Friday, December 7, 2018

భాగ్యలక్ష్మి


భాగ్యలక్ష్మి




సాహితీమిత్రులారా!

వృద్ధాప్యం. దానికి బంధువు రిటైర్‌మెంటు. ఇప్పటికి రెండేళ్ళు కావస్తోంది కాశీవిశ్వనాధ్‌ రిటైర్‌ అయ్యి. పెద్దగా చదువుకోలేదూ, పెద్ద పెద్ద ఉద్యోగాలు అంతకన్నా లేదు. తను చేసిన ఒక్కగానొక్క మంచిపని, ఒక్క పిల్లాడితో సంతానం ఆపేయటం. మొదట్లో సైకిలు కోసమే ఆపరేషను చేయించుకొన్నా,  ఖర్చులు పెరిగే సరికి తెలిసొచ్చింది, తన సంపాదనకి ఒకడు చాలని. ఇప్పుడదే తనని రిటైరు మెంటులోనూ పని చేయకుండా కాపాడింది. కొడుకు మంచి చదువు చదువుకొని పాలిటెక్నిక్‌ చేసి హెచ్‌.ఎం.టీ. లో పని చేస్తున్నాడు. తనకొచ్చే కొద్దిపాటి పింఛను, పైఖర్చులకి పోగా, కొడుకూ, కోడలూ,మనవడితో చక్కగా కాలనీ జీవితం, సుఖంగా అనుభవిస్తున్నాడు విశ్వనాధ్‌.

సాయంత్రాలు తన స్నేహితుడు రాజగోపాల్‌తో చదరంగం ఆడడం అలవాటయ్యింది. ఉద్యోగం లేని పుణ్యమా అని ఇప్పుడు రోజుకు ఏడుగంటలు అధికమయ్యాయి.
“నీ షష్టిపూర్తికి ఏర్పాట్లు ఎందాకావచ్చాయీ?” అడిగాడు రాజగోపాల్‌.
“తేదీ ఖాయమయ్యింది. మిగతావన్నీ ఇహ ఒకదాని తరవాత ఒకటి అవే ఖాయమవుతాయి. నా షష్టిపూర్తి కదా! అబ్బాయి నాచేత ఏపనీ చేయించట్లేదూ, నాతో చెప్పట్లేదు కూడా!” చెప్పాడు విశ్వనాధ్‌.

విశ్వనాధ్‌ మంత్రిని, ఏనుగునీ ఎక్కుపెట్టాడు తన మంత్రితో రాజ్‌గోపాల్‌. రెండిట్లో ఒకదాన్ని ఒదులుకోటం ఖాయం!
“పై ఆదివారం, గుర్రప్పందాల్లో, ఒక కొత్త జోడీ వస్తోంది. ఎవరో అరబ్బు దేశం వాడట, అక్కడ పందాల్లో బాగా రాణించాడు. మంచిజాతి అశ్వం. వయసు కొద్దిగా మీరినట్లుంది, అదికూడా ఇప్పుడు యూరప్‌లో నాలుగు, ఐదు స్థానాలు జారింది. కానీ మనవాటితో పోలిస్తే అనుమానంలేకుండా నెగ్గగలదు. రెండు వేలుదాకా దాచాను దానికోసం. వస్తావా నువ్వుకూడా?” అది రాజగోపాల్‌కున్న ఒక్కగానొక్క వ్యసనం. వ్యసనం అనుకోవచ్చు, హాబీ అనుకోవచ్చు. నెలంతా కష్టబడి స్కూలు పిల్లలకి సాయంత్రాలు ట్యూషనులు చెప్పి సంపాదించినదంతా పందాల్లో తగలేస్తే అది వ్యసనమే!

రిటైరు అయ్యాక కాస్త తగ్గాడు కానీ, విశ్వనాధ్‌ తక్కువ్వాడు కాదు. తన భార్య ఇందిరకి చెప్పకుండా ఆఫీసులో బోనసులు ఇచ్చినపుడూ, ఉద్యోగరీత్యా ప్రయాణిస్తే ఖర్చులకుగానూ మిగిలినవి,మరి ఇతరత్రా వచ్చే రాబడి అంతా గుట్టు చప్పుడు కాకుండా గుర్రప్పందాల్లో పోగొట్టుకున్నాడు. తన ముప్ఫై ఐదేళ్ళ కాపురంలో ఇందిరకి కూడా అనుమానం రాకుండా నెట్టుకొచ్చాడంటే!!! అదే వ్యసనానికున్న బలం, ఆకర్షణ.

ఇప్పుడదే ఆకర్షణ మళ్ళీ రెండేళ్ళనుంచీ లాగుతోంది విశ్వనాధ్‌ను. పింఛను ఎంత వస్తుందో ఇందిరకి తెలుసు. రిటైర్‌ అయ్యాక వేరే ఆదాయం లేదు,  తనకున్న చదువుకి తోడు ట్యూషన్లు కూడానూ!! మరీ కొడుకుతో డాక్టరుకనో,బట్టలకనో అబద్ధాలాడి పందాలు కాయలేడు… అందుకే రెండేళ్ళనించీ లాటరీ టిక్కెట్టు కొంటూ వచ్చాడు విశ్వనాధ్‌, ఎప్పుడో అప్పుడు తగలక పోతుందా అని. ఇప్పటిదాకా ఆ అదృష్టం కలగలేదు.

మనసు పీకుతున్నా అన్నాడు “చెప్పాగా, నాకు లాటరీ తగిలితే కానీ మళ్ళీ పందాల్లోకి రాననీ”

ముందు గుర్రం, తరవాత ఏనుగూ, రెండు శకటాలు అన్నీ పోయాక విశ్వనాధ్‌ రాజు తలవంచాడు. నలభై శాతం తను గెలిస్తే మిగిలిన అరవై శాతం రాజగోపాల్‌ విజయుడౌతాడు.
భోజన సమయానికి ఇంటికి వెళ్ళి పోయాడు రాజగోపాల్‌.
“నాతో ఆడవా తాతయ్యా?” అంటూ ముద్దు పోయాడు నందూ.
వాడితో రెండు ఆటలు ఆడి ఒకటి ఓడిపోయాడు. కావాలనే ఓడిపోయాడని అనుకొని  సర్ది చెప్పుకున్నా, నందూ ఆడినకొద్దీ వృద్ధిచెందుతున్నాడని సంతోషపడ్డాడు విశ్వనాధ్‌.
” తాతయ్యా, ఇవ్వాళ ఏంజరిగిందో తెలుసా స్కూల్లో?” రోజూ మల్లే జరిగిందంతా చెప్పుకుపోతున్నాడు.
తన కొడుకుని ఎన్నడూ ఇలా ముద్దు చేయలేదు. స్కూలు నుంచి వచ్చాక ఆడించటానికి ఇంత సమయమూ దొరకలేదు. అసలు కన్నా వడ్డీ ముద్దు…

భోజనాలయ్యాక పక్కలెక్కారు అందరూ. ఉన్న ఒక్క పడక గదీ కొడుకూ కోడలూ వాడుకొంటే, ముందు గదిలో నందూ, ఇందిర, వరండాలో విశ్వనాధ్‌. ఒంటరిగా ఇందిరతో కాలం గడిపి ఎన్నేళ్ళయ్యిందో మర్చిపోయాడు. విహారయాత్రలకి వెళ్దామనుకున్నా డబ్బు కిటకిట. తన చేతకానితనానికి ఇందిర చిన్న చూపు!
నిట్టూర్చి నిద్రకు ఉపక్రమించాడు.

……………………………………

ప్రతీ శుక్రవారంలాగే ఆ రోజు కూడా విధిగా వెళ్ళాడు “ఆంధ్రజ్యోతి” దిన పత్రిక కోసం పాన్‌ షాపు దగ్గరకి. పేపరు కొనకుండా భాగ్యలక్ష్మి లాటరీ ఫలితాల పేజీ వెతికాడు. ఎక్కడ పోతుందో అని నంబరు వేరే కాగితం మీద రాసుకొని టిక్కట్టుని భద్రంగా ఇంట్లో పుస్తకంలో దాస్తాడు. జేబులో కాగితం తీసి  అంకెలు సరిచూసుకున్నాడు మళ్ళీ…పది లక్షలు .. ఒక్క నంబరులో పోయింది … మళ్ళీ మళ్ళీ తణిఖీ చేసాక తగ్గాడు.
లక్షా, యాభై వేలూ అన్నీ వెతికాడు. నిరుత్సాహంతో మిగిలినవి చూస్తుంటే కనబడిందది..
1721944 .. కాకతాళీయంగా అది ఇందిర పుట్టిన రోజు. ఫిబ్రవరి పదిహేడు..
ఇరవై ఐదు వేలు !!
మళ్ళీ మళ్ళీ చూసుకున్నాడు. సంబరం బయటకి కనబడనిస్తే మళ్ళీ పాన్‌షాపు వాడికి బక్షీసు, వీధిలో అందరికీ తెలిసిపోవటం, తను పందాలు ఆడలేకపోవటం … నీరుగారే మొహం పెట్టి పేపరు పాన్‌షాపు వాడికిచ్చేసాడు. విధిగా వచ్చే వారం టిక్కెట్టు కూడా కొని కాళ్ళీడ్చుకొంటూ ఇంటి ముఖం పట్టాడు..
అద్భుత నటన!
పై ఆదివారం లోపల ఆ టిక్కట్టు తీసుకెళ్ళి ఆఫీసులో చూపిస్తే తన సొమ్ముముట్ట చెప్తారు.
……………
మేఘమాల, సరస శృంగార భరితమైన గ్రంధం. ఎన్నడూ తను పూర్తిగా చదివిన పాపాన పోలేదు. ఎవరో స్నేహితులు సిఫార్సు చేస్తే కొన్నాడు. చదివిన కొన్ని ఘట్టాల్లో, ఆ నాటి వర్ణన, అశ్లీలత లేని స్వచ్ఛమైన రసవత్తర సృష్టి!

దాని కోసమే వెతుకుతున్నాడు విశ్వనాధ్‌. ఇన్నేళ్ళలో ఎవరూ దాన్ని తాకలేదు. మరెక్కడ పెట్టినా ఎవరో ఒకళ్ళకి కనపడే అవకాశం ఉన్నందున అందులో  దాచాడు టిక్కట్టుని. బల్ల సొరుగులో మళ్ళీ మళ్ళీ గాలించాడు. నిఘంటువులూ, పత్రికలూ అన్నీ ఉన్నాయి. ఆ ఒక్క గ్రంధం తప్ప.
“దేనికోసం వెతుకుతున్నారు మామయ్యగారూ?” అడిగింది కోడలు వంకాయలు తరుగుతూ. ఇందిర స్నానాల గదిలో ఉన్నట్టుంది.
“ఇందులో మేఘమాల ఉండాలి నీకేమన్నా తెలుసా?” అడిగాడు.
“సుజాత వదిన గారికి పాత గ్రంధాలు చదవాలనిపించి ఏమన్నా పుస్తకాలున్నాయా అని అడిగారు అత్తయ్యగారిని. ఇచ్చి రెండు రోజులే అయ్యింది. మీక్కావాలంటే అడిగి తీసుకొంటాను మావయ్య గారూ” చెప్పింది కోడలు.

తను ఆ పుస్తకం చదివి పది, పదిహేనేళ్ళయినా అయ్యుంటుంది. ఇప్పుడుగానీ అది కావాలని అడిగితే ఇందిరకి వెంటనే అనుమానం వస్తుంది. మెదడు అతి వేగంగా పనిచేస్తోంది విశ్వనాధ్‌కి.
“ఇక్కడ కనపడకపోతేనూ అడిగాను. నేను కొన్న ఒక్కగానొక్క పుస్తకం అది. ఎక్కడపోయిందో అన్న తాపత్రయం అంతే”. చెప్పాడేగాని, ఇప్పుడా పుస్తకం తిరిగి ఎలా తీసుకోటమా అని పలు విధాల ఆలోచిస్తూ వరండాలో పడక్కుర్చీలో కూర్చున్నాడు.

తను వెళ్ళి అడిగితే వెంటనే కోడలికి తెలిసిపోతుంది. పై ఆదివారం లోపు ఆ టిక్కట్టు చేతికి రాకపోతే, ఒక్కసారి తలుపు తట్టిన అదృష్టదేవత,గుమ్మం దాటి రాకుండానే తిరిగి వెళ్ళిపోతుంది. మరి గుర్రాలూ అంతే!
ఆ మైదానంలో హోరు, ఎక్సైట్‌మెంట్‌, డెక్కల చప్పుడుతో బాటే గుండె లయబద్ధంగా కొట్టుకుంటూ …

అసహనంగా లేచి పచార్లు కొట్టాడు.
సాయంత్రం అయ్యింది ..
రోజూలాగే బడినుంచి రాగానే హోంవర్క్‌ చేయిస్తోంది నందూ చేత కోడలు ..
ఐదు అయ్యేసరికి వచ్చాడు యధావిధిగా రాజగోపాల్‌.
“ఏమిట్రా అంత ఎక్సైట్‌మెంటు, లాటరీ తగిలిందా?” ఆ హుషారులో గొంతు పెద్దది చేసాడన్న విషయం మర్చిపోయి ..
పొరపాటు గ్రహించి అటూ ఇటూ చూసి గుసగుసల్లో అన్నాడు .. ” లాటరీ గానీ తగిలిందా” నోటిమీద చెయ్యి అడ్డు పెట్టి.
జరిగిందంతా చెప్పాడు విశ్వనాధ్‌.
“గొప్ప చిక్కే వచ్చింది. ఆ ఇంట్లో ఎక్కడ పెట్టిందో ఆ మహాతల్లి. సరిగ్గా ఆవిడకి గ్రంధ పఠనం అవసరమొచ్చిందా?” మిత్రుడికి లాటరీ తగిలిందన్న ఆనందం కంటే, మహాలక్ష్మి రేస్‌కోర్స్‌కి వెళ్ళటానికీ, ఆ ఆహ్లాదాన్ని పంచుకోటనికీ తనకో జోడీ దొరకబోతోందన్న తపనే ఎక్కువగా ఉంది రాజగోపాల్‌కి.
“ఇప్పుడేం చేద్దాం?”
” ముందు ఆ పుస్తకం ఎక్కడ పెట్టిందో గమనించాలి. బజారుకెళ్ళినప్పుడు వాళ్ళాయనకోసం తాళాలు ఇచ్చి వెళ్తుంది కదా మీ ఇంట్లో. మీ నందూకి అవిచ్చి ఆ పుస్తకం తెమ్మని పంపుదాం. టిక్కట్టు తీసేసి మళ్ళీ దాన్ని యధాస్థానంలో పెట్టి రమ్మను. ప్రాబ్లం లేదు” శకటంతో భటుణ్ణి తీస్తూ అన్నాడు.

రాత్రంతా ఆలోచించి చూసాడు విశ్వనాధ్‌. రాజగోపాల్‌ ఇచ్చిన సలహాకి మించి వేరే సులువైన మార్గం కనపడలేదు. ముందు ఆ పుస్తకం ఎక్కడ పెట్టిందో పసిగట్టాలి. లేకపోతే ముందు దానికోసం వెతకడానికే గంట పట్టేస్తుంది.
అదే మరునాడు తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు.

…………………………..

పొద్దున్న పదకొండు కావస్తూండగా తలుపు తాళం వేసి వీధిలో కెళ్తూ కనిపించింది పక్కింటి సుజాత. దాదాపు నలభైరెండేళ్ళని తను ఇంట్లో చెప్పుకొనే ఆడంగి మాటలు వినకపోతే ఆవిడకి ఏ ముప్ఫయ్యో ఉంటాయనుకొనే వాడు. ఒక్క వ్యసనాన్ని కప్పి పుచ్చేందుకే శక్తంతా సరిపోయింది. స్త్రీలోలుడు కాలేదు విశ్వనాధ్‌.

రెండిళ్ళనీ విడదీస్తూ మధ్య గోడ. రెండిళ్ళలోనూ జామ చెట్లూ, కూరలూ, పూలమొక్కలూ. వంటింటికీ, పడక గదికీ ఉన్న కిటికీలు తమ గోడ వైపే కావడంతో కనీసం ఆ రెండు గదులన్నా పైపైన వెతకొచ్చని అటువైఫు వెళ్ళాడు, సుజాత వెళ్ళిన పావుగంటకి.
వీధినించి కనపడకుండా, జామచెట్టు మొదమాటున పొంచి గోడమీంచి చూపు సారించాడు..
క్షుణ్ణంగా వెతికాడు వంటిల్లు, కంటి చూపు ఆనేమేరంతా గాలించాడు. వంట చేస్తూ గాని చదవటానికి అనుకూలంగా అక్కడేమన్నా పెట్టిందేమోనని. బిందెలూ, గిన్నెలూ, గ్లాసులూ వగైరాలు తప్పించి మరేమీ కనపడలేదు.
పడక గదిలో చూసాడు. కిటికీకి కర్టెను వేసి ఉన్నా అది సరిపడేంత తీసి ఉంది. డబుల్‌కాట్‌ మంచం దాని పక్కన స్టూలూ దాని మీద లాంపూ. పిల్లలు లేకపోవడంతో అన్ని వస్తువులూ ఎక్కడపెట్టినవి అక్కడ ఉన్నాయి.
సుజాత వచ్చేస్తుందన్న హడావిడిలో చూస్తున్నాడు తప్పించి తన ఈ వింత ప్రక్రియని వెనకనించి కోడలు, ముందుగది కిటికీలోంచి గమనించినట్టు తెలుసుకోలేకపోయాడు.

ఎంతసేపు అలా గోడ పక్కన నిలబడి కళ్ళే చేతులుగా చేసుకుని వెతికాడో కూడా గమనించలేదు విశ్వనాధ్‌. కాలు చివరంటా లేచి దిండు అవతల తొంగిచూసాడు. తను వేసిన పసుపు రంగు అట్ట ..పుస్తకం కనిపించిన ఉత్సాహంలో సుజాత తలుపు తీసి లోపలికి వచ్చేచప్పుడు కూడా వినపడలేదు విశ్వనాధ్‌కి.
ఆ పుస్తకం తనదేనని నిర్ధారణగా చూస్తూ ఉన్నంతలోనే, హఠాత్తుగా సుజాత, పైట కొంగు తీస్తూ, చీర మార్చుకోడానికి కాబోలు, పడక గదిలోకి అడుగు పెట్టడం కనుచివర్లో కనిపించి గబుక్కున వంగున్నాడు విశ్వనాధ్‌.
అప్పటికే ఆలస్యమైపోయింది.
కదలకుండా అలాగే కూర్చున్నాడు కాసేపు. ఈ విడ్డూరాన్ని పూర్తిగా గమనించిన కోడలు మాత్రం నిర్ఘాంతపోయింది.
ఈ వయస్సులో ఇదేం బుద్ధీ !

ఇంతలో పక్కింటి పడగ్గది కిటికీ కర్టెను సర్రున లాగిన చప్పుడు !
సుజాతకి అనుమానం వచ్చిందేమోనని భయం !
ఎప్పుడు రాలిందో దోర జాంపండు, కాలి పక్కనే కనిపించేసరికి తీసుకొని వరండాలోకి వెళ్ళాడు.

కోడలు ఇందిరకంతా చెప్పేసరికి విస్తుపోయింది. ఇన్నేళ్ళనించీ వేరు పడకలైనా ఇంతకి దిగజారతాడనుకోలేదు. ఇన్నేళ్ళ తన కాపురంలో ఎప్పుడూ ఇలాంటి చేష్టలు లేవు. నమ్మ బుద్ధి కాలేదు ! వరండాలోకి వెళ్ళబోతూంటే వచ్చాడు విశ్వనాధ్‌.

“దోర జాంపండు తెంపి తెచ్చాను, మళ్ళీ చిలక పాలు కాకుండా. నందూకి పెట్టమ్మా” కోడలికి ఇచ్చి వెళ్ళాడు.
“జాంపండు కోస్తూంటే నువ్వేమన్నా అపార్ధం చేసుకున్నావా?” అడిగింది కోడల్ని.
“లేదత్తయ్యా, నిజంగానే గోడమీంచి కాళ్ళెత్తి మరీ చూసారు”
“సరేలే. అబ్బాయితో ఏమీ అనకు” ఇందిర చెంబునీళ్ళతో మొహం కడుక్కుంటున్నా అది కన్నీళ్ళు కప్పిపెట్టటానికే అని తెలుసు ఆమె కోడలికి.

“నిజంగా చూసిందంటావా ?” సాయంత్రం రాజగోపాల్‌ని అడిగాడు.
“అవకాశం తక్కువ. ఒక వేళ చూసినా, ఈ ముసలాయనకి ఈ అరవైలో ఇరవై వచ్చిందేమో అనుకుంటుందిలే” కన్ను గీటి అన్నాడు.

తన అనుమానం నిజమయ్యింది, సుజాత కూడా కోడలికి గోడ దగ్గర కలసి చెప్పిందట చాడీ. దుఃఖ్ఖాన్ని దిగమింగుకుంటూ గద్దించింది ఇందిర విశ్వనాధ్‌ని ఆ రాత్రి.
తనకొచ్చిన చిక్కల్లా ఒక్కటే! తనకి స్త్రీ వ్యామోహం లేదని చెప్తే,ఇందరికి అసలు విషయం చెప్పాల్సివస్తుంది. ఇన్నేళ్ళ తన పందాల గుట్టు బయట పెట్టాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో వేరే అబద్ధాలకి తావు లేదు.
పందాలకోసం ఆశ పడితే ఈ కొత్త వ్యసనపు భారం భరించాల్సిందే ..
తనిక నమ్మించలేడని తెలిసీ ప్రయత్నం మానలేదు, మరీ మరీ చెప్పాడు.
“నిజంగానే జాంపండు తెద్దామనే వెళ్ళాను. ఏదో అలికిడి అయితేనూ తొంగి చూసానంతే. నా దురదృష్టం కాకపోతే ఆవిడ అప్పుడే బట్టలు మార్చుకోవాలా?” వాన వెలిసిందో లేదో తెలీదు కాని, ఇందిర కన్నీళ్ళు ఆగాయి.
ఎన్నో ఏళ్ళుగా ఏర్పడ్డ అనుబంధం, నమ్మకం అడ్డు పెట్టి చెప్పిన అబద్ధం.

………………………

ఏది ఏమైనా, ఆ పుస్తకం చేజిక్కించుకోవటం ఖాయం. మరో రెండు రోజుల్లోకొచ్చింది తను ఆ టిక్కట్టు చూపించి డబ్బు చేజిక్కించుకోవాల్సిన దినం.
తను ఎదురు చూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది.
కోడలితో కలిసి బజారుకి వెళ్తూ ఇందిరకి తాళాలు ఇచ్చి వెళ్ళింది సుజాత.
వీధిలో ఆడుకొంటున్న నందూని పిలిచాడు విశ్వనాధం. సాయంత్రం ఐదు కావస్తోంది. మరో అరగంటలో సుజాత వాళ్ళాయన వచ్చేసేలోపు ఆ పుస్తకం సంగతి చూడాలి.
” నాన్నా నందూ, నీకో పని చెప్తాను. చేస్తావా?”
“ఏంటి తాతయ్యా?”
“పక్కింట్లో నా పుస్తకం ఒకటి ఉంది అది తెచ్చి కిటికీలోంచి నాకు అందివ్వాలి” అంటూ ఇందిర కంట పడకుండా తెచ్చిన తాళాలు ఇచ్చాడు.
“త్వరగా పద మళ్ళీ అంకుల్‌ వచ్చేస్తే కష్టం”
“పుస్తకం కావాలంటే అడిగి తీసుకొస్తాను తాతయ్యా?” పసికందుకి పది ప్రశ్నలు.
“మీ నానమ్మ ఇచ్చిందిరా ఆ పుస్తకం. మళ్ళీ పెట్టేద్దాంలే!” ఎవరితోనూ అనొద్దంటే వాడు దానికి ఇంకా విలువిచ్చి అనే అవకాశం ఎక్కువుందని గమ్మున ఊరుకొన్నాడు.

“సరే! ఏవీ తాళాలూ?” తాతయ్య అంటే ఇష్టం నందూకి. తాళాలు తీసుకొని గోడ దూకి వెళ్ళాడు నందూ. తలుపులు తెరిచి పడక గదిలోకి వచ్చాడు. దిండు పక్కన దొరికింది పుస్తకం. కీటికీలోంచి అందుకొని పేజీలు తిప్పి తిప్పి చూసాడు. టిక్కట్టు జాడ లేదు. ఎక్కడ పడిపోయిందో గదిలో, దాన్ని ఊడ్చేసారో …
మదిలో ఎన్నో ఆలోచనలు. మరో సారి గాలించి తిరిగి ఇచ్చేసి వచ్చేయమన్నాడు.

“తాతయ్యా, అంకుల్‌ వచ్చేస్తున్నారు. అదిగో టర్నింగు దగ్గర ఉన్నారు” కంగారుగా అన్నాడు నందూ.
“నేను వెళ్ళి ఏవో మాటలు చెప్పి వీధిలో ఆపేస్తాను, నువ్వు  తాళం వేసి గోడ దూలాన్నుంచి నేరుగా తీసుకొస్తున్నట్టు తాళంచెవులు తెచ్చేయి. ఆయనికి ఇచ్చేద్దాం” పరుగులాంటి నడకతో గేటు తీసి బయటకెళ్ళి ఆయన్ని సమయానికి పట్టుకున్నాడు..

మరో రెండు నిమషాల్లో నందూ వచ్చి తాళంచెవులు ఇచ్చి ఆడుకోడానికి వెళ్ళిపోయాడు.
గండం గడచిందని ఊపిరి వదిలాడు. గుండె దడ దడ కొట్టుకుంటోంది, డెక్కల చప్పుడులా …

……………………..

“రెండు సార్లు వెతికాను, ఎక్కడ పడిందో పడిపోయినట్టుంది” నిరుత్సాహంగా అన్నాడు రాజగోపాల్‌తో.
“అంతా నీ ఖర్మ అనుకొని వదిలేయి” అంత హైరానాలోనూ తన మంత్రిని ఎలా బంధించాడా అని ఆశ్చర్య పోయాడు రాజగోపాల్‌.
“నేను కిటికీలోంచి చూచినప్పటి నుంచీ, నాకు ఇల్లు నరకమైంది. ఇందిర నాతో మాట్లాడట్లేదు. కోడలు కూడా విచిత్రంగా చూస్తోంది. అబ్బాయితో చెప్పిందేమో. వాడూ మొహం చాటేసుకొని తిరుగుతున్నాడు. ఈ పందాలకోసం ఎన్నెన్ని భరించాల్సి వస్తోందో” చెక్‌ పెడుతూ నిట్టూర్చాడు.

రాజగోపాల్‌ ఆలోచనలో పడ్డాడు. కంచాల్లో వడ్డిస్తూ కోడలూ, గ్లాసులో నీళ్ళు పోస్తూ ఇందిర, స్నానం చేస్తూ కొడుకూ, ఎవ్వరూ గమనించలేదు, పడకగదిలో నందూ, వాళ్ళ నాన్న చొక్కా జేబులోంచి పది రూపాయల నోటు కొట్టేయటం.
అది చూసి గబుక్కున గదిలోకెళ్ళి పట్టుకున్నాడు నందూని.
“ఇదేమిట్రా కన్నా, తప్పు కాదూ, ఇలా దొంగిలించొచ్చా?” డబ్బు తీసి తిరిగి జేబులో పెట్టేసి అన్నాడు.
“మరి సాయంత్రం ఆంటీ వాళ్ళింటి కెళ్ళి బుక్కు తెస్తే ఏమీ అన్లేదుగా? రేపు  మేమందరం కలిసి డబ్బులేసుకొని క్రికెట్టు బాటు కొనుక్కోవాలి, నాన్నని అడిగితే ఇవ్వలేదు” పసివాడి కంటినిండా నీళ్ళు.
దగ్గరకి తీసుకొని హత్తుకొన్నాడు. “నేను అడిగి ఇప్పిస్తాగా, ఏడవకులే” నచ్చ చెపుతున్నా మనసు తొలిచేస్తోంది విశ్వనాధ్‌కి. తను చెసిన ఒక్క పొరపాటు ఆ పసి హృదయం ఎంత తొందరగా పట్టేసిందో!
“ఏంట్రా నీ గొడవా?” తల తుడుచుకొంటూ వచ్చాడు నందూ నాన్న.
“వాడికి బాటు కొనుక్కోడానికి డబ్బులివ్వరా!” సిఫార్సు చేసాడు విశ్వనాధ్‌.
తండ్రితో వాదన ఎప్పుడూ చెయ్యడు, “నాన్నా, నువ్విలా వీణ్ణి వెనకేసుకొచ్చి పాడు చేస్తున్నావు” అంటూ తీసిచ్చాడు పది రూపాయలు.

……………………

ఎందుకో ఆ వేళ విశ్వనాధ్‌కి తిన్నది అరగకుండా కడుపులోనే కూర్చుంది ..
వరండాలో పచార్లు కొడుతున్నాడు ..
వెనకేసుకు రాకుండానే నందూని పాడు చేస్తున్నాడన్న బాధ..
పిల్లల మెదడు ఒక స్పంజి లాంటిది, మంచన్నా చెడన్నా ఇట్టే ఇంకి పోతుంది. చేతులారా వాడి భవిష్యత్తుని పాడు చేయడానికి మొదటి విత్తనం వేసాడన్న హోరు మనసులో ..
తన ఒక్క బలహీనత కోసం ..
కన్నీళ్ళు తిరిగాయి ..
వృద్ధాప్యంలో అరుగుదల అసలే తక్కువ. పైగా ఈ వైపరీత్యాలకి కడుపులో అసిడిటీ పెరిగి వాంతి అయ్యింది..
వ్యసనం ఒక అయస్కాంతమయితే దాన్ని తోసి పారేయగలిగేది మరో అయిస్కాంతమే  … అది నందూ.

ఇందిరని పిలిచి అంతా చెప్పాడు ..
పొల్లు పోకుండా..
ఎంతసేపు కూర్చుందో అలాగే మాట రాకుండా ఇందిర.
తేరుకున్నాక అడిగింది “అంటే ఆ టిక్కట్టుకి తగిలిందా భాగ్యలక్ష్మి?”
ఇంకా నమ్మలేనట్టు అడిగింది. గత వారం రోజులుగా తనకొచ్చిన అనుమానాలన్నీ తీరాయన్న సంత్రుప్తి కంటే మరేదో ఆనందం..

ముప్ఫై ఐదేళ్ళ తమ కాపురంలో, అతడి వ్యసనాన్ని కప్పి పెట్టటానికి చెప్పిన అబద్ధాలూ, ఆడిన నాటకాలకి వచ్చిన ఉక్రోషం కంటే, మరేదో ఆనందం.

“అవునే, ఇరవై ఐదువేలు. నీతో చెప్పకుండా కొన్ని నెలలు పందాలు ఆడొచ్చనుకొన్నాను. నా అంత స్వార్ధపరుడు ఎవరన్నా ఉంటారా? పందాల ఊబిలో పడి బాబుని పాడు చేస్తున్నానన్న వాస్తవం కూడా మర్చి పోయాను …” ఇంకా ఏదో చెప్పుకు పోతున్నాడు.
“పుస్తకం ఇస్తుంటే కింద పడితేనూ నేనే తీసి దాచాను టిక్కట్టుని” అంటూ గబగబా వెళ్ళి తెచ్చింది.
పట్టరాని సంతోషం ..
“షష్టిపూర్తి అయ్యాక మనం యాత్రకి వెళ్దాం, అబ్బాయిని డబ్బు అడగక్కరలేదు” అంది ఇందిర.
సిగ్గుతో ఇంకా మొహం కప్పుకొనే ఉన్నాడు విశ్వనాధ్‌.
“నిజమే, నా పాపాలకి ప్రాయశ్చిత్తం అదే, తిరుపతికా?” అడిగాడు.
ఎన్నో ఏళ్ళుగా ఆ ఇంట్లోంచి బయటకెళ్ళి తామిద్దరమే ఏ బాదరబందీ లేకుండా తిరిగి యవ్వనంలో విహరించే విహారయాత్రకి వెళ్ళాలనే ఆశ, కోరికగా మిగిలిపోకూడదని అనుకొంటే అది ఆమె తప్పు కాదు, వ్యసనం అంతకన్నా కాదు.
“ఊటీకి, తిరుపతికని చెపుదాం” అంది.
డబ్బు, అదే దాని ఆకర్షణ.
-----------------------------------------------------------
రచన: శ్యామ్‌ సోమయాజుల, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment