Wednesday, January 16, 2019

చీకట్లో సన్మానం


చీకట్లో సన్మానం




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...........

చంటిగాడూ, నేనూ చిన్నప్పటినుంచీ నేను అమెరికా వచ్చేదాకా, ఇంచుమించు, కలిసి పాఠాలు నేర్చుకున్నాం, కానీ కలిసి చదువుకో లేదు. ఎందుకంటే వాడు చదివితే, నేను వినేవాణ్ణి. నేను పాఠం చదివితే వాడు ఆకాశం కేసి చూస్తూ పాఠం వినేవాడు. మా combined studies  అలా మూడు సీసాలూ, ఆరు గళాసులుగ మమ్మల్ని ప్రాణ మిత్రుల్ని చేసింది. పైగా నాకూ, వాడికీ నవాబ్‌ ఆఫ్‌ పటౌడీ, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్‌ వి. రంగారావు, రేలంగీ అంటే చాలా ఇష్టం. హిందీ భాష, హిందీ సినిమాలు వగైరాలంటే ఇష్టమున్న తెలుగు వాళ్ళని చూస్తే వాళ్లందరూ దేశద్రోహుల కిందే లెఖ్ఖ. ఆ రోజుల్లో నార్త్‌ ఇండియన్స్‌ అంటే కోస్తా జిల్లా కుర్రకారుల అభిప్రాయం అది.

నాకూ, చంటిగాడికీ ఒక్కటే విషయంలో చిన్నప్పటినుంచి ఏకాభిప్రాయం లేదు. అదే… చీకటి… వాడికి చీకటి అంటే ప్రాణ భయం. ఎప్పుడైనా లైట్లు ఆరిపోతే… అంటే ఆ రోజుల్లో కనీసం ప్రతి రాత్రికీ ఒకటి, రెండు సార్లు అన్నమాట, లైట్లు ఆరిపోగానే వాడు అరక్షణంలో అరవై అడుగులు గాలిలోకి ఎగిరి, క్రింద పడి అదో రకమైన, విచిత్రమైన గావుకేక పెట్టే వాడు. ఆధునిక శాస్త్రజ్ఞులు genetic engineering తో పిల్లి మొహం, కుక్క తోక మరియు అడ్డ గాడిదల గొంతుక కలిసి తయారు చేసిన వింత జంతువు అరుపు అలా ఉంటుంది… వాడి గావు కేక.. నా మటుకు నాకు చీకటి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చంద్రుడు,
నక్షత్రాలు చాలా అందంగా ఉంటాయి. హాయిగా లాహిరి లాహిరి లాహిరిలో పాట, అందాల చందమామ, రావోయి చంద మామ లాంటి సినిమా పాటలు పాడుకోవచ్చు. అప్పటికింకా ప్రేయసితో చీకటిలో వెన్నెల రాత్రుల వెచ్చదనంలో అనుభవం లేదు… ఇప్పటి సంగతి చెప్పను గాక చెప్పను.

పెళ్ళాం, పిల్లలతో ఇండియా వెళ్ళడం ఈ జన్మకి ఇక కుదరదని నిశ్చయం చేసుకొని, అమ్మని చూడాలని అనిపించి, ఇండియా బయలు దేరాను. R. R. Travel  అధినేత రాణి గారి ధర్మమా అని తక్కువ ఖరీదులో టిక్కెట్టు కొనుక్కొని చెన్నై  air port లో అర్ధరాత్రి దిగాను. ఇది వరకు Bombay, Madras  అనే పేర్లు ఉన్నప్పుడు, అన్నప్పుడు, ఏదో అసలు సిసలు ఇంగ్లీషువాడు, లేదా అమెరికా వాడిలా మాట్లాడుతున్న ఫీలింగు ఉండేది. ఇప్పుడు ముంబై, చెన్నై అంటుంటే త్తౖతె, ధ్తిౖతె అంటున్న బృహన్నలలాటి dance మాస్టారులా వంకర టింకర తిరిగిపోతున్న ఫీలింగు వస్తోంది. సరే… చెన్న పట్నం అదే Madras , అదే చెన్నైలో దిగి … రెండు డజన్ల ఇడ్లీలు, మూడు బాల్చీలు సాంబారు కొట్టేసి, ఒక విపరీతమైన express  రైలు, కోణార్కో, కోరమాండలో, ఏదైతేనేం అందులో సామర్లకోట జంక్షన్‌లో దిగాను. మా ఊరు కాకినాడ. రైలు ఆగగానే సామర్లకోట platform  మీద కోలాహలం చూసి ఎవరో మినిస్టర్‌ గారి బావమరది దిగుతున్నాడో, ఎక్కుతున్నాడో అనుకున్నాను. కానీ, ఆశ్చర్యం ఏమిటంటే, ఆ కోలాహలం జనాభా ఇంచుమించు వంద మందిలో పదిమంది మా కుటుంబం వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ దండలూ, డప్పులూ, నమస్కార బాణాలు,సాష్ట్టాంగ ప్రణామాలు లాటి సరంజామా పట్టుకున్న జనం. ఆ జనంలో నాకు ఎవ్వళ్ళూ తెలీదు. నా మొహంచూడగానే, మా బంధువుల్ని పక్కకి లాగేసి ” ఆహా! హ్యూస్టన్‌ రాజుగారూ, ఓహో,  హ్యూస్టన్‌ రాజుగారూ” అంటూ నన్నూ, నా సామాన్లనీ ఆ రైలు ఆగే అర క్షణంలో platform మీదకి ఎంతో మర్యాదగా విసిరేశారు…. చెప్పొద్దూ… నాకు అర్జెంటుగా “నేను NTR  లాంటి వాణ్ణి జనాలకి, అంటే అందరకీ NTR తెలుసు, కానీ NTR కి వాళ్ళెవరూ తెలియదు” లాంటి feelings  అన్నమాట అలాంటి feeling వచ్చేసింది. ఎప్పటి లాగానే శివరాం కూడా station కి వచ్చి, మా అందరితోటీ ఇంటికొచ్చాడు.

రైలు స్టేషన్‌ నించి ఇంటికి వెళ్ళి అందరితోటీ కులాసాగా మాట్లాడుతుండగా ఫోన్‌ మోగింది. ఇంత సేపూ అలా స్టేషన్‌కి వచ్చి ఎంతో ప్రేమగా పలకరించి స్వాగతం చెప్పిన వాళ్లంతా ఎవరూ, అసలు నేను గానీ, నేను వస్తున్నట్టుగానీ ఎలా తెలుసు అని అమ్మని, మిగిలిన వాళ్లనీ అడగబోతున్న నేను ఫోన్‌ తీసుకొన్నాను.  ” ఇంకా పూర్తిగా వచ్చావో లేదో అప్పుడే వెధవ ఫ్రెండ్స్‌.. ఒక్క క్షణం మాట్లాడుకోనివ్వరు” అని విసుక్కుంటూ ఫోన్‌ నాకు ఇచ్చింది అమ్మ.

” నమస్కారం సార్‌”
“నమస్కారం, ఎవరండీ”
“నేనూ, ఆచారినండీ”
“ఏ ఆచారండీ”
“చిన్నప్పుడు మీ వెనకాల వీధిలో ఉండే వాణ్ణండీ, ఇప్పుడూ అక్కడే లెండి. మీరు inter college cricket  టొర్నమెంట్‌లో రంగరాయ మెడికల్‌ కాలేజీలో ఆడిన match లో half-century  కొట్టినపుడు తప్పట్లు కొడుతూ, హుర్రే, హుర్రే అని అరిచిన వాడిని నేనే … మీకు జ్ఞాపకం ఉందో లేదో”
” ఆ! ఆచారి గారా! ఓహో! అంటే ఏ ఆచారి గారూ?” అన్నాను ఎక్కడా tube light  వెలక్క.
“అదేనండీ పొట్టి శ్రీరాములు గారు సత్యాగ్రహం చేసి పోయినపుడు మీ వీధి గోడమీద కాలేజీ కుర్రాళ్ళు strike  చేస్తూ సి. ఆర్‌ చావాలి అని మద్రాసు ముఖ్య మంత్రి సి. రాజగోపాలాచారి గారి గురించి బొగ్గుతో రాస్తే అది మీ గురించే అంటే మీ పేరు కూడా సి.ఆర్‌ అంటే చిట్టెన్‌ రాజు కదా… అది మీ గురించే అనుకొని వారం రోజులు భోజనం మానేశారు, జ్ఞాపకం ఉందా… అప్పుడు నేను కూడా మీతో బాటు పస్తులు ఉన్నాను..”
” ఆ! అవునవును.. జ్ఞాపకం వస్తోంది.. అదే . ఇప్పుడే కదా నాలుగు రోజులు ప్రయాణం చేసి వచ్చానూ.. కొంచెం జెట్‌లాగ్‌ మూలాన” అన్నాను. నా గురించి ఇన్ని వివరాలు తెలిసిన ఆచారి మొహం ఎలా ఉంటుందో అని ఊహించుకోటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ.
“… అదే లెండి మీకెలా జ్ఞాపకం ఉంటుందీ. అమెరికాలో అన్నేళ్ళనుంచి ఉంటూ, మీరు మన దేశానికి, సంస్కృతికి ఎంతో సేవ చేస్తున్నారు కదా… అందుకు మీకు పెర్సనల్‌గా thanks  చెబ్దామని పిలుస్తున్నాను.” అన్నాడు ఆచారి.
” ఓ.. అలాగా, చాలా thanks  అండీ…” అన్నాను మొహం వెధవలా పెట్టి… ఎందుకంటే అసలు ఆచారి ఎవడో, నా చిన్నప్పటి సంగతులు అంతగా తెలిసిన వాడు నా కెందుకు జ్ఞాపకం రావడం లేదో… అంతకన్నా ముఖ్యం మా ఇంటా వంటా లేని దేశసేవ, సాంస్కృతిక సేవా లాటి యూస్‌లెస్‌ పనులు నేను అమెరికాలో చెయ్యడం ఏమిటో తలా,తోకా తెలియక…
” అవునండీ… అందుకే… మీకు కృతజ్ఞతా పూర్వకంగా అందరం కలసి ఇవాళ రాత్రి మీకు ఒక చిన్న సన్మానం… చిన్న ఏమిటిలెండి… పెద్ద సన్మానమే తల పెట్టాం”
” నాకా, సన్మానమా… అంటే” …. నాకు గొంతు గట్టిగా పెగలలేదు కాని… కళ్ళు పెద్దవయ్యాయి. ఇందాకా అనుకోకుండా పెట్టిన వెధవ మొహం రేలంగి జోకులకి నవ్వుతున్న మొహంలా మారి పోయింది, కాలరు నిక్క బొడుచుకొంది… ఆచారి మీద అభిమానం పుట్టుకొచ్చింది….  ఎంతయినా సన్మానం కదా!
” ఏమిట్రా, ఇంకా ఇంట్లో పూర్తిగా కాలు పెట్టలేదు … అప్పుడే ఆ వెధవ ఎవడో సాయంత్రం రమ్మంటే ఇప్పుడే వెళ్ళేలా ఉన్నావే నీ మొహం చూస్తేనూ” అంటోంది అమ్మ చీపురు కట్టకోసం వెతుకుతూ.
” ఆ, అలాగే తప్పకుండానూ… ఎన్నింటికీ? ఎక్కడా?” అడిగాను.. వెనకాల అమ్మ తిడుతున్న తిట్లు అప్పుడే మూడు పేజీలు దాటి పోయాయి.
” అలాగే ఆచారి గారూ! సాయంత్రం ఏడు గంటలకి రెడీగా ఉంటాను మీరు వస్తానంటే” అంటూన్న నా చేతిలోంచి ఫోన్‌ ఠప్పున లాగేసుకొని.. “ఆచారీ! నేను శివరాంని… వీణ్ణి నేను నా కారులో తీసుకొస్తాను.. మీరు రావక్కర్లేదు” అని ఇంకా ఠప్పున ఫోన్‌ పెట్టేశాడు శివరాం.
” నువ్వు ఉట్టి వెర్రి వెధవ్విరా! దేశ కాల పరిస్థితులు ఎంతమాత్రం తెలియవు” అన్నాడు నన్ను చూసి జాలిగా నవ్వి… గత అరగంటనించీ నా ఫోన్‌ రామాయణం, మా అమ్మ భారతం పూర్తిగా విన్న శివరాం.

నేను సన్మానం కోసమని ప్రత్యేకంగా కాస్త ఎక్కువ పౌడరు, సెంటూ వగైరాలు రాసుకొని అన్నట్టుగానే శివరాం కారులో ఆచారి గారి ఆడిటోరియం చేరుకొన్నాం. గోగినేని చౌదరి మరియు చౌదరీ మణి గారు కట్టించిన వేదిక మీద నాలుగు భోజరాజు సింహాసనాలు,పొడుగాటి బల్ల మీద తెల్ల దుప్పటీ, దానికి చుట్టూ బంగారు అంచు, అగరొత్తులు వగైరా సన్మాన సామాగ్రి … నేనూ, శివరాం వెళ్ళగానే అర్జంటుగావచ్చి నన్ను కావలించుకొని, శివరాంని కారు డ్రైవరుని చూచినట్టుగా చూసిన ఆసామీ ఆచారి అని తెలిసిపోయింది. ఆ మేష్టారి చిన్నప్పటి మొహంకాని, ఇప్పటి ముసలి మొహం కాని ఎక్కడా చూసిన జ్ఞాపకం లేదు… సరే!

ఎవడైతేనేం సన్మానం జరిపిస్తున్నాడుకదా … అనుకొంటూండగానే తండోప తండాలుగా జనం, కిళ్ళీలు నవుల్తూ, సిగరెట్లు, బీడీలు కాల్చుకొంటూ వాళ్ళ తాలూకు ఆడంగుల్తో మొత్తం మూడు వందల మంది వచ్చి నాకు నమస్కారం తగలేసి ఎవరి కుర్చీ వాళ్ళు వేసుకొని కూర్చొన్నారు. అర్జంటుగా ఒక ఆడ అనాచారి …  ఆచారి భార్య అనుకొంటాను … మైకు ముందుకు వెళ్ళి నన్నూ, స్థానిక అసెంబ్లీ సుభ్యుడు గారినీ, జిల్లా కలెక్టరి గారిని represent  చేస్తూ వారి పి. యే. ని … ఇలా అందరినీ వేదిక మీదకి ఆహ్వానించారు. నాకు ఒక్కడికీ N.T.R. కి వేసే పెద్ద పెద్ద బంతి పూవులు, మల్లె పూవులు, కనకాంబరాలు గుచ్చిన ఆరడుగుల బరువైన దండ, మిగిలిన వారికి బావుండదని పుష్ప గుచ్ఛాలు సమర్పించారు … నేను మహదానందపడుతూ హాలు చుట్టూ చూశాను. గోడలమీద చిన్న దేవుడి ఫొటోలు, వాటికి మధ్యలో పెద్ద పెద్ద అక్షరాలతో దాతల పేర్లు, వాళ్ళిచ్చిన విరాళాల మొత్తం కనబడుతున్నాయి. ఆ పేర్లలో చౌదరి, రెడ్డి నాయుడు, గుప్తా, శెట్టి వగైరా పేర్లు కనపడ్డాయి కాని ఎక్కడా శాస్త్రి, శర్మ, దీక్షితులు కనపడ లేదు. మొట్ట మొదటి వరసలో కూర్చున్న శివరాం నాకేసి జాలిగా చూస్తున్నాడు. అసెంబ్లీ సభ్యుడు గారు ప్రసంగం మొదలు పెట్టి, హఠాత్తుగా నా పేరు తెలియక తడబడుతుంటే హ్యూస్టన్‌ రాజు గారు,ఎన్నారై, అమెరికా అని అనాచారి, ఆచారి  నేను వినడం లేదనుకొని ఆయనకి నా క్వాలిఫికేషన్సు అర్జెంటుగా వివరించారు. ఆయన పుంజుకొని అమెరికా సామ్రాజ్యానికి మహా రాజువి, చక్రవర్తివీ, హ్యూస్టన్‌కి సామంతుడివీ అని నన్ను పొగిడి … మహా దాతలైన బలి, కర్ణుడూ మొదలైన పురాణ పురుషులతో నన్ను పోల్చి సభకి విశదీకరించారు. ఈ పోర్షను, సంభాషణలూ ఆయనకి చాలా బ్రహ్మండంగా వచ్చాయి సుమా అని అనిపించి నా తలకాయలో “విరాళం సుమా!” అన్న మాట వెల్గగానే శివరాం కేసి చూసాను. వాడింకా అలాగే నవ్వుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా హాలు వెనకాల ఒక మూల నుంచి పెద్ద చప్పుడు, గావు కేక  నాకు కర్ణాకర్ణిగా వినపడింది, అసెంబ్లీ సభ్యుడు గారు మైకు ఆగిపోగానే ఆటోమేటిక్‌గా గొంతుక  సౌన్డ్‌ లెవెల్‌ విపరీతంగా పెంచెయ్యడంతో.

” మధ్యలో ఈయనొకడు, ప్రాణం తీస్తున్నాడు కరెంటు పోయినప్పుడల్లా” అని ఎవరో విసుక్కొన్నారు ఆ చీకట్లో ..
నేను లేవబోతుంటే కలెక్టర్‌ గారి పి. యే. గారి భారీ హస్తం, ఆచారి, అనాచారి వాళ్ళ అవయవాలు .. ఏ అవయవాలో తెలియలేదు ఆ చీకట్లో .. నా శరీరం మీద పడి నన్ను లేవనీయకుండా చేశాయి … ఆడియన్సు కాని, ఆహ్వానితులు కాని ఏమీ జరగ నట్టుగానే సన్మాన కార్యక్రమం కొన సాగించారు. అర్జెంటుగా నాలుగు పెట్రుమాక్సు లైట్లు వెలిగించి.

ఆచారి కాలయాపన చెయ్యకుండా విజృంభించి, ఎంత విరాళానికి ఎంత పుణ్యమో విశదీకరిస్తూ కేవలం పాతికవేల రూపాయలకి మా తండ్రిగారి ఆత్మ పూర్తిగా శాంతిస్తుందని పురాణాల్లో రాసి ఉందని నాలుగు
సంస్కృతంలో శ్లోకాలు చదివి, తెలుగులోనూ, నాకు అర్ధం అవలేదేమో అని తెలుగుఇంగ్లీషులోనూ వివరించారు. మా తండ్రిగారు చనిపోయి 15 సంవత్సరాలు అయింది. నా పాతికవేల విరాళం గురించి మా నాన్నగారు ఇంకా కాసుక్కూర్చొన్నారని వినగానే నాకు విరాళం tubelight  మళ్ళీ వెలిగింది, నేను మళ్ళీ లేవబోతుండగా. అనాచారిగారు … అంటే ఇందాకటి ఆచారి గారి భార్య, ఎంతో విలాసంగా, ప్రేమ పూరితమైన కళ్ళతో … ఆచారి మీద కాదు ఆ విరహం, విరాళ దాహంతో … నా మీద, సౌందర్య చిరంజీవికేసి నిజంగానూ, మోహిని భస్మాసురుడు కేసి అబద్ధంగానూ చూసినట్టు చూస్తూ, పైలెట్‌ పెన్ను మూత తీసి, నాకేసి రాబోతుండగా చూశాను. అప్రయత్నంగా, దైవ ప్రేరణ వలన నా రెండు అరి చేతులూ చొక్కా జేబూ, పంట్లాం వెనకాల జేబు కేసి పారిపోయి, నా చెక్కు బుక్కుగాని, వాలెట్‌ గాని ఎవరికీ కనబడకుండా గట్టిగా నొక్కేసాయి.

ఆ చీకట్లో నాకు జ్ఞానోదయం అయ్యేటప్పటికి శివరాం గాడు వాన చినుకుల్లో నకులుడిలా నన్ను ఆచారి, అనాచారి, అసెంబ్లీ సభ్యుడు, కలెక్టర్‌ పి. యే. మరియు మూడు వందల మంది కిళ్ళీ, సిగరెట్‌ బీడీ వాళ్ళ మధ్య నుంచి వాడి get-away  కారులోకి తోసేసి సన్మాన రక్షక భటుడి బిరుదు సంపాయించాడు.
” ఏమిటి గురూ, ఇదంతానూ … What is this garbage ” అన్నాను శివరాంతో ఇంటికొస్తూ దారిలో.
“ఏమిటేమిట్రా, నీ తలకాయ. నిరుద్యోగ సమస్య తీరడానికి మన వాళ్ళు మొదలు పెట్టిన మరో పద్ధతి. చిన్నదో, పెద్దదో సంఘసేవకి, సాహిత్య సేవకో, దీనికో, దానికో ఒక సంఘం పెట్టడం, దాన్ని నడపడానికి, తమ కుటుంబం నడవడానికి డబ్బుకోసం, విరాళాలు పోగు చెయ్యడం … ముఖ్యంగా నీ బోటి ఎన్నారై గాళ్ళ దగ్గర్నుంచి …”

” ఆ పోదూ, నువ్వు మరీనూ ఆచారీ వాళ్ళూ ఏమీ చెయ్యకపోతే అంతమంది జనం, అసెంబ్లీ సభ్యుడూ అందరూ వస్తారేమిటి?  … అది సరే నా గురించి వాళ్ళకి అన్ని వివరాలు ఎలా తెలిసాయి చెప్మా” … నా మనసులో ఇంకా ఆశ చావ లేదు. నేను నిజంగా గొప్పవాణ్ణి కాబట్టి నాకు వాళ్ళు సన్మానం ఏర్పాటు చేశారని …

” దాని కేముంది, నువ్వు మమ్మల్ని విరాళం అడక్కుండా ఉంటే … మీరు ఎన్నారైల దగ్గర్నుంచి డొనేషన్‌ల కోసం ఏర్పాటు చేసే అన్ని సన్మాన సభలకు వచ్చి తప్పట్లు కొడతాం అని కిళ్ళీ, సిగరెట్‌ గాళ్ళూ, ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడూ వస్తాడని అసెంబ్లీ సభ్యుడూ వగైరాలూ ఆచారి, వాడి బాసుతో చేసుకొన్న లోపాయకారీ ఒప్పందం ” శివరాం విశదీకరించాడు.

” కానీ … ఈ ఆచారిగాడు ఎవరో నాకు చచ్చినా జ్ఞాపకం రావడం లేదు … చిన్నప్పటి friend  అంటాడు … కానీ ఏమండీ, సార్‌ అని పిలుస్తాడు …  I still do not understand what is going on … ”
ఇది వినగానే శివరాం వికటాట్టహాసం చేశాడు.
“ఏమిట్రా వెధవా! ఏమిటా నవ్వు, చెప్పి చావు ” అన్నాను.
” ఆ ఆచారి గాడికి నువ్వు ఎవరో అస్సలు తెలియదు. నువ్వు, నాకు తెలిసి వాడి మొహం ఎప్పుడూ చూడాలేదు.”
” … మరి వాడు నా గురించి అంతా తెలిసున్నట్టు మాట్లాడుతున్నాడే?”
” వాడికి, అంటే ఆచారికి, నీ information  అంతా వాడి దగ్గర్నుంచి వచ్చింది ” అంటుండగా
” వెర్రి నాయనా! సన్మానం మధ్యలో కరెంటు పోయినప్పుడు ” శివరాం గుంభనంగా అన్నాడు.

నా బుర్ర అద్భుతంగా అర్జంటుగా వెయ్యివాట్ల బల్బులా వెలిగింది  …
“అవున్రా, ఆ చప్పుడు, ఆ విచిత్రమైన గావుకేక …. వాడే”
” ఈ తతంగానికీ, ఈ సంఘానికీ, ఈ సన్మానానికీ మూలపురుషుడు … వాడే … వాడే చాణుక్యుడు … చీకట్లో కూడా నన్ను సన్మానించిన అస్మదీయుడు … ఆప్తమిత్రుడు ” స్వయానా నా మేనత్త కొడుకు …. సామర్లకోట స్టేషన్‌కి, దండలూ వగైరాలు పట్టుకొచ్చిన వాళ్ళందరూ  అస్మదీయులు … పుణ్యం, పురుషార్ధం దక్కే గౌరవప్రదమైన ఉద్యోగస్తుడు వాడు.

“ఏదిరా వాళ్ళు వేసిన దండ పట్టుకు రాలేదేం? ఇంట్లో అందరికీ తల్లో పూలు వచ్చేవి.” అంది అమ్మ. చెవిలో పూవు అనే మాటకి అమ్మకి అర్ధం తెలియదు.

సంగతి అంతా విని ” అదా సంగతి. మొన్ననే చంటి వచ్చి, నువ్వెప్పుడు వస్తున్నావు, ఏమిటి అని అన్ని వివరాలు అడిగాడు. ఇందుకా … నీ దగ్గర విరాళం కోసం అని చెప్తే నేనే చెప్పేదాన్నిగా. నువ్వూ, మన శర్మలూ, శాస్త్రులు గాళ్ళందరికీ యుగ యుగాల నుంచీ పుచ్చుకోడమే గానీ ఇవ్వటం ఇంటా వంటా లేదని” అంది అమ్మ డబ్భై సంవత్సరాల అనుభవంతో … అందులోనూ నువ్వు మరీ కక్కుర్తి వెధవ్వి … అని ఇంకా ఏదో అనబోతుంటే లైట్లు వెలిగాయి… అమ్మ నాకు చేసే సన్మానం ఎప్పుడూ వెలుగులోనే…
----------------------------------------------------------
రచన: వంగూరి చిట్టెన్‌ రాజు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment