Wednesday, January 2, 2019

పెరటి తలుపు


పెరటి తలుపు
సాహితీమిత్రులారా!

ఈ అనువాద కథను ఆస్వాదించండి..............

ఆ పిల్ల వయసు పదిహేనేళ్ళు ఉంటుంది. కానీ మొహంలో వయసుకి మించిన పెద్దరికం కనిపిస్తోంది. “దొడ్డమ్మ ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. అంతవరకూ మీరు నన్ను భరించక తప్పదు,” అంది.

రావుగారికి ఏదేనా బదులిస్తే బావుణ్ణనిపించింది. డిప్లొమాటిగ్గా కాసేపట్లో రాబోయే లక్ష్మిగారిని (దొడ్డమ్మ) తక్కువ చెయ్యకుండా, ఈ అమ్మాయిని పొగుడుతూ గమ్మత్తుగా ఏదేనా అనగలిగితే బావుణ్ణనిపించింది. రావుగారి మనసులోని కోరికకి, మెదడు సహకారం అందలేదు. నోరు పెగల్లేదు.

రావుగారికి నరాల బలహీనత. డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పడంతో, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన తాతగారి ఊళ్ళో కొన్నాళ్ళు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఊరికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకునే సమయంలో, ఆయన అక్కయ్య బట్టలు పెట్లో సద్దుతూ, “నువ్వా ఊరికి వెళ్ళి ఎవ్వరితోనూ మాట్లాడకుండా ముంగిలా ఇంట్లోనే కూచుంటావు. దాంతో నీ నరాల జబ్బు ఇంకాస్త ముదురుతుంది. మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి. ఆ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళందరికీ నా తమ్ముడొస్తున్నాడని ఉత్తరాలు రాశాను. కాస్త నలుగురితోనూ కలుస్తూ ఉండు. ఏ వూళ్ళోనైనా ఊరు ఊరంతా చెడ్డవాళ్ళే ఉండరు. కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు. కాస్త మంచిగా ప్రవర్తించే వాళ్ళని చూసుకుని, వాళ్ళతో కలిసి తిరిగితే నీక్కూడా కాస్త బావుంటుంది,” అంది.

ఇలా ముక్కూ మొహం తెలియని వాళ్ళందరి ఇళ్ళకీ వెళ్ళి పరిచయాలు పెంచుకుంటే నరాలకు బలం ఎలా వస్తుందో ఆయనకి అర్థం కాలేదు.

అక్కయ్య ఉత్తరాలు రాసిన వాళ్ళలో ఈ లక్ష్మిగారు ఒకరు. ఇంకాసేపట్లో లోపల్నుంచి ఈ గదిలోకి రాబోతున్నారు. ఈయనని లోపల కూచోబెట్టింది ఆవిడ మరిదిగారి అమ్మాయి. కాస్సేపు ఇద్దరూ మాట్లాడకుండా కూచున్నారు. మౌనం విసుగెత్తిందో ఏమో! ఆ పిల్ల మళ్ళీ మాటలు మొదలెట్టింది.

“మీకీవూరు బాగా తెలుసా? ఇక్కడ పరిచయస్తులు ఎవరైనా ఉన్నారా?” అని అడిగింది.

“ఒక్కళ్ళు కూడా తెలీదు. ఇది మా తాతగారి ఊరు. మా అక్క నాలుగేళ్ళ క్రితం ఈ ఊళ్ళో పని చేయడంవల్ల ఆవిడకి ఇక్కడ కాస్త పరిచయాలున్నాయి. తనకి తెలిసిన వాళ్ళందరికీ ఉత్తరాలు రాసి నేనొస్తున్నాని చెప్పింది.” ఉత్తరాలు అంటున్నప్పుడు ఆయన గొంతు కాస్త నిట్టూర్చినట్టు ధ్వనించింది.

“అయితే మీకు మా దొడ్డమ్మ అస్సలు తెలీదా?” గంభీరంగా అడిగింది ఆ పడుచుపిల్ల.

“పేరూ అడ్రెస్సూ మాత్రమే తెలుసు.” తప్పొప్పుకున్నట్టు అన్నారు రావుగారు.

‘ఈ లక్ష్మిగారికి పెళ్ళయిందా? అయి మొగుడు పోయాడా? అక్క దృష్టిలో ఈవిడ మంచివాళ్ళ వర్గమా లేక రెండో వర్గమా? ఈ ఇంట్లో ఉండేది ఆడవాళ్ళేనా, మగవాళ్ళు కూడా ఉంటారా? ఈ గది చూస్తే, ఎందుకో తెలీదుగానీ, మగాళ్ళున్న ఇల్లే అనిపిస్తోంది.’ రావుగారి ఆలోచనలకి అడ్డు తగులుతూ, “ఆ దుర్ఘటన మా జీవితాల్ని కుదిపేసింది. సరిగ్గా మూడేళ్ళ క్రితం, అంటే మీ అక్కయ్యగారు ఇక్కణ్ణించి వెళ్ళిన తరవాత జరిగింది,” అంటూ మళ్ళీ మాటలు మొదలెట్టింది.

“దుర్ఘటనా?” అడిగేరు రావుగారు. ఆయనకి ‘ఈ ప్రశాంతమైన, అందమైన, పల్లెటూళ్ళో కూడా దుర్ఘటనలూ విషాదాలూ ఉంటాయా’ అనిపించింది.

ఆయన కూచున్న గదికి మూడు తలుపులూ, ఒక కిటికీ ఉన్నాయి. వీధి గుమ్మానికి ఎదురుగా ఉన్న తలుపు తెరిచి ఉంది. ఆ తలుపు వెనక పెరడు, ఆ వెనక పొలాలు కనిపిస్తున్నాయి. ఇంటి లోపలి గదుల్లోకి వెళ్ళడానికి కుడివైపు మరో తలుపుంది. ‘ఇప్పుడు లక్ష్మిగారు ఈ కుడివైపు తలుపులోంచే వస్తారు కాబోలు’ అనుకున్నారు రావుగారు.

“పెరట్లో దోమలన్నీ లోపలకి వచ్చేస్తున్నాయి. శీతాకాలం పొద్దు. అయినా ఆ తలుపు అలా బార్లా తెరిచే ఉండడం ఎబ్బెట్టుగా వుంది కదూ?” పెరటి తలుపువేపు చూస్తూ అందా పిల్ల. ఆ తలుపుకీ, దుర్ఘటనకీ ఏదో సంబంధం ఉందా! అన్నట్టు ఉన్నాయి ఆ పిల్ల మాటలు.

“దోమలవల్ల కాస్త ఇబ్బందిగానే ఉంది, కానీ పరవాలేదు. ఆ దుర్ఘటనకీ, ఈ తలుపుకీ ఏదన్నా సంబంధం ఉందా అమ్మా?” అడిగారు రావుగారు.

“లక్ష్మిగారు మా పెదనాన్న భార్య. మా నాన్న, పెదనాన్న, మా అన్నయ్య–అంటే మా పెదనాన్న కొడుకు–ముగ్గురూ ప్రతీరోజూ పొద్దున్నే బయలుదేరి ఈ పెరటి తలుపులోంచి పొలానికి వెళ్ళేవారు. సాయంత్రానికల్లా అంటే ఈ వేళకి ఇంటికి చేరుకునేవారు. మూడేళ్ళ క్రితం, రోజూలాగానే ఈ తలుపు తీసుకుని ముగ్గురూ పొలానికి వెళ్ళారు. కానీ తిరిగి రాలేదు. పొలం పనులు ముగించుకుని రోజూ లాగానే పొలానికి పక్కనే ఉన్న నదిలో ముగ్గురూ స్నానానికని దిగారు. అది దొంగ ఏరు. కన్ను మూసి తెరిచే లోపు వరద పొంగుకొస్తుంది. ఆరోజు కూడా ఏరు పొంగింది. ముగ్గురూ కొట్టుకుపోయారు. అంతకన్నా ఘోరమైన విషయం ఏమిటంటే అంతిమ సంస్కారాలకి శవాలు కూడా దొరకలేదు.”

గాంభీర్యం తగ్గి ఆ అమ్మాయి గొంతు కాస్త జీరబోయింది.

“మా దొడ్డమ్మకి మతి స్థిమితం కాస్త తప్పింది. పాపం పిచ్చిది. వెళ్ళినవాళ్ళు ఏదోరోజు తిరిగొస్తారనే అనుకుంటోంది. సరిగ్గా ఈ సమయానికి ఈ తలుపు తీసుంచమంటుంది. వాళ్ళు వస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళతో పాటూ మా చిట్టి కూడా వెళ్ళింది. చిట్టి అంటే మా ఇంటిల్లిపాదికీ చాలా ఇష్టం. బుజ్జిగా ఉండేది, జూలు కుక్క. కుక్కలకి ఈత బాగా వస్తుందంటారు. కానీ మా చిట్టి…” ఆ అమ్మాయికి దుఃఖం ఎక్కువై మాట్లాడలేకపోయింది.

కాస్సేపాగి, తమాయించుకుని “క్షమించండి. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. ఇదీ ఈ తలుపు కథ. మళ్ళీ చీకటి పడ్డాక ఈ తలుపు మూసేస్తాం. దొడ్డమ్మకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ బాగా గుర్తు. రోజా చెప్తూనే ఉంటుంది. పెదనాన్న పంచె, తలపాగా కట్టుకున్నారు. చిన్న నాగలి భుజాన వేసుకుని వెళ్ళారు. ఆ నాగలి ఆయన ఎవరికీ ఇవ్వరు. నాన్నా, అన్నయ్యా కొత్త తరం మనుషులు–పాంటూ చొక్కా వేసుకున్నారు. అన్నయ్యకి కాస్త అల్లరెక్కువ. అప్పట్లో వచ్చిన ‘ఆకలేస్తే అన్నం పెడతా’ పాట పాడితే పెద్దమ్మకి వళ్ళు మండుతుంది. అన్నయ్య ఆవిడని ఉడికించడానికి ఎప్పుడూ ఆ పాటే పాడేవాడు. గమ్మత్తు ఏమిటంటే, ఇలాటి చల్లటి శీతాకాలం సాయంత్రాలల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకనో తెలీదు కానీ వాళ్ళొస్తారని నాక్కూడా అనిపిస్తుంది.”

ఆ పిల్ల మాటలాపి తల దించుకుంది. కళ్ళలోంచి జారిన కన్నీటి చుక్కలు రావుగారి దృష్టిని తప్పించుకోలేక పోయాయి. రావుగారికేం మాట్లాడాలో తెలియలేదు. ఇంతలో అతన్ని కాపాడడానికి వచ్చిన దేవతలా వేగంగా వచ్చింది లక్ష్మిగారు. చాలాసేపు కూచోబెట్టినందుకు క్షమాపణ చెప్పుకుంటూ మెరుపులా గదిలోకి దూసుకొచ్చింది.

“లలిత కబుర్లు బాగానే చెపుతుంది,” లక్ష్మిగారు తొందర తొందరగా ఎవరో తరుముతున్నట్టు మాట్లాడతారు. “మా ఆయనా, మరిదీ, నా కొడుకూ–ముగ్గురూ పొలం వెళ్ళారు. మీకెందుకు, పనివాళ్ళు చూసుకుంటారు కదా అంటే వినరు. మా మావఁగారిచ్చిన ఐదెకరాలూ మాత్రం వీళ్ళే చేస్తారు. ఇక వచ్చే వేళయింది. పెరటివేపునుంచే వస్తారు,” తీసున్న తలుపు చూపిస్తూ చెప్పింది. “పొలం నుంచీ కాళ్ళయినా కడుక్కోకుండా తిన్నగా ఇంట్లోకి వచ్చేస్తారు. ఇల్లంతా బురద బురద చేసేస్తారు. మగాళ్ళకి ఏమైనా శుచీ శుభ్రం కాస్త తక్కువే.” ఆ మాట అన్నందుకు ఏమీ అనుకోవద్దన్నట్టు రావుగారి వంక చూస్తూ అన్నారు లక్ష్మిగారు.

పొలాలు, పంటలు, కాలవ తగువులు, పంచాయితీలు, వర్షాలు, రాబోతున్న పంట కోతలూ అంటూ, తలుపు వేపు చూస్తూనే, గలగలా మాట్లాడుతున్నారు లక్ష్మిగారు. రావుగారికి నరాల్లో పోటు అంతకంతకూ పెరిగిపోతోంది. విషయాన్ని పొలాలనుంచి, పంటలనుంచీ మళ్లించడానికి విశ్వప్రయత్నం చేశారు కానీ పెద్ద ఫలితం లేకుండా పోతోంది. ఆవిడ చూపంతా తెరిచే ఉన్న పెరటి తలుపు మీదే ఉంది. రావుగారిని పెద్దగా పట్టించుకున్నట్టు కూడా కనపడట్లేదు. పెరటివేపు ఆతృతగా చూస్తోంది. రావుగారు కాస్త ప్రశాంతత దొరుకుతుందని అక్క సలహా మేరకు ఈ ఊరొచ్చారు. దరిద్రం కాకపొతే ఈ ఊళ్ళో ఇంతమంది ఉండగా మొట్టమొదటిగా ఈ ఇంటికే రావడం ఏమిటి? అదీ సరిగ్గా చచ్చారో లేదో కూడా తెలియని వాళ్ళ తద్దినం రోజునే రావడం ఏమిటి? ఈ ఊరికి పెట్టేబేడాతో పాటూ తన దురదృష్టాన్ని కూడా వెంట తెచ్చుకున్నట్టు అనిపించింది రావుగారికి.

“డాక్టర్లు నాకు పూర్తి విశ్రాంతి అవసరం అన్నారు. మెదడుకి ఒత్తిడి కలగకూడదనీ, ఒంటికి ఒక్కసారిగా అదురు కలగకూడదనీ కూడా చెప్పారు.” ముక్కూ మొహం తెలియని వాళ్ళకి మన ఆరోగ్యం గురించి తెలుసుకునే ఆసక్తి అస్సలు ఉండదని తెలిసి కూడా, ఆవిడ వాగ్ధాటిని వేరే విషయంవైపు మళ్ళించాలనే ఆశతో చెప్పడం మొదలుపెట్టారు రావుగారు. “అయితే ఆహార నియమాల విషయంలో మాత్రం ఒక్కో డాక్టర్ ఒక్కోలా చెప్పాడు.”

“అలాగా!” అన్నారు లక్ష్మిగారు. ఆవిడ అన్న మాట ఆవలింతని ఆపుకోవడానికే అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇంతలో ఆవిడ కళ్ళు ఒక్కసారిగా ఉత్సాహంగా మెరిశాయి. అది రావుగారి మాటలవల్ల ఎంతమాత్రమూ కాదని రావుగారికి కూడా అర్థమైపోయింది.

“హమ్మయ్య! వచ్చేశారు!” గట్టిగా అరిచారు లక్ష్మిగారు. “సరిగ్గా కాఫీల వేళకి వచ్చేశారు. మళ్ళీ ఏట్లో స్నానం చేసి వస్తున్నట్టున్నారు. చూడు, తడి బట్టలూ కాళ్ళకి మన్నూ! ఎలా వస్తున్నారో! ఇక ఇల్లంతా మళ్ళీ తడిగుడ్డ పెట్టి తుడవాలి. వీళ్ళతో ఎప్పుడూ ఇదే బాధ. ఎన్నిసార్లు చెప్పినా వినరు.”

రావుగారికి వళ్ళు జలదరించింది. లలిత వేపు తిరిగారు. పరిస్థితి పూర్తిగా అర్థమైందన్నట్టుగా జాలి నిండిన కళ్ళతో లలితవేపు చూశారు. కానీ మరుక్షణం ఆ పిల్ల తెరిచున్న పెరటి తలుపు వేపు భయం నిండిన పెద్ద పెద్ద కళ్ళతో చూసింది. రావుగారికి జలదరింపు కాస్తా వెన్నులో వణుకుగా మారింది. కారణం ఏమిటో తెలియకుండానే భయం తీవ్రత పెరిగిపోయింది. తలుపు వేపు తిరిగి పెరట్లోకి చూశారు.

చిరుచీకట్లు కమ్ముకుంటున్న మసక వెలుతురు. పెరట్లో గుమ్మంవైపు అడుగులు వేస్తూ ముగ్గురు మగాళ్ళ ఆకారాలు కనిపించాయి. వాళ్ళలో ఒకరి భుజం మీద చిన్న నాగలి కూడా ఉంది. మిగతా ఇద్దరు పాంటూ, చొక్కా వేసుకున్నారు. ఒక అడుగు వెనకగా ఓ కుక్క కూడా వస్తోంది. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. చిత్రంగా లక్ష్మిగారు కూడా మాట్లాడడం ఆపేశారు. ఆ ముగ్గురూ గుమ్మం దగ్గరకొచ్చేస్తున్నారు. ముగ్గురిలో కాస్త చిన్నగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పాడడం మొదలెట్టాడు. ‘ఆకలేస్తే అన్నం పెడతా…’ పాట చీకటిని చీల్చుకుంటూ గదిలోకొచ్చింది.

రావుగారి చెయ్యి అసంకల్పితంగా చేతికర్ర అందుకుంది. రావుగారి శరీరం అసంకల్పితంగా ఒక్క గెంతు గెంతి వీధి గుమ్మాన్ని చేరుకుంది. ఆనక మరో గెంతులో అరుగు దాటి వీధిలో పడింది. మరుక్షణం సందు చివరకి ఒక్క గెంతులో చేరుకొని కనుమరుగయ్యింది. ఎదురుగా సైకిల్ మీద వస్తున్న వ్యక్తి రావుగారు మీదమీదకి రావడంతో పట్టు తప్పి కాలవలో పడ్డాడు.

“లక్ష్మీ!” నాగలి భుజానున్న వ్యక్తి నాగలి గుమ్మం అవతల పెట్టి లోపలికొస్తూ పలకరింపుగా అన్నాడు. “కాస్త బురద అయింది. మరోసారి ఇలా చెయ్యను. ఇప్పుడు మాత్రం తిట్టకు లక్ష్మీ! అవునూ! అలా గెంతుతూ పారిపోయాడు. అతనెవరు?” నవ్వు మొహంతో అడిగాడు ఆ వ్యక్తి.

“రావుగారట. చిత్రమైన మనిషి. అతని జబ్బు గురించే మాట్లాడతాడు ఎంతసేపూ. మీరొస్తూంటే ఒక్క మాటైనా చెప్పకుండా దెయ్యాన్ని చూసి భయపడ్డట్టు పరిగెత్తుకుంటూ పారిపోయాడు.” అన్నారు లక్ష్మిగారు.

అంతవరకూ నిశ్శబ్దంగా ఉన్న లలిత మాట్లాడడం మొదలెట్టింది. “కుక్కని చూసి భయపడ్డారేమో! కుక్కలంటే చాలా భయమని ఇందాకే చెప్పారు. కాశీలో గంగ ఒడ్డున ఓ రాత్రివేళ ఆయన్ని కుక్కలు వెంటబెట్టాయట. ఈయన పరిగెడుతూ వెళ్ళి ఓ నిలువెత్తు గోతిలో పడ్డారట. దొరికితే కండక్కండా చీల్చేద్దామని అతృతతో కుక్కలు రాత్రంతా పళ్ళు బైట పెట్టి, గోతి చుట్టూ తిరుగుతూ ఉంటే, పాపం, రాత్రంతా చీకట్లో భయంగా, ఒంటరిగా గడిపారట. పాపం. అలాటి సంఘటన తరవాత ఎవరికైనా సరే జన్మలో మరి భయం పోదు.”

అన్నట్టు, ఆ పిల్ల భలేగా కథలల్లుతుంది.

[మూలం: ది ఓపెన్ విండో (The Open Window) – హెచ్. హెచ్. మన్రో (సాకి) (H. H. Munro, 1870-1917).]
-----------------------------------------------------------
రచన: తుమరాడ నరసింహమూర్తి 
 మూలం: సాకి (హెచ్. హెచ్. మన్రో), 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment