Monday, January 7, 2019

గౌతమి


గౌతమి
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...................

నేను పిచ్చిదాన్ని — ఔను, పిచ్చిదానిలా నటిస్తున్న పిచ్చిదాన్ని.

దాదాపు నెల రోజులనుండీ గుట్టపైనున్న జాలారి చెట్టు కింద కూర్చుని నాలో నేనే కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. గుట్టమీది రాళ్ళూ, పొదలూ, గుట్టకిందనుంచి మా హైస్కూలు బిల్డింగూ నన్ను జాలిగా చూస్తున్నాయి.

‘మరీ పిచ్చి ఎక్కువయినట్లుంది ధర్మయ్య కోడలికి!’ చెవులు కొరుక్కుంటున్నారు గుట్ట మీద నన్ను చూస్తూ పొలాలకి పోయేవాళ్ళు.

స్కూలు ముందు నుండి ఊళ్ళోకి వెళ్ళే రోడ్డుకి తారు పోస్తున్నారు. పిల్లల అరుపులు, కూలీల కేకలు, మిషన్ల మోత కలిసి గజిబిజిగా వుంది నా మనసులో ఉన్నట్లే. దాదాపు నెల నుండి ప్రతిరోజూ ఇలానే వచ్చి కూర్చుని ఏడుస్తున్నాను. కాకపోతే నిన్నటినుంచీ నేను ఏడుస్తున్నది నామీద నాకే అసహ్యం వేసి. ఉమా మేడమ్ నిన్న వచ్చి పలకరించి వెళ్ళిపోయినప్పట్నుంచీ నేను చేస్తున్నది సరైన పనేనా అనే ఆలోచనతో దిగులు కలుగుతోంది.

శీతాకాలం గాలి విసురుగా కొట్టింది నన్ను. జుట్టు గట్టిగా ముడేసుకుని దుప్పటిని భుజాల నిండుగా కప్పుకున్నాను. గుట్టనెక్కి వస్తున్న వేణు — నా భర్త -– నా మెడలో పసుపుతాడు కట్టిన పాపానికి రొప్పుతూ చేతిలో క్యారియరుతో వస్తున్నాడు. అతన్ని చూస్తే చాలు జుట్టు విరబోసుకుని చూపులను పిచ్చిగా మార్చుకునే నేను ఈరోజు మౌనంగా అతని వైపే చూస్తూ అలాగే నిటారుగా కూర్చున్నాను. హడావుడిగా వచ్చాడేమో ఇంత చలిగాలిలో కూడా అతని నుదుటి మీద చెమట బిందువులు.

జాలారి చెట్టు అతన్ని తన నీడలోకి లాక్కుంది. ఆగి నా వైపే చూసి నవ్వుతూ, క్యారియర్ని కింద పెట్టి పై కండువాతో చెమట తుడుచుకున్నాడు. అతనినే చూస్తున్న నా కళ్ళని గమనించిన అతనిలో విస్మయం. గబగబా నడుస్తూ నాకు దగ్గరగా వచ్చాడు. నేను నా చూపుని మరల్చుకుని జాలారి చెట్టుకి కొంచెం పక్కగా ఉన్న పలవరేణి చెట్టు కాయల వైపు చూశాను.

రెండు విడి విడి రెమ్మలనుండి పుట్టిన పలవరేణి కాయల చివర్లు ఒకటిగా కలిసిపోతున్నాయి. కలిసిపోయిన అవి పండుగా మారతాయి. కొన్ని మాత్రం తోడు లేక ఒంటిగా వేళ్ళాడుతూ ముదురు రంగులోకి మారిపోతాయి. ఆ ముదురు కాయలను చూస్తుంటే నాకు ఈయనే గుర్తుకొస్తున్నాడు.

క్యారియర్ విప్పి గిన్నెలో అన్నం కలిపి నా చేతికిచ్చాడు. రోజూ అన్నం తినడానికి ఏ మాత్రమూ ఆసక్తి చూపని నేను మౌనంగా గిన్నెనందుకున్నాను. అతని కళ్ళల్లో ఆనందం.

నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. తినకపోతే ఇక్కడ నుండి వెళ్ళడని తెలుసు కాబట్టి తలవంచుకుని గబగబా అన్నం తిని చెట్టు కింద పెట్టిన నీళ్ళ కడవలోంచి నీళ్లు తీసుకుని గిన్నె కడిగి నీళ్ళు తాగాను. గిన్నె క్యారియరు పక్కన పెట్థి దుప్పటిని కప్పుకుని ముడుక్కున్నట్లుగా పడుకున్నాను. నాకు జ్వరం వచ్చి అలా ఉన్నాననుకున్నాడేమో అతను నా నుదురుని తాకి చూశాడు.

“గౌతమీ! సాయంత్రం పెందరాడే ఇంటికి వెళదాం. ఈరోజు వరికోత గుట్టకింది చేలోనే – మూడు నాలుగు గంటలకంతా అయిపోతుంది త్వరగా వస్తా” అన్నాడు. అతనికి సమాధానంగా దుప్పటి తల మీదికి లాక్కున్నాను. అతను క్యారియర్ సర్దుకుని గుట్ట దిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే లేచి చెట్టు మొదలుకి ఆనుకుని మళ్ళీ ఆలోచనల్లో పడిపోయాను.

నిన్న 11 గంటల వేళ పిల్లలను తీసుకొని ఉమా మేడమ్ గుట్ట పైకి వచ్చారు. పిల్లలు నన్ను అక్కడ చూసి గుసగుసగా మాట్లాడుకుంటూ అవతల వైపుకి వెళ్ళారు. ఉమా మేడమ్‌కి నా గురించి పిల్లలు ఏం చెప్పారో మరి నా దగ్గరకి వచ్చి నా వైపు తదేకంగా చూశారు. అప్రయత్నంగా నా పెదవులు ‘ఉమా మేడమ్!’ అన్నాయి. నా కళ్ళల్లో కలవరాన్ని గమనించిన ఆమె నన్ను మరింత నిశితంగా చూస్తూ, “గౌతమీ! బావున్నావా? నన్ను గుర్తు పట్టావా తల్లీ!” అన్నారు.

కొమ్మల మధ్య నుండి సూర్యుడి కిరణాలు పడి మేడమ్ ముఖం మరింతగా వెలిగింది. ఆవిడ ఏమీ మారలేదు. అదే ప్రశాంతమైన ముఖం, అదే చల్లటి పలుకు, అవే శాంతంగా ఓదార్చే కళ్ళు. నాకు తెలియకుండానే తలవంచుకుని సిగ్గుగా తల ఊపాను. ఆమెతో ఎన్నో మాట్లాడాలనిపించింది కాని ఒక్కమాట కూడా బయటకు రాకుండా నా పెదవులను అదిమిపట్టుకుని వెనక్కి తిరిగి జాలారి చెట్టుకేసి ముఖాన్ని రుద్దుకున్నాను. నన్నిక పలకరించే ప్రయత్నం చేయకుండా పిల్లలున్న వైపుకి వెళ్ళిపోయారు. ఆ క్షణం నుంచీ, ఉమా మేడమ్ జ్ఞాపకాలు, నా స్కూలు, నా ప్రవర్తన, ఒద్దనుకున్నా జ్ఞాపకం వస్తున్నాయి. నేను చేస్తున్న పని సరైనది కాదనే పశ్చాత్తాపం నన్ను కాల్చివేస్తోంది…

1.
“ఈరోజు కొత్త సైన్స్ మేడమ్ వస్తున్నారు ఆమె పేరు ఉమా మేడమ్ – మంచిగా ఉండి ఆవిడతో త్వరత్వరగా పాఠాలు చెప్పించుకోండి,” అన్నారు ప్రార్థన అయ్యాక మా హెడ్మాష్టర్ సార్. పిల్లలందరం సంతోషపడిపోయాం. మూడు నెలల పరీక్షలు దగ్గర పడుతున్నా మాకింత వరకూ సైన్స్ టీచర్ లేక ఒక్క పాఠం అన్నా అవలేదు.

ఆ రోజు నాలుగో పీరియడ్‌లో మేడమ్ మా తరగతికి వచ్చారు. మొదటి రోజే మమ్మల్నందరినీ గుట్ట మీదకు తీసుకొచ్చి మొక్కల గురించి పాఠం చెప్పారు. గుట్ట మీద ఉన్న జాలారి చెట్టును చూపిస్తూ, “మీకు తెలుసా దీన్ని దేవతా వృక్షం అంటారని?” అని అడిగారు.

“తెలుసు మేడం. ఎవ్వరూ ఈ చెట్టుని కొట్టరు – కొట్టిన వాళ్ళకి ఏదో ఒక కీడు జరుగుతుందంట,” అన్నాను నేను. చదువు మీద అంత శ్రద్ధ లేదు కాని ఇలాంటి కబుర్లు చెప్పడం అంటే నాకు భలే ఇష్టం. ఇప్పటికే ఏడో తరగతి రెండేళ్ళు చదివాను.

నా మాటలకి నవ్వుతూ, “అది కొన్ని ఊళ్ళ వాళ్ళ నమ్మకం గౌతమీ! అలాంటి నమ్మకాలు లేని కొంతమంది ఈ చెక్కని ఇళ్ళకి వాడతారు,” అన్నారు మేడమ్. మమ్మల్ని దగ్గరకి తీసుకువెళ్ళి చెట్టు మొదలుని చేత్తో ఆప్యాయంగా తాకారు. “దేవతామూర్తుల బొమ్మలు దీని చెక్కతో చాలా అందంగా చెక్కవచ్చునట. పురాయుగంలో సాలభంజికలను జాలారి చెట్టు చెక్కతోనే చెక్కారని అంటారు. గౌతమ బుద్దుడిని మాయాదేవి ఈ చెట్టు కిందే ప్రసవించిందట. ఆయన మంచం చుట్టూ తన కొమ్మలను వ్యాపింపచేసుకుని నిత్యమూ ఆయనని చూసుకుంటూ ఉండేదట. బుద్దుడు ఎక్కడో ఖుషీనగర్లో చనిపోతే లుంబినీ నగరంలో ఉన్న ఆ చెట్టు కొమ్మలు తెల్లబడిపోయాయట.”

ఆ ఉదయం, ఆ చల్లని గాలిలో ఆమె మాటలు కలిసిపోయి నా చుట్టూ ఓ వింత సుగంధం వ్యాపించినట్లనిపించింది. అప్పుడప్పుడే శరీరంలో వస్తున్న మార్పులను కుతూహలంతో చూసుకుంటున్న నాకు మేడమ్ మాటలు ఎందుకో గగుర్పాటు కలిగించాయి. ఆ చెట్టు సాటి మనిషిలాగా అనిపించి దానిపై నాకు విపరీతమైన మమకారం కలిగింది. అది నన్ను ఎంతో ఆకర్షించింది. గరుగ్గా ఉన్న ఆ చెట్టు మొదలుని నా చేతులతో వాటేసుకుని కళ్ళు మూసుకున్నాను. నన్ను చూసి అందరూ పెద్దగా నవ్వారు. నేను సిగ్గుపడి మేడమ్ వైపు చూశాను. ఉమా మేడమ్‌కి నా గురించి ఏం స్ఫురించిందో మరి, నా కళ్ళలోకి చూస్తూ ఆప్యాయంగా నవ్వేశారు.

మేడమ్ అన్నట్లుగా ఇది నా పాలిటి దేవతా వృక్షమే. ఆ రోజు — మైకంతో ఒళ్ళు మరిచిన ఆ వేళ, నన్ను కాపాడింది ఈ చెట్టు కొమ్మ…

2.
ఉమా మేడమ్ ఒక సంవత్సరమే మా స్కూల్లో ఉన్నారు. ఆమె ఉన్న ఆ ఒక్క ఏడాదిలో మాకు ఎన్నో విషయాలు చెప్పారు. జీవితంలో ఒక మంచి దృక్పథం ఏర్పడాలంటే పుస్తకాలు చదవాలి అనేవారు. ఆమె ఇంట్లో ఎన్ని పుస్తకాలో – ఆమె ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళినా ఆ పుస్తకాలు వెంట ఉండాల్సిందేట. ఆ ఏడాదిలోనే వారి ఇంట్లో నేను ఎన్నో పుస్తకాలు చదివాను. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమని నా పుస్తకాల పిచ్చి చూసి ఆమె వాటి గురించి నాతోనే చెప్పుకుని సంతోషపడేవారు. ఆమె స్నేహితులు ఆ పుస్తకాల గురించి మాట్లాడిన స్మృతులను నా దగ్గర నెమరు వేసుకొనేవారు. ఏ పుస్తకం చదివినా ఏమనేవారు కారు కానీ ఒక్కసారనుకుంటాను, నా చేతిలో ఒక పుస్తకం చూసి, “ఆయన పుస్తకాలు చదివేంత పెద్దపిల్లవేనా?” అన్నారు చిన్నగా.

మేడమ్ పిల్లల దగ్గరకి అమెరికాకి వెళ్ళాలని సంవత్సరం పాటు లాంగ్ లీవు తీసుకొని వెళ్ళిపోయారు. ఆమె వెళుతుంటే నేను ఆమెని కావులించుకుని ఏడ్చాను.

ఆమె స్థానంలో వచ్చిన టీచర్ బాగా చిన్నవాడు, మేడమ్ కంటే. భలే అందంగా ఉండేవాడు. అతను నన్ను చూసి నవ్వినప్పుడల్లా నాకేదోలా అనిపించేది. స్కూలు నుండి పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయినా డౌట్స్ ఉన్నాయనే వంకతో అతని దగ్గరే కూర్చునేదాన్ని. అతని కోసం ఏదైనా చేయాలనిపించేది. పడుకుని అతని గురించి కలలు కనేదాన్ని. అతన్ని ప్రేమిస్తున్నానని నాకు తెలిసిపోయింది. హెడ్మాష్టర్ సార్‌కి మా మీద అనుమానం వచ్చిందేమో సాయంకాలమైతే చాలు నాకు కాపలా కాస్తూ ఇంటికి తరిమేసేవాడు. ఏదో అసంతృప్తితో ఇంటికి నడిచేదాన్ని.

ఆరోజు హెడ్మాష్టర్ రాలేదు.

“సాయంత్రం త్వరగా ఇంటికి పోయి స్నానం చేసి ట్యూషన్‌కి రా గౌతమీ! సరిగ్గా ఆరు గంటలకి వచ్చేసెయ్,” అన్నాడు అతను.

అమ్మకి చెప్పి చీకటి పడితే వద్దంటుందని ముందుగా బయలుదేరి ఏదో పనికి వచ్చినట్లు ఈ చేను, ఆ చేను తిరుగుతూ ఆరు గంటలకంతా స్కూలుకి వచ్చాను. నా కోసమే ఎదురుచూస్తున్న అతను నన్ను క్లాసురూములోకి రమ్మని గట్టిగా కౌగలించుకున్నాడు. అతను రాసుకున్న సెంట్ వాసన మత్తుగా నన్ను కమ్ముకుంది. అతనిని నేను అడ్డుపెట్టలేదు. నేనూ అతన్ని గట్టిగా అదుముకున్నాను. అతని చేతులు నామీద పాకుతుంటే పరవశంతో కళ్ళు మూసుకున్నాను.

ఒళ్ళు మరిచి అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటున్న ఆ సమయంలో ఒక జాలారి కొమ్మ ఫెళఫెళమంటూ విరిగి గుట్ట మీద నుండి స్కూలు వంటగది రేకు పైన పడి భయంకరమైన శబ్దం చేసింది. ఉలిక్కిపడి భయంతో అతని చేతులనుండి విడిపోయి బయటకి పరిగెత్తాను. తల ఎత్తి గుట్టవైపు చూశాను జాలారి చెట్టు దిక్కుగా. గుట్టనానుకున్న ఆకాశం ఎర్రగా ఉంది. నా ముఖం కూడా అలానే ఉందేమో. నా బుగ్గల్లోంచి వెచ్చగా ఆవిరులు వస్తూనే ఉన్నాయి. పొలాల్లో పనులు చేసుకుని ఇళ్ళకి వెళుతున్నవాళ్ళు, చీకటి పడుతున్నా ఇంకా ఇంటికి చేరని వాళ్ళు, ఆ శబ్దానికి స్కూల్లోకి పరిగెత్తినట్లుగా వచ్చారు. వాళ్ళల్లో నాన్న కూడా ఉన్నాడు. నన్ను చూసి కొట్టడానికొచ్చినట్లు నా భుజం పట్టుకున్నాడు. నా కాళ్ళు వణికిపోయాయి.

“ఏం చేస్తున్నావిక్కడ గౌతమీ?”

“తను ట్యూషనుకి వచ్చిందండీ,” నా నోటి వెంబడి మాట రాకముందే అతను అన్నాడు.

“పద ఇంటికి!” అన్నాడు నాన్న గదిమినట్లుగా. అతని మాటలు నమ్మలేదని నాన్న ముఖం చెప్తూనే ఉంది.

జాలారి కొమ్మను లాగేసి ఇంటికొచ్చిన నాన్న అమ్మ మీద అరుస్తున్నాడు. నేను గది లోనుండి బయటకు రాకుండా ముసుగుతన్ని పడుకున్నాను. మాష్టారినే తలుచుకుంటూ అతని ఊహల్లో తేలిపోతున్న నాకు అమ్మా నాన్నల అరుపుల గురించి పట్టలేదు. నా శరీరంపై అతని చేతులు ఇంకా పాకుతున్నట్టే ఉంది. నా ఒళ్ళంతా ఏదో కొత్త పులకరింత. అతను లేకుండా బతకలేనని నిశ్చయించుకున్నాను. మర్నాడు స్కూలుకి తయారవుతున్న నన్ను అమ్మ ఆపేసింది.

“ఇక నువ్వు స్కూలుకి వెళ్ళక్కర్లే! నిన్ను చూసుకోవడానికి పెళ్ళివారొస్తున్నారు. ధర్మయ్య గారబ్బాయి వేణు. కుదిరితే లగ్నాలు కూడా ఈ రోజే.”

“నాకు పదిహేడేళ్ళే కదా. నాకు పెళ్ళేంటి?” అన్నాను.

“పదిహేడేళ్ళ దానివి మరి ఏం చేద్దామని చీకటి పడ్డాక ఒంటరిగా స్కూలుకి వెళ్ళావే?” అంది అమ్మ ఆవేదనగా.

ఆరోజే మా ఊరి ధర్మయ్యగారబ్బాయి వేణుతో నాన్న నాకు పెళ్ళి కుదిర్చాడు. వేణు నాకు అంతకుముందే తెలుసు.

భోగి రోజు గంగిరేణు చెట్టు కొమ్మకి కట్టిన ఉయ్యాల ఊగుతున్నాను. వేణు చెల్లెలు శోభ నా వెనక నిలబడి గంగిరేణు కాయలు కింద రాలేట్టుగా పెద్ద పెద్ద ఊపులు ఊపుతోంది. కాలేజీలో చదువుతున్న వేణు శెలవలకి ఇంటికి వస్తున్నట్లుంది, సూట్‌కేస్ పట్టుకుని నిలబడి నన్ను రెప్పవాల్చకుండా అలాగే చూస్తున్నాడు. ఉయ్యాల ఊపుతున్న శోభ, ‘అన్నయ్యా!’ అనుకుంటూ అతని దగ్గరకి పరిగెత్తి అతని చేతుల్లోంచి సూట్‌కేస్ లాక్కుంది. నేను ఉయ్యాల దిగాను. నా ఒళ్ళో నుంచి జారిపడ్డ గుండ్రటి గంగిరేణు కాయలను ఏరుకుంటూ తల ఎత్తి నా వైపు చూశాడు చిలిపిగా. అతని కళ్ళల్లో వచ్చిన ఆ మెరుపు దేని తాలూకుదో నాకు తెలుసు. పుస్తకాలు చదివిన నాకు ఆమాత్రం తెలీదా. కాని నాకెమంత గొప్పగా అనిపించలేదు. మూతి ముడుచుకుని వాళ్ళతో ఒక్కమాట కూడా చెప్పకుండా వచ్చేశాను.

మాష్టారి కళ్ళల్లో ఉండే ఉద్రేకమే నాకు బాగుండేది. పాఠం చెప్తూ నా దగ్గరగా వచ్చి నిలబడటం, కావాలని నన్ను తాకడం మళ్ళీ మళ్ళీ కావాలనిపించేది. అతని మైకంలో ఉన్న నాకు, వేణు చూపుల్లో భావం నచ్చలేదు. ‘వాళ్ళు నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నప్పుడు కదా’ అని ధీమాగా ఉన్నాను కాని, ‘నేనంటే ఇష్టపడుతున్నాడు కదా, అది చాలేమో నాతో పెళ్ళికి ఒప్పుకోవడానికి,’ అని కూడా అనిపించింది.

అనుకున్నట్టే పది గంటల వేళ వాళ్ళు వచ్చి లగ్నాలు పెట్టుకున్నారు. పెళ్ళి పనులన్నీ హడావుడిగా జరిగిపోతున్నాయి. నన్ను ఇల్లు దాటనివ్వకుండా కట్టుదిట్టం చేశాడు నాన్న. జాలారి చెట్టుకి పూజ చేయించడానికి తీసికెళ్ళిన రోజు మాష్టారుని ఎలాగైనా కలిసి మాట్లాడాలనుకున్నాను. ‘మొన్న నా బిడ్డను చల్లగా చూశావు తల్లీ. ఈ పెళ్ళి కూడా ఏ ఆటంకమూ లేకుండా జరిపించు,’ అనుకుంటూ అమ్మ జాలారి చెట్టుకి మొక్కుకుంది.

ఆ మాటలు మనసులో అనుకోకుండా నేను వినాలనే పెద్దగా అంటున్నదని నాకు అర్థమయింది. ఆ రోజు స్కూలుకి వెళ్ళి మాష్టారుని కలవాలనే ప్రయత్నం మానుకున్నాను. మాష్టారు నన్ను ఎలాగైనా తీసికెళ్ళి పెళ్ళి చేసుకుంటాడు అనే నమ్మకం నాలో.

పెళ్ళి రోజు మాష్టారు ఇవ్వమన్నారంటూ మేఘన ఉత్తరం తెచ్చి ఇచ్చింది. ఏం రాశాడో చదవాలని ఆతృత కాని చదవడానికి అస్సలు వీలు కాలేదు. అమ్మ చూస్తుందన్న కంగారుతో దాన్ని జాకెట్టులో దోపుకున్నాను. పెళ్ళి మధ్యలో తలంబ్రాల బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళినపుడు చదివాను.

‘పెళ్ళి అయితేనేమిలే, నువ్వేమీ దిగులుపడకు. ఈ రోజు రాత్రికి పిచ్చిపట్టిన దానిలా నటించు. నువ్వు నా దానివన్న సంగతి మర్చిపోకు. నిన్ను జీవితాంతమూ ప్రేమించే – నీ …’

ఎప్పుడొచ్చిందో అమ్మ నా వెనక నుండి నా చేతిలోని చీటీ లాగేసుకుంది.

అతను చెప్పినట్లు నా పెళ్ళయిన రోజు నుండే పిచ్చిదానిలా నటిస్తున్నాను. అతనిని కలుసుకోవాలన్న నా ప్రయత్నాలు అమ్మ సాగనివ్వలేదు. ఎవరికీ తెలియకుండా మేఘన చేత మాత్రం అతనికి ఉత్తరాలు పంపించేదాన్ని. మేఘన మీద కూడా అమ్మకి అనుమానం వచ్చినట్లుంది తనని మా ఇంటికి తరచుగా రానిచ్చేది కాదు. పదవ తరగతి పరీక్షలు దగ్గరకొచ్చాయి. పరీక్షలు నేను రాయలేదు. పిచ్చి పట్టినట్లు నటిస్తున్నాను కదా! పరీక్షలయ్యాక మాస్టారు ట్రాన్స్‌ఫరయి వెళ్ళిపోయారని మేఘన చెప్పింది. ఆరోజు నిజంగానే పిచ్చిపట్లినట్లు ఏడ్చాను. అతను వెళ్ళడానికి కారణం అమ్మే అని నాకు అనుమానం వచ్చింది. అప్పటి నుండి అమ్మని చూస్తే పిచ్చి కోపంతో నిజంగానే పిచ్చి పట్టినట్లు అరిచేదాన్ని.

అతను నా కోసం వస్తాడు, నన్ను తీసికెళతాడనే నమ్మకం నన్ను వదలలేదు. పిచ్చిదానిలా నటించడం మాత్రం నాకు చాలా బాగా పట్టుబడింది.

3.
నన్ను కాపురానికి పంపించమని మా అత్తమామలు అడుగుతున్నారు. ‘ఇంకా చిన్నపిల్లేగా వస్తుందిలే,’ అని అమ్మ దాటేస్తోంది. నా పరిస్థితి నిజమే అనుకుంటున్న వేణు కూడా నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదు.

ఆరోజు, “అత్తా! గౌతమిని డాక్టరు దగ్గరకి తీసికెళదామా,” అంటున్న వేణు మాటలకి నాకు భయం వేసింది. డాక్టర్ దగ్గరకి వెళితే నాకేమీ పిచ్చి లేదని తెలుస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మొదటి సారిగా నాకు మాష్టారు మీద అనుమానం వచ్చింది. అతను నన్ను నిజంగా ప్రేమిస్తే పెళ్ళినే ఆపేసేవాడు. సరే, ఆపలేకపోయినా తను వెళ్ళేప్పుడు నన్ను ఎలాగైనా తీసుకెళ్ళేవాడు. అతనిక రాడేమో. ఇప్పుడు నేనేం చేయాలి? చచ్చిపోవాలా? ‘మీ అమ్మాయి పిచ్చిది’ అని ఈ వేణు నన్ను వదిలేస్తే బాగుండు. కానీ వదిలేసే వాడైతే డాక్టర్ దగ్గరకి తీసికెళతాడా? నాకు తల పగిలిపోయింది ఆలోచనలతో.

అమ్మ నా ఆందోళన కనిపెట్టిందో లేక ఈ డాక్టరు అనే పేరుతో పిచ్చి వదిలిపోయిందని అల్లుడి దగ్గర నాటకం వేయాలనుకుందో! నా దగ్గర కొచ్చి, “డాక్టరు గారి దగ్గరకి వెళ్ళి వచ్చాక ‘ఆ పిచ్చి’ వదిలించుకుని శుభ్రంగా కాపురం చేసుకో,” అంది.

“నాకు వేణు అంటే ఇష్టం లేదు. నాకిష్టం లేదంటే వినకుండా పెళ్ళి చేశారు. మాస్టార్ని ఊళ్ళో లేకుండా పంపారు. మీ మీద కక్షతోనే నేను ఇలా చేస్తున్నాను! పెళ్ళి అయితే చేయగలిగారు కాపురం చేయించగలరా నా చేత?” అని పెద్దగా అరిచాను. అమ్మ ఏడ్చుకుంటూ అవతలకి వెళ్ళిపోయింది.

డాక్టరు దగ్గరకి తీసికెళ్ళాడు వేణు నన్ను. ఏవో కొన్ని మాత్రలు ఇచ్చారు వాళ్ళు. నాకు తగ్గుతుందనే ఆశతో వేణు క్రమం తప్పకుండా మాత్రలు ఇవ్వనూ, టైముకి తినిపించనూ చేస్తుంటే నాకు సిగ్గుతో తల వాలిపోయేది. నిజం చెప్పేయాలనిపించేది. పాపం వేణు తప్పేమీ లేదు. అతనంటే నాకు కోపమూ లేదు. కానీ ఎందుకో గొంతు పెగల్లేదు. చెప్పేదామనుకున్నప్పుడల్లా గొంతుకలో ఏదో అడ్డం పడేది.

ఉన్నట్టుండి ఒక రోజు పొద్దున్నే అమ్మ నన్ను గదిలోకి లాక్కెళ్ళి పైట చెరుగులోంచి న్యూస్ పేపర్ తీసి నా ముఖాన కొట్టింది. “వీడి కోసమేనా నీ భర్త దగ్గర నువ్వు పిచ్చిదానిలా నటిస్తుంది?” అంది చీదరగా నన్ను చూస్తూ.

‘విద్యార్థినిపై అత్యాచారం చేసిన స్కూలు టీచర్‌కి యావజ్జీవ కారాగార శిక్ష!’ అన్న వార్త కింద అతని ఫొటో. చూడగానే తెలీనంత భయం వేసింది. ఫిట్స్ లాగా వచ్చి అమ్మ పైన స్పృహ తప్పి పడిపోయాను. తెలివి వచ్చాక పేపర్లో ఆ అమ్మాయి స్థానంలో నన్ను ఊహించుకుని ఆరోజంతా భయంతో వణికిపోతూనే ఉన్నాను.

తర్వాత రోజు పొద్దున గుట్ట కింద పొలానికి వెళుతున్నానని చెప్తున్న వేణు మాటలు వినగానే… మెరుపులా జాలారి చెట్టు — ఆ రోజు అతని నుండి కాపాడిన జాలారి చెట్టు — గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా ఆచెట్టే నాకు తోడు. ఆ చెట్టుని చూడాలి. పెళ్ళయ్యాక వేణుతో ఒక్కసారి కూడా బయటికి రాని నేను అతనితో పొలానికి బయలుదేరాను. ఆరోజు వేణు ముఖంలో ఎంత సంతోషమో! అప్పటినుంచీ ప్రతి రోజూ పొలానికని వచ్చి గుట్ట ఎక్కి జాలారి చెట్టు కింద సమయం గడుపుతున్న నన్నూ, నా ముఖంలోని ఆవేదనని చూసి అతని సంతోషం ఆవిరవుతోంది. ‘ఎన్నాళ్ళిలా’ అని నన్ను ప్రశ్నిస్తున్నట్లున్న అతని కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను.

ఇక్కడకొచ్చి కూర్చున్నప్పటి నుండీ నా బాధ మెల్లిగా తగ్గుతోంది. ఈ జాలారి చెట్టు గౌతముడిని సాకినట్లే నన్నూ సాకుతున్నట్టు అనిపిస్తోంది. నాకూ ఏదో అస్పష్టంగా చెప్తున్నట్లే ఉంది. నిన్న మేడమ్‌ని చూసినప్పటి నుండీ నేనేం చేయాలో నాకు అర్థం అవుతోంది కాని ఏదో తెలియని తెర అడ్డం పడుతోంది. వెక్కి వెక్కి ఏడుస్తూ మోకాళ్ళపైన తల దాచుకున్నాను.

సాయంత్రం నాలుగయిందేమో పిల్లలు గోలగా అరుచుకుంటూ ఇళ్ళకి వెళుతున్నారు. ఎండ తగ్గిపోయింది. గుట్ట రాళ్ళ పైన చెట్ల నీడలు వ్యాపించడంతో గుట్ట గోధుమరంగుతో మెరుస్తోంది. గుట్ట కింద మాటలు వినిపిస్తున్నాయి. లేచి చూశాను. ఉమా మేడమ్ – ప్రక్కన వేణు ఇద్దరూ నడుస్తూ నా దగ్గరకి వస్తున్నారు.

“ఈ గుట్ట చుట్టు పక్కలే స్థలం చూడు వేణూ! పిల్లల బాధ్యతలు తీరాయి. ఇక ఇక్కడే ఇల్లు కట్టుకుంటే…,” అని ఆగి చుట్టూ చూస్తూ “ఈ పరిసరాలు వదలలేకే మళ్ళీ ఈ స్కూలుకే పోస్టింగ్ వేయించుకున్నాను,” అన్నారు.

“చూస్తా మేడమ్! నాన్నతో కూడా మాట్లాడతా,” అన్నాడు వేణు.

“నేను గౌతమిని తీసుకుని వస్తాలే వేణూ! నువ్వెళ్ళు,” అన్నారు మేడమ్.

“సరే మేడమ్,” అంటూ నా వైపు చూసి నవ్వి, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

“కూర్చో గౌతమీ!” అంటూ ఉమా మేడమ్ నాకు దగ్గరగా వచ్చారు. తను కూర్చుంటూ “రాత్రి మీ అమ్మతో మాట్లాడాను,” అని అన్నారు. నేను అప్రయత్నంగా చెట్టు మొదలుకి ఆనుకుని కూర్చున్నాను.

“ఇది సినిమా కాదు నటించడానికి జీవితం!” ఈసారి ఆమె గొంతులో కాఠిన్యం.

దిగులు, భయం, అపరాధ భావనతో నా కళ్ళు నిండి కన్నీళ్ళు చెంపల మీదికి గబగబా దొర్లాయి. “అయ్యో! గౌతమీ ఏమిటిది?” అంటూ హడావుడిగా లేచి చేతిలో ఉన్న కర్చీఫ్‌తో నా కళ్ళు తుడుస్తూ “ఛ! ఏడుపెందుకు ఊరుకో – తప్పులు చేయడం గొప్ప కాదు. సరి చేసుకోవడం నేర్చుకోవాలి,” అన్నారు.

నేను మౌనంగా ఉన్నాను. ఆపుకున్నా ఆగకుండా నా కళ్లు కన్నీటితో నిండి పోతున్నాయి. గుట్ట మీదకి మేతకి తీసికెళ్ళిన ఆవులని ఇళ్ళకి తోలుకుని వస్తున్నట్లున్నారు. గిట్టల చప్పుడు, హెయ్! హెయ్! అనే అరుపులు విన్న మేడమ్ “ఇంటికి పోదాం దా గౌతమీ!” అన్నారు. కన్నీళ్ళని భుజం మీద ఉన్న దుప్పటితో గట్టిగా తుడుచుకుంటూ లేచాను.

గుట్ట దిగుతూ ఆగి వెనక్కి తిరిగిన ఉమా మేడమ్ జాలారి చెట్టుని చూస్తూ, “యశోధరనీ, బిడ్డనీ నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళే బుద్దుడిని ‘పెళ్ళి అనే బంధనం నీకొక్కడికే సంబంధించినది కాదు, బాధ్యతని వదిలి ఇలా వెళ్ళడం నీకు తగునా!?’ అని ఈ జాలారి చెట్టు అడిగే ఉంటుంది – కదా గౌతమీ?” అని అడిగారు.

ఆమె గొంతులో ఆవేదన, కాదు కాదు, యుగాలుగా ఓ స్త్రీ బాధని చూసి మరో స్త్రీకి కలిగే ఆక్రోశం — అది ప్రకంపనలుగా నా హృదయాన్ని తాకింది. ఇంతవరకూ నన్ను కప్పి ఉంచిన ఏదో తెర ఒక్కసారిగా కళ్ళ ముందు నుంచి సర్రున తొలగినట్లయింది.

నా కర్తవ్యాన్ని చెప్పకనే చెప్తున్న మేడమ్‌కి దగ్గరగా వెళ్ళి ఆలంబన కోసం అన్నట్లుగానో మరి కృతజ్ఞతాపూర్వకంగానో ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాను.
-----------------------------------------------------------
రచన: రాధ మండువ, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment