Tuesday, December 25, 2018

గుర్రాల మావయ్య


గుర్రాల మావయ్య




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

సరిగ్గా యాభై ఏళ్ల నాటి మాట-

నేను, మా అన్నయ్య బాపట్లలో డిగ్రీ రెండో సంవత్సరం వెలిగిస్తున్న రోజులు. అవటానికి అన్నయ్య నాకంటే రెండేళ్లు పెద్దేకాని, వాడెక్కడో ఒక ఢింకా కొట్టడం వల్ల, నన్నో ఏడాది ముందు హైస్కూల్లో వేయడం వల్ల స్కూల్ ఫైనల్లో యిద్దరం కలిసిపోయాం. వాడు అంగుష్ఠమాత్రం లొజ్జు కావడంతో యిద్దరం ఒకే ఎత్తులో వుండేవాళ్లం. చాలా చిన్నప్పుడు, మేం నాలుగైదేళ్ల వయసులో ఉండగా మా యిద్దరితో అమ్మ పుట్టింటికి బాపట్ల వెళ్తోందిట. ఆ ప్రయాణంలో మా నాయనమ్మ కూడా వుందిట. పిల్లలిద్దరూ సరిసమంగా వుండటం చూసి, రైల్లో వాళ్లెవరో ‘కవల పిల్లలా?’ అని అడిగారట. మా అమ్మ కాదని చెప్పేలోగా అత్తగారు అందుకుని, ‘లేదమ్మా వీడు పెద్దాడు వాడు చిన్నాడు. కాకపోతే యిద్దరికీ ఆర్నెల్లే వార’ అందిట. మా అమ్మకి చచ్చేంత సిగ్గు, చిరాకు ముంచుకొచ్చాయిట. మేం పెద్దయ్యాక కూడా యీ విషయం చెప్పి నాయనమ్మని సాధించేది అమ్మ. ‘పిల్లలకి దిష్టి తగుల్తుందని అలా చెప్పా. దానికింత రాద్ధాంతమేంట’నేది మా గ్రాండ్మా. ‘అయితే మాత్రం ఆర్నెల్ల తేడాతో పిల్లలేమిటండీ? అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. రైల్లో వాళ్లంతా నన్ను విడ్డూరంగా చూస్తుంటే సిగ్గుతో చచ్చాను’ – అంటూ ఆనాటి దృశ్యాన్ని మళ్లీ తెరమీదికి తెచ్చేది మా అమ్మ.

అలాంటి పూర్వగాథ వున్న మా అన్నదమ్ములిద్దరం బాపట్ల – పర్చూరు మధ్య తరచు తిరిగేవాళ్లం. పర్చూరు దగ్గర్లో వర్జీనియా పొగాకు పండే భూములుండేవి. సీజన్‌లో కౌలు డబ్బుల కోసం తిరగక తప్పేది కాదు. అట్నించి వచ్చేటప్పుడు తప్పకుండా వెదుళ్లపల్లిలో ఆగేవాళ్లం. మా యోగయ్య మావయ్య కరణీకం చేస్తూ అక్కడ వుండేవాడు. మా అత్తయ్య వుత్తమా ఇల్లాలు. యోగి మావయ్య వ్యవహారంలో దిట్టేగాని వయసులో పెద్దేమీ కాదు. వెదుళ్లపల్లి బ్రేక్ జర్నీలో మాకో గొప్ప ఆకర్షణ వుండేది. దాని తాలూకు కథా కమామీషూ చెప్పాలనే యాభై ఏళనాటి జ్ఞాపకాన్ని దాఖలు చేసుకుంటున్నా. అవధరించండి-

బస్ దిగి పదడుగులు వేస్తే మావయ్యగారిల్లు. మేం సామాన్యంగా మధ్యాన్నం మూడు గంటలవేళ బస్సు దిగేవాళ్లం. మమ్మల్ని చూడగానే మావయ్య నిలువెల్లా వెలిగిపోయేవాడు. రెండు ప్రశ్నలతో యోగ క్షేమాలన్నీ రాబట్టేసి, యిక క్షణం వృథా కాకుండా పనిలోకి దిగేవాడు. మా ఇద్దర్నీ వెయ్యి మాటల సాటిగా ఒక్క చిరునవ్వుతో పలకరించి, నీళ్ల కూజాని చూపిస్తూ అత్తయ్య లోపలికి కదిలేది. బరువైన ఓ సత్తు టిఫిను, ఖాళీ స్టీలు టిఫిను కాసేపట్లో మా చెరో చేతికి యిచ్చేది. ఇంతలో మావయ్య గాంధీ బొమ్మ చేసంచిని మడిచి, ఆ మడతలోనే కాసిని చిన్నపెద్ద నోట్లు పెట్టుకుని బయలుదేరేవాడు. ‘ఇదిగో వాటి సంగతి చూస్తావుగా, మేం సరుకుల్తో సహా వస్తాం’ అంటూ మావయ్య కదిల్తే, మేమిద్దరం అటూయిటూ నడిచేవాళ్లం.

అపుడపుడే సముద్రపు గాలి తిరిగి ప్రాణానికి హాయిగా అనిపించేది. అంతలోనే యెదురైన ఓ పెద్దమనిషి ఆశ్చర్యంగా చూస్తూ, ‘అయ్యా! సాక్షాత్తూ ఆ యొక్క విశ్వామిత్ర మహర్షి ఆనాడు యాగరక్షణకు సీతారాముల్ని వెంటపెట్టుకు వెళ్తున్నట్టుంది… ఆహా!’ అని యింకేదో అనబోతుంటే అడ్డుకుని, ‘కాని, మహానుభావా! మీ గ్రామకంఠాన్ని వొడ్డెక్కించడం మాత్రం నా చేతుల్లో లేదు. అన్నట్టు యాగరక్షణకు తీసికెళ్లింది రామలక్ష్మణుల్ని. లేనిపోని పొగడ్తలకి దిగితే యిలాగే అపశ్రుతులు దొర్లుతాయ్.’ అంటూ నడక వేగం పెంచాడు.

‘అయ్యా! తమరలా తక్కువ చేసుకుంటే నే పోయినంత ఒట్టు!’ అంటూ వెనక్కి తిరిగి మరీ నడక సాగించాడు.

‘అయినా తప్పదు. వున్నమాట చెప్పా’ అంటూనే మావయ్య యింకో ఆసామీని ఆపాడు.

‘ఏం సాంబయ్యా, మీ వాళ్లు తాసీళ్లు కట్టనేలేదు. ఏం చేద్దాం? ఇహ జప్తులే మరి…’

‘అట్లా అనకండి బాబూ… ఎక్కడా అసలు మగ్గం కదలందే! ఏం చేస్తాం?’

‘మనోళ్లంతా పడుగులు పక్కనపెట్టి అచ్చంగా పేకలు పట్టుకు తిరుగుతున్నారుగా!’

‘శివ… శివ… శివా!’

పర్ణశాలలా వున్న ఓ యింటిముందు ఆగాం. లోపల్నించి ఓ అమ్మాయి ఛెంగున వచ్చింది. ‘నాగమణీ, నాలుగు కర్వేప రెబ్బలు… తెలుసుగా?’ అని మావయ్య అనగానే, ‘తెలుసండీ. ముదురు పచ్చగా వుండాలండీ, స్వభావం మంచిదై వుండాలండీ.’ వినయంగా పూరించింది నాగమణి. మావయ్య భేష్ అంటూ, ‘సిపాయి లాంటి మొగుడొస్తాడు. నువ్ చెప్పినట్టు వినుకుంటాడు.’ దీవించాడు.

చిన్న సందు మొగలో చప్పుడు చేస్తూ పిండిమర. ‘ఒరే పెద్దాడా, నీ చేతిలో టిఫిను అక్కడ యివ్వు.’

‘ఖాసిం! మిషన్ తుడు. ఓ చారెడు పప్పు మరపట్టి పిండి వదిలెయ్. నష్టం లేదు మనకు.’

‘ఇక్కడిచ్చి వెళ్లండి, నాకు తెల్సుగా… నే చూసుకుంటా.’ అన్నాడు పిండి తల దులుపుకుంటూ.

మళ్లీ మెయిన్ రోడ్డెక్కామో లేదో, ఊర్థ్వపుండ్రాలతో ఆచారిగారు యెదురుపడ్డారు. ‘కరణంగారు ఎందుకో మెట్టుదిగి దయచేశారు. ఆలయానికొచ్చి స్వామివారికి తమ దర్శనమెప్పుడిస్తారో…’

‘దీనికేం! అతి వినయం ఏదో లక్షణం అన్నట్టు… పాపం స్వామివారికి నిత్యం బెల్లం ముక్క నైవేద్యమేగా? నులిపురుగు పడుతుంది జాగ్రత్త!’

‘క్రిష్ణ… క్రిష్ణ… ఎంతమాట!’

‘దేవుడిక్కాదు నులిపురుగు పడేది, మీ పిల్లలకి…’

‘మా కరణం గారికి నిలువెల్లా చమత్కారమే. ఇలవేలుపు కృష్ణస్వామి పోలికొచ్చింది. ఆహా!’ అంటూ నొసలు విప్పార్చాడు. తిరునామం ఎగపాకింది.

‘నీ ముందు నేనెంత? నీకో దణ్ణం!’ అంటూ చప్పుడయ్యేలా రెండు చేతులూ కలిపాడు మావయ్య.

ఇలా ప్రతిసారీ యీ సంచారంలో మావయ్యని పలకరించేవారుండేవారు. ఒక్కోసారి ఒక్కో అనుభవం మాకు ఎదురయ్యేది. అన్నీ గుర్తుండిపోయాయి.

ఈ క్రమంలో మావయ్య ఎక్కడికి వెళ్తాడో మాకు తెలుసు. నూనె గానుగ!

‘ఒరే చిన్నాడా, నీ చేతిలో టిఫినక్కడ యివ్వు.’

అక్కడున్న ఆడమనిషి అందుకుంది. ‘రావుడూ, వీశెడు… ఈ పట్టులోదే. మళ్ళీ వస్తాం. రెండు జల్లెళ్లలో వడగట్టి పోస్తావుగా… మర్చిపోకు.’

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మరోవైపు కదిలాడు.

చిన్న పూరింటి ముందు ఆగాం. ‘దణ్ణాలు దొరా!’ అంటూ ఓ పెద్దావిడ వచ్చింది.

‘రాగమ్మా, పిల్లలొచ్చారు… సరుక్కోసం వచ్చా.’

‘అయ్యో! మీకంటేనా? మీరే ఏరుకోండి, మీరే ఎంచుకోండి…’ అంటూ లోపలకు వెళ్లింది.

“ఈ రాఘవమ్మ యిప్పుడంటే ఇలా శబరిలా అయిపోయింది గాని కాలం నాడు సత్యభామరోయ్!” అని మావయ్య అంటుంటే లోపల్నించి పెద్ద జాడీతో వస్తున్న రాగమ్మ చిరునవ్వింది. ‘చూస్కోండి సామీ, అన్నీ గుర్రాలే…’ అంటూ గుప్పెళ్ళతో తీసింది. జీడిపప్పులు! నోరూరేలా!

“చూశారా, యిలా బొద్దుగా తెల్లగా పాల నురగల్లో పుట్టినట్టుండాలి. మీ కుడిచేతి బొటనవేలు వంచండి. రెండు కణుపులు కలిసినట్టుంటే వాటిని గుర్రాలంటారు. వాటికి అద్భుతమైన రంగు రుచి వాసన వుంటాయి. ఇహ తర్వాతవన్నీ నాసిరకాలే. గాడిదలు, ఒంటెలు, చంద్రవంకలు, జీడిపిక్కలు… అంతే!”

రాగమ్మ గుర్రాల్లోంచి మళ్లీ మేలు జాతివి తీసి పక్కన పెడుతోంది.

“రాగమ్మ జీడితోటల్లోకి పళ్లు ఏరడానికి వెళ్తుంది. ముఠా మేస్త్రీ. జీడిగింజలు తోటవాళ్లకిస్తే, పళ్లు ఏరిన వాళ్లకిచ్చేస్తారు. అప్పుడప్పుడూ రాగమ్మకి తెలియకుండానే జీడిగింజలు కూడా వచ్చేస్తుంటాయ్…” మావయ్య మాటల్ని వినీ విననట్టుండిపోయింది.

“రాగమ్మ అసాధ్యురాలు. పత్తి వొలవడానికి చేలోకి దిగితే, ఎక్కేప్పుడు మల్లె చెండంత పత్తి కొప్పులో పెట్టుకుని గట్టెక్కేది. మేస్త్రీ కదా, అందరికీ నేర్పింది. పత్తి వొలుపులు అయ్యేసరికి రాగమ్మ క్వింటాల్ పత్తి తూకం వేసేది…” మావయ్య మాటకి అడ్డంపడి, ‘చిన్న బిడ్డలకి యివన్నీ దేనికిలే సామీ…’ అంటూ గుర్రాల పొట్లం అందించింది రాగమ్మ. మావయ్య యిచ్చిన నోట్లని కళ్లకద్దుకుని తీసుకుంది.

తిరుగు ముఖం పట్టాం. గానుగ దగ్గర నూనె టిఫిను బరువుగా ఎదురొచ్చింది. ఖాసిం ఎదురొచ్చాడు. నాగమణి కర్వేప రెబ్బలతో పాటు యీ బరువులు కూడా తీసుకుని మాతో నడిచింది.

ఆ ఇల్లాలికిదేమైనా కొత్త కనకనా? అప్పటికే పొయ్యి రాజేసి వుంచింది. కావల్సిన పాత్ర సామానంతా సిద్ధంగా ఉంది. మేం కాళ్లు చేతులు కడుక్కుని వచ్చేసరికి, వంటింట్లో పొయ్యి మీద నూనె భాండీ నిండుగా కనిపించింది. నాకు, మా అన్నయ్యకు తెలిసిన కథే – ఇప్పుడు తెచ్చిన గుర్రాలు వచ్చేసారికి. ఇప్పటికి పాత సరుకు నీళ్లలో తగుమాత్రం నాని సిద్ధంగా వున్నాయి. అప్పుడప్పుడే చల్లారుతున్న శనగపిండిని బేసిన్‌లోకి కావల్సిన మేర తీసింది అత్తయ్య. అప్పటికే నానిన జీడిపప్పు కురిడీల్ని బద్దలు చేసి వుంచింది. శుద్ధంగా కడిగిన కర్వేపాకులు సహా శనగపిండిలో కలిశాయి. తగినన్ని నీళ్లు కలుపుతూ పకోడీ మిశ్రమానికి పదును తెస్తోంది అత్తయ్య. మావయ్య సలహా సహకారాలను పెద్దగా పట్టించుకోకుండానే ఉప్పుకారాలు జోడించింది.

“ఒరేయ్, రేప్పొద్దున మీకు పెళ్లిళ్లవుతాయ్. పెళ్లాలొస్తారు. వాళ్లని ఏమే ఏమే అని పిలవకండి. అరిష్టం. హేమే హేమే అని పిలుచుకోండి. గృహం శోభన గృహం అవుతుంది. నేనలాగే పిలుస్తా…” అని, యింకేదో అధిక ప్రసంగం మావయ్య చెయ్యబోగా అత్తయ్య కళ్లతోనే ఆపింది.

“ఇప్పుడీ పకోడీ పాకంలో ఒక్క గంటెడు కాగే కాగే నూనెను వేసి కలుపుతుంది మీ అత్తయ్య!” అంటూ పెద్ద గరిటెడు నూనె భాండీలోంచి తీసి వేశాడు. “ఈ నూనె వృథా ఎంతమాత్రం కాదు. ఈ నూనె వార తర్వాత తక్కువే పీలుస్తాయ్ పకోడీలు. రుచి మాత్రం అధికం…”

అత్తయ్య నీళ్లలో చెయ్యి ముంచి, విదిల్చి, వేళ్ల మీదుగా రెండు నీటిచుక్కల్ని భాండీలో రాల్పింది. ఒక్కసారిగా వంటిల్లు చిటపటలాడింది.

మావయ్య, మండే పొయ్యి, పక్కన సమిధల్లా పొందిగ్గా సర్వీ కట్టెలు, చుట్టూ రకరకాల దినుసులు ద్రవ్యాలు, వాటి మధ్య పీట మీద కూచున్న అత్తయ్య సాక్షాత్తూ కాశీ అన్నపూర్ణలా కనిపించేది.

అత్తయ్య ఒక్కసారి జుట్టు ముడి, కొంగు ముడి బిగించుకుని, చిల్లుల గరిటెను సరిచూసుకుని సర్వసిద్ధమైపోయేది. చేతి గాజులు పైకి తీసుకుని, తడిచేత్తో పకోడీ పిండి తీసి వొడుపుగా, గోడవారగా భాండీలోకి వదిలేది. మావయ్య ఒక్కసారి ముక్కుపుటాలెగరేసి, చతికిలబడి కూర్చున్నవాడల్లా గొంతుకు లేచి, వుత్సాహంగా వుడుకుతూ వేగుతూ సతమతమవుతున్న పకోడీలను చూస్తూ మురిసిపోయేవాడు. అత్తయ్య జల్లెడ గరిటతో విడివిడిగా కలివిడిగా పకోడీలను పలకరించేది. వాటి దిశలు మారుస్తూ పరామర్శించేది.

అప్పటికే అక్కడ సిద్ధం చేసిన పింగాణి సాసర్లను మా చేతుల్లో పెట్టేవాడు మావయ్య. తానొకటి ధరించేవాడు. అత్తయ్య చిల్లుల గరిటతో పకోడీలను దూసి పళ్లెంలో పోస్తుంటే మావయ్య తన్మయత్వంలో వూగిపోయేవాడు.

“ఒరేయ్! కొంచం ఆగండి. నోళ్లు కాల్తాయ్. కాస్త చల్లారనివ్వండి…” మావయ్య హెచ్చరించేవాడు గాని ప్రతిసారీ నాలిక్కాల్చుకునేది ఆయనే. అత్తయ్య చిన్న ముక్క నోట్లో వేసుకుని సంతృప్తిగా చూసేది. ఇక మేం విజృంభించేవాళ్లం.

“చూశారా, భాండీలో చిన్నచితక పూసల్లేకుండా చూడాలి. వాయకీ వాయకీ మధ్య కాస్త నూనె కాగటానికి వ్యవధివ్వాలి…” మావయ్యకి యిలాంటప్పుడు కొంచెం అతిధోరణి వచ్చేది. పాపం!

ముత్యం మూడు వాయల తర్వాత యీ పకోడి యజ్ఞం ముగిసేది. మా ముగ్గురి ముఖాల్లో తృప్తిని పసికట్టి అత్తయ్య ఆనందించేది.

అప్పటిదాకా మూసి వుంచిన కరణంగారి వీధి తలుపులు తెరుచుకునేవి. బయట అరుగుల మీద మావయ్య కోసం ఎవరెవరో కూచుని వుండేవారు. ఆరోజు – ‘చలమయ్యతో చెప్పరా, రేపు పొలం కొలత పెట్టుకోమని. గొలుసు, క్రాస్టాఫు కచ్చేరి సావిడిలో వుందో, ఇంట్లో వుందో చూడండి. ఆ మూడెకరాల హద్దులూ తేలాలంటే యాభై ఎకరాలన్నా కొలవాలి. సరిహద్దు ఆసాములకి చెప్పండి…” అంటూ వెట్టి, మోతాదులకు ఆజ్ఞాపించాడు.

పకోడి తొలి వాయకే చీకటిపడింది. మేమిద్దరం వచ్చిన పని అయినట్టు బయల్దేరడానికి సిద్ధమయాం. మావయ్య అటువెళ్లే బస్సును గుమ్మంలో ఆపడానికి రోడ్డెక్కాడు. అత్తయ్య గుమ్మందాటి వచ్చింది. చేతిలో చేసంచీ వుంది. మా చేతికిస్తూ, “రెండు మొగలి పొత్తులున్నాయ్, అమ్మకి. అడుగున తోట వంకాయలున్నాయ్. అవి అన్నయ్యకి. కొతిమీర కారంతో బాగుంటాయని చెప్పండి…” ఆ నవ్వులో ఎంత ఆప్యాయత! వెదుళ్లపల్లి తీపి జ్ఞాపకాలలో యీ రెండు మాటలే మా అత్తయ్యవి. దయాపేక్షలకు మాటలక్కర్లేదని అర్థమైంది. బస్సు ఎక్కించి నవ్వుతూ వీడ్కోలు యిచ్చేవారు. ఆ ఆపేక్షలన్నీ యిప్పుడు కొండెక్కాయ్.

వెదుళ్లపల్లిలో యిప్పటికీ ఖాసిం పిండిమర వుంది. నూనె గానుగ కరెంటు మీద తిరుగుతూనే వుంది. జీడితోటల్లో పుష్కలంగా జీడిపప్పు పండుతూనే వుంది. ఎటొచ్చీ అన్నింటినీ సమీకరించి పకోడీలు వేయించే మావయ్యే కరవు. గుర్రాల మావయ్య మా జ్ఞాపకాలలో గొప్ప హీరో.

ఫలశ్రుతి: మా గుర్రాల మావయ్య గురించి చదివిన వారికి, విన్నవారికి శ్రేష్ఠమైన జీడిపప్పు పుడుతూనే వుంటుంది. తిన్నవారికి హాయిగా అరుగుతూనే వుంటుంది.

కొన్ని వివరణలు:

గ్రామకంఠం: గ్రామాన్ని ఆనుకుని వున్న వ్యవసాయ భూమి. దీన్ని సర్కారు వాళ్లు అవసరం వస్తే ఇంటి స్థలాలకు కేటాయించే వీలుంది. దీనికి పరిహారం చెల్లిస్తారుగాని తక్కువగా వుంటుంది. అందుకని గ్రామకంఠం మార్చి పంటభూమిగా చెప్పి దాచిపెడతారు.
గొలుసు: భూమి కొలిచేందుకు వాడే పరికరం. వంద లింకులు = ఒక గొలుసు.
క్రాస్‌స్టాఫ్: సూటిగా లేదా తిన్నగా రేఖని నిర్ధారించడానికి, కచ్చితమైన లంబరేఖని తేల్చడానికి యీ క్రాస్‌స్టాఫ్ వుపయోగపడుతుంది. చిన్న కొయ్య దిమ్మకి ప్లస్(+) ఆకారంలో సన్నని గాడి పెడతారు. దాన్ని సన్నని ఇనుపచువ్వకి బిగిస్తారు. మనిషి నిలబడితే సరిగ్గా కళ్లకి సూటిగా వుండే ఎత్తులో అమర్చి, వంకరటింకరలు లేకుండా గొలుసు లాగి కొలత సాగిస్తారు. సరిహద్దులు తేలుస్తారు.
కచ్చేరి సావిడి: పాతరోజుల్లో గ్రామాధికారుల (కరణం, మునసబు) కార్యాలయాన్ని కచ్చేరి సావిడి లేదా గ్రామ కచ్చేరి లేదా కచ్చేరి ఆఫీసు అని పిలిచేవారు.
-----------------------------------------------------------
రచన: శ్రీరమణ, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment