Wednesday, January 30, 2019

ఆనందం


ఆనందం




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి..........

అన్ని రకాల భేదాల నుండి మనకి
వస్తు ప్రపంచం విముక్తి కలిగిస్తుంది
కాని, లాలస అనే ఒకే ఒక తాటితో
తిరిగి అందర్నీ బంధిస్తుంది.

క్రయవిక్రయ చింతనలు విరామ కాలాన్ని హరిస్తాయి
కలలు కూడా కమర్షియల్ బ్రేక్స్‌తో నడుస్తాయి

పొందిన వస్తువు నుండి ఆశించిన ఆనందం పొందలేక
పొందటమే ఆనందంగా భ్రమిస్తాము
పొందలేని దానిలో ఇంకేదో ఉంటుందని
నిత్యం దాని చుట్టూ పరిభ్రమిస్తాము

మరొక వైపు
అందరికీ అందేంత ఎత్తులోనే ఉన్నా
ఎందుకో ఎవరికీ పట్టని పండులా
అసలైన ఆనందం విచారంగా చూస్తుంది

తడబడే అడుగుల పసివాడి
పాదం తగిలితే చాలు
పుడమితల్లి పుత్రవాత్సల్యంతో పులకిస్తుంది
రెండడుగులు తనవైపు నడిచి పలకరిస్తే చాలు
చుట్టాల్ని చూసిన చిన్నపిల్లలా
సముద్రం అరుస్తూ గంతులు వేస్తుంది

నిన్నటి పాట మనం విన్నామో లేదోనని
కొమ్మ మీద వాలిన పక్షి
అదే పాటని పదేపదే పాడి వినిపిస్తుంది

పున్నమి రాత్రి ఆరుబయట విశ్రమిస్తే చాలు
ఎన్నిసార్లు ముద్దుచేసినా
మళ్ళీ తన ఒళ్ళు నిమరమని
కళ్ళలోకి గోముగా చూసే తెల్ల కుక్కపిల్లలా వెన్నెల
ఒడిలో చేరి ముడుచుకు పడుకుంటుంది

ఏదీ పట్టదు
మూసిన ఈ మది తలుపుల్ని
ఏ మృదుహస్తమూ తట్టదు
అన్నీ మరిచి ముందు రాబోయే దేనికోసమో
ఎదురుచూస్తూ బతుకుతాము
కళ్ళ వెలుగులు చుట్టూ మిరుమిట్లు గొలుపుతున్నా
కనిపించని దేనికోసమో వేళ్ళతోనే వెతుకుతాము.
-----------------------------------------------------
రచన: విన్నకోట రవిశంకర్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment