్సిందేమో?”
“తరవాణిలో ఉప్పు వేస్తారా?” అన్నాను ఆశ్చర్యంగా.
“అదే గుర్తు రావడం లేదు.  మా అమ్మమ్మో మామ్మో ఇస్తే తాగేయడమే తప్ప వాళ్ళు దాన్ని ఎలా తయారు చేసేవాళ్ళో నేనెప్పుడూ చూడలేదు.  నాకు తెలిసిందల్లా వాళ్ళు అప్పుడప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని ఆ తరవాణి కుండలో వెయ్యడమే.  కానీ చూడబోతే ఇందులో మనకి తెలియని తిరకాసేదో ఉందనిపిస్తోంది.”
“మరయితే ఇప్పుడేం చేద్దాం?”
“ఇక చేసేదేముంది?  ఆ తరవాణికి తిలోదకాలు ఇచ్చేయడమే.”
“అంతేనంటారా?” అన్నాను నీరుగారిపోతూ.
“అంతే మరి.”

నీరసంగా ఫోను పెట్టేశాను.  నాకే ఇలా ఉంటే ఇక శర్మగారు ఏమైపోతారో? పాపం తరవాణి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు.  ఆయనకి ఈ విషాద వార్త ఎలా చెప్పాలో నాకర్థం కాలేదు.  ఇంతలో నా గుండె ఝల్లు మనేలా ఫోను మోగింది.  యాంత్రికంగా దాన్ని తియ్యబోయి మళ్ళీ చెయ్యి వెనక్కి లాగేసుకున్నాను.  ఒకవేళ ఆ పిలుస్తున్నది శర్మగారైతే?  ఇంతలో ఫోను మోత ఆగిపోయింది.  నేను నిట్టూర్చి కాస్త కుదుటబడే లోపల మా ఆవిడ కార్డ్‌లెస్‌ ఫోనుతో నా ముందర నిలబడి ఉన్నది.
“శర్మగారు.  తరవాణి తయారయిందా అనడుగుతున్నారు,” అన్నది కొంచెం గొంతు తగ్గించి.
నా గుండె మళ్ళీ గుభేలు మంది.  “నువ్వే చెప్పేసెయ్‌” అన్నాను రహస్యంగా.
“నేనెందుకూ మధ్య?” అని ఆవిడ బలవంతంగా ఫోను నా చేతిలో ఇరికించి వెళ్ళిపోయింది.
ఇక తప్పేదిలేదని ఫోను తీసుకుని, “ఆఁ, హలో శర్మగారూ,” అన్నాను గొంతుని మామూలుగా ధ్వనింపచేసేందుకు ప్రయత్నిస్తూ.
“ఆఁ, చెప్పండి సార్‌.  అంతా తయారేనా?  శుక్రవారం వచ్చేయమా?” అనడిగారు శర్మగారు ఉత్సాహంగా.
హతోస్మి.  “శుక్రవారమా?  ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుందేమో,” అన్నాను ఏమీ తోచక.
“అబ్బే ఫరవాలేదులెండి.  “ఆలస్యం అమృతం విషం” అన్నారు కదా పెద్దలు.  అసలు శుక్రవారం వరకూ కూడా ఆగాలనిపించడం లేదు.”
“ఆఁ, ఫరవాలేదు, శుక్రవారం రాత్రి వచ్చేయండి.  ఇంకా రెండు రోజులేగా,” అన్నాను కంగారుగా.
“నిజమే లెండి.  ఇంతకీ దాన్ని రిఫ్రిజరేటర్లో పెట్టారా?”
“ఇదిగో ఇప్పుడే పెడుతున్నా,” అని తరవాణీ గిన్నెని రిఫ్రిజరేటర్లో పెట్టేశాను హరిశ్చంద్రుడిలా.
“వెరీ గుడ్‌” అంటూ శర్మగారు ఫోను పెట్టేశారు.

నాకేమీ పాలుపోలేదు.  ఇప్పటికెలాగో మాట దక్కించుకున్నా శుక్రవారం ఏం చేసేట్టు?

నా ఆలోచన ఎటూ తేలకుండానే శుక్రవారం వచ్చేసింది.  ఈ లోపల రెండు మూడు సార్లు మా ఆవిడ ఆ తరవాణీ గిన్నెని కడిగేయబోతే వద్దని వారించడం మినహా నేను దాని గురించి వేరే ప్రయత్నాలేమీ చేయలేదు.  ఇంతలో శర్మగారూ, ఆయన భార్యా లోపలికి అడుగు పెట్టేశారు కూడా.  అంత్యనిష్టూరం కంటే ఆదినిష్టూరం మేలని నేను కుశల ప్రశ్నలు కూడా వేయకుండా,
“వెరీ సారీ శర్మగారూ, ఆ తరవాణీ బూజు పట్టిపోయింది,” అని కుండ బద్దలు కొట్టేశాను.

శర్మగారు కొయ్యబారినట్టైపోయారు.  నోట మాట రావటం లేదు.  నిలువుగుడ్లు పడిపోయాయి.  చేష్టలు దక్కినవాడిలాగా కాలూ చెయ్యీ ఆడక రెప్పపాటు లేకుండా మమ్మల్నే చూస్తున్న ఆయన వాలకం చూసి మేమంతా కంగారు పడిపోయి నెమ్మదిగా కూర్చోపెట్టి శైత్యోపచారాలు చేశాం.  కొన్ని నిముషాలకు ఆయన కొంచెం తేరుకున్నారు.
“ఏమిటి?  ఎలా జరిగింది?  రిఫ్రిజరేటర్లో .. ?” అని ప్రశ్నలు గుప్పించేస్తూంటే మళ్ళీ గుక్క తిప్పుకోలేకపోతారేమోనని భయపడి నేను అడ్డొచ్చాను.
“రిఫ్రిజరేటర్లో పెట్టక ముందే బూజు పట్టేసిందండీ.  ఒకవేళ ఉప్పు వెయ్యకపోవడం వల్లనేమో అని రావుగారు అన్నారు,” అని రెండు ముక్కల్లో తేల్చేశాను.
దీనికి శర్మగారేమీ సమాధానం చెప్పలేక పోయారు.  ఏమంటే ఏం ముంచుకొస్తుందోనని మేం ముగ్గురం కూడా నిశ్శబ్దంగా కూర్చున్నాం.  చివరకి ఆయన దీర్ఘంగా నిట్టూర్చి తలెత్తారు.  “సరే.  ఏం చేద్దాం?  మనకి ప్రాప్తం లేదనుకోవాలి.  అంతే.”
ఆయన నిబ్బరాన్ని నేను మెచ్చుకోలేకుండా ఉండలేక పోయాను.  “మీరింత ధైర్యంగా ఉంటారనుకోలేదండీ,” అన్నాను అభిమానంగా.
జీవం లేని నవ్వొకటి నవ్వారు శర్మగారు.  “ఆట్టే మెచ్చుకోకండి మాష్టారూ.  ఇది మేకపోతు గాంభీర్యమేమో ఎవరికి తెలుసు?  ఆ తరవాణీ గురించి ఎన్ని కలలు కన్నానో,” అని మళ్ళీ నిట్టూర్చారు.
“నిజమే.  నేను మాత్రం?”
“అసలు తరవాణీ కన్నా కూడా తరవాణి చారు తినాలని నాకెంతో కోరిక.”
అంతవరకూ ఏమీ కల్పించుకోని మా ఆవిడ ఆసక్తిగా, “తరవాణీ చారేమిటి?” అనడిగింది.
“అదే.  ఇలా వార్చిన గంజిలోంచి తేట తీసి దాంట్లో పోపూ అదీ పెట్టి చారు చేస్తారు.  ఎంత కమ్మగా ఉంటుందో,” అన్నాను నోట్లో ఊరుతున్న నీళ్ళను మళ్ళీ మింగేస్తూ.
“అందులో ముక్కలు కూడా వేస్తారా?” అనడిగింది మా ఆవిడ కుతూహలంగా.
“అబ్బే, ముక్కలు వేస్తే దాని రుచే పోతుంది.”
“ఓహో.  అంటే “ఏడిచార”న్నమాట,” అని మా ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వింది.
ఆ మాటను ఆవిడకు నేర్పింది నేనే కాబట్టి దాన్ని ఆక్షేపించలేక, “ఏం కాదు.  ఏడిచారు కంటే ఎన్నో రెట్లు బాగుంటుంది,” అని దబాయించేశాను.
శర్మగారిదేమీ పట్టించుకోకుండా, “పోనీ రెడీ మేడ్‌ గంజి ఎక్కడైనా దొరుకుతే బాగుంటుంది. దాన్ని చారు చేసుకోవచ్చు,” అన్నారు ఆశగా చూస్తూ.
“ఆయనుంటే మంగలెందుకన్నట్టు, అలాంటిదే ఉంటే మనకీ అవస్తలన్నీ ఎందుకు?” అన్నాన్నేను.
మళ్ళీ కాస్సేపు మౌనంగా గడిచింది.  వాతావరణాన్ని కాస్త తేలిక చేసే ఉద్దేశంతో, “ఏమైనా డ్రింక్‌ పుచ్చుకుంటారా?” అనడిగాను.
“డ్రింకా?” అంటూ శర్మగారు నా మాటలు అర్ధం కానట్టు చూశారు.  అంతలో ఆయన కళ్ళలో ఒక మెరుపు మెరిసింది.  ముందుకు వంగి, “ఏమున్నాయ్‌?” అన్నారు ఆత్రంగా.
“బీరు, స్కాచ్‌, కోక్‌,” అన్నాన్న్నేను.
ఆయన నవ్వుతూనే తల అడ్డంగా ఊపి, “నాక్కావాల్సింది మీ దగ్గిర లేదు,” అన్నారు.
“ఏం కావాలి మీకు?  పోనీ వెళ్ళి కొనుక్కొద్దాం,” అన్నాను ఎలాగైనా ఆయన్ని సంతృప్తి పరుద్దామని.
“తరవాణి,” అన్నారు శర్మగారు.  భగవంతుడా!  ఈయన మళ్ళీ ఈ ధోరణికొచ్చాడేమిటీ? అని నేను తలపట్టుకోబోతూంటే, ఆయన చెంగున లేచి నుంచుని, “రండి, వెళ్ళి కొనుక్కొద్దాం,” అన్నారు.
నేను తెల్లబోయి చూశాను.  “తరవాణీ కొనుక్కొద్దామా?”  అన్నాను అతి కష్టం మీద.

శర్మగారు పగలబడి నవ్వుతూ, “అవును.  స్వఛ్ఛమైన, తేట తీసిన, పులవ బెట్టిన తరవాణీ.  రండి, వెళ్దాం!” అన్నారు.
ఈయనకి మతిబోయిందేమిటా అని నేను భయపడ్డాను.  పాపం తరవాణీ పిచ్చి నిజమైన పిచ్చిలోకి దింపింది.
నా అవస్థ చూసి శర్మగారే మళ్ళీ అన్నారు,”ఏమిటి అర్ధం కావటంలేదా?  సాకె అండీ, సాకె!”
“సాకె ఏమిటి?” అన్నది మా ఆవిడ విచిత్రంగా చూస్తూ.

నేను కొంచెం తెప్పరిల్లి, “అదొక జపనీస్‌ వైనులే.  కానీ .. ” అంటూ ఆగిపోయాను.
“ఉట్టి వైను కాదు. రైస్‌ వైన్‌!  సాకె ఎట్లా తయారు చేస్తారో మీకు తెలీదా?  గంజిని పులవబెట్టి చేస్తారు!” అన్నారు శర్మగారు.
“నిజంగా గంజి వాడతారా?” అనడిగింది మా ఆవిడ కుతూహలంగా. నేనూ సందేహంగానే చూశాను.
“పోనీ గంజిలాంటిదేదో.  అంతకన్నా తరవాణికి దగ్గిర పదార్ధం మనకు దొరకదు లెండి,” అన్నారు శర్మగారు.
“కానీ .. ” అని నేనింకా నసుగుతుంటే శర్మగారన్నారు,
“చారు పెట్టుకుందాం,” అని.

ఎట్టకేలకు నాకు జ్ఞానోదయం అయింది.  “బ్రిలియెంట్‌!  అట్టర్లీ బ్రిలియెంట్‌!” అంటూ శర్మగారిని కౌగలించుకున్నంత పని చేశాను.  “అన్నం వండక్కర్లేదు, వార్చక్కర్లేదు ”
“అది పులిసేందుకు వేచి ఉండక్కరలేదు,” అని అందించారు శర్మగారు.
“పదండి వెళ్దాం!” అని నేను ఉత్సాహంగా చెప్పులు తొడుక్కున్నాను.  “మేం వచ్చేటప్పటికి కొంచెం అన్నం వండి పెట్టి సిద్ధంగా ఉంచండి,” అని మా ఆవిడ కొక రిక్వెస్ట్‌ పడేసి బయల్దేరాం.

మేం తిరిగివచ్చేటప్పటికి అన్నమే కాక పాపం మా ఆవిడ పప్పూ, రెండు కూరలూ, పులుసూ కూడా చేసి ఉంచింది.  “ఇక తప్పుకోండి,” అని మా ఇద్దరి భార్యలనూ అవతలకి పంపించి పోపు సామానులకోసం వెతకసాగాను.  ఈ హడావుడి చూసి మా ఆవిడ మళ్ళీ వంటింట్లోకి వచ్చింది.
“ఏం కావాలి?”
“దీంట్లోకి కొంచెం చారు పొడీ, పోపూ వెయ్యాలి.”
ఆవిడ అవన్నీ తీసిచ్చి అక్కడే నిలబడింది.  శర్మగారి భార్య కూడా కుతూహలంగా మా ఆవిడ పక్కనే నుంచుని మేమేం చేస్తున్నదీ శ్రద్ధగా గమనించసాగారు.
“కొంచెం కరివేపాకు ఉంటే బాగుంటుంది,” అన్నారు శర్మగారు.
అదికూడా చేతికొచ్చింది.

పది నిముషాల్లో ఘుమఘుమలాడే తరవాణి చారు తయారైంది.  ఈ లోపల మా ఆవిడ బల్ల మీద భోజనాలకి అన్నీ సిద్ధం చేసేసింది.  శర్మగారూ, నేనూ కూడా ముందర చారు కలుపుకున్నాం.  మా ఆత్రం చూసి మా భార్యలిద్దరూ నవ్వాపుకోలేకపోయారు.  మొదటి ముద్ద రుచిచూడగానే అప్రయత్నంగా నా నోట్లోంచి “అద్భుతం!” అని వెలువడింది.
“అనిర్వచనీయం!” అన్నారు శర్మగారు సగం మూసిన కళ్ళతో ఏవో దివ్య లోకాలను అనుభవిస్తూ.
మా పారవశ్యంనించి కొంచెం తేరుకుని, “నువ్వు కూడా కలుపుకో,” అని మా ఆవిడకి చారు వడ్డించబోయాను.
“అబ్బే, ఎందుకూ, నేను పులుసు పోసుకుంటాను,” అంటూ ఆవిడ ప్లేటునిండా పులుసు నింపేసుకుంది.
“పోనీ కొంచెం రుచి చూడు, కప్పులో పోసి ఇవ్వనా?” అన్నాను నచ్చచెబుతూ.
“అవునండీ, అసలు అన్నంలో కలుపుకున్నప్పుడు కంటే దాన్ని విడిగా తాగినప్పుడే దాని అసలు రుచిని పూర్తిగా ఆస్వాదించవచ్చు,” అన్నారు శర్మగారు కవిత్వధోరణిలో.

కానీ ఆవిడ చలించలేదు.  “మీరిద్దరూ కష్టపడి చేసుకున్నారు కదా, మీరే తనవి తీరా తినండి,” అని తప్పించేసింది.  శర్మగారి భార్య కూడా తరవాణీ చారుని వద్దనేశారు.
“దేనికైనా పెట్టి పుట్టాలండీ మాష్టారూ,” అన్నారు శర్మగారు ప్లేట్లో మిగిలిపోయిన చారుని జుర్రుతూ.
“అంతేకాదు లెండి.  అసలు ఆంధ్రా కల్చర్‌ రక్తంలో ఉండాలి,” అన్నాను మా ఆవిడను ఉడికించేందుకు.
కానీ ఆవిడ అదేం పట్టించుకోకుండా, “అన్నట్టు రావు గారిని పిలిచి చెప్తారా మీ చారు గురించి?  మరి మీరు సాకెతో దీన్ని తయారు చేశారంటే మీ cultural preservation  అంతా గోవిందానే కదా?” అని నవ్వింది.
శర్మగారు గంభీరంగా, “ఏంకాదు.  అసలైన cultural preservation  ఈ పధ్ధతిలోనే ఉంది,” అన్నారు.
“అదెలా?” అన్నాను నేను తెల్లబోయి.
“అవును మరి.  మనం కిందటి సారి చేసిన పొరబాటేమిటంటే, మన చిన్నప్పటి జ్ఞాపకాన్ని మళ్ళీ అనుభవించాలనుకోవడం.  జ్ఞాపకాలు కలలలాంటివి.  అవెప్పుడూ అక్షరాలా నిజం కావు.  నిజం చెయ్యాలని ప్రయత్నిస్తే మనకు మిగిలేది ఆశాభంగమే.  రెండవ పొరబాటు మనమింకా చిన్నపిల్లలం కామని గుర్తించకపోవటం.”
“అదేమిటి?” అన్నాన్నేను అర్ధం కాక.
“అంటే మన చిన్నప్పుడు చేసినట్టు ఇప్పుడు ఏ పనీ మనం చేయడం లేదు.  నా చిన్నప్పుడు పొద్దున్నే లేచి కచ్చికతో పళ్ళు తోముకుని, పెరట్లో కట్టెల పొయ్యి మీద కాగులో కాచిన వేన్నీళ్ళు గంగాళంలోకి తొలిచి స్నానం చేసేవాణ్ణి.  తర్వాత వంటింట్లో నేల మీద కూర్చుని కంచంలో చద్దన్నం పెట్టుకుని తినేవాణ్ణి ..” అంటుంటే మా ఆవిడ అడ్డొచ్చి అన్నది,
“మీరు పల్లెటూరిలో పెరిగారు కాబట్టి అవన్నీ చేశారు.  నేను చిన్నప్పుడు కూడా బ్రష్షూ, పేస్టుతోనే పళ్ళు తోముకునే దాన్ని.  గీజర్లోంచి వచ్చే వేణ్ణీళ్ళతోనే స్నానంచేసేదాన్ని …”
ఈసారి శర్మగారు అడ్డొచ్చి, “కానీ ఆ గీజర్నీళ్ళు మీరు బక్కెట్టులో పట్టుకుని స్నానం చేసేవారు కదా?” అనడిగారు.
“అయితే?” అంది మా ఆవిడ ముఖం చిట్లిస్తూ.
“అదే నేను చెప్పేది.  ఇప్పుడు మా అమ్మే గాస్‌ స్టవ్‌ మీద ప్రెషర్‌ కుక్కర్‌ లేకుండా వంట చెయ్యదు .  మీరు కూడా మనం భోంచేసిన తర్వాత ఈ గిన్నెలూ ప్లేట్లూ dishwasher  లేకుండా కడగరు.  నేను చెప్పేదేమిటంటే, దేశ కాల పరిస్థితులనిబట్టి ధర్మాలు మారతాయని మన వాళ్ళెప్పుడో చెప్పారు.  కానీ మనం మాత్రం పరిస్థితులు మారిన కొద్దీ ఇంకా ఆ పాత పధ్ధతులని పట్టుకు వేళ్ళాడాలనీ, పాత రోజులని నిలబెట్టాలనీ అనవసరంగా శ్రమపడతాం.  అందుకే ఆశాభంగాలు తప్పవు.  అది జరిగే పని కాదని ఎప్పుడైతే గ్రహించి మన పధ్ధతులని మార్చుకుంటామో అప్పుడు మనకు విజయం లభిస్తుంది.  ఇప్పుడు మనకేమయింది?  మనం గంజీ, కుండా, దబ్బాకులూ అని కొట్టుకున్నందుకు వచ్చిన ఫలితమేమిటి?  బూజు!  కానీ మన కోరికలోని అసలు సూక్ష్మాన్ని గుర్తించి, మనం ఉన్న చోట దొరికే వస్తువులతో దాన్ని చేయదల్చుకున్నప్పుడు సాధించాం,” అంటూ మళ్ళీ చారు కలుపుకున్నారు.

మా ఆవిడ పట్టు వదలదల్చుకోనట్టు, “మీరు గంజి బదులు సాకె వాడితే ఇంకా cultural preservation  ఏముందీ?  అదేదో చాకిరీ తప్పించుకునేందుకే,” అని తీర్మానించింది.
“నిజమే.  ఇది cultural preservation  కాదు.  cultural evolution!   కానీ ఏ కల్చర్‌కైనా జరిగేదిదే.  అవసరాన్నిబట్టి  మారని ఏ కల్చరైనా నశించిపోకతప్పదు,” అని శర్మగారు మూడోసారి చారు కలుపుకున్నారు.
“శభాష్‌” అన్నాన్నేను ఉత్సాహం పట్టలేక.  “బ్రహ్మాండంగా చెప్పారండీ, శర్మగారూ!  మీ దగ్గిర శిష్యుడిగా చేరి ఉపదేశం పొందాలనిపిస్తోంది. మీరిదంతా కిందటి వారమే ఎందుకు చెప్పలేదు?”
“ఏమో అప్పుడు తట్టలేదు.”
“ఆయన ఇప్పుడు జీవరసం బదులు సోమరసం తాగుతున్నారు కదా, అందుకని,” అంది మా ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుతూ.

హఠాత్తుగా ఇండియన్‌ కల్చర్‌ గురించి ఆవిడకి ఇంత పరిజ్ఞానం ఎలా వచ్చిందా అని నేను దిమ్మెరపోయి చూశాను.
“ఆఁ, నేననుకుంటునే ఉన్నాను, ఇది తలకెక్కకుండా ఉండదని.  ఇక చారు కలుపుకోకండి, మళ్ళీ చాలా దూరం డ్రైవ్‌ చెయ్యాలి,” అన్నారు శర్మగారి భార్య కంగారుగా.
“ఫరవాలేదులెండి, ఈ రాత్రికిక్కడే పడుకుని రేపు వెళ్ళచ్చు,” అన్నది మా ఆవిడ.
తన భార్య మాటలతో కొంచెం చిన్నబుచ్చుకున్న శర్మగారి మొహం మళ్ళీ వికసించింది.  “అయితే సరే.  కొంచెం చారుని కప్పులోపోసివ్వండి,” అనడిగారు ఉత్సాహంగా.

ఆయనకూ నాకూ కూడా కప్పుల్లో చారుపోసిచ్చాను.  ఇద్దరం ఎడంచేత్తో కప్పుల్నెత్తి, “ఛీర్స్‌” అంటూ ఆనందంగా తరవాణి చారుని తాగాం.
-----------------------------------------------------------
రచన: మాచిరాజు సావిత్రి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment