కలయో!వైష్ణవమాయయో!
సాహితీమిత్రులారా!
కొన్ని కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించేవిగా
నమ్మశక్యం కానివిగా ఉన్నపుడు ఇలా అనుకోవడం
సహజమేకదా అదేమిటంటే కలయో వైష్ణవమాయయో
ఇంతకు ఇది ఎవరన్నారు అంటే
చిన్నికృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు చెప్పగా
యశోదాదేవి కృష్ణుని నోరు తెరువమన్నపుడు కృష్ణుడు
తననోరు చూపించాడు ఆ సమయంలో ఆమెకు
కృష్ణుని నోటిలో ఈ సకల బ్రహ్మండము కనిపించింది
కనిపించగానే ఆమెకు కలిగిన ఆశ్చర్యాన్ని పోతనమహాకవి
ఈ పద్యంరూపంలో వెలయించాడు ఆ పద్యం-
కలయో!వైష్ణవమాయయో! యితర సంకల్పార్థమో! సత్య మో
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁగానో పర
స్థలమో! బాలకుఁడెంత! యీతని ముఖస్థంబై యజాండం బు ప్ర
జ్వలమై యుండుటకేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపగన్!
(పోతన భాగవతము - 10-342)
యశోదాదేవి ఇలా అనుకొంటున్నది-
నేను కలగనలేదుకదా లేకపోతే ఇది విష్ణువు మాయకాదుకదా!
దీనిలో ఇంకేదైనా అర్థం ఉందా? ఇలాకనిపించడానికి
లేక ఇది సత్యమేనా? నా బుద్ధి పనిచేయడం లేదు
అసలు నేను యశోదాదేవినేనా?ఇది మాయిల్లేనా
లేకపోతే ఈ కుర్రవాడు ఎంత వీని నోటిలో ఈ
బ్రహ్మండమంతా వెలుగులు చిమ్ముతూ కనిపించడమేమిటి?
ఎంత వింత ఆలోచించి చూచేకొద్దీ ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా ఉంది!
ఎవరైనా ఇంకోలా అనుకొనే వీలుందా!
No comments:
Post a Comment