Friday, September 10, 2021

ఎఱ్ఱనగారి మధుపానం

 ఎఱ్ఱనగారి మధుపానం




సాహితీమిత్రులారా!



ఎఱ్ఱనగారు తన నృసింహపురాణంలో తృతీయాశ్వాసంలో హిరణ్యకశిపుడు

వనవిహారం వెళ్ళినపుడు అక్కడ చీకటిపడగా అక్కడే గుడారాలు వేసుకొని

ఉన్నాడు అప్పుడు చంద్రోదయం తర్వాత మధుపానం చేయడం మొదలు పెట్టారు 

ఆ సందర్భంలో మధుపాత్రలో చంద్రుడు ఎలా కనిపించాడో కొన్ని పద్యాల్లో వర్ణించారు

ఎఱ్ఱనగారు. వాటిలోని ఒక పద్యం ఇక్కడ- 


సురుచిర పానపాత్రమున సుందరి యొక్కతె కేల నిండుచం

దురుఁడు ప్రకంపితాంగకముతోఁదికించెఁ దదాననాంబుజ

స్ఫురిత వికాస వైభవము సొంపు లడంకువ మ్రుచ్చలింపఁ జె

చ్చెరఁ జనుదెంచి పట్టువడి చేడ్పడి భీతి వడంకు చాడ్పునన్

                                                                                                 (నృసింహపురాణము - 3- 97)

ఒక సుందరి(అందాలరాశి) చేతిలో 

అందమైన పానపాత్ర 

అందులో నిండు చందురుడు ప్రకంపిత (కదలాడే) 

అంగకముతో(రూపంతో) ఎలా కనిపించాడంటే 

ఆమె ముఖపద్మం తాలూకు విస్ఫురిత వికాస వైభవాల సొంపుల్ని 

అణకువతో దొంగిలిండానికి వేగంగా వచ్చి పానపాత్రలో పట్టుబడి 

నిశ్చేష్టుడై భయంతో వణికిపోతిన్నట్టు కనిపించాడు

(ఆమె కంటికి అలా అనిపించాడు 

లేదా ఆమె అలా తిలకించింది.) - అని భావం.

2 comments:

  1. అయ్యా రాజు గారు,
    ఎఱ్ఱన గారు వర్ణిస్తున్నది హిరణ్యకశిపుడు చేసిన మధుపానం గురించి కదా? మరీ మీరు పెట్టిన హెడింగ్ ప్రకారం ఎఱ్ఱన గారే మధుపానం చేస్తారని అనిపిస్తుంది సారూ 🙂.

    ReplyDelete
    Replies
    1. సాహితీమిత్రుమా!
      మీరన్నదీ నిజమే కానీ
      ఎఱ్ఱనగారి మధుపానం అంటే ఎఱ్ఱనగారి మధుపాన వర్ణన

      Delete