Saturday, December 1, 2018

ఉత్తర కిష్కింధ (నాటిక)


ఉత్తర కిష్కింధ (నాటిక)
సాహితీమిత్రులారా!

ఈ నాటిక చూడండీ...........

మొదటి రంగం

(కిష్కింధ రాజభవనం)

హనుమంతుడు: జయము జయము మహారాజా! సుగ్రీవ సార్వభౌమా!

సుగ్రీవుడు: సార్వభౌమత్వం ఏడిచినట్టే వుంది. మనవాళ్ళంతా చేరి నా ఎముకలు కొరికేస్తున్నారు. వెనక రుష్యమూకం మీద మనం అజ్ఞాతవాసం చేసిన రోజులు హాయిగా ఉన్నాయనిపిస్తోంది.

హను: ఇప్పుడేం వచ్చిందీ? హాయిగా మనం మళ్ళీ రాజ్యం తెచ్చుకున్నాంగా ఆ శ్రీరామచంద్రమూర్తి కృపచేతా?

సుగ్రీ: ఆ జాంబవంతుడేమంటున్నాడో విన్నావా? మనం వట్టి దద్దమ్మలంట. మన బలగంతో శ్రీరామచంద్రుడు ఆసేతుహిమాచలం జయించి తన రాజ్యం ఏర్పాటు చేసుకున్నాట్ట. రామరావణ యుద్ధంలో నిజమైన ఆర్యుడి రక్తం ఒక్క బొట్టు కూడా చిందలేదట. ఈ ఆర్యపాలకులకు సామంతులు కావటం తప్ప మనకు గతే లేదట! విన్నావా?

హను: అంత పచ్చి అబద్ధాలాడతాడా జాంబవంతుడు!

సుగ్రీ: నీ మొహంలా వుంది. వాడనేవి అబద్ధాలైతే ఏ చిక్కూ లేదు. నిజం కాబట్టే చిక్కు. రావణుడికి కూడా తలవంచని కిష్కింధకు దాస్యపు రోజులు వచ్చాయని జాంబవంతుడంటున్నాడు. అందరూ వింటున్నారు. నేను వాలిని చంపించింది కిష్కింధకు దాస్యం అంటగట్టటానికే నంటున్నారు.

హను: మనం రామరాజ్యంలో ఉండమని ఖచ్చితంగా చెప్పెయ్యకూడదూ?

సుగ్రీ: అమ్మో ఇంకేమన్నా ఉందా? నా పుచ్చె యెగిరిపోదూ?

హను: మరయితే ఏమిటి ఉపాయం?

సుగ్రీ: చూడు హనుమంతుడూ, నీవు కాస్త నలుగురు బలవంతుల్ని సామంతులు చేద్దూ. వాళ్ళకి మంత్రి పదవులన్నా పారేస్తాను!

హను: అట్లా వస్తారా?

సుగ్రీ: ఆఁ రాకేంచేస్తారు? మంత్రిపదవులంటే అంతా వస్తారు. రుష్యమూకుణ్ణి కూడా ఒక కంట కనిపెట్టుండు. రుష్యమూకం కిష్కింధలోది కాదని వాడంటున్నాట్ట. వాడి వాలకం చూస్తే వాడు మన మాట వినేట్టు లేడు. రుష్యమూకాన్ని కిష్కింధలో చేర్పిస్తానని నాకు లక్ష్మణుడు మాట యిచ్చాడు. తీరా ఏం చేస్తాడో?

హను: అంగదుడు మన మాట వింటాడు లెండి. నలుడూ, నీలుడూ, జాంబవంతుడూ చాలా దగ్గిర స్నేహితులు.

సుగ్రీ: వాళ్ళని ఎట్లాగైనా విడగొట్టుదూ

హను: ప్రయత్నిస్తా, సెలవు!

రెండో రంగం

(కిష్కింధ వెలుపల)

జాంబవంతుడు: జై స్వతంత్ర కిష్కింధకూ …

అందరూ: జై!

జాంబ: మిత్రులారా! ఇవాళ చాలా సుదినం. నా పిలుపు విని మీరంతా వస్తారని నాకు తెలుసు. నేను రాజకీయవేత్తను కానని మీరెరుగుదురు. నేను యుద్ధ నిపుణుణ్ణి. అనేక యుద్ధాల్లో ఆరితేరినవాణ్ణి. ఆ సంగతి నేను మీకు మనవి చేయనక్కర్లేదు. నాకిప్పటికి ఎనభై ఏళ్ళు. కాని నా జీవితంలో యుద్ధంలో గెలిచి, రాజకీయంగా ఓడటమనేది ఎరగను. ఈ దుర్దశ మనకీ రామరావణ యుద్ధంతో సంప్రాప్తం అయిందని చెప్పటానికి నాకు చాలా చిన్నతనంగా ఉంది. ఈ యుద్ధం గెలిపించిందెవరు? మనం. మన గతి ఏం కానున్నది? అ మనం అయోధ్యకు దాస్యం చెయ్యనున్నాం. శ్రీరామపట్టాభిషేకం ఇక్కడ వైభవంగా జరపాలట. సుగ్రీవుడుగా రాజ్ఞాపించాడు. దీన్ని మనం ఎలా సహించగలం? ఏం నలా, నీలా, మాట్లాడరేం?

నలుడు: ఏం మాట్లాడం? నువేమన్నా తప్పు చెప్పావు కనకనా?

నీలుడు: నువ్వే పెద్దవాడివి. సలహా చెప్పు, ఏం చెయ్యమంటావో?

జాంబ: ఇంకేం చెయ్యాలి, మనం స్వతంత్ర కిష్కింధ నినాదం లేవదీయాలి. సుగ్రీవుడు ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు. లేదా మరొకరు పరిపాలన చేస్తారు. సుగ్రీవుడే పరిపాలన చెయ్యాలని ఏ వేదాల్లో రాసిపెట్టి ఉంది?

నలు: ఒకవేళ సుగ్రీవుడు వినకపోతే?

జాంబ: వినకపోతే మనం అతని పరిపాలనకు తోడ్పడవద్దు. తన మంత్రుల పేర్ల జాబితా అయోధ్యకు రహస్యంగా పంపాట్ట. అక్కడ ఆ పేర్లు ఆమోదించబడాలన్నమాట! ఎన్నడన్నా ఈ ఘోరం ఎరుగుదుమా?

పిపీలిక: ఏం జాంబవంతుడూ? అందులో నీ పేరు లేదా ఏం?

జాంబ: నోరుముయ్యరా, పిపీలికా! నేను ముష్టి మంత్రి పదవి కోసం పాకులాడుతున్నాననుకున్నావా? ఈసారి మళ్ళీ ఆ మాటంటే, సున్నంలోకి ఎముక ఉండదు జాగర్త…నేననేదేమిటంటే, మనం ఐక్యంగా ఉంటే ఈ సుగ్రీవుడు మన మాట వినకేంజేస్తాడు?

గదుడు: అది కాదే తాతా! ఒకవేళ సుగ్రీవుడి కిష్టమైతే మాత్రం అయోధ్యవాళ్ళు కిష్కింధకు స్వాతంత్ర్యం ఇవ్వకపోతే అప్పుడేం చేయటమని?

జాంబ: ఒరే గదుడూ? అన్నీ తెలిసి నువ్వే అట్లా అడుగుతావేం? శ్రీరాముడికి జయించిపెట్టినవాళ్ళం, మన స్వాతంత్ర్యం కోసం పోరలేమా? ఏమిటో అనబోయావు దీర్ఘవాలా?

దీర్ఘవాలుడు: ఏమీలేదు. స్వతంత్ర రుష్యమూక నినాదం ఏం చేస్తామని!

జాంబ: వాళ్ళు అజ్ఞానం చేత ఆ నినాదం లేవదీశారు. ఈ ఉద్యమం నడిచేది కాదు.

దీర్ఘ: వాళ్ళు వాలిని గొప్పవాణ్ణి చేసి, సుగ్రీవుణ్ణి భ్రాతృహంతకుడుగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి వాలి రుష్యమూకంవారి స్వాతంత్ర్యాన్ని గౌరవించాడు.

జాంబ: ఇదంతా వట్టి భ్రమ. కిష్కింధలో అంతర్భాగంగా తప్ప రుష్యమూకం అభివృద్ధి చెందలేదు. అందుచేత మీరంతా ఇప్పుడు ప్రమాణాలు చెయ్యండి. స్వతంత్ర కిష్కింధ ఏర్పడితే తప్ప సుగ్రీవుడి ప్రభుత్వంతో సహకరించమని.

అందరూ: చేస్తాం! అలాగే చేస్తాం!

దీర్ఘ: ఏమో! నేనింకా ఆలోచించుకోవాలి.

మూడో రంగం

(కిష్కింధలో రాజభవనం)

సుగ్రీ: పిపీలికా, రా! కూర్చో, ఏమిటి విశేషాలు?ఎల్లుండి అయోధ్యలో జరగనున్న రామ పట్టాభిషేకం మనం ఇక్కడ జరపబోతున్నాం. భారీగా ఏర్పాట్లు కావలసి ఉన్నాయి. నీబోటి మిత్రులంతా పట్టించుకోకుండా తిరిగితే ఎట్లా?

పిపీలిక: ఆ నాదేముందిలెండి, నా మొహం! అందరూ సహకరిస్తేగాని జయించలేని ఆ జాంబవంతుడే నన్ను తీసిపారేస్తున్నాడు.

సుగ్రీ: నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావటంలేదు. జాంబవంతుడేమిటి, జయించటమేమిటి?

పిపీ: మీరింకా వినలేదా? వాళ్లంతా రామ పట్టాభిషేక మహోత్సవాన్ని బహిష్కరిస్తారుట.

సుగ్రీ: జాంబవంతుడే ? అట్లా ఎన్నటికీ జరగదు. నేను నమ్మను.

పిపీ: జరిగినా జరక్కపోయినా ఇప్పటికి వాళ్ళ ఉద్దేశమదే.

సుగ్రీ: వాళ్ళతో నీకెందుకులే. నువు చాలా బుద్ధిమంతుడివి. అయోధ్యకు నా ప్రతినిధిగా హనుమంతుణ్ణి పంపేశాను. అక్కడ వారు కిష్కింధకు అఖండగౌరవం చెస్తారు. ఇక్కడ మనం అయోధ్యకు అఖండగౌరవం చెయ్యాలి. ఉత్సవం ఏర్పాట్లన్నీ నీ చేతిలో పెడదామనుకుంటున్నా, ఏమంటావు మరి?

పిపీ: మీరు చెప్పినదానికి ఎదురుంటుందా? కానివ్వండి. (సంతోషం వెలిబుచ్చుతాడు)

సుగ్రీ: అయితే మరి నువ్వు వెంటనే అంగదుణ్ణి కలుసుకుని ఏర్పాట్లు చేయించు.

(నలుడు, నీలుడు ప్రవేశం)

సుగ్రీ: రండి రండి. కూర్చో నలా, కూర్చో నీలా, మీ కోసమే ఎదురుచూస్తున్నా. నా కాబోయే మంత్రులై ఉండి మీరు తప్పించుకు తిరగటం ఏమీ భావ్యంగా లేదు. రేపుగాక ఎల్లుండే రామ పట్టాభిషేకం.

నలుడు: మాకు మంత్రిత్వాలు అక్కర్లేదు, రామ పట్టాభిషేకమూ అక్కర్లేదు. మాకు కావలసింది సుగ్రీవ పట్టాభిషేకం.

సుగ్రీ: పిచ్చివాడా, ఎట్లాగూ జరిగేదదే. మీ అభిప్రాయాలు నేనెరుగుదును. నా అభిప్రాయాలూ అవే. కాని ఒకటి అడుగుతాను. స్వాతంత్ర్యం పేరిట ఈ భరతఖండం ఇంకెంతకాలం విచ్ఛిన్నం కావాలని?

నీలుడు: ఐక్యత పేర మనం దాస్యం ఎందుకు తెచ్చుకోవాలన్న ప్రశ్న ఉండొద్దా?

సుగ్రీ: మిమ్మల్ని చూస్తే నాకు విచారంగా ఉంది. మీరేమో నిస్వార్థంగా ఆదర్శం ఆలోచిస్తున్నారుగాని, మీ మనస్సులు పాడుచేసే ఆ ముసలి జాంబవంతుడు కేవలం స్వార్థం ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఎవరితోనూ అనకండి. ఈ జాంబవంతుడు నన్ను రెండు విషయాలడిగాడు. అయోధ్యకు కిష్కింధ ప్రతినిధిగా తనను పంపమన్నాడు. తనను ప్రధానమంత్రి చెయ్యమన్నాడు. అయోధ్యకు వెళ్ళటానికి హనుమంతుడికన్న తగినవాడు లేనేలేడని ఎవరైనా ఒప్పుకుంటారు. నామటుకు నేనే పనికిరాను. పోతే ఈ ముసలాణ్ణి ప్రధానమంత్రిగా చేసుకుని మీవంటి యువకులకు అన్యాయం చేయనా? పైగా జాంబవంతుడు యోధుడు. రాజకీయవేత్త కాడు. ఆ సంగతి కిష్కింధ స్వతంత్ర్యోద్యమం చూస్తేనే తెలుస్తున్నది. ఈ ఉద్యమం గురించి అయోధ్యలో అంతా నవ్వుకుంటున్నారు. మనలో చీలికలు మనకే హానిచేస్తాయి. పైవారికేం?

నలుడు: జాంబవంతుడి వ్యక్తిగత ఆశయాలతో మాకు నిమిత్తం లేదు. అతడు చెప్పేది మాకు సరిగా తోచింది. ఈ ఉద్యమాన్ని మేం బలపరిచి తీరుతాం.

సుగ్రీ: సరే మీ యిష్టం, నేను చెప్పవలసింది చెప్పాను. రేపు జాంబవంతుడు మిమ్మల్ని విడిచినప్పుడుగాని మీరు పశ్చాత్తాపపడరు. ఇక మీరు వెళ్ళవచ్చు.

రుష్యమూకుడు: నమస్కారం మహారాజా! నన్నెందుకు పిలిపించారట?

సుగ్రీ: రా, కూర్చో, రుష్యమూకా, ఒక శుభవార్త తెలుపటానికే నిన్ను రమ్మన్నాను. రామరాజ్యంలో రుష్యమూకానికి మహోన్నతస్థానం ఇవ్వవలసిందిగా సీతామహాదేవి శ్రీరామచంద్రుణ్ణి కోరిందట. "నాకు అయోధ్య కన్న రుష్యమూకం ప్రియతమమైంది. నేను నా సింహాసనం కంటే రుష్యమూకంతో స్నేహం ఎక్కువగా భావిస్తాను" అని శ్రీరామచంద్రులవారు హనుమంతుడితో అన్నారట. నా నమ్మకం ఏమిటో తెలుసా? కిష్కింధకు ఇకమీదట రుష్యమూకమే రాజధాని అవుతుందని.

రుష్య: చాలా సంతోషం. ఈ వార్త విని నా చెవులు పవిత్రమయాయి. రామ పట్టాభిషేకం రుష్యమూకం మీద మహావైభవంగా జరిపిస్తాను. వ్యవధి లేదు. వెళ్ళిరానా? సెలవా?

సుగ్రీ: మంచిది, నాయనా వెళ్ళిరా..ఒరే, ఎవడ్రా అక్కడా?

సేవకుడు: ప్రభూ!

సుగ్రీ: జాంబవంతుడింకా రాలేదా?

సేవ: ఇంతకు ముందే వచ్చి మీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు, ప్రభూ!

సుగ్రీ: రమ్మను, రమ్మను…రా, బాబాయ్! ఇదేమిటి బాబాయ్? ఈ సమయంలో అందరికన్న ముందుండి మమ్మల్ని నడిపించాలిసినవాడివి నాతో సహాయనిరాకరణ చేస్తావా? ఇదేమన్నా బాగుందా?

జాంబ: ఒరే, నీ నక్క వినయాలు కట్టిపెట్టు! నువు రాముడికి అమ్ముడుపోయావ్. ఎందుకు పిలిపించావో చెప్పు.

సుగ్రీ: కిష్కింధ స్వాతంత్ర్యం గురించి నీ ఒక్కడికే పట్టిందనీ, మాకెవరికీ లేదని నీ అభిప్రాయం, అవునా? హనుమంతుడి ద్వారా నేను ఖచ్చితంగా అయోధ్యకు కబురుచేశాను. కిష్కింధ సర్వస్వతంత్రం కావాలనీ, కిష్కింధ భవితవ్యం కిష్కింధ ప్రజలే నిర్ణయించుకుంటారనీనూ.

జాంబ: నిన్ను నేను నమ్మను.

సుగ్రీ: అయోధ్యవారు దీనికి ఒప్పుకుంటారంటేనన్నా నమ్ముతావా?

జాంబ: వాళ్ళు ఒప్పుకున్నారు కూడానా? నిజమా?

సుగ్రీ: అవును బాబాయ్, ఎందుకు ఒప్పుకోరూ? వాళ్ళు రుష్యమూకం స్వాతంత్ర్యం కూడా ఒప్పుకుంటేనూ?

జాంబ: రుష్యమూక స్వాతంత్ర్యమా? అదెట్లా కుదురుతుందీ?

సుగ్రీ: ఎందుకు కుదరదూ?

జాంబ: మనకూ రుష్యమూకానికీ మధ్యగోడా? వాలి ఈ రెంటినీ కలపక విభేదాలు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ విభేదాలు కావాలా?

సుగ్రీ: పిచ్చివాడా, శ్రీరామచంద్రుడు దేశమంతా ఏకం చెయ్యాలని చూస్తున్నాడు. నీకు రుచించిందా? మనం ఎంతసేపూ విభేదాల కోసమే చూస్తున్నాం. ఎక్కడో ఉన్న అయోధ్య మన స్వాతంత్ర్యాన్ని అపహరిస్తుందని భయపడి మనం మన పక్క ఉన్న రుష్యమూకాన్ని పోగొట్టుకుంటున్నాం. అయోధ్య మనల్ని పాలించటం నామమాత్రం. మనకూ రుష్యమూకానికీ మధ్య గోడలు ప్రత్యక్షం.

జాంబ: (అరుస్తూ) రుష్యమూకం లేని కిష్కింధకు ఈ జాంబవంతుడెన్నటికీ ఒప్పడు.

సుగ్రీ: ఆ మాటమీదే ఉండు బాబాయ్.

నాలుగో రంగం

(కిష్కింధ పురవీధులలో ఉత్సవం, కోలాహలం, బాకాలు, మేళాలు, భజనలు)

1వ గొంతు: ఆహా! ఏమి వైభవంగా జరుగుతోంది పట్టాభిషేక మహోత్సవం.

2వ గొంతు: పేరు రాముడిది, అనుభవం సుగ్రీవుడిదీనూ. అంబారీలో ఎట్లా కూచున్నాడో రాజాధిరాజల్లే.

3వ గొంతు: పక్కన జాంబవంతుడు చూశావా? నిన్న మొన్న కూడా ఈ ఉత్సవాన్ని బహిష్కరిస్తున్నామనే అన్నాడు. అవకాశం దొరికేసరికి అంబారీ ఎక్కి కూచున్నాడు చూసుకో.

4వ గొంతు: అంతా ప్రగల్భాలు చెప్పేవారే. వీళ్ళని నమ్మితే ఏమవుతుందయ్యా? దేనికైనా ప్రజలం పూనుకోవాల్సిందేగాని!
-----------------------------------------------------------
-అక్టోబర్ 1952, ఆంధ్రజ్యోతి మాసపత్రిక
-----------------------------------------------------------
రచన: కొడవటిగంటి కుటుంబరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment