Saturday, January 5, 2019

గానుగెద్దు


గానుగెద్దు




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

గానుగెద్దు. ఈ ఉపమానం విన్నప్పుడెల్లా నాకు వేరువేరు సందర్భాల్లో, వేరువేరు ప్రాంతాల్లో కలిగిన రెండు అనుభవాలు గుర్తుకొస్తాయి. ఒకటి, నా బాల్యంలో మా ఇంటి ఎదురుగా ఉండిన అబ్బులుగాడి గానుగ. ఇంకొకటి, గుర్గాఁవ్‌లో నాతో ఒక ఏడాదిపాటు కలిసి పనిచేసి, హటాత్తుగా మాయమైన హరిప్రసాదు. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే, ఈ రెండు అనుభవాలను కలిపే గమ్మత్తైన లింకొకటుందని కొద్దిరోజుల క్రితం మళ్ళీ హరిప్రసాదును దుబాయి ఎయిర్‌పోర్టులో కలిసేంతవరకూ నాకు తెలియలేదు!

చిన్నప్పుడు మా ఇంటెదురుగా ఉండిన అబ్బులుగాడి గానుగను లాగిన ఎద్దు నాకు జీవితంలో ఎదురుపడిన మొదటి గానుగెద్దు. బక్కగా, పొట్టిగా, చెమట, నూనె కలగలిసి జిడ్డు కారుతున్న శరీరంతో గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేటట్లుండేవాడు అబ్బులు. గానుగ మధ్యలో ఛర్నాకోలుతోనో లేక ముల్లుగర్రతోనో కూర్చున్న అబ్బులు, ఆ గానుగను విరామంలేకుండా లాగే ఎద్దు, మధ్యలో వాడి అరుపులు… ఈ దృశ్యం నాకు ఊహ తెలిసినప్పటినుండి, చదువు నిమిత్తం ఊరు వదిలేంతవరకు నిత్యదర్శనం. చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఇదొక్కటే దిక్కు కాబట్టి, రోజంతా క్షణం విరామం లేకుండా తిరుగుతుండేది గానుగ. నాకు మొదట్నుంచీ అబ్బులంటే కోపం. అందుకు కారణం వాడు ఆ ఎద్దును పెట్టే హింస. పాపం ఆ ఎద్దు ఎంత కష్టపడుతున్నా వాడు దానిని కాస్త ప్రేమగా చూసిన పాపాన పోలేదు. పని ఎక్కువైనా, కస్టమర్లు గొడవచేసినా వాడి కోపాన్ని ఎద్దుమీద చూపించేవాడు. వాడు అరిచే అరుపులకు, ఛర్నాకోలు శబ్ధం నేపధ్యసంగీతంలా వినిపించేది. అలాగని పని ఎక్కువగా లేనప్పుడు కూడా దానికి విశ్రాంతి దొరికేది కాదు. వాడు దాన్ని పెట్టే హింస చూసి నాకు చాలాకోపమొచ్చేది. నిస్సహాయంగా చూస్తూ ఉండేవాడిని. ఆ ఎద్దు వాడిపై తిరగబడాలని, గానుగను లాగిపడేసి వాడిని పొడిచిపడేయాలని ఎదురుచూసేవాడిని. కొన్నిసార్లు ఎద్దు వాడిని పొడిచేసినట్లు కలలు కూడా వచ్చేవి. ఒకసారి ఇటువంటి కలవచ్చి భయంతో అరుస్తూ నిద్రలేస్తే, భయపడ్డానేమోనని తరువాతరోజు మా అమ్మ నన్ను దర్గాకు తీసుకెళ్ళి తావీజు కట్టించింది. నిజానికి ఎద్దు తలచుకుంటే ఈ బక్కప్రాణి దానిముందు నిలవలేడు. కానీ ఎద్దు అలా ఎందుకు చెయ్యదో నాకు అర్ధమయ్యేది కాదు. ఆ గానుగెద్దుమీద నా మమకారాన్ని చూసి మా ఇంట్లోవాళ్ళకు నవ్వులాటగా ఉండేది. వాళ్ళ నవ్వును చూసి నేను ఉడుక్కునేవాడిని.

“వాడి చేతిలోని ముల్లుగర్రకి భయపడినంతకాలం, దాని బలం దానికి తెలీదు. అలా ఉన్నంతకాలం ఆ ఎద్దు ముందు వీడే బలవంతుడు. అది వాడినేమీ చెయ్యలేదు.” మా నాయన తత్వం ఎరుకపరచాలని ప్రయత్నించాడు కానీ, నా కోపం అలానే ఉండిపోయింది.

తరువాత, కొన్నిరోజులకు హైస్కూలు చదువులకోసం నేను తిరుపతి వెళ్ళిపోయాను. మెల్లగా మన జీవితాలనుంచి గానుగనూనె, మా ఉరినుంచి అబ్బులుగాడి గానుగ మాయమైపోయాయి. కానీ నా జ్ఞాపకాలలో ఆ గానుగెద్దు, అది తిరగబడలేదన్న అసంతృప్తీ అలా మిగిలిపోయాయి. ఎప్పుడైనా గానుగెద్దు పోలిక చదివినా, విన్నా, చిన్నప్పటి జ్ఞాపకం నవ్విస్తుండేది.

ఇది జరిగిన పాతిక సంవత్సరాల తరువాత, రెండో గానుగెద్దు హరిప్రసాద్ రూపంలో నాకెదురుపడింది. ఈ గానుగెద్దు పోలిక నేనివ్వలేదండోయ్, ఒకసారి తనను తనే అలా పోల్చుకొన్నాడు. అది జరిగిన కొన్ని రోజులకే నాకు కనీసం మాటమాత్రమైనా చెప్పకుండానే మాయామైపోయాడు.

అవి నేను గుర్గాఁవ్‌లో పనిచేస్తున్న రోజులు.

“అమ్ములూ, ఇందాకే రిపోర్ట్ చేశాను. అన్ని ఫార్మాల్టీస్ పూర్తయ్యాయి. మెల్లగా ఇల్లు వెతకడం మొదలుపెడతాను…”

ఓ రోజు ఆఫీసు క్యాంటీన్లో కాఫీ తాగుతుంటే తెలుగు మాటలు వినపడి గిరుక్కున వెనక్కి తిరిగి చూశాను. నేనలా తిరిగి చూడడం గమనించి కాస్త సర్దుకుని గొంతు తగ్గించి మాట్లాడసాగాడు. కాల్ అయిపోయింతరువాత, తనే వచ్చి పరిచయం చేసుకున్నాడు. పేరు హరిప్రసాద్. ఊరు పలమనేరు. మా జిల్లానే. అందుకే గాబోలు, నాకంటే ఎనిమిదేళ్ళు చిన్నవాడైనా మాకు వెంటనే స్నేహం కుదిరింది. ఆన్‌సైట్ అసైన్మెంట్ నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఇక్కడకు వచ్చాడు. భార్య, రెండేళ్ళ పాప… ఇదీ కుటుంబం. కొన్నిరోజులకు మా అపార్టుమెంట్ కాంప్లెక్సులోనే ఇల్లు దొరికింది. ఇంకో తెలుగు కుటుంబం వచ్చిందని మా ఆవిడ సంబరపడింది కానీ, వాళ్ళావిడ పెద్దగా కలిసేది కాదు. దానికి మా ఆవిడ ఆపాదించిన కారణం, వాళ్ళింటికి బంధువుల తాకిడి ఎక్కువ.

అయితే, మా ఇద్దరి స్నేహం మాత్రం బలపడింది. ఇద్దరమూ ఒకే కార్లో ఆఫీసుకెళ్ళేవాళ్ళం. హరి మంచి మాటకారి. కాస్మోస్ నుంచి కందపద్యం వరకూ, దేనిమీదైనా అనర్గళంగా మాట్లాడగలిగేవాడు. చలం అన్నా, తిలక్ అన్నా, ఆర్‌డీ బర్మన్ సంగీతమన్నా అమితమైన ఇష్టం. కార్లో చాలావరకూ నాది శ్రోత పాత్ర. తనే ఎక్కువగా మాట్లాడేవాడు. అలాగని తన మాటలు బోర్‌కొట్టేవి కావు. తనన్నా, తన మాటలన్నా నాకు చాలా ఇష్టం ఏర్పడింది. చాలా సున్నితమనస్కుడు, స్వాప్నికుడూ… మాటలలో ఎక్కువగా భావుకత్వం ఉట్టిపడుతుండేది. ముఖ్యంగా తను మానవ సంబంధాలను విశ్లేషించే పద్దతి నాకు చాలా నచ్చేది. బహుశా చలం ప్రభావమేమో అనుకునేవాడిని. జీవితంలో డ్రామాను సహించలేకపోయేవాడు. తన అభిప్రాయాలు ఎంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండేవో అంతే నిక్కచ్చిగా ఉండేవి. ఇంత ముక్కుసూటితనమూ, సున్నితత్వంతో గాయపడకుండా ఎలా ఉండగలడా అనుకునేవాడిని. నాకెందుకో ఆ భావుకత్వపు పరదా వెనుక కాస్త అసంతృప్తి దాగుందేమోనని చిన్న అనుమానం. ఒకసారి ఈమాటే తనతో అంటే, ‘నిన్న స్వప్నం నేటి సత్యం, నేటి ఖేదం రేపు రాగం, ఒకే కాంతి ఒకే శాంతి, ఓ మహాత్మా ఓ మహర్షీ!’ అని నవ్వుతూ శ్రీశ్రీని వినిపించాడు.

తన మంచితనంతో, మాటకారితనంతో ఆఫీసులో కూడా తొందరగానే పాపులర్ అయ్యాడు. అయితే, అప్పుడప్పుడూ కాస్త ముభావంగా ఉండేవాడు. కార్లో మామధ్య నిశ్శబ్ధం రాజ్యమేలేది. నిజం చెప్పాలంటే, తన నిశ్శబ్ధాన్ని భరించలేకపోయేవాడిని. కారణం తనూ చెప్పేవాడు కాదు, నేనూ అడిగేవాడిని కాదు. ‘నిశ్శబ్ధం నీకు సూటు కాదోయి…’ అని నేనంటే నవ్వేసేవాడు. మూడ్ స్వింగ్స్ కాబోలని సరిపుచ్చుకునేవాడిని. ఇలా ఒక సంవత్సరం గడిచింది.

ఒకరోజు ఆఫీసుకెళ్తున్నప్పుడు, ఉన్నట్లుండి “గానుగెద్దు జీవితం అయిపోయింది గురువుగారూ!” అన్నాడు. గానుగెద్దు ప్రసక్తి రాగానే, నాకు అలవాటు ప్రకారం వెంటనే నవ్వు తన్నుకొచ్చి గట్టిగా నవ్వాను.

“అదేమిటండీ, నేనేదో సీరియస్‌గా నాకష్టం చెప్పుకుంటే, అలా నవ్వేశారు?” తను హర్ట్ అయినట్లున్నాడు.

వెంటనే సర్దుకొని, నా చిన్నప్పటి అనుభవం, గానుగెద్దు గురించి నా కలలు, అమ్మ కట్టించిన తావీజు, నాయన చెప్పిన తత్వం… అన్నీ వివరంగా చెప్పాను. తనేమీ మాట్లాడలేదు. ఇంతలో ఆఫీసు రావడంతో విడిపోయాము. సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడుకూడా తను ముభావంగా వుంటే, నా నవ్వును అపార్ధం చేసుకోవద్దని సారీ చెప్పాను.

“అయ్యో, అలాంటిదేమీ లేదండీ గురువుగారూ. మీరు చెప్పిన గానుగెద్దు అనుభవం నాకేమైనా దారిచూపిస్తుందేమోనని ఆలోచిస్తున్నాను.” అన్నాడు.

“నిజమే కదా, దాని శక్తి దానికి తెలియనంతకాలం, వాడికి భయపడినంతకాలం ఆ ఎద్దు అలా వృత్తంలో తిరుగుతుండాల్సిందే కదా? వాడి దెబ్బలను భరిస్తుండాల్సిందే కదా? మనమూ అంతేకదా! ఎవరేమనుకుంటారేమోననే భయం. సమాజం అంటే భయం! ఏమౌతుందోననే భయం! జీవితమంటే భయం! చావంటే భయం! క్షణం క్షణం భయం భయం! ఇలా భయపడినంత కాలం, మనమూ గానుగెద్దులమే!” తనలోతను మాట్లాడుకున్నట్లు అన్నాడు.

అంతలో ఇల్లు రావడంతో విడిపోయాము. మరుసటి రోజు తను ఆఫీసుకు రావట్లేదని మెసేజ్ పంపాడు. ఆ తరువాత తను నాకు కనపడలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చేది. పదిరోజుల తరువాత తను రిజైన్ చేసినట్లు తెలిసింది. తను ఇల్లు ఖాళీ చేసిన విషయం మా అపార్ట్‌మెంటు వాచ్‌మెన్ చెప్పాడు. తను అలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం నన్ను చాలా బాధపెట్టింది. తనపై ఉన్న ఇష్టమూ, చెప్పకుండా వెళ్లిపోయాడన్న బాధ, కోపమూ, అలా మిస్టీరియస్‌గా మాయమవడం వల్ల కలిగిన అయోమయం, ఏమైందో అన్న కుతూహలం, అన్నీ కలిసి చికాకుగా మారాయి. చాలారోజులు ఆ చికాకు నన్ను వెంటాడింది. నా చికాకు చూసి మా ఆవిడ, పిల్లలూ నవ్వుకునేవాళ్లు. అలా, నాకెదురుపడిన రెండో గానుగెద్దు వలనకూడా ఇంట్లో మళ్ళీ నవ్వులపాలయ్యాను.

ఐదేళ్ళు గడచిపోయాయి. నేను ఉద్యోగరీత్యా సిడ్నీలో సెటిలయ్యాను. హరిప్రసాదు మిస్టరీ అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు గానుగెద్దు ప్రస్తావనొస్తే హరిప్రసాదు గుర్తుకొస్తున్నాడు.

ఒకసారి, ఇండియా నుంచి తిరిగి వెళ్తూ దుబాయ్ ఎయిర్‌పోర్టులో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే, లాంజ్‌లో హరిప్రసాదు మళ్ళీ కలిశాడు. మొదటిసారికిమల్లే ఈసారి కూడా తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే వెనక్కి తిరిగి చూస్తే కనపడ్డాడు.

నన్ను చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను గట్టిగా వాటేసుకున్నాడు.

“మొదట మీరు నన్ను క్షమించండి గురువుగారూ. చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాను. అనుకోకుండా అలా జరిగిపోయింది. తరువాత మీకు అన్నీ వివరంగా మెయిల్ చేద్దామనుకున్నాను కానీ, కుదర్లేదు. కాదు, కాదు. అన్ని సంగతులూ మెయిల్లో ఎలా వ్రాయాలో తెలియలేదు…”

నేను ఆశ్చర్యంనుంచి తేరుకోకముందే, ఇంకో షాకిచ్చాడు. తన ప్రక్కన ఎవరో స్త్రీ. తన భార్య మాత్రం కాదు. తన భార్యను నేనెరుగుదును.

“షి ఈజ్ ప్రియాంక. హీ ఈజ్ శ్రీధర్, ఏన్ ఓల్డ్ ఫ్రెండ్. వుయ్ వర్క్‌డ్ టుగెదర్ ఇన్ గుర్గాఁవ్.” నేను అయోమయం నుంచి తేరుకోకముందే మా ఇద్దరి పరిచయాలు పూర్తిచేశాడు. తను చేసిన పరిచయంలోని అసంపూర్ణత నాలోని కుతూహలాన్ని పెంచింది.

తనను కూర్చోపెట్టి, లగేజ్ మొత్తం సర్దిపెట్టి, రెండు కాఫీ కప్పులతో వచ్చాడు.

నాలో ఎన్నో ప్రశ్నలు. ఇన్ని రోజులు నన్ను వెంటాడిన మిస్టరీ, ఇప్పుడు వచ్చి చేరిన కొన్ని కొత్త ప్రశ్నలు. వాటికి సమాధానాల కోసం ఆతురత నన్ను నిలువనీయడంలేదు.

“మీకు సారీకంటే ముందు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే, మీ వల్లే నా జీవితం నా చేతుల్లోంచి జారిపోలేదు. మీ మొహంలో ఎన్నో ప్రశ్నలు కనబడుతున్నాయి. అన్నిటికీ జవాబులిస్తాను. వాటిలో మీరెన్నిటిని ఆమోదించగలరో నాకు తెలీదు కానీ ఇంతకంటే ప్రాక్టికల్ సొల్యూషన్ నాకైతే తట్టలేదు.” మాటలు కూడదీసుకోవడానికన్నట్లు కాసేపు ఆగాడు. నా ముఖంలో ఫీలింగ్స్ దాచుకొని మామూలుగా కనబడడానికి ప్రయత్నిస్తున్నాను.

“మా నాయన రెవెన్యూ డిపార్టుమెంట్‌లో అటెండరు. చాలీచాలని జీతం, కొద్దిపాటి వ్యవసాయం, ఇవే మాకు జీవనాధారం. ఇద్దరు ఆడపిల్లల తరువాత పుట్టాను కాబట్టి, వాళ్ళ ఆశలన్నీ నామీదే పెట్టుకుని పెంచారు. అమ్మా, నాయన ఇద్దరక్కలూ వీళ్ళందరిదీ ఒకే ధ్యేయం, నన్నుబాగా చదివించి, గొప్పవాడిని చెయ్యడం! అందుకోసం అందరూ ఎన్నో త్యాగాలు చేశారు. తాహతుకు మించినపనైనా, నన్ను విజయవాడలో హాస్టల్లో ఉంచి చదివించారు. వాళ్ళ కష్టం, నామీద వాళ్ళకున్న నమ్మకం చూసి నాకు చాలా భయంవేసేది. ఒళ్లు దగ్గరపెట్టుకొని చదివేవాడిని. అదృష్టవశాత్తూ, నా చదువు బాగా సాగింది. ఐఐటికి సెలెక్ట్ అవ్వాలనే నా ఆశయం సాధించుకోగలిగాను. ఊళ్లో అందరు నన్ను పొగుడుతుంటే, మొదటి సారి నాయన మొహంలో సంతోషం చూశాను. ఇన్ని సంవత్సరాలు పడిన కష్టానికి ఫలితం దక్కిందని ఇంట్లో అందరూ సంబరపడ్డారు.

చదువు పూర్తికాగానే, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం, అమెరికా వెళ్ళే ఛాన్సు, ‘మంచి కుర్రవాడు’, ‘ప్రయోజకుడు’ అన్న ముద్రలు వెంటవెంటనే వచ్చేశాయి. వాటితోపాటూ పెళ్ళిసంబంధాలు కూడా వచ్చాయి. అంతవరకూ చదువు, ఉద్యోగం గురించి మాత్రమే ఆలోచించిన నాకు, విషయం పూర్తిగా గ్రహింపుకొచ్చేలోపే పెళ్ళి కుదిరిపోయింది. అమ్మాయి తండ్రి మా నాయన ఆఫీసులో ఎమ్మార్వోగా పనిచేసి రిటైరయ్యారు. ఒకటే కూతురు. మా నాయన ఆనందానికి అంతు లేకుండా పోయింది. తనకంటే ఎన్నోమెట్ల పైన పనిచేసిన ఆఫీసరు, తనకు వియ్యంకుడవ్వడం అతిపెద్ద గౌరవం అనుకున్నాడు. ఈ పెళ్ళి తాము పడ్డ కష్టాలకు తగిన ఫలితం అనుకున్నారు మా ఇంట్లోవాళ్ళు. బహుశా, నా పెళ్ళి వలన మా కుటుంబపు సామాజిక స్థాయి పైకెగబాకుతుందనే ఆశ కూడా ఒక కారణం కావచ్చు. మావాళ్ళ ఆనందాన్ని కాదనలేక, పెళ్ళి గురించి నాకు అప్పటికీ నిర్ధుష్టమైన అభిప్రాయమేమీ లేకపోవడం వలన, నానుంచి ఎటువంటి వ్యతిరేకత లేకపోయింది. పెళ్లి తరువాత వెంటనే అమెరికా వెళ్ళిపోయాము.

ఇండియాకు తిరిగి వచ్చాక కానీ నాకు ఈ సంబంధంలోని డొల్లతనం తెలియరాలేదు. నేను ఒక బంగారు పంజరంలో బందీనయ్యానని అర్ధమయ్యింది. ఒకటే కూతురు కావడం వలన, అత్తామామల పూర్తి ఫోకస్ మా మీదకు మారిపోయింది. నేను పూర్తిగా రియలైజ్ అయ్యేలోపే నా జీవితపు పగ్గాలు నా చేతుల్లోంచి జారిపోయాయి. నాకూ, నా కుటుంబానికీ మధ్య గోడ కట్టబడింది. అన్నిటికన్నా బాధ కలిగించిన విషయమేమిటంటే, మా నాయన అటెండరు హోదా నా ఇంట్లో కూడా కొనసాగింపబడింది! ఆయనకు జరుగుతున్న అవమానాన్ని సహించలేకపోయేవాడిని. అడిగితే, అవి గొడవలకు దారితీసేవి. దాంతో, నా అమ్మానాన్నలు, అక్కలు నా ఇంటికి రావడానికే భయపడే పరిస్థితి వచ్చింది.”

హరిప్రసాదు గొంతులో వణుకు తెలుస్తోంది. కాఫీ త్రాగుతూ సంబాళించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

“దీనిని ఎలా చక్కదిద్దాలో తెలీక, నలిగిపోతున్న సమయంలో మీరు మీ గానుగెద్దు కల గురించి చెప్పారు. మీకు గుర్తుండే వుంటుంది. ఆరోజు చివరిసారి మనం కలిసి ఇంటికి ప్రయాణిస్తున్నప్పుడు, మన మధ్య గానుగెద్దు ప్రస్తావన వచ్చింది. మీరు మీ కల గురించి చెప్పారు. దాంట్లో నా సమస్యకు పరిష్కారం దొరికింది!”

ఇంత సీరియస్ విషయంలో అసంబద్ధమైన నా కల ప్రస్తావన రావడంతో ఉలిక్కిపడ్డాను.

“గానుగెద్దుకు మల్లే, ఏమౌతుందోనన్న భయం, తిరగబడాలన్న ఆలోచన రాకపోవడం నా బలహీనత. అబ్బులుగాడికి మల్లే నా భార్య, అత్తమామలకు కావలసింది నేను కాదు, నా ఉద్యోగం, సంపాదన, హోదా. అవి లేని నాడు నాకు ఏ మాత్రం విలువ ఉండదు. ఈ క్లారిటీ వచ్చేశాక వెంటనే నా ఉద్యోగానికి రిజైన్ చేసేశాను. ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నానని, నచ్చితే నాతో రావచ్చని నా భార్యతో చెప్పాను. మొదట నేను చేసిన పనితో షాకయ్యారు. తరువాత నన్ను, నా వాళ్ళను తిట్టిపోశారు. ఊళ్ళో పంచాయితీ పెట్టారు. తప్పును అంగీకరించడం పోయి, తప్పంతా నాదేనని ఆడిపోసుకున్నారు. విడిపోవలసి వస్తుందని భయపెట్టారు. పాపను చూడలేనని బెదిరించారు. నేను తొణకలేదు. మా వాళ్ళు కూడా, ఎక్కడ నా జీవితం నాశనమైపోతుందోనని నాకు నచ్చచెప్పాలని చూశారు. ఒకసారి భయం పోయిన తరువాత, అన్ని సమస్యలూ చిన్నవిగానే కనిపించాయి. నేను మొండిగా ఎవరి మాట వినలేదు. చివరకు తనే నాకు విడాకులిచ్చింది. ఇవన్నీ జరగడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పట్టింది. ఆ తరువాత మళ్ళీ ఉద్యోగంలో చేరాను. ముక్కలైన స్వప్నాలను ఏరుకుంటూ, కొత్త కలలు కనడానికి కావలసిన ధైర్యాన్ని కూడతీసుకుంటూ, ఎక్కడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కుంటూ, ఇలా తిరుగుతున్నాను.”

తన మొహంలో కాస్త తెరిపి కనపడింది. బహుశా, నాకు చెప్పే ప్రయత్నంలో తన గుండెబరువు కాస్త దించుకున్నాడు కాబోలు.

“మళ్ళీ పెళ్ళి, పిల్లలు అని ఆలోచించే ధైర్యం కూడా లేదు. నా పాప గుర్తుకొచ్చినప్పుడల్లా గిల్టీ ఫీలింగుతో చచ్చిపోవాలనిపిస్తుంది. తన తప్పేమీ లేకపోయినా, కేవలం మాకు పుట్టినందుకు తను కూడా శిక్షింపబడింది. బహుశా ఈ విధంగా నన్ను శిక్షించడంలో నా భార్య, అత్తామామలు విజయం సాధించారు. కానీ, నిత్యం దెబ్బలాడుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకునే తల్లిదండ్రులమధ్య పెరగడంకంటే, తండ్రి లేడనుకుంటూ పెరగడమే మంచిదని నాకు నేను సర్దిచెప్పుకుంటాను. ఇకపోతే, ఇంతకుముందు మీకు పరిచయం చేసిన ప్రియాంక, నాకు డాలస్‌లో పరిచయమైంది. బెంగాలీ అమ్మాయి. పెళ్ళిగురించి తనకూ దాదాపు నా లాంటి అనుభవమూను, అభిప్రాయమూను. ఒక సంవత్సరం నుంచి కలసి ఉంటున్నాము. పెళ్ళి చేసుకునే ఆలోచనైతే ప్రస్తుతానికి లేదు. ముందు ముందు ఏమౌతుందో తెలియదు. ఇదీ జరిగిన కథ. ఇందులో నేను గెలిచానో, లేదో తెలియదు. కానీ ఓడిపోలేదన్న నమ్మకం మాత్రం ఉంది.”

చెప్పడం ఆపి, నాకళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో నాకు తన భవిష్యత్తు మీద తనకున్న ఆశ, నమ్మకం కనిపించాయి.

లేచి గట్టిగా, మనస్పూర్తిగా హత్తుకున్నాను. నా అభినందన తనకర్ధమైందనుకుంటా, “థ్యాంక్యూ గురువుగారూ!” అంటూ నా చెయ్యి నొక్కి పట్టుకున్నాడు.

“మొత్తానికి గానుగెద్దు తిరగబడటం చూడగలిగానోయ్!”

నా మాటలకు గట్టిగా నవ్వేశాడు. ఆ నవ్వులో నాకు పరిచయమున్న హరిప్రసాదు మళ్ళీ కనపడ్డాడు!
---------------------------------------------------------
రచన: గిరీష్ కె., 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment