Monday, December 3, 2018

సమవుజ్జీ


సమవుజ్జీ





సాహితీమిత్రులారా!

“ఈ మద్దెల మా బావగాడికి గోరోజనం బాగా పెరిగిపోయిందండే. ఎక్కడా భూమ్మీద నిలబట్టన్నేదు. మొన్న బుర్లంక పెల్లికొల్నప్పుడు చూడాలండే ఆడి బడాయి. ఆడు పెసింటుగోరి మంత్రంటండే. పెసింటుగోరి మంత్రంటే… పెదానమంత్రి, నేనూ ఇంద్రాగాంధీ ఒకటే అన్నాడండి. నిక్కల్లేసుకు తిరిగే ఎదవ. ఆడే పేద్ద పెసింటైనట్టు పెల్లింట్లో పంచెగదీసి మా చెడ్డ తిరిగేసాడండి. తల తెగ్గొట్టేసినట్టయిపోందనుకోండి. పాపం ఆళ్ల అన్నగారి సోకు చూసి మాయావిడ కూడా మనేద ఎట్టేసుకుందండే. ఇంట్లో దాని బాధ చూల్లేపోతనాను. ఈ సారెలాగైనా మీరు పెసింట్ అయిపోవాలండే. అప్పుడు నేను కూడా పెదానమంత్రయిపోతాను!” మున్సబుగారికి గడ్డం గీస్తూ గీస్తూ కత్తిని గొంతు మీదకి తెచ్చిన అంతర్వేది ఘీంకరించాడు.

వాడి కత్తి నొక్కుడు చూస్తే ఎక్కడ గొంతు కోస్తాడో అన్నంత ఖంగారు పుట్టింది మున్సబుగారికి. ఆయన పేరు అర్జునవర్మ అయినా మున్సబ్ అని పిలవడమే అందరికీ అలవాటు.

“ఊఁ” అన్నారాయన కత్తి తెగకుండా వుండేందుకు మెడ కండరాలు బిగించి. ఆయన అన్న’ఊఁ’లో ‘అలాగే’ అన్న అర్థం వెదుక్కున్న అంతర్వేది “ఇప్పుడే బుర్లంక ఉత్రం రాసడేత్తానండైతే. నా కొడకల్లారా, మీ పిల్లకి మల్లీ పెల్లి చైండ్రా. అచ్చింతలెయ్యడానికొచ్చి నా డాబూ డప్పం చూపిత్తానని. కాంత చంటమ్మగారికి చెప్పి ఆ ఉత్రం ముక్క రాసెట్టమనండి,” అన్నాడు.

“సరే. ముందు పని కానియ్!” చిరాగ్గా అన్నారాయన.

అంతే అంతర్వేది చెలరేగిపోయాడు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన తలకి మర్ధనా చేసి, వంటికి నలుగుపెట్టి చకచకా స్నానం చేయించేశాడు. గబగబా పొది సర్దేసుకొని పొరుగునే వున్న సర్పంచ్ కృష్ణంరాజుగారి ఇంటి ముందు నిలబడ్డాడు. గేటు వేసేసి ఉండడంతో అక్కడే నిలబడి, “ఒరేయ్ బద్దిగా రారా! రేపున్నుంచి ఊరికి నేనే పెదానమంత్రిని. ఎవరడ్డొత్తారో చూత్తాను,” అంటూ రెయ్యమీసం మెలేస్తూ మార్చి మార్చి తొడగొట్టడం మొదలెట్టాడు. చేత్తో బాది బాది తొడ నొప్పెట్టిందేగానీ వాళ్ళ బావ భద్రాచలం అటునుంచి ఉలకలేదు, పలకలేదు.

“ఏంటి మంత్రీ, ఏంటి గొడవ? పొద్దున్నే మా బలంగా కొడతనావు తొడ. కుతుకులోకిగ్గానీ ఇరిగిపోగలదొరే!” వెళ్తున్నవాడల్లా సైకిల్ని ఆపి ఆరాగా అడిగాడు కూనిశెట్టి నారాయణ.

“మా రాజుగారు పెసింట్ అవుతానన్నారండి.”

“ఏంటీ! నిజవా?” ఆశ్చర్యంగా రాగం తీశాడు నారాయణ.

“అవునండే కాపుగారు. ఇప్పుడే చెప్పారు. నేనింక మున్సీబుగారి మంత్రిని కాదండి. పెసింటుగారి మంత్రండి. అంటే, ఊరందరికీ ఇంద్రమ్మలాటోన్ని,” సిగ్గుపడుతూ చెప్పాడు.

“నీ సిగ్గు చిమడా! సరిగా ఇన్నావా? కాబోయే ఇయ్యంకుళ్ళు, ఆళ్లిద్దరి మజ్జినా పొటీయేంట్రా? మనలో మనమాట, పెళ్లికానీ ఆగిపోయిందంటావా?” గుసగుసగా అడిగిన నారాయణ, ప్రెసిడెంటుగారి ప్రహారీ గేటు దగ్గరకి వెళ్ళి, దాన్ని లోపలకి తొయ్యబోతే అది తెరుచుకోలేదు.

“ఇదేంట్రా. ఇయ్యేలప్పుడు గెడెట్టేసేరు గేటు గుమ్మానికి!”

“మా బావెదవ పనే అయ్యుంటది. ఆడి పనోడితనం ఎవరన్నా చూత్తే చీ అంటారని, అలా తలుపులకీ గుమ్మాలకీ గొల్లేలెట్టేత్తుంటాడు లెండి.” వివరణ ఇచ్చాడు అంతర్వేది.

దీంతో, లోపలకి ఎలా వెళ్ళాలో తెలీక, అక్కడే ఆలోచిస్తూ నిలబడిపోయాడు నారాయణ.

“మీరలా తలదించుకోటం నాను తట్టుకోలేపోత్నానండే,” బాధగా అన్నాడు భద్రాచలం.

“తలొంచకపోతే, మెడమీద జులపాలెలా కత్తిరిస్తావురా సన్నాసీ?” గంభీరంగా అన్నారు ప్రెసిడెంట్ కృష్ణంరాజు. ఆయన రెన్నెళ్ళక్రితమే మాజీ అయినా ఇంకా తాజాగానే చలామణీలో వున్నారు.

“తలొంచడం అంటే ఆ తలొంచడం కాదండి బాబూ. మునిసీబు గారికంటే ఓ మెట్టు కిందుండం.”

“మెట్టు కిందుండడం ఏమిట్రా? కావాలంటే లెక్కెట్టు. వాళ్ళ మేడకంటే మన మేడకే రెండు మెట్లెక్కువ.” మీసం మెలేశారు ఆయన అద్దం అందుకుంటూ.

“మీతో మా తిరకాసొచ్చేసిందండే. మెట్టంటే ఆ మెట్టుకాదండే బాబో! పాపగారి నెప్పుడైతే ఆ ఇంటి కోడలని చేత్తనారో, అప్పుడే మీమీద మునిసీబుగారిది పైచేయైపోయిందండే. మీకేం తెలట్లేదు. ఈ ముక్క నేనంటం కాదండే. మొన్న బుర్లంక పెల్లికొల్నపుడు మా చుట్టపోళ్లంతా అన్నారండి,” చెప్పాడు భద్రాచలం కత్తిరించడం ఆపి.

అద్దంలో మొహం చూసుకుంటున్న ప్రెసిడెంట్ కృష్ణంరాజు కళ్ళు కొంచెం ఎరుపెక్కాయి. అది కోపంతోనా? లేక కత్తిరించిన వెంట్రుకలు కంట్లో పడడం వలనా? అన్నది భద్రాచలం గమనించే స్థితిలో లేడు.

“అప్పుడికీ నేనన్నానండీ. నోర్ముయ్యండెదవల్లారా! పెసింట్ అంటే మాట్లేటీ? ఊరికి పెదం పవురుడూ. మున్సీబైతే తాశీల్దార్‌కి నవస్కారం ఎట్టాలని.”

“…”

“అందరూ ఒప్పుకున్నారు కానండే, మా అంతర్వేదెదవ ఒప్పుకోలేదండె. ఒంటికాలిమీద లేచిపోయి మునిసీబే మొగోడు. మునిసీబంటే ఊరికే కలట్టేరు. మెజిస్టీకు పొవర్లూ అయీ ఉంటాయి. బొక్కలో తోయించేత్తానని నోటికొచ్చినట్టు పేలేడండీ!”

“…”

“నేను మునిసీబుగారి మంత్రిని. మునిసీబుగారి కంటే నేనే పొవరుపొల్లు అనేసాడండి. ఈ మాటిన్నకాడ నుంచి నా మనసు మనసులో లేదండే. మీరేం చేత్తారో ఏంటో? ఆడింక మున్సీబుగారి మంత్రికింద వుండకూడదండే,” గడ్డం పట్టుకొని పెసిడెంట్‌గారి కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు.

“బామ్మర్ది బావ బతుకు కోరాలి కానీ నువ్వేంట్రా వాడి పొట్ట కొట్టెయ్యమంటున్నావు!”

“అబ్బే, ఆ మాట నేనెక్కడన్నానండి బాబో. నాకెందుకండా పాపం? మునిసీబుగారిని మంత్రిలేని మున్సీబుగారిని చేసెయ్యమంటనానంతే!” చతురత ప్రదర్శించాడు.

“ముందు, నీ మంత్రి పదవి పోకుండా చూస్కో. బుర్రిలంకా గొర్రిలంకా తిరిగి మా పరువు బజారు కీడుస్తారా? చెమడాలు వలిచేస్తా నొక్కొక్కళ్ళకీ. పో! పోయి స్నానానికి నీళ్ళు తోడు!” హుంకరించారు కృష్ణంరాజుగారు.

“చిన్నప్పన్నుంచూత్తనారు. మీకళ్ళల్లో వొప్పుడైనా పిసరంత కుంకుడుకాయ పులుసు పన్నిచ్చానాండీ? మంచెప్పేవోళ్ళంటే వొవలకైనా లోకువేనండి,” అంటూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా గాబు వైపు కదిలాడు.

“ఒరేయ్ ఆగరా!” అంటూ వెళ్ళేవాన్ని పిలిచి “నిజంగానే మన చెయ్యి కిందయిపోద్దంటావేట్రా?” అంటూ అనుమానించారు ప్రెసిడెంట్‌గారు.

“చూత్తంటే అలాగే కనిపిత్తంది కదండీ!” అంటూ మెరిసే కళ్ళతో అక్కడనుంచి పోయాడు భద్రాచలం.

దీర్ఘాలోచనతో అద్దంలోకి చూసుకుంటూ వుండిపోయారు ప్రెసిడెంట్ కృష్ణంరాజు.

“ఇందాకా జోస్నాదేవేదో చెప్పిందంట. నువ్విన్నావేమిట్రా రంగా?” అన్నారు కాసుగారు పొడుంకాయ తొడిమీద వేలితో కొడుతూ.

“ఆఁ. ఈసారి డైరెట్టెలచ్చనేనంట!” భూపతిరాజు రంగరాజు సమాధానం చెప్పేలోపే అందుకున్నారు దాట్ల రామచంద్రరాజు.

“అద్గదీ! ఎప్పుడంట?” అడిగారు కాసుగారు ఉరఫ్ కాకర్లపూడి సుబ్బరాజుగారు.

“ఎప్పుడైతే ఏవిటి లెండి. మనల్నేవన్నా నిలబడనిస్తారా? కూర్చోనిస్తారా?” నిట్టూర్చారు రామచంద్రం.

“బాగా చెప్పేరన్నయ్యా! మున్సబులు ఆళ్ళే. ప్రెసింట్లు ఆళ్ళే. ఎవరూ అడగాపోతే కరణీకాలు కూడా ఆళ్ళే ఎలగబెట్టేద్దురు!” అసహనంగా అన్నారు రంగరాజు.

ఆ ముగ్గురూ కాసుగారి వీధిలో కానుగచెట్టు చప్టా మీద కూర్చున్నారు. విరగబూసిన చెట్టు మీదనుంచి అప్పుడొకటీ అప్పుడొకటీ లేత గులాబీరంగు పూలు కిందపడుతున్నాయి. చెట్టుకింద నేలంతా రాలుపూలతో నిండిపోయింది. గాలి వీస్తున్నప్పుడల్లా చిక్కటి వాసన ముక్కులని పలకరిస్తోంది. ఊరందరిదీ ఒక దారైతే ఈ ముగ్గురిదీ తలోదారి. ఊళ్ళో వాళ్ళందరినీ ఉతికి ఆరేయడం తప్ప, వాళ్ళకి ఇంకో పనుండదు. స్వంత పనులు చేసుకోవడానికి తీరికా వుండదు.

“ఎవర్రా ఆ ఆళ్ళు?” దీర్ఘం తీశారు కాసుగారు.

“మీకు తెలకేటీ మా చేత చెప్పించడంగానీ! ఒకే ఒరలో రెండు కత్తులు. ఒక్కప్పుకిందే వున్న రెండు కొప్పులు. మీ తమ్ములుంగారు, బావలుంగారూను…” అంటూ దూరంగా కనిపిస్తున్న జోడు మేడలవైపు చూపించారు రంగరాజు.

ఊరికి మధ్యలో ఎత్తుగా వున్న ఆ జోడు మేడలవైపు ఓసారి చూసిన కాసుగారు “మీ ఇంటికెందూరమో మా ఇంటికీ అంతే దూరం లేవోయ్. ఎదవ వేళాకోలవూ నువ్వూను. వాళ్ళిద్దరూ కృష్ణార్జునుల్లాంటోళ్ళు, మేనత్త మేనమామ పిల్లలూనూ. సంబంధాలు కలుపుకున్నా ఆళ్ళే. చంకలు నాక్కున్నా ఆళ్ళే. ఇంకొకళ్ళని ఇరుపంచాలకి రానిత్తారేటి?” అన్నారు, లాగిన వెండితొడిని మళ్ళీ పొడుంకాయకి నొక్కేస్తూ.

“మరేఁ! మొన్న దాచ్చారం సంతలో కూడా చెప్పుకున్నారటలెండి. పెదలంక పెసింట్‌కి ఎంత నిక్కో. పంచాయితాఫీస్కి పగిడీని పంపడవే కానీ ఎప్పుడూ కాలెట్టలేదంటని!” ఎద్దేవాచేశారు రంగరాజు.

“యాండి రాంచెందర్రారు, పేంతీయ వాత్తలిన్నారేటండే? పంచాయతెలచ్చన్లెట్టేత్నారంట!” అంటూ అక్కడకి వచ్చిన జవ్వాది ఏడుకొండలు సైకిల్ స్టాండేశాడు.

“ఆ పంచాయితీయే నడుత్తుందిక్కడ. ఎలక్షన్లొస్తే ఏంటి? రాపోతే ఏంటి? నడిచేది మీ రాజ్జమె కద!” నిష్టూరంగా అన్నారు రామచంద్రం.

“అదేటండి బాబూ అంత మాటనేసారు? మాకూ దానికీ యాటండి సమ్మందం? పెసినెంట్‌గారంటే ఎవళ్ళు? కూనిశెట్టోళ్ళ పార్టీ. మా జవ్వాదోళ్ళెవరం? మునిసీబుగారి పార్టీ. మీ దాట్లోరిదీ అదే లెక్క గదా? కూనిశెట్టోళ్ళు మా మావలే అయినా, ఆళ్ళు మాకు ఎగస్పాట్టీ. ఇప్పుడుదాకా ఆళ్ల జండా ఎగిరితే ఎగిరింది, ఇంక ఎగరనియ్యమండి! యాండి కాసుబారూ మాట్టాడరేటీ మీరు? మీరేవంటారండి రంగబారూ? అన్నట్టు చెల్లెమ్మగారి ఓటు ఇక్కడే వుంది. ఎయ్యడానికొత్తారంటారా? లేపోతే ఓపాలెల్లొచ్చెయ్యమంటారా! ఐద్రాబాద్లోనే కదండీ వుంటుంట. మళ్ళీ చెప్పలేదనేత్తారు. మా వాడ్రుకేద్దావనుకుంటున్నాను. మీరు నా ఎనకుండాలండో. చాలామందిని కలాలింకా మరెల్లోత్తానండి,” ఎదుటివాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అందరి మాటలూ తనే మాట్లాడేసి సైకిల్ ఎక్కేశాడు ఏడుకొండలు.

“హేవిటోయ్ రామం, ఈ జవ్వాదోళ్ళ హెచ్చులు! మాట్టాడితే మున్సబ్ పాట్టీ, పెసింట్ పాట్టీ అంటాడు. కొంపదీసి కేండేట్ని కానీ పెడతారంటావా?” ఏడుకొండలు వెళ్ళిన వైపే చూస్తూ అన్నారు కాసుగారు, పొడుంకాయ వెండితొడిని ఊడదీస్తూ.

“పెట్టుకుంటే పెట్టుకుంటారు. ఎప్పుడూ ఆ మేడోల్లేనేటి? ఇంకెవళ్ళకీ సరదాలుండవా? సాపచ్చాలుండవా? అయినా ఈ ప్రెసిడెంట్ ఏం పీకేడని పోటీ పెట్టాపోటానికి? ఎజ్జుకేషను ఎంతుంటే ఎవడిక్కావాలండీ, టెకనాలజీ వుండాలి కానీ! జవ్వాదోళ్ళకి మేమూ, మాకు జవ్వాదోళ్ళూ కావలసినోళ్ళం. నేను ఆళ్ళకే సపోర్టు.” కసిగా చెప్పారు రామచంద్రం.

“భలే చెప్పారన్నయ్యా. ఊళ్ళోకి టాట్టర్ రాటానికీల్లేదు. కూలోళ్ళకి పనిపోద్దని ఆ మున్సబు చెప్పడవేంటీ, తగుదునమ్మాని ఈ పెసినెంటు తీర్మానం చేయించడవేటండీ! పాపం పీతరాజుగారెంత లాసయిపోయేరో. తోటి రాచోడని చూడొద్దా? ఆయనా టాట్టర్లు అయినకాడకి అమ్ముకోల్సొచ్చింది,” అంటూ విచారం వ్యక్తంచేశారు రంగరాజు.

“దూళ్ళకి గడ్డెయ్యాలి. ఇంక నేనెళతా,” అంటూ లేచారు రామచంద్రం రంగరాజుకి కన్నుగీటుతూ.

“మీకేనేంటి? నాకూ పనుంది,” అంటూ లేచారు రంగరాజుకూడా.

“ఆకాడకి మేమేదో ఖాళీగా వున్నట్టు. మీ మొకాలకి పనులు కూడానా! ఇంటికెళ్ళి తొంగోవాలని చెప్పేడొచ్చుగా?” అంటున్న కాసుగారి మాటలని పట్టించుకోకుండా ఆ ఇద్దరూ రాజకీయ సమాలోచనలు చెయ్యడానికి పీతరాజుగారి మకాంకేసి నడిచారు. వెళ్తున్న ఆ ఇద్దరివైపూ చూస్తూ ముక్కుపొడుం గట్టిగా ఓ పట్టు పట్టారు కాసుగారు.

చద్దన్నం తినేసి, పొద్దున్నే ఊరిమీదపడ్డ జవ్వాది ఏడుకొండలు పేపరు పట్టుకొని రామాలయం మెట్టుమీద ఆసీనుడయ్యాడు. ఎవరూ కనిపించకపోవడంతో ‘బద్దకం ఎధవలు, ఎలచ్చనన్నాల్లైనా పెందలాడే లెగాలన్న గ్నానం లేకుండా పోయింది’ అని గొణుక్కుంటూ పేపర్ విప్పాడు.

“ఏటండి, ఏడుకొండలగారో! మీరొక్కరే ఫలారం చేసేత్తనారు పేపరు, ఎనకాలోళ్లకి నాలుగచ్చరం ముక్కలుంచండీ,” అన్నాడు అంతర్వేది సైకిల్ ఆపుతూ.

“నాలుగేటహే, నలభై వున్నాయి కానీ ఇలా రావాహై. దా కూకో…” అంటూ ఆహ్వానించాడు.

“ఏటండిసేసాలు? గబగబా చెప్పెయ్యండి. ఆలీసవైతే మున్సీబ్‌గారు కోప్పడతారు.”

“ఎలచ్చన్లొచ్చేసాయి. నీ వోటేవాడ్రులో వుందిరా?”

“ఏంటి? ఎలక్షన్సా? ఐతే ఈసారి సర్పంచ్‌గా నేను పోటీలో వుంటానోయ్!” అన్నారు అప్పుడే అక్కడకి వచ్చిన ఆయుర్వేదం డాక్టర్ అమ్మన్నగారు.

“ఆహాయ్! పెసింట్ అయి… పెజలని పేసెంట్లునిగానీ చేసేత్తారండి తవరు?” అన్నాడు ఏడుకొండలు.

“అలా ఎందుకు చేస్తామోయ్, సేవ చేసుకుంటాంకానీ!” ఉడుక్కున్నారు అమ్మన్న.

“సేవలు చేసుకోటానికిక్కడ లేనిదేటండీ! మీరొచ్చేసి ఇంకేం ఊడబొడిచేత్తారండి?” అన్నాడు అంతర్వేది వెటకారంగా.

“ఏం చేస్తామంటే… అవన్నీ ఇప్పటికిప్పుడు ఎలా చెప్పేస్తామోయ్? వుండు. ఇంటి దగ్గర వెచ్చాలిచ్చేసి తాయితీగా మళ్ళీ వస్తా,” తల గోక్కుంటూ వెళ్లిపోయారు అమ్మన్న.

“ఊళ్ళో ఆస్పటలెట్టాకా యాపారం పోయిందని పెసింట్‌గారి మీద డాట్రుగారికి ఏడుపహేయ్!”

“మరేండీ.”

“నువ్వు చెప్పింది నిజమేరా అంతర్వేదీ! పెసింట్ అయితే చైడానికేం మిగిలిందిరా ఊళ్ళో?” పేపర్‌తో తలమీద కొట్టుకుంటూ అడిగాడు ఏడుకొండలు.

“ఏం? చెబితే మీరు కాన్నుంచుంటారా? మీకా చాన్స్ లేదండే. ఈపాలి మున్సీబుగారు పెసింట్ కేసేత్తనారు.”

“యేంటి?” అంటూ నోరు చాపాడు గతుక్కుమన్న ఏడుకొండలు.

“ముయ్యండే, ఎదవ చుట్టకంపు!” అంటూ లేచి సైకిల్ తీశాడు అంతర్వేది.

“ఒరే! ఒరే అంతర్వేదీ!” ఏడుకొండలు వెనక నించి ఎంత పిలుస్తున్నా వాడు వినిపించుకోలేదు.

“యాండే కాపుగారూ! తవకి మా బావెదవే కానీ మేం అంపడవా? తూ నాబొడ్డూ అని పోయీవోన్ని, ఊఁ తెగ పేమించేత్తనారెందుకు?”

వెనక నుంచి భద్రాచలం మాట వినపడ్డంతో తలతిప్పి చూసిన ఏడుకొండలు “నియ్యెంకమ్మా, హళ్ళిపోయేన్రా బాబూ! నువ్వెప్పుడొచ్చీవు?” ఆశ్చర్యంగా అడిగాడు.

“మంతో పనలా వుంటదిలెండి. వుప్పుడుదాకా మీతో ఏం చెపుతున్నాడండాడు? ఆ బుర్లంక పెల్లి గొడవేనా?”

“కాదెహే. మునిసీబుగారు పెసినెంటుగారి మీద పోటీ చేత్తనారంట కదా! అదీ, ఆ గొడవ.”

“చెయినియిండి, చెయినియిండి. ఆయనగోరికి పెసింటుగోరు బుర్రగొరిగొదిలెయ్యడం కాయం! మా బావగాడి మాటలినేసీమద్దిల మున్సియ్యిగోరికి మైండ్ దొబ్బీసింది.”

“నిజవేరా. ఈ మాటిన్నకాన్నుంచీ నాకూ అదే కొడతంది. అయినా మజ్జలో ఈ బుర్రిలంక పెళ్ళి గొడవేట్రా?”

“ఉప్పుడు దాని ఊసెందుకులెండి? అరిజంటు పనోటి గుత్తొచ్చింది,” అంటూ పరుగులాటి నడకతో అక్కడనుంచి పోయాడు భద్రాచలం.

‘ఏంటో ఈ బావాబామ్మద్దుల దొబ్బిదేళ్ళు! పెద్దమనిషినన్న ఇంగితవే లేకుండా’ గొణుక్కుంటున్న ఏడుకొండలు కంట్లో నడుచుకుంటూ వస్తున్న రాపర్తి విశ్వనాథం పడ్డాడు. “ఏరోయ్ కొత్తపెళ్లికొడుకా! మా చెల్లెలేవన్నా మల్లెపూలట్రమ్మందేట్రా పొద్దున్నే, మా ఊపుమీద పోతన్నావు! మాట్టాడీ పనుందిలారా!” అంటూ పిలిచాడు.

“యా య్యేటీ?”

“మన మునిసీబుగారు, ఈ సారి పెసినెంటుకి పోటీ చేత్నారు తెలుసా?” అన్నాడు మడతెట్టిన పేపర్‌తో అరచేతిలో కొట్టుకుంటూ.

“ఏటి? ఈ ఇసయం పేపర్ కింతాలిసంగా ఎక్కిందా? ఏ పేపరది? రేపున్నుంచి కొండం మానెయ్యి.”

“యేం, నీకు ముందే తెలుసా?”

“రాజమన్నార్ మూడురోజులకిందే చెప్పేడు కదా!”

“ఆయనెవళ్లు?”

“మీ చుట్టాలేమో వాకబు చెయ్యి. అద్దంకోళ్ళు. డిల్లీలో వార్తలు చదూతాడు.” అనేసి పోయాడు విశ్వనాథం.

‘అమ్మడియ్యమ్మా! మున్సిబుగారి పోటీ యవ్వారం అపుడే డిల్లీదాకా ఎల్లిపోయిందా? నాకేటింత ఆలీసంగా తెలిసింది!’ అని విచారిస్తున్న ఏడుకొండలు, “హేమోయ్. జవ్వాదోరబ్బాయ్! అవతలంత హడావిడొదిలేసి ఒంటికాయ సొంటికొమ్ములా ఒక్కడివే దేబిరిస్తున్నావిక్కడ? అన్నట్టు మీ నారాయణమావ పార్టీ ఫిరాయించేసాహ్టగా. నువ్వేంచేస్తావు మరి? పెసింట్‌గారి వేపెళ్లిపోతావా? జవ్వాదోళ్ళూ కూనిశెట్టోళ్ళూ ఎప్పుడూ ఉప్పూ నిప్పేగా!” అన్న శాస్త్రులుగారి ప్రశ్నతో అదిరిపడ్దాడు.

“ఇదెప్పుడు జరిగిందండి బాబూ?” ఖంగారుగా అడిగాడు ఏడుకొండలు.

“నిన్నో మొన్నో! పెసింట్‌గారి మేడలోకి వెళదామని చూసాహ్ట. ప్రహరీ గేటు మూసేసుందహ్ట. వెర్రిపీనుక్కి అభిమానం ఎక్కువ కదా! అవమానభారంతో తెరిచివున్న మునసబుగారింట్లో దూరేసాహ్ట. ఇంకేం వుంది, నువ్వెళ్లి పెసింట్‌గారి పెరట్లో దూకెయ్యహ్టమే!”

బుర్ర గోక్కున్న ఏడుకొండలు ‘ఎవరూ కబడ్డంలేదేటని పొద్దున్నుంచీ ఇక్కడే పడిపడి కొట్టుకుంటున్నాను. అవతలంత టోరీ జరిగిపోతందా? ఎంతెనకబడిపోయాను తింగరెధవని!’ అని గొణుక్కుంటూ “ఇయ్యన్నీ మీకెలా తెలిసాయండి? అసలేం జరిగిందో చెప్పి పుణ్యంకట్టుకోండి మహాప్రభూ!” అని వేడుకున్నాడు.

రోజూలాగే ఆరోజూ మున్సబు అర్జునవర్మా ప్రెసిడెంట్ కృష్ణంరాజూ మున్సబుగారి వాకిట్లో కుర్చీలేయించుకుని కూర్చున్నారు. పాలేరు అప్పన్న బల్లమీది స్కాచ్ గ్లాసుల్లో పోస్తుంటే, ఒక్కో గుటకా మింగుతూ ప్లేటులో జీడిపలుకులు నములుతూ పేకాట ఆడ్డం మొదలెట్టారు.

పూల్ గేమ్. జోరుగా సాగుతుంటే కాసుగారు, రామచంద్రం, రంగరాజు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వచ్చి ఖాళీగా వున్న కుర్చీల్లో కూర్చున్నారు. మందు బాటిల్ కిందున్న స్కోరు కాగితం అందుకొని “ఎన్నెకరాలకేసారేటి గేమ్?” అడిగారు రంగరాజు.

“దంతులూరోళ్ళకి మీసాలు తప్ప రోషాలు ఎక్కడోయ్? పదెకరాలకి ఏద్దాం అంటే ఐదెకరాలు చాలన్నాడు. స్కోర్ తక్కువేవుంది జాయిన్ అవుతావేటీ?” అన్నారు మున్సబుగారు.

గతుక్కుమన్న రంగరాజు చేతిలో కాగితాన్ని మళ్ళీ బాటిల్ కిందెట్టేశారు. రామచంద్రం ‘తిక్క కుదిరిందా’ అన్నట్టు రంగరాజు వంక కొరకొరా చూశారు. అప్పన్న లోపలనుంచి మూడు గ్లాసులు తెచ్చి మందు కలిపి ముగ్గురి ముందూ పెట్టాడు.

“పిలుపులందాయి కదా? ఎల్లుండే మేవిద్దరం అత్తరు తాంబూలాలు మార్చుకోవడం. వదినియ్యా మీరూ ముందురోజే వచ్చి, దగ్గరుండి అన్ని పనులూ చక్కబెట్టండి అన్నయ్యా. రంగా, రామం మీరు కూడా ఇధాయకంగా దగ్గరుండాలిరా,” అన్నారు మున్సబుగారు కాసుగారి దగ్గరకి గ్లాసు జరుపుతూ.

“అదేం కుదరదు. మీరు ముందు మా ఇంటికే రావాలి బావా. తర్వాతే ఎవరింటికి వెళ్ళినా, ఏం చక్కబెట్టుకున్నా!” అన్నారు ప్రెసిడెంట్‌గారు దర్పంగా.

“సరే, సరే. ఆడాళ్ళు ఆడపెళ్ళివారింటికి, మగాళ్ళం మగపెళ్ళివారింటికీ వస్తాం,” సర్దుబాటు చేశారు కాసుగారు ఓ గుటకేసి గ్లాసు కిందపెడుతూ.

“ఏరా రామం, ఎలా వుంది రాజకీయం? ఏవంటున్నాడు మీ పీతరాజు?” పేక కత్తెరేస్తూ అడిగారు ప్రెసిడెంట్‌గారు. పీతరాజుగారిది పట్నంలో ఫైనాన్సూ, ఫెర్టిలైజర్స్ వ్యాపారం. లక్షల్లో వుంటుంది టర్నోవరు. ఆ మధ్య మున్సబుగారబ్బాయికి వాళ్ళమ్మాయినిస్తామనొస్తే వీళ్ళు వద్దన్నారు. వడ్డీ వసూలు చెయ్యడంలో జలగలాంటివారన్న మంచి పేరుంది ఆయనకి.

అక్కడున్న పెట్టెలోంచి దర్జాగా ఓ త్రిబుల్ ఫైవ్ సిగరెట్టు తీసి వెలిగించుకుంటూ “ఈ సారి ఎలక్షన్లో పెసింటుగా నిలబడతానంటున్నారన్నయ్యా!” చెప్పారు రామచంద్రం.

“అబ్బో, మా మున్సబ్బావొక్కడే అనుకున్నా! ఇప్పుడు మీ పీతరాజుకూడా తయారయ్యాడా?”

ప్రెసిడెంటుగారి మాటలకి ఆ ముగ్గురూ ఒకళ్ళనొకళ్ళు అయోమయంగా చూసుకున్నారు. ‘మున్సబుగారు, ప్రెసిడెంటుగారి మీద పోటీ చెయ్యడం ఏమిటి? ఈయనకి అప్పుడే మందెక్కువయ్యిందా!’ అన్న అనుమానమొచ్చింది. కాసుగారు పొడుంకాయ తీసి ముక్కుపొడుం బలంగా ఓ పట్టు పట్టారు.

కరణంగారూ, సొసైటీ ప్రెసిడెంటూ, కూనిశెట్టి నారాయణ, మేడిశెట్టి వెంకటరెడ్డిలాంటి ఊరిపెద్దలు పదిమందిదాకా అలవాటు ప్రకారం వచ్చి అక్కడ వేసున్న బల్లలమీద కూర్చున్నారు. రోజూ ఎకరాలకి ఎకరాలు పందెం కాసుకుంటూ సాగే ఆ బావా బామ్మర్ధుల పేకాటని ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటూ ఆ పలుకూ ఈ పలుకూ నములుకుంటూ చూడడం వాళ్ళకో సరదా.

గేమ్ అయిపోయింది. పెసింటుగారు ఐదెకరాలు గెలుచుకున్నారు.

మున్సబుగారు అప్పన్నని పిలిచి “అయ్యగారిని అయిదెకరాలకి సరిపడ దస్తావేజులిమ్మని తేరా,” అని పురమాయించి “ఈ గేమ్ పది ఎకరాలైతేనే ఆడతాను. లేకపోతే మానేస్తాను,” అన్నారు ఖాళీ అయిన గ్లాస్‌లో స్కాచ్ నింపుకుంటూ.

“అయితే ఓ పనిచేద్దాం. ఈ గేమ్ ఎవరు కొడితే వాళ్ళే నామినేషన్ వెయ్యాలి. ఓడినోళ్లు వెయ్యకూడదు. ఏమంటావ్?” కవ్విస్తున్నట్టు అన్నారు ప్రెసిడెంట్‌గారు.

ప్రెసిడెంట్‌గారి మాటలకి అక్కడ వున్నవాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కాస్సేపు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. మున్సబుగారు యం.యస్సీ. మేథ్స్. ఆయనంతా లెక్కప్రకారం మాట్లాడుతుంటారు. ప్రెసిడెంటుగారలా కాదు, నోటికి ఎంతొస్తే అంతే.

కరణంగారు లేచి “కృష్ణంరాజుగారూ, మీరు మాట్టాడింది భావ్యం కాదు. సర్పంచ్ ఎన్నిక మీ బావాబామ్మర్దుల పేకాట వ్యవహారం కాదని గ్రహించండి. పెద్దలనిబట్టో మీ కుటుంబం మీద వున్న అభిమానంతోనో జనం మీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు. ఇప్పుడు మీ కుటుంబం మధ్యే చీలిక వచ్చి మీలో మీరే పోటీ పడతానంటే పడండి. ఎవరి సత్తా ఏంటో ప్రజలే తేలుస్తారు. అంతేకానీ ఇలా పేకాటాడో, కోడి పందేలుకట్టో అధికారం అనుభవిస్తామంటే మొత్తం గ్రామాన్ని అవమానించినట్టే!” స్థిరంగా అన్నారు.

కరణంగారు అలా నిలదీస్తారని ఎవ్వరూ ఊహించలేదు. మునసబుగారూ ప్రెసిడెంటుగారూ తమ మనస్సులోని భావాలని మొహంలో కనిపించనియ్యడంలేదు. ప్రెసిడెంట్‌గారు గ్లాసులో అడుగున వున్న మందుని గిరగిరా త్రిప్పి గొంతులో పోసుకొని సావకాశంగా రెండు జీడి పలుకులు నోట్లో వేసుకొని నములుతూ “బాబయ్యగారెందుకింత ఆవేదన చెందారో అర్థంకావడంలేదు. ఇది మా బావాబామ్మర్దుల వ్యక్తిగత విషయం. కచ్చేరీ చావిట్లోనో రచ్చబండ దగ్గరో జరుగుతున్న వ్యవహారం కాదిది. మా ఇంటి నాలుగు గోడల వెనకా మా ఇద్దరి మధ్యా జరుగుతున్న సంవాదం. మీరంతా మాకు అయినవాళ్ళు, ఆశ్రితులూ కాబట్టి ఇక్కడ వున్నారు. లేకపోతే మా గేటుదాటి రావడం మీ తరమా? మా రాజుల గుట్టు తెలుసుకోవడం మీకు సాధ్యమా?” అని తీక్షణంగా ప్రశ్నించారు.

అంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

“అవును. ఆలోచిస్తుంటే ప్రెసిడెంటుగారు చెప్పేది నిజమేననిపిస్తోంది. ఆళ్ళల్లో ఆళ్ళు ఎవలు నిలబడాలో తేల్చుకోవాలనుకున్నారు. ఇది వాళ్ళ స్వవిషయమే. అనవసరంగా అపార్థం చేసుకున్నాం.” అన్నాడు సొసైటీ ప్రెసిడెంట్.

“సరి సరి. ఈ నాలుగ్గోడలమధ్యా మనం నిందించినా నిలదీసినా వారి శ్రేయస్సు కోసమేగా! ఇలాటివాటిని పట్టించుకొని పంతాలకీ ప్రతీకారాలకీ దిగడం వీరికలవాటులేదులే. ఇంకీవిషయం ఇంతటితో వదిలెయ్యండి.” అంటూ కూర్చున్నారు కరణంగారు.

“అయినవాళ్ళ మధ్య ఈ పోటీలూ పోట్లాటలూ ఎందుకు? ఇద్దరిలో ఎవరు నుంచోవాలో ఓ మాటనేసుకోక?” ఓ జీడి పలుకు నోట్లో వేసుకుంటూ హితవు పలికారు కాసుగారు.

“అది కుదరదు. ప్రధానమంత్రనిపించుకోవాలని మా అంతర్వేదిగాడి కోరిక. తీరుస్తానని మాటిచ్చాను. నేను మాటంటే మాటే!” ఖరాఖండీగా చెప్పారు మున్సబుగారు.

“అదికాదు బావా! పీతరాజుగారు ఎప్పన్నుంచో ప్రెసిడెంటవ్వాలని సరదాపడుతున్నారు. ఆయన్నోసారి ఏకగ్రీవం చేసేయచ్చుకదా!” అంటూ పైకి లేచారు రామచంద్రం.

“అంత సరదాగా వుంటే పోటీ చేసి గెలుచుకోమనండి. దేహీ అని అడుక్కోడం ఎందుకు? యేం, మీ పీతరాజుగారుకి పౌరుషం లేదా? రాసోడు కాదా?” ఎద్దేవా చేశాడు కూనిశెట్టి నారాయణ.

“అడుక్కోవాల్సిన ఖర్మ ఆయనకేవిటోయ్? కట్టపడి పైకొచ్చేడు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే చీడపురుక్కాదు.” కాలరెగరేశారు రామచంద్రం.

“యాండోయ్! కొంచెం నోరదుపులో ఎట్టుకోండి. చీడపురుగులు పైక్కనిపిస్తాయి. చెదమందు కొడితే చచ్చూరుకుంటాయి. మీ రాజు ఏరుపురుగు. చెట్టు చంకనాకిపోయినా పైకి కనిపించని పెమాదకారి!” తగ్గలేదు నారాయణ.

“యాండోయ్ రావచందర్రారు! మీరోపాలి కూకోండి. నారాయంగారు మీరు కూడా. మీరెవలు ఎన్ననుకున్నా ఈరికో సరిత్రా ప్రెతిట్టా వుంది. పీతరారు పొరుగు పచ్చగా వుంటే పొయిలో ఉచ్చోసొచ్చే రకం! ఆరికీ ఈరికీ పోలికేటి? ఆ కురిసీమీద మాకెవులికీ కూకోడం రాదనుకుంట్నారా, లేపోతే రాసోల్లు తప్ప ఎవలూ కూకోకూడదని రాసేసుకున్నారా!” ఒంటికాలిమీద లేచాడు మేడిశెట్టి వెంకటరెడ్డి.

“గుభీగుభీ గుద్దేద్దారంటే గుప్పుడుమంది రాసోళ్ళేరు ఊల్లో. మంతుర్లుకోసవూ సేనాపతులకోసవూ ఈళ్లల్లో ఈల్లే తన్నుకోడవోటీ. ఈళ్ల సత్తేటో మన సత్తేటో తేలిపోద్ది. రండహే! మన కాండేట్ని మనం ఎట్టుకుందారి.” పొగాకు వీరబాబు రుసరుసలాడుతూ అక్కడనుంచి వెళ్లిపోయాడు.

“ఎవరెవరు ఏ గోదాట్లో దూకుతారో దూకండి. నేను ఎమ్మే పాలిటిక్స్. నాకంటే రాజకీయం తెలిసినోడెవడూ లేడిక్కడ. చక్రం తిప్పేస్తా. రావోయ్ నారాయణా మనింటికిపోదాం!” అన్నారు ప్రెసిడెంట్‌గారు.

“నేన్రానండి. మొన్న మీ గేటుగుమ్మంకాడ నాకవమానం జరిగిపోంది. అందుకే మునిసీబుగారేపు వచ్చేసాను,” నిక్కచ్చిగా చెప్పేసిన నారాయణ “మునిసీబుగారికే జై!” అన్నాడు.

“మాదీ మాదీ వశిష్ట గోత్రం. నేనూ మునసబు వైపే!” అన్నారు కాసుగారు.

“అలాగైతే మాదీ మాదీ ఒకటే గోత్రం. నాది పెసింటుగారి పార్టీ!” అన్నారు రంగరాజు.

“అన్నయ్యా, బావా! మీరేవన్నా అనుకోండి. నేనూ పీతరాజుగారూ పార్టనర్సుం కాబట్టి నేనాయన ఏపెళ్లిపోతున్నాను.” అంటూ రామచంద్రం అక్కడనుంచి విసవిసా వెళ్లిపోయారు.

“పోతేపోయావు. నువ్వూ మీరాజూ పెళ్ళిభోజనాలకి రాడం మాత్రం మానెయ్యకండ్రోయ్!” వెనకనుంచి వెటకరించారు మున్సబుగారు.

కరణంగారు రాజకీయాల్లో తలదూర్చకూడదు కాబట్టి, సొసైటీ ప్రెసిడెంటూ, వెంకటరెడ్డీ ప్రెసిడెంట్‌గారికి జై కొట్టిన తరువాత ఇరువైపుల బలబలాలూ సమానమయ్యాయి. దాంతో సంతృప్తిచెందిన ఇరువర్గాలు ఇంటిదారి పట్టడంతో అక్కడ మిగిలిన బావాబామ్మర్దులిద్దరూ మళ్ళీ గ్లాసులు నింపుకొని చీర్స్ కొట్టుకున్నారు.

రాత్రికిరాత్రే ఊరు కులాలవారీగా కాకుండా గోత్రాలవారీగా విడిపోయింది. తెల్లవార్లూ నిద్రపోకుండా బావలంతా ఓ వర్గం, బామ్మర్దులంతా ఓ వర్గం, అమ్మలంతా ఓ వర్గం, అత్తలంతా ఓ వర్గం, అమ్మమ్మలది ఓ పార్టీ, నాన్నమ్మలది ఓ పార్టీ, అప్పులున్నవాళ్ళు ఓ పార్టీ, అప్పు కావాల్సినవాళ్ళు ఇంకో పార్టీలోకీ చేరిపోయారు.

జోడు మేడల్లో అంగరంగ వైభవంగా పెళ్ళిపనులు మొదలయ్యాయి. ముప్పై ఏళ్ల తరువాత తమ ఇంట్లో జరుగుతున్న పెళ్ళి కావడంతో మున్సబుగారూ ప్రెసిడెంట్‌గారూ ఏదాదికోరోజు చొప్పున లెక్కేసుకొని ఊరందరికీ ముప్పై రోజులపాటు విందు వినోదాలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించుకున్నారు. నెల్లాళ్ళ పండగకి తరలిరమ్మంటూ ఊరందరికీ శుభలేఖలు పంచిపెట్టడంతో ఎన్నికల హడావిడీ పెళ్లి హడావిడీ కలగాపులగం అయిపోయాయి.

ఆ రోజు లగాయితు నెల్లాళ్ళపాటు ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. చుట్టుపక్కల ఏ ఊళ్ళోనూ కోడి కుయ్యలేదు. కోళ్లన్నీ మున్సబుగారింట్లోనో ప్రెసిడెంట్ గారింట్లోనో డేగిసాలో పలావులాగో, దాకలో వేపుడులాగో మారిపోయాయి. వారపు సంతలకి ప్రత్యేకంగా మనుషుల్ని పంపి మేకపోతులనీ గొర్రెపోతులనీ దిగుమతి చేసుకుంటున్నారు. పెళ్ళి పనుల్లోనూ ఎలక్షన్ పనుల్లోనూ పడి ఊరిలో మరకాళ్ళు వలెయ్యడం మానేయడంతో పీతలూ చేపలూ రొయ్యలూ ఎక్కడెక్కడనుంచో తెప్పించాల్సివస్తోంది. మున్సబుగారూ ప్రెసిడెంట్‌గారూ ఎవరి మేడముందు వాళ్ళు నిలబడి అతిథులని ఆహ్వానిస్తూ అలసిపోతున్నా సాయంత్రం అయ్యేసరికి మందుకొట్టి పేకాటాడ్డం మాత్రం మానలేదు. ప్రెసిడెంట్‌గారి హ్యాండ్ మంచి రేజ్ మీదుండడంతో వారం రోజుల్లోనే మున్సబుగారివి ఏభై ఎకరాలు లాగేశారు.

ముప్పొద్దులా మునసబుగారింట్లోనో ప్రెసిడెంటుగారింట్లోనే పడి మెక్కడం, సాయంత్రం అయ్యేసరికి ఏర్పాటుచేసిన రికార్డింగ్ డ్యాన్సులో భోగం మేళాలో చూసి ఇంటికెళ్లి పడుకోవడం–ఇది తప్ప జనానికి వేరే పనిలేకుండా పోయింది. భోజనాల తరవాత కిళ్ళీలిస్తే తేలిగ్గా జీర్ణమవుద్దని అంతర్వేది సలహా చెబితే మున్సబుగారు రామచంద్రపురం రాజుగారి కిళ్ళీకొట్టునుంచి రెండుపూటలా రెండుగంపల కిళ్ళీలు తెప్పిస్తున్నారు. తిన్నదరక్క జనం బలువారంతో బాధపడతన్నారని భద్రాచలం చింతించడంతో ప్రెసిడెంట్‌గారు ఆర్టోస్ ఫ్యాక్టరీనుంచి రోజుకో జింజిరుబుడ్ల లోడు దింపిస్తున్నారు.

ఎవరూ చెప్పకుండానే మున్సబుగారి వైపు కాసుగారు, ప్రెసిడెంటుగారి వైపు రంగరాజుగారు ఎలక్షన్ బాధ్యతలు భుజాలకెత్తుకున్నారు. ఏ వార్డులో ఎన్నోట్లున్నాయి, ఏ కులపోళ్లవెన్నున్నాయి లాంటి విషయాలు వాళ్లిద్దరూ ఎవరి తరుపున వాళ్ళు కూపీలాగుతూ మెనూనిబట్టీ మషాలా వాసన్నిబట్టీ రోజురోజుకీ అటూ ఇటూ మారిపోతున్న జనసమీకరణలని లెక్కగట్టలేక, తలనెప్పితో ఒకరు హెర్గోఫైరన్ వేసుకుంటే ఇంకొకళ్ళు నవాల్జిన్ మింగుతున్నారు.

జోడు మేడల మధ్యవున్న ప్రహరీ గోడకి నిచ్చెన్లేసుకొని అంతర్వేదీ భద్రాచలం ఎవరిదొడ్లో జనమెక్కువున్నారో ఎప్పటికప్పుడు లెక్కేసి, ఎవరికివాళ్ళు మున్సబుగారి భార్య చంటమ్మ, ప్రెసిడెంటుగారి భార్య చిట్టెమ్మ చెవుల్లో వేస్తున్నారు.

ఆడుతూ పాడుతూ పది రోజులు గడిచిపోయాయి. నెల్లాళ్ళ పెళ్ళి ఇరవై రోజుల్లోకొచ్చేసింది.

కొత్త జంట రాపర్తి విశ్వనాథం, వాళ్ళావిడ నాగరత్నం డాబుసరిగా ముస్తాబయి చేయీచేయీ పట్టుకొని అల్పాహారానికి రావడం ప్రెసిడెంట్‌గారి కంట్లో పడింది. అంతే! ఆయన అగ్గిమీద గుగ్గిలమైపోయారు.

“ఏరా విశ్వనాథం, ఏం పనిరా ఇది?” అంటూ గద్దించారు.

మున్సబుగారితోపాటూ అటువాళ్ళూ ఇటువాళ్ళూ ప్రెసిడెంటుగారి చుట్టూ చేరారు.

కొత్త పెళ్ళాం ముందు బిత్తరపోయిన విశ్వనాథం “యాండి యాంజేసాను?” అని గొణిగాడు.

“శుభలేఖ సరిగ్గా చదివావా, లేదా?”

“ఆఁయ్, నెల్లాళ్ళపాటూ ముప్పొద్దులా రమ్మని రాసారు కదండీ!”

“సకుటుంబ సపరివార సమేతంగా రమ్మన్నామా? లింగూలిటుకుమని మీ ఇద్దరినే ఊపుకుంటూ రమ్మన్నామా? పధ్ధతుండొద్దురా బడుద్దాయ్?”

“అయ్‌బాబోయ్! పెళ్ళై నెలే కదండి బాబూ అవుత! అప్పుడే పిల్లాజెల్లా ఎక్కన్నుంచొత్తారు?”

“అది కాదోయ్ ఏబ్రాసీ! ఈ పిల్లకి అమ్మా బాబూ, అక్కా డొక్కా, చెల్లీ చెక్కా లేరేంట్రా? మా ఇంట్లో పెళ్లంటే మీ ఇంట్లో పెళ్ళి కాదా? ఆళ్ళందరినీ తీసుకురావద్దా? ఇదేనా మనూరి మర్యాద! ఇప్పుడే ఉత్తరం రాసి ఆళ్ళందరినీ రప్పించు. అవసరమైతే దారి ఖర్చులుకి మనియార్డర్ చేద్దాం. ఆ ఇంట్లోగానీ ఈ ఇంట్లోగానీ మళ్ళీ మీ ఇద్దరే కనబడ్డారనుకో, మీ ఎక్కడెక్కడి చుట్టాలనో లెక్కెట్టి వాళ్లందరి వాటా మీ ఇద్దరిచేతే తినిపిస్తా, జాగ్రత్త!” అని, అందరివైపూ చూసి “మీక్కూడా ఇదే చెప్పటం,” అని హెచ్చరించారు.

“శభాష్ బావా! బాగా చెప్పావు,” అంటూ మెచ్చుకున్నారు మున్సబుగారు ప్రెసిడెంట్‌గారిని.

ప్రెసిడెంట్‌గారి కోపాన్ని చూసిన ఊళ్ళోవాళ్లంతా చుట్టాలకీ పక్కాలకీ ఆరోజే బస్తాడు ఉత్తరాలు రాసిపడేశారు. అంతే! మర్నాటి నుంచీ బళ్ళల్లో బస్సుల్లో పడవల్లో సకుటుంబ సపరివార సమేతంగా ఎక్కడెక్కడనుంచో ఎవరెవరి బంధుగణాలో మిత్రబృందాలో దిగిపోయి, మదర్పిత చందన తాంబూలాది సత్కారాలు గైకొనడం మొదలెట్టారు.

ప్రెసిడెంట్‌గారి హెచ్చరిక విన్న అంతర్వేది చంటమ్మగారి చేత, భద్రాచలం చిట్టెమ్మగారి చేత, రాయించి విడివిడిగా బుర్రిలంక ఉత్తరాలు పడేశారు. ‘తిక్కనాకొడుకులు! ఈళ్ల మాటట్టుకొని మనవంతా పొలోమని అక్కడకి పోతే కుక్కతోకట్టుకొని గోదారీదినట్టుంటది. మా ఇంట్లో వుండమంటే మా ఇంట్లో వుండండని ఇద్దరూ కొట్టుకుచత్తా మన్ని కాల్చుకు తినేత్తారు. ఎళ్ళాపోడమే మంచిది. అంతగ్గాపోతే బేండట్టుకొని ఆఖరువురోజుకెళదాం, రాజుల మాట మన్నించినట్టుంటది.’ అనుకొని ఉత్తరాలందుకొన్న ఆ బుర్రిలంక చుట్టాలు రావడం మానేశారు. ‘ఇంకా ఉత్తరం అందలేదేమో… ఇవాళ వస్తారు, రేపొస్తారని’ అంతర్వేదీ, భద్రాచలం రోజూ ఎదురుచూపులు చూస్తూ వున్నారు.

విందు వినోదాలతో ఊరు మొత్తం తిరణాళ్లని తలపిస్తోంది. జిల్లామొత్తం ఏ నోట విన్నా పెదలంక ముచ్చటే. పెదలంకలో జరుగుతున్న విందువినోదాల గురించీ, చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల గురించీ ఎవరో కార్డుముక్క రాసిపడేయడంతో విషయం కలక్టర్‌గారి చెవిన పడింది. ‘ఇదేదో అతిసమస్యాత్మక గ్రామంలా వుందే!’ అనిపించడంతో ఆయన సబ్ కలక్టర్నీ, సబ్ కలక్టర్ తహశీల్దార్‌నీ విచారణకి నియమించారు. మున్సబుగారికి తెలియని తహశీల్దారా ఏమిటి! ఊళ్ళో జరిగేదంతా వివాహమహోత్సవం తప్ప మరేమీ కాదని చాలా నిజాయితీగా ఓ నివేదిక తయారుచేసుకొని, పెళ్లికి విధాయకంగా వస్తానని బావాబావమరుదుల చేతిలో వట్టేసి చెప్పి, ఎవరికీ కనిపించకుండా రెండు స్కాచ్ బాటిళ్ళు పట్టుకొని వచ్చినంత వేగంగానూ వెళ్లిపోయాడాయన.

ప్రొద్దున్నే టిఫిన్లయ్యాక మొదలెట్టి మధ్యాహ్నం భోజనాలవరకూ ఒక విడతా, భోజనాలయ్యాక ఓ కునుకు తీసి సాయంత్రంవరకూ రెండో విడతగా పొగాకు వీరబాబూ, అమ్మన్నగారూ ఓటర్ లిస్టులట్టుకొని ‘సర్పంచ్‌గా పోటీచేస్తనాం. సపోర్ట్ చెయ్యమని’ ఎక్కీగడపా దిగీగడపగా ఎవరిదారిన వాళ్ళు మద్దతు కూడగట్టుకుంటున్నారు.

“రొట్టకట్టు రాజ్యంలో గోచిపాతరాయుడే రారాజని, ఆఖరికి ఈకాడకొచ్చిందన్నమాట రాజకీయం! నువ్వే పోటీకి దిగినప్పుడు నేను దిగాపోతే నలుగురూ నవ్విపోతారు. నేనూ ప్రెసిడెంటుకేస్తా. ఈసారికొదిలెయ్ మళ్ళీసారి చూద్దాం,” సిపాయి కనకయ్య ముక్కుమీద గుద్దినట్టు చెప్పడంతో వీరబాబు మొహం మాడ్చుకొని ఇంకో ఇంటి తలుపు కొట్టాడు.

“నా చేతిమాత్రా వైకుంఠయాత్రా అని సంచట్టుకొని ఇంచక్కా తిరిగీవోరు. మీకూ రాజకీయం పిచ్చట్టేసుకొంది. మరేంజేత్తాం! తీరా జూత్తే ఇంట్లో రెండోట్లే వున్నాయి. మున్సబుగారికోటి, ప్రెసింట్‌గారికోటి. ఓ పంజెయ్యండైతే. మా బామ్మర్దికి ఓటుంది కానీ ఆడిప్పుడు రాజమండ్రీ సెంట్రల్ జైల్లో వున్నాడు.ఆడ్నేదోలా బైటడేత్తే ఆడోటు మీకేయించేత్తాను. మా బలవైన మనిసేమో, ఎలచ్చన్లయ్యేదాకా మీకు దన్నుగా కూడా వుంటాడు, ఆలోచించుకోండి.” గుడ్లెర్రజేస్తూ చెప్పాడు భూతవైద్యుడు సదాచారి అమ్మన్నగారితో. అతని మాటలకి అవాక్కయిన ఆయన ‘ఇంకా ఇక్కడేపుంటే ఏ చేతబడో చేసేలా వున్నాడు. ఎందుకొచ్చిన గొడవ’ అనుకుంటూ అక్కడనుంచి వడివడిగా వెళ్ళిపోయారు.

ఇలా అందరిదగ్గరా గోరంత అభిమానాన్నీ కొండంత అవమానాన్నీ కొల్లగొట్టుకుంటున్న వీరబాబూ, అమ్మన్నా ప్రతిరాత్రీ తీరుబడిగా తమతమ అనుభవాలని పంచుకుంటున్నారు.

ప్రెసిడెంట్‌గారింట్లో ఓ పూట, మున్సబుగారింట్లో మరో పూటా విందు ఆరగిస్తూ పీతరాజు, రామచంద్రం ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నారు. మకాంలో ఆ ఇద్దరూ తప్ప మూడోవారుండడం లేదు.

“మళ్ళీ చెప్పొరే, ఆయాళ మునసబు ఏమన్నాడో, ప్రెసిడెంటేమన్నాడో?” సాలోచనగా అడిగారు పీతరాజు.

“నేను ఎమ్మే పాలిటిక్స్. నా అంత పోటుగాడు రాజకీయాల్లో లేడని పెసింటంటే, మాటిస్తే నా అంత మొగోడుండడని మున్సబ్ ప్రేలేడు. అయినా పదిరోజులనుంచి మీరు అడిగిందే అడగటం, నేను చెప్పిందే చెప్పటం, ఏటండిది?” చిరాగ్గా అన్నారు రామచంద్రం.

“రోషం రావాలి కదరా? అందుకే అలాటిమాటలు ఓటికి రెండుసార్లిన్నామనుకో పౌరుషం పొడుచుకొస్తుంది. అయినా ఏంట్రా ఆళ్ల బలుపు? ఆళ్లకున్నదేంటి? నాకు లేనిదేంటి? డబ్బూ దస్కం అన్నీ లెక్కేస్తే ఆళ్లకన్నా ఎక్కువే వుంటదికదా! బ్రేవ్! అన్నట్టొరే, అడుగుదామని మర్చిపోయేను. నిన్న ప్రెసిడెంట్‌గారి డప్పలంలో చిన్న ఉప్పిసరు తగ్గలేదూ?” అన్నారు పీతరాజు.

“ఏటండి, మీ పనికిమాలిన సందేహాలూ మీరూ. నామినేషన్లెయ్యడానికి పట్టుమని పదిరోజుల్లేవు. ఆ యవ్వారం మానేసి, పప్పూడప్పలం, ఉప్పూఊరగాయా అంటారు!” తల పట్టుకున్నారు రామచంద్రం.

“ఏంచేద్దామంటావు?”

“జనాన్ని మనేపు మళ్ళించుకోవాలికదా!”

“పెళ్ళొంకతో ఆళ్ళు భోజనాలెడతనారు. మనవూ ఏదో వంకతో పెడదామన్నా తినీవోళ్లెవరు? ఇదేంట్రో! అరకాసు తిరకాసుల్లా వీళ్ళిద్దరూ ఇటే వస్తనారు…” వస్తున్న వీరబాబునీ అమ్మన్నపంతులునీ ఆశ్చర్యంగా చూస్తూ అన్నారు.

“నేనే రమ్మన్నాను. శత్రువులకి శత్రువులు మనకి మిత్రులు.”

“కనిపించవు కానీ నువ్వు మా కానెధవ్విరా!” మెచ్చుకున్నారు పీతరాజు.

వీరబాబూ అమ్మన్నపంతులు వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. వాళ్ళ చేతుల్లో ఓటర్ లిస్టులున్నాయి.

రామచంద్రరాజు ఓ సారి గొంతు సవరించుకొని “మీరు నిదానంగా వింటానంటే ఓ మాట చెబుతాను. కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలుండాలంటారు. ఆ బావా బామ్మర్దులిద్దరూ కొండల్లాటోళ్ళు. ఖర్చుకాడకొస్తే వెర్రి ఖర్చెట్టేస్తారు. చూస్తున్నారుగా వాళ్ళ భోజనాల భాగోతం! రోజుకెంతలేదన్నా ఒక్కొక్కళ్ళూ పదేలు ఎగరగొట్టేస్తున్నారు. మనలాంటి అణాకాణిగాళ్ళు ఆళ్ళని తట్టుకోటం కష్టం. దానికి పీతరారే కరక్ట్. ఏమంటారు?” అన్నారు ఇద్దరి మొహాల్లోకీ చూస్తూ.

“నిజమేననుకోండి. నామినేషనేత్నాం అని, ఊరంతా చెప్పుకు తిరుగుతునాం. ఇప్పుడు లేదంటే ఎర్రిపప్పలైపోమా! ఆళ్లంత కాపోయినా మాకూ అంతో ఇంతో కరుసయింది కదా! యాండాట్రుగారు మాట్టాడరేటి?” అన్నాడు వీరబాబు.

“అవునవును. నువ్వేవంటే నేనూ అదే!”

“ఎంతయ్యుంటుదో మాకు తెలని ఎవహారమేంటిగానీ. ఆ కర్చులతోపాటే అంతో ఇంతో పీతరారు ముట్టచెప్పకుండా వుండరు. మీ ఇద్దరూ మాకు సపోర్ట్ చేసెయ్యండి. ఏవంటారండి?” అన్నారు రామచంద్రం పీతరాజుగారికేసి.

“ఏం చెయ్యమంటారో వాళ్ళనే అడుగు.”

“వాళ్ళమొహం, వాళ్ళు చెప్పేది ఏం వుంటదిలెండి. సొసైటీ బాకీలు ఏవున్నాయో అయి కట్టేస్తారు. మీరు పీతరారి తరుపున వార్డు మెంబర్లకెయ్యండి. ఎన్నికల్లో నిలబడతానన్న మీ మాటా బోటోయినట్టుండదు.”

రామచంద్రం మాటలకి వీరబాబుకీ అమ్మన్నగారికీ కళ్ళు మెరిశాయి. ‘తంతే బూరలబుట్టలో పడ్దమంటే ఇదే’ అనుకున్నారు మనస్సులో.

“రామం చెప్పింది బానేవుంది. ఇంక అలా కానియ్యండోయ్!” అన్నారు పీతరాజు.

“అలాగేండి. మీరు మాత్రం మాకు పైయోల్లేటి? ఆళ్ళిద్దరినీ మట్టి కరిపించడం కావాలికాని,” చెప్పాడు వీరబాబు.

“ఆలస్యం అమృతం విషం. మళ్ళీ మేము ఏదో గొంతెమ్మకోరిక కోరేలోపు ఆ సొసైటీ గొడవేదో తేలిపోతే తరవాయి వ్యవహారాల్లోకి పోవచ్చు,” తొందరపెట్టారు అమ్మన్న.

పీతరాజుగారు “ఒరేయ్ బూరిగా!” అని పిలవడంతో పాలేరు బూరయ్య తలపాగా విప్పుకుంటూ వచ్చాడు.

“సొసైటీకాడకెళ్లి సెకట్రీతో ఇలాగిలా పీతరారు పంపేరండీ, ఆరి డిపాజిట్లోంచి కోసుకొని, పొగాకు వీరబాబుగారిదీ అమ్మన్నపంతులుగారిదీ పద్దులు కొట్టెయ్యమన్నారండి. గుమాత్తాచేత రసీదు కాయితాలంపమన్నారండీ, అని చెప్పేసిరా. ఎళ్ళు. ఇక్కడున్నట్టొచ్చెయ్యాలి!” పురమాయించారు పీతరాజు.

వీరబాబు ఓటర్ లిస్ట్ తెరుస్తూ, “మొత్తం ఏడోడ్రులుకీ ఐదొందల అరవై వోట్లండి. చచ్చిపోయినోళ్ళనీ లేచిపోయినోళ్లనీ కొట్టేస్తే నికరంగా ఐదొందలు. ఇందులో ప్రెసింటుగారియ్యెన్నో, మున్సబుగారియ్యెన్నో లెక్కేట్టేద్దాం. నేను చెబ్తాను. అమ్మన్నగారూ మీరు ప్రెసింటుగారియి రాయండి. రాంచంద్రారు, మీరు మున్సిబుగారియి రాయండి.” అన్నాడు వీరబాబు.

రామచంద్రం, అమ్మన్నా చెరో నోటుపుస్తకంలో పెన్సిల్‌తో రాస్తుంటే ముగ్గురినీ పీతరాజుగారు మార్చిమార్చి చూస్తున్నారు.

రెండు గంటలు కుస్తీ పట్టేటప్పటికి, ఐదొందల ఓట్లకిగానూ మున్సబుగారేపు నూట ఇరవై, ప్రెసిడెంట్‌గారివైపు నూట యాభై ఓట్లు తేలాయి. ఇంకా రెండు వందల ముప్పై ఓట్లు అటూ ఇటూ గాకుండా మిగిలాయి.

“ఐదొందల్లోంచి రెండొందలడెభ్భై తీసేత్తే రెండొందలముప్పై. జాగరత్తగా జనాన్ని మెలతెడితే ఇయ్యన్నీ మనయ్యేనండి. ఈ లెక్కన నామినేసనెయ్యకుండానే గెలిచేసాం మనం!” ఆనందంగా చెప్పాడు వీరబాబు.

పీతరాజు, రామచంద్రం ఒక్కసారిగా పైకి లేచి కౌగలించేసుకున్నారు. అమ్మన్నా వీరబాబూ మురిపెంగా చప్పట్లు కొట్టారు.

“నడండి భోజనాల వేళయ్యింది. చేసొచ్చేకా ఇంకో వడపోతేసి మెజారిటీ తేల్చేద్దాం. ఈ పూట ఎవరింటికి వెళదామోయ్ రామం?” అన్నారు పీతరాజు.

“మున్సిబుగారింట్లో మేకమాసం మాడికాయ. నాకదంటె మా చెడ్డిట్టం. పెసింట్‌గారింట్లో ఎండ్రెయ్యలూ చింతకాయ్, నాకది పడదు.” అన్నాడు వీరబాబు.

“వారింటికే వస్తానని నేను ప్రెసిడెంట్‌గారికి మాటిచ్చానండి. నిన్న డప్పలంలో ఉప్పు తక్కువయ్యిందని చెబితే, ఈపూట ఆవెట్టి పుణుకులూ మజ్జిగపులుసు చేయిస్తానన్నారు.” చెప్పారు అమ్మన్న.

“చూసావటోయ్, రామం! ఇందాక నేను చెప్పానా లేదా? ఈ డప్పలం ఇసయం. చిటికెడు ఉప్పిసరుకే అంత కక్కుర్తేవిటోయ్ వెధవ గాడిదకొడుక్కి!”అన్నారు పీతరాజు.

“సర్లెండి. పోయేటప్పుడు కూడా పట్టుకుపోతాడేమో. ఆళ్ల ఉప్పు గొడవ మనకెందుగ్గానీ, ఎండ్రెయ్యల మీదకి పోతంది నామనస్సు. మొన్న తెచ్చేటప్పుడు చూసాను. పప్పు రెయ్యలు. ఒక్కోటీ గుప్పెడంత వుంది!” చెప్పారు రామచంద్రం.

“వీరబాబు మేకమాంసం మావిడికాయా బావుంటుందంటున్నాడు. నేనటెళ్తా. నడండింక. భోజనాలకి ముందూ, దెబ్బలాటకి వెనకాలా వుండాలి.” అందరికంటే ముందు నడిచారు పీతరాజు.

జోడు మేడలు దగ్గరవగానే ఆ నలుగురూ ఇద్దరిద్దరిగా విడిపోయి ఆ దొడ్లోనూ ఈ దొడ్లోనూ చొరబడ్డారు.

పీతరాజుగారిని గుమ్మందగ్గరే చూసిన మున్సబుగారు “రండ్రండి బావగారు!” అంటూ దగ్గరుండి తీసుకెళ్ళి బంతిలో కూర్చోబెట్టారు. స్వయంగా అన్నీ కొసరి కొసరి వడ్డించారు.

ఎవరో పిలవడంతో మున్సబుగారు ‘ఇప్పుడే వస్తా,’ అని అటు వెళ్ళగానే, “ప్రెసిడంటంత వెధవ కాదోయ్ ఈ మున్సబు. కాంత మర్యాదా మన్ననా ఎక్కువే మనిషికి!” నెమ్మదిగా అన్నారు పీతరాజు వీరబాబుతో.

“మరే కానండి, ఇద్దరూ ఇద్దరేనండి. తడి గుడ్డతో కుత్తుక్కోసేత్తారు. మన జాగత్తలో మనవుండాలి.”

మున్సబుగారు మళ్ళీ ఇటురావడంతో ఇద్దరూ మాటలాపేశారు.

పళ్లెంలో పగిడీ పెట్టుకొని ప్రెసిడెంటుగారి దొడ్లో భోజనం బంతుల మధ్య హడావిడిగా తిరుగుతున్న భద్రాచలాన్ని “ఏవిటోయ్, రాజుల హడావిడంతా నీలోనే కనిపిస్తోంది! పగిడీ కింద తలకాయెక్కడా కనిపించదేం?” అడిగారు శాకాహారం వరసలోని అమ్మన్నగారు.

“వమెరికానుంచి పాపగారొత్తనారు కదండి, తీసూరాడానికెళ్ళేరు. భోయనాల దగ్గర ఆయన కనపడాపోతే మరేదకాదని ఇలా పగిడీ తిప్పమన్నారండి. ఇదుంటే ఆయనున్నట్టే కదండి. వుండండి అక్కడో కొత్త బంతి మొదలైనట్టుంది,” అని అక్కడ్నుంచి హడావిడిగా వెళ్ళిపోయాడు భద్రాచలం.

ఆ నలుగురూ సుష్టుగా విందారగించి, తలో జింజిర్ బుడ్డీ త్రాగేసి మిఠాయికిళ్ళీ నములుకుంటూ మకాం దగ్గరకి వచ్చేసరికి, అక్కడ జవ్వాది ఏడుకొండలూ, రాపర్తి విశ్వనాథం, శాస్త్రిగారు, సిపాయి కనకయ్య కాక ఇంకో పదిపదిహేనుమంది ఎదురుచూస్తూ వున్నారు.

పీతరాజుగారిని చూడగానే ఏడుకొండలు గబగబా ఎదురు వచ్చేశాడు.

“ఏంటంతా కూడబలుక్కుని వచ్చేసేరు?” అడిగారు పీతరాజు.

“ఆళ్ళ సంగతి నాకుతెలదుగానండి నా సపోట్టు మాత్తరం మీకేనండి. ఈరబాబుకీ అమ్మన్నగారికీ చేసినట్టు చేసెయ్యండి చాలు. మాయి మొత్తం పన్నెండు పద్దులండి. ఇగోండి లిస్టు,” అని ఓ కాగితం చేతిలో పెట్టాడు. కాగితంవంకా ఏడుకొండలువంకా పీతరాజు తెల్లబోయిచూస్తుంటే…

“చల్లకి వచ్చి ముంత దాయడం ఎందుహ్కానీ, మేవూ అందుకే వచ్చాం!” అన్నారు అక్కడకొచ్చిన శాస్త్రిగారు.

పీతరాజుగారి గొంతులోకి నములుతున్న కిళ్ళీరసం పోయి ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘హ, హ’ అని దగ్గుకుంటూ రామచంద్రానికి సైగచేసి సావిట్లోకి పోయారు.

“ఏవిట్రా, ఈ సంగతి అపుడే వీళ్ళకెలా తెలిసిపోయింది? ఆ ఇద్దరూ మనతోనే వున్నారు…” ఆందోళనగా అడిగారు, లోపలకి వచ్చిన రామచంద్రాన్ని.

“పాలేరుని పంపేరు కదా! సొసైటీ పెసింట్ ఊదేసుంటాడు.”

“వీళ్ళందరి బాకీలూ తీర్చాలంటే, నేను ఉన్నదంతా ఊడ్చుకోవాలి. పోనీ ఓటుకి పదో పరకా అని మాట్టాడకూడదూ?”

“ఓట్లమ్ముకునీలా కనిపిస్తున్నామా? అని పళ్ళూడగొట్టేసి చెప్పు తెగీదాకా కొట్టెయ్యగలరు. ఎలక్షన్ అంటే ఏరుపిడకలమ్ముకోడం అనుకుంటున్నారేమిటీ? లచ్చో లచ్చన్నరో, ఆళ్ల ఖర్చుతో పోల్చుకుంటే సగం వుండదు. పొనకల్లోనూ పురిల్లోనూ దాచింది తియ్యండి. అలాగే వుంచేత్తే చెదట్టేత్తది.”

“నువ్వు ఏరుపిడకలమ్మడం అనటం బాగోలేద్రా!”

“అదా! ఎరువులూ పురుగుమందులనబోయి ఏరుపిడకలనేసినట్టున్నాను. ఏదోట్లెండి, రెండూ ఒకటేకదా!”

“…”

“ఈ దెబ్బతో ఊరు మొత్తం మనేపు తిరిగిపోద్ది. ఆళ్ళకింక నెత్తిమీద చెంగే. ఆలోచించకండి.” అనేసి రామచంద్రం బయటకి వచ్చేశారు.

ఇక తప్పదన్నట్టు మొహం వ్రేళ్లాడేసుకుని బయటకి వచ్చిన పీతరాజుగారు, ఊరు మొత్తం మకాం ముందు నిలబడ్డంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు.

“సరేనోయ్. మీ అందరి బాకీలు చెల్లగట్టేస్తాను, మీ మద్దతు నాకే!” అన్నారు సంతోషంగా.

“పీతరాజుగారుకీ జై!” అన్నాడు జవ్వాది ఏడుకొండలు.

“జై, జై, జై,” అన్నారు సగంమంది. మిగతా సగంమందిలోంచీ ముందుకొచ్చి…

“ఆళ్ళంటే రైతులు. పొలాలు పుట్టలూ ఆటిమీద అప్పులూ వున్నాయి కాబట్టి తీర్చేత్తనారు. మరి మా ఇసయం యేటండి? మూడేసేలు, నాలుగేసేలు ఆళ్ళియ్యి తీచ్చేసినప్పుడు మాలాంటి బక్కోళ్ళకి ఎయ్యో రెండేలో చేతిలో అడేత్తే చేబదుళ్ళు తీచ్చుకోవా?” ఆవేశంగా అడిగాడు రాపర్తి విశ్వనాథం.

“నిజవేండి. మావేం పాపం చేసుకొన్నాం? మీరు పెట్టదగ్గావోరు, మేవు తినదగ్గావోళ్లుం!” అన్నాడు గానుగు నూకరాజు.

రామచంద్రం మొహంలోకి చూసిన పీతరాజుగారు మళ్ళీ లోపలకి వెళ్ళి మంతనాలు మొదలెట్టారు.

“మా అయితే వంద గడప. తల్లితోడెయ్యించుకుని వెయ్యేసిచ్చేస్తే లక్షతో పోద్ది. కక్కుర్తనవసరం.” చెప్పారు రామచంద్రం.

మాడిపోయిన మొహానికి మళ్ళీ నవ్వద్దుకొని బయటకొచ్చిన పీతరాజుగారు “సరేనోయ్, అలాగే చేద్దాం.” అన్నారు.

“పీతరాజుగారికీ జై!” అన్నాడు రాపర్తి విశ్వనాథం.

“జై, జై, జై,” అన్నారంతా.

పొద్దున్నే జోడుమేడల్లో టిఫిన్లు తినేసి పీతరాజుగారి మకాంలోకి పోవడం, అక్కడ నోరు నెప్పెట్టేద్దాకా పీతరాజుగారికి జైకొట్టడం, మధ్యాహ్నం భోజనాలకి జోడుమేడల్లోకి తిరిగిరావడం, తినేసి పోయి మళ్ళీ పీతరాజుగారికి జైకొట్టడం. సాయంత్రం భోజనాలకి మళ్ళీ షరా మామూలే. అయినా మున్సబుగారు కానీ, ప్రెసిడెంట్‌గారు కానీ ‘ఇదేంటోయ్ ఇదేం పధ్ధతని’ ఎవరినీ పల్లెత్తుమాటనడంలేదు. బయటి జనంతో జోడుమేడలు క్రిక్కిరిసిపోతుంటే, ఊరి జనంతో పీతరాజుగారి మకాం కళకళ్ళాడిపోతోంది.

“ఇదేమిట్రా రంగా! భోజనాలు బామ్మర్ధులవి, ఓట్లు పీతరాజువీ అన్నట్టుందే వ్యవహారం!” అన్నారు కాసుగారు ఆరోజు సాయంత్రం పేకాట దగ్గర.

ఇదిలాగే సాగితే కౌంటింగ్ దాకా అక్కర్లేదు. పోలింగుకి ముందే బొక్కబోర్లా పడిపోయీలా వున్నాయి మన రెండు పార్టీలూ.” అన్నారు రంగరాజు.

అది విన్న బావాబామ్మర్దులిద్దరూ నవ్వి ఊరుకున్నారు.

ఆ రోజు సోమవారం. ఆ రోజునుంచే నామినేషన్ల ఘట్టం మొదలయ్యింది. ఆదివారం సాయంత్రంతో గడువు ముగుస్తుంది. ఆ రాత్రికి పెళ్ళి.

అమెరికానుంచి పెళ్లికొడుకు డా. వత్సవాయి సింహాద్రి అప్పల నరసింహవర్మ, పెళ్లికూతురు డా. దంతులూరి సుందరయ్యమ్మ, డిల్లీదాకా విమానంలో వచ్చి, అక్కడనుంచి రైలెక్కి మూడు రోజుల తరవాత సామర్లకోటలో దిగితే, ప్రెసిడెంట్‌గారు కారేసుకువెళ్ళి రెండ్రోజుల క్రితమే ఊరికి తీసుకొచ్చారు.

పీతరాజుగారు నామినేషన్ వేయడానికి ఆఖరిరోజైన ఆదివారం మధ్యాహ్నం పన్నెండూ ముప్పైకి మంచిదని శాస్త్రిగారు ముహూర్తం పెట్టారు.

“ఒకటి. రెండు. మూడు. అబ్బో రేజింగ్ నంబర్. ఇదీ ఒకందుకు మంచిదే. ఆలోపే బావాబామ్మర్దులు నామినేషన్లు ఏసేస్తే ఆళ్ళకంటే ధూంధాంగా మనం నామినేషన్ వేసి దుమ్ము దులిపెయ్యొచ్చు!” అన్నారు రామచంద్రరాజు.

“మరే! మరే!” అని సంబరపడ్డారు పీతరాజుగారు.

ద్రాక్షారామం నుంచి మున్సబుగారింటికీ, కొమరిపాలెం నుంచి ప్రెసిడెంట్‌గారింటికీ బండ్ల మీద బాణాసంచా దిగింది.

“వీళ్ళ తస్సాదియ్యా, జనవంతా మనపక్కున్నారని తెలిసినా గట్టి మోపే చేస్తున్నారింకా! యేంట్రా ఈళ్ల ధైర్యం? మనం కూడా ఎక్కడా తగ్గొద్దు.” అంటూ జువ్విపాడు నుంచి బాణసంచా తెప్పించారు పీతరాజుగారు.

సోమవారం ఉదయం…

“నామినేషన్లు మొదలయ్యాయిగా, మీరు ఒకటో వార్డుకి నామినేషన్ వెయ్యండి.” చెప్పారు మున్సబుగారు కాసుగారితో.

“నీతోపాటూ వేస్తాలే,” అన్నారు ఆయన.

మున్సబుగారు ‘చెప్పింది చెయ్యండ’నడంతో కాసుగారు మందీమార్బలంతో బాణసంచా కాల్చుకుంటూ వెళ్ళి నామినేషన్ వేసొచ్చారు.

మంగళవారం ఉదయం…

ప్రెసిడెంటుగారు రంగరాజుగారినీ, చెప్పులుకుట్టే ఆదియ్యనీ పిలిచి రెండోవార్డుకొకరినీ, ఏడోవార్డుకొకరినీ నామినేషన్ వేసి రమ్మంటే మేళతాళాలతో బాణసంచా కాల్చుకుంటూ వెళ్ళి నామినేషన్ వేసొచ్చారు వాళ్ళు.

బుధవారం ఉదయం…

మున్సబుగారు కూనిశెట్టి నారాయణని మూడోవార్డుకి నామినేషన్ వేసిరమ్మంటే, ప్రెసిడెంటుగారు సొసైటీ ప్రెసిడెంట్ తమ్మున్ని ఆరోవార్డుకి నామినేషన్ వేసిరమ్మన్నారు. మళ్ళీ మేళతాళాలు మ్రోగాయి. బాణసంచా ప్రేలింది.

“ఆళ్ళు నామినేషనెప్పుడేస్తారో తెలడంలేదు. పోని మన మెంబర్లచేత వార్డులకి వేయించేద్దామా?” అన్నారు రామచంద్రం పీతరాజుగారితో.

“వేసుకుంటే వేసుకోనియ్యవోయ్. కేండేట్లు దొరక్క, ఆళ్ళనీ ఈళ్లనీ బతిమాలి ఒకటీ అరా ఏయించుకుంట్నారు. నాతోపాటే మనమెంబర్లూను. అందరం ఆదివారం మజ్జాన్నమే!” అన్న పీతరాజుగారు “ఏవోయ్ ఏడుకొండలూ మంచి బ్యాండ్ మేళం కూడా మాట్టాడవోయ్. చుట్టుప్రక్కల మేళాలన్నీ ఆళ్లకిందే బుక్కై పోయినట్టున్నాయి.” చెప్పారు ఏడుకొండలుతో.

“మొన్న కడియం పూలదండలు పురమాయించడానికెళ్లినప్పుడు అక్కడెవళ్ళో చెప్పేరు, బుర్లంకలో మా పనోడు మేళం వుంది, ఆళ్ళోయించనిపాట లేదని. మీరడ్వాన్సిత్తే తెల్లారీటప్పటికి దింపేత్తాను.” అన్నాడు ఏడుకొండలు.

గురువారం ఉదయం…

మున్సబుగారు సదాచారిని పిలిచి ఐదోవార్డుకి నామినేషన్ వేసి రమ్మన్నారు. సదాచారి మారుమాట్లాడకుండా మందీమార్బలంతో బాణసంచా ప్రేల్చుకుంటూ వెళ్ళి వేసివచ్చాడు.

ఆ సాయంత్రానికి బుర్రిలంక బేండ్ మేళం ఊళ్ళోకి దిగేసింది. భద్రాచలమూ అంతర్వేదీ ఉత్తరాలు వ్రాయించింది వాళ్ళకే. బుర్రిలంకోల్ని కౌగలించుకొని ముద్దులెట్టేసుకున్నారు ఇద్దరూ. మా ఇంటి దగ్గరుండాలంటే, మా ఇంటి దగ్గరుండాలని తెగ బ్రతిమిలాడేశారు. వాళ్ళు ఎక్కడా తగ్గకుండా తెలివిగా తప్పించుకొని పీతరాజుగారి మకాంలోకి పారిపోయారు.

శుక్రవారం మధ్యాహ్నం…

పీతరాజుగారివర్గం యావత్తూ పెళ్ళి భోజనాలకి మందలాగా తరలి వస్తుంటే భద్రాచలం పళ్ళెంలో పగిడీ పెట్టుకొని పంచాయితీ ఆఫీసుకి వెళ్ళడం కనిపించింది.

“ఏట్రా భద్రాచలం, ఎక్కడకి వెళ్తున్నావు? పైన ఎండమండిపోతంది. పగిడీ పళ్లెంలో పెట్టాపోతే నెత్తిమీదెట్టుకోవచ్చు గదరా?” వెటకారంగా అన్నారు పీతరాజుగారు. ఆయన మాటలకి చుట్టూ వున్న జనం పకపక నవ్వారు.

“సుభమాని నావినేసనెయ్యడానికెల్తంటే ఏటండిబాబీ ఎకసెక్కాలు!”

“మీ ప్రెసింటుగారి నామినేషనా, నీ నామినేషన్రా?” ఆరాగా అడిగారు రామచంద్రం.

“నాదేండి. నాలుగోవాడ్దుకేసి రమ్మన్నారు.”

“మరి మందుకాల్పేదిరా? టింగురంగాని ఒక్కడివే పోతున్నావే! ఊళ్ళోవాళ్ళెలాగూ రారు. కూడా నలుగురు పొరుగూరోళ్లనైనా ఏసుకోలేపోయేవా?” అడిగాడు ఏడుకొండలు.

“తప్పుకోండిబాబూ, అసలే ఆకలేసేత్తంది!” అంటూ అక్కన్నుంచి పరుగులాంటి నడకతో పోయాడు.

“బేగొచ్చేయయితే. లేటైతే కూరలైపోతాయి,” అని “చూడండ్రా, ఆళ్ల కర్మెలాకాలిందో!” అంటూ పీతరాజుగారు జనంతో ముందుకు కదిలిపోతే, అక్కడే ఆగిపోయిన బుర్రిలంకోళ్ళు భద్రాచలం వెనకే నడుస్తూ బ్యాండ్ వాయించడం మొదలెట్టేరు.

నామినేసనేసొచ్చి బుర్రిలంకోళ్ళతో కలిసి భోజనానికి కూర్చున్న భద్రాచలం తెగ రెచ్చిపోయాడు. ప్రెసిడెంటుగారిగురించీ వాడిగురించీ ఒకటే బాజా వాయించుకోవడం మొదలెట్టాడు.

శనివారం ఉదయం…

“నిన్న బుర్లంకోళ్ళదగ్గర మా బావెధవ నా పరువంతా తీసేసేడండి. ఆడి పనోడితనం చూసి పెసింటుగారాడిచేత నామినేసన్ ఏయించారటండి. నాను పనికిమాలినోన్ని కాబట్టి మీరు దూరవెట్టేసారంటండి…” మున్సబుగారి గడ్డం చేయడం మొదలు పెట్టిన దగ్గరనుంచి ఆయన తలంటుస్నానం ముగిసేవరకూ అంతర్వేది తన ఆవేదననంతా వెళ్లబోసుకున్నాడు.

మౌనంగా వాడి బాధంతా విన్న మున్సబుగారు తల తుడుచుకుంటూ “ఒరే అంతర్వేదీ. నిన్నియ్యాళనుంచి కమతంలోంచి తీసేస్తున్నానుర్రా!” అన్నారు గంభీరంగా.

వాడి గుండె ఆగినంత పనయ్యింది. “ఏవంట్నారండిబాబూ!” అన్నాడు ఖంగారుగా.

“అవున్రా. ఇంక నీ సేవలు నాకనవసరం. రేప్రొద్దున్నోసార్రా, లెక్కలు తేల్చేద్దాం.” అన్నారు.

“ఇదన్యాయం అండి బాబూ. పరాచికాలక్కూడా అద్దుండదా?”

“…”

“ఇంట్లో పెళ్ళెట్టుకొని నా పొట్టకొట్టేత్తారా? మాబావెదవేవయినా లేనిపోనియి చెప్పేడేటండి?”

అయినా మున్సబుగారు కనికరించలేదు.

“పోనీ… ఏం తప్పు చేసానో అదన్నా చెప్పండే?” అన్నాడు రోషంగా.

“నువ్వు ప్రధానమంత్రవ్వాలనుకోవడమేరా. అప్పట్నుంచీ చూడు ఊరెంత అల్లకల్లోలమైపోయిందో!” అని లోపలకి వెళ్ళిపోయారు.

ఆదివారం ఉదయం…

జనవంతా టిఫిన్లు చేసేసి పీతరాజుగారి మకాంలోకి పోయారు. కొంతమంది బొమ్మాబోకూ, పులీమేకా ఆడుకుంటుంటే కొంతమంది పేకాడుకుంటున్నారు.

“ఏంట్రా, ఎన్ని గంటలకంటావు ఆళ్ళ మూర్తం?” అన్నారు పీతరాజు.

“ఇంకేం మూర్తం? ఆళ్లమొహం మూర్తం. ఆళ్లు నామినేషనేత్తే ఇక్కడ ఓట్లేసీవోడెవడు. మెంబర్లని నిలబెట్టడానికే చతికిలబడి ఆయనో ముగ్గురు, ఈయనో నలుగురుతో సరిపెట్టుకున్నారు.” అన్నారు రామచంద్రరాజు.

“అలా తేలిగ్గా తీసెయ్యకండోయ్. సాంత్రంలోపు ఏయింతారేమో.” అన్నాడు ఏడుకొండలు.

“ఇయాళ ప్రెసింటుగారింట్లో కణుచు మాసం, మున్సబుగారింట్లో అడింపంది మాసం. అక్కడ దూపుడు గొర్రీ ఇక్కడ కొండగొర్రీ!” నోరూరిస్తూ చెప్పాడు రాపర్తి విశ్వనాథం.

“అయితే ఓగంట ముందెల్లిపోవాలియ్యాల. రేపన్నుంచి వాసన చూత్తామన్నా లోపలికి రానియ్యరు.” అన్నాడు వీరబాబు.

“మన్నామినేసన్లన్నీ జార్తగా ఒకళ్ళట్టుకోండి. భోజనాలయ్యాకా అటునుంచటే పంచాయతాఫీసుకెళ్లి ఇచ్చేద్దాం.” చెప్పారు పీతరాజు.

“ఇంకెందుకు, ఊరేగింపు మొదలెట్టేద్దాం.” అన్నారు అమ్మన్న.

పీతరాజుగారు కడియంనుంచి తెప్పించిన రెండు దండలు మెళ్ళో వేసుకొని మెంబర్ కాండీడేట్లు పుగాకు వీరబాబు, అమ్మన్న, రామచంద్రరాజు, ఏడుకొండలు, విశ్వనాథం, గానుగ నూకరాజు, మోర్త సత్తియ్య మెడలో తలో దండ వేసి “నడండి!” అన్నారు.

మందీమార్బలం వెంటరాగా రాజు వెడలె రవితేజములలరగ అన్నట్టు పీతరాజుగారు ఊరిమీదకి బయలుదేరారు. కూడా వున్నమద్దతుదార్లు జై! జై! జై! అంటూ చిందులు తొక్కుతుంటే, జువ్విపాడు బాణసంచా ఢాం ఢాం పేలతావుంది. బుర్రిలంకోళ్ళయితే హిందీ ఇంగ్లీష్ తమిళం తెలుగూ అన్న తేడా లేకుండా అన్ని పాటలని కలిపికొట్టేస్తున్నారు.

ఊరంతా పెద్ద పెద్ద పెళ్లిపందిళ్ళు వేసి, మామిడి తోరణాలు కట్టేసున్నాయి. వీధులన్నీ కళ్ళాపి చల్లి ముగ్గులేసున్నాయి. ఏమూల చూసినా పెళ్ళికళ కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

“ఇదేటండిబాబూ, ఆవులూ గేదెలూ తప్ప ఇల్లకాడ ఒక్కళ్ళూ లేరు!” అన్నాడు వీరబాబు అసంతృప్తిగా.

“సగంమంది మనెనకాల మిగతాసగం మంది ఆ జోడుమేడల కూడా వుంటే ఇంకెక్కన్నుంచొస్తారు? అద్దెక్కానీ తేవాల. నోర్ముసుకుని పదహే!” అన్నారు రామచంద్రం.

ఊరేగింపుకి రెండో వేపునుంచి ‘ఢాం ఢాం’ అని మందుకాల్పు వినబడింది.

“ఒరేయ్. వాళ్ళు నామినేసనెయ్యడానికెళ్లేరేమో. మందు సామాను కాలుస్తున్నారు. బూరిగా, నువ్వర్జంటుగా ఎళ్ళి అక్కడేం జరుగుతుండో చూసి ఇక్కడున్నట్టొచ్చెయ్యి.” ఆజ్ఞాపించారు పీతరాజు.

ఊరేగింపు జనం లేని సందుల్లోంచి మహా జోరుగా సాగుతుంటే బూరయ్య ఆయాసంగా వచ్చి “ఏం లేదండి. మొన్న భద్రాచలం నావినేసనేసినప్పుడు మందుగుండు కాల్చలేదంటండి. ఆడు అప్పున్నుంచీ ఏడుపుమొహం ఎట్టుకున్నాడని, సరే ఇంటికట్టుకెళ్ళి కాల్చుకోరా అంటే ఆడు కుర్రోళ్ళకి కూలిచ్చి కాల్పించుకుట్నాడండి.” చెప్పాడు బూరయ్య.

“మనదెబ్బకి ఏం చెయ్యాలో పాలిపోక, ఏదో వంకన మందుగుండు తగలెట్టించుకుంటున్నారన్నమాట. సర్లే. ఏదొకటి ఏడనియ్యి,” అన్నారు పీతరాజు మెడలో దండని సవరించుకుంటూ.

మందుగుండు కాల్చుకుంటూ బేండ్ మేళం కొట్టుకుంటూ ఆ వీధీ ఈ వీధీ తిరిగి ఊరేగింపు జోడుమేడల దగ్గరకొచ్చేసరికి భోజనాల టైమ్ అయ్యింది.

‘అటెలితే కణుచూ దూపుడుగొర్రీ, ఇటెలితే అడవిపందీ కొండగొర్రి. ఎటెళ్ళాలా?’ అని అనుమానం వచ్చింది అందరికీ.

“అదేంటి బావా, అలా నిలబడిపోయేరు? రండి!” అంటూ మున్సబుగారు ఎదురు సన్నాహం చేశారు.

“ఏం లేదండి! రెండూరెండూ వత్తాదు వంటలుకదా? ఎటేపెళ్లాలా అని ఆలోచిత్తనాం.” ఉన్నమాట చెప్పేశాడు ఏడుకొండలు.

“అందుకేరా రెండుచోట్లా, అన్నిటినీ సమానంగా సర్దేసాం. ఎటెళ్ళినా ఒక్కటే!” అన్నారు మున్సబుగారు.

“హమ్మయ్య బతికించేరు. ఈ పక్కకి నడండే. ప్రెసింటు దొడ్లో బాక్కాళీగుంది,” పీతరాజుగారి చెవిలో చెప్పాడు విశ్వనాథం. దండలు దండెంమీదేసి అంతా పొలోమని అటు నడిచారు.

“రావోయ్ పీతసోదరా. రా, రా!” అని ప్రెసిడెంట్‌గారు ఆప్యాయంగా పీతరాజుగారిని తీసుకెళ్లి బంతిలో కూర్చోబెట్టి దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. భోజనవయ్యాకా చేతులు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లందిస్తుంటే, అక్కడకి వచ్చిన రాచపల్లి రాజులిద్దరు “ఏవోయ్ ప్రెసిడెంటూ! నామినేసన్లెప్పుడు?” అని అడిగారు.

“కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీ వుండాలంటారు. ఇడుగో ఈ పీతరాజు పోటీచేస్తున్నాడు. వీడితో మనకేంటి పోటీ… అని మానేసాను. మరి మా మున్సబు సంగత్తెలదు,” అని చెప్పిన ప్రెసిడెంట్‌గారు వచ్చే ఎన్నికల్లో యం.యల్.ఏ. టికెట్ గురించి వాళ్లతో మాటల్లోపడ్డారు.

ప్రెసిడెంటుగారి మాటలకి వళ్ళు కుతకుతా వుడికిపోయింది పీతరాజుగారికి. “చూసావురా ఆడి పొగరు!” అంటూ రామచంద్రం చెవిలో బుసలుకొట్టారు.

బయటికొచ్చి ఓ జింజిరుకాయ త్రాగి, కిళ్ళీ వేసుకుంటుంటే “ఎలా వున్నాయి బావా వంటలు?” అంటూ అక్కడకి వచ్చారు మున్సబుగారు.

‘ఢామ్ ఢామ్ ఢామ్!’ పీతరాజుగారేదో చెప్పబోతుంటే బాణాసంచా ప్రేలింది.

“ఏమిటండీ ఈ భద్రాచలంగాడి చాదస్తం! మొన్నేసిన నామినేసన్‌కి ఇయ్యాళ మందుకాలుపేటి? మీరన్నా చెప్పొచ్చుగా?” చిరాకుపడ్డారు పీతరాజు.

“ఇది భద్రాచలంగాడిది కాదు బావా, అంతర్వేదిగాడి మందుకాల్పు.”

“ఏం! ఆడికేవొచ్చింది? పనిలోంచి పొమ్మన్నందుకా?”

“అదేటంటి! మీకు తెలీదా? సర్పంచ్‌కి నామినేషనేస్తున్నాడక్కడ. వాడే మీకు పోటీ. త్వరగా వెళ్ళండి, మీ ముహూర్తం దగ్గరపడ్డట్టుంది!” మొహం నిండా వంకరనవ్వు పులుముకొని మున్సబుగారు చెబుతుంటే పీతరాజుగారికి నెలరోజుల్నుంచి తింటున్న మాంసంమసాలాలు పొగల్లాగా సెగల్లాగా వంట్లోంచి తన్నుకురావడం మొదలెట్టాయి.

పీతరాజుగారు నామినేషన్ వెయ్యడానికొస్తారని పంచాయతాఫీస్ దగ్గర ఎదురుచూస్తున్న బుర్రిలంకోళ్ళు లోపలనుంచి మందీమార్బలం, మందుకాల్పుతో ఊరేగింపుగా వస్తున్న అంతర్వేదిని చూసి ‘అనుకున్నదొక్కటీ, అయినది ఒక్కటీ…’ అన్నపాట వాయించడం మొదలెట్టారు.

వాళ్ళు బాకాలూదుతుంటే బుగ్గలు ప్రేలిపోయేలా కనబడుతున్నాయి.
---------------------------------------------------------------------------------------
రచన: చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment