Thursday, January 10, 2019

ఒక తల్లి గొడవ


ఒక తల్లి గొడవ
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...................

పెళ్ళికి ముందు రోజు:
ఛ ఛ ఛ ఏం దేశవిదీ, ఏం బతుకులివీ, ఇంతింత సంపాయించీ ఏం ప్రయోజనమో కడుపు నిండా తిండన్నా తినకుండా. నాకేవీఁ అర్థం కావటల్లేదు వీళ్ళ పద్ధతులూ, వీళ్ళ జీవితమూనూ. అయ్యొయ్యో ఎవరీ గ్లాసుల్ని ఇక్కడ పడేసింది? అంటు కాదూ, ఎంగిలి చేసి తాగిన గ్లాసుల్ని ఇలా ఉడుకుతున్న రైస్‌ కుక్కరు పక్కనే పెట్టుకుంటారా ఎవరన్నా? తీసి వాటిని సింకులో పడెయ్యండి. హవ్వ, అవ్వ.. నొక్కుకుని నొక్కుకుని నా బుగ్గలు సొట్టలు పడిపోవాల్సిందే. అరుచుకుని అరుచుకుని నా గొంతు రాచుకు పోవాల్సిందే. ఈ దేశం వొచ్చి ఈయనక్కూడా మతి పోతోంది గామాలు. అంతేలే, ఇక్కడికొచ్చాక ఒక ఇడ్లీ ముక్క లేదు, ఒక దోసె ముక్క లేదు, పొద్దున్న లేచి చొప్పదంటు నవిల్నట్టు ఆ సీరియల్‌ పలహారం. మొదలెట్టారుగా ఆయన గూడా. ఆ పిల్లల్తో సమానంగా. ఇహను వాళ్ళ అలవాట్లు కూడా మొదలు పెడతారు గామాలు. ఆ పెద్ద దానికి చూశారా, వొదినా, ఏది తిన్నా పడదు. పొద్దున్నో రెండు బ్రెడ్డు ముక్కలు. మధ్యాన్నం ఇంకో రెండు బ్రెడ్డు ముక్కలు. పోనీ రాత్రన్నా ఏమన్నా స్థిమితంగా ఇంత వొండుకు తింటారా అంటే. ఎందుకమ్మా వీళ్ళ ఉరుకులూ పరుగులూ, నాకు తెలీ కడుగుతాను!. ఇంత సంపాదన ఉండీ.

ఖర్మ గాక పోతే ఈ చిన్నదానికి ఈ తెల్లపిల్లాడితో పెళ్ళేవిటి చెప్పండి. పిల్లాడేవిటి, నా బొంద, వాడికి ఇంచుమించు నలభయ్యేళ్ళుట! ఏవిటీ, ముప్ఫయ్యారేనా? ముప్ఫయ్యారుకీ నలభైకీ ఎంత తేడా ఏవిటి? ఇంత మహా దేశంలోనూ ఇన్నాళ్ళూ ఘోటక బ్రహ్మచారిలా అఘోరిస్తూ నా చంటితల్లే కళ్ళబడాలా వీడికి లవ్వాడేందుకు? లవ్వు లవ్వు!

చూశారా వొదినా. పెద్దదానికి పెళ్ళై ఐదేళ్ళయింది. దాని కడుపునఒక మనవడో, మనవరాలో, ఒక్ఖ నలుసంటూ పుడితే చూసుకుని ఆనందిద్దామని. ఎంత చెడ్డా తల్లిని గదా. నా మనసుకి ఉండదూ. అల్లుడి తమ్ముడు. ఆ అబ్బాయికి రెండేళ్ళ క్రితమే పెళ్ళయింది. అప్పుడే పండంటి బాబునెత్తుకుంది దీని తోటికోడలు! ఏవైనా ఇండియాలో ఉన్న వాళ్ళ పనే సుఖంగా ఉంది. మొన్ననే ఆరో నెల వెళ్ళాక అన్నప్రాశన చేస్తే వెళ్ళొచ్చాం. పనస పండల్లే ఉన్నాడు బుజ్జి ముండ. చేతులకి బంగారు మురుగులూ, కాళ్ళకి వెండి గజ్జెలూ చేయించారు అమ్మాయి పుట్టింటారు. దేనికన్నా. రాసుండాలి. దీనత్తగారే నయం, కనీసం రెండో కొడుక్కన్నా మనవణ్ణెత్తుకుంది సంబరపడుతూ. ఆ, ఏం సంబరమో ఏవిటో. ఆవిడకి మాత్రం లేదంటారూ, పెళ్ళై ఐదేళ్ళయినా ఇంకా పెద్ద కోడలు నెల తప్పలేదని. మా పెంకి ఘటాన్ని వాళ్ళబ్బాయికి చేసుకున్నందుకు ఆవిడ ప్రాణం ఉసూరు మంటూనే ఉంటుంది. నే చెబుతున్నాగా, చూశారూ. మొన్నటికి మొన్న చూడరాదూ, దీని రెండో మరిది పెళ్ళికని ఇండియా వొచ్చారూ. ఇంటికి పెద్ద కోడలు గదా, ఎంత గుంభనగా, హుందాగా ఉండాలీ! అమెరికా దొరసానల్లే చేతుల్లేని చొక్కానూ, పొట్టి లాగూ ఒకటి తొడుక్కుని మొగాళ్ళతో సమానంగా కూర్చుని ఖబుర్లాడుతోంది. వాళ్ళ మావగారున్నారనైనా జంకుంటేనా? పాపం ఆ అత్తగారు ఎంత గుంజాటన పడిందో! ఆవిడ మాత్రం ఏం చేస్తుందేం, ఏవన్నా ఇది ఆవిడ ఎంచుకున్న కోడ లైతేగా? కొడుకు ఏరికోరి చేసుకున్నాడాయె.

అక్కడికీ నా మనసు పీకుతూనే ఉంది, పెద్ద ఇల్లాలు ఆవిడ నోరు తెరిచి ఏవీఁ అనక పోయినా తల్లిని నాకా మాత్రం కూతురి బాధ్యత తెలీదూ. దీనికి నచ్చ చెప్పబోతే ఇంత పెద్ద నోరు చేసుకుని నా మీద విరగబడి పోయింది. నేను అల్లుణ్ణి మీరూ గారూ అని పిలుస్తానుటా, తనని తన అత్తగారు నువ్వు అని ఎందుకు పిలిస్తుందీ. మీరూ అని ఎందుకు పిలవదూ అని వితండ వాదం. పిదప కాలం, పిదప బుధ్ధులూ కాకపోతే. ఎక్కడన్నా విన్నామా కన్నామా, అత్తగారు కోడల్ని “మీరు” అని పిలవాల్ట. దీన్ననేం లాభం లెండి, అన్నీ బామ్మ గారి పోలికలు పుణికి పుచ్చుకుంది. ఆవిడ బతికున్నన్నాళ్ళూ నన్ను సాధించింది చాలక, ఇప్పుడు చచ్చాక ఇదుగో దీని రూపంలో. అంతా నా ఖర్మ.

ఖర్మ గాక పోతే ఈ చిన్నదానికి ఈ తెల్లపిల్లాడితో పెళ్ళేవిటి చెప్పండి. పిల్లాడేవిటి, నా బొంద, వాడికి ఇంచుమించు నలభయ్యేళ్ళుట! ఏవిటీ, ముప్ఫయ్యారేనా? ముప్ఫయ్యారుకీ నలభైకీ ఎంత తేడా ఏవిటి? ఇంత మహా దేశంలోనూ ఇన్నాళ్ళూ ఘోటక బ్రహ్మచారిలా అఘోరిస్తూ నా చంటితల్లే కళ్ళబడాలా వీడికి లవ్వాడేందుకు? లవ్వు లవ్వు! దీనికింకా ఇరవయ్యయిదైనా వెళ్ళలేదు. చిట్టి తల్లి. ఏవిటే గొణుగుతున్ణావ్‌ దానికి ఇరవయ్యెనిమిది నిండాయా? మరీ చెప్పొచ్చావ్‌ నా కూతురి వయసెంతో నాకే తెలీదంటావ్‌. చూశారా వొదినా దాని టొకాయింపు? పోయి పోయి ఆ ముసలాణ్ణి. ఏం చెయ్యను చెప్పండి. ఛ, ఛ. నా ఖర్మ. అంతా నా ఖర్మ. కాక పోతే. రెండేళ్ళ క్రితం, చిన్నది ఇంకా ఈ వెధవ దేశానికి రాకముందు. చక్కటి సమ్మంధం వొచ్చింది. రాజా లాంటి సమ్మంధం. అబ్బాయి ఎమ్మెస్‌ చేసి అక్కడే సర్జన్‌ ప్రాక్టీసు చేస్తున్నాడు. రెండు చేతులా సంపాదన. అబ్బాయి అమ్మా నాన్నా కూడా ఎంతో మర్యాదస్తులు. మన వాళ్ళే. వాళ్ళు దీన్ని ఎవరో ఫ్రెండు పెళ్ళిలో చూసి, నచ్చి, పిల్ల నడగటాని కొచ్చారు. ఎందుకు నచ్చదూ నా బంగారు కొండ. మహారాజులే లైనుకట్టి నించోరూ. వీళ్ళైనా పూర్వకాలపు జమీందారీ వంశంట. ఎంత మర్యాద వాళ్ళకి. మన వాళ్ళ గౌరవ మర్యాదలు ఈ మ్లేఛ్ఛపు భడవాల కెక్కణ్ణిం చొస్తాయీ. ఎన్ని జెన్మ లెత్తితే వొస్తాయీ? చాలా తప్పు చేశా నొదినా. ఘోరమైన తప్పు. చిన్నపిల్ల, ఇంకా హౌస్‌సర్జనన్నా పూర్తి కాలేదే, ఇప్పుడే పెళ్ళెందుకులే అనుకునీ. అక్కడికీ ఆయన యిష్టంగానే ఉన్నారు, నేనే వొద్దన్నా. ఆ తప్పుకి. ఇదుగో ఇప్పు డనుభవిస్తున్నా. నాదేముందీ, నా బంగారు తల్లి జీవితమే. ఈ లుబ్ధావధాన్లు గాణ్ణి కట్టుకుని. తల్లి కడుపుకోత. ఎంత సమాధాన పెట్టుకున్నా. అదే కావాలని కోరి చేసుకుంటోందని నచ్చ చెప్పుకో చూసినా. కన్నపేగు బాధ చూశారూ. వాడు ఏ మత్తు చల్లి. ఏ మాయ చేసి దీన్ని బుట్టలో వేశాడో. అతన్ననేం లాభం లేండి, అసలిదంతా మా జెష్టాదేవి చేసింది కాదూ. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మన బంగారం మంచిదైతే కంసాల్ని తిట్టడమెందుకూ. హయ్యో మీకింకా తెలీదూ, ఈ తెల్ల దొరగారు మా పెద్దదాని ఫ్రెండు. మా గొప్ప ఫ్రెండు దొరికాడు.

చిన్న దెప్పుడూ బుధ్ధిమంతు రాలే. మొన్న మొన్నటి వరకూ నా కొంగు పట్టుకు తిరిగిన పిల్ల కాదూ. మెడికల్‌ కాలేజీ చదువైనా ఎంత అణుకువగా వుండే దనుకున్నారూ. ఈ కాలప్పిల్లల్లాగా ఇల్ల్లొదిలి రోడ్లంట తిరగటం. మొగ పిల్లల్తో బుజాలు రాసుకుంటూ తిరగటం. ఇవేవీఁ ఎరగదు పాపం. ఇదుగో ఇక్కడి కొచ్చిందీ. ఈ పెద్దదాని నిర్వాకం. దీన్ని పూర్తిగా పాడు చేసి వొదిలిపెట్టింది. ఎంత పెద్ద జడ ఉండేది దానికి!. వొత్తుకి వొత్తూ, పొడుక్కి పొడుగూనూ, నడుముదాకా వుండేది. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందనీ. ఈ పెద్దది దీనికీ పురెక్కించి. క్రాపింగు చేయించి వొదిలిపెట్టింది. చూశారుగా ఆ వాలకం. ఇవ్వాళ్ళ చూడండి, పెళ్ళి గదా! పూల జడ సంగతి దేవుడెరుగు, కనీసం ఒక పూలచెండు పెట్టుకో డానిక్కూడా లేదే జుట్టు! సవరం పెట్టి జడ వేద్దామన్నా కూడా అందకుండా. ఆ క్రాపింగు చందం. బెత్తెడే బెత్తెడు జుట్టు. ఎట్లా చావను వీళ్ళతో. నేనేవన్నా అంటే. ఆ చిన్నదంటుందీ, నీకు నా పెళ్ళి ముఖ్యమా, పూలజడ ముఖ్యమా అని!. చోద్యం కాకపొతే, దానికీ దీనికీ లంకేవిటి. దేని ముచ్చట దానిది కాదూ. అక్కగారు బాగానే నేర్పించింది పాఠాలు. జుట్లు కత్తిరించు కోడం, పొట్టి లాగూలూ చొక్కాలూ వేసుకుని మొగరాయళ్ళా తిరగడం, పెద్ద వాళ్ళ మాట వినకుండా వుండటం ముఖ్యం వాళ్ళకి. అయినా చూస్తూ వూరుకుండలేం గదా. ఇదుగో పెద్దమ్మాయీ, చాలా పొద్దు పోయింది. ఇహ ఆ పకపకలు చాలించి పడుకోండి. పొద్దున్నే మళ్ళీ బోలెడు పన్లు. మీరూ పడుకోండి వొదినా, చాలా దూరం నించి అలిసిపోయి వచ్చారు. పడుకోండి.

పెళ్ళి రోజున :
అక్కడికి తీసుకెళ్ళే సామానులన్నీ. ఇదుగో ఈ బాక్సులో పెట్టండి. తమల పాకులేవీ? ఇంత దేశంలోనూ ఒక్ఖ మామిడి చెట్టుకనబడదు, పెళ్ళింటికి ఒక తోరణం కట్టుకుందామంటే. పూర్ణ కుంభంలోనూ తమల పాకులు పెట్టుకోవాల్సిందేగా కొబ్బరికాయ కింద. ఈ తమలపాకులు మాత్రం? అల్లుడు వారం రోజులు ముందే కొనుక్కొచ్చి ఫ్రిజ్లో దాచిపెట్టాడు. ఏవిటో ఈ పెళ్ళి. ఇలా బోసిగా. అదే మన వూళ్ళో ఐతే ఎంత వైభవంగా జరి గుండేది! నాదేమీ లేదు. అంతా. ఆ పెద్దదాని పెత్తనం. ఆ పైన ఆ ఏడుకొండల వాడి దయ. ఇహ వాళ్ళ చేతుల్లో పడ్డాం. నేనెంత వెష్టపడీ ఏం లాభం. ఆ కొబ్బరి కాయలు చూడండి వొదినా. ఒక పీచూ పిలకా లేకుండా. ఈ బోడి కాయల్నా పెట్టుకునేది పూర్ణ కుంభంలో? ఇలా కాని దేశంలో. ఛ ఛ. ఈ ఛండాలం. ఇదిలా సాగాల్సిందే గదా. ఏదీ అన్ని సామాన్లూ చేరాయా? కర్పూరం, వొత్తులూ, నూనే, ఊదొత్తులూ. వెంకటేశ్వరస్వామి పటమేదర్రా? హయ్యో హయ్యో ఇంతా జేసి స్వామి పటాన్ని మర్చి పోయారా? అసలు దైవభక్తంటూ ఏడిస్తేగా. రాక్షస జన్మం! మీకు తెలుసో లేదో వొదినా. మేవొచ్చి రెండు వారాలైందా . ఈ రాక్షసి యింటో యిలాంటివేవీఁ ఉండవని అనుమానించే. నేనే వెంట తెచ్చుకున్నా, స్వామి పటాలూ, మూర్తులూనూ. ఇంత పేద్ధ ఇల్లు కొన్నారు గదా, ఒక్ఖ గోడ మీదనన్నా. ఒక్ఖ దేవుడి బొమ్మన్నా పెట్టుకుందేమో చూడండి. పోన్లే అని నేను తెచ్చిన పటాలు ఇలా లివింగ్‌ రూములో ఒక చిన్న మందిరంగా పెట్టుకుంటే. ఠాట్‌ వీల్లేదంటుందీ పెద్దది. పైగా కావాలంటే మా బెడ్రూములో పెట్టుకొమ్మని ఉచిత సలహా ఒకటి. హవ్వ. అపచారం కాదూ, బెడ్రూములోనా దేవుణ్ణి పెట్టుకునేది? మన ఆచారాలు. సంప్రదాయాలూ. ఛ ఛ. అంతా అప్రాచ్యపు బుద్ధులూ, అప్రాచ్యపు పన్లూనూ. ఏవర్రా మీరంతా తెవిలేదుందా లేదా. ముహూర్తానికి వేళవుతోంది. శాస్తుల్లు గారు వచ్చేశారేమో. హయ్యో రామ,మీరేవిటీ ఆ ధోవతీ వాలకం? ఎడమనించి ఆ కట్టేవిటీ? మన పద్ధతిలో లక్షణంగా కుడి వేపునించి. ఆ ఆ, ఇప్పుడు విప్పకండి. సడే, అసలు ధోవతంటూ కట్టుకున్నారు, అందుకే సంతోషించాలి గామాలు. అల్లుణ్ణి చూస్తే అదీ లేదు. ఈ ఆడపిల్లలన్నా చీరలు కట్టుకుంటారో. ఏదీ, వాళ్ళు మేడ దిగి రానిదే. ఆ చింపిరి జుట్లకి ఇంతోటి ముస్తాబులు. పెళ్ళయిం తరవాత డాన్సు పార్టీట, విన్నారా వొదినా? ఎక్కడన్నా వున్నాయా మన్లో. ఇలాంటివి!

ఎంత పెద్ద జడ ఉండేది దానికి! వొత్తుకి వొత్తూ, పొడుక్కి పొడుగూనూ, నడుముదాకా వుండేది. ఇవ్వాళ్ళ చూడండి, పెళ్ళి గదా! పూల జడ సంగతి దేవుడెరుగు, కనీసం ఒక పూలచెండు పెట్టుకో డానిక్కూడా లేదే జుట్టు! సవరం పెట్టి జడ వేద్దామన్నా కూడా అందకుండా. ఆ క్రాపింగు చందం. బెత్తెడే బెత్తెడు జుట్టు.

ఏవిటి, ఇక్కడా పెళ్ళి? చుట్టూతా ఆ భోజనాల టేబుళ్ళూనూ, మధ్యలో ఈ కాస్త జాగాలోనా పెళ్ళి తంతు? హు, బాగానే వుంది. సరే ఏం చేస్తాం. అంతా వాళ్ళ నిర్వాకమాయె. ఇంకా నయం కుర్చీల్లోనే కూర్చోబెట్టి చేస్తా నన్లేదు. ఒక పీట లేదు, పాడు లేదు. ఇదుగో ఆ జమ్పకానా పరుచుకునీ. అబ్బాయ్‌ ఆ చివర కాస్త సాయం పట్టు నాయనా ఆయనకి.. అలాగే ఆ కలకండ, కిసుమిస్సు, పళ్ళూ, అవన్నీ ఆ పళ్ళాల్లో సర్ది పెట్టు. హయ్యో పెళ్ళి వారొచ్చేశారే. ఆ అబ్బాయే పెళ్ళి కొడుకు. చూడండి వాడి సూటూ బూటూను. అలాగే పీటల మీద కూచుంటాడు గామాలు. ఖర్మ! ఏవిటబ్బాయ్‌ నీ ఇకిలింపు, పీటలే లేవంటావా. అదీ నిజమే. రేపు మా వూరు తిరిగెళ్ళాక పిల్ల పెళ్ళి చేశార్టగా, ఎలా జరిగిందీ అని అడిగే వాళ్ళకి ఏం చెప్పుకోను? కనీసం పీటలు గూడా లేకుండా ఉత్తి జంపకానా మీద కూర్చుని పెళ్ళి చేశాం అని చెబితే. నలుగురూ నవ్వరూ. అన్నట్టూ, వధూ వరులు మార్చుకోవాల్సిన మాలలేవీ? ఇవా? హయ్యో రామ, ఇంత చిన్నగా కడితే ఇది స్వామి పటానికి వేద్దా మనుకుంటున్నా. ఇంత చిన్నవా వరమాలలు? ఏవిటీ, వీటికే ఒక్కొక్కటీ పదిహేను డాలర్లా? రామ రామ! అదే మనూళ్ళో. ఎంచక్ఖటి పెద్ద పేద్ధ గులాబీ మాలలు వేసి. రాత. రాసుండాలి దేనికైనా. నా చిట్టి తల్లికి ఇలాంటి అప్రాచ్యపు పెళ్ళి. అమెరికా పెళ్ళి రాసి పెట్టుంది. వొదినా కొంచెం ఆ దీపారాధన వెలిగించండీ. ఒక వొత్తి స్వామి ముఖంగానూ. ఇంకో వొత్తి ఇలా మేము కూర్చునే చోటికి ఎదురుగుండానూ. అలాగే పసుపూ కుంకుమా. అయ్యొయ్యో పసుపేదర్రా? పొట్లం కట్టి పెట్టానే? హయ్యో రామా. ఏవిటబ్బాయ్‌. కిచెన్లోనించి తెస్తానంటావా? ఆ కిచెన్లో ఎవరెవరి చేతుల్లో పడిందో ఆ పసుపు. మంగళ కరమైన వస్తువు కాబట్టి పరవా లేదంటారా వొదినా? అంతేలే, ఎడ్జస్టు ఎడ్జస్టు అంతా ఎడ్జస్టే.

ఇదుగో శాస్తుల్లుగారూ. ఈ పిల్లలు ఏదో క్లుప్తంగా జరిపించెయ్యమని చెప్పార్ట, మీతో. అదేం పట్టించుకోకుండా, నా మాట చెవిన బెట్టి. ఏదీ, చక్కగా జరగాల్సిన వన్నీ ఏదీ వొదిలి పెట్టకుండా జరిపించండి. ఆ, గెస్టులొస్తే. వాళ్ళే కూర్చుంటారు. వొచ్చిన వాళ్ళు భోంచెయ్యకుండా వెళ్ళరుగా. మీరు మాత్రం ఏం లఘువు చెయ్యకుండా. మంత్రాలు బాఘా ధాటిగా చదవండి. ఇదుగో అబ్బాయ్‌ ఆ పెళ్ళి కొడుకుని వచ్చి కూర్చోమనూ. ఈ సూటేవిటో ఖర్మ. అది టాక్సీడోనా? టక్సీడో ఐతేనేం, బొక్సీడో ఐతేనేం, బాబూ, కనీసం ఆ కోటన్నా తీసెయ్య మనబ్బాయ్‌ అతన్నీ. ఏవిటీ, తియ్యనంటాడా. అసల్నువ్వు అతనికి చెప్పావా లేదా? నేన్చెప్పానని చెప్పు. చెప్పవూ. నా ఖర్మకి దొరికా రందరూనూ. ఏవండోయ్‌ శాస్తుల్లు గారూ. విఘ్నేశ్వర పూజయ్యాక వెంకటేశ్వర స్వామివారు. మా కులదైవం. స్వామి వారి స్తోత్రం కూడా చదివేసెయ్యండి. హబ్బో, ఈ తెల్ల పెళ్ళికొడుకు శాస్తుల్లు గారి వెనకాలే మంత్రాలు బాగానే చిలకపలుకులు వల్లిస్తున్నాడే. ఆ ఇదీ ఓ గొప్పేనా. ఆ మాత్రం శ్రమ పడద్దూ, నా బంగారుని ఎగరేసుకు పోతున్నాడుగా. చూశారా వొదినా. నే చెప్పలే. ఇలా వెనకాల్నించి చూస్తే. బట్ట తల అవుతున్నట్లు కనపట్టల్లేదూ. నలభయ్యేళ్ళ పెళ్ళి కొడుకు. పాతికేళ్ళ పిల్లకు, ప్చ్‌! నా ఖర్మ. అదుగో ఆ లావాటి ఆవిడ. ముందు కుర్చీలో కూర్చుందే గౌనేసుకుని. ఆవిడేట వాళ్ళమ్మ. పండుకోతిలా ఎలా ఇకిలిస్తోందో చూడండి. పోయి పోయి వీళ్ళ కొంపలో పడుతోంది నా చిన్నారి. ఏవి రాసి పెట్టుందో దానికి. ఏడుకొండల వాడా. వెంకటేశ్వర స్వామీ. నువ్వే దిక్కు నాయనా.

ఐతేనూ, అబ్బాయీ, ఆ సర్వరేవిటీ, అందరికీ గ్లాసుల్లో పోసి ఇస్తున్నాడూ, అదేం తాగుడు పదార్థం కాదు గదా! ఏమో వచ్చిన వాళ్ళు సగం మంది తెల్లదొరలూ దొరసానులూ. ఇక్కడే సప్లయి మొదలు పెట్టారేమోననీ. తెల్ల వాళ్ళనే ఏముందిలే. మా అల్లుడే పెట్టుకున్నాడు ఇంట్లో సీసాలు దొంతర్లుగా. మొన్న మేం దిగంగానే ఈయనకీ ఆఫర్‌ చేశాడు. నేనొక్ఖ చూపు చూశా దాంతో ఈయన. సర్లే ఒక మొగా లేదు, ఆడ లేదు పెద్దంతరం లేదు చిన్నంతరం లేదు. అన్నీ అప్రాచ్యపు పన్లే గదా. ఇంతకీ వాళ్ళు సర్వ్‌ చేస్తున్నది ఏపిల్‌ జ్యూసే నంటావా? నన్నే తాగి చూడమంటావా? ఇంకా నయం, మంచి వాడివే. ఆ మహరాష్ట్రుల పిల్లని చూశారా వొదినా. చిన్న పాపని ఎత్తుకు నుందీ. ఎంచక్ఖా చీర కట్టుకుని. ఐదేళ్ళ క్రితమేట పెళ్ళయింది ఆ అమ్మాయికీనూ, సరిగ్గా మా పెద్దదాని లాగే, ముత్యాల్లాంటి పిల్ల లిద్దరూ, దేనికన్నా పెట్టి పుట్టాలి. ఆ పిల్లా డాక్టరుట ఐనా ఎంత అణకువగా వుందో. ఆడపిల్లకి అణకువే కదుటమ్మా అందం. ఆ మాట మా జెష్టమ్మకి చెప్పి చూడండి. విరుచుకు పడిపోతుంది.ఏ మాట కామాట. చిన్నది బుద్ధిమంతురాలే. ఇక్కడి కొచ్చాకే. అదుగో సూత్రధారణం వొచ్చేసిందీ అప్పుడే. అబ్బాయ్‌ ఆ టేప్‌ రికార్డర్లో సన్నాయి మేళం కాస్త ఎక్కువ చెయ్యీ. ఆహా స్వామీ. ఆ మూడు ముళ్ళూ వేయించేశావా అయ్యా, తండ్రీ, నీ లీలే అంతా. సర్వాంతర్యామివి. నా బుజ్జితల్లి నెలా చూసుకుంటావో నీదే భారం!
----------------------------------------------------------
రచన: ఎస్‌. నారాయణస్వామి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment