Saturday, December 15, 2018

ఒక మరిచిపోలేని వాక్యం


ఒక మరిచిపోలేని వాక్యం
సాహితీమిత్రులారా!

He was suddenly reminded of girls in white gowns with blue sashes around trim waists, broad rimmed hats pinned to high-piled curls, who played tennis and strolled on cropped green lawns and laughed lightheartedly in the summer of 1914, then disappeared forever.

ఈ వాక్యం నేను 2002లో అనుకోకుండా కొని చదివిన ఒక మిస్టరీ పుస్తకంలోనిది. ఇన్నేళ్లకీ నన్ను వెంటాడుతూనే ఉంది.

ఒకసారి, నేను పిల్లలతో ఆన్ ఆర్బర్ వెళ్ళాను. ఆ ఊరు నిండా పుస్తకాల షాపులు. అక్కడ ఆంట్ అగాథాస్ బుక్ స్టోర్ (Aunt Agatha’s, అగాథా క్రిస్టీ పేరు మీద పెట్టినది) అని ఒక షాపు ఉంది. ఆ షాపుకి వెళ్లి పుస్తకాలు చూస్తుంటే అక్కడ పనిచేసే కుర్రవాడు సహాయం చేయచూపాడు. మాటల్లో నాకు నచ్చే మిస్టరీ పుస్తకాలు ఎలాగ ఉంటాయో చెప్పాను: కొట్లాటలు ఉండకూడదు. అనవసరమైన హత్యలుండకూడదు. పాత్రల వివరణ ముఖ్యం. ఆ పాత్రల అంతర్మథనం ముఖ్యం. ఆ పాత్రల మధ్యన జరిగే ఘర్షణ ముఖ్యం. ఆ పాత్రలు ఉండే ప్రపంచవర్ణన ముఖ్యం. ఇది విని, ‘ఇంక మీరేమీ చెప్పనక్కర లేదు. ఈ పుస్తకం నచ్చకపోతే వాపసు తీసుకుంటాను,’ అని నాకు ఎ టెస్ట్ ఆఫ్ విల్స్ (A Test of Wills) అనే పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తక రచయిత ఛాల్స్ టాడ్ (Charles Todd). తన తల్లి కెరోలిన్‌తో కలిసి రాస్తుంటాడు. చిన్నప్పటి నుండీ, అతడికి ఇంగ్లాండ్ చరిత్ర అంటే మక్కువ. ఇంగ్లాండ్ చరిత్ర నేపథ్యంతో రాసిన ఆ పుస్తకానికి కొన్ని అవార్డులు కూడా గెలుచుకున్నాడు.


కొన్ని వారాల తర్వాత, నేను ఒక ప్రయాణంలో ఆ పుస్తకం చదువుతూ నన్ను నేను మరిచిపోయాను. కొట్లాటలు లేవు. ఒకే ఒక హత్య. పాత్రల వెనుక ఏవో రహస్యాలు. చదువుతున్న కొద్దీ ఒక్కొక్క పొర తొలగిపోతూ మరికొన్ని వివరాలతో చిత్రం పూర్తవుతుంటుంది. కొంచెం కొంచెంగా మనకి ఆ పాత్రల గురించి, మరణించిన వ్యక్తి గురించి తెలుస్తుంటుంది. మన మనసు కలుక్కుమంటుంది ఆ మరణానికి. మనకి హతుడు తెలియపోయినా, సానుభూతి కలుగుతుంది.

పుస్తకమంతా బాగున్నప్పటికీ, నాకు అందులో ఒక వాక్యం ప్రత్యేకంగా నచ్చింది. ఇన్నేళ్ళకీ ఆ వాక్యం మరచిపోలేకపోతున్నాను. ఇది ఏదో కవిత్వం పూనిన వాక్యం కాదు. ఇది ఏదో రహస్యం మన చెవిలో గుసగుసలాడే వాక్యం అంతకంటే కాదు. ఇది గుండెను మెలితిప్పి కళ్లనీళ్లు కార్పించే వాక్యమూ కాదు. ఏదో అందమైన, మధురమైన పదబంధాలతో నిండి ఉన్న వాక్యం కాదు. అయినప్పటికీ, ఆ సాధారణమైన వాక్యంలో నా కళ్ల ముందు కొన్ని శతాబ్దాల ఇంగ్లాండు చరిత్రని రచయిత ప్రదర్శించాడు.

అయితే, ఆ వాక్యం అర్థం చేసుకోవడానికి, ఆ వాక్యం వెనకున్న చారిత్రక నేపథ్యం తెలియాలి.

కథ మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన కొన్ని నెలలకి జరుగుతుంది. కథలో డిటెక్టివ్, యుద్ధంలో మానసికంగా దెబ్బతిన్న ఒక చిన్న సైన్యాధికారి. ఒక ఊరికొచ్చి ఆ ఊరిలో ఒక పెద్దింటి అమ్మాయిని ప్రశ్నిస్తుంటాడు. యుద్ధం మూలాన ఆ కుటుంబాలు కొంచెం దెబ్బతిని ఉంటాయి. ఆ సందర్భంలో, ఆ డిటెక్టివ్‌కి ఏమనిపించిందో రచయిత ఇలా చెప్తాడు: “తెల్లని దుస్తులు వేసుకొని, నీలి రంగు రిబ్బను సన్నని నడుముకు కట్టుకొని, ఉంగరాల జుట్టు మీద, ఎండ తగలకుండా టోపీ పెట్టుకొని, టెన్నిస్ ఆడి, కిలకిలలాడుతూ, ఆకుపచ్చని మైదానాల మీదుగా షికారు కెళుతూ, ఆ 1914 వేసవి సాయంత్రాల్లో, ఎవరూ గమనించకుండానే కనుమరుగైపోయిన అమ్మాయిలు అతనికి హఠాత్తుగా గుర్తుకు వచ్చారు.”

19వ శతాబ్ది చివరికి గ్రేట్ బ్రిటన్, ప్రపంచంలో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించింది. అంతకు ముందు అనేక దేశాలు ప్రపంచాధిపత్యం నెరిపాయి. అవి తమ ఆధిపత్యం నిలుపుకోవడానికి, తమ ముద్ర వేయడానికి అనేక రకాల సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన ఉపకరణాలు వాడుకున్నాయి. ఉదాహరణకి, అరబ్బులు తమ రాజ్యానికి ఒక ఏకీభావం ఇవ్వడానికి మతాన్ని వాడుకున్నారు. చైనావారికి వారి లిపి ఒక ఏకత్వభావన ఇచ్చింది. ఇతిహాసాలు, కథలు, సంగీతం, ఇలాగ అనేకం మన దేశానికి ఒకప్పుడు రూపాన్ని ఇచ్చాయి.

కానీ, ఇంగ్లండ్ పరిస్థితి వేరు. వాళ్ళు ఎన్ని దేశాలు జయించినా, వాటిని పరిపాలించారే తప్ప అక్కడే స్థిరపడలేదు. ఇంగ్లండ్‌లో పుట్టి, పెరిగి, వలసపోయి, డబ్బు సంపాదించి, మళ్ళీ ఇంగ్లండ్‌కి తిరిగి వచ్చి ఒక ఇల్లు, కాపురం ఏర్పాటు చేసుకోవడం సాధారణంగా జరిగే విషయం. ఇది ఒక మధ్యతరగతి కల. లెక్కలు చూసి, కాలువలు తవ్వించి, రోడ్లు వేయించి, కొత్త వాణిజ్య కేంద్రాలు పెట్టించి, పన్నులు వసూళ్లు చేసి, స్థానికులని నయాన్నో భయాన్నో అదుపులోకి తెచ్చుకొని, ఒక సామ్రాజ్య మహాచక్రంలో ఆకుల వంటి వీళ్ళే నిజమైన సామ్రాజ్య నిర్మాతలు.

మరి, మాతృదేశంతో అంతగా పెద్ద సంబంధాలు లేని వీళ్ళకి, ఇంగ్లండ్‌కి దూరంగా గడిపే వీళ్ళకి, ఎందుకు దేశ, రాజభక్తి ఉండేది? ఎందుకు అమెరికాలో లాగ కొత్త రాజ్యాలను స్థాపించలేదు? ఎందుకు తమకు తాము ఇంగ్లీష్ వాళ్లమని అనుకునేవారు? ప్రాచీనకాలం నుండి ఉన్న తెగ, జాతి నుండి విధేయత ఎందుకు దేశానికి బదిలీ అయింది? దేశదేశాలు వెళ్లిన ఇంగ్లీష్‌వాడు, మరి తన మాతృభూమితో ఎలాగ సంబంధం ఉంచుకోగలడు? ఆఫ్రికాలో పుట్టి పెరిగిన ఇంగ్లీష్‌వాడు, తన ఇంగ్లీష్ తనాన్ని ఎలా కల్పించుకోగలడు? ఎలా నిలుపుకోగలడు?

ఈ ‘దేశం’ అనే ఒక కల్పనను నూతన యుగంలో దృఢంగా స్థాపించింది ఇంగ్లీష్‌వారు. పునరుజ్జీవనం ఇటలీలో మొదలయినా వాళ్ళు తమ నగరానికే విధేయులుగా ఉండేవారు. నగరం బయట కొన్నేళ్లు గడిపితే ఆ విధేయతాభావం పోతుంది. మతపరమైన అస్తిత్వంతో దేశాలు ఉన్నా, వాళ్లలో వాళ్ళకి మతం మీద గొడవలు. ఆధునిక యూరప్ చరిత్రనంతా క్రిస్టియన్ మతశాఖల మధ్య గొడవల్లాగా చూడవచ్చు. యూరప్ చరిత్రలో, దేశానికి కావలసిన ఒక రాష్ట్రీయతా అస్తిత్వం ఇంగ్లాండ్ కంటే ఏ దేశంలోనూ లేదు.

ఈ ఇంగ్లీష్ అస్తిత్వభావం పెరగడానికి, ముఖ్యంగా విక్టోరియా పరిపాలనలో, అన్ని కళలూ సహాయం చేశాయి. ఉదాహరణకి, జనసామాన్యంలో పేరు పొందిన గిల్బర్ట్ & సలివన్ (Gilbert & Sullivan) పాటల్లో ఒకటి అతడు ఇంగ్లీష్ వాడు (For he is an Englishman) అనేది ఒకటి ఉన్నది. ఇంకా, పైరేట్స్ అఫ్ పెంజాన్స్‌లో (Pirates of Penzance) ‘అతడిలో ఎన్ని తప్పులు ఉన్నా, అతడు తన రాణిని ప్రేమిస్తాడు’ అని ఒక పాట పల్లవి ఉంటుంది. ఇంగ్లీష్ జీవన విధానం గొప్పది, ఈ మానవ సంబంధాలు గొప్పవి, అసలు ఇంగ్లీష్ పుటకే గొప్పది అనేది వాళ్లకి సాహిత్యం, సంగీతం, మిగిలిన కళలు మాటిమాటికీ చెప్పేవి. ఎంత అంటే, ఫ్రెంచ్ చిత్రకారులు గొప్పవారని ఒప్పుకున్నా, వారి జీవిత విధానం విషయలోలత్వంతో కూడుకున్నదని చిన్నచూపు చూసేవారు!

19వ శతాబ్దం చివరికి, ఇంగ్లాండ్ స్వర్ణయుగం వచ్చింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పడింది. అప్పటికి, ఈ ఇంగ్లీష్ వాళ్ళు తమ అస్తిత్వంలో భాగంగా నమ్మినవి రెండు: ఒకటి వాళ్ళ వర్గ వ్యవస్థ. రెండవది వారి గ్రామ జీవితం మీద మమకారం.

ఇంగ్లీష్ వర్గ వ్యవస్థ అనేక పుస్తకాలలో కనబడుతుంది. జేన్ ఆస్టిన్, అగాథా క్రిస్టీ, ఛాల్స్ డికెన్స్ పుస్తకాల్లో, దాదాపు ప్రతి పుస్తకంలో ఈ వర్గాల విషయాలు కనబడుతుంటాయి. పెద్దింటివారు పెద్ద చదువులు చదువుకుంటారు. లేదా, వారికి ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. చిన్నవారు తమ పనులేవో చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంటారు. వారి జీవితం బండగా ఉంటుంది. పెద్దవారు సున్నితంగా ఆలోచిస్తారు. చిన్నవారు తాత్కాలికమైన శారీరక సౌఖ్యాలే చూసుకుంటారు. ఇటువంటి అనేక ముతక పడికట్టు వర్ణనలు ఈ కథల్లో కనబడుతుంటాయి.

20వ శతాబ్దానికి ముందు, ఈ వర్గ వ్యవస్థను అందరూ ఒప్పుకున్నవారే. ఒప్పుకోనివాళ్ళని అరాచకులని, రకరకాల పేర్లు పెట్టి బహిష్కరించిన సందర్భాలున్నాయి. పెద్దింటి అమ్మాయిలంటే గౌరవం. జార్జ్ బెర్నార్డ్ షా రాసిన పిగ్మేలియన్‌ (Pygmalion) నాటకంలో ‘ఈ సమయంలో మీరు ఉండకూడదు మిస్,’ అని పూలమ్మే ఆవిడ ఎలైజాకి గౌరవంగా, పెద్దింటివాళ్లకి చెప్పినట్లు చెబుతుంది. లోకంలో ఉండే మట్టి, మురికి, బాధలు, క్రూరత్వం, ఇవేవీ ఆ పెద్దింటి అమ్మాయిలకు కనబడకుండా కాపాడటం ఈ వర్గ సంస్కృతి మాత్రమే కాదు, సమాజ సంస్కృతి కూడానూ. పెద్దింటి అబ్బాయిలు, బోర్డింగ్ స్కూల్‌లో చదివి, ఒక ద్వంద్వ దృష్టిని తెచ్చుకుంటారు. క్రూరత్వం చిన్నవర్గాల మీద, వలస దేశాల్లో స్థానికుల మీద. సున్నితత్వం పెద్ద సమాజంలో, ముఖ్యంగా ఆడవాళ్ళతో. ఇంకా ముఖ్యంగా, వయసులో ఉన్న ఆడవాళ్ళతో. విక్టోరియన్ రోజులలో ఆడవాళ్లని ఇంగ్లీష్ రోజ్ అని భావించడం, వర్ణించడం చాలా సాధారణం. వలస దేశాల్లో ఉన్నన్నాళ్ళు ఈ ఇంగ్లీష్ రోజ్ గురించి కలలు కనేవాళ్ళు (Oh, my heart still beats /For my home and my English rose).

ఇక గ్రామీణ జీవన మమకారానికి వస్తే, పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్‌లోనే వచ్చినప్పటికీ, ఇక్కడ గ్రామీణ జీవన సరళికి గౌరవం ఎక్కువ. మాగ్నా కార్టా (Magna Carta Libertatum) రోజులనుండీ, ఇంగ్లండ్‌కి ఒక స్థిరత్వం, శాశ్వతత్వం ఇచ్చింది భూస్వామ్య వ్యవస్థ. వీళ్ళు విశ్రాంతి సమయాల వినోదాలు ఇంగ్లీష్ ఆదర్శాలు. ఉదాహరణకి, గుర్రపు స్వారీ, ఆటలు ఆడటం, డాన్స్ చెయ్యడం, నక్కల వేటలు, కుక్కలు పెంచడం. ఇటువంటి గ్రామ ప్రాంతపు పెద్ద తరగతి సరదాలు దేశమంతా ప్రాచుర్యంలో ఉండేవి. అంతేకాదు, బాగా డబ్బులున్న జమీందారులు పట్టణాలలో ఇళ్ళు కొనుక్కొని వాటిలో గడిపేవారు. ఎండాకాలం తమ గ్రామాలకు వెళ్ళి ఆటపాటల్లో వేటవిందుల్లో గడిపేవారు. చలికాలం విదేశాల్లో, మధ్యలో నగరంలో ఉండేవారు. ఇలాగ వారి జీవితం అందం, ఆనందం, అనుభవం కోసమే గడుపుతుండేవారు, బాధ్యతారహితంగా, పొలాల మీద వస్తున్న డబ్బులు తింటూ.

కానీ, 20వ శతాబ్ది వచ్చేటప్పటికి, ఆ సమాజం క్షీణిస్తూ వచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్యం పతనం కాసాగింది. వర్గ వ్యవస్థ, దాని చిహ్నాలు, రాజరికం మీద బ్రిటిష్ ప్రజలలో అసహనం, ద్వేషం పెరగటం మొదలయింది. ఒక వైపు వ్యాపారం మూలాన పైకివచ్చినవారు, ఈ వంశ పారంపర్య వ్యవస్థను చిన్నచూపు చూపేవారు. ఇంకొక వైపు, యూరప్ నుండి సామ్యవాద భావజాలం అసలు పెద్ద, చిన్న భావాలమీదే దాడి చేసింది.

మొదటి నుంచీ పరిశ్రమల నుంచి, వ్యాపారం నుంచి డబ్బులు సంపాదించినవారు ఉన్నప్పటికీ, వారు ఈ భూస్వామ్య వర్గం వారి ఆమోదం కోసం తపించేవారు. పెద్దింటి వివాహ సంబంధాలు, దొర బిరుదులు కొనుక్కోవడం, ఇటువంటి పనులతో పెద్ద వర్గంలో చేరిపోయేవారు. కానీ, 20వ శతాబ్దంలో, ఈ భూస్వామ్య వర్గపు పలుకుబడి, గౌరవం తగ్గిపోవడంతో, కొత్త వర్గం మొదలయింది. ఈ చారిత్రక పరిణామం ది వే ఉయ్ లివ్ నౌ (The way we live now) అనే ఆంథొనీ ట్రాలప్ (Anthony Trollope) నవలలో; సామ్యవాద ప్రభావంతో ఈ ఇంగ్లీష్ విలువలు మారడం హవర్డ్‌స్ ఎండ్ (Howards End) అని ఫార్‌స్టర్ (E.M.Forster) నవలలో చూడవచ్చు.

ఇక, టెన్నిస్ ఆటకు వద్దాం. ఇంగ్లీష్‌వారు ప్రపంచం మీద వేసిన రెండు పెద్ద ముద్రలలో మొదటిది భాష, రెండవది ఆటలు. ఈ ఆటలు ప్రచారం చెయ్యడంలో ఒక పరమార్థం ఉన్నది. ఈ ఆటల ద్వారా వాళ్ళు నియమాలకు కట్టుబడి ఉండటం, అంపైర్ మాట వినడం వంటి కీలమైన విషయాలు స్థానిక ప్రజలకు అలవాటు చేశారు. నిజానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకి, ఆటలకు మధ్యన చాలా పోలికలు ఉంటాయి. రెండూ సంప్రదాయ, యాదృచ్ఛిక నియమాలకి ప్రజలు కట్టుబడి ఉండడం మీద ఆధారపడి ఉంటాయి.

ఇక ఆడవాళ్లు ఆడటం ఎప్పుడు మొదలయింది? ముందు ఇంగ్లండ్‌లో కూడా ఆటల నియమాలు బాగా పాటించేవారుకాదు. క్రీడారంగంలో కత్తులు దూయడం సాధారణంగా ఉండేది. 1850లు వచ్చేసరికి ఆడవాళ్లు, అందునా పెద్దింటి ఆడవాళ్లు ప్రేక్షకులుగా ఉండడం మొదలయిన తర్వాత, ఆటలలో సభ్యత, హుందాగా ప్రవర్తించడం పెరిగింది. టెన్నిస్ లాంటి ఆటలు, ఈ సామాజిక సభ్యతని, క్రీడాస్ఫూర్తిని పెద్దింటి గుణాలుగా, అంటే అందరికీ ఆదర్శప్రాయంగా చేశాయి. 1900లు వచ్చేసరికి ఆడవాళ్లు టెన్నిస్ ఆడటం ఆధునిక సమాజ లక్షణంగా అయింది.

ఇప్పుడు వ్యాసం మొదట్లో నేను చెప్పిన వాక్యం పరిశీలించండి. ఇంతవరకూ చెప్పిన విషయాలు ఎలా సూచనప్రాయంగా కనబడతాయో చూడండి.

1914లో ఏమైంది? మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. దానితో ఇంగ్లీష్ బండారం బయటపడింది. మిగిలిన యూరప్ దేశాలు కూడా, ఇంగ్లండ్ లాగ అభివృద్ధి చెందాయని, నిజానికి ఇంగ్లండే కొన్ని కొన్ని విషయాల్లో వెనకపడి ఉన్నదనీ తెలిసింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యూడల్ వ్యవస్థ పడిపోసాగింది. గ్రాండ్ ఇల్యూజన్ (Grand Illusion) అని ఒక సినిమాలో ఈ ఫ్యూడల్ విలువలు పడిపోవడం బాగా చూపిస్తాడు జాఁ రెన్వార్ (Jean Renoir).

ఏ మాత్రం బాదరబందీ లేకుండా ఆడుకునే ఆడపిల్లలు. వెన్నెల్లో కాదు, వీరు చల్లని ఇంగ్లీష్ ఎండాకాలంలో పగలు ఆడుకొనేవారు. ఇంగ్లీష్ రోజ్, మాసిపోకుండా నెత్తిన టోపీ పెట్టుకొని మరీ. ఇది మగవాళ్ల టోపీ కాదు. ఇది ఉంగరాల జుట్టుకి పిన్ను పెట్టిన టోపీ.

రానురాను, 1920 రోజుల నాటికి స్త్రీ స్వాతంత్య్రం పెరగగానే, రింగుల జుట్టు, వంకీల జుట్టు పోయి, బాబ్ జుట్టు ఫ్యాషన్ అయింది. బాబ్ జుట్టే కాదు, ఒంటి ఒంపుసొంపులు చూపకుండా, పైనుంచి కిందవరకూ ఒకే విధంగా కనబడడటం ఫ్లాపర్ ఫాషన్ అయింది. వీరు ‘పృథు వక్షోజ నితంబ యౌవన భారలై’ వంగిపోయేవారు కాదు. పురుషులని ఆకర్షించే శారీరక లక్షణాలని ఈ ఫ్లాపర్ యువతులు తిరస్కరించారు. సామాజిక కట్టుబాట్లను ఉల్లంఘించారు. అంటే, కొన్ని తరాలుగా పెంచిన విక్టోరియన్ విలువలు, సామ్రాజ్యవాదపు సమాజ లక్షణాలు దెబ్బతినడం మొదటి ప్రపంచ యుద్దపు కాలంలోనే మొదలయింది.

తెల్లటి బట్టలు వేసుకోవడం, ఉతికే మనుషులు ఉంటారు కాబట్టి పెద్దింటివారికి కుదురుతుంది. నీలి రంగు రిబ్బన్ నడుము చుట్టూ కట్టుకొని, సంప్రదాయక ఆకారంగా కనపడే ఆడపిల్లలు. సన్నని నడుము, అది కొట్టవచ్చే విధంగా, నీలి రిబ్బను కట్టి ఉండటం మరుగున పడిపోతున్న సంప్రదాయక ఇంగ్లీష్ స్త్రీత్వం. అందునా, కిలకిలలాడుతూ, అందంగా, ఆరోగ్యంగా, లోకంలో కష్టాలు తెలియకుండా ఉండే ఆ ఆడపిల్లలు. వారిని రక్షణ కావలసినవారిగా చూడటం ఒకప్పటి ఇంగ్లీష్ ఆధిపత్య భావ చిహ్నాలు. కానీ, యుద్ధం ఆ భావజాలాన్ని మార్చేసింది. ఈ యుద్ధంలో అందరూ, అంటే ఉన్నత కుటుంబాలవారు, సాధారణ సైనికులు అందరూ పాల్గొన్నారు. బాదరబందీ లేని రోజులు అంతరించాయి. యుద్ధం ఏదో వలస దేశాల్లో వేరే ప్రతినిధులతో చేయించడం కాదు. ఇది గుమ్మం మీదకి వచ్చిన యుద్ధం. అమ్మాయిలు కూడా యుద్ధంలో పనిచేశారు, వెనకనుంచి హాస్పిటల్స్‌లో, పొలాల్లో, ఆఫీసుల్లో. అగాథా క్రిస్టీ కూడా హాస్పిటల్లో నర్సుగా చేసింది. ఈ అనుభవాల మూలాన, ఇంగ్లీష్ రోజ్ కొత్త నిజాలు నేర్చుకుంది. పూలరెక్కలు రాలిపోయాయి. సంరక్షణ కోసం ముళ్ళు బయటకి రాక తప్పలేదు.

ఆ విధంగా ఈ కథాకాలానికి, సమాజం నెమ్మదిగా, హఠాత్తుగా మారుతూ వచ్చింది. మార్పు నెమ్మదిగా కావడంతో, గుర్తించడం కష్టం. కానీ, ఒకరోజు లేచి చూసేసరికి, అనేక చిహ్నాలు పోయి, హఠాత్పరిణామంలాగా ఈ మార్పు కనబడుతుంది. ఈ వాక్యంలో ఆ చిహ్నాల గుర్తింపు ఉంది. ఆ అందమైన ఇంగ్లీష్ అమ్మాయిలు, ఆనందమైన ఆటలు ఇవన్నీ సామ్రాజ్యవాదపు లోతులు చూడకుండా పైపైన మెరుగులు. అయినా, ఆ వ్యవస్థకి ఒక అర్థం ఇచ్చిన సామాజిక సాంస్కృతిక విలువలు ఇటువంటి చిన్ని చిన్ని అభిరుచులగుండా బయటపడతాయి.

ఇలాగ, మనుషులు మారారు. స్త్రీ పురుష సంబంధాలు మారాయి. వ్యవస్థ మారుతూ ఉన్నది. అందరూ నమ్మిన సత్యాలు మారుతున్నాయి. ఏది అందమో, ఏది వాంఛనీయమో అన్నీ మారుతూ వస్తున్నాయి. ఒకే ఒక్క వాక్యం సాధారణమైన పదాలతో ఇంత చరిత్ర చూపించింది. అందుకే నాకు నచ్చిన వాక్యం అయింది.
---------------------------------------------------------
రచన: రామారావు కన్నెగంటి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment