Sunday, January 27, 2019

గాంధీ అభిమాని


గాంధీ అభిమాని

సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి...............
ఆ శనివారం, మార్చి 8న అర్ధరాత్రికింకా పన్నెండు మిమిషాలుంది. ఆ రోజు జరిగిన హాకీ మ్యాచ్ వివరాలను రేడియోలో వింటున్నాడతను. కాసేపట్లో టి.వి.లో ‘గాంధీ’ సినిమా రాబోతోంది. ఆ సినిమా చూస్తూ తాగడం కోసం అతను వంటింట్లో చాక్లెట్ డ్రింక్ కలుపుకుంటున్నాడు. ఇంతలో హఠాత్తుగా రేడియోలో ఓ ప్రకటన వెలువడింది. దాన్ని వింటూనే అతడి నోట్లోంచి ఒక శాపనార్థం వచ్చింది.

బాంబు దాడులకి కనీసం ఓ చిన్న నిట్టూర్పు కూడా అతనినుంచి రాదు. వేర్వేరు తెగల మధ్య గొడవలు, గుంపు హత్యలు, క్రూరమైన ఆచారాలలానే బాంబు దాడులు కూడా రోజూవారీ వార్తలలో సర్వసాధారణమైపోయాయి. మాంట్రియల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగి దాదాపుగా మూడువందల మంది చనిపోయినప్పుడు కూడా అతను అంతగా చలించలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి, విమానయాన చరిత్రలో ఎక్కువ ప్రమాదాలు జరిగిన సంవత్సరాలలో ఒకటిగా ఈ ఏడాది అప్పుడే పేరు సంపాదించేసింది. కానీ, ఇప్పుడీ రేడియో ప్రకటన – ‘ఓ-పాజిటివ్’ గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తులను తక్షణం సెయింట్ ల్యూక్ ఆసుపత్రికి రమ్మని ప్రాధేయపడుతూ – అతన్ని వ్యక్తిగతంగా బాధ్యుణ్ణి చేసింది. అతనిది ఓ-పాజిటివ్ గ్రూప్ రక్తమే; పైగా సెయింట్ ల్యూక్ ఆసుపత్రి అతనుండే అపార్ట్‌మెంట్ నుంచి పది నిముషాలు, అంతే.

అతను రేడియో కట్టేశాడు. “గాంధీ ఎంతగొప్పవాడైనా సరే, కానీ అవతల ఓ మనిషి ప్రాణం నేనివ్వబోయే కొద్దిపాటి రక్తంపై ఆధారపడి ఉన్నప్పుడు, ఓ చనిపోయిన వ్యక్తి గొప్పతనాన్ని టీవీలో చూడ్డం కోసం నేనాగలేను. చాక్లెట్ డ్రింక్ తాగేసి, తయారై ఆసుపత్రికి వెళ్లిపోతాను.” అని అనుకున్నాడు.

చాక్లెట్ డ్రింక్‌ని కప్పులోకి వంపుకున్నాడు.

చాక్లెట్ డ్రింక్ చాలా వేడిగా ఉంది. చల్లార్చేందుకు దానిపై నోటితో ఊదుతూ వంటింటి కిటికీలోంచి బైటికి చూశాడు. కిటికీ అవతల దాదాపుగా మూడంతస్తుల ఎత్తు పెరిగి, ఆకులు రాలిపోయిన మేపుల్ చెట్టు గాలికి ఊగడం చూసి అతని ఒళ్ళు జలదరించింది. బైట కురుస్తున్న మంచు రోడ్డు పక్కగా నిలిపి ఉంచిన అతని కారు చుట్టూ తెరలు తెరలుగా సుళ్ళు తిరుగుతోంది.

“కార్ బ్రేక్ డౌన్ అవకుండా ఉంటే బావుండు” అనుకున్నాడతను. ఎక్కువగా ప్రయాణాలు చేసే ఓ సేల్స్‌మాన్‌ షికాగో నుంచి బయల్దేరి వెడుతుండగా అతని కారు హైవే మీద పాడైపోయి మంచు తుపానులో నిల్చిపోయిన దారుణ సంఘటన అతనికి గుర్తొచ్చింది. ఆ రోడ్డు మీదుగా వెళ్ళేవారెవరైనా ఆగి సాయం చేస్తారేమోనని ఆ సేల్స్‌మాన్‌ దాదాపుగా మూడు గంటలు వేచి చూశాడు. కానీ ఎవరూ ఆగలేదు. నిరాశతోనూ, చలికి సగం గడ్డ కట్టుకుపోయీ అతను తన కార్లో ఎక్కి కూర్చుని, తన సహోద్యోగులకి ఒక చిన్న వీడ్కోలు ఉత్తరం మనసుకు తాకేట్టుగా రాసి నోటిలో తుపాకీ పెట్టుకుని కాల్చుకున్నాడు.

“ఇటువంటి సంఘటనలు పెద్ద నగరంలో జరగవు, ప్రతీ వీధి మూలన పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉంటుంది కదా,” అని అనుకున్నాడు.

అంతలోనే: “ఈ మాంట్రియల్ ఎలా పెరిగిపోయిందంటే, ఎవరైనా సాయం చేయడానికి వస్తే వాళ్ళెలాంటివాళ్ళో అని భయం పుడుతుంది, ధైర్యం రావడానికి బదులుగా!”

అలా అనుకోడానికి కారణం అతని అపార్ట్‌మెంట్‌కి కొన్ని బ్లాక్‌ల అవతలే జరిగింది. ఒక పిల్లల డాక్టరు, కుర్రాడే, ఓ సాయంత్రం పూట వాళ్ళమ్మని ఇంటికి తీసుకువెడుతుండగా, కారు టైరు పంచరయింది. సాయం చేస్తామంటూ ఆ దారిన వెడుతున్న ఇద్దరు ఆగారు. అందులో ఒకడు కడ్డీతో డాక్టర్ తలమీద గట్టిగా మోదాడు, ఇంకోడేమో వాళ్ళమ్మపైకి దూకాడు. అయితే ఆవిడ భయంతో గట్టిగా కేకలు వేయడంతో దుండగులు ఆమె హాండ్‌బ్యాగ్‌ని లాక్కుని పారిపోయారు.

“సమాజానికింకా ఎంతో ఇవ్వగలిగిన ఓ యువ డాక్టర్ సాయం కోసం ఎదురుచూస్తూ, మాదకద్రవ్యాలకు బానిసలైన వ్యక్తుల చేతుల్లో హత్యకి గురయ్యాడు.” అతని ఆలోచన కొనసాగింది.

“ఇటువంటి ప్రమాదకరమైన వాతావరణంలో, గాయపడడానికి లేదా చావడానికి సిద్ధమై, నేనిప్పుడు ఓ గూండాకి సాయం చేయడానికి వెళ్ళడం అంత అవసరమా? లేకపోతే ఈ సమయంలో రక్తం ఎవరికి అవసరమవుతుంది? ఆగిపోయిన కార్లను తీస్కెళ్ళే టో-ట్రక్ డ్రైవర్ని దోపిడీ చేయబోయి తన్నులు తిన్న ఏ వ్యసనపరుడో అయుంటాడు. లేదంటే చేతిలో డబ్బులేకపోతే మత్తుమందు కోసం మాదక ద్రవ్యాలమ్మే వాడిని ఎవడో కత్తితో పొడిచేసి ఉంటాడు.లేదంటే నైట్‌క్లబ్‌ గొడవల్లో బదులు తీర్చుకునేందుకు మోటార్ సైకిల్‌ గ్యాంగు వాణ్ణెవరో కాల్చేసి ఉంటారు. ఇలాంటివి ప్రతీ రాత్రి జరుగుతునే ఉంటాయి. వెధవ! రక్తం పోయి ఛస్తే ఛావనీ.”

కిటికీ దగ్గర నుంచి కదిలాడు. వంటింట్లో దీపం ఆర్పేయబోతుండగా గాయపడిన వ్యక్తి నిజానికి చీకటి ప్రపంచానికి చెందినవాడు కాకపోయుండచ్చని అతని మనసుకి తట్టింది. పైగా నేరస్తుల వలన ప్రమాదానికి గురైన వ్యక్తి కావచ్చు. ఉదాహరణకి, ఆ టో-ట్రక్ డ్రైవర్, ఎంతో కష్టపడి పనిచేసే నిజాయితీ మనిషి, మంచు తుఫానును కూడా లెక్కచేయకుండా రక్తదానం ఇవ్వడానికి వచ్చే వ్యక్తి అయ్యుండచ్చు.

వేడిగా ఉన్న చాక్లెట్ డ్రింక్ కప్పుని గట్టు మీద ఉంచాడు. కిటికీకి అవతల మేపుల్ చెట్టు కొమ్మలు గాలికి కిర్రుమంటూ చప్పుడు చేస్తున్నాయి.

“వాడు తప్పకుండా గూండా అయ్యుంటాడు” తనలో తాను అనుకున్నాడు. “బ్లడ్ గ్రూప్‌లు అనువంశికంగా ఉంటాయి. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి కాపాడచ్చుగా? వాడు కోలుకుని మళ్ళీ మత్తుమందులు అమ్మడం కన్నా, లేదంటే హ్యాండ్‌బ్యాగ్‌లు దొంగిలించడం కన్నా, వాడు చచ్చిపోవడమే మంచిదని వాళ్ళు అనుకున్నారేమో? అలాంటి వాడికి నేను నా రక్తం ఇచ్చి వాణ్ణి బతికించాలా? వాడు చెడ్డలవాట్లలో మళ్ళీ కొనసాగడానికా? ఇలాంటివన్నీ కొందరికి తమాషాగా అనిపిస్తాయేమో కానీ, నాకు మాత్రం కాదు.” సాగుతున్నాయి అతని ఆలోచనలు.

తన సహోద్యోగి బాబ్‌ గుర్తొచ్చాడు. నిన్న సాయంత్రం బాబ్ అతనితో పందెం వేసి అయిదు డాలర్లు గెలుచుకున్నాడు. ఏ వృత్తిలోని అబ్బాయిల వెనుక అమ్మాయిలు ఎక్కువగా పరిగెడతారనే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోయాడతను. ఓడిపోయానని ఒప్పుకున్నాక, “ఓరి దద్దమ్మా! పర్సులు కొట్టేవాడి వెనక!” అంటూ నవ్వాడు బాబ్.

అతను గట్టు మీది కప్పుని అందుకున్నాడు. అయినా అతను దాన్ని తీసుకుని వంటింట్లోంచి బయటకి రాలేకపోయాడు, గాంధీ సినిమా మరో ఏడెనిమిది నిముషాలలో మొదలవబోతున్నా కూడా.

“ఒక వేళ రక్తం కావల్సింది ఎవరైనా యాత్రికుడికేమో? లేదా మాంట్రియల్‌లో కుటుంబమే లేని ఏ ప్రవాసికో అయితే? పోనీ, రక్తం కావల్సింది మాంట్రియల్ మనిషికే కావచ్చు. అతను తన తల్లిదండ్రులతో కారులో బయటకి వెళ్ళి ఉండచ్చు, దారిలో కారు పాడైపోయుండచ్చు, ఈ వాతావరణంలో జారిపోయి ఏ గోడనో స్తంభాన్నో గుద్దుకుని అందరూ ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో ఉండి ఉండచ్చు.”

కప్పు పక్కన బెట్టి, టాక్సీని పిలిచేందుకు ఫోన్ అందుకున్నాడు. “టాక్సీ ప్రయాణం క్షేమం! హాయిగా గుమ్మం ముందు ఎక్కి, ఆసుపత్రి ముంగిట్లో దిగచ్చు. పైగా నేను నా టయోటా వేసుకెళ్ళి అది ఈ వాతావరణంలో పాడయిపోతే టో-ట్రక్‌కి పెట్టే ఖర్చుకన్నా టాక్సీకయ్యే ఖర్చే తక్కువ. ఎటొచ్చీ, టాక్సీ డ్రైవర్ హైతీ దేశంవాడయితేనే ఇబ్బంది.”

హైతీ దేశస్తుల పట్ల అతనికేం వ్యతిరేకత లేదు, కానీ హైతీ డ్రైవర్లపై ఇటీవలి కాలంలో ఫిర్యాదులు చాలా ఎక్కువయ్యాయి. వాళ్ళకి ఉద్యోగాలిచ్చిన సంస్థలు వాళ్ళని తొలగించాలనుకుంటున్నాయి. దీని పట్ల మానవ హక్కుల సమితి, హైతీ అసోసియేషన్ వారు నిరసన తెలిపారు, కొంతమంది హైతీ డ్రైవర్లకి మాంట్రియల్ నగరంలోని వీధులు ఇంకా పూర్తిగా తెలియవని వాదించారు.

“మరి వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్సులు ఎలా వచ్చాయి?” తనని తానే ప్రశ్నించుకున్నాడు. “నా అభిప్రాయంలో వీళ్ళు నగరానికి కొత్తగా వచ్చిన వారిని ఊరంతా తిప్పి ఎక్కువ డబ్బులు గుంజుతారు.’ఓ-పాజిటివ్’ గ్రూప్ రక్తాన్నివ్వడం కోసం నేనిప్పుడు హైతీ డ్రైవర్ నడిపే టాక్సీ ఎక్కి ఆసుపత్రికి వెళ్ళేసరికి నాకే రక్తమార్పిడి చేయాల్సిన అవసరం రావచ్చు,” అతను ఫోన్ పెట్టేసాడు. కానీ ఫోన్ చేయాలనే ఆలోచన మాత్రం అతన్ని వీడలేదు. ఓ టాక్సీని తప్పకుండా పిలిపించుకోవాలనుకున్నాడు. కానీ డ్రైవర్ హైతీ దేశస్తుడు అయ్యుండకూడదని మాత్రం చెప్పదలచుకోలేదు. “నాకు జాతి వివక్ష లేదు,” తనకి తాను చెప్పుకున్నాడు.

“మరిప్పుడు నేనేం చేయాలి?”

అతను తన నుదురు రుద్దుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారమంతా అతనికి తలనొప్పి కలిగిస్తోంది. ఒకసారిగా భార్యని గుర్తు చేసుకున్నాడు. ఆమె నిద్రపోయి అప్పుడే గంటపైనే అవుతోంది. “తను తన కొత్త హోండా కారుని గారేజ్‌లో ఉంచకపోయినట్టయితే, నేను దానిలో సెయింట్ ల్యూక్ ఆసుపత్రికి పది నిముషాలలో వెళ్ళి, రక్తం ఇచ్చేసి ఇంటికొచ్చి గాంధీ సినిమా కనీసం ఇంటర్వల్ తరువాతి భాగమన్నా చూసుండేవాడిని” అని అనుకున్నాడు. కానీ,నిజానికి అతనికి సినిమాలు మొదటి నుంచి చూడడమే ఇష్టం.

“ఇక వీసిఆర్‌ని బాగు చేయించక తప్పదు.”

ఫ్రిజ్ మీద అంటించిన పలకపై ఆ విషయం గుర్తుకోసం రాయబోతుండగా, వంటింటి గోడ వెనక నుంచి నీళ్ళు పారుతున్న చప్పుడు వినిపించింది. వెంటనే పక్క వాటాలో ఉండే ఆవిడ ఓ నర్సనే సంగతి గుర్తొచ్చింది.

“ఆవిడ నర్సు కాబట్టి, పరిస్థితి చెప్తే అర్థం అవుతుంది, తన కారుని కాసేపు ఇవ్వమంటే ఇవ్వచ్చు. కాకపోతే, ఈ సమయంలో నన్ను ఇంట్లోకి రానిస్తుందో లేదో. పైగా ఆవిడ చాలా తిక్క మనిషి.” అనుకున్నాడు.

అతనికి తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ (ఉదాహరణకి, అన్ని కాలాలలోను, వాతావరణం ఎలా ఉన్నా ఏ మాత్రం పట్టించుకోకుండా అతను రోజూ రాత్రి భోజనమయ్యాక సుమారుగా అరగంట సేపు నడుస్తాడు). అందుకని లిఫ్ట్ సౌకర్యం లేని ఓ నాలుగు అంతస్తుల భవనంలో పై అంతస్తులోకి మారిపోయాడు. మెట్లెక్కి దిగుతూ ఉంటే శరీరం అనుకూలంగా ఉంటుందని భార్యతో చెప్పాడు. అయితే ఈ నర్సు కూడా ఇదే కారణంతో పై అంతస్తులో ఉంటోందని అతను అనుకోవడం లేదు. ఆవిడ రోజు విడిచి రోజు తినడానికి పీజ్జా, చైనీస్, సౌవ్లాకీ, ఇలా తిండి ఆర్డరిచ్చి తెప్పించుకుంటుంది. పాపం, డెలీవరీ చేసేతను మెట్లెక్కి ఆమె గుమ్మం వద్దకి చేరేసరికి ఆయాసంతో రొప్పుతుంటాడు. పైగా ఆవిడ తలుపు తీయడానికి దాదాపుగా రెండు నిముషాల సమయం తీసుకుంటుంది. అవతల గుమ్మం దగ్గర ఓ మనిషి ఆయాసపడుతూ నిలబడి ఉంటే, రెండు నిముషాల పాటు ఆవిడ ఏం చేస్తుందో అతనికి అర్థం కాదు. ప్రతీరాత్రీ, పక్కన పడుకున్న భార్య నిద్రపోయి చాలాసేపయినా, అతనప్పుడూ ఇదే ఆలోచనలో మేల్కునుండేవాడు. “ఎందుకో తెలుసుకోటానికి ఇప్పుడిది మంచి అవకాశం. ఎలానూనేనూ ఆయాసపడ్డానికి ఇప్పుడు కారణం కూడా ఉంది కదా…”

ఇంతలో కింద రోడ్డు మీద సైరన్ మోగిస్తూ వెళ్ళిన ఓ అంబులెన్స్ సమయం వృధా అవుతోందని అతనికి గుర్తుచేసింది. “బాబ్ అనుకునేటట్లుగా ఒంటరిగా ఉండే ఆడవాళ్లందరూ తల తిక్కవాళ్ళు కాదు. అలాగే కొందరు హైతీ డ్రైవర్లు మోసగాళ్ళయినంత మాత్రాన అందరు హైతీ డ్రైవర్లు వంచకులు కారు. అంతే కాకుండా, ఎయిడ్స్ క్రిమి ఆఫ్రికా నుంచి వచ్చినంత మాత్రాన అందరు నల్లవాళ్ళకి ఎయిడ్స్ సోకదు. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలన్నీ కట్టిబెట్టి టాక్సీని పిలు.”

వెంటనే ఫోనందుకుని, టాక్సీని పంపమని చెప్పడానికి నెంబర్ డయల్ చేయసాగాడు. కాని అంతలోనే ఓ క్షణం ఆగాడు. “ఇలా చేయడం వల్ల నాకు ఎయిడ్స్ సోకే ప్రమాదం లేదు కదా?” అని ప్రశ్నించుకున్నాడు. హైతీ టాక్సీ డ్రైవర్నుంచి కాదు. అతను ఎన్నో ప్రకటనలు చూసాడు, దినపత్రికలలో చదివాడు – కేవలం స్పర్శ వలన ఎయిడ్స్ సోకదని అతనికి తెలుసు. కాకపోతే అతని బెంగంతా రక్తం తీయడానికి ఉపయోగించే సూదుల గురించే. నిధులు లేకపోవడం వలన ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి కేటాయింపులు బాగా తగ్గించేసింది, కొన్ని ఆసుపత్రులలో దాదాపు సగానికి పైగా గదులను మూసేసారు.

“ఆసుపత్రి వాళ్ళు సిరంజిని మళ్ళీ మళ్ళీ వాడితే నా పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు నా చేతికి గుచ్చేముందుగా సిరంజిని స్టెరిలైజ్ చేయడం చాలా ముఖ్యమని నర్స్‌కి తెలిసుండాలి. కానీ ఆసుపత్రిలో నర్స్ కూడా మా పక్కింటావిడలానే తిక్కదైతే? ఒక వేళ వాళ్లు డిస్పోజబుల్ సిరంజి వాడినా, నాకు ‘లీజనేర్స్ వ్యాధి’ రాదనే భరోసా అయితే లేదుగా? విజ్ఞానం అభివృద్ధి పుణ్యమా అని, క్రిస్మస్ నుంచి ఈ కొత్త రోగం వల్ల మాంట్రియల్లో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు.”

అతను ఫోన్ పెట్టేసాడు.

“ఆవిడ చాలా మంచిది, నిజం చెప్పింది” అంటూ కొత్త సంవత్సరం వచ్చిన రోజు ఓ షాపింగ్ మాల్‌లో ఎదురైన ఓ చిన్న సంఘటనని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు తన భార్య కోసం ఎదురుచూస్తుండగా, ఓ చిన్నపిల్ల దాదాపు అరవై ఏళ్ళున్న ఓ ముసలావిడని ‘సెలవు రోజున ఒంటరిగా షాపింగ్ మాల్‌లో ఎందుకు కూర్చున్నారు?’ అని ఆడగడం అతనికి వినిపించింది.

“ఎందుకంటే, నేను పెద్దదాన్ని! మా లాంటి పెద్దవాళ్ళ బుర్రలు అత్యంత సృజనాత్మకంగా ఉంటాయి. మాకు మేమే ఎప్పటికప్పుడు సమస్యలని, శతృవులని సృష్టించుకుంటూంటాం” అందా ముసలావిడ.

“ఆవిడ చెప్పినది నిజం!” అనుకుంటూ అతను తన చేతి గడియారం కేసి చూసుకున్నాడు. “ఇంత ఆరోగ్యంగా ఉండే నేను – తథాస్తు – ఎవరికో మంచి చేయడం కోసం ఉన్నట్టుండి చావును పిలిచి తెచ్చుకోడమేనేమో ఇది! మంచికి పోయి క్రిస్మస్ కల్లానో, ఈస్టర్ వచ్చేలోపో నేనే చచ్చిపోనూ వచ్చు!”

తలూపుతూ అతను చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకున్నాడు. అతని చేయి వణుకుతోంది. కప్పుని మళ్ళీ గట్టు మీద పెట్టేసాడు.

“నేను సాయం చేయాలి.” పైకే అనుకున్నాడతను. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు రక్తదానం చేసాను. అప్పటి నుంచి ప్రతీ ఏడాది కెనడియన్ హార్ట్ అసోసియేషన్‌కి ఇరవై డాలర్లు, కెనడియన్ మెంటల్ హెల్త్ సొసైటీకి ఇరవై డాలర్లు, ఆర్థరైటిస్ సొసైటీకి పది డాలర్లు విరాళంగా ఇస్తునే ఉన్నాను. ఇవి కాకుండా పదనాలుగు డాలర్ల నలభై మూడు సెంట్లు ప్రతీ వారం ప్రొవిన్షియల్ హెల్త్ ప్లాన్ కోసం కడుతున్నాను. మరి అలాంటప్పుడు – అత్యవసర పరిస్థితుల కోసం ఒక్క పైంట్ ఓ-పాజిటివ్ రక్తాన్ని కూడా నిలువ ఉంచుకోలేని బుద్ధిహీనుల అసమర్థత నా తప్పా? పైగా ఈ మంచుతుఫానులో రోడ్లమీద తిరిగి ఇలా ప్రమాదాలు తెచ్చుకునే వాళ్ళకోసం, ఇంట్లో కూర్చుని ఓ గొప్ప సినిమాని చూడకుండా నేనెందుకెళ్ళాలి?”

ఈ ఆలోచనల జడిలో అతను కొంత చాక్లెట్ డ్రింక్‌ని చేతిమీద ఒంపుకున్నాడు. వాటిని తుడుచుకుంటూ, “హాస్పిటల్‌లో ఓ-పాజిటివ్ గ్రూప్ రక్తం కోసం ఎదురుచూస్తున్న వారు కూడా నాలానే మహాత్ముడైన గాంధీ గురించిన సినిమా చూద్దామనే, ఆయన జీవితంనుంచి స్ఫూర్తి తెచ్చుకుందామనే అనుకున్నారేమో, కాకపోతే హఠాత్తుగా వాళ్ళింటికి నిప్పంటుకుని ఉండచ్చు; లేదా హాస్పిటల్‌లో పరీక్ష చేసినప్పుడు నిలవ ఉన్న ఓ-పాజిటివ్ గ్రూప్ రక్తం చెడిపోయిందని తెలిసిందేమో.” అని అనుకున్నాడు.

తన నుదురు మరోసారి రుద్దుకున్నాడు. తలనొప్పి ఎక్కువైపోతోంది. బయట ఈదురుగాలి మరింత ఎక్కువయింది. భార్య మరోసారి గుర్తొచ్చింది. ఆమె ప్రతీ రోజు రాత్రి పదకొండు గంటల కల్లా నిద్రబోతుంది. వార్తలు వినదు. ప్రతీ చలికాలంలోను తన కార్‌ని గరాజ్‌లో భద్రంగా పెడుతుంది. ఆమె కంటే ముందు రోజు పొద్దున్నే నిద్ర లేచి, ఆ చలిలో బయటికెళ్ళి కారు మీద మంచు గీకి, వేడి చేసుకుని ఆఫీసుకెళ్ళాల్సింది తనే అయినా కూడా.

“వాళ్ళ నాజూకుదనం చూసి మోసపోవద్దు” అన్నాడు వాళ్ళ నాన్న అతనితో ఒకసారి. “డాక్టర్ల గదిలో వేచివున్న ఆడవాళ్ళ సంఖ్య కంటే సమాధులలో ఉన్న మగవారి సంఖ్య రెండింతలు ఉంటుంది”

“ఆయనకేం తెలుసని అలా తిట్టడానికి? ఆయన ముగ్గురు భార్యలని సమాధి చేసాడు. పుట్టిన పిల్లల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. తన ఎనభై ఎనిమిదో ఏట గుర్రపు స్వారిలో మజా చేస్తూ, కాలు జారిపడి చనిపోయాడు. ఒకసారి తను “నాన్నా, నీ జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి, నీకేమీ పట్టినట్లు లేదా?” అని తండ్రిని అడిగితే, “నువ్వు చాలా విషయాలకి బెంగపడతావురా” అన్నాడాయన. అతనికది నిజమేననిపించింది. “నా తోటివాళ్ళలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంది తాజా గణాంకాలని గమనిస్తే, క్విబెక్‌లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఎనభై శాతం మంది మగాళ్ళేనని తెలుస్తుంది.” అని అనుకున్నాడు.

బయట మేపుల్ చెట్టు కొమ్మలు మరింత గట్టిగా విరిగిపోయేంతగా ఊగుతున్నాయి.

“ఆ ప్రకటన బహుశా ఏ ఆత్మహత్య కేసుకో సంబంధించినదై ఉంటుంది. ఎక్కువమంది చలికాలం అయిపోయే ముందు రోజుల్లో మణికట్లు కోసుకుంటారట. ఎందుకు కోసుకోరూ? అయిదునెల్లపాటు ఈ చలినీ, ఈ పొడుగు రాత్రులనీ, ముసురు బట్టిపోయిన ఆకాశాన్ని చూసి చూసీ, చివరికి మదర్ థెరెసా అయినా సహనం పోయి కిటికీలోంచి దూకేస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నిరుద్యోగం, హింస, పస్తులు, తీవ్రవాదుల దాడులు, ఆర్ధిక మాంద్యం, ఆమ్ల వర్షాలు, సామూహిక హత్యాకాండ, స్టార్‌వార్స్ రక్షణ వ్యవస్థ, ఇలాంటివన్నీ పక్కన పెట్టినా ఈ చలి బాధ తప్పదు. అయితే మన ప్రియమైన వైద్య వ్యవస్థ మాత్రం – ఇంత నిరాశతో చద్దామని చూసేవారికి ఓ పైంట్ రక్తం ఎక్కిస్తే వారి జీవితం ఆనందమయం అవుతుందని భావిస్తోంది. అయ్యోరామ! వారు రక్షిద్దామని ప్రయత్నిస్తున్న వ్యక్తి బతికి బయటపడ్డాక, నన్నెందుకు బతికించారంటూ వారిని తిట్టుకోకుండా ఉంటాడా? వాళ్ళకి ఆ మాత్రం వివేకం లేదా? ఈ సారి చేయి కోసుకోడానికి ప్రయత్నించినప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాడని గ్రహించరెందుకు? కానీ పాపం మన వైద్యులు మాత్రం రోగి బాధపడుతుంటే చూడలేరు. తాము తీసుకుంటున్న ఘనమైన జీతాలకి న్యాయం చేయాలని ప్రయత్నిస్తారు లేదంటే తమ సొంత ప్రతిష్టని పెంచుకోవాలని చూస్తారు. ఇలాంటి అపరబ్రహ్మలకి తోడుదొంగగా నేను ఉండాలా?” అనుకున్నాడు.

హఠాత్తుగా అతని కళ్ళ ముందు ఊగిసలాడుతున్న బోడి చెట్టు కొమ్మలు – ఎక్కడో ఆఫ్రికాలోనో లేదా గాంధీ ఉపఖండంలోనో తీసిన ఓ డాక్యుమెంటరీలో, ఎముకల గూడులా ఉన్న చిన్న పిల్లాడిని అతనికి గుర్తు చేసాయి. గాంధీ గురించి ఆలోచించాడు. గత ఎనిమిది నిముషాలుగా తన ధోరణి పట్ల తనకే చిరాకు కలిగింది. గబగబా బాత్‌రూంకి పరిగెత్తాడు. రెండు ఆస్ప్రిన్ బిళ్ళలు మింగాడు. తనపై తనకి కాస్త గర్వం కలిగింది. ఫోన్ అందుకుని టాక్సీ కోసం ఫోన్ చేసాడు.

తన చిరునామా చెబుతుండగా, తను రక్తదానం చేయడానికి పనికిరాననే సంగతి అతనికి స్ఫురించింది.

అతను చివరిసారిగా రక్తదానం చేసి ఇరవై ఏళ్ళయింది. కానీ ఆ సందర్భంలో రక్తం తీసుకోడానికి ముందుగా నర్స్ అతడిని ఎన్నో ప్రశ్నలు అడగడం అతనికి గుర్తుంది. ఆమె అడిగిన మొట్టమొదటి ప్రశ్న గత ఇరవై నాలుగు గంటలలో అతనేమయినా తలనొప్పికి గానీ వేరే రకమైన మందులు గానీ వాడారా అని! ఈ ప్రశ్న ఎందుకడిగిందా అని అతను ఆలోచించాడు. అంతలో అతనికి జవాబు దొరికింది – ‘రక్తదానం చేసేవారు రక్తం ఇవ్వడానికి ఇరవై నాలుగు గంటల ముందుగా ఎటువంటి మందులు గానీ ఉపయోగిస్తే, అటువంటి వారి రక్తం రోగికి పనికిరాదు.’

కోపంతో ఫోన్ పెట్టేసాడు. “నేనో మందమతిని, ఈ సంగతి ముందే ఎందుకు గుర్తు చేసుకోలేదు?” అనుకుంటూ తనని తాను తిట్టుకున్నాడు.

కాసేపయ్యాక: “ఈ ప్రకటన విన్న వాళ్ళలో ‘ఓ పాజిటివ్’ గ్రూప్ రక్తం ఉన్నది నేనొక్కడినే అయ్యుండనేమో.”

నుదురు చిట్లించి, తన పరిచయస్తులలో ఎవరికైనా ‘ఓ పాజిటివ్’ గ్రూప్ రక్తం ఉందేమో గుర్తు చేసుకోడానికి ప్రయత్నించాడు. ఎవరి పేరయినా తడితే, వెంటనే సెయింట్ ల్యూక్ ఆసుపత్రికి వెళ్ళమని చెబుదామనుకున్నాడు. కానీ ఎవరూ గుర్తు రాలేదు. అతను ఆశ కోల్పోలేదు.

“ఈ ప్రకటన విన్నది నేనొక్కడినే అయ్యుండను. మాంట్రియల్లో కనీసం పది శాతం ‘ఓ పాజిటివ్’ గ్రూప్ రక్తం వున్నవాళ్ళయితే వారి సంఖ్య దాదాపుగా రెండు లక్షలుంటుంది. వాళ్ళలో కనీసం ఒక్క శాతం మంది రేడియో ప్రకటన విన్నా, రెండువేల మంది దాతలు దొరికినట్లే.”

కాస్త ధైర్యం కలిగింది, అమ్మయ్య అంటూ నిట్టూర్చాడు. తన చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకుని హాల్లోకి నడిచాడు. టి.వి ఆన్ చేయగానే, సినిమాలో మొదటి సీన్ – గాంధీ గారి హత్య సన్నివేశం వస్తోంది.

తదుపరి సన్నివేశం – గాంధీ గారి అంత్యక్రియల దృశ్యం నడుస్తుండగా అతను తన సహోద్యోగి బాబ్‌ని తలచుకున్నాడు. వెంటనే ఓ కపటమైన నవ్వొకటి అతని పెదాలపై వెలిసింది. తను పోగొట్టుకున్న అయిదు డాలర్లను రాబట్టుకునే మార్గం – ఊహూ, అంతకంటే ఇంకా ఎక్కువే, దానికి రెట్టింపు పొందే ఉపాయం అతనికి తట్టింది. సోమవారం ఆఫీసుకి వెళ్ళగానే బాబ్‌తో పందెం వేస్తాడు. “బాబ్, ఓ ప్రశ్న అడుగుతాను. నువ్వు మూడు సార్లు ప్రయత్నించి సరైన జవాబు చెబితే నీకు పది డాలర్లు ఇస్తా. ప్రశ్న ఏంటంటే : పది నిముషాలలో తేలికగా, సంతృప్తికరంగా ఓ పౌండ్ బరువు తగ్గడం ఎలా?” అని అడుగుతాడు. ఈ ప్రశ్నకి జవాబు తెలియని బాబ్ నోరెళ్లబెడతాడు. అప్పుడు అతను బాబ్‌ని వెక్కిరిస్తూ, “ఓరి దద్దమ్మా, ఓ పైంట్ రక్తం దానం చేస్తే సరి” అని అంటాడు.
----------------------------------------------------------
రచన: కొల్లూరి సోమ శంకర్ 
మూలం: పాన్ బూయూకాస్
ఫ్రెంచ్ మూలం – లె అద్మిరాచుర్ దె గాందీ. రచయిత: పాన్ బూయూకాస్. ఈ అనువాదానికి పాల్ కర్టిస్ డా (Paul Curtis Daw) ఆంగ్లసేత “Gandhi’s admirer” ఆధారం.
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment