Thursday, January 17, 2019

ప్రారంభం


ప్రారంభం




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి..........

నా ఆఫీసు ఇరవైతొమ్మిదో అంతస్తులో ఉంది. చుట్టూ గాజు కిటికీలు. దాని చుట్టూ ఉన్న మిగిలిన కట్టడాల ఎత్తు కూడా తక్కువే. అలా ఎత్తులో ఉండటంలో కొన్ని సౌకర్యాలున్నాయి. పై అంతస్తులో ఉండటం ప్రపంచాన్నే ఏలుతున్నటువంటి భ్రమని కలగజేస్తుంది.

భూమి నిద్రపోదు అంటారు. అయితే ఆకాశం మేలుకునుండదు. రాత్రివేళల్లో మేలుకుని పనిచెయ్యాల్సి వచ్చినప్పుడు చాలా మనోహరంగా ఉంటుంది. దీపాలన్నీ ఆర్పేసి చీకటి మధ్యలో నిశబ్దంగా కూర్చుని చూసేప్పుడు నక్షత్రాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. వర్షాకాలంలో మెరుపులూ, ఉరుముల శబ్దమూ ఆశ్చర్యంగా కిందనుండి పైకొస్తున్నట్టుగా ఉంటుంది.

ఎగిరే పక్షుల గుంపులను చూడటం మరొక ఆహ్లాదమైన అనుభవం. వాటితో సమానమైన ఎత్తులో ఉండి వాటిని చూడచ్చు. కొన్ని పక్షులు తెరిచున్న కిటికీల్లోంచి స్వతంత్రంగా లోపలికొచ్చేస్తాయి. రెక్కలు కదపకుండా రివ్వుమని వచ్చి ఒక రౌండ్ కొట్టి రెక్కలు రెపరెపలాడిస్తూ వెళ్ళిపోతాయి. అవి అలా వచ్చి వెళ్ళేది, ఆ చోటు తమ స్వంతమని చెప్పుకోడానికేనని నేను అనుకుంటాను. అలా అనుకోవడం నాకు ఆనందంగా ఉంటుంది.

ఇదికాకుండా మరి కొన్ని దృశ్యాలూ చూడొచ్చు. ఎదురుగావున్న కట్టడంలో ఇరవైయ్యారో అంతస్తులో ఇద్దరు పనిచేస్తున్నారు. ఒక మగ, ఒక ఆడ. వాళ్ళు ఒకరిమీద ఒకరికి ఆసక్తి ఉన్నవాళ్ళలా అనిపించారు.

ఆమె అప్పుడప్పుడూ ఏవో పేపర్లు తీసుకొస్తుంది. అతను వాటిని చూస్తాడు. ఆమెనీ చూస్తాడు. తొలగిన భాగాల మీద చూపు నిలుపుకుంటారు; నిషేధించబడ్డ చోట్లను తడుముకుంటారు. అటూ ఇటూ చూసి అవస్థగా పెదవులు రాసుకుంటారు.

తర్వాత ఆమె ఫైళ్ళ మోపులను ఎత్తుకుని ఏమీ ఎరుగనట్టు బైటకెళ్ళిపోతుంది. అతను నిట్టూర్చుకుంటూ ఆమె మళ్ళీ రావటం కోసం ఎదురుచూస్తుంటాడు. పని విసుగనిపించినప్పుడు ఈ లేత ప్రేమికుల్ని చూసి కొంచం పరవశించవచ్చు.

అయితే ఇప్పుడు దానికి వ్యవధిలేదు. ఈ రోజు జరగనున్న ముఖ్యమైన సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలను ప్రకటించే నివేదికను సమర్పించాలి. పదకొండు పేజీలుగల ఈ నివేదిక తగిన ఆధారాలనూ, బలమైన కొన్ని నిర్ణయాలనూ పొందుపరచుకున్నది. దీన్ని పరిచయం చేసే ప్రారంభ ప్రసంగం ఎలా ఉండాలి అన్న ఆలోచనలో ఉన్నాను.

గత ఆరునెలలుగా ఈ సలహాదారు ఉద్యోగం నాకు చుక్కలు చూపిస్తోంది. నేనూ నా కార్యదర్శి గాసమర్ ఇద్దరం పొద్దెరగకుండా పనిచేశాము. నిన్ననే ముగించాము. వ్యాసాన్ని సవరించి, చక్కబెట్టేసరికి రాత్రి పదైంది.

ప్రసంగానికి అవసరమైన గ్రాఫులు, స్లైడ్‌లు, ఇతర ఉపకరణాలు సిద్ధంగా పెట్టాము. నకళ్ళు, అపెండిక్స్‌లు వరుసగా కూర్చి సమావేశానికి వస్తున్న డెలిగేట్స్ టేబిల్స్ మీద నా కార్యదర్శి గాసమర్ పెట్టేసింది. అందరు వక్తలకీ ఉండేలాంటి బెరుకే నాకు ఉండింది. ఆ ఆలోచనలలో నిమగ్నమై ఉన్నాను.

అప్పటికి మూడోసారి టెలిఫోన్ మోగింది. ఈ సారికూడా ఐదేళ్ళ నా కూతురే! తన అన్నయ్య మీద ఏవో చాడీలు. జాబితా సాగుతూనే ఉంది… ఒక ఏడేళ్ళ పిల్లాడు అర్ధగంటలో ఇన్ని ఇబ్బందులు పెట్టగలడా అని నాకు ఆలోచన వచ్చింది.

నా భార్య ఉద్యోగానికి వెళ్ళింది. పిల్లలకి బడి సెలవు. ఈ రోజంతా వాళ్ళ పేచీలను తీర్చడమే నా పని అయ్యేలా ఉంది. పనమ్మాయిని పిలిచి పిల్లల్ని కొంచం కటువుగా వారించమని చెప్పాను.

అప్పుడనగా గాసమర్ లోపలికి తొంగి చూసింది. ఎప్పుడూ అంతే, సమయమెరిగి వచ్చేస్తుంది. చిరునవ్వుల దేవత! ఆమె ముఖం తిప్పుకుని ఉండటమో, చిన్నబుచ్చుకుని ఉండటమో, చిరాకుపడటమో నేను చూడలేదు.

ఆఫ్రికాలో సెక్రటరీ పక్షి అని ఒక పక్షి ఉంది. దాని తలమీద రెండు పెన్సిళ్ళు నిలబెట్టినట్టుగా ఉంటుంది. అది నడిచేప్పుడు తల పైకెత్తుకుని ఒక రకమైన గాంభీర్యంతో నడుస్తుంది. గాసమర్ చూడటానికి ఆ పక్షిలానే ఉంటుంది. విచిత్రమైన వస్త్రధారణ, అంతకంటే విచిత్రమైన కేశాలంకరణతో ఉంటుంది. ముళ్ళపంది ముళ్ళులాంటివి రెండు ఆమె జుట్టు ముడిలో నిలబెట్టివున్నాయి. ఒక కోణంలోంచి చూస్తే జపానమ్మాయిలా అనిపిస్తుంది. సన్నగానూ పొడవుగానూ ఉంటుంది. దగ్గర దగ్గరగా అడుగులేసుకుంటూ వడివడిగా నడుస్తుంది.

“గాసమర్, నా తల్లీ! నాకో సాయం చేస్తావూ?”

“చెప్పండి, చేస్తాను,” అంది.

“నా పిల్లల దగ్గర్నుండి ఫోన్ వస్తే నువ్వు రెండే రెండు ప్రశ్నలు అడగాలి. ఒకటి, ఇల్లు అంటుకుపోతుందా? రెండు, ఎవరైనా కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకున్నారా? రెంటికీ లేదు అని జవాబు వస్తే టెలిఫోన్ కట్ చేసేయ్. నాకు ఇంకా ఇంకా ఆటంకం కలిగించకు.”

ఆమె ముసిముసిగా నవ్వుకుంటూ సరే అని చెప్పింది. రివాల్వింగ్ చెయిర్‌లా ఒంటికాలిమీద రయ్యిమని తిరిగి వెళ్ళిపోయింది. పాయింటర్ హీల్స్ చెప్పులమీద అంత సునాయాసంగా ఎలా తిరుగుతుందో! ఒక్కసారైనా పడిపోయింది కాదు.

రెండుగంటల సమయం గడిచింది. ఏ ఒక్క ఫోనూ రాలేదు కాబట్టి ఇల్లు భద్రంగానే ఉంది; కాళ్ళూ చేతులూ క్షేమమే అని నమ్మొచ్చు.

ప్రపంచంలో ఉన్న అన్ని సంస్థలూ ఏదో ఒక వస్తువుని లేదా సేవని కొని తర్వాత అమ్ముతాయి లేదా తయారుచేసి అమ్ముతాయి. అయితే ఈ కంపెనీ దానికి బిన్నంగా ఒక మెట్టు పైకి వెళ్ళి ఆ సంస్థలనే కొని, అమ్మే వ్యాపారం చేస్తుంది. దీనికి కావలసిన మూలధనంలో ప్రధానమైనది దుర్మార్గం. దీని పునాదే అధర్మ మార్గంలో మనగలగడం. ఇవే కాకుండా జిత్తులమారితనం, మోసం, కపటం మరికొన్ని గుర్తించదగిన గుణాలు. మిగిలిన మూలధనాలు ఖాతాదారుల దగ్గర్నుండే లభిస్తాయి. మనిషికుండే సహజమైన మౌఢ్యమే దీనికి నిదర్శనం. మనుషుల్లో మౌఢ్యం పుష్కలంగా ఉందికాబట్టి వ్యాపారంకూడా అంతు లేకుండా విస్తరిస్తుంది. అధర్మమార్గాల్లో డబ్బు సంపాయించే వాళ్ళకు ఇది స్వర్గం. వాళ్ళ డబ్బులన్నీ హవాలా మారకం ద్వారా వస్తాయి. వాడకంలోకి వెళ్తాయి. ఇలా సంపాదించిన దానితో ఈ సంస్థ పతాక స్థాయికి చేరుకుంది.

అయితే ఈ మధ్యకాలంలో ఒక స్టార్టప్ సంస్థని కొన్నప్పుడు ఒక చిన్న పొరబాటు జరిగింది. అది ఈ సంస్థని అధఃపాతాళానికి తీసుకెళ్ళిపోయింది. బ్లాక్‌హోల్ అంటారే, అలాంటిది. పెట్టిన పెట్టుబడి ఎటు వెళ్లిందీ దిక్కే తెలీడంలేదు. ఇంకా పచ్చిపాల వాసనైనా మరవని ఈ స్టార్టప్ సంస్థ ఉన్నదాన్ని కూడా ఊడ్చుకుపోయేలా చేస్తోంది!

ఏనుగుకైనా కాలు జారుతుందంటారు కదా? దీన్నెలా సమర్థించబోతున్నానో మరి… నమ్మరు. తగిన ఉదాహరణతోనో సామెతతోనో మొదలుపెడితే బాగుంటుంది. ‘ఎలుకను పట్టేవాడు ఎలుకలాగే ఆలోచించాలి’ అని ఆఫ్రికాలో ఒక సామెత వాడుకలో ఉంది.

ఈ రోజు సమావేశానికి వచ్చే అందరూ అనుభవజ్ఞులు, నిపుణులు. అటువంటివారు ఇరవైమందికి పైగా హాజరయ్యే ఈ సభలో కొందరితో మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలినవాళ్ళు తలకాయలాడిస్తూ వినేవాళ్ళే.

ఈరోజు ఉదయం వచ్చిన వాయిస్ మెయిల్ సందేశంలో ప్రాధాన్యంగల విషయం ఏమిటంటే అలిసాలా బిన్ ఒస్మాన్ సభకు వస్తున్నాడు అన్నదే. ఇతని ప్రశ్నల్లో చాలా లోతులూ గోతులూ ఉంటాయి. వాటిలో పడిపోకుండా నిభాయించుకోగలగాలి. ఇతను అరేబియా దేశస్థుడు. చార్టెడ్ ఫ్లైట్‌కి అధిపతి. శాటిలైట్‌లా ప్రపంచమంతా తిరుగుతుంటాడు. కళ్ళు ఆంబులన్స్ లైట్లలాగా మెరుస్తుంటాయి. ఇతని ముఖమూ చేతులూ సదా చెమటలు పట్టి ఉంటాయి. ముక్కుమీద కోపం మనిషికి. ఇతను ఓసారి ఊపిరి పీల్చుకునే సమయంలో పదివేల డాలర్లు సంపాయిస్తాడు; ఊపిరి బయటికొదిలేప్పటికి మరో పదివేల డాలర్లు సంపాయించేస్తాడు అంటారు. ఇతను ఎవరికోసమూ ఎదురుచూసినట్టుగా చరిత్రలోలేదు.

రాత్రయ్యేసరికి ఎక్కడెక్కడి పక్షులన్నీ చెట్టుమీద గూళ్ళకి చేరుకునేట్టుగా వార్ధక్యం రాగానే పలురకాల జబ్బులు మనిషి ఒంటిలోకి వచ్చి చేరతాయి. మిచెల్ పూనే వృద్ధుడు. పేరు తెలిసిన, తెలియని పలు రకాల వ్యాధులు అతనికున్నాయి. దుంపలన్నీ ఖాళీ చేసిన బంగాళా దుంపల గోనెసంచిలా ముడుచుకుపోయిన దేహమతనిది. ఒళ్ళంతా చక్కరే కావును, తను తాగే కాఫీలో చక్కెర వేసుకోడు. అయితే అతని మెదడు అతి చురుకుగా పనిచేస్తుంటుంది. జిరాఫీ ఆహారాన్ని అందుకునేంత నెమ్మదిగా, ఓర్పుగా మాట్లాడుతాడు. ఇతను ఒక వాక్యం ముగించేలోపు మెల్లగా లేచి వెళ్ళి లఘుశంక తీర్చుకునివచ్చి కూర్చోవచ్చు.

గ్లోరియా బాన్స్ అనబడే వనిత. భారీ స్థూలకాయురాలు. ఎందువల్లనోమరి ఆమెను చూసినప్పుడల్లా నాకు కావ్యాలంకారచూడామణి గుర్తొస్తుంది. ఎంత ప్రయాసతో తయారుచేసిన వార్షిక నివేదికనైనా ఒకే ఒక ప్రశ్నతో తీసిపడేసేలా చెయ్యగలదు.

ఓలాండో, రెండువేల డాలర్లకు తక్కువ ఖరీదున్న బట్టలు వేసుకోనని శపథం పూనినవాడు. ఆడంబర ప్రియుడు. ముందరి వెంట్రుకలు రాలిపోయి నడినెత్తిమీదున్న వెంట్రుకలు నిక్కబొడుచుకున్నట్టు ఉంటాయి. ఇంగ్లీషుని ఒక్కో అక్షరంగా పలుకుతాడు. ఆలోచనాపరుడు. ఒక గంటలో చెప్పాల్సిన విషయాన్ని ఒకే నిముషంలో చెప్పేయగలడు. ఒక వాక్యాన్ని ఒకే మాటలో చెప్పేస్తాడు. అతని మాటలు అర్థంకావు. ఎవరైనా వచ్చి దానికి టీకా తాత్పర్యం, వ్యాఖ్యానం, అన్వయాలు చేసి వివరించితేగానీ అర్థంకాదు.

‘నీ వైపు చతురత కలిగిన వకీలు ఉంటే, సత్యం ఎప్పుడూ నెగ్గుతుంది’ అన్నది తెలిసిందే. కాబట్టి, మంచి వాక్చాతుర్యంతో ఈ నివేదికను వాళ్ళకి ప్రెజెంట్ చెయ్యాలి. అప్పుడే విజయం చేకూరుతుంది.

గాలి ఎక్కువగానే వీస్తున్నప్పటికీ ఉక్కగానే ఉంది. పొడవాటి గాజు కిటికీని మూసేసి నీళ్ళు తాగుదామని వెళ్ళాను. కాసేపు నడిస్తే కాస్త ఊరటగా ఉంటుంది. మెదడుకు కాస్త విశ్రాంతి కావాలి.

వాటర్ ఫౌంటెన్ దగ్గరకెళ్ళాను. ఈ ఫౌంటెన్‌ను ఎడమచేతివాటం ఉండేవాళ్ళకోసం చేసినట్టున్నారు. నొక్కాల్సిన బటను ఎడమవైపున ఉంది. కుడిచేతివాటమున్న నాకు అది సౌకర్యంగా లేదు. ఎడంచేతి బొటనవేలుతో దమ్ము పట్టి నొక్కినప్పుడు నీరు పైకి ఎగజిమ్మింది. దానికి అనుగుణంగా నోరు తెరచి తాగాలి. మూడంగుళాలు నోరు తెరచి ముప్పై డిగ్రీల కోణంలో అందుకోవాలి. దీనికి చాలా అభ్యాసమూ, ఓపికతో కూడిన నేర్పూ ఉండాలి. క్లిష్టమైన అభ్యాసమే! నోరు, ముఖం, జుట్టు, గొంతు- ఇలా అన్ని అవయవాలనూ తడుపుకున్నాకే దాహం తీర్చుకోగలం.

ఎంత ప్రయాసతో ప్రయత్నించినా ఈ కళ నాకు పట్టుబడనేలేదు. దీనిలో నిపుణత్వం పొందేలోపు కందపద్యమూ, సీసపద్యమూ అల్లడాన్ని నేర్చుకోవచ్చేమో అనిపిస్తుంది.

గదికి తిరిగొచ్చాను. అయితే అక్కడ మరోరకమైన సంఘటన ఎదురుచూస్తోంది…

తలుపులు బిగించుకుని మళ్ళీ నా నివేదికను ముందరేసుకుని పదాలతో కుస్తీ పడుతూ కిటికీకేసి చూస్తున్నాను. అప్పుడు ‘ఠప్‌’మని ఒక శబ్దం. నా కళ్ళముందే ఒక పక్షి యాభై మైళ్ళ వేగంతో దూసుకువచ్చి గాజు కిటికీకి కొట్టుకుని పడిపోయింది. పూవు రేకులు రాలినట్టు దాని ఈకలు రాలి గాలిలో ఎగిరాయి. అది మోదుకున్న చోట గాజుపైన గుండ్రంగా, తెల్లగా మరక.

కిటికీ తెరచి బాల్కనీలోకి వెళ్ళాను. పక్షులు ఎగురుతుండటం చూశానుగానీ ఇలా పడిపోయుండటం చూడలేదెప్పుడూ. ఈ పక్షి పడిపోయివుంది. దాన్ని చేత్తో ఎత్తుకున్నాను. నాడి మెల్లగా కొట్టుకుంటోంది. వెచ్చగా ఉంది. మృదువుగా ఉంది. కాడలేని పూవుని తీసుకున్నట్టుగా తేలిగ్గా ఉంది.

ఆ శబ్దం విని గాసమర్ వచ్చేసింది. ఆమె కళ్ళలో భయమూ బాధా కనిపించాయి. మెల్లగా దగ్గరకొచ్చి తాకి చూసింది.

“చనిపోయిందా?”

మెల్లగా తలూపాను. నాడి కొట్టుకోవడం ఆగిపోయి వెచ్చదనం ఆరిపోతూ ఉంది. అదేం పాపం చేసింది? ఎవరికీ ఎటువంటి హానీ తలపెట్టలేదే. మూసి ఉన్న గాజు కిటికీని వెల్లడి ప్రదేశం అనుకుని వచ్చి మోదుకుంది.

“ఇదేం పక్షో తెలుసా?”

“ఈ దేశపు పక్షి కాదు. వలస పక్షి. మెడ చూడు, ప్రకాశవంతమైన రంగు. మగ పక్షే. ఆడ పక్షైతే రంగు కాస్త కాంతి తక్కువగా ఉంటుంది. ఇంతకుముందొకసారి ఈ పక్షిని చూశాను. తెరిచున్న కిటికీలోంచి ఇది నా గదిలోకొచ్చింది. రెక్కలు విప్పి ఒక రౌండ్ కొట్టింది. నాతో స్నేహం ఈ పక్షికి. నేను దీనికిలా ద్రోహం చేసేశాను.”

“ద్రోహమా! ఏం ద్రోహం?”

“ఇందాకే ఈ కిటికీని మూసేశాను. పక్షి తెలీకుండానే మనదగ్గరకొచ్చేసిందని మనం అనుకుంటాం. నిజానికి మనం కదా దానికి బాటలో బిల్డింగులు లేపి అడ్డువేస్తున్నాం?”

“సరే, ఇప్పుడింకేం చేస్తాం? మీకు ఆలస్యం అవుతోంది. మీరు సభకి బయల్దేరండి. నేను క్లీనింగ్ స్టాఫ్‌ని పిలిచి అప్పగించేస్తాను.”

నాకది సబబుగా అనిపించలేదు. కొత్త దేశానికొచ్చిన ఒక శరణార్థి పక్షి. ఏ పాపమూ ఎరగదు, ఒంటరిగా చనిపోయింది.

దాన్ని చేతిగుడ్డలో చుట్టుకుని ఇరవైతొమ్మిది అంతస్తులు కిందకి వెళ్ళి పాతుతుండగా చూశాను. నీలిరంగులోనున్న దాని కుడికాలికి ఒక రింగ్ ఉంది. అల్యూమినియంతో చేయబడిన ఆ రింగ్ మెరిసింది. దీన్ని నేనెందుకు ముందే చూడటాన్ని మిస్ అయ్యాను? నా మనసు బింగో ఆటలో చివరి ఘట్టంకోసం వేచివున్నట్టు వేగంగా కొట్టుకుంది. ఆ రింగుని మెల్లగా తీశాను.

గాసమర్ నా ప్రసంగానికి కావలసిన మెటీరియల్ అంతటినీ కాన్ఫరెన్స్ రూమ్‌లో సిద్ధంగా పెట్టేసింది. నా రాకకోసం అందరూ వేచివున్నట్టు తెలియజేసింది. చెప్పులో గులకరాయి చిక్కుకున్నట్టు నిలవలేక అవస్థపడుతూ ఉంది. ‘తొందరగా వెళ్ళాలి’ అని నన్ను తొందరపెట్టింది.

అయితే అక్కడికి వెళ్ళేముందు నాకొక చిన్న పని ఉంది.

రింగుని తీసి జాగ్రత్తగా చూశాను. ‘మాస్కో పక్షుల కేంద్రం, రోల్ నెంబర్ Z453891’ అని ఉంది. ఇంటర్నెట్ ఓపెన్ చేశాను. ఆ రింగులో ఉన్న మాస్కో పక్షుల కేంద్రం కోసం వెతికాను. దొరకలేదు.

పక్షుల డేటాబేస్‌కు తల్లివంటి వెబ్‌సైట్ కోర్నెల్ విశ్వవిద్యాలయంలో ఉండింది. దానిలో నా అన్వేషణ మొదలుపెట్టాను. ఎన్నెన్నో వివరాలు దొరికాయి. కొన్ని మార్గాలు, ద్వారాలు తెరచుకున్నాయి. కొన్ని మూసుకున్నాయి. వివరాలు అడుగుతూ మాస్కో పక్షుల కేంద్రంవారి తలుపు తట్టాను. రెజిస్టర్ నెంబర్ అన్న ప్రశ్నకి జంకకుండా Z453891 అని ఇచ్చాను.

అప్పుడు ఆ పక్షి జాతకం అంతా పరుచుకుంది. సేకర్ ఫాల్కన్. ఐదేళ్ళ క్రితం ఆ రింగ్ వేయబడింది. కొన్నేళ్ళ క్రితం, అరేబియాలో కనిపించింది. పలుమార్లు మాస్కోకీ, ఆఫ్రికాకీ మధ్య ప్రయాణాలు చేసి ఉంది. చలికాలం ప్రారంభంలో వచ్చి ఆ ఋతువు ముగిసేప్పటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఈ రోజున నా చేతుల్లో మరణించి పడి ఉంది.

మరిన్ని వివరాలు చదివాను. ఆ రింగ్‌ని టేబిల్ మీద పెట్టాను. ఈ పక్షి ఈ రోజు, ఈ తారీకున, ఈ చోట మరణించినట్టు వివరాలు రాశాను. నేను రాసిన వివరాలనూ రింగునూ జతచేసి మాస్కో కేంద్రానికి పంపించమని గాసమర్‌కి చెప్పాను.

నా ప్రసంగ వ్యాసాన్ని తీసుకున్నాను. కావలసిన మరికొన్ని వస్తువులను సిద్ధం చేసుకున్నాను. ఆ పెద్ద బిల్డింగ్‌లోనే మరో వింగ్‌లోనున్న కాన్ఫరెన్స్ రూమ్‌కి పరుగు తీశాను. ప్రసంగాన్ని ఎలా మొదలుపెట్టాలన్నది నేను ఇంకా తీర్మానించుకోలేదు. అందుకు కావలసినంత వ్యవధీ లేదు. ఇంక ఆలస్యం చెయ్యడానికి వీలులేదు.

నేను మోచేతులతో తలుపుని తోసుకుంటూ తెరచి, లోపలకి దూరాను. అనుకున్నట్టే అక్కడ ఇరవై మందికి పైగా సభ్యులు ఆసీనులై ఉన్నారు. నన్ను చూడగానే వాళ్ళు తమ అసంతృప్తిని తమ స్థాయికి తగ్గట్టు వ్యక్తపరిచారు. కొన్ని కుర్చీలు జరిగాయి. కొందరు కదిలారు. సగం తాగిన కాఫీ కప్పులు టేబిల్ మీద చప్పుడు చేశాయి. పొగతాగరాదన్న నిబంధనను ఉల్లంఘించి ఎవరో పొగ తాగినట్టున్నారు. ఆ వాసన గదిలో చుట్టుకుని ఉంది.

నా ఆలస్యానికి క్షమాపణ కోరుతానని కొందరు ఎదురుచూశారు. ‘లేడీస్ & జెంటిల్మెన్’ అని సంప్రదాయ పద్ధతిలో ప్రసంగం ప్రారంభిస్తానని మరికొందరు అనుకున్నారు. మరికొందరేమో ‘గ్రీటింగ్’ చెప్తానని ఎదురుచూశారు. నేను అవేవీ చెయ్యలేదు. వేదిక మీద అంజలి ఘటిస్తున్నట్టు కొన్ని క్షణాలు కదలకుండా నిల్చున్నాను. విప్పిన రెక్కలతో వేగంగా వచ్చి గ్లాస్‌ని ఢీకొట్టి చచ్చిపోయిన ఆ పక్షే నా కళ్ళ ముందు కదలాడింది.

నా ప్రసంగాన్ని మొదలుపెట్టాను.

“ఒక పక్షి ఈ రోజు దారి తప్పింది. కొన్ని నిముషాల క్రితం, ఒట్టి వెల్లడి ప్రదేశం అనుకుని అది నా కిటికీ గ్లాస్‌మీద యాభై మైళ్ల వేగంలో ఎగురుకుంటూ వచ్చి గుద్దుకున్నది. తక్షణమే ప్రాణం పోయింది.

దాన్నిప్పుడే పాతిపెట్టేసి వస్తున్నాను.

వంగిన ముక్కు, తెల్లటి తల కలిగివున్న పక్షి. దాని బూడిదరంగు రెక్కలు చూసేవారిని ఆకట్టుకుంటాయి. ఈ చేతుల్లో అనాథలా పడివుండింది. దాని ఒంటి వెచ్చదనం చల్లారేలోపే పాతిపెట్టేయబడింది.

ఈ సంస్థ తోటలో, ఒక అడుగులోతు గొయ్యిలో, అది నిద్రపోతూ ఉంది. గులాబీ మొక్కకీ, అంథూరియం మొక్కకీ మధ్యన మరణ వచనం రాయబడని ఒక సమాధిలో నిద్రిస్తోంది.

ఈ పక్షిని సేకర్ ఫాల్కన్ అని అంటారు. రష్యాలోని ఈశాన్యమూలనుండి చలికాలం మొదలయ్యేప్పుడు ఇది వలసపోతుంది. దక్షిణ ఆఫ్రికా వరకు ఎగురుకుంటూ వచ్చి వసంత ఋతువు ప్రారంభ సమయానికి తిరిగి వెళ్ళిపోతుంది. ఐదువేల మైళ్ళు దీనికొక లెక్క కాదు. సూర్యుణ్ణీ నక్షత్రాలనూబట్టి దిక్కులు తెలుసుకుని ఎగురుతుంది. సరిగ్గా ప్రతి ఏడూ ఆ ఋతువులోనే వచ్చి మరో ఋతువులో సరిగ్గా వెనుతిరుగుతుంది.

అంతటి తెలివితేటలుగల పక్షి ఈ రోజు ఒక చిన్న తప్పు చేసింది. తిరగవలసిన ఒక చిన్న మలుపులో తిరగడాన్ని మరిచిపోయింది. కావున మరణానికి గురయ్యింది. అది తన సొంతమైన రష్యాదేశపు ఈశాన్య ప్రాంతానికి ఇక వెనుతిరిగి పోలేదు.”

నా ప్రారంభ ప్రసంగాన్ని ముగించి నివేదిక అందుకున్నాను. సభలోని సభ్యుల ముఖాలను చూశాను. ఆ ముఖాలను కప్పిన చీకటి తొలగుతున్నట్టు అనిపించింది. నేను ఏమి చెప్పొస్తున్నాను అన్నది వాళ్ళకి అర్థం అవుతున్నట్టు అనిపించింది. నేను ఈ నివేదికను ఇక చదవవలసిన అవసరమేలేదు. అలానే అనుకుంటున్నాను.
----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, 
మూలం: ఎ. ముత్తులింగం, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment