Friday, January 18, 2019

కృషితో దుర్భిక్షం


కృషితో దుర్భిక్షం





సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..............

హైదరాబాద్ వచ్చిన నెల రోజుల తరువాత తోట పని చేద్దామని నిర్ణయించుకున్నాను. వ్యాయామం చేసినట్టూ ఉంటుంది, కూరగాయలు పండిస్తే, మనం తినగా మిగిలినవి పక్కవాళ్ళకి, పక్క వీధిలోనూ అమ్మి డబ్బు కూడా సంపాదించవచ్చు, వేణ్ణీళ్ళకి చన్నీళ్ళు తోడు, వచ్చే పెన్షనికి వ్యాపారం తోడు,అని ఉత్సాహపడ్డాను. కూరగాయల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొన్ననే ఉల్లిపాయలు వంద రూపాయలు పెట్టి ఒకటే కేజీ కొన్నాను కాబట్టి బోల్డు లాభాలు వచ్చేస్తాయని ముందే ఆనందపడ్డాను.

ఏం కూరగాయలు పెంచాలి అని విస్తృతంగా అభిప్రాయ సేకరణ చేశాను. మా పక్కింటాయన, వెనకింటాయన పెదవి విరిచేశారు. పైగా ఈ నేలలో ఏమీ పండవు అంటూ నన్ను నిరుత్సాహపరిచారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. ఎదురింట్లో ధనియా, మెంతికూర బాగానే పండుతున్నాయని కనిపెట్టాను. వెనక వీధిలో కూడా కేరట్, కాప్సికం కూడా పండించారని వార్తలు విన్నాను. మా ఇంటిలో కూడా కొన్ని పూల మొక్కలు కనిపించాయి. ఏ నేలైనా మనం శ్రద్దగా వ్యవసాయం చేస్తే బంగారం పండించవచ్చు అని ధృఢనమ్మకానికి వచ్చేశాను. సౌత్ ఎండ్ పార్క్‌లో కూరగాయల వ్యవసాయం అనే విషయం మీద మా కాలనీ లోని ఆదర్శ రైతు, రైతణి లతో కూలంకషంగా చర్చలు జరిపాను. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో కూర బాగా పండుతోంది. అన్ని కూరలూ ఎవరూ పండించటం లేదు. ఎవరికిష్టమైన కూర వారు శ్రద్ధగా పండిస్తున్నారని నా సూక్ష్మ బుద్ధితో కనిపెట్టేశాను. నేను కూడా ఆదర్శ రైతుగా కీర్తింప బడాలని, అందుకై ఎన్ని కష్టనిష్టూరాలైనా భరించాలని నిశ్చయించుకున్నాను.

అలా తీర్మానించుకున్న తరువాత, మా కిద్దరికీ ప్రేమ పాత్రమైన వంకాయలు, తోటకూర, మా ఆవిడకి ఇష్టమైన బెండకాయల వృక్షాలు మొదటగా పెంచాలని, ఆపైన మెల్లిగా మిగిలిన కూరగాయల గురించి ఆలోచించాలని కూడా నిర్ణయించుకున్నాను. మొదటి అడుగుగా మా వ్యవసాయ క్షేత్రం పై దృష్టి సారించాను. ఒకటిన్నర ఇంటూ ఇరవై అడుగుల విస్తీర్ణం వెనక వైపు, ఒకటిన్నర ఇంటూ పదిహేను అడుగుల విస్తీర్ణంలో పక్క వైపు చోటు ఉంది. అక్కడ తులసి, మల్లె, మందార ఇత్యాదులు కొన్ని విరాజిల్లుతున్నాయి. ఓ శుభ ముహూర్తాన ఉదయమే స్నాన సంధ్యాదులు ముగించుకొని, నియమ నిష్ఠలతో గౌరీ పూజ చేసి, వినాయక స్తుతి చేసి, మా ఇలవేలుపు భువనేశ్వరీ దేవిని స్తోత్రం చేసి, ఏరువాక సాగాను. నేలంతా నేనే కష్టపడి తవ్వి, గుల్ల చేసి, రాళ్ళు రప్పలు, పిచ్చి మొక్కలు మొదలైనవన్నీ తీసేశాను. చెమట ఓడ్చాను. ఏరులై పారించాను. బాగు చేసిన నేలను చూసి సంతృప్తిగా తల పంకించాను. మా ఆవిడ కూడా సెభాష్ అంది. వీర తిలకం దిద్దుతానంది కానీ, వంకాయ కూర, తోటకూర పులుసు చేసిన రోజున నేనే దిద్దుకుంటానని మందస్మిత వదనారవిందుడనై వక్కాణించాను.

ఓ శుభ ముహూర్తాన్న బజారు కెళ్ళి నాలుగు రకాల వంకాయల (సన్నవి, లావువి, నల్లనవి, ఆకుపచ్చనివి), తోటకూర, బెండకాయల విత్తనాలు పట్టుకొచ్చాను. మా గుడిలో పూజారి గారిని సంప్రదించి విత్తనములు నాటుటకు ముహూర్తం కూడా పెట్టించుకున్నాను. నాలుగు రకాల వంకాయల విత్తనాలు కలిపి ఓ గుప్పెడు విత్తనాలు పళ్ళెంలో ఓ రెండు కేజీల మట్టిలో కలిపి చల్లేను మా వ్యవసాయ క్షేత్రంలో గుడిలో గంటలు మోగుతుండగా. అదే విధంగా బెండ, తోటకూర విత్తనాలు కూడా చల్లేను. విత్తనాలు చల్లిన తరువాత ఓ బకెట్ నీళ్ళలో పది చుక్కల చొప్పున గంగా, బ్రహ్మపుత్రా, గోదావరి, కృష్ణా, మూసీ నీళ్ళు కలిపి ఆ నదీమ తల్లులను ధ్యానం చేసుకుంటూ వ్యవసాయ క్షేత్రాన్నంతా తడిపాను. ఆ తరువాత మెల్లిగా ప్రేమతోనూ, శ్రద్ధగానూ ఇంకో రెండు బకెట్ల నీళ్ళు పోశాను. నేలంతా తడిగా, తడి తడిగా, బహు తడిగా కనిపించింది. నేను బహు సంతృప్తిగా తల పంకించాను ఆనంద బాష్పాలు రాలుస్తూ. మా వెనకింటి పక్కింటి పనివాడు, ‘అన్ని నీళ్ళు ఎందుకు పోశారు సార్? విత్తనాలు కుళ్లిపోతయ్యండీ’ అంటూ అనుమానబాణం వదిలాడు. ‘కొత్త పెళ్లికొడుకు పొద్దు ఎరగడు అంటారు కదా’ అంటూ వారి పక్కింటాయన పళ్లికిలించాడు. “హుఁ, హూఁ, ధూర్తజనం. ముందడుగు వేసేవాడిని నిరుత్సాహ పరచడమే కాక వెనక్కి కూడా లాగుతారు. ఎందుకో!? అని నేను ఆశ్చర్యంతో కూడిన నిట్టూర్పు విడిచి ఇంటిలోకి వచ్చేశాను.

నేను విత్తనాలు నాటి ఇప్పటికి పదేళ్ళయింది. ఉదయం తొమ్మిది గంటలకి నేను, తెల్ల పొడుగు చేతుల చొక్కా వేసుకొని, చొక్కా మీద తెల్ల గ్లాస్కో పంచె ధరించి, నల్ల బెల్టుతో పంచె బిగించి, వంకాయ రంగు కోటు ధరించి, తెల్ల తలపాగా కట్టుకొని, నా ఆఫీసులో అడుగు పెట్టాను. నాకు భారతీయ సంస్కృతి అన్ననూ అందులో తెలుగు సంస్కృతి యన్ననూ మిక్కిలి మక్కువ. అందుచేత నేను, భారతీయ సంస్కృతి ప్రతిబింబించేటట్టు వస్త్ర ధారణ చేయటమే కాదు, మా కార్యాలయములో అందరూ అటువంటి దుస్తులే వేసుకోవాలని, స్త్రీలు కూడా ఏడు గజాల నేత చీర సాంప్రదాయ బద్ధంగా ధరించాలని కూడా నియమం పెట్టాను. కార్యాలయంలో నా గదిలో ప్రవేశించి నా ఆసనమున ఆసీనుడనవుతుండగా, నా వ్యక్తిగత కార్యదర్శి అచ్చాయమ్మగారు హడావడిగా వచ్చారు. అన్నట్టు, నా కార్యాలయంలో పనిచేసేవాళ్ళ పేర్లు కూడా తెలుగు సంస్కృతి ప్రతిబింబించేటట్టు ఉండాలని నియమం. పరంధామయ్య, సీతారామయ్య, వెంకన్న, సుబ్బన్న, గణపతి, సూర్యాకాంతం, దుర్గా భవాని, అఖిలాండేశ్వరి, లాంటి పేర్లు పెట్టించేను. వాళ్ళ పేర్లు అన్ని మన సంస్కృతిలో భాగంగా మార్చటానికి నాకు కొన్ని లక్షలు ఖర్చు అయ్యాయి కానీ నేను వెనకడుగు వేయలేదు.

కుమారి అచ్చాయమ్మగారు, ‘గంటన్నర నుంచి అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధాని మీకోసం ప్రయత్నం చేస్తున్నారు,’ అని కంగారుగా చెప్పింది. ఐక్యరాజ్యసమితి సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు సభ్యదేశాల అధ్యక్షులకు, ప్రధానులకు విందు ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఇప్పటి దాకా కనీ, వినీ, ఎరుగని, రుచి చూడని కొత్త వంకాయ వంటకం వడ్డించాలని సంకల్పించారు. మా వంకాయ పరిశోధనా సంస్థ గత రెండు నెలలుగా ఈ విషయంపై కృషి చేస్తోంది. ఇప్పటికే గత ఆరేళ్లగా నూట ఏభైమంది వంకాయ శాస్త్రజ్ఞులు కొన్ని వందల వంకాయ వంటకాలు తయారు చేశారు. అన్నీ దేశ విదేశాల్లో బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రపంచంలో వంకాయ వంటకం తినని వాడు లేడు. అన్ని విదేశీ రుచుల కనుగుణంగా వంకాయ వంటకాలు తయారు చేశారు మా శాస్త్రవేత్తలు. మా సంస్థ ఆధీనంలో, మేము అభివృద్ధి చేసిన రెండు వందల ఏభై ఆరు రకాల వంకాయలు, డెభై ఆరు మిలియన్ టన్నులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మన దేశానికి ఏడాదికి సుమారు నాలుగు వేల బిలియన్ల రూపాయలు వంకాయ ఎగుమతుల వల్ల వస్తోంది. దేశంలో వంకాయ లేని భోజనం లేదు. సుమారు ఆరేడు మిలియన్ టన్నుల వాడకం ఉంది.

ఇంగ్లాండులో ఎన్నికలు వస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కొన్ని విదేశీ శక్తులు వంకాయలను నల్లబజారు లోకి మళ్లించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. వంకాయ ధరలు అక్కడ ఆకాశంలోకి వెళ్లిపోయాయి. బ్రిటన్ ప్రధాని తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ‘అందరికీ ఐదు కేజీల వంకాయలు ఒక్క పౌండుకే’ పధకం మొదలు పెట్టాడు. దాంతో వంకాయికి అక్కడ డిమాండ్ పెరిగిపోయింది. ఎన్నికలు ఇంక ఇరవై రోజులే ఉన్నాయి. అప్పటిదాకా రోజుకొక లక్ష టన్నులు ఎగుమతి చేయమని ఆయన నన్ను అభ్యర్దిస్తున్నాడు. ఈ విషయం పసిగట్టి ఆ విదేశీ శక్తులు భారత ప్రధాని పై ఒత్తిడి తెస్తున్నాయి. వంకాయల ఎగుమతి ద్వారా భారత దేశం బ్రిటన్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా కలగ చేసుకుంటోందని, ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేశాయి. ఐ.రా. స. లో మద్దత్తు కూడగట్టుకోవడానికి భారత ప్రధాని, రాష్ట్రపతి, విదేశాంగ మంత్రి, విత్త మంత్రి విదేశాలు తిరుగుతున్నారు. భారత ప్రధాని కోరిక మేరకు మేము ప్రస్తుతం రోజుకు నలభై వేల టన్నుల వంకాయలు మాత్రమే, తక్కువ ధరకే, బ్రిటనుకి ఎగుమతి చేస్తున్నాం.

ఇంతలో మా వంకాయ పరిశోధనా సంస్థ సంచాలకుడు వైద్యశ్రీ గోవిందయ్య గారు వచ్చారు. (మా సంస్థలో పిహెచ్.డి. చేసిన వాళ్ళని వైద్యశ్రీ అనే పిలుస్తాం.) తయారు చేసిన కొత్త వంటకం ప్రస్తుతం రహస్యంగా క్షేత్ర పరీక్ష చేస్తున్నట్టు చెప్పారు. ఆ నివేదిక వచ్చిన తరువాత అవసరమైతే తగు మార్పులు చేసి, ఇంకో వారం రోజుల్లో వంటకం తయారు చేసే విధానం, కొన్ని చిట్కాలు అమెరికా అధ్యక్షుడికి పంపవచ్చు అని కూడా చెప్పారు. సమావేశం ఇంకా పదిహేను రోజులు ఉన్నందున కంగారు పడవలసిందేమి లేదు. అదే విషయం అమెరికా అధ్యక్షుడికి టెలిఫోన్ చేసి చెప్పాను. ఆయన పరిశోధనా పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసి, వారం రోజుల్లో పంపించాలని ఇంకో మాటు అభ్యర్ధించాడు.

ఇంతలో బ్రిటన్ ప్రధాని టెలిఫోన్ వచ్చింది. సాధ్యమైనంత ఎక్కువ ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పాను. కనీసం రోజుకి ఇంకో ఇరవై ఐదు వేల టన్నులు ఎగుమతి చేయమని కన్నీరు పెట్టుకొని అడిగాడు. నేను జాలి దలచి ఇంకో పదివేల టన్నులు పంపిస్తాను కానీ అంతకన్నా ఎక్కువ మా ప్రధాని అనుమతి లేనిదే పంపించలేను అని చెప్పాను. సరే, మీ ప్రధాని ఈ రోజు హంగెరీ వెళతాడు కాబట్టి, నేను అక్కడికే వెళ్ళి ఆయనను కలుస్తాను అని చెప్పారు. నేను వెంటనే ప్రధానికి టెలిఫోన్ చేసి విషయం వివరించాను. ఆయనతో చెప్పకుండా పదివేల టన్నులు ఎక్కువగా పంపుతానన్నందుకు కొంచెం అసంతృప్తి కలిగినట్టు అర్ధం అయింది కానీ నన్నేమి అనలేకపోయాడు. ఆయనతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటాను అని మన ప్రధాని ముక్తసరిగా నాతో అన్నారు.

ఇంతలో ఫైర్ ఇంజన్ గంట గణ గణ మోగింది. నేను ఆఫీసు బయటకు వచ్చాను. అంతా ప్రశాంతంగానే ఉంది. ఇంతలో ఎవరో గిల్లినట్టు అనిపించింది. నేను ఉలిక్కి పడ్డాను. ‘అలారం మోగుతోంది. నాలుగున్నర అయింది. లేచి నీళ్ళు పట్టండి,’ అన్న మాటలు వినిపించాయి. కళ్ళు తెరిచి చూస్తే పక్కన మా ఆవిడ మళ్ళీ గిల్లుతోంది.

తప్పదు కాబట్టి, నిద్ర లేచి, పైన టాంకు, కింద సంపు నీళ్ళతో నింపి, బకెట్లు, ఖాళీగా ఉన్న బిందెలు, గిన్నెలు కూడా నింపేటప్పటికి పావు తక్కువ ఆరు అయింది. నీళ్ళు పడుతున్నంత సేపు నా కల గురించే ఆలోచించాను. తెల్లవారు జామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు. మిలియన్ల కొద్దీ రూపాయలు కాకపోయినా, కనీసం నెలకి ఐదారు వందల రూపాయలైనా కూరగాయల సాగులో సాధించాలనే ఉత్సాహం కలిగింది. ఓ కప్పు కాఫీ తాగి, కొద్దిగా వెలుగు వస్తుండగా నా వ్యవసాయ క్షేత్రం పరిశీలించాను. ఎక్కడా ఏమీ మొలకెత్తలేదు. ఇంతలో వెనకింటి పక్కింటి పనివాడు, ‘అప్పుడే ఏం వస్తాయండి. వంకాయలు మొలకెత్తడానికి వారం పది రోజులు పడుతుంది. తోటకూరకే నాలుగైదు రోజులు పడుతుంది,’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. నాకు మండుకొచ్చినా ఏమీ అనలేకపోయాను.

అలా ఒక ఐదారు రోజులు రోజూ నాల్గైదు మాట్లు చూశాను. మొలకెత్తే సూచనలు ఏమీ కనిపించలేదు. నీళ్ళు తక్కువయ్యేయేమో నని ఇంకో రెండు మూడు బకెట్లు పోద్దామనుకున్నాను కానీ మా ఆవిడ నా అభిప్రాయాన్ని వ్యతిరేకించింది. ‘నేలంతా తడిగానే ఉంది ఇంకా, వాడు అన్నట్టు విత్తనాలు కుళ్ళిపోయాయేమో,’ అని కూడా అనేసింది. నేనేమి అనలేదు. నాకొచ్చిన కల గురించి చెపుదామనుకున్నాను కానీ, కాలనీ లోనే కాక బంధు మిత్ర గణాల కందరికి చెప్పి తను నవ్వి, మిగతా అందరిని కూడా నవ్విస్తుందేమో నని నోరు మూసుకున్నాను. ఇంకో నాల్గైదు రోజులు గడిచాయి కానీ ఏమీ మొలకెత్తలేదు. కానీ నా ఆశ చావలేదు. ఇంకో నాలుగు రోజుల తరువాత నా ఆశ కూడా సన్నగిల్లింది.

ఇంకో రెండు రోజులు పోయిన తరువాత విత్తనాలు మొలకేత్తవేమో నన్న అనుమానం కలిగి ఇంకో నాలుగు రోజుల తరువాత బలపడింది. ఇలా ఎందుకు జరిగిందా అని బాసింపట్టు వేసుకొని తీవ్ర మేధోమధనం చేసుకున్నాను. లేచి ఒక కప్పు కాఫీ తాగి మంచం మీద పడుకొని చింతన్ బైఠక్ చేసుకున్నాను. ఈ తీవ్ర పరిశోధన వల్ల నా మనోవీధిలో కొన్ని సత్యాలు దృగ్గోచరమయ్యాయి.

సూర్య కిరణాలు పడుచున్న చోటే పూల మొక్కలున్నాయి.
సూర్యకాంతి పడక పోవడం వల్ల విత్తనాలు మొలకెత్తలేదు. బహుశా కుళ్ళి, కృశించి నశించిపోయాయి.
గోడకు పక్కనే ఉండడం వల్ల సూర్యకిరణాలు, మన వ్యవసాయ క్షేత్రంలో పడటం లేదు.
సూర్యరశ్మి పడాలంటే వెనకింటాయన, పక్కింటాయన సహాయ సహకారాలు అవసరం. వారి సహాయాన్ని కోరాలి.
మర్నాడు మొదటగా వెనకింటాయన ఇంటికి వెళ్లాను. ఆయన సాదరంగానే ఆహ్వానించారు. విత్తనాలు మొలకెత్తక పోవటానికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాఢ సంతాపాన్ని ప్రకటించారు. విత్తనాల ఆత్మ శాంతికి ఒక నిముషం మౌనంగా ప్రార్ధించారు. తరువాత నేను వచ్చిన పని మనవి చేయమని కోరారు. నేను విషయం వివరించాను. మా గోడ పక్కన సూర్యరశ్మి పడాలంటే ఆయన చేయాల్సిన పని చెప్పాను. ఆయన రెండు నిముషాలు రెండోసారి తీవ్ర దిగ్బ్రాంతికి లోను అయ్యాడు. నోట మాట రాలేదు. తేరుకొని వాళ్ళావిడను పిలిచాడు.

‘చూడు ఈయన ఏమి అడుగుతున్నాడో? వాళ్ళ గోడ పక్కన ఎండ పడాలంటే మన ఇంటి పైన రెండు అంతస్థులు పడగొట్టాలంట. ఎంత ధైర్యం!’ అంటూ ఆవిడను కోప్పడ్డాడు. ఆపైన వాళ్ళిద్దరూ కలిసి నామీద విరుచుకు పడ్డారు. చెడామడా, ఎడాపెడా దుమ్ము దులిపేశారు, దుర్భాషలాడారు. ఈ పక్క వాళ్ళు, ఆ పక్క వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు. విషయం విని వాళ్ళు కూడా నా మీద మాటల శరాలు సంధించారు. నాకూ కోపం పేట్రేగి పోయింది. ‘అసలు ఇన్ని అంతస్థులు కట్టడానికి మీకు అనుమతి ఉందా? పక్క వాళ్ళ ఇళ్ళకి ఎండ, గాలి, వెలుతురు తగలకుండా ఇలా పై అంతస్థులు కట్టడం చట్ట విరుద్ధం,’ అంటూ లా పాయింటు విశదీకరించాను. ‘కాబట్టి మీరు చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం వుంది!’ అని తీవ్రాతి తీవ్రంగా ఎదురు దాడికి దిగాను. కానీ ఫలితం లేకపోయింది. అందరూ ఏకతాటిపై నిలబడి, ఉమ్మడిగా ముక్త కంఠంతో, ‘మాకు అనుమతులు ఉన్నాయో లేవో నీకనవసరం, నీ దిక్కున్న చోట చెప్పుకో’ మన్నారు. చేసేదేమీ లేక నేను తిరిగి వచ్చాను. అయినా నేను ధైర్యం వీడలేదు.

మర్నాడు పక్కింటాయన దగ్గరికి వెళ్లాను. ‘వెనకింటాయన్ని బాగా కడిగేశారుటగా నిన్న. నిజమే, మనకి అసలు ఎండ రావటం లేదు. టెర్రస్ మీద ఆరవేసిన బట్టలు కూడా ఆరటం లేదు,’ అన్నాడు ఆయన. ‘ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. మీరు టెర్రస్ మీద బట్టలు ఆరవేయవద్దు. అందువల్ల మా మొక్కలకి వచ్చే గంట ఎండా రావటం లేదు. కాబట్టి మీరు బట్టలు ఇంకో చోట ఆరవేసుకోండి,’ అని కోరాను. ఆయన అగ్గి ఫైర్ అయ్యాడు. ఈయన వాళ్ళావిడను పిలవలేదు కానీ వాళ్ళ కుక్కని పిలిచాడు. నేను మధ్య గోడ దూకి మా ఇంటికి పారిపోయి వచ్చాను.

ఇప్పుడు నేనేమి సేయవలెనని చింతించాను. మరల ఇంకోమారు చింతన్ బైఠక్ కూర్చునే చేశాను. ఎందుకో న్యూటన్ మహాశయుడు, బుద్ధుడు గుర్తుకు వచ్చారు. జ్ఞాన చక్షువులు విచ్చుకోవాలంటే ఆపిల్ చెట్టో, బోధివృక్షమో కావాలి, మా చుట్టుపక్కల అవి లేవు. జామకాయని పేదవాడి ఆపిల్ అంటారు కాబట్టి జామ చెట్టు కింద నుంచుని ఆలోచించాను. మెరుపు మెరిసింది. సంభ్రమానందోత్సాహములతో, ఈ పక్కింటాయన ఇంటి టెర్రస్, మా టెర్రస్ పరిశీలించాను. అక్కడనుండి మా ఇంటి గోడల దూరం కొలిచాను. కాగితం కలం తీసుకొని లెఖ్ఖలు వేశాను. బజారుకెళ్ళి కావాల్సిన పరికరాలన్నీ తీసుకువచ్చాను. ఈ పక్కింటాయన అనుమతి తీసుకొని, వారి టెర్రస్ మీదా, మా టెర్రస్ మీద, మా ఇంటి రెండు గోడలమీద, పరికరాలు అమర్చాను. మా రెండు గోడల పక్కన సూర్య రశ్మి పడింది. రోజూ కనీసం రెండు గంటలు సూర్య కాంతి పడేటట్టు పరికరాల కోణాలు సరిచేశాను. మా ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. ‘మీకు మతి భ్రమించలేదు కదా,’ అని విచారంతో కూడిన ఆశ్చర్యం వెలిబుచ్చింది. వెంటనే తన అనుజుడికి టెలిఫోన్ చేసి, ‘మీ బావగారిని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలేమోరా,’ అని అనుమానం వ్యక్తం చేసింది. ఆ పక్కింటాయన కోడై కూశాడు. వెనకింటాయన దండోరా వేశాడు.

సాయంకాలానికి, కాలనీ జనం మా ఇంటికి క్యూ కట్టారు. మా శంకరరావుగారు నా భుజం తట్టి, ‘మొత్తం మీద సైంటిస్ట్ ననిపించుకున్నావు ప్రద్యుమ్నా,’ అని నా భుజం తట్టారు. ‘ఆ ఇంటి మీద, ఈ ఇంటి మీద, ఆ గోడల మీద, అంత ఎత్తులో ఇలా అద్దాలు అమర్చి, సూర్యకాంతిని పరావర్తనం చేయించి మీ గోడపక్కల పడేటట్టు చేయడం అపూర్వం!’ అని మెచ్చుకున్నారు. నా ఎదుట నన్ను మెచ్చుకున్నా నలుగురితో కలిసి నవ్వుకున్నారని తరువాత తెలిసింది. అయినా నేను లెఖ్ఖ చేయలేదు.

ఈ మారు మరింత నియమ నిష్టలతో విత్తనాలు చల్లి పవిత్ర నదీ జలాలతో అభిషేకం చేశాను. ఎందుకైనా మంచిదని గుళ్ళో రుద్రాభిషేకం చేయించి అమ్మవారికి అరటి పళ్ళు సమర్పించాను. సాయిబాబా గుళ్ళో కొబ్బరికాయ కొట్టాను. రోజూ కనీసం రెండు మూడు మాట్లు, సూర్య కాంతి పడేటట్టు అద్దాల కోణాలు మార్చేను. ఒక వారం రోజులు భారంగానే గడిచాయి. వారం రోజుల తరువాత కొన్ని విత్తనాలు మొలకెత్తాయి. ఇంకో నాల్గైదు రోజుల్లో మరికొన్ని మొలకెత్తాయి. నా మది ఉయ్యాలలూగే అని పాడుకున్నాను. కానీ వారం పదిరోజులైనా అవి ఒక సెంటిమీటర్ కూడా పెరగ లేదు. ఇంకో పది రోజులైనా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. అవి ఓ మిల్లీమీటర్ పెరిగాయేమో. వెనకింటాయనా, ఆ పక్కింటాయనా నన్ను చూసి మళ్ళీ నవ్వడం మొదలు పెట్టారు. ఈ పక్కింటాయన కూడా, ‘ఏదో ఒకటి రెండు పూల మొక్కలు ఎలా పెరిగేయో తెలియదు కానీ భూమిలో సారం లేదనుకుంటాను,’ అని అభిప్రాయపడ్డాడు.

నేను ఓటమి నంగీకరించక సారం పెంచడానికి ఒక కేజీ యూరియా ఇంకో కేజీ ఎన్.పి.కె ఎరువులు తెచ్చాను. అర కేజీ యూరియా బకెట్టు నీళ్ళలో వేసి, యూరియా నీళ్ళు పిచికారీ చేశాను. పావుకేజీ ఎన్.పి.కె చల్లాను. ఇక మొలకలు ఉత్సాహంగా పెరుగుతాయని అనుకున్నాను. కానీ మర్నాటికి కొన్ని మొలకలు నల్లబడ్డాయి, కొన్ని వాలిపోయాయి. ఇంకో రోజులో కీర్తిశేషులైనాయి. వెనకింటి పక్కింటి పనివాడు ‘అంత యూరియా పోస్తే మానైనా పడిపోతుందండి మరి,’ అని కిసుక్కుమన్నాడు. వెనకింట్లోంచి, పక్కింట్లోంచి అట్టహాసాలు వినిపించాయి.

ఈ మాటు ఒక రెండడుగులు నేల తవ్వించి, ఆ మట్టి అవతల పాడేయించి, ఎర్రమట్టి, ఒండ్రు మట్టితో నింపితే మొక్కలు భేషుగ్గా పెరుగుతాయని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. నా ఆలోచనలను ఇట్టే పసిగట్టే ప్రావీణ్యం గల మా ఆవిడ, ‘ఇప్పటికే నలుగురూ నవ్వుతున్నారు. ఇకపై మీరు ఏమీ పెంచఖ్ఖర్లేదు. మీరు ఎంత కృషి చేసినా మీ పర్సుకి దుర్భిక్షమే తప్ప మరేం కాదు,’ అంటూ వీటో చేసేసింది.
---------------------------------------------------------
రచన: బులుసు సుబ్రహ్మణ్యం, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment