Friday, December 21, 2018

పై గదిలో ప్రేమికుడు


పై గదిలో ప్రేమికుడు




సాహితీమిత్రులారా!

ఈ అనువాద కథను ఆస్వాదించండి....................

శ్రీదేవి చిర్రెత్తిపోవడం మూడంచెల్లో జరిగింది. తను రాసుకుంటున్న పాటలో లీనమై వుండడం వల్ల ఆమెకి ఆ చప్పుడు ముందు లీలగా వినిపించింది. విని కొంచెం చిరాకు లాంటిది కలిగింది. కొంచెం సేపటి తర్వాత తన ఏకాగ్రతకి భంగం కలిగేసరికి కోపం మొదలైంది. ఇంకొంచెం సేపటి తర్వాత ఆ చప్పుడు తాను రాస్తూ పాడుకొంటున్న పాటని వెక్కిరిస్తున్నట్టనిపించి అవమానంలోకి దారి తీసింది.

పై గదిలో వుండే వెధవన్నర వెధవకి తాను వయోలీన్ మీద వాయిస్తున్న పాట నచ్చక అలా బూట్లతో తప్పుడు తాళం వేస్తూ గొడవ పెడుతున్నాడన్నమాట. కోపంతో పళ్ళు పట పటా కొరికి లేచింది శ్రీదేవి. వాడికి బుద్ధి చెప్పకుండా వదిలేది లేదు. ఆవేశంతో ఆమె చెంపలు ఎర్రబడ్డాయి, కళ్ళు నిప్పులు కక్కాయి. తన గదిలోంచి బయటికి వచ్చి మెట్లెక్కింది. ఆ క్షణంలో ఆమెని చూసిన వారెవ్వరైనా, ఆ పై గదిలో వున్న అమాయకుడి మీద జాలి పడక మానరు. తన మీదికి రాబోతున్న సుడిగాలి గురించి తెలియదు పాపం, అని నిట్టూర్చక మానరు! శ్రీదేవి తలుపు గట్టిగా తట్టింది.

“యస్! కమిన్,” లోపల్నుండి కొంచెం ప్రసన్నంగా మగ గొంతు వినిపించింది. గొంతు ఎంత బాగుండీ ఏం లాభం, మనిషి సంగీతాన్ని అవమానించే మూర్ఖుడికి!

శ్రీదేవి లోపలికి అడుగేసింది. లోపల ఒక చిన్న గది, ఒక పెయింటరు తన కోసం తయారు చేసుకున్న స్టూడియోలా వుంది. గది శుభ్రంగానే వున్నా నిరాడంబరంగా వుంది. గది మధ్యలో బొమ్మలేసుకోవడానికి కాన్వాస్ బిగించిన ఈసెల్ వుంది. ఈసెల్ పైనుంచి సిగరెట్టు పొగ తేలుతోంది. ఈసెల్ కింది నించి జీన్స్ పేంట్ కాళ్ళు కనిపిస్తున్నాయి. బూట్లు తొడుక్కున్న ఆ కాళ్ళు నిరంతరంగా నేల మీద రకరకాలుగా తాళం వేస్తూనే వున్నాయి.

“ఒక్క క్షణం ఇటు చూస్తారా?” శ్రీదేవి మర్యాదగానే అడిగింది.

“వొద్దండీ! ఇప్పుడు నాకే మోడల్స్ తోనూ పని లేదు.” ఈసెల్ వెనకనించి ఆ మూర్ఖుడి గొంతు వినొచ్చింది. “మీ అడ్రసు అక్కడ ఆ కాగితం మీద రాసి పెట్టి వెళ్ళండి, అవసరం అయితే నేనే కబురు చేస్తాను.”

“నేను మోడల్‌ని కాను!” శ్రీదేవి కఠినంగా అంది.

ఆ మాటతో ఆ గొంతు తాలూకు మొహం ఈసెల్ వెనకనించి బయటికొచ్చింది. నోట్లో వున్న సిగరెట్టుని యాష్ ట్రేలో పెట్టి కుర్చీలోంచి లేచాడు.

“అలాగా? ముందిలా కూర్చొండి. ఎవరు మీరు? ఏం పని మీద వచ్చారు?” మర్యాదగా అన్నాడు.

దేవుడు ఎంత అపాత్ర దానం చేస్తాడో కొన్నిసార్లు! ఆ దౌర్భాగ్యుడి గొంతే కాదు, మొహం కూడా బాగానే వుంది. అన్నిటికంటే అడ్డదిడ్డంగా వున్న ఆ వొత్తైన జుట్టు, అనుకుంది శ్రీదేవి. కోపంగా వున్నా నిజాలు ఒప్పుకుంటూంది మరి!

“మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలి. మీకు నా పాట నచ్చినట్టు లేదు.” కోపాన్నీ, మర్యాదనీ, వెటకారాన్ని సమపాళ్ళలో మేళవించి అంది. ఆమె వెటకారం అతనికేమీ అర్థమయినట్టు లేదు. అయోమయంగా చూశాడు. ఇహ ఇతనితో సూటిగా చెప్పాల్సిందే!

“నేను కింద పోర్షన్లో అద్దెకుంటాను. బహుశ నా పాటా, నా వయోలీన్ నచ్చక కాబోలు బూట్లతో తాళం వేస్తూ గొడవ చేస్తున్నారు!”

“అదేం లేదే! మీ పాట బాగానే వుంది.” ఇంకా అయోమయంగానే అన్నాడు.

“మరయితే ఆ బూట్లతో నేల మీద చప్పుడు చేస్తారెందుకు? చాలా చిరాగ్గా వుంది!”

శ్రీదేవి కోపంగా అని వెళ్ళడానికి వెనుదిరిగింది. మళ్ళీ ఆగి, “పైగా మీరలా బూట్లతో తడుతూ వుంటే నా నెత్తిన కప్పు కూలుతుందేమోననే భయం కూడా! వస్తా!” అంటూ వెళ్ళబోయింది. అప్పటికి ఆ అందగాడు తేరుకున్నాడు.

“ఆగండాగండి! అప్పుడే వెళ్ళకండి.”

ఆగి అతని వైపు చూసింది. స్నేహంగా, అందంగా చిరునవ్వు నవ్వుతున్నాడు. “మీరెందుకో కోపంగా వున్నారు. నిజానికి నాకు సంగీతమంటే చాలా ఇష్టం. కానీ, మీరు పాడే పాట ఏదో నాకు తెలియలేదు. ఊరికే వాయిస్తున్నారనుకొన్నాను. ఏదో ఆలోచనలో యధాలాపంగా బూట్లతో నేలను తడుతున్నాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు.”

“ఒక కొత్త పాటకి వరస కడుతున్నాను. ఇంకా సరిగ్గా రావటం లేదు,” ముక్తసరిగా అన్నా, ఆమె గొంతులో కోపం తగ్గింది.

“అమ్మో! మీరు పాటలకి వరసలు కడతారా?”

“ఒకటి రెండు పాటలు రాసి వరసలు కట్టాను!”

“యెంత అదృష్టవంతులో! నాకు అసలు అలా కళల్లో ప్రవేశం వున్నవాళ్ళంటే చాలా గౌరవం.”

“మీరు కూడా కళాకారుడిలానే వున్నారే. ఏదో పెయింట్ చేస్తున్నట్టున్నారు?”

చిరునవ్వుతోనే తల అడ్డంగా తిప్పాడతను. “నా బొంద! ఈ పెయింటింగు మానేసి గోడలకి సున్నం వేసుకోడానికి పనికొస్తానేమో నేను! ” అతని మాటల్లో నిరాశేమీ లేదు.

“ఏదీ, నన్ను చూడనీండి!” ఈసెల్ వైపు నడిచింది.

“నా మాట విని మీరటు వెళ్ళొద్దు. ఆ పెయింటింగు చూస్తే జడుసుకుంటారేమో!”

అతని మాటలు పట్టించుకోకుండా ఈసెల్ మీదున్న బొమ్మని చూసింది. నిజాయితీగా చెప్పాలంటే ఆ బొమ్మ ఘోరంగా వుంది. ఒక చిన్న పాప ఇంకొక చిన్న పిల్లి కూనని పట్టుకుని వుందా చిత్రంలో. ఆమెకేమనాలో తోచలేదు.

“నేను చెప్పలే మీరు జడుసుకుంటారని? దాని పేరేమిటో తెలుసా? పిల్లి-పిల్ల! పేరు బాగుంది కదూ? వినగానే చూసే వాళ్ళకి బొమ్మలో సంగతేంటో తెలిసిపోతుంది. అన్నట్టు, ఆ కుడి వైపున వున్నది పిల్లి కూన! మళ్ళీ మీరు పొరపడతారేమో, వద్దని చెప్తున్నా, అంతే!”

శ్రీదేవికి బొమ్మల మీద వుండే అభిప్రాయాలు ఆ బొమ్మ గీసిన వాళ్ళపై తన అభిప్రాయాల మీద ఆధారపడి వుంటాయి. అందులో ఆ అందగాడు తన సంగీతాన్ని కూడా మెచ్చుకున్నాడాయె!

“చాలా అద్భుతంగా వుందీ బొమ్మ!”

సంతోషం కంటే ఆశ్చర్యం ఎక్కువ కనిపించిందతని మొహంలో. “నిజంగానా? హమ్మయ్య, ప్రపంచంలో ఒక్కరికైనా నా బొమ్మ నచ్చింది. ఇహ నేను హాయిగా చచ్చి పోతాను. అయితే ముందు కిందికొచ్చి మీ పాట మొత్తం విన్నాకనే అనుకోండి!”

“వొద్దులేండి! చిరాకుతో నేల మీద బూట్లతో తప్పు తాళం వేస్తారు.”

“అసలు నేనిక ఈ జన్మలో నేలమీద బూట్లతో తాళం వేయదల్చుకోలేదు,” అన్నాడు గంభీరంగా. అందంగా నవ్వింది శ్రీదేవి.

కళాకారుల్లో స్నేహాలు తొందరగా పెరుగుతాయి. గంట సేపట్లో అతని పేరు సి.జీవి అనీ, ఈ పెయింటింగు అతనికి బ్రతుకుతెరువేమీ కాదనీ, ఎక్కడో చిన్న వుద్యోగం లాటిది చేస్తున్నాడనీ తెలుసుకుంది. మాట్లాడుతున్నకొద్దీ అతనామెకి నచ్చసాగాడు. తన బొమ్మలు అంత ఘోరంగా వున్నందుకు అతనేమీ పెద్ద నొచ్చుకున్నట్టు లేదు. అది ఆమెకి వింతగా అనిపించినా, నచ్చింది.

అదే అపార్ట్‌మెంట్లో ఇంకో పోర్షన్లో వుండే మోహన్‌కి ఎంత విభిన్నంగా వుందీతని ధోరణి, అనుకుందామె. మోహన్ ఒక్క చిత్రాన్ని కూడా అమ్ముకోలేని విఫల కళాకారుడు. అప్పుడప్పుడూ శ్రీదేవి గదిలోకొచ్చి ఒక కప్పు కాఫీ తాగి, తన నిరాశా, నిస్పృహలని గుమ్మరించి వెళ్తూంటాడు. అయితే మోహన్ అభిప్రాయం ప్రకారం, తానొక అద్భుతమైన కళాకారుడు. పాడు నికృష్ట ప్రపంచం అతన్నీ, అతని కళనీ అర్థం చేసుకోలేక వ్యర్థం చేస్తుంది. ప్రజలకసలు ఏ మాత్రం కళా హృదయం లేదని మోహన్ గాఢ నమ్మిక. అందుకు నేరుగా వ్యతిరేకంగా వుంది జీవి అభిప్రాయం. శ్రీదేవికి అతని స్పోర్టివ్ నెస్సూ, నిజాయితీ చాలా నచ్చేయి.

నిజానికి శ్రీదేవికి కొంచెం అహంకారం ఎక్కువ. ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా ఆమెకి తన బాధలు ఇతరులతో పంచుకోవడం ఇష్టం వుండదు. అందుకే ఆమెకి ఊరికే తన సానుభూతి కోసం ఏడ్చే మగవాళ్ళంటే మంట. కానీ ఇవాళ మొదటిసారి ఆమె జీవితో తన కష్టాల గురించి కొంచెం చెప్పుకుంది. బహుశా ఆ వొత్తైన జుట్టు వల్లో ఏమో, అతను చాలా నమ్మ దగ్గ వ్యక్తిలా అనిపించాడు. తాను రాసి వరస కట్టే పాటలని ఎవరూ కొనకపోవడంతో నానాటికీ దిగజారుతున్న తన ఆర్ధిక పరిస్థితీ, డబ్బు కోసం ఇబ్బంది పెట్టే ఆమె విద్యార్థులూ, అన్నిటి గురించీ చెప్పుకుంది.

“నువ్వప్పుడే రెండు మూడు పాటలు రాసేవు కదా? ఇంకా నీ కొత్త పాటలకోసం ఎవరూ అడగటం లేదా?” అనునయంగా అడిగాడు జీవి. అంతలోనే, వాళ్ళు మీరులోంచి నువ్వులోకి మారిపోయారు.

“లేదు. ఆ మూడు పాటలే అమ్ముడయాయి, అంతే! కొత్త పాటల కోసం ఏ మ్యూజిక్ కంపెనీ కానీ, సినిమా వాళ్ళు కానీ అడగటమే లేదు.”

“ఎందుకని?”

“ఎందుకంటే నేను రాసిన మూడు పాటలూ ఒకాయన పాడతానని హక్కులు కొనుక్కున్నాడు, కానీ వాటిని ఎక్కడా పాడటం లేదు. అప్పుడు నా పాటల గురిచి జనాలకి ఎలా తెలుస్తుంది? ఎంత మంది మ్యూజిక్ కంపెనీ వాళ్ళు అలా ఆశ పెట్టి మోసం చేస్తారో తెలుసా? ”

“అలా నిన్ను మోసం చేసిన వాళ్ళందరి పేర్లూ ఇటు పారేయ్. రేప్పొద్దున్న అందర్నీ వరసబెట్టి కాల్చి పారేస్తాను.”

గలగలా నవ్విందామె. “అదేం వొద్దులే. ఇలాగే రాస్తూ పాడుతూ వుంటాను. ఎవరైనా ఒక మంచి గాయకుడో, మ్యూజిక కంపెనీనో నా పాటలొకటి రెండు కొనుక్కుని బయట ఎక్కడేనా పాడి వాటిని పాప్యులర్ చేస్తే చాలు. ఇహ నాకడ్డే వుండదు.”

“అలా అయితే చాలా సంతోషం. అంత వరకూ నీకెప్పుడు దిగులుగా అనిపించినా పైన నా గదిలోకొచ్చి ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళు, సరేనా? లేదా అదిగో ఆ మూలనుంది చూడు పెద్ద కర్ర, దానితో నీ సీలింగు మీద నాలుగు బాదు. వచ్చి నీ గోడు వింటా, సరేనా?” స్నేహపూర్వకంగా అన్నాడు.

“ఆ మాటనేముందు బాగా ఆలోచించుకో! మళ్ళీ బాధ పడతావేమో!” అల్లరిగా అంది శ్రీదేవి.

“అదెప్పటికీ కాదు. బూట్ల చప్పుడయ్యే గది తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచే వుంటాయి.”

“బూట్ల చప్పుడా? ఎక్కడ? ఎప్పుడు? నేను వినలేదే!”

“ఆ చెయ్యి ఇటిస్తావా కొంచెం? ఒకసారి కళ్ళకద్దుకుంటాను.”

ఒక రోజు తన విద్యార్థులతో మరీ విసుగెత్తి జీవితో కబుర్లు చెప్పుకోవడానికి పైకెళ్ళింది శ్రీదేవి.

అక్కడ ఈసెల్ ముందు గంభీరంగా నిలబడి వున్నాడు మోహన్. చేతులు కట్టుకుని జీవి వేసిన బొమ్మ వైపు సుదీర్ఘంగా చూస్తున్నాడు. అతన్ని చూస్తేనే చిరాకు శ్రీదేవికి. అందరికంటే తనేదో మేధావిననుకునే అతని అహంభావం, మిగతా వాళ్ళందర్నీ చిన్న చూపు చూసే అతని అతి తెలివీ, ఏది చూసినా చిరాకే ఆమెకి.

“బాగున్నావా అమ్మాయ్?”

“ఎవర్రా నీకు అమ్మాయ్? శ్రీదేవీ, అని మర్యాదగా పిలవలేవూ? చవట!” మనసులో తిట్టుకుంటూ పైకి మర్యాదగా నవ్వింది.

“రా, రా శ్రీదేవీ! మోహన్ గారు నన్నూ, నా బొమ్మనీ చీల్చి చెండాడుతున్నారు. రాకపోయి వుంటే నా మర్డరు మిస్సయివుండేవారు.” జీవి ధోరణిలో మార్పేమీ లేదు.

“అలా ఉడుక్కోకోయ్ జీవీ! నేను కేవలం ఈ బొమ్మలో వున్న లోపాలు ఎత్తి చూపుతున్నానంతే. నా మాటలు నిన్ను నొప్పిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను,” దర్పంగా అన్నాడు మోహన్.

“అయ్యయ్యో! మీరు చెప్పేది నా మంచికేనని నాకు బాగా తెలుసండి. మీరు కానివ్వండి.”

అలానే కానిచ్చేడు మోహన్. “ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ బొమ్మలో అసలు జీవం లేదు. ఆ పిల్లిలో కానీ, ఈ పిల్లలో కానీ, ఎక్కడైనా జీవకళ వుందా చెప్పు?” మాట్లాడుతూనే ఒకడుగు వెనక్కి వేశాడు. చేతుల్ని ఫ్రేములా వుంచి దాన్లోంచి ఆ చిత్రాన్ని చూస్తూ,

“ఆ పిల్లి! ఊ… ఆ పిల్లీ – ఆ… ఏం చెప్పమంటావు ఆ పిల్లి గురించి? దాన్లో అసలు…”

“నాకా పిల్లి చాలా నచ్చింది! భలే ముద్దుగా వుందా బుజ్జి కూన.” వున్నట్టుండి అంది శ్రీదేవి.

ఎప్పుడూ ఆమె ముక్కు మీద వుండే కోపం మెల్లిగా కళ్ళల్లోకి ఎక్కుతోంది. మోహన్ చెత్త వ్యాఖ్యల్ని అంత సరదాగా నవ్వుతూ తీసుకుంటున్న జీవిని చూసినా ఆమెకి కోపంగా వుంది.

“ఏమైతే యేం? మీరిద్దరూ అది పిల్లి అని గుర్తుపట్టటమే నాకన్నిటికన్నా నచ్చింది,” ఎప్పట్లానే తనదైన చిరునవ్వుతో అన్నాడు జీవి.

“నాకు తెల్సు జీవీ! నా విమర్శతో నువ్వు చాలా నిరుత్సాహపడుతున్నట్టున్నావు! నీ బొమ్మ మరీ అంత చెత్తగా ఏం లేదు లేవోయ్! ఇంకొంచెం కష్టపడితే ఎప్పటికైనా నువ్వూ మంచి బొమ్మలు వేయగలవు!”

శ్రీదేవి కళ్ళల్లోకి ఒక ప్రమాదకరమైన మెరుపు వచ్చింది. ఇహ వీడ్ని వదిలేది లేదనుకుంది. చాలా మెత్తగా నవ్వుతూ, “అవును జీవీ! మోహన్ గారు ఎంతో కష్టపడి ఇంత పైకొచ్చారు. ఆయన బొమ్మలు నువ్వు చూసే వుంటావు!”

“నేనా? మోహన్ గారి బొమ్మలా? చూడలేదే!”

“చూడకపోవటమేమిటి? పత్రికల్లో అన్నీ ఆయన వేసిన బొమ్మలే కదా!” శ్రీదేవి ఇంకా మెత్తగా నవ్వుతూనే వుంది.

మోహన్ వంక ఆరాధనగా చూశాడు జీవి. అయితే ఎందుకో మరి మోహన్ మొహం ఎర్రబడి వుంది, ఇబ్బందిగా. దాన్ని ఆయనకి సహజంగా వుండే వినయంగా అర్థం చేసుకున్నాడు జీవి.

“పత్రికల్లో ప్రకటనల పేజీలుంటాయి చూడు. ఆ బొమ్మలన్నీ ఆయనవే. ఆ బూట్ల కంపెనీ ప్రకటనలో బూట్లూ, ఫర్నీచర్ కొట్టు ప్రకటనలో సోఫా సెట్టూ ఎవరు వేశారనుకున్నావు? మోహన్ గారే! స్టిల్ లైఫ్ బొమ్మలు భలే వేస్తారులే!” చురకత్తిలాటి నవ్వుతో నిర్దాక్షిణ్యంగా చెప్తోంది శ్రీదేవి.

మోహన్ మొహం మాడి పోయింది. ఒకలాటి భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది గదిలో. జీవి ఉత్కంఠతతో చుస్తున్నాడు, ఈ వాగ్యుధ్ధంలో గెలుపెవరిదా, అని!

ఆఖరికి మోహన్ తేరుకున్నాడు. కోపం గొంతు నిండా పొంగి పొర్లుతూండగా, “అమ్మాయ్! నేను డబ్బు కోసం వేసే కొన్ని మామూలు చిత్రాలే చూసినట్టున్నావు. నేను అవే కాక కళాత్మకమైన బొమ్మలు బోలెడు వేశాను.”

“అవునా? అవెవరు కొన్నారబ్బా? ఆ… గుర్తొచ్చింది! ఎనిమిది నెలల కింద ఒక బొమ్మ వంద రూపాయలిచ్చి ఎవరో కొన్నట్టున్నారు, కదూ! అంతకు ముందర, దాదాపు సంవత్సరం క్రితం ఒక చిత్రం ఇంకెవరో…”

ఆమె మాట మధ్యలోనే మోహన్ కోపంగా లేచి వెళ్ళిపోయాడు. జీవికి అతన్ని చూస్తే జాలేసింది.

“ఆ మనిషిని మరీ అంతగా చావగొట్టాలా! పెద్దాయన, ఏదో ఆన్నాడే అనుకో!”

ఉన్నట్టుండి ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి జేబులోంచి రుమాలు తీసి ఇచ్చాడు. “ఏమయింది? ఊరికే నవ్వులాటకన్నాను, అంతదానికే ఇంతలా ఏడవాలా..”

“ఛీ! నా అంత నీచురాలు ఎవరైనా వుంటారా?”

“అంతదానికేనా? చాల్లే!”

“మనందరవీ ఒక్క లాటి కష్టాలే కదా? నేను నా పాటలు ఎవరూ కొనక ఎలా బాధ పడుతున్నానో, అతనూ తన బొమ్మలు అమ్ముడవక అలాగే బాధ పడుతున్నాడు కదా? అతన్ని అవమానించే హక్కు నాకెక్కడిది?”

వెక్కిళ్ళు పెడుతూంది శ్రీదేవి. కొంచెం సేపటికి తేరుకుంది. మొహం తుడుచుకొని జీవి వైపు చూసి సన్నగా నవ్వింది.

“సారీ! ఊరికే వచ్చి నీ మూడ్ పాడు చేశాను కదూ! నాకంటే అసహ్యమైన జంతువుంటుందా?”

“వుంది! ఇదిగో, నా బొమ్మలో ఈ పిల్లి! ఇందాక మోహన్ కూడా అదే మాటన్నారు కదా? అది సరే, నాకొక విషయం అర్థం కావడం లేదు.”

“ఏమిటి?”

“నేనింకా మోహన్ గారు చేయి తిరిగిన కళాకారులనీ, జనమంతా ఆయన గీసిన చిత్రాలు కొనడానికి బారులు తీరి నిలబడ్డారనీ అనుకున్నాను. అందుకే ఆయన ఇక్కడికొచ్చి నా బొమ్మని చెడామడా తిడుతూంటే, అంతటి మేధావి నా బొమ్మ గురించి అభిప్రాయం చెప్పటమే నా అదృష్టమని మురిసిపోయాను కూడా! మరి నువ్వేమో…”

“అదేం లేదు, పాపం. అతనూ మన గూటి పక్షే. ఒక్కరూ తన చిత్రాలు కొనక, ఇలా ప్రకటనల కోసం బొమ్మలు గీసి డబ్బు సంపాదిస్తూంటాడు. నేనేమో అలాటి ఆయనని పట్టుకొని… నా పాపానికి నిష్కృతి లేదు,” మళ్ళీ గొల్లుమంది శ్రీదేవి.

“మళ్ళీ మొదలు పెట్టొద్దు, ప్లీజ్!”

శ్రీదేవి లేచింది. “వెళ్ళి క్షమాపణలైనా చెప్తాను. అతనంటే నాకేమాత్రం ఇష్టం వుండదనుకో. అయినా నేను చేసింది తప్పేగా? తప్పదు మరి! వస్తా.” బయటికెళ్ళింది.

సి.జీవి లేచి సిగరెట్టు ముట్టించాడు. కిటికీలోంచి బయటికి చూస్తూ దీర్ఘాలోచనలో పడ్డాడు.

జీవితంలో వీలైనంతవరకూ క్షమాపణలు చెప్పకుండా ఉండడానికే ప్రయత్నించాలి. ఎప్పుడైనా విధిలేక చెప్పాల్సి వస్తే, అందుకు అర్హులైన వారికే చెప్పాలి. ఏదో పొరపాటు చేశాం కదా అని ఎవరికి పడితే వారికి చెప్పకూడదు! అందులో మోహన్ లాటి వారికి అసలే చెప్పకూడదు. అలాటి వారికి క్షమాపణ చెప్తే, పెద్ద మనసుతో హుందాగా క్షమించేయకుండా, చిన్న పొరపాటుని పదే పదే ఎత్తి చూపి, పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడి, ‘ఇతనికి క్షమాపణ చెప్పటం కాకుండా, చెంప పగలగొట్టాల్సిందేమో,’ అని అనుకునే పరిస్థితికి మనల్ని దిగజారుస్తారు.

ఇప్పుడూ అదే జరిగింది. ఈ పొరపాటు వల్ల ఇహ ముందు తనేం మాట్లాడినా, ఏం చేసినా శ్రీదేవి నోరెత్తకుండా పడుండాల్సిందే తప్ప, నోరెత్తకూడదని అన్యాపదేశంగా ఆమెకి సూచించి పంపేశాడు. మళ్ళీ ఎప్పట్లాగే జీవి గదికి పోవడాలూ, అడగకున్నా సలహాలు ఇచ్చేయడాలూ యథేఛ్ఛగా సాగుతున్నాయి. జీవి పధ్ధతి మాత్రం ఏమీ మారలేదు. ఎప్పట్లాగే, చిరునవ్వుతో అతను మోహన్ తన బొమ్మలమీద చేసే వ్యాఖ్యానాలని స్వీకరిస్తున్నాడు. అతనితో ఏకీభవిస్తున్నాడు కూడా. అతని స్థితప్రఙ్ఞత చూస్తున్నకొద్దీ శ్రీదేవికి అతను ఇంకా నచ్చుతున్నాడు.

ఈ మధ్య మోహన్ ఉపన్యాసాల్లో దర్పం పెరిగింది. ఎందుకంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత అతని చిత్రాలు అమ్ముడవుతున్నాయి. రెండు వారాల్లో మూడు బొమ్మలు అమ్ముడు పోయేసరికి అతని ఏజెంటు కూడ ఆశ్చర్యం పట్టలేకపోయాడు. సూర్యరశ్మికి కమలాలు విచ్చుకున్నట్టు, ఈ శుభ పరిణామాలతో అతనిలోని విమర్శకుడు విచ్చుకున్నాడు. ఈ మధ్యనే ఒక డబ్బున్న మారాజు తన బొమ్మని రెండువేలకి కొన్నాడని తెలియగానే, మోహన్‌కి డబ్బున్న వాళ్ళ మీద ఇదివరకున్న అభిప్రాయాలు సమూలంగా తుడిచిపెట్టుకు పోయాయి.

“నాకైతే ఇది డబ్బున్న వాళ్ళల్లో కళల గురించి సరైన అవగాహన పెరుగుతున్న శుభోదయానికి నాందిలా అనిపిస్తుంది,” అని ప్రకటించాడు, శ్రీదేవి, జీవిల ముందర, గంభీరంగా!

జీవి కూడా మొత్తానికి పిల్లి-పిల్ల చిత్రాన్ని పూర్తి చేసి ఒక పెద్ద గాలరీలో ఇచ్చాడు, దీంతో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండని. మోహన్ రికమెండేష లెటర్ రాసిచ్చాడు కదా! అందుకని వాళ్ళూ తీసుకున్నారు. తన బొమ్మలు బాగనే అమ్ముడవుతూండడంతో మోహన్ ప్రకటనలకి వేసే బొమ్మలు తగ్గించుకున్నాడు. దాంతో తీరిక చిక్కి జీవి గదిలో ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వసాగాడు.

“నీ బొమ్మని కూడ ఎవరైనా కొంటే కానీ ఆయన నోటికి తాళం పడదు.” వాపోయింది జీవి దగ్గర శ్రీదేవి.

“నా పనైతే నేను చేశానుగా! ఆ సంగతొదిలేయ్. అది సరే కానీ, నువ్వు ఆ మధ్య రాసిన పాటేమైంది?”

“అదా! అమీన్-సయానీ అనే మ్యూజిక్ కంపెనీ తీసుకుందిలే!” నిర్లిప్తంగా అంది శ్రీదేవి.

“మరి అలా మొహం వేలాడేసుకున్నావెందుకు? ఇహ చూడు నీ పాట ఢంకా బజాయించేస్తుంది.”

“కానీ కిందటిసారి సయానీని కలిసినప్పుడు ఏమంత ఉత్సాహంగా లేడు.”

“ఆ సయానీదంతా ఆంజనేయుడి తంతు. తన గొప్ప తనకే తెలిసి చావదు! కొంచెం టైమివ్వు ఆయనకి!”

“కొంచెమేం ఖర్మ, ఎక్కువే తీసుకోమను. పాట నలుగురి నోళ్ళలో నానితే చాలు.”

ఆశ్చర్యకరంగా ఆ పాట హిట్టయింది! ఆ రికార్డు ఎక్కువగా అమ్ముడవడమే కాక, సయానీకి ఆ పాట కోసమే ఎక్కళ్ళేనన్ని ఫోన్ కాల్సూ, అభినందనలూ అందసాగేయి. శ్రీదెవి డబ్బు ఇబ్బందులూ మాయమైపోయాయి. ఈ సంతోషంలో జీవి చిత్రం కూడా ఎవరైనా కొంటే బాగుండని ఎంతో ఆశ పడింది శ్రీదేవి. ఆ చిత్రం అమ్ముడు పోకపోగా, మోహన్ ఉపన్యాసాలూ, విమర్శలూ, సలహాలూ భరించలేని స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు జీవి గదిలో మోహన్ అలికిడి వినిపిస్తే కిందికి జారుకుంటుంది శ్రీదేవి.

ఒకరోజు మధ్యాహ్నం శ్రీదేవి గదిలో పని చూసుకొంటోంది. ఉన్నట్టుండి వరండాలో పబ్లిక్ ఫోన్ మోగిన చప్పుడు. అన్ని అపార్ట్‌మెంట్లకీ అదొక్కటే దిక్కు. అది ఇంకా మోగుతూనే వుంది. పాపం, ఏదైనా ముఖ్యమైన పనేమో.

“హల్లో! జీవి గారున్నారా?” అడిగిందొక బొంగురు గొంతు.

“లేరండీ! బయటికెళ్ళినట్టున్నారు. ఏదైనా మెసేజీ ఇస్తే ఆయనకిస్తాను.”

“అవునాండీ! పాండు ఫోన్ చేశాడని చెప్పండి. రోజూ పోస్ట్‌లో వస్తున్న ఆ కేసెట్లని ఏం చెయ్యమంటారని అడుగుతున్నానని కొంచెం చెప్పండి, ప్లీజ్!”

“కేసెట్లా?”

పాపం పాండు గారికి తన బాధ పంచుకోవటానికి ఎవరైనా పర్వాలేదు లాగుంది. ఆయన గోడు వింటే చాలు! అందుకే ఆగకుండా చెప్పుకుపోయాడు. “అవునండీ కేసెట్లు! పాటలు వింటాం చూడండి, రికార్డెడ్ కేసెట్లు అవి! ఒక్కటే పాటల కేసెట్టు వందల్లో కొన్నాడు. పోయిన నెలలో పోస్టులో పెద్ద పెద్ద పెయింటింగులు వచ్చాయి. నాలుగో ఐదో! ఎంత ఛండాలంగా వున్నాయనుకున్నారు? పగలు చూస్తే రాత్రి పీడకలలొస్తాయి! ఇంటి నిండా దిష్టి బొమ్మల్లా, ఇదేంటయ్యా మగడా అంటే, అవో గదిలో పడెయ్యవోయ్, నువ్వేం వాటి వంక చూడకూ అన్నాడు. సరేలే అని ఊర్కుంటే ఇప్పుడీ కేసెట్లు! అడుగెయ్యడానికి చోటు లేదు ఇంట్లో. నన్ను ప్రశాంతంగా రాసుకోనీకుండా ఏమిటండీ ఇది!”

పాండు కనక శ్రీదేవి మొహంలో మారుతున్న రంగులు చూసి వుంటే వెంటనే మాటలు ఆపేవాడే. కానీ చూడలేడు. కడుపులో వున్నదంతా కక్కేశాడు పాండు ఫోన్లో!

“పాటల కేసెట్టు ఏ కంపెనీది?”

“అదే నండీ, ఏదో తురక పేరు, ఈదీ అమీన్ లాటిది”

“అమీన్ సయానీ?”

“ఆ… అద్దీ! సరిగ్గా చెప్పారు. మరి ఆయనకి చెప్తారు కదా?…”

శ్రీదేవి ఫోన్ పెట్టేసింది.

గంటయింతర్వాత జీవి కూనిరాగం తీస్తూ మెట్లెక్కుతున్నాడు.

“ఒక సారిలా వస్తారా?” శ్రీదేవి గుమ్మంలోనించి పిలిచింది.

“తప్పకుండా! ఏమిటి సంగతి? మీ కాసెట్లు ఇంకా అమ్ముడవుతున్నాయా?”

“ఏమో, ఇంకా తెలియదు చిరంజీవి గారూ!”

ఒక్క క్షణం తడబడ్డాడు జీవి. అంతలోనే తేరుకున్నాడు.

“ఓ, నా పేరు తెలిసిపోయిందన్నమాట.”

“పేరే ఏం ఖర్మ, ఊరూ, ఉద్యోగం, మొత్తం మీ జాతకమే తెలుసుకున్నాను.”

ఏమనాలో తోచలేదు జీవికి.

“మీ పేరు చిరంజీవి. విశాఖపట్నంలోని కోటీశ్వరులలో మీరొకరు.”

“అది నా తప్పు కాదు! అది వంశపారంపర్యమైన జబ్బు. మా నాన్నా, మా తాతా, అంతా కోటీశ్వరులే. కోట్లు సంపాదించడం వాళ్ళ హాబీ!” సీరియస్ గానే అన్నాడు.

“అవును! ఆ కోట్లు ఉపయోగించి మాలాటి అమాయకులని మభ్య పెట్టడం మీ హాబీ కావొచ్చు!”

మళ్ళీ ఏమనాలో తోచలేదు జీవికి. శ్రీదేవే మళ్ళీ అందుకుంది, అతని మొహంలోకి సూటిగా చూస్తూ.

“అవునా కాదా? డబ్బుంది కదా అని మా లాటి తెలివి తక్కువ వాళ్ళకి జాలిగా బిస్కత్తులు పడేస్తూ వుంటారన్నమాట. పాపం, మోహన్, తన బొమ్మలు నిజంగానే ఎవరికో నచ్చి కొనుక్కుంటున్నారనుకొని సంబరపడుతున్నాడు. ఎప్పటికైనా నిజం తెలిస్తే ఆయన అసలు బొమ్మలు గీయగలరా? విసుగొచ్చి మీరు బొమ్మలు కొనడం మానేసినప్పుడు…”

తేలిగ్గా నిట్టూర్చాడు జీవి. “ఓస్! అదీ ఒక సమస్యేనా? ఆయన ఎన్ని బొమ్మలు వేస్తే అన్ని నేనే కొంటాను. ఆయనకసలు నిజం తెలిసే పరిస్థితే రాదు. ఆయన భవిష్యత్తుకేమీ ఢోకా లేదు.”

“ఓహో! అలాగా? మరి నా భవిష్యత్తు కూడా ప్లాన్ చేశారా?” వెటకారంగా అంది శ్రీదేవి.

“నీ భవిష్యత్తా? అదెలాగూ నా చేతిలోనే వుంది. ఎందుకంటే నువ్వు నన్నే పెళ్ళాడతావు గనక.”

శ్రీదేవి నిర్ఘాంతపోయింది.

“నిన్నా? నేనా? పెళ్ళా? నీ గురించి ఇంత తెలిశాకా?”

“నీ అభ్యంతరం ఏంటో నాకు బాగా తెలుసు. పెళ్ళాడితే మన ఇంటి నిండా మోహన్ గీసిన బొమ్మలుంటాయనే కదా? నేనా విషయం ఎప్పుడో ఆలోచించాను. అవన్నీ అటక మీద దాచేద్దాం. నర మానవుడికెవ్వరికీ ఆ బొమ్మలు చూసే అగత్యం పట్టదు!”

శ్రీదేవి గొంతు పెగల్చుకుని ఏదో చెప్పబోయింది. ఆమెని ఆపేడు జీవి.

“ఆగు! నేను నీతో ఎప్పట్నించో నా జీవిత చరిత్ర చెప్పాలని అనుకుంటూన్నను. నాకసలు నా జీవిత చరిత్ర చెప్పడమంటే చచ్చేంత ఇష్టం. వినేవాళ్ళకంత ఇష్టం వుండదు కానీ!”

“నీ బోడి జీవిత చరిత్ర మీద నాకేం ఇంట్రస్టూ లేదు.”

“వినకుండానే ఇంట్రస్టు లేదంటే ఎలా? అసలెన్ని మలుపులూ, హ్యూమన్ ఎలిమెంట్సూ వున్నాయో తెల్సా నా జీవిత చరిత్రలో? నేను పుట్టింతర్వాత ఇరవై యెనిమిదేళ్ళ జీవితం గురించి వదిలేద్దాం. అదుత్త బోరు! కానీ, సరిగ్గా నెలా పది రోజుల కింద ఆఫీసు పని మీద ఈ ఊరొచ్చిన నేను టాక్సీలో వెడుతూ, పక్క సందులో బస్సు దిగి ఇటు నడుస్తూంటే నిన్ను చూశాను.”

“ప్లీజ్! నాకు వినాలని లేదు.”

“ఇక్కణ్ణించే నా జీవితంలోకి యాక్షనూ, రొమాన్సూ, అన్నీ ప్రవేశించాయి. ఆ సంగతి అప్పుడే గ్రహించాను కాబట్టి టాక్సీ దిగి నీతో మాట్లాడదామని ఇటొచ్చాను. నువ్వు ఈ చిన్న అపార్ట్మెంట్ బిల్డింగులోకి వచ్చావు. ఎలాగబ్బా నిన్ను పలకరించడం అనుకుంటూంటే పైన “ఇల్లు అద్దెకివ్వబడును” అని బోర్డు కనబడింది. ఎన్నాళ్ళనించో ఒక ఆరునెలలు సెలవు పెట్టి బొమ్మలు వేయాలన్న కోరికా ఇలా తీర్చుకోవచ్చని, ఆఫీసుకి సెలవు పెట్టి పైభాగంలో అద్దెకి దిగాను!” ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు జీవి.

“ఎలాగైనా నిన్ను పైకి రప్పించాలని అలా బూట్లతో నేలమీద తాళం వేశానన్నమాట! ఎంతైన నా తెలివే తెలివి. అది సరే కానీ, నా గురించి నీకెలా తెలిసింది?”

“మీ స్నేహితుడు పాండు ఫోన్ చేశాడు.”

“వాడా! కథలు రాసుకోవడానికి ప్రశాంతమైన చోటు లేదు బ్రదర్ అంటే నేనే నాతో పాటు ఇల్లు షేర్ చేసుకోమన్నా! అసలు రచయితలు భలే సున్నితంగా…”

“చిరంజీవి గారూ!’

“నన్ను జీవి అనే పిలవొచ్చు! అసలు శివ ప్రసాద్ అనే మారు పేరు పెట్టుకుందామనుకున్నా కానీ…..”

“మీ ఉద్దేశ్యాలు మంచివే అయివుండొచ్చు. అయినా మీరు చేసిన పని హేయమైనది, మమ్మల్నెంతో అవమానిస్తున్నారు…”

జేబులో చేయి పెట్టి దేనికోసమో వెతుకుతున్నాడు జీవి. ఒక చిన్న ఉత్తరం తీశాడు.

“ఈ ఉత్తరం చదువుతాను, కొంచెం వింటావా?”

“మీ ఉత్తరాల మీద నాకేం ఇంట్రస్టూ….”

“చిన్నదేలే! విను మరి. నేను నా ‘పిల్లి-పిల్ల’ బొమ్మ ఇచ్చాను చూడు ఆ ఏజెంటు దగ్గర్నించన్నమాట. ‘జీవీ, నీ పిల్లి-పిల్ల బొమ్మ కొనాలనని ఒక కస్టమరు ఐదువేల రూపాయలు చెల్లించారు. బొమ్మ ఇచ్చేస్తాను. నీకేమైనా అభ్యంతరమా?” ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నాడు జీవి. తలొంచుకుంది శ్రీదేవి.

“అయితే?” బింకంగా అంది.

“ఇప్పుడే ఏజెంటు దగ్గరికెళ్ళొస్తున్నా. ఆ పిల్లిని కొనే కస్టమరు ఎవరా అని కొంచెం ఆరా తీశాను. ఆ యిల్లు నీ దగ్గర సంగీతం నేర్చుకొనే అమ్మాయిదని తేలింది. ఆ అమ్మాయినడిగితే నువ్వే కొనమన్నావని కూడా చెప్పింది.”

శ్రీదేవి దించిన తల యెత్తలేదు. ఆమె దగ్గరకెళ్ళి నిలబడ్డాడు జీవి.

“వెళ్ళిక్కణ్ణించి!” శ్రీదేవి తల యెత్తకుండానే బలహీనంగా అంది.

“వెళ్ళను. నువ్వు ఒప్పుకునేదాకా ఇక్కడే వుంటాను.”

“ముందు వెళ్ళు. ఆలోచించుకుని చెప్తాను.”

చిరంజీవి మెల్లిగా గదిలోంచి బయటికి వెళ్ళి, మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళాడు. గదిలో ఆగకుండా పచార్లు చేస్తున్నట్టున్నాడు, బూట్ల చప్పుడు వినిపిస్తూంది.

శ్రీదేవి లేచింది. బట్టలారేయడానికి తను వాడుకునే పొడుగాటి కర్ర తీసుకుని సీలింగ్ మీద మూడు సార్లు గట్టిగా పొడిచింది!
(The Man Upstairs.)
-----------------------------------------------------------
రచన: శారద 
మూలం: పి. జి. ఓడ్‌హౌస్
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment