Thursday, December 13, 2018

తడిబల్ల – పొడిబల్ల


తడిబల్ల – పొడిబల్లసాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.............

సినిమా అంత పెద్ద ప్రశ్న
ఎట్లనో మా బలరామ్‌గాడు డిగ్రీ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంటరైనాడు. అంటే ఎవరో హీరోయిన్‌కు అద్దం పట్టే పనిలాంటిదేదో దొరికించుకున్నాడు. వాడికి నా బాధొకటి చెప్పుకున్నాను. వాడు తన అనుభవంలోని పరిచయాలతో ఓరోజు ఒక ‘అన్న’ దగ్గరికి తీసుకెళ్లాడు.

పొద్దున మేము వెళ్లేప్పటికి ఆయన హోటల్లో ఇడ్లీ తింటూ వున్నాడు. బయట రోడ్డు మీదకు వచ్చేట్టుగా కూడా కుర్చీలు వేసివున్నాయక్కడ. మేము వెయిట్‌ చేశాం. ఈయన కెమెరా అసిస్టెంట్‌. ఈయన ఎక్కడైనా పెట్టిస్తే, మళ్లీ అక్కణ్నుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వెళ్లాలనేది నా దూరాలోచన. ముందైతే ఏదో ఒకదాన్లో చేరమన్నాడు బలరామ్‌గాడు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావడం మామూలు విషయం కాదు. మీరు నటులనుకుందాం, ఇదెట్లా చేస్తావో చూపించమని ఒక సీన్‌ ఇవ్వొచ్చు. మీరు పాట రాస్తామంటే, రాసిందేదైనా చూపించమనొచ్చు. పాడతా అన్నారా ఇంకా మంచిది, పాడి వినిపించొచ్చు. అవకాశం ఇస్తారని కాదు, కనీసం మీరు ఏమిటో చెప్పుకోవడానికీ, మిమ్మల్ని ఎదుటివాళ్లు అంచనా వేయడానికీ ఒక సులువు ఉంటుంది. కానీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అవుతానంటే ఏం పరీక్షించాలి?

తర్వాతెప్పుడో ఈ సంగతి చెబితే దర్శకుడు సుకుమార్‌ చెప్పారు నాతో: ‘మీరు ఐఏఎస్‌ కావాలనుకుంటే, కనీసం ఇలా చదవాలి అనే ఒక ఐడియా ఉంటుంది; కష్టపడితే అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అవ్వడం ఐఏఎస్‌ అవడం కన్నా కష్టం; ఎందుకంటే ఇక్కడ ఏ మార్గంలో వెళ్లాలో చెప్పే సిలబస్‌ లేదు.’

ఆ అన్న తినడం పూర్తి చేసి, చేయి కడుక్కుని తుడుచుకుంటూ వచ్చి, మళ్లీ ఇందాకటి కుర్చీ మీదే కాళ్లు ముడుచుకుని కూర్చుంటూ ‘ఏం తమ్ముడూ ఏం సంగతి?’ అన్నట్టుగా కొన్ని వివరాలు అడిగాడు. నా చదువూ ఊరూ గురించి చెప్పాక, నా రహస్యాన్ని బయటపెట్టేశాను. చాలా క్యాజువల్‌గా మాట్లాడుతున్నవాడల్లా కుర్చీలోకి మరింత ఒరుగుతూ, నా ముఖాన్ని పరీక్షగా చూసేలా తల పైకెత్తి, ‘డైరెక్టర్‌ అవడమంటే మాటలా?’ అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు.

‘చూడు, ఈ ప్రశ్నకు జవాబు చెప్పు? ఒక తల్లి తన కొడుక్కు పాలిస్తున్నప్పుడు ఆమె చేతులు ఎక్కడుంటాయి?’

నాకు వెంటనే జవాబు తోచలేదు. ఎక్కడ ఉంటాయబ్బా చేతులు? ఇది ఆలోచించాల్సినంత విషయమా? నిజమే కదా, తల్లి తన బిడ్డకు పాలిస్తూ ఎక్కడ చేతులు వేస్తుంది? అరే, చాలా చిన్న ప్రశ్నలా కనబడుతోంది, కానీ నాకు స్పష్టంగా జవాబు తోచడం లేదు. బుర్రలో ఏవేవో తిరుగుతున్నాయి. మొత్తం నన్ను నిర్ణయించే జవాబా ఇది?

గింజుకుని, నాకు తెలియట్లేదని చెప్పాను. చాలా స్థిరమైన గొంతుతో చెప్పాడాయన: ‘పిల్లాడి తల మీద ఉంటాయి చేతులు.’

అబ్బా! అరే నాకు ఇది కూడా తెలీదే. ఇది కూడా తెలీని నేను ఏం లోకాన్ని చదివినట్టు? నాకు ఇంకేం అర్హత ఉన్నట్టు? నేనింకా పరీక్షలో విఫలమయ్యాను కాబట్టి, బలరామ్‌గాడు నోరు తెరిచి ఏమనీ అడగలేకపోయాడు. రాక రాక ఒక పెద్దమనిషిని కలిసే అవకాశం వస్తే ఆయన్ని ఇంప్రెస్‌ చేయలేకపోయాను.

అవకాశం ఎటూ పోయింది, కానీ తర్వాత నేను ఈ ప్రశ్న గురించే చాలా ఆలోచించాను. అరే, పాలిస్తున్న తల్లి తన చేతుల్ని కచ్చితంగా బిడ్డ తల మీదే వేస్తుందా?

ఆ రొమ్ము ఏదో పిల్లాడి నోటికి ఇచ్చేసి తన మానాన తను పేపర్‌ చదువుతూ ఉండొచ్చు. పక్కింటామె వచ్చి తలలో పేన్లు కుక్కుతూవుంటే తన్మయంగా కళ్లు మూసుకుని చేతుల్ని పక్కన పెట్టుకోవచ్చు. యారాలుతో మాటలతో పోట్లాడుతూ ఆ చేతుల్ని దానికి అనుగుణంగా ఊపుతూ ఉండొచ్చు. అత్త చెప్పే ఇంటిపనిని తప్పించుకోవడానికి ఈ పాలు ఇవ్వడమనే సాకుగా కూర్చుండి ఎడమచేత్తో కింది పెదాల్ని సాగదీసుకుంటూ తమాషా చూస్తుండొచ్చు. బీడీలకు ఆకు కత్తిరిస్తుండొచ్చు. వాడి గోళ్లు కత్తిరిస్తుండొచ్చు. అన్నం మెతుకులు అట్లేనా అని పెద్దబిడ్డను మందలిస్తూ ఉండొచ్చు. ఏ వదినో చాయ్‌ గ్లాసు చేతిలో పెడితే తాగుతూ ఉండొచ్చు. గల్ఫ్‌కు పోయిన వాళ్ల నాన్నో, అన్నో గుర్తొచ్చి కళ్లల్లో నీటిని కొంగుతో ఒత్తుకుంటూ ఉండొచ్చు. పాలు తాగుతూ ఆ ప్రేమ ప్రవాహానికి నిక్కిన వాడి బుచ్చి మీద చిరుకోపపు నవ్వుతో చేయి ఎత్తవచ్చు, లేదా దానితో ఆడుకోవచ్చు. నిజంగానే అతడు అన్నట్టు మురిపెంగా వాడి తలను దువ్వుతూ ఆస్వాదిస్తుండవచ్చు కూడా. కానీ ఇన్ని సాధ్యాలకు అవకాశం ఉన్నప్పుడు గన్‌షాట్‌గా తల మీద చేయి వేయడమే జవాబు ఎలా అవుతుంది? అసలు ఒక దృశ్యంలోంచి ఇంకో దృశ్యంలోకి ప్రవహించే కథను బట్టి కదా, ఆమె చేతులు ఎక్కడ వేస్తుందనేది తేలుతుంది. మరి ఇంత తతంగం ఉన్నప్పుడు ఆమె కచ్చితంగా చేతుల్ని వాడి తల మీదే ఎలా వేస్తుంది?

ఆ అన్న ఇప్పుడు ఏం చేస్తున్నాడోగానీ నాలో మొగ్గ రూపంలో ఉన్న కళాకారుడిని ఇడ్లీ తిన్నంత ఈజీగా ఆరోజు నలిపేశాడు!

శుక్రవారం
షాపు ఎందుకో మొన్న చూసినట్టు లేదే! మొన్న కౌంటర్‌ ఎడమవైపు ఉన్నట్టు అనిపించింది. ‘కస్టమర్‌ ఈజ్‌ గాడ్‌’ అని రాసివున్న ప్లేట్‌ ఒకటి కౌంటర్‌ మీద పెట్టివుంది. కొంచెం లావుగా, అంతకుమించి ఎత్తుగా ఉన్న వ్యక్తి కౌంటర్‌ మీద ఉన్నాడు. చూడగానే గుర్తుపట్టి, నవ్వాను. షాపతను బదులు నవ్వలేదు. మనం ఎందుకొచ్చామో వీళ్లకు ముందే తెలిసిపోతుందా?

చేతిలో పట్టుకున్న టాబ్లెట్‌ స్ట్రిప్స్‌ చూపిస్తూ, ‘ఇవి మొన్న పదిహేను రోజులకని పొరపాటున మూడు స్ట్రిప్సు తీసుకున్న. కానీ ఐదు రోజులు వేసుకుంటే చాలని చెప్పిండు డాక్టర్‌’ అన్నాను. నాకెందుకు చెప్తున్నట్టుగా షాపతని ముఖంలో ప్రశ్న గుర్తు. నిశ్శబ్దంగా కవర్‌ను టేబుల్‌ మీద పెట్టాను. షాపాయన వాటి వైపు కూడా చూడలేదు, కానీ ‘పొద్దున్నే ఏంటయ్యా’ అన్న విసుగు ముఖం మాత్రం పెట్టాడు. మొన్న సాయంత్రం వచ్చినప్పుడు ఈయనే ‘సార్‌’ అన్న విషయం గుర్తుంది. నన్ను కాసేపు నిలబడనిచ్చి, ‘ఒకసారి అమ్మినై వాపసు తీసుకోం’ అని తేల్చేశాడు.

నేనేమీ మాట్లాడలేదు. నాకు వెనక్కి తీసుకెళ్లే ఉద్దేశం లేదన్నట్టుగా, కవర్‌ను టేబుల్‌ మీద అతడి వైపు మరింత జరిపాను. పదకొండు రూపాయల తొంభై పైసలకో టాబ్లెట్‌. మొత్తం ఇరవై. వదిలేస్తే పోతుందా? చూస్తూ చూస్తూ… షాపాయన వాటి మీద ఓ కన్నేశాడుగానీ చేతిలోకి తీసుకోలేదు. హెల్పర్‌ వచ్చి, చిన్న కవర్లో వేసివున్న స్ట్రిప్సునూ, వాటితోపాటు మడతపెట్టి వున్న బిల్లునూ ఓసారి అట్లా చూసి, మళ్లీ టేబుల్‌ మీద పెట్టాడు, యజమాని ఒక మాట అనకుండా, తాను సొంతనిర్ణయం తీసుకోవడం బాగోదన్నట్టుగా.

షాపాయన కంప్యూటర్‌లో నిన్నటి రోజు లెక్కలు కావొచ్చు, ఏవో కాసేపు చూసి, ముందట నిలుచున్నవాడికి ఏదో ఒకటి చెప్పాలన్న బాధ్యత తన మీద ఉందని గుర్తొచ్చినట్టుగా ‘తొమ్మిది కూడా కాలేదు, బోణీ కాకుండా వాపసు తీసుకోం’ అన్నాడు. ఫర్లేదు, కొంచెం మెత్తబడ్డాడు. అది కూడా కరెక్టే అనిపించింది. ‘అయితే నన్ను తర్వాత రమ్మంటారా?’ అంత వినయంగా మాట్లాడగలనని నేనే అనుకోలేదు. ‘పన్నెండు తర్వాత చూద్దాం.’

చూద్దాం. ఇది స్పష్టమైన హామీ కాదు, కానీ కొంతనయం. కానీ మళ్లీ మధ్యాహ్నం రావాలంటే, లంచ్‌ అవర్లో పర్మిషన్, రాను బస్సు పోను బస్సు, ఇటు పది అటు పది, పైగా ఎండ, దానికన్నా సాయంత్రం రావడం బెటర్‌. ఒక్క అదనపు పదిరూపాయలతో చెల్లిపోతుంది.

‘మధ్యాహ్నం వచ్చినా డబ్బులైతే వాపసు ఇవ్వం, వేరేది ఏదైనా తీసుకోవాలి.’

కోపం వచ్చింది. వచ్చినా ప్రదర్శించకూడదు. ‘వేరేదంటే…’ నీళ్లు నమలడం అనే స్థితి.

మళ్లీ అతడు కంప్యూటర్లో ముఖం పెట్టాడు. హెల్పర్‌ మందులున్న కార్టన్స్‌ను హేక్సాబ్లేడ్‌తో కట్‌ చేస్తున్నాడు.

‘ఎక్కడన్నా బియ్యం కొంటే మీరు వాపసు ఇస్తారా?’

హెల్పర్‌ కట్‌ చేయడం ఆపి, ఇటు చూశాడు.

‘బియ్యం అంటే ఇవ్వాళో రేపో ఖర్చవుతాయి, వీటిని అట్లా వాడుకోలేంగా!’ నవ్వుతూ అన్నాను. ఇట్లాంటి సందర్భంలో లాజిక్కులు పనిచేయవని షాపాయన ముఖం చూశాక అర్థమైంది. ఆ ముఖం మీద ఆయన్ని ఎక్కువ సేపు ఉంచితే కష్టం. కానీ దేబిరించినట్టు ముఖం పెట్టడం ఇష్టంలేదు. పోనీ, జింకోవిట్‌ లాంటిది ఏమైనా కొందామా అనుకున్నాను. దానికన్నా అలాగే కౌంటర్‌ మీద స్ట్రిప్సును విసిరేసిపోవడం ద్వారా ఒక తృప్తిని ఏదైనా పొందగలనా అని కూడా ఆలోచించాను. కానీ అవేమీ చేయలేదు. ‘మీరే ఏదైనా చూడండి సార్‌.’

వెంటనే రియాక్ట్‌ అవ్వాల్సినదేమీ లేదన్నట్టుగా కాసేపు లెక్కల్లో గడిపి, కౌంటర్‌ మీద తాపీగా కూర్చుని, హెల్పర్‌ వైపు చూశాడు. హెల్పర్‌ వచ్చి కవర్‌ను చేతిలోకి తీసుకుని, బిల్లు మడత విప్పి తల మరింత వంచి చూశాడు. ‘అన్నా, ఇది ఆ షాపుది’. నాకేమీ అర్థం కాలేదు. ‘మొన్న మీరు ఆ షాపులో కొన్నట్టున్నారు, అక్కడే ఇవ్వాలి’ అన్నాడు షాపాయన. నాకు అయినా అర్థం కాలేదు. ‘అన్నా, ఇరవై షట్లర్ల తర్వాత ఇంకో బ్రాంచుంది, అక్కడ ఇయ్యిపో’ చెప్పాడు హెల్పర్‌. అందుకా కౌంటర్‌ మారినట్టనిపించింది! ‘మరి మొన్న మీరే ఉన్నారు’ షాపతడిని ఉద్దేశించి అన్నాను. ‘రెండూ మాయే, అక్కడా ఉంటా ఇక్కడా ఉంటా.’

మెడ పైకి చూసుకుంటూ వెళ్తే త్వరగానే భార్గవ్‌ మెడికల్‌ హాల్‌ కనబడింది. అవును, మొన్న చూసిందిదే! కౌంటర్‌ మీద బక్క పలుచటి మనిషి ఉన్నాడు. దాదాపుగా మళ్లీ మొత్తం రిహార్సల్‌ జరిగింది. ‘పదిహేను రోజలకు కొంటే మాదా తప్పు?’ అన్న అదనపు ప్రశ్న కూడా పడింది.

అలా కొనాల్సిరావడానికి తగినన్ని చారిత్రక కారణాలున్నాయి. డాక్టర్‌ రాసింది అర్థం కాక, అర్థం కావట్లేదని అర్థమయ్యేసరికి డాక్టర్‌ అందుబాటులో లేక, హాస్పిటల్‌ ఫార్మసీలోనే కొనేస్తే వాళ్లే ఏదో తిప్పలు పడతారులే అనుకుని, తీరా రాసిన నాలుగు ముందుల్లో మూడు మాత్రం ఇచ్చి ఈ ‘షాప్‌ వాపసీ’ కార్యక్రమానికి కారణమవుతున్న టాబ్లెట్స్‌ మాత్రం వాళ్లు లేవని చెప్పి, వారి అనుభవసారాన్నంతా రంగరించి ‘పదిహేను రోజులు’ అని నా ప్రశ్నకు జవాబుగా ఇచ్చి, మరెక్కడో ఎందుకులే పనైపోతుందని హాస్పిటల్‌ పక్కనేవున్న ఈ మెడికల్‌ షాపులోనే ఆ టాబ్లెట్స్‌ కూడా కొనేసి, ఎందుకొచ్చిన రిస్కూ అని మళ్లీ రెండ్రోజుల తర్వాత ఆ డాక్టర్‌తోనే నిర్ధారించుందామని వెళ్తే ఆయన కూల్‌గా ‘ఐదు రోజులు వేసుకుంటే చాలు’ అని, కుర్చీలోంచి అలాగే ఎత్తి పడేద్దామన్నంత కోపం వచ్చినా శాంతంగా చిరునవ్వుతో తమాయించుకుని…

షాపతని ప్రశ్నకు జవాబుగా, ‘మీ అన్ననే ఇక్కడికి పోతే ఇస్తరన్నడు.’ ఇది పని చేసింది. ‘అన్న కాదు, తమ్ముడు’ అని చెప్పి, ‘రెండ్రూపాయలు ఇవ్వండి’ అన్నాడు రౌండ్‌ ఫిగర్‌ ఇచ్చే ఉద్దేశంతో. నేను ప్యాంటు వెనక జేబులోంచి బిళ్ల తీసి టేబుల్‌ మీద పెట్టాను. షాపాయన గల్లాలో చేయిపెట్టి, రెండు వంద నోట్లు, నాలుగు పదులు తీస్తున్నవాడల్లా ఎందుకో క్యాలెండర్‌ వైపు చూస్తూ, ‘ఇవ్వాళ ఏ వారంరా?’ అని అడిగాడు పక్కనే మా తమాషా చూస్తున్న హెల్పర్‌ను.

దీనికోసమైనా యజమాని తన మీద ఆధారపడ్డందుకు సంబరపడ్డట్టుగా, ‘శుక్రవారమన్నా’ అని అతడు జవాబిచ్చాడు. నాకు ధడిల్లుమంది. ‘ఇవ్వాళ శుక్రవారం, డబ్బులు వెనక్కి పోనివ్వం, రేపు ర’మ్మంటాడా కొంపదీసి?

తెలుగు సంసారి వెర్రినవ్వు ముఖంతో ఆ కౌంటర్‌ ముందు నిల్చున్న నాకు, ఈ మొత్తం హైరానా అంతా మనసులోంచి ఎగిరిపోయేలా ఒక ఆలోచన తళుక్కుమంది. ఇప్పుడు గనక ఇతడు డబ్బులు వాపస్‌ ఇస్తే పనయిపోయి లాభం; ఇవ్వకపోతే గనక దీనిమీద ఒక కథ రాసుకోవచ్చు. ఇన్‌స్పిరేషన్లు ఉత్తగనే వస్తాయేంటి మరి!

పేరు లేని పరిచయం
అలవాటైన స్థలంలో కాకుండా, ఎవరైనా మరోచోట కనబడినప్పుడు, ఈ ముఖం మనకు తెలిసినట్టుందే అని గుర్తు చేసుకుంటూ ఒక నిలిపే చూపు సారిస్తాం. ఎదుటివారి స్పందనను బట్టి అది ఒక చిరునవ్వుకు దారితీయవచ్చు. అయితే ఓసారి ఈ చూపు నాకు అవతలివైపు నుంచి వచ్చింది.

పిల్లలతో మృగవని పార్కుకు వెళ్తున్నాం. టికెట్స్‌ తీసుకునేటప్పుడు కండక్టర్‌ నా ముఖం మీద ఒకసారి ఆగింది. నాకు ఆమెవరో చప్పున స్ఫురించలేదు. కానీ ఆ ముఖాన్ని ఎక్కడో చూశాను. ముప్పైల్లో ఉంటుంది. బక్కపలుచటి దేహం. పంజాబీ డ్రెస్‌ మీద బూడిద రంగు అంగి వేసుకుంది. ‘మీ పిల్లలాన్నా?’ అని అడిగింది. ‘అవును’ అని చెప్తున్నాగానీ నాలో చిక్కు వీడలేదు. వంద నోటుకు చిల్లరతోపాటు టికెట్లు ఇచ్చి, ‘ఇవ్వాళ ఈ రూటేసిండ్రు నాకు’ అని చెబుతూ వేరే ప్రయాణీకుల దగ్గరకు వెళ్లిపోయింది. ఓహో! ఆమెవరో నిర్ధారించుకున్నట్టుగా, అప్పటికే కళ్లల్లో ప్రశ్న కనబడుతున్న నా భార్యతో ‘తాళ్లగడ్డ బస్సుల కనవడుతది’ అని చెప్పాను.

బంజారాహిల్స్‌ నుంచి తాళ్లగడ్డకు డైరెక్ట్‌ బస్సు దాదాపుగా దొరకదు. ప్రతిసారీ మెహిదీపట్నం వెళ్లి ఆటో ఎక్కాల్సిందే. కానీ అట్లా దొరికిన కొన్నిసార్లలో కొన్నిసార్లు ఈమే కండక్టర్‌గా ఉండటమూ, ఆమె నా ముఖాన్ని గుర్తించడమూ విశేషమే.

అట్లాంటి అరుదైన సందర్భం మళ్లెప్పుడో తటస్థించింది. ఆ రోజు బస్సు చాలా రష్షుగా ఉంది. స్కిప్‌ చేయొచ్చు, కానీ ఎందుకో ఇది మన బస్సు అనిపిస్తుంది, అందుకే ఎక్కేశాను. అంతమందిలో కండక్టర్‌ దోవ తీసుకుంటూ వస్తున్నప్పుడు, కొందరు జరిగీ కొందరు జరగకా ఒక రకమైన చికాకు ఆమె ముఖంలో ప్రతిఫలిస్తున్నప్పుడు, ఈమెవరో నాకు తెలిసిన ముఖమే అనిపిస్తూవున్నా, దాన్ని నిర్ధారించుకునేలా ఒక పరిచయపు నవ్వు నవ్వనీయకుండా, యాంత్రికంగా పది రూపాయలిచ్చి, ‘శారదానగర్‌’ అనేలా చేసింది ఆ ప్రతికూల వాతావరణం. ఆమె మిషన్‌లోంచి ప్రింటెడ్‌ టికెట్‌ చింపి నా చేతికిస్తూ, ‘మీరాన్నా?’ అంది నవ్వుతూ. బదులుగా నేనూ నవ్వాను. ‘ఏడాది, ఏడాదిన్నర అయుంటుంది కదా కనవడక’ అంటూ ముందుకు కదిలింది. ‘టికెట్, టికెట్‌.’ ఓ! అయితే, పిల్లల్ని నేను మృగవని పార్కుకు తీసుకెళ్లి ఏడాది, ఏడాదిన్నర అయివుంటుందా? ఊళ్లల్లో కాలాన్ని లెక్కించే పద్ధతి గుర్తొచ్చింది. ‘మా లింగంకు పుట్టెంటికలు తీసిన యాడాది తిరుపతికి వోయినం.’

టికెట్లు చకచకా ఇచ్చింది. ఫుట్‌బోర్డులో నిలబడిన కాలేజీ పిల్లల్ని అదిలించి పైకొచ్చేలా చేసింది. బస్సు మాసాబ్‌ట్యాంకు నుంచి ఎన్‌ఎమ్‌డీసీ వైపు మలుపు తిరుగుతున్నప్పుడు మళ్లీ అదే రద్దీలో దారి చేసుకుంటూ ముందున్న లేడీస్‌ వైపు వెళ్లడానికి మధ్యలో ఉన్న నన్ను దాటుతున్నప్పుడు, మర్యాద కోసం నేను ఆమె వైపు ముఖం పెట్టాను. ‘ఇప్పుడెక్కువ ఉప్పల్‌ రూట్ల వోతున్నా; ఇయ్యాల్నే ఇటొచ్చినా’ అంది. అట్లనా అన్నట్టుగా నేను తలాడించాను. నాకు దాదాపు అటువైపు పోయే పనుండదు. ఆమె ముందుకు వెళ్లిపోయింది.

ఈ బస్సులో మెహిదీపట్నంలో చాలామంది దిగిపోతారు. ఈసారి కూడా అట్లే సీట్ల మందం జనం ఉండేలా బస్సు ఖాళీ అయింది. ఆమె కొత్తగా ఎక్కినవారికి టికెట్లు ఇచ్చేసి, ఇంకెవరూ లేరని నిర్ధారించుకుని, నా దగ్గరకు వచ్చి నిలబడింది. ఈమెను ఏం ప్రశ్న అడగొచ్చు? ఏం పేరు? మీదేవూరు? ఒక మగ కండక్టరునైనా ఈమాత్రం పరిచయానికే పేరేమిటని అడగలేం. కాకపోతే క్యాజువల్‌గా ‘ఏ ఊరన్నా’ అనొచ్చు. కానీ మహిళకు అట్లాంటి ప్రశ్న వేయడం కూడా మర్యాద కాదనిపించింది. మరి ఇంక ఈమెతో నేను ఏం మాట్లాడగలను? అయినా తల తిప్పుకున్నట్టుగా ఉండటం మర్యాద కాదు కాబట్టి, ఆమె వైపు తలెత్తాను. ‘ఎక్కడ పనిజేస్తరన్నా?’ చెప్పాను. రెండు ఆఫీసు గురించిన ప్రశ్నలు. తర్వాత ఎటు సాగాలో సంభాషణకు తెలియదు. బస్సును ఓసారి కలియజూసి, వెనక ఖాళీ ఉన్న సీట్లోకి వెళ్లి కూర్చుంది.

కిలోమీటరున్నర దూరమే కాబట్టి, అప్పటికే దాదాపుగా వచ్చేశాను కాబట్టి, సీట్లోంచి లేచి, ఫుట్‌బోర్డు దగ్గరకు వెళ్లి నిల్చున్నా. బస్సు శారదా నగర్‌ స్టాపులో ఆగుతోంది. వెనక్కి చూడాలా, మామూలుగా దిగిపోవాలా? చివరి మెట్టు దిగుతూ తల తిప్పాను. ఆమె తన మానాన తను నోట్లు లెక్కపెట్టుకుంటోంది.

రెండో అనుభవం
మొదటి అనుభవం అయిన మూడేళ్ల తర్వాత గానీ నాకు మళ్లీ దాని మీద ఆసక్తి పుట్టలేదు. మధ్యలో ఒకట్రెండుసార్లు గుర్తొచ్చినా, అంత బలమైన కోరికేం కాదు. వేసవి సెలవులు రావడమూ, పెద్దోడు మా అమ్మ దగ్గరికీ, చిన్నోడు వాళ్లమ్మ దగ్గరికీ, తను విపాశన ధ్యానం క్లాసులని పది రోజులూ… ఇంట్లో ఒక్కడినే ఉండటమే దీనికి ప్రేరణగా పనిచేసి వుండాలి.

పాత దోస్తే. పాత లెక్కనే. శనివారం అనుకున్నాం. అవసరమైతే తెల్లారి ఆదివారమంతా పడుకునే ఉండొచ్చని.

ఈసారి పాత తప్పులు చేయదలుచుకోలేదు. తినకుండా మొదలెట్టొద్దు. దానికి ప్రిపరేషన్‌గా రెండు స్మాల్స్‌ విత్‌ ఉడికించిన పల్లీలు, నేనే పొద్దున నానబెట్టి వచ్చి పోయాక ఉడికించాను కొద్దిగా ఉప్పు వేసి. ఉలవ మొలకలు, ఇవి అంతకుముందు రాత్రి నానబెట్టి తెల్లారి బట్టలో కట్టిపెట్టాను, వెళ్లేసరికి చిన్న తెల్ల మొలకలు పుట్టినై… వీటిమీద సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, మూడు నాలుగు చుక్కల నిమ్మరసం పిండుకుని బుక్కాలని ప్లాను. అంటే ఆ చేసేదేదో కొంచెం ఆరోగ్యకరంగా చేద్దామని!

వంశీ వచ్చేసరికి ఎనిమిది దాటింది. నేను పొయ్యి మీద బియ్యం పెట్టాను. ఇంకో స్టవ్‌ మీద పోచ్‌డ్‌ ఎగ్‌ అని, మొన్న ఎందులోనో ఏదో చదువుతుంటే తగిలింది, అది ఎలా చేయాలో నెట్లో గాలిస్తే గిన్నెలో నీళ్లు పోసి, మరిగాక సుడిగుండం వచ్చేట్టుగా నీటిని తిప్పి, ముందే గిన్నెలో కొట్టిపోసుకున్న ఎగ్‌ అందులో పొయ్యాలన్నాడు. ‘అన్నా, మరి నేను రెడీ చేసుకోవన్నా?’ కొత్త లైట్స్‌ ప్యాకెట్‌ చేతికిచ్చాను. న్యూస్‌ పేపర్‌ ముందేసుకుని, బుద్ధిగా కూర్చుండి, సిగరెట్‌లోంచి తంబాకు రాల్చడం మొదలుపెట్టాడు. అయ్యో, ఇట్లా అని ముందే ఆలోచనవుంటే ఏ బ్రిస్టలో తెచ్చినా అయిపోయేది, డబ్బులు మిగిలేవి! పోచ్‌డ్‌ ఎగ్‌ కోసం ఫ్రెష్‌ ఎగ్‌ కావాలన్నాడు. తీరా నేను తెచ్చినవి చూస్తే శీగుడ్లయినాయి. అవి తినడమా? మానడమా? ఆ ప్రయత్నం ఫ్లాప్‌ అయింది. ఆనియన్‌ రింగ్స్‌ కూడా ఉన్నాయి కాబట్టి స్టఫ్‌ సరిపోతుందిలే.

ఇంకంతా మామూలే. హాల్లో చాప వేసుకుని కూర్చుని, అన్నీ ముందర పెట్టుకుని, ‘బిడ్డకు ఇప్పుడెంత వయసు?’ ‘రెండేండ్ల్లకొచ్చిందన్నా’ ‘రెండేండ్లు, ఆడపిల్లంటే… గిరగిర మాట్లాడుతున్నమటే’ ‘అవన్నా, వచ్చినవాయే పోయినవాయే అని ఇంట్ల మాట్లాడినట్టే మాట్లాడుతున్నది’… ఇవన్నీ ముగించి, అన్నాన్ని కొత్త నిమ్మకాయతొక్కుతో కొంచెం, పెరుగుతో కొంచెం తినేసే సరికి పదయినట్టుంది.

బయటికి వెళ్లేముందు గిన్నెలన్నీ జాగ్రత్తగా ఎక్కడివక్కడ సర్దాను, తక్షణం కడగ్గలిగేవి కడిగేశాను, మళ్లీ వాటిని తర్వాత కదిలించలేం. ఇంకా ముఖ్యంగా బెడ్రూమ్‌ కిటికీ తెరిచిపెట్టాను. తర్వాత కిటికీ రెక్కకూ నా రెక్కకూ సంయమనం కుదరకపోవచ్చు. కాళ్లకు అడ్డం తగిలేవి ఏమైనా ఉన్నాయా? స్టూల్‌ కొంచెం పక్కకు జరిపి, ముందు డోర్‌ బిగించి పెట్టి, ‘వంశీ, నువ్వు పడుకునేటప్పుడు వెనకాలి డోర్‌ వేయడం మాత్రం మరిచిపోకు’, ’సరే అన్నా’, తను హాల్లోనే చాప మీద పడుకుంటానన్నాడు కాబట్టి, మెత్త, చెద్దరు వేసి, ‘ఫ్యాన్‌ స్విచ్‌ ఇక్కడుంది నీకు తెలుసుకదా’ ‘ఓకే అన్నా’. అగ్గిపెట్టె ఎక్కడుంది?

ఎండాకాలమైనా బయట చలిగా ఉంది. నిన్న కురిసిన వర్షమూ మళ్లీ కురుస్తుందేమోనన్నట్టున్న వాతావరణమూ తగిన మూడ్‌ను ఇస్తున్నాయి. ‘అయిపోయినంక ఈ బట్స్‌ ఇక్కడ పడేయొద్దు, సింకు పక్కన కవరుంది చూడు, అందులో వేద్దాము’ ‘ష్యూర్‌ అన్నా’. కొంచెం ఉద్విగ్నంగానే ఉంది. ఊ, స్టార్ట్‌ చేద్దామా!

కూర్చుని, నాకోటిచ్చి, నాకు అంటించి, తను అంటించుకుని…

తెలిసిందే. పెదాల్లోకి చేదు. మామూలు పొగే. ఒకటి, రెండు, మూడు, ‘ఇంకేంటి? నీ జాబ్‌ బానేవుందా?’ ‘బానేవుందన్నా, స్కూలు పిల్లల్లెక్క. నైన్‌ టు ఫోర్‌’, నాలుగు, ‘పేషెంట్లు ఎంతమందొస్తరు?’ ‘ఓ యాభై’. ‘తక్కువనే’. ‘తక్కువనే, కానీ సంగారెడ్డి లెక్కల ఇదెక్కువన్నా’, ఐదు, ఆరు. ముందున్న చిన్న కళ్యామాకు చెట్టు కనబడుతోంది. దూరంలో ఒకట్రెండు మల్లెమొగ్గలు తెల్లగా. ఇంటిపక్కోళ్లు ఎవరో బాత్రూములోకి వచ్చినట్టున్నారు, ముందు వెలిగిన లైట్‌. ‘ఆ బట్స్‌ ఇవ్వు, నేను పడేసొస్తా’ ‘ఇంకొకటుంది, అది కూడా కాల్చేద్దామా?’ ‘ఏమైతలేదుగదా, ముట్టియ్యి’ ‘నువ్వు ముట్టియ్యన్నా’. తర్వాత ఫ్లష్‌ చేసిన శబ్దం. ఏడు, ఎనిమిది, ‘ఇగో’ లైట్‌ బందయింది. ఆ, ఆ, ఆ… నాభి కింద ఏదో తెలుస్తోంది. ఊఊఊ, ‘రంగులరాట్నం ఎక్కుతున్ననబ్బా.’ చిరునవ్వు. కడుపు ఊగినట్టయింది. కిందికీ మీదికీ. కిందీకీ మీదికీ కిందికీ మీదికీ. ‘పొట్ట కదిలినట్టయితుంది.’ ‘మనం స్మోక్‌ చేసినప్పుడు పొగ మొత్తం లంగ్స్‌కే కాకుండా కొంచెం ఇంటెస్టయిన్ లోకి కూడా పోతుందన్నా’. ఇప్పుడు కడుపులో రాయి ఏదో ఉండి, అది బరువుగా కదులుతున్నట్టుగా… పొట్ట కదలట్లేదు, కష్టంగా, రాయిని పెట్టినట్టు. గుండె డుమ్‌ డుమ్‌ డుమ్‌… ‘శ్వాస పెరిగినట్టయితుంది’ ‘పెరిగిందా? తగ్గిందా?’ మళ్లోసారి ఆగి చూసుకుని, ‘పెరిగినట్టే అనిపిస్తుంది’. డుమ్‌ డుమ్‌ డుమ్‌. అది నా గుండె చప్పుడా? ఇంక నేను లోపటికి వెళ్లాలి, ‘నువ్వు జాగ్రత్తగా వచ్చేసెయ్‌’ ‘ఏంకాదన్నా నువ్వెళ్లు, నేనొస్తా’.

నోరంతా కటిక చేదు. వాష్‌ బేసిన్‌. నీళ్లు మరీ చల్లగా తగిలినై. పళ్లు తోమి కడిగి ఉమ్మి, అయ్యో! ఇప్పుడు నీళ్లు ముట్టుకోవద్దుకదా, నీళ్లు ముట్టుకున్నానేంటి? శరీరం చల్లబడుతోందా? ఐసు తగిలినట్టుగా, ఒళ్లంతా ఏదో పొంగు వచ్చినట్టుగా… వెంటనే బెడ్రూములోకి వెళ్లి తువ్వాలతో తుడుచుకున్నా. వెర్రికుక్కలు నీళ్లు తాకొద్దంటారు కదా! భయంగా, బయటికి హడావుడిగా వెళ్లి, ‘ఇప్పుడు నీళ్లు తాగొచ్చా?’ ‘తాగొచ్చన్నా’ నాకొక్కసారి అట్ల అనిపించిందేంటి? బెడ్రూమ్‌లోకి వెళ్లి, మంచం మీద వెల్లకిలా పడుకుని…

శరీరం బరువుగా, మరింత బరువుగా, నిశ్చలంగా, ఎటూ కదలలేకుండా, కదల్చగలనా? కదిలేట్టులేను, చేయి కూడా కదలట్లేదు, ఇంత బరువుగా ఉందేమిటి? టక్‌ టక్‌… టక్‌ టక్‌… టక్‌ టక్‌… ఒంట్లోంచి సిరిసిల్లలో విన్న సాంచెల టకటక కొట్టుకునే శబ్దం… టక్‌ టక్‌… టక్‌ టక్‌… ఒక లయగా లోపలెవరో డమరు కొడుతున్నారు… టక్‌ టక్‌… టక్‌ టక్‌… మీసాల మీద ఏదో చిమచిమ… డమరు దిశ మారింది, అదే శబ్దం, మరింత బలంగా, అటూ యిటూ… అటూ యిటూ… అటూ యిటూ… చీమలు నడుస్తున్నట్టు పెదవుల మీద, మూతి మీద… అటూ యిటూ… ఒక క్రమంలో అటూ యిటూ… అటూ యిటూ… కదిలే శక్తి లేదా, కదలాలనిపించట్లేదా? నెమ్మదిగా ఎడమచేతి వేళ్లను… ఊఊ కదిలినై. లేచాను! ఈజీగా. ఈజీ. మళ్లీ తువ్వాలతో మూతి తుడుచుకున్నాను. ఇందాక మిగిలిన తడి అది. మళ్లీ వచ్చి, మళ్లీ అలాగే వెల్లకిలా పడుకుని…

మెదడు లోపల ఏదో మెత్తటి వలయం తిరుగుతోంది. ఒక రిథమ్‌తో. ఆలోచనా రహిత వలయం. బరువులేని వలయం. లోతుగా, నెమ్మదిగా, ఒక ధ్యానంలాగా, హాయిగా, మెదడును తేలిక చేస్తూ… జ్‌జ్‌జ్‌జ్‌… దాని మీద ఇంకో వలయం, డిస్ట్రాక్షన్‌… ఏవో గుర్తొస్తున్నై, నాకు తెలియకుండానే ఆ వలయాన్ని ఇది డిస్టర్బ్‌ చేస్తోంది… అచేతనంగా ఉన్న ఆలోచనలు… మెదడు బరువెక్కుతోంది, బరువుగా, కొట్టినట్టుగా, జ్‌జ్‌జ్, వద్దు, కాన్సంట్రేట్, కాన్సంట్రేట్‌… ఊఊమ్‌ తేలిగ్గా, హాయిగా, జ్‌జ్‌జ్‌… బరువుగా, ఒత్తుతున్నట్టుగా, కాన్సంట్రేట్‌… పళ్లు మరీ కరుచుకుంటున్నానా? నోరు తెరిచి, దవడలు రెండూ కొంచెం ఎడంగా పెట్టి, నాలుకను ఎక్కడుంచాలి? మధ్యలో ఆగట్లేదు. జ్‌జ్‌జ్‌జ్‌… మొదటిసారిలాగా బ్లిస్‌ రావట్లేదేంటి? ఆ అనుభూతి ఏది? ఇది వేరే ఉంది. ఇది వేరే. ఆ బ్లిస్‌ ఏది? అట్లా ఉండదా ఈసారి? హాయిగా ఉన్న వలయం చెదురుతూ, మళ్లీ పట్టాలెక్కుతూ… పిల్లలు గుర్తొస్తున్నారు. వాళ్ల ముఖాలు… ఆఫీసులో వాళ్ల ముఖాలు… ఒకదాన్నొకటి దాటిపోతూ… దీన్నంతా ఎవరైనా షూట్‌ చేయగలరా? ఒక పెయింటింగ్‌లాగా వేయగలరా? యానిమేషన్‌ కరెక్ట్‌. ముందు బ్లూ లైన్‌ తిరుగుతోంది. బ్లూ బ్లూ బ్లూ హాయిగా స్మూతుగా… రెడ్‌… చెదిరి… బ్లూ బ్లూ… రెడ్‌ దాన్ని చెదరగొడుతోంది. ఒక్కోసారి బ్లూ మీదే తిరుగుతూ ఒక్కోసారి పక్కకే తిరుగుతూ… బ్లూ బ్లూ బ్లూ… హాయి హాయి… బ్రేక్‌! బ్లూ బ్లూ రెబ్లూ రెబ్లూ… రెడ్‌ రెడ్‌ రెడ్‌.. బ్లూడ్‌ బ్లూడ్‌! ఈ పైనేమిటి? ఇది బ్లాక్‌ వలయం. ఇవి నేనుగా గుర్తుకు తెచ్చుకుంటున్న విషయాలు… రేపు ఆఫీసులో పని, చేయాల్సిన ప్రూఫులు… వంశీ నడిచిన చప్పుడు. హాల్లో. చెవుల్తో ఆలోచిస్తున్నాను. చెవుల్తో! బయట వర్షం చినుకులు. గాలి వీస్తోంది. ఎవరిదో కిటికీ రెక్క కొట్టుకుంటోంది. ఇదంతా ఎల్లో వలయం. ‘నువ్వింకా పడుకోలేదా?’ ‘ఒక ఫోన్‌ వస్తుందని చూస్తున్నాన్న’ బ్లూ డిస్టర్బ్‌ అయిపోయింది. బ్లూ డిస్టర్బ్‌ అయిపోయింది. నాకు అర్థమౌతోంది, నేను ఎందుకు ఎక్కువ ఆలోచించి జీవితాన్ని స్పాయిల్‌ చేసుకుంటున్నానో! నాకు అర్థమౌతోంది. బ్లూ రెడ్‌ బ్లూ రెడ్‌… తల నొప్పి, పోటు. ఇదే ఇదే లేదు నాకు. ఈ ధ్యానం లేదు. ఇది చెదరకుండా లేను. నాకు ఇది అర్థం చేయించడానికే ఇదంతా జరుగుతోంది. ఆలోచనారహితంగా ఉండటంలోని ఆనందం. కామ్‌ కామ్‌. తల వాల్చు. మళ్లీ రెడ్‌. దాహం. కొన్ని నీళ్లు తాగొద్దాం. దాహం. మళ్లీ ఈజీగానే లేచాను. కిచెన్‌లోకి వెళ్తూ, ‘వంశీ, వంశీ, చెద్దరు కప్పుకోలేదేంటి?’ ‘ఎండకాలమే కదన్నా’ ఫోన్‌ ఇతడు తల దగ్గర పెట్టుకుని పడుకుంటాడేమిటి? కిచెన్‌లోకి వెళ్లి, గ్లాసెడు నీళ్లు తాగి, మరికొన్ని ముంచుకుని తాగి, బెడ్రూములోకి వచ్చి, కిటికీలోంచి, బయట వర్షం పడుతోంది, చినుకుల చప్పుడు. దారి ఖాళీగా ఉంది. కానుగ చెట్టు ఊగుతోంది. అన్వర్‌ గారికి మెసేజ్‌ పెట్టాలి. రేపటికి కార్టూన్‌ కావాలి. ముందు వద్దనుకున్నాం. ఇప్పుడు చెబితే ఈ నిద్రలో… కొంచెం కోపం రాకుండా, ‘తెల్లారి ఈ మెసేజ్‌ చూడగానే తిట్టుకోవద్దు సార్‌’… సెంట్‌. మంచం మీద పడుకుంటే, మళ్లీ బరువుగా, మళ్లీ ఏదో అవుతుండగా. ఇదేదో బాగుంది. కిటికీ తీసుకుని బయటకు రావొచ్చు, కిటికీ మూసుకుని మళ్లీ లోపలికి వెళ్లిపోవచ్చు. ఈసారి అనుభవంలో వేరియేషన్‌ లేదు. ముందులా లేదిది. గాఢంగా లేదు. కానీ ఈ ఆలోచనల వలయం. ఇది రేపటికి గుర్తుంటుందా? డైరీలో రాద్దాం. మళ్లీ హాల్లోకి వెళ్లి, డైరీ ఎక్కడ? పెన్‌ పెన్‌ ఏది? లైట్‌ వేసి, చిన్న స్టూల్‌ మీద కూర్చుని, రాయగలనా? రాస్తున్నా. ఫోర్‌ లేయర్స్‌ ఆఫ్‌ థాట్‌ ప్రాసెస్‌. చిన్న సర్కిల్‌. ఇది డీపర్, మెడిటేటివ్‌ థాట్‌. ఒక రిథమ్‌ ఉంది ఇందులో. రెండోది బ్లర్రీగా, ముందుదాన్ని చెదరగొడుతూ… డాటెడ్‌ సర్కిల్‌. మూడోది చేతన సర్కిల్‌. నా స్పృహతో గుర్తుతెచ్చుకుంటున్న అంశాలు. నాలుగోది బయటి శబ్దాలను గుర్తిస్తున్న స్పృహ. వంశీ నడవడం, చెట్ల ఆకులు కదలడం. ఇక ఐదవది, నేను పార్టిసిపేట్‌ అవుతున్న యాక్షన్‌. నీళ్లు తాగడం, ఈ డైరీ రాయడం. రాయడం పూర్తి చేసి, టైమెంత? రెండూ ఇరవై. పీఎం. కొట్టేసి ఏఎం. మళ్లీ వచ్చి మళ్లీ మంచం మీద, మళ్లీ బరువుగా, మళ్లీ ఏదో అవుతుండగా.

తెల్లారి లేచేప్పటికి ఏడవుతోంది. ‘ఎట్లుందన్నా?’ ‘ఉందో రకంగా.’ వంశీ పోవడానికి రెడీ అవుతున్నాడు. ‘ఆగు, లెమన్‌ టీ తాగుదాం’. కళ్లు కొంచెం బరువుగానే ఉన్నాయి. పొయ్యి మీద నీళ్లు సిమ్‌లో పెట్టి, పిసరంత చాయ్‌పత్తా, మూడు చంచాల చక్కెర వేసి, బ్రష్‌ చేసుకునొచ్చి, గ్లాసుల్లోకి దాన్ని వడగట్టి, నిమ్మరసం నాలుగు నాలుగు చుక్కలు పిండి… ‘బాగుందన్నా’. పేపర్‌ ఏదో వచ్చింది. తియ్యలేదు. ‘పోతవా ఇగ?’ బయటికి వెళ్లి, బై చెప్పి, అట్లానే కూర్చీలో కూర్చుని, బరువుగా మగతగా చిత్రంగా… ఎనిమిదవుతోంది. బాపు నుంచి ఫోన్‌. కట్‌ చేసి చేశాను. పెద్దోడు. ‘నానా, మంచిగున్నవా?’ ‘బాగున్నరా బుజ్జి, ఏం జేస్తున్నవురా?’ ‘నానా, అన్విగాడు మేకను తెచ్చిండు నానా’ ‘అరే, అట్లనా?’ ‘వాడెట్ల పెంచుతడు నానా దాన్ని?’… ‘నానా’ ‘నానా’ ‘హలో’ ‘హలో’ ‘హలో బుజ్జి, చెప్పురా’ ‘హలో నానా’ ‘చెప్పు బిడ్డా’ హలో హలో ఇంకేదో లైను మధ్యలోకి. కట్‌ కాదూ మాట్లాడరాదూ. ఇంకెవరో మాట్లాడుతూ గర్‌గర్‌గర్‌. ‘నానా’ ‘హలో’ బ్లూ మీద రెడ్‌. బ్లూ మీద రెడ్‌. రెడ్‌ రెడ్‌!

తడిబల్ల – పొడిబల్ల
పార్కుకున్న చిన్న గేటు దగ్గరికి చేరుకునేసరికి, రోజూ కనబడే నలుగురైదుగురు మధ్యవయస్కులు నడక సాగిస్తూవున్నారు. పార్క్‌ మెయింటెయిన్‌ చేసే వ్యక్తి పచ్చిక మీద నీళ్లు పడుతున్నాడు. పొద్దుటిపూట జనం ఉండగా ఎప్పుడూ నీళ్లు పట్టడం చూడలేదు. నేను రౌండ్‌ మొదలుపెట్టి, కొంత దూరం వెళ్లేసరికి నా రాతిబల్ల మీద తడి కనబడింది. ‘గాడిదిగాడు తడిపినట్టున్నాడు.’

పార్కుకు రెండు వైపులా రెండేసి ఒరిగి కూర్చునేలా రాతికుర్చీలుంటాయి. మరో రెండువైపుల్లో ఒక వైపు రెండూ, ఇంకోవైపు ఒకటీ రాతి బల్లలు ఉంటాయి. నేను చేయాల్సిన రన్నింగ్‌ చేశాక, ఈ రాతిబల్ల మీద, ఒకవైపు రెండున్నవాటిల్లో ఒకటి, నిజానికి అవతలి వైపు విడిగా ఒకటున్నదే ఏకాంతంగా ఉంటుంది కానీ పార్కులో ఉన్న ఒక విడి ట్రాక్‌ ఆ రాతిబల్లకు దగ్గరగా ఉంటుంది కాబట్టి, నేను ఈ రెండున్న వైపు దాన్లోనే ఒకదాన్ని నాదని అనేసుకున్నాను, దీని మీద పడుకుని పుషప్, బ్యాకప్‌ లాంటివి చేస్తుంటాను. అయితే మరీ అంత తడి ఏమీలేదు. అంచుల్లో నీళ్లు పడ్డాయంతే. కాబట్టి నా రొటీన్‌ చేసుకోవచ్చు.

శారదానగర్‌లో ఉంటున్న పదేళ్లకుగానీ ఎక్సర్‌సైజ్‌ చేయడానికి తగిన క్రమాన్ని కనుక్కోలేకపోయాను. పిల్లల్ని ఏడు ఇరవైకి స్కూలు బస్సు ఎక్కించేసి, అట్నుంచే పార్కుకు వచ్చేస్తే సరి! చిన్న పార్కే. కానీ పన్నెండు రౌండ్లు కొడితే చెమట పట్టేంత పెద్దది. అంతకుముందు పిల్లలతో పాటు తినేయాలని, అంటే రోజుకు నాలుగు పూటలు తినాలనే ప్రణాళికలో భాగంగా, పిల్లలకంటే ముందు లేచి వ్యాయామం చేయడానికి ప్రయత్నించి, ఒక్కోసారి బద్దకం వల్ల లేవక ఆగిపోయేది; పిల్లలతోపాటే లేస్తే పొద్దుటి హడావుడిలో ఏదైనా సాయం చేయాల్సి వచ్చి, వచ్చి కాదు, చేసి తీరాల్సి వచ్చి, కాడా పడేది. మూడు పూటల భోజనం చాలని తేల్చుకున్నాక, నా పొద్దుటి తిండి సమయాన్ని ముందుకు జరపడంతో ఈ వ్యాయామానికి నిర్దేశిత సమయం కుదిరింది.

నా రన్నింగ్‌ అయింది. వ్యాయామం మొదలైంది. నడకదారుల్లో కొందరు వెళ్లిపోయారు, కొందరు వచ్చి చేరారు. నీళ్లు పడుతున్న మనిషి పైపు చుట్టేసి ఇంట్లోకి వెళ్లిపోయాడు. పార్కు మూలకే ఒక చిన్న గది ఉంటుంది. అందులోనే అతడి ఇద్దరు కొడుకులు, భార్య ఉంటారు. అతడు ఈ బల్లలన్నింటినీ పూర్తిగా కడిగేసివుంటే బాగుండేదే! మంచిగా శుభ్రమయ్యేవి కదా! అతడికి ఈ ఆలోచన ఎందుకు రాలేదు? ఎటూ గడ్డికి నీళ్లు పట్టినప్పుడు వీటి పైకికూడా పట్టేయాలన్న ఇంగితం ఎందుకు లేదు?

అలుపు తీర్చుకోవడానికి తలకింద చేతులు పెట్టుకుని బల్ల మీద విరామంగా పడుకున్నాను. సీజన్‌ అయిపోవడంతో మూలనున్న పెద్ద కానుగ చెట్టు పూలను బలహీనంగా రాలుస్తోంది. దాని కొమ్మల మీదుగా నీలి ఆకాశం కనబడుతోంది. తెల్లటి మబ్బులు కదులుతూ వస్తున్నప్పుడు ఈ తెల్లరంగు కాంట్రాస్టుగా ఆకాశం నీలపుదనం మరింత చిక్కనవుతోంది. గూడు కట్టుకోవడానికి కావొచ్చు, చుక్కల గువ్వ ఒకటి ఎండిన గడ్డిపోచను ముక్కున కరుచుకుని ఎగురుతూ పోయింది. వాకర్స్‌ అడుగుల చప్పుళ్లు వినబడుతున్నాయి. పాతకాలపు సన్నమీసాల హీరోలా ఉండే నల్లటి అంకుల్‌ చాలా వేగంగా నడుస్తాడు. ప్రతి నమస్కారం చేయడమే తన వయసుకు సార్థకత అన్నట్టుగా ముఖమంతా విప్పార్చుకుని కళ్లు కలపడానికి సిద్ధంగావుండే పెద్దాయన అడుగులు రాసినట్టుగా పడతాయి. అందరి మీదా తియ్యటి ఆధిపత్యం చలాయించే (‘అప్పుడే కూలబడ్డారేంటీ, లేవండి లేవండి.’) సెక్సీ తెల్లాంటీ అడుగులు మృదువుగా పడతాయి. బట్టతలలో కూడా అందంగా ఉండే కళ్లజోడు అంకుల్‌ చెప్పులు టిక్కుటిక్కుమంటాయి. ఒకాయన ఫ్యామిలీ చరిత్ర మొత్తం ఫోన్లో ఏకరువు పెట్టుకుంటూ నడుస్తాడు (‘నా బామ్మరుదులు మంచిగ సెటిలైతే నాకే గద మంచిపేరు’). అరగంట కాలావధిలోనే నేను రెండు రకాలుగా ఆలోచించాను. ఇందులో ఏది నేను? ఏది కరెక్టు? మబ్బులా నా నుంచి నేనే జారిపోతున్నప్పుడు ఏ దృక్కోణం నాదనుకోవాలి?

టెన్తు వరకు కీసరగుట్ట హాస్టల్లో ఉన్నప్పుడు–-ఎ, ఎస్, పి, వీఆర్‌–-ఈ బ్యాచొకటి ఉండేది; వీళ్లు బుద్ధిగా చదివే గ్యాంగు; సహజంగానే నేను ఇందులో కలిసిపోయేవాణ్ని. అట్లానే, ఎన్, కె, జి–-కబడ్డీ ఆడటం, డైనింగ్‌ హాల్లోంచి దొంగతనంగా ఉల్లిగడ్డలు ఎత్తుకొచ్చి అంచుకు తినడం ఈ బ్యాచీ ప్రత్యేకతలు. నేను ఇందులోనూ చేరేవాణ్ని. ఎం, ఏఎన్, కేఆర్‌–వీళ్లు ఒకటి. ఇది దొంగతనంగా సినిమాలు చూసే బ్యాచీ. నేనూ స్టడీ అవర్స్‌ తప్పించుకుని ఎన్నో సినిమాలు చూసొచ్చాను. తమాషా ఏమిటంటే, ఉల్లిగడ్డల బ్యాచీకి సినిమాలంటే ఇంట్రెస్టు ఉండదు; చదివే గ్యాంగుతో ఉంటే ఉల్లిగడ్డలు దొరకవు. కాబట్టి, అన్నింట్లోనూ నాక్కావాల్సింది నేను కొంత కొంత వెతుక్కునేవాణ్ని. వాళ్లకూ నాకూ తేడా ఏమిటంటే, వాళ్లు రాజాల్లా సినిమా చూసొస్తారు; నేను గుండెల్లో గుబిల్లు గుబిల్లుతో ఆ పని చేస్తాను. ఉల్లిగడ్డలు పట్టుకొచ్చేవాళ్లు అవసరమైతే వంటాయన్ని ఒక మాట అనగలరూ పడనూగలరూ. నేను అనలేనూ పడలేనూ. మంచో, చెడో ఏదో ఒకదానికి స్థిరీకరించుకోగలిగే స్వభావం నాకెందుకు లేదు? అందరితో ఉండి ఎవరికీ చెందక, ఎవరితోనూ పూర్తిగా ఉండకపోవడం వల్ల కూడా ఎవరికీ చెందక… ఎందుకిలా నేను? పోనీ, ఏ దృక్కోణం లేదన్న దృక్కోణం ఉన్నవాడిగానైనా చెప్పుకుందామంటే, నీళ్లు పట్టినతణ్ని మనసులో కూడా ‘గా… గాడు’ అనుకోకుండా ఉండగలిగే గాడిదితనం లేకుండా అయినా ఎందుకు లేను?
----------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment