Saturday, January 19, 2019

బోధిచెట్టులో సగంచెట్టు


బోధిచెట్టులో సగంచెట్టు





సాహితీమిత్రులారా!

ఈ అనువాద కవితను ఆస్వాదించండి...........

“కాలాన్ని వెనక్కి తిప్పితే
ఏది చూడాలని కోరిక నీకు?”
అడిగింది భూమి.

“సిద్ధార్థుడి సన్యాసం” అన్నాను నేను.

కాంతివేగంతో వెనక్కి తిరిగి
చెప్పినచోట ఆగింది భూమి.

మౌనం గడ్డకట్టినట్టుగా
కపిలవస్తు రాజప్రాసాదం.

పగలు కాల్చిన బూడిద
పరచుకున్నది రేయిగా.

ఇది చరిత్రపుటల్లో మరపురాని
రాత్రన్నది ఎరుగక
ఆక్రోశం వెళ్లగక్కుతుంది
అనాథ జాబిలి.

గవాక్షాల్లో దీపాలు మగతలో
తమ ఒంటికన్నులు మూసుకున్నాయి.

తుమ్మెదలకిక దారి తెలియదులే అని
ఆకులని అరకొరగా కప్పుకుని
నిద్రకొరిగాయి నందనవనంలోని పూలు.

తాడి చెట్ల సారాయి తప్ప తాగిన మత్తులో
ఒళ్ళు తూలి కాళ్ళు విరిగాయో ఏమో…
కనిపించటం లేదు గాలి.

చుక్కల్ని కాపలా ఉంచి
నడి ఆకాశంలో తూగింది జాబిలి
నిద్రగా వెలుతురు.

లౌకికపు చివరి క్షణాల్లో సిద్ధార్థుడు
మరొక జన్మలో ప్రవేశించబోయే ముందు
గతజన్మని అనాసక్తిగా చూస్తున్నాడు.

త్యాగంలా ఒదిగిపోయి
ఒత్తిగిలి నిద్రపోతున్న భార్య

తామరవదనంపై ఒక చెమ్మగిల్లిన ముద్దు.

వీడిరాలేక పోతున్నాయి
పిల్లవాడి జుట్టులో జొనిపిన వేళ్ళు

పాదుకలలో చొరబడిన పాదాలు
వాటినీ విదిలించుకుని నడిచాయి బయటకి
తమంతట తామే, ఏ ప్రమేయమూ లేదు.

“సిద్ధార్థా, ఆగు!” అంటున్నాయి
కదలక నిలిచిన కోట జెండాలు.

“బుద్ధా, రా!” అంటున్నాయి
అల్లారుతున్న బోధివృక్షపు ఆకులు.

ఆకుల పిలుపుకే
ఫలం దక్కింది.

ఎగురుతున్న పక్షి ఒకటి
నక్షత్రంగా మారినట్టు కలగంటూ
ఉలికిపడి మేలుకుంది యశోధర.

జరిగినదేమో చెప్పకనే చెప్పింది
ఒక సగమే నలిగిన పరుపు.

కన్నీరు మున్నీరై ఒడలంతా
కుమిలిపోయి కరిగిపోయింది
స్థాణువై యశోధర.

“ప్రభూ!
మీరు పరిత్యజించినది లౌకికసౌఖ్యం
పొందబోతున్నది అలౌకికానందం

పోగొట్టుకున్నది ఒక చిన్న రాజ్యం
స్వాధీనం చేసుకోబోయేది విశాల విశ్వం

విడిచిపెట్టినది స్వర్ణ కిరీటం
ధరించనున్నది దివ్యతేజస్సు

వదులుకున్న దానికంటే పొందేది ఎక్కువైనపుడు
అది సన్యాసం అవుతుందా శుద్ధోధన కుమారుడా?!

మీ ప్రపంచం పరిపూర్ణత వైపు
నా ప్రపంచం శూన్యం వైపు.

రాజ్యమున్నా
శరణార్థిలా…

మంగళసూత్రమున్నా
వితంతువులా…

సంతానం ఉన్నా
సన్యాసినిలా…

ఆలోచించారా నా పరిస్థితి ఏమిటో?

సన్యాసి మీరు కాదు రాజుకుమారా,
యశోధర! యశోధర! యశోధర!”

ఆమె కన్నీటి
వేడిమి తాళలేక
కాంతివేగంతో తిరిగి
వర్తమానంలోకి వచ్చింది భూమి.
----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, మూలం: వైరముత్తు, ఈమాట సౌజన్యంతో
(మూలం: బోదిమరత్తిల్ పాదిమరం – కొంజం తేనీర్ నిఱైయ వానం (2005) కవితాసంపుటం నుండి. మూల కవిత తమిళ్, తెలుగు లిపిలో)

No comments:

Post a Comment