క్లబ్బులో చెట్టు కథ
సాహితీమిత్రులారా!
ఈ కథను ఆస్వాదించండి.......
క్లబ్బులో చెట్టు కొట్టేశారని రెడ్డి మేష్టారు రాజు గారింట్లో చెప్పంగానే, నా కుడిచెయ్యి కొట్టేసినట్టనిపించింది. కుడి చేతిలో స్కాచ్ గ్లాసు జారిపోతుందేమోనని భయపడి, గట్టిగా ఎడమచేత్తో వత్తి పట్టుకున్నా బాలాజీ గుడిలో పూజారి మంత్రపుష్పం చెప్పేప్పుడు పెట్టే నమస్కారంలాగా!
..
మా తాత అంటూవుండేవాడు. “చెట్టు కొట్టేసినవాడి చెయ్యి కొట్టమన్నాడోయ్ నైజాము నవాబు! అదీ రాచరికం, పరిపాలన అంటే.” తాతయ్యది ఖమ్మం జిల్లాలో బేతుపల్లి గంగారం. రజాకార్లు ఆయన గుర్రానికి చెవులూ తోకా కోసి పారేసిన తరువాత కూడా నైజాము నవాబుని ఎంతమంది ఎప్పుడు ఎంత తిట్టినా అసహ్యించుకున్నా(ఆ విషయంలో మా నాన్నది అగ్ర తాంబూలమే!), చెట్లు నరికేయడం అన్న కసాయి ప్రసక్తి వస్తే, నవాబుని తెగ పొగిడే వాడు! నవాబు గారన్నది నిజమే అయితే, ఆ వొక్క విషయంలో అతగాడిని పొగడక తప్పదు!
..
“ఎందుచేత చెట్టు కొట్టేశారు? పుచ్చిపోయిందా, పురుగు పడ్డదా?” అని అడగంగానే, రాజుగారు “అబ్బో! అది చాల పెద్ద కథ, రెడ్డి గారినే చెప్పనీయండి,” అంటూ, రాజ దర్పం చూపించారు.
..
నా బుర్ర గింగుర్లు తిరిగి, నన్ను నాలుగున్నర దశాబ్దాలు వెనక్కి పంపించింది. ఆ నాటి అనుభవాలు ఎన్నో ఒక్కటొక్కటే గుర్తుకు రావడం మొదలయ్యాయి.
క్లబ్బులో చెట్టు, మాకు తెలిసేటప్పటికే కనీసం నలభై అడుగుల ఎ్తౖతెన పెద్ద మాను. క్లబ్బు రెండో అంతస్థు పైన ఇంకో పది అడుగుల ఎత్తుండి పైన పెద్ద స్టేకు పేకాట వాళ్ళకి చల్లగా గాలి విసిరేది. అప్పుడప్పుడు, చీకట్లో దారి తప్పిన పిట్టల కిలకిలలు వినిపించేవి.
క్లబ్బులో చెట్టు నిద్రగన్నేరు చెట్టు. బ్రహ్మ సృష్ఠి పొట్టి గన్నేరని, నిద్రగన్నేరు విశ్వామిత్ర సృష్ఠి అనీ అనే వాడు మామేనత్తగారి భర్త. ఆయన ప్రవరలో విశ్వామిత్రుడు ఒక ఋషిగాబట్టి అల్లా గొప్ప చెప్పుకున్నాడు కానీ, నన్నడిగితే, నిద్రగన్నేరే బ్రహ్మ సృష్టి అని ఢంకా బజాయించి చెప్పగలను. అంత గొప్ప చెట్టు విశ్వామిత్రుడు సృష్టించలేడు. చూడరాదూ! వేపచెట్టుకీ, కరివేపచెట్టుకీ భేదం! కరివేపచెట్టు విశ్వామిత్ర సృష్ఠేకదా మరి! హుందాతనంలో కరివేపచెట్టుని వేపచెట్టుతో పోల్చగలరా!
క్లబ్బులో చెట్టు కొట్టేసేటప్పటిికి, ఆ చెట్టుకి కనీసం డెబ్భై ఐదు ఏళ్ళైనా వుండి వుండాలి. అది క్లబ్బుకన్నా ముందే పుట్టింది. మరి ఏ “సుందరి విత్తనం చేతనుంచి పలక్కండా వెళ్ళిపోయిందో,” తెలియదు. ఇప్పుడు, “ఆమెను వెతుక్కుంటూ, యోజనాలు నడిచి పోవడం,” శుద్ధ అనవసరం! ఆ క్లబ్బు స్థలంలో ఆగ్నేయంగా ఉన్న నిద్రగన్నేరు చెట్టుని ఆ పళంగా అల్లాగే వుంచి, క్లబ్బు కట్టారుట! ఆ కట్టించిన పంతులుగారికి నైజాము నవాబు గురించి తెలియడానికి ఆస్కారం లేదు. కానీ, చెట్లంటే ఎడతెగని అభిమానం, ఆప్యాయత వుండి వుండాలి.
ఎండల్లో ఎర్రగా కుంకుమ రంగు పూలతో విరబూసి, సాయంకాలం అయ్యేటప్పటికి, కాసిని పూల గుత్తులు మాను చుట్టూరా, నేలమీద, హుందాగా తంగెళ్ళమూడి ఉన్ని తివాచీ మీద డిజైనులా విచ్చలవిడిగా పరిచేది “ధరను చొచ్చి, దివిని విచ్చి, విరులు తాల్చు తరువు,” అన్న కవిగారి హృదయంలా! ఆ పూలగుత్తుల్లో పుప్పొడి కొక్కెంలా చిన్న కాడకి పట్టుకొని పచ్చగా బంగారంలా వుండేది. మా చిన్నప్పుడు, ఆ కొక్కెంలావున్న కాడలతో కోడిపందేలాట ఆడుకునే వాళ్ళం.
సాయంకాలం ఐదు కొట్టగానే, ఆ నిద్రగన్నేరు చెట్టు నీడలో, క్లబ్బులో పనిచేసే కుర్రాళ్ళు, ఆనవాయితీగా పది పేము కుర్చీలు వేసే వాళ్ళు ఓ చిన్న కాఫీ బల్ల చుట్టూరా. కాఫీ బల్ల మీద ఇంగిలీషు దినపత్రికలు, తెలుగు వార పత్రికలూ, ముఖ్యంగా నెలవారీ వచ్చే భారతి, పడేసే వాళ్ళు. ఆరు గంటలు కొట్టంగానే ఖద్దరు పంచె బిళ్ళగోచీతో పెద్ద రాజు గారు, గ్లాస్గో పంచె వారగోచీతో పెద్ద ప్లీడరు గారు, కాలేజీ లెక్కల మేష్టారు, జరీపంచె,జరీకండువా లాయరు గారు, వైసు ప్రిన్సిపాలు గారు, ఎకనామిక్స్ మేష్టారు, అప్పుడప్పుడు టకప్పు చేసుకోని మా డాక్టరు గారు వచ్చేవాళ్ళు. బోలెడు విశేషాలు, లోకాభిరామాయణం చెప్పేవాళ్ళు. రాజకీయాల వాదోపవాదాలు జరగడం కూడా కద్దు. జరీపంచ లాయరు గారు ఏదో అనవసర ప్రసంగం చేసేవారు. అంతే! మా లెక్కల మేష్టారు వాదనలోకి దిగి,నిష్కర్షగా ఒకటి, రెండు, మూడు, ఖతం అన్నట్టు ఆఖరి మాట చెప్పేసే వాడు. QED . అందరూ మాట్లాడకండా వెర్రి మొహాలేసుకొని వినాల్సిందే. అడపా తడపా, పైసా స్టేకు పేకాటలో ఆట పారేసిన (రమ్మీ లో డ్రాపు అంటారు) మధ్యకారు ప్లీడర్లు మధ్యలో వచ్చి, ఏదో తెలిసినట్టు విసుర్లు వేసి పోయేవాళ్ళు. వెంటనే మాచెవిటి మేష్టారు, కెమెస్త్రీ మేష్టారూ, మెత్త మెత్తగా వాళ్ళకి చివాట్లు పెట్టే వాళ్ళు. పెద్ద రాజు గారు, పెద్ద ప్లీడరు గారు వెళ్ళే వరకూ మేము నోరెత్తకుండా వింటూ కూచునే వాళ్ళం. వాళ్ళు సరిగ్గా ఎనిమిది కొట్టంగానే పంచెల కుచ్చిళ్ళు సర్దుకొని ఇళ్ళకి పోయేవాళ్ళు. అదేదో, గంట కొట్టగానే పాలకోసం పరిగెత్తే పిల్లుల్లా వాళ్ళు వెళ్ళంగానే, మా వాగుడు మొదలెట్టే వాళ్ళం, సిగరెట్లు వెలిగించి. ఎందుకనో తెలీదు వాళ్ళ ముందు సిగరెట్లు కాల్చే వాళ్ళం కాదు.
ఈ నిద్రగన్నేరు చెట్టు ఎందరో “జనాల మనోగగనంలో చాపుకున్న జ్ఞాపకాల కొమ్మలనీ, గాఢానురాగాల ఊడల్నీ,” వెనక్కి పిలిచి పిలిచి చెపుతున్నట్టుంటుంది.
కవిగారూ! క్షంతవ్యుడిని!!
మా డాక్టరు గారు మమ్మల్ని రమ్మీనుంచి విముక్తులని చేసి, బ్రిడ్జ్ ఆటలోకి దింపింది ఈ చెట్టుకిందే! ఆయన్ని ఎవడో హత్య చేసి చాలాకాలం అయ్యింది. కానీ, ఆయన అన్న మాటలు చెవుల్లో ఇంకా రింగు రింగుమని గంటల్లా వెంటాడుతూనే ఉన్నాయి. రమ్మీ ఆడటం ఎందుకు మానేశారండీ అని అడిగితే, ఆయన ఇచ్చిన సమాధానం. “ఏ ఆట అయితేనే! చేతిలో పదమూడు ముక్కలేగా కావలిసింది. బ్రిడ్జ్ లో ఆట పోతుంది కానీ డబ్బులు పోవు; రమ్మీలో ఆటా పోతుంది, దానితో డబ్బులూ పోతాయి. అందుకని బ్రిడ్జ్ లో పడ్డా.” అప్పటినుంచీ మేమూ బ్రిడ్జ్ ఆటలో పడ్డాం, ఆయనతో పాటూ.
క్లబ్బులో ఎలెక్ట్రీ లైట్లు తెగ పోయేవి. ఈ ఎలక్ట్రీ బాధ అప్పుడే వుండేది. దానికి తోడు, ఎలక్ట్రీ డిపార్ట్ మెంటు ఇంజనీర్లు క్లబ్బులో ఎడతెరపి లేకండా పెద్ద ఎత్తునే పేకాడుకునే వాళ్ళు. వాళ్ళకి తోడు సెంట్రల్ ఎక్సైజు ఇనస్పెక్టర్లూ! లైట్లు పోయినప్పుడు, రమ్మీ జనం గొల్లున గోల చేసే వాళ్ళు క్లబ్బు కుర్రాళ్ళని పెట్రమాక్స్ లైట్లు వెలిగించమని. కొందరైతే, పనిచేసే కుర్రాళ్ళని అడ్డమైన తిట్లూ తిట్టే వాళ్ళు. ఎలెక్ట్రీ డిపార్ట్ మెంటు ఇంజనీర్లని నానా మాటలూ అనే వాళ్ళు. వీళ్ళకి,పారేసిన పేక ముక్కలు చీకట్లో దొంగతనంగా ఎవడన్నా ఎత్తుకుంటాడేమోనని భయం.
అయితే, చెట్టు కింద బ్రిడ్జ్ జనానికి ఆబాధలేదు. పైగా, బ్రిడ్జ్ ఆట లో సుఖం (కష్టం?) ఏమిటంటే, చేతిలో ముక్కలు, పారేసిన ముక్కలూ అందరికీ గుర్తుండాలి; అలా గుర్తుండేవి! లైట్లు పోయినప్పుడు, ఆ నిద్రగన్నేరు చెట్టు పూలగుత్తులు,”పచ్చటి చీకట్లో మంటేదో ఎర్రగా కదిలి,” నట్లుండేది. లైట్లు తిరిగి రాగానే,”వంద వాయిద్యాలతో వికసించిన బ్యాండు మేళంలా, అకస్మాత్తుగా చివిరించినట్టు,” గల గల పూలగుత్తులు కురిపించిందా అన్నట్టు ఉండేది. చెట్లని అనుభవించడం చేతకాని వాళ్ళకి ఆ అనుభవంలో ఆనందం తెలియదు.
……
రెడ్డి గారు చెప్పుకో పోతున్నారు. నేను వినటల్లేదని, ఎక్కడో గగనవీధిలో ఎగిరి పోతున్నాననీ పసి గట్టి, ” అయ్యా! కాస్త ఓపిగ్గా వినండి. అడిగారుగదా!” అని హెచ్చరించారు. నేను వెంటనే excuse me అని, మరో రెండు జిగ్గర్ల స్కాచ్ ఐసు మీద పోసుకున్నా.
“ఆనందం క్లబ్బు ప్రెసిడెంటు అవడం మీకు తెలుసుగా! అప్పుడు క్లబ్బు వైభవం అంతా ఇంతా కాదు. స్కూటర్లకి షెడ్డు కట్టించారు. పక్కనే మునిసిపాలిటీ వాళ్ళ స్థలం ఆక్రమించి రెండస్తుల మేడ వేశారు. అంతా పేకాట మహిమేననుకోండి. క్లబ్బుకి లక్షల మీద లక్షలు ఆదాయం. ఒక ఐదారేళ్ళు ఏ ప్రెసిడెంటూ గుక్కతిప్పుకోలేక పోయాడు. ఆనందం తర్వాత, ఐదుగురు పెద్దమనుషులు ప్రెసిడెంట్లయ్యారు. ఇఖ ముసలం ఎప్పుడు మొదలయ్యిందీ అని అడగండి?” అంటూ ఆయన మరో విడత స్కాచీ సోడా కలుపుకున్నాడు.
“చెప్పండి! ముసలం మొదలవడమేవిటి?”
“అప్పలరాజు నాయుడు సెక్రటరీ అయ్యాడు. స్కూటర్లు, మోటారు సైకిళ్ళూ క్లబ్బులోకి సరాసరి రావడానికి, చెట్టు మొదలు మినహాయించి మొత్తం మట్టి కనిపించకండా అంతా గచ్చు చేయించాడు. అదెందుకయ్యా అని అడిగితే, చెట్టు కింద మట్టి, వర్షాలొస్తే బురద బురదగా తయారయి, మనుషులూ మోటారు బండ్లూ జారి పడే ప్రమాదం ఉందని గచ్చు చేయించాడుట! విన్నారా వింత! ఇన్నేళ్ళుగా ఎవ్వడూ కాలు జారి చెట్టుకింద మట్టిలో పడలేదు.”
..
నాకు వానొచ్చినప్పుడు చెట్టుకింద కూర్చున్న రోజులు గుర్తుకొచ్చాయి. వాన చినుకులు పడినంతసేపూ, చెట్టుకింద ఒక్క చుక్క కూడా రాలేది కాదు. అలా “హఠాత్తుగా ఒక మేఘం యుద్ధం ప్రకటించినపుడు,” మేము “నెత్తిమీద రుమాళ్ళు వేసికోని పరిగెత్తి తల దాచుకునే,” వాళ్ళం కాదు. వాన తగ్గి, గాలి వీచినప్పుడు మాత్రం, చెప్పకండా, చెయ్యకండా, క్లబ్బులో నిద్రగన్నేరు చెట్టు “తన ప్రైవేటు వానతో తడిపేసేది, మమ్మల్ని.”
..
“ఏమండోయ్ మిమ్మల్నే. వింటున్నారా,” అని ఆయన కసిరే వరకూ ఈ స్పృహ లోకి రాలేదు. రెడ్డి గారు చెప్పుకో పోతున్నారు.
“అసలు వీళ్ళ రోగం ఏమిటంటే,క్లబ్బుకి బాగా డబ్బులొస్తున్నాయిగా! ఎన్నికయిన ప్రతి వాడూ ఏదో పేరుపెట్టుకొని పని చేయించాలి, వాడి హయాంలో! మీకు తెలీదు గానీ, గచ్చు చేయించిన తర్వాత, చెట్టు కింద కూర్చోడం మహ కష్టంగా ఉండేది. ఎండల్లో చచ్చే వేడి. నిద్రగన్నేరు పూలు కూడా పడటం తగ్గింది; చుట్టూ గచ్చు చెయ్యడం మూలంగానో ఏమో మరి!
ఒక రోజున అప్పలరాజు నాయుడు తిన్నగా క్లబ్బులోపలికి స్కూటర్ మీదొచ్చి, చెట్టు పక్కనే దభేలుమని పడ్డాడు. ఎడమ కాలు విరిగింది. పుర్రచెయ్యి అదే! వాడు పేక ముక్కలు పట్టుకునే చెయ్యి ముంజేతి కణుపు దగ్గిర బెణికింది. అప్పటి పెద్ద ఘటాల్లో చాలామంది పోయారు. బాగా వయసు మీరిన వాళ్ళు క్లబ్బుకి రావడం మానేశారు. ఇప్పుడు, చెట్టు కింద కూచునే జనం, ఎవ్వరూ లేరు, నేను, ఈ రాజుగారూ తప్ప. అడపా తడప, గాడిదాట సుబ్బయ్య గారున్నూ! ముత్యంగా మూడు కుర్చీలుకూడా వేసేవాళ్ళు కాదు. సెక్రటరీ అప్పలరాజు నాయుడు పడ్డప్పుడు మేము లేము. క్లబ్బు కుర్రాళ్ళు చెప్పగా వినడమే!
అప్పలరాజు నాయుడు చెట్టుపక్కన పడంగానే, మా రెడ్డిశాస్తుర్లు ఊరుకోకుండా, “నే చెప్పలా! ఆగ్నేయంగా చెట్టు అనర్థం అని. ఇవాళ అప్పలరాజు నాయుడు పడ్డాడు. రేపు, ప్రెసిడెంటు కోదండం గారికే ముప్పు రావచ్చు,” అని, ఆరు డ్రాపుల తరువాత, రెండు సీసాల బ్రాందీ పట్టించి, తన మిడి మిడి వాస్తు జ్ఞానం మళ్ళీ ప్రదర్శించాడు.
ఈ వాగుడు ఎవడో కోదండం గారికి చెప్పాడు. ఆయన ఇద్దరు సాయి బాబాల భక్తుడు. చాలా పెద్ద స్టేకు పెట్టి పేకాట ఆడతాడు. ఆయన వెంటనే, తణుకునించి ఆంజనేయులు శాస్త్రి గార్ని వెంటనే రమ్మని క్లబ్బునుంచే ఫోను చేశాట్ట! ఆంజనేయులు శాస్త్రి మరుసటి రోజునే గురవయ్య చౌదరి గారిని వెంటపెట్టు కోని క్లబ్బు కొచ్చేశాడు.”
“వీళ్ళెవళ్ళు? క్లబ్బుతో వీళ్ళకేమిసంబంధం?” అని అడిగా. రెడ్డి గారు మరో పెగ్గు స్కాచ్ లో సోడా కలిపి, మొదలెట్టారు. ” మీకు తెలియదు. ఈ జిల్లాలో వాళ్ళిద్దరూ వాస్తు బ్రహ్మలు. అప్పలరాజు నాయుడు చెట్టు చుట్టూ గచ్చు చేయించేటప్పుడు, వాళ్ళని సంప్రదించ లేదని, గురవయ్య చౌదరి గారు మండి పడ్డాడట.
ఇంతకన్నా ముందు ఇంకొకటి చెప్పాలి. అసలు, కోదండం వైసు ప్రెసిడెంటుగా నెగ్గాడు. అప్పల రాజు నాయుడు బావ జోగయ్య నాయుడు ప్రెసిడెంటు అయిన మూడో రోజునో, నాలుగో రోజునో, ఆయనకి హఠాత్తుగా క్లబ్బులో గుండె నెప్పి వచ్చింది. జోగయ్య నాయుడిని చిన్న కార్లో హుటాహుటిన హైదరాబాదు తీసుకోపోయారు. ఆయన ఇంకా కోలుకోలేదు; మంచం మీదే వున్నాడు. ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించారు. ఆయనకి, గురవయ్య చౌదరి చెప్పాడుట. గచ్చు చేసినప్పుడు, దక్షిణం వేపు ఉత్తరం వేపుకన్నా ఎత్తు ఎక్కువయ్యిందిట. అది క్లబ్బు పెద్ద ఎవడైౖతే వాడికి హానిట. మరి, క్లబ్బు పెద్ద అంటే, ప్రెసిడెంటేగదా! అందుకే, కోదండం గారికి హృద్రోగం వచ్చిందిట. అది విని, కోదండం అప్పలరాజు నాయుడి మీద కత్తులు నూరుతున్నాడట. లేచే ఓపిక లేదుగానీ, అప్పలరాజు నాయుడిని నరికిపారెయ్యాలి, అంటున్నాడుట!
ఏది ఏమయితేనే! వాస్తు బ్రహ్మలు, ఆంజనేయ శాస్త్రి, గురవయ్య చౌదరీ, ఇద్దరూ వచ్చారు. విరుగుడు మంత్రం చెప్పారు, నిద్రగన్నేరు చెట్టు కొట్టెయ్యమని. ఈ చెట్టు ఇక్కడ వుంటే, క్లబ్బుకి ఇంకా బోలెడు అనర్థాలు వస్తాయి అని నొక్కి చెప్పి, క్లబ్బు డబ్బు పది వేల రూపాయలు భరణం తీసుకోని మర్నాడే తణుకు వెళ్ళిపోయారు.
మరుసటి ఆదివారం పొద్దున్నే, నిద్రగన్నేరు చెట్టు అప్పలరాజు నాయుడు దగ్గిర ఉండి మరీ నరికించాడు. ఇదీ, నిరిటి వరకూ జరిగిన భాగవతం; క్లబ్బులో నిద్రగన్నేరు చెట్టు కథ.”
“మరయితే, ఇప్పుడు క్లబ్బు బాగా నడుస్తున్నదా?” అని అడిగా. రెడ్డిగారు, మందహాసం చేసి, “మళ్ళీ వచ్చే ఏడు మీరు ఏలూరు రాకముందే, క్లబ్బు దివాలా తీస్తుంది. పేకాట పూర్తిగా పడిపోయింది. దొంగ తాగుడు బాగా పెరిగింది. ప్రస్తుతం ఇప్పుడు, క్లబ్బుకి, ఎలక్ట్రీ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవు. పేకాట ఉంటేకదా, డబ్బులొచ్చేది! పీడా వదిలి పోతుంది లెండి, తథాస్తు” అంటూ రెడ్డి మేష్టారు కథ ముగించారు.
..
“క్షుద్ర గృహాలకి (గ్రహాలకి!) అతీతంగా ఎదిగిన,” డెబ్భై ఐదేళ్ళ నిద్రగన్నేరు చెట్టు కొట్టేసారు. ఇప్పుడు “చిగిర్చే చెట్టు” లేదు. చీకట్లో దారి తప్పి”ఎగిరే పిట్టలు” లేవు.
“చిలకలు వాలిన చెట్టు లోతైన కావ్యం లాంటిది,” ట! అది ఎందరికి తెలుసు?
-----------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment