Thursday, January 24, 2019

ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము


ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము




సాహితీమిత్రులారా!

ఈ అనువాద లేఖను ఆస్వాదించండి...........

(1910 – భారతి మాసపత్రిక , సాధారణ సంవత్సరాది సంచికనుండి)

[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలు లో 1877 లో జన్మించారు. భువనగిరి, నాగపూర్లలో విద్యాభ్యాసం. సంస్కృతం, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. చరిత్ర పరిశోధకులుగా ప్రసిద్ధికెక్కారు. మహమ్మదీయ మహాయుగం, హిందూమహాయుగం, శివాజి, హైందవ చక్రవర్తులు అన్న గ్రంథాలు రాశారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల స్థాపించి, భౌతిక శాస్త్రం, దేశ చరిత్రలపై పుస్తకాలు ప్రకటించారు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం పేరుతో తెలుగులో మొట్టమొదటి ఎన్‌సైక్లోపీడియా మూడు సంపుటాలు ముద్రించారు.

ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం ఆయన 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులు  పాఠకులు గుర్తించగలరు. లక్ష్మణరావు గారు 1923 లో మరణించారు]

ఔరంగజేబునెడల నెన్ని దుర్గుణములున్నను అతడు గొప్ప విద్వాంసుడని చెప్పక తప్పదు. అతనికి భాషా పాండిత్యమును, లౌకికవ్యవహార జ్ఞానమును, దూరదృష్టియు గలవు. అతని యక్షరములు ముత్తియములవలె ముద్దులమూట గట్టుచుండెను. తనయొద్దకు బంపబడిన ముఖ్యమైన యర్జీల కన్నిటికిని, అతడు స్వహస్తముతో బ్రత్యుత్తరములు వ్రాయుచుండెను. అతనికి చిన్ననాడు చదువు చెప్పిన ముల్లా సాలె అనునతడొకప్పుడు తనకు గొప్పయుడ్యోగ మీయుమని యర్జీ పంపగా, అందుకు బాదుషహా ఈ క్రింది విధమున బ్రత్యుత్తర మంపెను.

” మీరు నాకు అనావశ్యక మైనట్టి అరబ్బీభాష నేర్పుటయందు పెక్కు సంవత్సరములు నిరర్థకముగ గడిపి కోమలమైన నా బుద్ధిని, తీక్ష్ణమైనట్టి నా స్మరణశక్తిని వ్యర్థపుచ్చితిరి. జీవితమునందెన్నడును ఉపయోగపడని భాష రాజపుత్రులకు నేర్పుటకు పది పన్నెండు వత్సరములు వెచ్చించుటయు, ఆభాషయందు నన్ను వైయాకరిణిగను, ధర్మశాస్త్ర జ్ఞు నిగను చేయ యత్నించుటయు నెంత హాస్యాస్పదములు. ఉపయోగమైన విద్యలును, జ్ఞానమును బాలకులకు వారి వారి బుద్ధిననుసరించి చిన్ననాడు నేర్పుటయందు కాలము గడుపుటకు మాఱుగా మా గురువులవారగు మీరు మా బాల్యమును వ్యర్థపుచ్చితిరిగదా! అయ్యో! భూగోళజ్ఞానమా ఏమియును లేదు. పోర్చుగలు, హాలండు, ఇంగ్లండు మొదలగు దేశములు కొన్ని కలవనియు, అవి ఆయా స్థలము లందు కలవనియు, నాకు నేర్పితిరా? ఆ దేశములు ద్వీపములా, ద్వీపకల్పములా, సమభూమియందున్నవా, లేక ఎత్తుస్థలములందున్నవా యన్న సంగతులు నాకు తెలియ వలదా? చీనా, పారసీకము, పెరు, తార్తారి మొదలైనదేశముల రాజులు హిందూదేసపు బాదుషహా పేరువిని గజగజ వణికెదరని నా ఎదుట మీరు చేసిన ముఖస్తుతి వలననే దేశ దేశ చరిత్రములన్నియు నాకు తెలిసినవనుకొంటిరా? ఈ జగత్తుమీదనున్న వేరువేరు రాజ్యములెవ్వి? అందలి ఆచారవిచారములు, రాజ్యవ్యవహారములు, మతములు నెట్టివి? ఆ యా రాజ్యములను గల సంపత్తులును, విపత్తులును, ఆ యాదేశము సంపద్విపత్తులలో, ఆ దేశస్థు ల యొక్క ఏ యే గుణావగుణములవలన ఎట్టి యెట్టి మార్పులు గలిగినదియు, ఎట్టి మహత్కారణములచే గొప్పరాజ్యములు తలక్రిందగునదియు అను మహద్విషయములు చరిత్రాధ్యయనములేకయే మా కెట్టుల తెలియ గలవు? ఈ విషయములు మాకు నేర్పితిరా?

రాజపుత్రులు పైని వర్ణింపబడినట్టి యత్యంతావశ్కములగు వివిధ విషయములను నేర్చుకొని జ్ఞానసంపన్నులై తమ బుద్ధిని వికసింపజేయవలయును. కావున రాజపుత్రులయొక్క జ్ఞార్జనకాలమగు బాల్యదశయందలి యొక్కొక్క క్షణము మిక్కిలి విలువ గలదియని యెఱింగి నా బాల్యదశను మీరు చక్కగ వినియోగపఱచితిరా? మీరు నాకు లేనిపోనట్టియు, బుద్ధినిభ్రమింపజేయునట్టియు లౌకికవ్యవహారమునకు నిరుపయోగకరమైనట్టియు పరభాషాజ్ఞానము గఱపుటయందే కృతకృత్యులమైతిమని తలంపలేదా? మొదట పరకీయ భాషనొకదానిని నేర్పి దాని మూలముగా శాస్త్రములు, ధర్మవివేచనము, న్యాయనీతి మొదలైన యావశ్యకములైన విద్యలనేర్పుట సులభమని తలంచితిరా? ఈయావశ్యకములగు విద్యలన్నియు మీరు నాకు నామాతృభాషలోనే నేర్పియుండకూడదా? “నేను ఔరంగజేబునకు తత్త్వజ్ఞానశాస్త్రమును నేర్పెదను” అని మీరు నా తండ్రియగు శహజహాను బాదుషహా గారితో వొకప్పుడనియుంటిరి. మీ రనేకసంవత్సరములకు బ్రహ్మ, ఆకాశము, ఖటపటములు, మొదలైన నీరస శబ్దములచే నేదోయొక విషయము నాకు బోధింప యత్నించినట్లు నాకు జ్ఞాపకమున్నది. ఆ విషయమును గ్రహింపవలయునని నేను పెక్కు పర్యాయములు యత్నించితిని. కాని యందువలన నా జ్ఞాన భాండారమునకును, రాజ్యకర్తృత్వమునకును, ఏమి లాభము కలిగినది? మీరి తేప తేప యుచ్చరించుచున్నందున నీరసములును, పలుకుటకు కఠినములును అగు ఖటపటాది పదములు కొన్ని నాకు జ్ఞాపకమున్నవి. కాని వానితోసంబంధించిన, విషయచర్చ మాత్రము నేను ఎప్పటిదప్పుడు మర చిపోవుచుంటినని మీఱెరుగరా? నేడు ఆవిషయచర్చ జ్ఞాపకమున్నను దాని వలన నాకు ప్రయోజనమేమి? ఇట్లు మీరు కోమలమైనటువంటి నా బుద్ధిని, చురుకుదనమును, వ్యర్థము చేసితిరిగాదే?

నిజముగా నిరుపయోగములైనను మీరు ఆవశ్యకములని తలచిన ఈ విషయములు మీరు నాకు నేర్పినందున మీకు మాత్రమొక లాభము కలిగినది. మూఢులును, అజ్ఞానులును అగు మావంటివారికి మీరు సర్వజ్ఞులనియు, సర్వశాస్త్రపారంగతులనియు, అత్యంతపూజ్యగురువర్యులనియు, నిరథకగౌరవభావమును కొంతకాలమువఱకు పుట్టింపగలిగితిరి. అందువలన పెక్కుదినములవఱకు మీ మాటను మేము మన్నించుట తటస్థించెను. రాజులను వ్యర్థముగా స్థుతించుట, సత్యమును తలక్రిందు చేయుట, నక్కవినయములు నటించుట యను గుణములు మాత్రము మీయందు చక్కగ వసించుచున్నవి. మిమ్ముల నేను నారాజసభయందు, ఒక సరదారునిగ నియమింపవలయునని మీరు కోరితిరిగదా. మీ యొక్క ఏ గుణమును జూచి నేను మీకాపదవినొసగవలయును? మీరు నాకు రాజకీయ, సైనిక, వ్యావహారికవిద్యలలో నేవిద్య నేర్పితిరని మిమ్ములను నేను గౌరవింతును? నన్ను నావశ్యకములైన విద్యలలో బారంగతునిజేసి యుండిన యెడల సికందరు (అలెగ్జాండరు) బాదుషహాకు పరమపూజ్యగురువర్యుడగు మహావిద్వాంసుడైన అరిస్టాటుల్‌ ఎడలగల పూజ్య భావమునే చూపియుందును. అట్టి యుపయోగకరములగు శిక్షణ గాని లాభకరములగు విద్యలనుగాని నేను మీవలన బడయలేదు. కావున మీ విషయమై గౌరవముగాని, పూజ్యభావముగాని నాకు లేదు. మీరు వచ్చిన త్రోవనే వెళ్ళుడు. మీ పల్లెటూరిలోనే దేవుని స్మరణ చేసికొనుచు కాలము గడుపుడు. మీరు నారాజసభలో ప్రవేసింపకూడదనియు, మీరెవరో ఇచ్చటివారెవరికిని తెలియకూడదనియు నా యభిప్రాయము.”

ప్రస్తుతకాలమందు బాలబాలికా విద్యను గుఱించియు, జాతీయవిద్యను గుఱించియు మనదేశమందు కొంత యత్నము జరుగుచున్నది. ఇందును గుఱించి పాటుపడుతున్న మహనీయులకీ యుత్తరములోని రెండుమూడు సంగతులాదరణియములు. బాలబాలికలకు బోధింపబడు విషయములు వారికి, వారి జీవితకాలములో నుపయోగకరముగానుండవలయును. కేవలము పాండిత్యము జూపుటకై అనుపయోగకరములగు విషయములు వారికి నేర్పి గుడ్డిపాఠముచేయించి కాలము వ్యర్థపుచ్చుట, వారికిని, దేశమునకును హానిప్రదము. బాలురకు శాస్త్రములన్నియు వారి మాతృభాషలోనే నేర్పవలయునుగాని పరభాషలో నేర్పుట కేవలము ద్రావిడప్రాణాయామమని ఔరంగజేబు ఉత్తరము వలన మనవారు ముఖ్యముగా నేర్చుకొనవలయును. మొదట పరభాషనభ్యసించుటకు బాలుర కాలమెంతయో వ్యర్థమగును. అట్లు పరభాషవచ్చిన తరువాత, ఆభాషలో శాస్త్రములనభ్యసించుటకంటె మొదటనుండియు స్వభాషలోనే శాస్త్రాధ్యయనము చేసిన యెడల బాలురకెంతయో కాలము, శ్రమయు కలిసివచ్చును కదా? తెలివిగల పిల్లవానికి ఇంగ్లీషుభాష చక్కగ నభ్యసించుటకు సుమారు ఆరేడు సంవత్సరములు పట్టును. అప్పటికా బాలునకు ఇంగ్లీషులో గ్రంథావలోకనము చేయుటకును, శాస్త్రాభ్యాసము చేయుటకును అధికారము కల్గును. ఇట్లు పరభాషాధ్యయనమునకై ఏడెనిమిది సంవత్సరములు వ్యర్థమగుచున్నవి. దేశ భాషలలో శాస్త్రములు జెప్పిన యెడల నీ ఏడెనిమిది సంవత్సరములలో నెన్నియో విద్యలలో పారంగతుడు కావచ్చును. ఇప్పుడు మనదేశమందు ఇంగ్లీషువారి ప్రభుత్వమున్నందునను, ఇంగ్లీషుభాషలో గ్రంథభాండార మసంఖ్యముగ నున్నందునను ధనము గలవారు కొందఱా భాషనభ్యసించుట యావశ్యకమే. మేము వలదనము. కాని సకల శాస్త్రజ్ఞానమును, ఇంగ్లీషుభాషయను గదిలోబెట్టి తాళమువైచి, ఏ.బి.సి.డి. అను తాళపుచెవిని సంపాదించుటకు ఎనిమిది సంవత్సరములు ముక్కు పట్టుకొని తపస్సు చేయనివారలకు జ్ఞానభాండారములోని సొత్తును కొల్లగొట్టునధికారము లేదనియు, విద్యామహిమయు మాతృభాషాప్రభావమును తెలియని దూరదృష్టి విహీనులు తప్ప మరెవ్వరును చెప్పజాలరు.

జ్ఞానార్జనమార్గము లన్నియు పరభాషయొక్క యధీనమునందుండిట కంటె దేసము పాలించి మూర్తీభవించిన యజ్ఞానాంధకారము మఱొకటి కలదా? కావున స్వభాష మూలముననే జ్ఞానార్జనము చేయవలయునని ఔరంగజేబు నుత్తరములో నున్న విషయమును నా జాతీయపాఠశాలాధ్యక్షులు గమనింపవలెను. అట్లు చేయక వారు ఇంగ్లీషుభాషనే జ్ఞానసాధనముగా బెట్టిరేని ఔరంగజేబు తన గురువును నిందించినట్లు రాబోవుతరమునందలి విద్యార్థులు తమ యాయుష్యములోని పది సంవత్సరములు పాడుచేసినందులకు మనలను నిందింపక మానరు.
-----------------------------------------------------------
రచన: కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, 
మూలం: ఔరంగజేబు, ఈమాట సౌజన్యంతో 

No comments:

Post a Comment