Wednesday, December 26, 2018

పోతన కవిత్వ పటుత్వము


పోతన కవిత్వ పటుత్వముసాహితీంిత్రులారా!

“ముక్కుతిమ్మనార్యు ముద్దుపలు”కన్నట్లే పోతన్నది సహజ పాండిత్యమనీ అతను రామభక్తి పరాయణుడనీ సహృదయులు తమ అభిప్రాయాన్ని ‘గుళిగారూపం’గా ప్రకటించారు. దానితో ఇటీవలి పాఠక లోకానికి బమ్మెర పోతరాజూ, యెడ్ల రామదాసూ ఒక్క తరగతి రచయితలుగా కనబడ నారంభించారు.

సహజ పాండిత్యం కాబట్టి పోతన్న ఆంధ్ర శబ్దచింతామణిగానీ కనీసం చిన్నయసూరి పాటైనా గానీ నేర్చుకొని ఉండడు. కాబట్టి అతని కవిత్వంలో వ్యాకరణ దోషాలూ, తప్పుడు సంధులూ కనబడతాయి. రఱ ల పరిజ్ఞానం అసలే లేదు. అందుచేతనే అప్పకవిలాంటి లాక్షణికులు పోతరాజును ప్రామాణిక కవిగా అంగీకరించలేదు.

… కాబట్టే పోతన్న ఆంధ్ర జనసామాన్యానికి అభిమాన కవి కాగలిగాడు. భారత రామాయణాలలోని ఒక్క పద్యమైనా నోటికి రానివారు చాల మంది భాగవతంలోని పద్యాలను పఠించగలరు.
మరే మెరుగూ లేకపోయినా రచనలో శబ్దాడంబరమైనా ఉంచాలని పోతన్న అంత్యానుప్రాస కోసం ప్రాకులాడి నిఘంటువులన్నీ గాలించాడని కొందరనుకున్నారు.

ఇక పోతన రామభక్తుడన్నారు సహృదయులు. కాబట్టి అతని కవిత్వం భక్తిప్రేరితమూ, భక్తిపూరితమూ. ’భక్తిఆవేశంవల్ల ఒళ్లు మరచి ఏదో అన్నాడు, ఏదో వ్రాశాడు; ఆ భక్తి సంబంధమైన గొడవ మినహాయిస్తే ఇంక పోతనలో కవిత్వమేమి కనబడుతుంది?; అన్నారు మరికొందరు విద్యాధికులూ విమర్శక ప్రముఖులూనూ.

అయ్యో! పోతనామాత్యా! నీవు ‘దుర్గ మాయమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్’ అని అర్థించినదంతా వ్యర్థమేనా? ‘కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ’ నేడుస్తున్నట్లు కనిపించిన సరస్వతి దృశ్యమంతా నిఘంటువుల నిషాయేనా? ‘ఇమ్మనుజేశ్వరాధముల’ కివ్వనని చెప్పుతూ ‘సత్కవుల్ హాలికులైననేమి? గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులైననేమి?’ అని సత్కవిగా సగర్వంగా చెప్పినదంతా వట్టి బాకా ఊదుడేనా?

అభిప్రాయ గుళికలవల్ల కలిగిన అనర్థమిది. ఆనాటి సహృదయులు ఆ కవులలోని గుణాలన్నీ చూచినవారే. అందులో మరీ స్ఫుటంగా ఉన్న ఏ గుణాన్నో ఒకదాన్ని గుళికా రూపంలో ప్రకటిస్తారు. తక్కిన కవితా విశేషాలు లేవని వారెప్పుడూ అనలేదు. అయినా ఆ గుళికా ప్రభావం విపరీతంగా పరిణమించింది.

వారు పేర్కొన్న గుణమొక్కటే ఆ కవిలో ఉన్నట్టూ, తక్కిన గుణాలు ఏవిగూడా లేనట్టూ ఇటీవలి పాఠకలోకం అర్థం చేసుకుంది. రసపోషణగాని, కవితా శిల్పంగాని, భావ నిరూపణంగాని, విషయచిత్రణం గాని ఆ కవిలో ఉంటాయని అనుకోరు. చూద్దామని శ్రద్ధగూడ తీసుకోరు.

పోతన్న అంత తేలికగా త్రోసివేయదగినవాడు కాడు. ఎందరో మహానుభావుల కన్న మిన్న. అమర్త్యకాంత అయిన ఆంధ్ర కవితా పితామహుని వరూధిని మర్త్యకాంతగా పుట్టకపోయానే అని విచారిస్తుంది. చూడండి-

ఎంత తపంబు చేసి జనియించినవారొక మర్త్యభామినుల్
కాంతు డవజ్ఞ చేసినను కాయము వాయుదు; రే నమర్త్యనై
చింతల వంతలం జిదికి సిగ్గరితిన్; మృతి లేని నాదు చె
ల్వింతయు శూన్యగేహమున కెత్తిన దీపికయయ్యె నక్కటా!

ఈ విధంగా వరూధిని గణితంలో ఒక లెక్కచేసినట్టు, లాయర్ వాదించినట్టు చింతిస్తుంది. ఇక పోతనగారి గోపిక అలా కాదు. యమునా తీరంలో ఒక వెదురుమొక్కగా పుట్టకపోయానే అని విచారిస్తుంది.

నా మోసంబున కెద్దిమేర వినవే నా పూర్వజన్మంబులన్
లేమా నోములు నోచుచో నకట కాళిందీతటిన్ వేణువై
భూమిన్ పుట్టెదనంచు గోరగదే బోధిల్లి; యట్లైన నీ
బామం దిప్పుడు మాధవాధరసుధాపానంబు గల్గుంగదే!

ఇది స్త్రీభావ సహజంగా, రసముట్టిపడేటట్టుగా ఉన్నది.

వామనావతార ఘట్టంలో పోతన చూపిన ‘కవిత్వపటుత్వము’ అసాధారణం. ఆ ఘట్టాన్ని అంత సమర్థతతో చిత్రించగల కవులు ఒకరిద్దరు మించి ఉండరు. బలిచక్రవర్తి దానాన్ని గ్రహించి వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండం నిండిపోతాడు. వటు డింతింతై మరింతై పెరిగి పోతూండటం పోతన్న హృదయానికి ప్రత్యక్షంగా కనిపిస్తూంది. ఆ విధంగానే పాఠకునికి గూడా కనబడాలి గదా! ఆ బ్రహ్మాండత్వం పాఠకునికి ప్రస్ఫుటం కావాలి గదా! అలా జరిగినప్పుడే గదా ఆ రసం పలికినట్టవుతుంది!

ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థియై.

అని వర్ణించాడు. ఆకాశవీధి, మేఘమండలం, కాంతిరాశి, చంద్రుడు, ధ్రవుడు, మహర్వాటి, సత్యపదం అని ఆ రూపాన్ని పెచాడు. కానీ మహాద్భుతాకారమెంత పెద్దదో కంటికి కట్టినట్టయిందా? తృప్తి లేదు. కాబట్టే –

రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

అని వర్ణించి కృతార్థుడయ్యాడు. ఆ మహాద్భుతరూపాన్ని ప్రత్యక్షంగా చూపించి పాఠకులను చరితార్థులను చేశాడు పోతన్న. నడిమింటి నున్న సూర్యబింబాన్ని చూడమన్నాడు. అది యెంత యెత్తున ఉందో, ఎంత పైకిపోతే దాన్ని తాకగలమో ఊహారూపంగా ప్రతి పాఠకుడికీ తెలుసును. దృష్టిని ఆ బింబం మీదనే ఉంచి పోతన్న వామనుడిని పెంచాడు. వామనుడికది గొడుగులా గుందన్నాడు. ఇంకా పెంచాడు. ఇప్పు డా బింబం తలలో పెట్టుకున్న రత్నంలా గుందన్నాడు. ఇంకా పెంచాడు. చెవి పోగులాగుంది. ఇంకా – కంఠాభరణంలాగ; ఇంకా – భుజకీర్తిలాగ; ఇంకా – కాలి అందెలాగ; ఇంకా పెంచాడు – ఆ బింబం పాదపీఠంలా గుందన్నాడు. ఎంత పెద్ద ఆకారాన్ని ఎంత స్ఫుటంగా చిత్రించాడో చూడండి. పోతన్న శిల్పనైపుణ్యం ఏమనగలం? మన మహాకవులెందరీ మహాకార్య మింత అందంగా నిర్వర్తించగలరు? అనకూడదు గాని భగవద్గీతలోని విశ్వరూప సందర్శన ఘట్టంలో నైనా ఇంతటి స్ఫుటత్వం ఉందేమో చూడండి-

ద్యావా పృథివ్యో రిద మంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః
దృష్ట్వాద్భుతం రూప ముగ్రం త వేదం
లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్.

ప్రహ్లాదచరిత్రలో నృసింహావతార వర్ణన ఎందరు కవు లా రీతిని వర్ణించి సాధకులకు సాక్షాత్కారం కలిగించగలరో యోచించినట్లయితే పోతన కవిత్వ పటుత్వం నిస్సందేహంగా తేటపడుతుంది.

గజేంద్రమోక్ష ఘట్టంలో పోతన చూపిన మహాకవి లక్షణాలు అమోఘములు. గజేంద్రుడి ప్రార్థనలో జ్ఞాన భక్తి వైరాగ్య ప్రపత్తులను ఏ విధంగా సోపానాలుగా ఉపయోగించాడో చూడవలసినదే. విష్ణుమూర్తి భక్తవాత్సల్యం ప్రకటించటానికి పోతన వేసుకున్న పథకం కేవల భక్తిప్రేరకమే కాదు, అత్యుత్తమ కవితా భరితం కూడా. నిరాటంకంగా లక్ష్మీదేవితో కాలం గడుపుదామని నిశ్చయించుకున్న విష్ణుమూర్తితో మనలను ఆ వైకుంఠపురంలో, నగరిలో, ఆ మూల సౌధం దాపల, మందారవనంలో, సెలయేటి ప్రక్కనున్న కలువతిన్నె దగ్గరకు పోతన్న తీసుకెళ్లాడు. అక్కడ మంచి రసవంతమైన పట్టులో గజేంద్రుడి మొర వినిపించాడు. క్షణంలో రమావినోదితనం ఎగిరిపోయింది. ఆపన్న ప్రసన్నత మూర్తీభవించింది. ఆ పైటచెంగు పట్టుకునే విష్ణువు సంరంభంతో బయలుదేరాడు. ఆ సంరంభం ఒక మహా ప్రవాహంలాగా కవి హృదయంలో పరుగెడుతూ వుంది. ఆ ప్రవాహ వేగంలోకి మనల నీడ్చాడు పోతన మూడు పద్యాలలో. సిరికి చెప్పకుండా, శంఖ చక్రాలు తీసుకోకుండా విష్ణువు వెళ్తున్నాడు. చేతిలో పైట చెంగు చేతిలోనే ఉంది. లక్ష్మి పాపం ఏమో తెలియక శాటీముక్త కుచంబుతో తాటంకా చలనంబుతో వెంటపడ్డది. కలువతిన్నె నుంచి తిరుగు ప్రయాణం ఆరంభమయింది. ఆ మందారవనంలో మరెవ్వరూ లేరు కాబట్టి వెంటన్ సిరి మాత్రమే. తరువాత ఆ మూల సౌధంలో కొస్తారు. అక్కడున్న అవరోథ వ్రాతం వెంట పడుతుంది. చావడిలో పక్షీంద్రుడు మొదలైనవారు. నగరి వెలుపలికి వచ్చేసరికి వైకుంఠంలోని ఆబాల గోపాలం వెంటబడ్డారు. వారిలోనే మనమూ ఉన్నట్టు పోతనకవి చేశాడు. చూడండా క్రమం-

తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధ వ్రాతము; దావి వె
న్కను పక్షీంద్రుడు; వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖచ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్.

పద్యారంభంలో ‘వెంట’ ‘వెన్క’ ‘పొంత’ అన్న మాటల నుపయోగించిన పోతన్న పోనుపోను సంరంభాతిశయం వల్ల వాటి నుపయోగించటం మానుకున్నాడు. తానూహించిన సంరంభభావాన్ని పాఠకుల హృదయాల్లో ఇంత చక్కగా ప్రతిఫలించినట్టు చేసిన పోతనలో కవితావిశేషం లేదా?

ఇంతేకాదు. అతిసున్నితమైన మానసికావస్థలను చిత్రించటంలో కూడా పోతన్న ఏ కవికీ తీసిపోడు. పాత్ర హృదయం తనదిగా చేసుకొని దానికి సరిపోయినట్టు భావాలను ప్రకటించగలగటం పోతన్న కలవడినట్టు ఎందరికో అలవడలేదు.

రుక్మిణి తన బ్రాహ్మణుడిని కృష్ణుని దగ్గరకు పంపించింది. ఇంకా రాలేదు. ఇక్కడ వివాహ ప్రయత్నాలు సాగిపోతున్నాయి. కూర్చుని అనుకుంటూంది-

ఘను డా భూసురు డేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచ్చేయునో యీశ్వరుం
డనుకూలింప దలంచునో తలపడో ఆర్యామహాదేవియున్
నను రక్షింప నెరుంగునో యెరుగదో నా భాగ్య మెట్లున్నదో!

ఈ పద్యంలో పోతన రుక్మిణీ హృదయంలో ప్రవేశించాడు. అనిన మాటలు కొన్ని; అనకుండా ఉన్న ఊహలు కొన్ని. అతిమనోహరమైన పద్యం. ‘భూసురుడేగెనో’ అన్నదేగాని ‘లేదో’ అనలేదు. ఆ ఘనుడి విషయంలో వెళ్లకపోవటమన్న ఊహ కూడా రుక్మిణి సహించలేదు. మార్గాయాసం వల్ల కొంచెమాలస్యమై యుంటుందని సమర్థించుకొని, “వెళ్లే ఉంటాడు. కృష్ణుడితో చెప్పేఉంటాడు.” అనుకొన్నది. విని కృష్ణుడిది తప్పుగా భావించి ఉంటాడా? అని ప్రశ్నించుకుంది. అతనలాగ తలచేవాడు కాడే అనుకొని ‘విచ్చేయునో’ అన్నదేగాని ‘విచ్చేయడో’ అనలేదు. ఆ ఊహే తనకు దుర్భరం. ‘లేదు’ అన్న పదం తన నోట పలకదు. తానూ, భూసురుడు, కృష్ణుడు అయిపోయారు. ఇక మిగిలినది దేవతలు. వారిలో ఇష్టదైవతం ఆర్యామహాదేవి. నలుగురితో పాటు తనకూ ఈశ్వరుడే దేవుడు. ఆర్యాదేవంతటి దగ్గరి దైవం కాడు. కొంచెం దూరం. వీళ్లను గురించి సందేహముంది. ‘ఈశ్వరుడు అనుకూలించటానికి తలుస్తాడో తలపడో’ అన్నది – అంత పరిచయం లేదు కాబట్టి. ఆర్యామహాదేవి విషయంలో తలుస్తుందో లేదో అన్న సందేహం రుక్మిణికి లేదు; తప్పకుండా తలుస్తుంది. తనకు నమ్మకమే. కాని ఆమెకు తన్ను రక్షించే ఉపాయం తెలుసునో తెలియదో! ఉన్న సందేహమంతా అదే. ఉపాయం తెలిస్తే తప్పక రక్షిస్తుందన్న మాటే. ఇంత వ్యత్యాసముంది కాబట్టే పోతన్న ఈ రెండు సందేహాలను ఈ విధంగా ప్రకటించాడు. విషయ విశ్వాసాన్నింత చక్కగా ప్రదర్శించగల సమర్థులు మన కవుల్లో ఎందరున్నారు?

ఇన్ని విషయాల నింత రసవంతంగా చిత్రించ గలిగినవాడు కాబట్టే పోతన్న ఆంధ్ర జనసామాన్యానికి అభిమాన కవి కాగలిగాడు. భారత రామాయణాలలోని ఒక్క పద్యమైనా నోటికి రానివారు చాల మంది భాగవతంలోని పద్యాలను పఠించగలరు. ఇటువంటి పోతనలో కవిత్వ విశిష్టత లేదనీ, ఇతను వ్యాకరణం రాని సహజ పండితుడనీ, అంత్యప్రాసకోసం నిఘంటువులకు ప్రాకులాడే వాడనీ భావించడం కూడనిపని. ఇంకా సందేహముంటే ఏదైనా ఒక్క ఘట్టం సంస్కృత భాగవతంతో సరిపోల్చి చూస్తే పోతన కవిత్వపటుత్వం కరతలామలకం కాకతప్పదు.
---------------------------------------------------------
రచన - శ్రీ తాపీ ధర్మారావు
(పరిశోధన, 1954
పొద్దు.నెట్ సౌజన్యంతో

No comments:

Post a Comment