Wednesday, December 12, 2018

హెల్లో…శంకరం…


హెల్లో…శంకరం…
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...........

“ఈ టైంలో ఎవరబ్బా …” విసుగ్గానే ఫోనందుకున్నాను.
“హలో ” సాధ్యమైనంత సౌమ్యంగానే.
“ఓ మీరా… ఇంటి దగ్గర్నుంచేనా నేనిప్పుడే చేస్తాను పెట్టేయండి” అన్నాన్నేను.
“ఎవరూ?” అడుగుతోంది సరోజ.
“ఇంటి దగ్గర్నుంచి నాన్నగారు” అన్నాను ఆవులిస్తూ.

ఉదయం నాలుగున్నరౌతోంది టైం. మాంఛి నిద్ర చెడిపోయింది. వాళ్ళే ఫోన్‌ చేసారంటే ఏదో పెద్ద విశేషం వుండి వుండాలి. బాత్‌ రూమ్‌ కెళ్ళొచ్చి, నంబర్‌ డయల్‌ చేసాను.

“లైనులన్నీ బిజీగా వున్నాయి. దయచేసి కాసేపాగి …” వస్తోంది మెసేజి. కట్‌ చేసి రీడయల్‌ నొక్కాను. నాలుగైదు సార్లు ట్రై చేస్తే మొత్తానికి లైను దొరికింది.
రింగ్‌ కాగానే ఫోనెత్తారు.
“హల్లో… నేనే నాన్నా శంకర్‌ ని”
” హలో  ఎలా వున్నార్రా?” అట్నుంచి నాన్న.
“బానే వున్నాం … మీరెలా వున్నారు?”
” మాకేంరా. అంతా క్షేమమే. పోయిన బుధవారం నీ  మేనల్లుడికి మనింట్లోనే ఉయ్యాల పండగ జరిపాం…”
“ఎవరికీ?”
“సుశీల కొడుక్కి. ఇరవై ఒకటో రోజున ఉయ్యాల్లో వేశాం. ఫంక్షన్‌ చాలా బాగా జరిగింది. నూటయాభై మంది పైగా వచ్చారు.”
“అలాగా! మంచిది” అన్నాన్నేను మరేమనాలో తెలీక. ఉయ్యాల పండక్కి నూటయాభై మందిని పిలవాలా?
“ఒక ముఖ్యమైన పని మీద నీ సలహా అడుగుదామని ఫోన్‌ చేసానురా” అన్నారు అసలు విషయం లోకి వస్తూ.
“ఊ చెప్పండి” అన్నాను నేను. ఊహించిందేగా!
“మీ బావ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు తెలుసుగా. ఈ మధ్య మనవూరి మునిసిపాలిటీ ఆఫీసులో క్లర్కు పోస్టొకటి ఖాళీ అయింది. పై డబ్బులు కూడా బాగానే వస్తాయట. నీ సలహా  ఏమిటి?”
“ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా వుండేకంటే బానే వుంటుందనుకుంటా” ఆలోచిస్తూ అన్నాన్నేను.
హమ్మయ్యమొత్తానికి బావ గారికి అక్కడే ఉద్యోగం చూస్తున్నారు కాబట్టి ఇక మీదట “మీ బావ గారి క్కూడా అమెరికా లో ఉద్యోగం చూడరా శంకరం” అనే పోరు తప్పుతుంది. కొంచెం రిలీఫ్‌ ఫీలయ్యాను.
“మేమూ అదే అనుకుంటున్నాం రా. ఏదో ఈ వుద్యోగమైనా వస్తే వాళ్ళూ స్థిమిత పడతారు” అన్నారు నాన్న.
“మరే…”అన్నాను.
“అంతా బాగానే వుంది గానీ, లక్ష న్నర కట్టాలట రా”
“అలాగా. అయితే కట్టమనండి” అన్నాన్నేను. కొంచెం దిగింది నిద్రమత్తు.
“అదేరా. ఆ మొత్తం నువ్వు ఎలాగోలా సర్దితే, చెల్లెలి కాపురం ఓ వడ్డున పడుతుంది. లక్షన్నరంటే నీకెంత భాగ్యం?  ఐనా నువ్వు కాకపోతే …”    చెప్పుకుపోతున్నారు నాన్నగారు. నా ఆలోచనలైతే   “ఆ మొత్తం నువ్వు ఎలాగోలా సర్దితే…” అన్నదగ్గరే ఆగిపోయాయి.నిద్రమత్తు పూర్తిగా ఎగిరిపోయింది.పెనం మీద నుంచి పొయ్యి మీద పడడమంటే ఇదే కాబోలు!
“ఆ ….ఊ …” లతో మొత్తానికి ఫోను పెట్టేశాను.
“ఏమిటట?” అడిగింది సరోజ కళ్ళుతెరవకుండానే.
“ఏం లేదు. వుదయం చెబుతాలే” అన్నాను. పడుకున్నా కానీ నిద్ర పట్టడం లేదు.
“ఇంట్లో అందరిలా నేనూ ఇండియాలోనే వుండక, అమెరికా కెందుకొచ్చానురా బాబూ” అన్పించింది మరోసారి.
మా  బావ అంటే చెల్లెలి మొగుడి వుద్యోగానికి నేనెందుకు లంచం డబ్బులు కట్టాలో అందులోని మహత్తరమైన లాజిక్కేమిటో అది ఎంత వరకు సమంజసమో అర్ధంకావడం లేదు.
నిజానికిప్పుడు బావ గారి ఉద్యోగాని కివ్వాల్సిన లక్షన్నర నాన్నగారి దగ్గర లేకనా? ఉంటాయి. అయినా ఇవ్వరు.పోనీ సుశీల మా అన్న క్కూడా తోబుట్టువేగా? వాడూ బాగానే సంపాదిస్తున్నాడుగా. వాడు సర్దొచ్చు కదా?
ఊహు…అలా కుదరదు.
సుశీల పెళ్ళప్పుడు సరీగ్గా సంవత్సరం క్రితం , బావకు కట్నం క్రింద ముట్టచెప్పిన డబ్బు అంతా ఐపోయుంటుందా?
ఉండదు!
మరి బావగారి నాన్నగారు, బావగారి అన్నగారు ఇంట్లో మనిషికి అవసరానికి ఓ లక్షన్నర సర్దలేరా?
లేరు. సర్దలేరు.
ఎందుకు సర్దాలిట?
వాడి బావ మరిదిని నేనొకడ్ని  అమెరికాలో అఘోరిస్తున్నానుగా. నేనే సర్దాలి. నాకేగా వుత్తినే డాలర్ల కట్టలు వద్దన్నా వచ్చిపడుతోంది!
చెల్లెలి పెళ్ళికి డబ్బు కావాలన్నా
అన్నగారు  ఫ్లాటు కొనుక్కోవాలనుకున్నా
తమ్ముడు బస్సులో కష్టపడి కాలేజీకి వెళ్ళలేక బైకు కావాలనుకున్నా
ఇంటికి చిన్న చిన్న మరమత్తులు చేయించాలన్నా
చివరికి చెల్లెలి మొగుడికి ఉద్యోగం కొనాలన్నా
నేనే ఎందుకు గుర్తొస్తాను మా వాళ్ళకు?
ప్రతి చిన్న అవసరానికిపెద్ద అవసరానికి సర్దాలంటే నేనిక్కడ ఎంతగా సర్దుకుపోవాల్సొస్తుందో వాళ్ళకెలా చెప్పాలి?

నేనూ కుటుంబంలో సభ్యుడిగా, ఒక కొడుకుగా బాధ్యతలు పంచుకోవాలి. నాకున్నంతలో, చేతనైనంతలో వాళ్ళను ఆదుకోవాలి. అంతేగానీ, ఎవరి మట్టుకు వాళ్ళు, వాళ్ళ మూటల్ని గట్టిగా ముడేసుక్కూర్చుని     ప్రతి దానికీ “హల్లో… శంకరం” అంటే ఎలా? నేనమెరికా వచ్చి రెండేళ్ళయ్యిందనే గానీ, పట్టుమని పదివేలు కూడా లేదాయె బ్యాంకు బాలెన్సు.

మొన్నటికి మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అతిజాగ్రత్తగా ఓ ఏడాది పాటు కూడబెట్టిన సేవింగ్స్‌ కూ రెక్కలొచ్చేశాయి.నాలుగు వారాలు శలవు మీద ఇండియా వస్తున్నామని చెప్పగానే ఆల్రెడీ తయారు చేసుకున్న లిస్టులు చదివేశారు ఫోన్లో.
“బంగారం చౌకట కదా అక్కడ ? ఓ నాల్గు…” అని ఒకరు బిస్కెట్లో కేజీలో మరి!
“అక్కడ వీసీఆర్‌ లూ, వీడియో కేమెరాలు మహాచీపట కదా. పైగా ఒరిజినల్‌ వి దొరుకుతాయిగా! నాలుగో ఐదో తేగూడదూ! ”
“మాంఛి ఎలక్ట్రిక్‌ కార్డ్‌ లెస్‌ రేజర్లు పేనసోనిక్‌ వి” అని మరొకరు.
“కార్డ్‌ లెస్‌ ఫోను లెలాగూ తెస్తావుగా. వాటితో పాటు ఎడాప్టర్లు మర్చిపోకు రోయ్‌ ” అంటూ ఇంకొకరు.
“రేబాన్‌ కళ్ళద్దాలు వద్దు… అవిక్కడ అందరూ పెట్టేస్తున్నారు. అవేవో అర్మానీ అద్దాలట. అవి పట్రా అందరికీ”
ఇంకా చిన్నా చితకా కలసి చాలా పెద్దలిస్టే తయారయ్యింది.ఇక్కడ మా ఇంట్లోక్కావలసిన వస్తువులు కొనడానికేరెండు మూడు నెలలాలోచించి, బడ్జెట్లువేసుకుని లేబర్‌ డే సేల్‌ కోసమో, థాంక్స్‌ గివింగ్‌ సేల్‌ కోసమో మరో రెండు మూడు నెలలు వెయిట్‌ చేసితీరా కొన బోయే టైం కు మరేదో అవసరమొచ్చిసర్లే మరలా డబ్బున్నప్పుడే కొనుక్కుందామని ఎన్ని సార్లు ఆగలేదు?! సరూ ఆ  విషయమ్మీద ఎన్ని సార్లు నాపై యుద్దం ప్రకటించ లేదు!

నేనూ, సరోజా ఫోనుల్లో వచ్చిన లిస్టు ముందెట్టుక్కూర్చుని ఎంతౌతుందో లెక్కగట్టి అసలు ట్రిప్పే కాన్సిల్‌ చేసుకుంటే బాగుంటుందనుకున్నాం. ఒకరు కోరింది తీసుకుని, మరొకరు అడిగింది తీసుకెళ్ళక పోతే ఇంకేమైనా వుందా? ఉతికి ఆరేయరూ! ఏవైనా అక్కడ దొరకనివి, అత్యవసరమైనవిఇక్కడ బాగాచౌకగాదొరికేవి తెమ్మన్నా ఓ అర్ధముంటుంది.చివరకి మాకు వీలైనంతలో తలా ఓ గిఫ్ట్‌ తీసుకెళ్ళాం. “పోనీ ఏదో అంతదూరం నుంచి వస్తూ మనల్ని గుర్తెట్టుకుని సంతోషంగా తెచ్చారుగా” అని ఇచ్చినవాటినైనా ఆనందంగా తీసుకున్నారాఅంటే అదీలేదు.ఒక్కరంటే ఒక్కరి మొహం లోకూడా తృప్తి కన్పించలేదు.
అది చూసేక ఈసారి ఇండియా వెళ్ళే ముందుగా, మేమొస్తున్నట్టు ఎవరికీ చెప్పకుండా హటాత్తుగా వెళ్ళి సర్ప్రైస్‌ ఇద్దామని పించింది(లిస్టులు తప్పించుకోడానికన్న మాట!).కొంతలో కొంత నయమేమిటంటే సరూ వాళ్ళ ఇంటి దగ్గర నుండి లిస్టులూ గట్రా భారీగా రాక పోవడం. బహుశా సరూ కూడా ఉద్యోగం చేస్తుంటే వాళ్ళూ లిస్టులు చదివేవారేమో?! నాదగ్గర మొహమాట పడివుంటారు.

మేమిక్కడకు వచ్చాక వెంటనే ఉద్యోగం దొరక్క ఎన్ని పాట్లు పడ్డామోదొరికాక కూడా ఇక్కడ టాక్సులూ, ఇళ్ళ అద్దెలూ, ఇన్సూరెన్సులూ కట్టేక మిగిలిన జీతంతో ఎంత జాగ్రత్తగా రోజులు వెళ్ళదీస్తున్నామో వారికెలా తెలుస్తుంది? తెలియదు కదా అని చెప్పబోతే వినేదెవరు? విన్నా నమ్మేదెవరు?
“వెళ్ళిన నాల్గునెలల్లోనే కారు కొన్నావు కదరా నీకేం దొబ్బుడాయి? వేషాలు కాకపోతే” అనుకుంటారే గానీ ఆ కారు కొన్నది అప్పు తీసుకుని అనీ, ఆ అప్పు వాయిదాల పద్ధతిలో ప్రతి నెలా తీర్చాలనీ చెబితే ఓ పట్టాన నమ్మరు.పైగా ఈ మధ్య ఇంకోటి మొదలెట్టారు.
“ఆ ప్రకాష్‌ గాడిని చూడు. వాడమెరికా వచ్చి ఆర్నెల్లయ్యిందో లేదో ఇప్పటికే పాతిక లక్షలు పంపాడట ఇంటికి ( ” డబ్బే” అని అడగాలనిపించింది! )
“వాళ్ళ నాన్న ఇంటి మీద ఇల్లు కట్టించాలని ప్లానులు గీయిస్తున్నాడు. సికింద్రాబాదు లో ఫ్లాటులు, హైదరాబాదు లో ద్రాక్ష తోటలు కూడా కొనాలని చూస్తున్నారు” అని క్రొత్త పాట!
ఏమో … పంపాడేమో!
వాడైతే అఖండుడు. అనన్య సామాన్యుడు. అహోరాత్రాలూ కష్టపడి, చెమటోడ్చి సంపాదించి కూడ బెట్టి పంపుతున్నాడేమో?!
నేనంత గొప్పవాణ్ణి కాదు. నాకంత ఓపికా, మేధస్సు, నైపుణ్యమూ లేదంటే వినిపించుకోరు.
“అరే శంకరం మీ కక్కడెలా వుంది? నీ ఉద్యోగమెలా వుంటోంది. మీ కొచ్చే డబ్బులు సరిపోతున్నాయా? అక్కడి వాతావరణమూ అదీ మీకు సరిపడుతోందా?” అని ఒక్కరంటే ఒక్కరు కూడా అడిగిన పాపాన పోలేదు. పైపెచ్చు “అమ్మాయి ఉద్యోగం చేస్తోందా?” అంటూ సరోజ గురించి ఆరాలు తీయడం.
“లేదు. ఇంటి దగ్గరే వుంటుంద”ంటే ఓ పట్టాన నమ్మినట్లు కనబడరు. ఎందుకబ్బా అలా అపనమ్మకంగా చూస్తున్నారని ఎంతగా ఆలోచించినా నా బుర్రలో లైటు వెలగలేదు.
ఏదో పెద్ద లాజిక్కే వుండి వుంటుంది.
పక్క మీద సరోజ కొంచెం కదిలింది.
“నిద్ర పోవడం లేదా?” అడిగింది నన్ను.
“లేదు. ఆలోచిస్తున్నాను.”
“దేని గురించి? ఇంతకీ మామయ్య గారు ఫోనెందుకు చేసారు?”
“వారు ప్రతీసారీ ఫోనెందుకు చేస్తారో ఇప్పుడూ అందుకే చేసారు.”
“డబ్బవసరమా?”
“ఆ…”
“మరింకేం. వెంటనే వ్రాయండి చెక్కు రేపు పోస్టు చేద్దురు” అంది నవ్వుతూ.
నేను కామ్‌ గా వుండడం చూసి ,” దానికి అంతలా ఆలోచిస్తారెందుకు? వీలైతే పంపండి. లేకుంటే కుదరదని చెప్పండి”.
“నేనాలోచిస్తోంది డబ్బు పంపడమా వద్దా అని కాదు!”
“మరి?”
“నన్నో ఏడాది నుండి ఓ  అనుమానం పీడిస్తోంది నిజంగా మా వాళ్ళకు నా మీద ప్రేమా, అభిమానం వున్నాయా? అని”
“అబ్బో పెద్ద అనుమానమే! ఎందుకొచ్చిందో?”
“ఎప్పుడు చూసినా దానికి డబ్బులు కావాలి పంపు దీనికి డబ్బు పంపు అనడమే గానీ ఏనాడైనా  మిమ్మల్ని చూడాలని పిస్తోంది ఓ ఫొటో పంపండనో లేక  నీ గొంతు వినాలనిపించి  ఫోను చేసామురా.
ఏదైనా మాట్లాడు అనో అన్నారా? మా చెల్లెలు పెళ్ళి టైంకు మనకి శలవు దొరక్క ఓ నెల పోస్ట్‌ పోన్‌ చేస్తే వస్తామంటే అంత  డబ్బు ఖర్చు పెట్టుకుని ఏమొస్తారు గానీ కట్నానికి,పెళ్ళి ఖర్చులకు మాత్రం
వెంటనే డబ్బు పంపరోయ్‌ అన్నారే కానీ , మీరు రాకుండా ఎలా? మీకు కుదిరినప్పుడే ముహూర్తాలు పెడతామ”ని మాట వరసకైన అన్నారా? ఈ రోజు చెల్లెలు మొగుడు ఉద్యోగానికి  డబ్బు పంపమని ఫోను చేసారే కానీ , నాకు మేనల్లుడు పుట్టినప్పుడు చెయ్యలేదేం? ఇవన్నీ ఆలోచిస్తూంటే నా కనుమానమొచ్చింది సరూ…” అన్నాన్నేను.
“ఫోన్లు చేసి అనవసరంగా డబ్బు వేస్టు చేయడమెందుకనేమో?” అంది సరు.
“ఉయ్యాల పండక్కి నూట యాభై మందిని పిలిచి,చిన్న సైజు పెళ్ళిలా ఖర్చు పెట్టడం వేస్టు కాదా?!”
“ఏమో బాబూ ఇక నిద్రపోండి. మరలా వర్కు కెళ్ళాలిగా?”
“చెప్పు సరూ! నీ కే మనిపిస్తుందో  చెప్పవూ?” అడిగాన్నేను మళ్ళీ.
“నేన్నిజం చెబితే అది మీ ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా వుందా? నన్నింకా నాలుగాడిపోసుకుంటారు. ఆలోచించిన వరకూ చాల్లేగానీ ఇక నిద్ర పోండి బుచ్చబ్బాయి గారూ” అంటూ
నన్ను కావలించుకుంది.
సమాధానం తెల్సినా మరొకరి నోట వినాలని నా తాపత్రయం .
బలవంతాన కళ్ళు మూసుకున్నాను నిద్ర పోవాలని ప్రయత్నిస్తూ!
----------------------------------------------------------
రచన: కె. వి. గిరిధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment